Home ఇంద్రధనుస్సు సినీగేయాల పరామర్శ

విజయా సంస్థ నిర్మించిన “జగదేక వీరుని కథ” చిత్రం 1961లో విడుదలైనది. ఆ చిత్రంలోని ఒక పాట.

రారా కన రారా

కరుణ మానిరారా ప్రియతమ లారా ||రారా||

నాలో నాలుగు ప్రాణులనగా

నాలో నాలుగు దీపములనగా       ||నాలో||

కలిసిమెలిసి అలరించిన చెలులే     ||కలిసి||

నను విడనాడెదరా                   ||రారా|

మీ ప్రేమలతో మీ స్నేహముతో      ||మీ ప్రేమ||

అమరజీవిగా నను చేసితి రే

మీరు లేని నా బ్రతుకేలా             ||మీరు||

మరణమె శరణముగా

రారా కనరారా

కరుణ మానినారా ప్రియతమ లారా

ఈ పాటను గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు అద్భుతంగా ఆలపించగా ప్రతాప్ గా నటించిన నందమూరి తారక రామారావు అభినయించారు. మధ్య మధ్య సన్నివేశ ప్రాధాన్యంగా ఇంద్రకుమారి జయంతిగా నటించిన బి.సరోజాదేవి, నాగకుమారి నాగినిగా నటించిన యల్. విజయలక్ష్మి, వరుణకుమారి వారుణిగా నటించిన జయంతి, అగ్నికుమారి మరీచిగా నటించిన బాల కనిపిస్తారు. రసస్పర్శ అంటే ఏమిటో అవగాహనతో, అనుభూతితో ఘంటసాలగారి గళంలో పెండ్యాల నాగేశ్వరరావు తన సంగీత దర్శకత్వంలో “భాగీశ్వరి” రాగంలో మనకు అందించారు.

భూలోకంలోని రాకుమారుడైన ప్రతాప్, తన జీవిత లక్ష్యమైన, తన కలల రూపంలోని నలుగురు దేవకన్యలను వివాహమాడతాడు. కాని ఆ నలుగురు తనను విడిచి ఊహకందని లోకాలకు తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఉద్దేశించి కథానాయకుడు పాడిన పాట ఇది.

ఇటువంటి శోకతప్త గీతాలకు సాధారణంగా సింధుభైరవి, ముఖారి, ముల్తానీ, అసావేరి, తోడి, ఘార్జరీ, భాగీశ్వరి రాగాలను వాడతారు. పెండ్యాలవారు ఈ పాటను భాగీశ్వరి రాగంలో ట్యూన్ ని దర్శకులు కె.వి.రెడ్డిగారికి వినిపించారు. ఈ ట్యూన్ లో ఆర్తి, ఆరాధనా భావం బాగా వచ్చాయని కె.వి.రెడ్డిగారు అభిప్రాయపడ్డారు. ఆ మరునాడు మరో రాగంలో ట్యూన్ చేసి కె.వి.రెడ్డిగారికి వినిపించారు పెండ్యాలవారు. ఆ ట్యూన్ కూడా బాగుందనిపించింది కె.వి.రెడ్డిగారికి. కె.వి.రెడ్డిగారు ఈ రెండు రాగాల్లో ఏ ట్యూన్ తో రికార్డింగ్ చేయించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. పాత్రధారి ఎన్టీఆర్ ను రమ్మని కబురు పంపించి, ఈ రెండు ట్యూన్ లలో ఏది బాగుందో తెలియజేయమని, ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసికొన్నా, కట్టుబడి వుంటానన్నారు కె.వి.రెడ్డిగారు. పెండ్యాలవారు చేసిన రెండు స్వర రచనలను రెండుసార్లు పాడి ఎన్టీఆర్ కు వినిపించారు. 5 నిమిషాలపాటు ఎన్టీఆర్ మనసులో తర్జనభర్జన చేసికొని, అరబిక్ మెలోడీలోని ట్యూన్ సాహిత్యాన్ని కొంచెం వెనుకకు నెట్టి ముందుకు దూకుతోంది. సంగీతమే ముందు చెవులను తాకుతుంది. కాని భాగీశ్వరి రాగంలో సంగీత సాహిత్యాలు రెండు కూడా ఒకేసారి మనసును తాకుతున్నాయి. సన్నివేశానికి భాగీశ్వరి రాగం ట్యూన్ నిండుదనం కలిగిస్తుందని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ లోతైన సునిశిత పరిశీలన కె.వి.రెడ్డిగారికి నచ్చింది. భాగీశ్వరి రాగంలో ట్యూన్ చేయబడిన ఈ పాట ఈ రోజువరకు సజీవంగా ఉన్నది. తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నంలో, ఒక రాకుమారుడు చేసిన సాహస కార్యముల గాథ “జగదేక వీరుని కథ”.

గీత రచయిత పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా మాటల, పాటల రచయిత మాత్రమే కాకుండా, నాటక రచయిత, పాత్రికేయుడు.

You may also like

Leave a Comment