‘వాగ్ధానం’ సినిమాలోని పాట
1961 సం||లో విడుదలైన వాగ్ధానం చిత్రాన్ని నిర్మించిన ఆచార్య ఆత్రేయ దర్శకత్వం కూడా వహించారు. దాశరథి కృష్ణమాచార్య గారు వ్రాసిన తొలి సినీ గీతం “నా కంటి పాపలో నిలిచిపోరా”. ఇందులోనిదే. ఈ పాట కొరకు ఆత్రేయగారు, దాశరథిని ప్రత్యేకంగా పిలిపించుకొని వ్రాయించుకున్నారు.
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువ నీరా
తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమికుడు ఎక్కడో దూరంగా వుండకుండా తన కంటి పాపలోని ఉంటేనే తనకు సంపూర్ణ రక్షణ. ఆత్మబంధాన్ని హృదయం కళ్ళలోకి తీసికుంటుంది. కనుపాపలలో పొదుగుకుంటుంది. కాని కంటి పాపలో ప్రేమికుడు ఉండడమేమిటని మనకు అనిపించవచ్చు. మనిషి (మనో లోకం) ఏమోమో కావాలనుకుంటుంది. దానికి హద్దులు అంటు ఏవీ వుండవు, ప్రేయసి తన కళ్ళలోని పాపలో తన రక్షణ కొరకు తన ఇష్టసఖుడిని నిలుపుకొని 14 లోకాలను గెలుచుకొని రావచ్చును. అందుకే తన ప్రియుడు ఎటూ పోకుండ తన కంటి పాపలోనే వుండి పొమ్మని ఇక్కడి కథా నాయిక ఆకాంక్షిస్తున్నది.
ఈనాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మన కోసమే
నెయ్యాలలో తలుపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే || నా కంటి ||
ప్రేయసీ ప్రియులు భావోద్వేగానికి లోనై తమ భావనా లోకంలో సృష్టిలో వున్న, ప్రతి వస్తువు తమకు స్వంతం కావాలనుకుంటే, సమస్త మానవాళి కొరకు సృష్టించబడిన అపురూపమైన వస్తువులన్నీ తమ కొరకే వున్నాయని భావించుకుంటే, ఇతర మానవులకు కాని, ప్రాణికోటికి కాని నష్టం ఏమీ లేదు. అందుకే ఆకాశాన్ని తాము తమ చేతిలోనికి తీసుకొని, చందమామ కేవలం తమ ఇద్దరి కొరకే వెలిసింది అనుకుంటున్నారు. ఆ సమయంలో వారిద్దరి హృదయాలు పారవశ్యంలో తేలిపోతుంది.
ఆ చందమామతో ఆనందసీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో
దూర దూరాల స్వర్గాలు చేరుదమా || నా కంటి ||
ప్రేమికులు తమ ఆనంద సీమను చేరుకోవాలనుకుంటే
పున్నమి నాటి చందమామ వెలుగులో వెన్నెల స్నానాలు
చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరైనా పన్నీటి స్నానాలు చేస్తారు.
కాని వీరి పరిస్థితి భిన్నం. ఆ భావనా లోకంలో వారిద్దరు
ఆకాశంలో విహరిస్తూ, తమ చుట్టూరా ఆవరించి వున్న
మేఘాలపైన నడుస్తూ, తాము బ్రతికి వుండగనే, ఎవరు కూడా చూడలేనటువంటి స్వర్గాన్ని చేరుకోవాలని కలలు కంటున్నారు.
ఈ పూలదారులూ, ఈ నీలి తారలూ
తీయని స్వప్నాల తేలించగా
అందాలను, తీపి బంధాలను
అల్లుకుందాము డెందాలు పాలించగా || నా కంటి ||
తాము భావనా లోకంలో ఆకాశంలో పూలదారులను ఏర్పరచుకొని, ఇద్దరూ నక్షత్రాలలో చేరి తమ బంధాలను దృఢంగా చేసికొని, తమ హృదయాలు తమ భావనాలోకాలలో ఎవరి అధికారం లేకుండా పరిపాలించుకొనవచ్చని ప్రేమికులు కలలలో తేలియాడుతున్నారు.
తన తొలి పాటతో తెలుగు సినీ సాహిత్యంలో ప్రేక్షకులను, శ్రోతలను సుకురమైన మనఃప్రసన్నకరమైన రసోద్వేగానికి గురిచేసిన దాశరథిగారు చిరస్మరణీయులు. సాహిత్యం – సంగీతం పోటీపడి, ఘంటసాల, సుశీలగారల గాత్రాలు సంగీత ప్రియులతో రసఝరులు నింపిన ఈ గీతం 60 సంవత్సరాలైనప్పటికి, ఇప్పటికే కాదు, చిరస్థాయిగా అందరి హరృదయాలలో నిలిచిపోతుంది.
దాశరథిగారు వ్రాసిన ఈ గీతం గల చిత్రం ‘వాగ్ధానం’ తేది 05.10.1961న విడుదలైంది. అంటే ఇప్పుడీ పాటకు షష్టిపూర్తి సంవత్సరమన్న మాట
అమరశిల్పి జక్కన్న (1964) సినిమాలోని
ఈ నల్లని రాళ్ళలో……… పాట గురించి
ఈ పాటను డా|| సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు తాను రచించిన “రామప్ప” సంగీత రూపకం కొరకు వ్రాసినారు. వారి అనుమతితో అమరశిల్పి జక్కన సినిమా కొరకు నిర్మాత, దర్శకులు బి.ఎసం.రంగా ఈ పాటను వాడుకున్నారు.
సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాలగారు ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.
ఒక శిల్పి ఉలిని చేత పట్టుకొని, శిలవద్దకు చేరగనే, ఆ శిలల మాటున దాగిన శిల్పాలన్నీ మన కళ్ళకు గోచరమవుతాయి.
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నుల దాగెనో
ఈ బఁడల మాటున ఏ గుండెలు మోగెనో
అంతకుముందు రాయి లాగ పడి వున్న వస్తువులో దాగిన కళ్ళ కాంతి పుంజాలు మనకు గోచరిస్తాయి. ఆ రాయి చాటున దాగిన గుండె చప్పుళ్ళు మన మనస్సును తాకి మనం పరవశమగునట్లు వినిపిస్తాయి.
పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి ||ఈ నల్లని||
అడవులల్లో తపస్సు చేసికొనే ఋషులవలె పర్వతాలు కూడ (పర్వతాలలో వుండే శిలలు) మానవ జాతికి దూరంగా పాపాలకు, తాపాలకు దూరంగా కారడవులలో ఎక్కడో ఎవరికీ కనపడకుండ వుంటాయి.
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలియలికిడి విన్ననంతనే జల జలమని పొంగి పొరలు ||ఈ నల్లని||
శిలలు ప్రకృతి సహజంగా ఎక్కడ వున్నవి అక్కడే కదలకుండా వుంటాయి. కాని శిల్పి ఉలిని ఆడించగనే ఆ శబ్ధం వినబడగానే సెలయేర్లు ఉప్పొంగినట్లు సజీవ శిల్పాలు ఏర్పడతాయి.
పైన కటిన మనిపించును, లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ||ఈ నల్లని||
మనుషులుపైకి మంచివాళ్ళలాగా కనపడతారు. కాని లోపల క్రూరమైన తలంపులుంటాయి. శిలలు పైకి కఠినంగా కనపడతాయి. కాని శిల్పి ఉలితో వాటిని తాకితే ఒక ఆకారం వచ్చి, వాటిలో వెన్నలాగా మృదుత్వం మనకు సాక్షాత్కారమవుతుంది. అయినప్పటికీ అవి ప్రపంచంలోని ఏ వస్తువుకు కూడా హాని చేయవు. ప్రాణమున్న మనిషికంటే శిల్పాలైన శిలలే ఎన్నోరెట్లు బాగనిపిస్తాయి.
శిల్పకళ ప్రవీణుడు జక్కన పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు జీవించారు. ముఖ్యంగా “ఈ నల్లని రాళ్ళలో” గీతం సన్ని వేశంలో ANR నటన అద్భుతం.
ఇక సాహిత్యానికి వస్తే అలతి పొలతి పదాలలో, మనం మాట్లాడే భాషా పదాలను ఉపయోగించి, సినారెగారు సినిమాకు కాకుండ, తాను రచించిన “రామప్ప” రూపకానికి లిఖిస్తే, రాజేశ్వరరావుగారి మధుర బాణికి ఘంటసాలవారు తన గాన మాధుర్యంతో శ్లోతలను తన్మయంలో ముంచారు.
-ఏలూరు అశోక్ కుమార్ రావు