శ్లోకం:
ప్రథమవయసి పీతం తోయమల్పం స్మరంతః
శిరసి నిహితభారా నారికేళా నరాణాం
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాంతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి
(శ్లోకం సేకరణ: సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు)
భావం: ఎప్పుడో చిన్నప్పుడు పోసిన నీళ్లను తాగి,ఆ మేలు మరచి పోలేక, కొబ్బరి చెట్టు నీటితో నిండిన బరువైన కాయల్ని తలమీద మోస్తూ జీవితపర్యంతమూ మానవులకు తియ్యటి నీటిని అందిస్తూ ఉంటుంది.ఆహా! సజ్జనులు ఎదుటి వారి నుండి ఎంత చిన్న ఉపకారం అందుకున్నా దానిని మరచి పోకుండా పరులకు తిరిగి ఉపకారం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు.
అన్వయం: ప్రకృతి , మనిషి నుండి ఏ కాస్త సహాయం అందుకున్నా ఋణం తీర్చేసుకుంటుంది. మళ్లీ ఇటువంటి స్వభావం సజ్జనులకే ఉంటుంది.ఈ లక్షణం మానవులందరూ అలవరచు కుంటే మనం ప్రకృతిలో మ మేకమైనట్లేకదా!
మనిషికి ఉండవలసిన లక్షణాలలో ప్రథమమూ,ఉత్తమమూ అయినది -కృతజ్ఞత.ఈ స్వభావమే మనిషిని ఉన్నతమైన స్థానం లో నిలబెట్టుతుంది.తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు,బంధువులు వీరందరి పట్ల కృతజ్ఞత కలిగిఉండాలి.ఎందుకంటే , మనం పుట్టిన దగ్గర నుండి మనం ఎదుగుదలకు వీరు మనకు సహాయం చేసిన వారే.వీరందరినీ మనతో పాటు నిలబెడుతూ , మనకొక స్థాయిని కల్పిస్తున్న ఈ సమాజానికి మన మెప్పుడూ ఋణపడి ఉండాలి.
సమాజ ఋణం తీర్చుకొనేందుకు మనశక్తియుక్తులను … బౌద్ధిక ప్రమాణాలస్థాయిననుసరించి ఏ రంగాలలో మనం వికాసప్రగతిని సాధించినామో ఆ రంగంలోనే ఇతరులకు సహాయసహకారాలు అందించవచ్చును. తరాల అంతరాలను తగినవ విధంగా పూరించటంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించటం కృతజ్ఞతా పూర్వకంగా మన పూర్వులనుండి పొందిన స్ఫూర్తిని జాతినిర్మాణపరమైన కృషికి కృతజ్ఞతాసమర్పణమే ఔతుంది. కృతకృత్యుల కృషిని వారి పేరున స్మరించటమే వారి కీర్తిగీతికి మనం సమకూర్చే ఆకర్షణీయ వాద్యసంగీతం.
-డా|| మృదుల నందవరం
తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిగ్రీ కాలేజీ (విమెన్), బేగంపేట్
+91-9441408393