Home పుస్త‌క స‌మీక్ష‌ సు’లోచనాల’లో మెరిసిన” నానీ లోచనాలు “

సు’లోచనాల’లో మెరిసిన” నానీ లోచనాలు “

by Radhika Suri

గడ్డం సులోచనగారితో నా తొలి పరిచయం సోమవారపు కుటుంబంలో . నిరాడంబరత, స్నేహపూరిత పలకరింపు ఆమెలో నన్నాకర్షించిన విషయాలు.
కలంపట్టి రాయమంటూ ప్రోత్సహించిన సహాధ్యాయుడికే తన తొలి రచనను అంకితమిచ్చి కృతజ్ఞత చాటుకున్న స్నేహశీలి.
పుస్తకావిష్కరణ సభలో ‘నానీ లోచనాలు’ పుస్తకంతో ఇల్లు చేరి సమీక్ష రాయాలనుకున్నా కారణాంతరాలతో జరిగిన జాప్యమిది.

అక్షరాలవెంట పరుగులుతీసి ఒజ్జగా మారినా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించిన సందర్భం నేర్పిన అనుభవంతో
“ఇంటి వెలుగు
లైట్ల వల్లకాదు
ఇంట్లో స్త్రీలు
విద్యావంతులు”
అంటూ – పుట్టెడు బాధ్యతలున్నా బొంగరంలా తిరుగుతూ ఇంటెడు చాకిరీ చేసే ఇంతికి విద్యాగంధం తోడైతే పిల్లలలో అక్షరక్రాంతి నింపుతుందంటూ’ ఇల్లాలిని శ్లాఘిస్తూ పుస్తకానికి శ్రీకారం చుట్టారు.

కనిపించని దేవుళ్ళకు సాగిలబడుతూ కళ్ళెదుట ఉండే తల్లిదండ్రులను పట్టించుకోరు .
“చిన్నప్పుడు
అమ్మ అందరి సొత్తు
పెద్దపుడే
వదిలించుకునే విపత్తు “
అంటూ మమతానురాగాలు రంగరించి గోరుముద్దలు తినిపిస్తూ పెంచిన తల్లి పిల్లలను ఎప్పుడూ భారం అనుకోదు కదా! అదే తల్లులు అవసాన దశలో ఆదరణకు దూరమై అలమటిస్తున్న సందర్భాలు నేటి సమాజంలో కోకొల్లలు. కనిపెంచిన అమ్మదనానికి
మలిదశలో ఎందుకీ ‘అంకురయాతన’ అంటూ ఆవేదన చెందుతారు.

జల్లెడను పోలీసుతో పోలుస్తూ , ‘దాక్కున్న తాలును నిగ్గు తేల్చి’ పట్టిస్తుందంటూనే , డాక్టర్ల తెలివిని అభినందిస్తూ’ ప్రాణమున్న బికారి’ని చేస్తాడంటూ నేటి కార్పో’రేటు ‘వైద్యులకు
చురకలంటిస్తారు .అమ్మ ప్రేమలో నైర్మల్యం గూర్చి చెప్తూ అబద్ధాల్ని అమాయకంగా నమ్మేస్తుంది ‘అచ్చం యశోదమ్మ’లా అంటూనే కట్టుబాట్ల సంకెళ్ళల్లో ‘ఆమె’ తెలివితేటలు ‘కట్టడి’ చేయబడతాయి అంటూ ఆవేదన చెందుతారు. ‘నడిరేయి దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలున్నా ‘మహిళలు వీధులలో తిరుగలేని సమాజ స్థితిగతులకు మహిళగా ఆందోళన చెందుతారు.

“సాహితీ మాగాణంలో
కలం సేద్యం
అనంతభావాల
అక్షర నైవేద్యం “
అంటూ కలంతో కవితాసేద్యం చేస్తూ భావాక్షరాలను పండించే కవి ఇంట్లో దొంగలు పడితే సంపద కోసం కాకుండా తన’ కవితలు దోచుకుపోయారంటూ’
ఆవేదన చెందుతాడంటారు ఆమెలోని కవయిత్రి .

‘ప్రయత్న లోపాన్ని వీడితే విజయం తథ్యం’ అంటూ వెలిగే సూర్యుడిని ఆపడం ఎవరితరం కానట్టే , ప్రజాఉద్యమాల్ని అణచివేయడం అసాధ్యం అంటూ తెలంగాణ ఉద్యమం మదిలో మెదిలి, “చరిత్రపుటల్లో
అమరుల త్యాగాలు
తెలంగాణ
జీవన చిత్రాలు”అమరులైన తెలంగాణా వీరులు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వెలుగొందుతారంటూ’ తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు.
‘పచ్చదనం చెట్టుకెరుక పొట్ట నింపడం అమ్మకెరుక’ అంటూ పర్యావరణానికి మమకారానికి లంకె పెడతారు .

“మొగ్గను గుచ్చినా
దారంతో ఉరేసినా
మల్లె
తెల్లగానే నవ్వుతుంది “
అంటూ విరుల ఒంటిపైనున్న గాయాల జల్లెడను చూసి మనసున్న మనిషిగా విలవిల్లాడిపోతారు .

“పరిణతి లేని
ప్రేమ వ్యవహారం
రెక్కలు రాని పక్షి
గూడు వదిలినట్టు”
అంటూ
అపరిపక్వపు ప్రణయం రెక్కలు రాని పక్షి గూడు వదిలి దారితప్పిన చంద’మంటూ యువతకు చిరు హెచ్చరిక చేస్తారు. క్రమశిక్షణ లేని జీవితాలు, అలవాట్ల పొరపాట్లతో ‘ఆరోగ్యం అనారోగ్యం పాలబడకుండా నడకతో సరిచేసుకోవచ్చంటూ’ చక్కని సూచన చేస్తారు. రాగద్వేషాలు వీడితేనే మనిషిలో మానవత్వం చిగురించేదని హితబోధ చేస్తారు.

లింగ వివక్ష పై మండిపడుతూ – స్త్రీని పూజించే సమాజం మనది అయినా గర్భస్థ శిశువు ‘ఆడ’ని తెలిస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా అంతమొందించే ప్రయత్నం చేస్తారు
“గుడిలో అమ్మని పూజిస్తారు
గర్భగుడిలో ఆడబిడ్డను
హత్య చేస్తారంటూ”
భ్రూణహత్యలపై ఘాటుగా స్పందిస్తూ, చిన్న బుద్ధిగల మనుషుల ‘మనసుల్లోని మాలిన్యాన్ని చీపురుతో
కడిగేయాలంటూ’ కళ్ళెర్రజేస్తారు . ‘గట్టిగా ముడివడని బంధాలు తెగదెంపులతో
దూరమౌతుండడం బాధాకరమంటూ నేటి వివాహ వ్యవస్థ తీరుకు వాపోతూనే ఇల్లాలిని సూర్యుని’తో పోలుస్తూ ఆమె చుట్టూనే పరిభ్రమించే ‘మమతల గ్రహాలు ‘ఇంట్లోని వారంటూ, కలతలు లేని సంసారాలు ‘మమతల కోవెల’లంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘ఎదగడానికి తొందర పనికిరాదంటూ’ అదను చూసుకుని అనువైన మార్గం వైపు దృష్టి సారించమని, ‘సద్విమర్శల్ని సహృదయంతో స్వాగతించమని’ అనుభవంతో చెప్తారు.

“ఉచితాలెందుకు?
ఉపాధి కావాలి
ఆశల సుడిగుండంలో
యువత ఉంది”
ఉచితాలతో యువత భవితవ్యం అయోమయంలో పడిపోయి ప్రశ్నలా మారిపోయిందని ఆవేదన చెందుతారు. పట్టణీకరణతో పచ్చని పల్లెలు కాంక్రీట్ జంగల్లుగా మారడం ,పొట్టకూటి కోసం రైతన్న వలస కూలీగా మారిపోయాడంటూ బాధపడి, భూకబ్జాలలో చిక్కి నలిగిపోతున్న భారతావనికి “భరతంపట్టే భీమసేనుల ” అవసరం ఎంతైనా ఉందంటూ ఆశాభావం
వ్యక్తం స్తారు.

‘వర్షించని మేఘపు నీటితడిఅంతా రైతు కళ్ళ’ల్లోనే దాగుంటుందంటూ జాలి పడుతూనే , కన్నీళ్ళను దాచి మనసు భారం కానీయొద్దంటూ ‘వర్షించిన మేఘా’నివై తెలిమబ్బులా సాగిపొమ్మంటూ ఊరడిస్తారు.

” తెలుగుకు తెగులు సోకిస్తున్న” ఆధునిక తల్లుల వింత పోకడలకు తల్లడిల్లిపోతారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అంతా చరవాణి చేతిలో బందీలైన ఏకాకులంటూనే పాపం ‘ఉత్తరం ఉనికి లేకుండా పోయిందని ‘బాధ పడతారు .
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు మమతానురాగాలు పెనవేసిన ‘లతానికుంజ’మంటూ కౌటుంబిక జీవన మాధుర్యాన్ని అందంగా వర్ణిస్తారు.

“బొమ్మలేయడం
ఈజీకాదు
భావాల చుక్కలకు
గీతలు కలపాలి”
అని చిత్రలేఖనంలోని సాధకబాధకాలను వెల్లబోసుకుంటుంది తనలోని చిత్రకారిణి. పదాల్ని దారంగా మార్చి భావాల కవితాపుష్పాలను మాలికగా అల్లుతుంది ఈమెలోని కవయిత్రి.
గ్రామీణ నేపథ్యమున్న వీరు పంటచేల నాట్యానికి పరవశిస్తారు, వరినాట్లేసే అతివల్లో ‘నేలకు దిగిన రంగుల సింగిడి అందాలను’ చూస్తూఆనందిస్తారు.

“పొలాల్లో
హరివిల్లులా ?
లేక వరినాట్లేస్తున్న
పల్లె పడతులా?
అంటూ అచ్చెరువొందుతారు.

స్వతహాగా ఉపాధ్యాయురాలైన
వీరు “నసుగుతూ మాట్లాడకు స్పష్టత అవసరమంటూ”గట్టిగా మందలిస్తారు. “ప్రశ్నించడం నేర్చుకోమంటూ బెత్తాన్నెత్తి హెచ్చరిస్తారు”. చదువులో ముందుండి జీవితంలో వెనుకబడ్డ అతివల్లోని అసంతృప్తి,అసహనం ఆమె కవితల్లో స్పష్టంగా కనబడుతుంది. ‘గ్రంధాలయాలు జ్ఞాన భాండాగారాలు ‘అంటూ పుస్తక పఠనపు ఆవశ్యకతను, చదువు సార్ధకతను ‘మహిళా సాధికారతను అక్షరాలలో రంగరించి చెప్తారు .

“సాహితీ సముద్రంలో
మునిగాను
అప్పుడప్పుడు
ముత్యాలు దొరుకుతున్నవి”
అంటూ ‘మేలిమి కవిత’ల ఊటకోసం ఆరాటం, ఒకింత నిరాశ కలగలిపిన కళ్ళతో అర్థవంతమైన అక్షరాలకై దోసిళ్ళొగ్గుతారు. .

సమాజపు తీరుతెన్నులను మీ ‘సులోచనాల’తో ఓ కంట గమనిస్తూ మీలో దాగిన సన్నటి అసంతృప్తి సెగను చల్లార్చి మీదైన శైలిలో మంచి కవితా ఝరులు జాలువారుస్తారని ఆశిస్తూ…

You may also like

Leave a Comment