Radhika Suri
అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి దూరం మాత్రమే! రెప్పపాటు కాలం అందలమైనా ఎక్కించగలదు లేదా అధఃపాతాళానికైనా తొక్కేయగలదు. వైద్యం కొత్త పుంతలు తొక్కి, ఔషధం ఎల్లలు దాటి సేదదీరుస్తున్నా ! ఎక్కడో ఒకచోట అపశృతి విలయతాండవం చేస్తూనే ఉంటుంది. అందమైన జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంటుంది. అలా ఓ భావి జీవితాన్ని నిర్దయగా కబళించి, నిస్తేజంలోకి నెట్టిన సంఘటన.వివరాల్లోకి వెళ్తే… వైకల్యాన్ని తన మనోబలమనే ఉక్కు పాదంతో తొక్కి పెట్టి, పడి లేచిన కడలితరంగమై, నింగి కెగసిన తారాజువ్వలా దూసుకుపోతున్న ఈ ఆత్మవిశ్వాసం పేరే బాలలత మల్లవరపు.
సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఆరాధ్య దైవం, ఆమె మార్గ నిర్దేశం కోసం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన
వ్యక్తినంటూ చెప్పే వీరు గుంటూరు వాస్తవ్యులైన శ్రీ శౌరయ్య, విజయ దంపతుల కుమార్తె. ఈమెకు సంవత్సరంలోపే పోలియో చుక్కలు వికటించి రెండు కాళ్లు పని చేయకపోవడంతో డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదట. ఆటపాటలతో, చదువుసంధ్యలతో హాయిగా సాగాల్సిన బాల్యంలో
ఆ చిన్ని మనసు ఎన్ని అలజడలకు లోనై ఉంటుందో కదా! ‘వైకల్యం అపహాస్యం చేసినా చివరికి సంకల్పబలం ముందు తలవాల్చింది’ .ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగిస్తూ న్యాయ శాస్త్రంలో పట్టా పొందినా, సమాజం వికలాంగురాలిగా గుర్తించడం బాధించిందంటారు. డాక్టర్ల చుట్టూ తిరిగినప్పుడు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వ్యక్తుల్లో అని వారు అన్నప్పుడు, నేను ఎక్కువ రోజులు బతికి చూపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కానీ ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎంత సాధించాం ,సమాజానికి ఏం చేశామన్నది మాత్రమే ముఖ్యం అంటారామె .
బాల్యం నుండి అవహేళనలతో బాధకు గురైన సందర్భాలెన్నో గుర్తొస్తాయంటారు. నన్ను నేను నిరూపించుకోవాలనుకుని , డిగ్రీ సెకండ్ ఇయర్లో ఐ.ఏ.ఎస్ . కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ ‘ఆసి రెడ్డి ‘గారు మాట్లాడుతూ గ్రూపు 2. లాంటి పరీక్షలు రాయమ్మా, రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయత్నించు కావాలంటే స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తానంటూ అనునయించి పంపారని గుర్తు చేసుకుంటారు. వారికి తాను ‘ఏకలవ్య శిష్యురాలి’నని పేర్కొంటారు.
ఎంతసేపు చదివామన్న దానికంటే ఎంత మనసు పెట్టి చదివామన్నదే ముఖ్యం. గడచిన క్షణాలు తిరిగి రావు కాబట్టి జీవితాన్ని ‘పాషన్’తో ఉత్సాహంగా గడపాలంటారు. సివిల్స్ పై దృష్టి పెట్టి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే 2004లో ,399 ర్యాంక్ సాధించి, రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంట్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని అధికం చేసిందంటారు. తన విజయం వెనుక నాన్న కృషి వెలకట్టలేనిదని , విలేకరిగా వారి అనుభవాలు సమాజాన్ని చూపించిన తీరు తనకు ఎంతో కలిసి వచ్చిన అంశాలుగా పేర్కొంటారు. నాన్న బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినప్పుడు పుస్తకాలు కావాలంటూ తెప్పించుకుని చదివేదాన్నని రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమయ్యానంటారు. ఐ.ఏ.యస్.గా పేపర్లో ఫోటో చూసుకోవడమే తన ధ్యేయంగా దాదాపు 12 – 15 గంటలు చేసిన కృషికి దక్కిన ఫలితంగా పేర్కొంటారు.
సివిల్స్ ఆస్పిరెంట్స్ యన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాలు 6 నుండి 12వ తరగతి వరకు చదివి జ్ఞానం సంపాదించాలంటారు .
ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నప్పుడు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులు తన సలహాల కోసం రావడం మొదలుపెట్టారని మెంటార్ గా ఎంతోమందికి ర్యాంకులు రావడంలో సహాయసహకారాలు అందించానంటారు .అప్పుడే తనలో ‘నేర్పాలనే’ ఆలోచనకు బీజం పడిందంటారు. ఆరు సంవత్సరాల క్రితం సి .యస్.బి.
ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నపుడు ముందుగా తనపై తానే ప్రయోగం చేసుకోవాలనుకుని తిరిగి 2016లో సివిల్ సర్వీసెస్ కు అప్లై చేసి 167వ ర్యాంకు పొందినపుడు తన నిర్ణయం సరైనదేనని భావించారట.
మెంటర్ గా ఎంతోమంది కి శిక్షణ ఇస్తూ , వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతూ సమాజానికి చక్కటి యువతను, అధికారులను అందిస్తూ ప్రభంజనమై సాగుతున్న వీరి జీవిత భాగస్వామి శ్రీ సురేష్ బాబు ‘ గ్రూప్ వన్’ ఆఫీసర్ కాగా, పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు.
తల్లిదండ్రులు తమ ఆశయాలకు అనుగుణంగా కాకుండా నిర్ణయాధికారం పిల్లలకే వదిలేసి వారికి నచ్చిన రంగాల వైపు నడిపించాలంటారు.
ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండడంలోని తృప్తి కంటే ఎంతో మందికి శిక్షణనిస్తూ మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉండటంలోనే తనకు ఆత్మసంతృప్తి లభించిందంటారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తున్న వీరు భారతదేశంలో స్త్రీలు మరియు దివ్యాంగులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలన్నదే తన తపన అంటారు. దాంట్లో విజయం సాధిస్తేనే తన లక్ష్యం నెరవేరినట్లు అంటారామె.
జీవితం ప్రశాంతంగా ఉండాలంటే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలనే వీరు, సివిల్స్అభ్యర్థులు ప్రారంభం నుండే టెస్టులు రాస్తూ ఉండాలని ,సిలబస్ అయ్యాక రాయడం మంచిది కాదంటారు. రివర్స్’ ఇంజనీరింగ్ మెథడ్ ‘ఫాలో అవ్వాలని సూచిస్తారు.
జనం ఎవరేమన్నా పట్టించుకోకు శత్రువుల్ని గెలవాలంటే లక్ష్యం మాత్రమే మన మనసులో మెదులుతూ ఉండాలని, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే విజయం నీకు దాసోహం ఔతుందంటారు . మన ఆలోచనలే మనల్ని డిసైడ్ చేస్తాయి థాట్స్ ని సీరియస్గా తీసుకోకూడదంటారు “ఐయామ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్” అన్న భావన బలీయంగా ఉండాలంటారు. మన జీవితం మనకు మాత్రమే సొంతం. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా అనుభవాలనే జీవిత పాఠాలుగా మలుచుకోవాలని ,ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ, నిర్ణయాల్ని వాయిదా వేసి, ఆలోచనాశక్తిని కోల్పోకుండా తట్టుకుంటూ ముందుకు సాగా లంటారు. సమాజంలో అందరూ మంచివాళ్లే ఉంటారనుకుని భ్రమ పడక, జాగ్రత్తగా అడుగులు వెయ మంటూ దారి చూపుతారు. నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుందనే
వీరి దృష్టిలో,’ మనోబలమే నిజమైన శక్తి ‘.
జీవితం రైలుబండి లాంటిది ఎంతోమంది తారసపడుతుంటారు. బంధాలు బాంధవ్యాలు దూరం అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు .అశాశ్వతమైన బంధాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం సరికాదు అంటూ యువతకు హితోపదేశం చేస్తారు .మన అనుభవాల్ని జీవిత పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగాలంటూ ధైర్య వచనాల్ని స్వానుభవంతో చెప్పారు .గతాన్ని వదిలేసి భవిష్యత్తును ఊహిస్తూ ఆలోచనల్లో ఊగిసలాడడం సరికాదంటూ సలహా ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని వెన్ను తట్టి చెబుతారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమార్గం
ఎంతో అనుకూలమైందంటూ సూచిస్తారు.
సమయం ఎవరికోసం ఆగదు తెలివిగా సమయాన్ని ఒడిసిపడితేనే విజయం నీదౌతుందంటూ
వెన్ను తడతారు.మన కోసం మనం జీవించాలి. అనునిత్యం ఆత్మ పరిశీలన అవసరం , కలల్ని కంటూ సాకారం చేసుకోవాలనే వీరు నిర్ణయాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం సరికాదంటారు.
సామాజికాంశాల్ని ఎప్పటి కప్పుడు తెలియజేసే వీరు, కీర్తిశేషులు. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని తన స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు.
వ్యవస్థ ,మనుషుల్లో అంత త్వరగా మార్పు కనిపించిందని, యువతను మార్చడమే తన ఆశయమని.’ వేచి చూస్తేనే విజయం వరిస్తుంది ‘పోరాడి గెలిచిన వాడే రియల్ హీరో ‘అంటూ, సవాలును స్వీకరిస్తూ మంచి ఆశయాలతో ముందుకు సాగాలంటారు. మనిషి కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేసే రోజులు రావాలంటూ ఆకాంక్షిస్తారు . ఆత్మ న్యూనతకు లోనైతే ఏది సాధించలేరంటూ , ‘భయపడడం తప్పు కాదు, భయాన్ని జయించలేకపోవడమే పెద్ద తప్పు’ అంటారు. భయాన్ని వీడితే నిన్ను ఏ శక్తి ఆపలేదంటూ ధైర్యం నూరిపోస్తారు.ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉన్నప్పుడు ప్రయత్నం నల్లేరుపై నడకలా సాగిపోతుందని, ప్రతి నిమిషం చాలా విలువైనదని, గెలుపోటములు పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తేనే ప్రశాంతత దొరుకుతుందంటారు.
ఓపిక ,పట్టుదల గెలుపుకు రెండు మెట్లలాంటివని మనల్ని మనం అభిమానించుకుంటేనే ఎన్నో విజయాలను అందుకోగలం ఇతరుల గురించి ఆలోచించడం, అసూయాద్వేషాల మధ్య కొట్టు మిట్టాడితే నీ లక్ష్యాన్ని మరిచిపోతావంటారీమె .
‘లాయిడ్ గ్రూప్ ‘సంస్థల అధిపతి శ్రీ విక్రమ్ నారాయణ గారి ఉదారత, సేవానిరతి తననెంతో ప్రభావితం చేశాయని వారు’ ధనిక్ భారత్ మిషన్ ‘విద్యా సంస్థలను ప్రారంభించడానికి ముందు నన్ను సంప్రదించినప్పుడు ‘ సర్ , మీరు నా స్పీడును అందుకోగలరా !అంటూ ప్రశ్నించిన ఆమె ఆత్మ స్థైర్యానికి ఆశ్చర్యపోకుండా ఉండడం అసాధ్యమని నా భావన. దాదాపు ఒక లక్షా యాభైవేల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆ పదహారేళ్ల వయసు పిల్లల్లో తప్పకుండా మార్పు తీసుకు రాగల సత్తా నాకుందనిపించి ఈ విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉండడానికి నిశ్చయించుకున్నానని ,
‘ధనిక్ భారత్’ విద్యాసంస్థల పేరిట 16 బ్రాంచీలతో ‘ఇంటర్ మీడియట్’ కాలేజీ’లు ప్రారంభించబోతున్నామంటూ, తమ కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఉండదంటూ స్పష్టం చేశారు. యువతకు సరైన దిశా నిర్దేశం చేస్తూ జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సరైన మార్గం చూపించగలమని గట్టిగా చెప్పగలనన్నారు. సాధారణ విద్యార్థినినైన నేను ,నాపై నాకు నమ్మకం లేకున్నా మొండి ధైర్యంతో ముందుకు నడిచి గెలుపు సాధించాను ,అలాగే అంగవైకల్యం ఉన్న పిల్లలకి కోచింగ్ ఇస్తున్నప్పుడు వారిలో నన్ను నేను చూసుకుంటాను అంటూ చెప్పే వీరు గెలుపు కోసం ఐదు సూత్రాలను పాటించాలంటారు .
ఒకటి . డిసిప్లిన్ ,
రెండు . క్లారిటీ అఫ్ థాట్
మూడు. ప్లానింగ్
నాలుగు. డిజైన్
ఐదు. పర్పస్ ఆఫ్ లైఫ్
సరైన ప్రణాళిక ,అవగాహన ఉత్సాహం ఉంటే రెండు సంవత్సరాల్లో సులభంగా సివిల్స్ లో విజయం సాధించవచ్చు అంటూనే ,ఒకవేళ ఓటమి ఎదురైనా ఆ అనుభవంతో జీవితంలో ఏదో ఒక రకంగా ఉన్నతంగా జీవించగలరని ధీమాగా చెప్తారు. భావోద్వేగంతో కూడిన జీవనశైలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ” తన జీవిత పుస్తకంలో ప్రతి పేజీ కొట్టివేతలు లేకుండా అందంగా మలుచుకోవాలనే తపన ఆరాటం తనలో అనుక్షణం ఉంటుందంటూ ‘ చెప్పే వీరు,
చిన్ననాడు ‘వడ్డాణం ‘కొని పెడతానన్న తాతయ్య మురిపెపు మాటలకు బంధువులు చేసిన అవహేళనలు తనను ఇప్పటికీ బాధించే సంఘటనైననా “నా పేరే నాకు ఆభరణం”లా మారిందంటూ ఆత్మవిశ్వాసంతో ,ఒకింత ఆనందంతో చెప్తారు . విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో తన జీవితాన్ని అంకితం చేస్తానంటూ దానికోసం కుటుంబానికి కూడా దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, వారి భాగస్వామి మమ్మల్ని వదిలేసావన్నమాట అంటూ నవ్వుతూ అన్న మాటల్ని గుర్తు చేస్తూ, మంచి భర్తకు సరైన నిర్వచనం మావారంటూ కితాబిస్తారు.
తొణకని ఆత్మవిశ్వాసం, ప్రవాహం లాంటి మాట తీరు ,ఎంతోమంది పిల్లల్ని ఐ.య్యే.యస్ .లుగా చేయాలన్న మీ తపన అభినందనీయం . విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న మీరు మరెందరికో రోల్ మోడల్ గా మారి మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.
సొగసైన అక్షర శిల్పాలను కలబోసి ఒడుపుగా కూర్చిన తేటతెనుగు అక్షరకాంతను నేను
శివుని పంపున ఇలకు దిగిన పుష్పగంధను నేను
వసివాడిన శబ్దకుసుమాలలో
జీవకళ నింపే అంగీరసను నేను
ముద్దుగారే చిన్నారుల నోటి
మాటల జుంటి తేనియను నేను
ఒడుపైన దోసిట అక్షరమై ఒదిగిపోయే అమృతభాండాన్ని నేను
కళతప్పిన తెలుగుదనానికి రంగులు కలబోసిన హరివిల్లును నేను
అలసిన వేళ వర్ణరాగ రంజితమై హాయిని గొలిపే మలయ సమీరాన్ని నేను
క్షరమైపోతున్న పద సౌందర్యానికి వన్నెచిన్నెలద్దే కవి కోకిలలు చేతబట్టిన అక్షర తూలికను నేను
ఉనికి ప్రశ్నార్థకమైన ఊగిసలాటలో భావితరానికి ఊతమయ్యే
శబ్ద క్రాంతిని నేను
హంసవాహిని చేతిలో ఆభరణమై వెలుగులీనుతున్న జ్ఞాన
జ్యోతిని నేను
అంతిమంగా అమ్మ భాషలోని కమ్మదనపు తేనెలొలుకు
తేట తెనుగును నేను.
సెలవంటూ నింగికేగిన గంభీరస్వరం : శ్రీ టేకులపల్లి గోపాల రెడ్డి
ఒక్క కవితను కూడా వారు రాసింది లేదు, చిన్న కథను కూడా అల్లిందీలేదు, ఐనా వారిలో నిగూఢంగా దాగిన రచనాతృష్ణ అక్షర ఝరుల్ని అలవోకగా పారించి మూడు సంపుటాలుగా స్వీయ చరిత్ర ‘జీవన స్రవంతి’ని బ్రెయిలీ లిపిలో రాయించింది. వారిలోని కవి హృదయం’ సోమవారపు కవి సమ్మేళనం’లో భాగస్వామిని చేసింది. ఊతకర్రను ఆసరాగా చేసుకుని ఏమరుపాటు లేక జీవిత వైకుంఠపాళీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ గమ్యం చేరిన వారి ప్రస్థానం ,స్వానుభవం నేర్పిన పాఠాలను అధ్యాపకుడిగా, భాషావేత్తగా తేటతెనుగుపై మమకారం ఎంతో మంది శిష్యులకు పాఠాలుగా నేర్పి సఫలీకృతున్ని చేసి విద్యార్థుల్లో మనోధైర్యం నింపి వారి మనసులకు చేరువ చేసింది .
దివ్యచక్షువుల పాలిటి ఆశా కిరణం’ లూయీబ్రెయిల్’ ని ‘చీకటిసూర్యుడు ,’అంటూ బ్రెయిలీ లిపి సృష్టికర్తను పొగడ్తలతో ముంచేసేవారు. ఒక అధ్యాపకుడికి ఆశయం తోడైతే ప్రబోధం కడలి అలలై ఎగిసిపడి ఎందరిలోనో స్ఫూర్తి నిలుపుతుంది. తన జీవితంలోని ఆటుపోట్లను తట్టుకుంటూ అనేకంటే ‘చీకటి సముద్రాన్ని’ ఈదడం అంటే సముచితమేమో! జీవితపు పరుగు పందెంలో ఒక్క అడుగు వెనుకబడితే చాలు మాటల ఈటెలతో మనసుకు తూట్లు పొడుస్తుందీ సమాజం. ఇది అన్నీ సక్రమంగా ఉన్న వారి జీవితాల్లో , అదే వైకల్యపు జీవితమైతే పెనుకల్లోలమై ప్రకంపనలని సృష్టిస్తుంది.

చిన్ననాడు వారి తండ్రి పడ్డ మనోవేదన, ముందుచూపుతో వారు బలంగా నాటిన ‘క్రాంతి బీజాలు’ వేళ్ళూనుకుని అంధులైన వీరిని అక్షర ప్రబోధకుడిగా మార్చి, వెలుగులీనే కళ్ళుండీ దిక్కులు చూసే ఎందరో శిష్యుల్లో చైతన్యాన్ని నింపి దిశా నిర్దేశం చేయించింది. వీరు 2012లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ చేసిన అనంతరం నేటి కామారెడ్డి జిల్లా పోచారం స్వగ్రామంలో విశ్రాంత జీవనం గడిపారు.
ఇక నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి.
గతమూడు సంవత్సరాలుగా మా’ సోమవారం కుటుంబం’లో అందరితో ముచ్చటిస్తూ కవితలపై నిష్పాక్షికంగా స్పందిస్తూ , ప్రోత్సహిస్తూ కార్యక్రమం చివరగా వారి వాగ్ఝరితో ఆవారం సెలవు తీసుకుని మరోవారానికై ఎదురుచూసే సభ్యులం మేమందరం. అలాంటి సోమవారపు ప్రయాణం తొలినాళ్లలో, నా ‘ఆలోచన’ కవిత విని (ఇది కొండపల్లి నీహారిణి గారి తరుణి ఆన్లైన్ మ్యాగజైన్లో వచ్చింది)మరుసటి రోజు రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు .అమ్మా నీ కవిత విన్నప్పుడు నా గతం కళ్ళ ముందు నిలిచింది ,ఆలోచనలు ఎలా మనిషికి ఊపిరి పోస్తాయో !అలాగే ఎంతలా ఊగిసలాటకు కారణం ఔతాయో కదా! నేను ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపానో ! తెలియదమ్మా అంటూ చాలా సేపు మాట్లాడారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని గంటలు నాతో సంభాషించారో లెక్క తెలీదు. నా కవితల్లో వ్యక్తిత్వ వికాసపు ఛాయలు ఉంటాయని, అలాగే నీలోని జంకును వెనక్కి నెట్టి పడేయమ్మా ఇంకా అద్భుతంగా రాయగలవని అంటుండేవారు. సర్ ఒక పది సంవత్సరాల ముందు మీరు నాకు పరిచయమై ఉంటే ఎంత బాగుండేది అంటే అదేం లేదు రాధికా ! నువ్వు నా శిష్యురాలివే నేను చాలా సందర్భాల్లో నా సన్నిహితులతో చెప్తూ ఉంటాను అనేవారు.’రాధిక నా శిష్యురాలు’ అని అన్న వారి మాటలు నాకు ఒక ప్రశంసా పత్రమై చక్కటి జ్ఞాపకాన్ని మిగిల్చాయి .
వారి ‘జీవన స్రవంతి’ నవలపై కొంతమందితో వ్యాసాలు రాయించినప్పుడు నేను వారి నాన్నగారిపై రాస్తానన్నాను ఆ వ్యాస సమీక్ష ‘మనోహరి’ ఆన్లైన్ పత్రిక సంపాదకులు బుజ్జమ్మ (స్వప్న) గారు వేస్తే సార్ కు పంపించాను , దాన్ని చదివి ఎన్నోసార్లు అభినందిస్తూ సంతోషపడేవారు .ఏదో ఒక సందర్భంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆనందించే వాళ్ళు .మరో పాత్ర గురించి రాయమన్నప్పుడు నేను నవ్వుతూ మేడమ్ గారి గురించే రాస్తాను సర్ అది కూడా ఆమె వర్షన్ లోనే అంటే పర్లేదమ్మా ఎవరి అభిప్రాయం వాళ్లది రచయితకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా అంటూ నవ్వారు.
రంగరాజు పద్మజ గారు అరుణ ధూళిపాళతో కలిసి చిన్న జీయర్ స్వామి వారి అంధుల పాఠశాలలో గడిపిన సందర్భాన్ని , స్వామి వారితో జరిగిన ఆత్మీయపు సంభాషణ తనకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చిందని చెప్పారు. సర్ మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఇలాంటి పాఠశాలలకు వెళ్లి ప్రసంగాలు చేయవచ్చు కదా అన్నప్పుడు వయసు ప్రభావం, చూపులేనితనం ఇబ్బందికరమైన అంశాలు కదమ్మా అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పారు.
సరిగ్గా నెలరోజుల ముందు మరేదైనా పాత్ర గురించి రాశావా రాధికా అని అడిగారు అప్పుడు సర్,మీ నాన్నగారు ముందు చూపుతో మీ జీవితానికి చక్కటి బాట వేసి మీకు స్ఫూర్తి ప్రదాతగా మారారు కదా! అదే స్ఫూర్తితో మీ అబ్బాయి కష్టకాలంలో మీరు అండగా నిలిచారు , ఈసారి మీ అబ్బాయిని మీరు ఎలా వెన్ను తట్టింది రాయాలనుకుంటున్నాను అని చెప్తే , చాలామంచి మాటచెప్పావు రాధికా అంటూ ఆనంద పడిపోయారు.
ఒక పది రోజుల ముందు అనుకుంటాను సార్ ఫోన్ చేస్తే నేను బంధువుల ఇంట్లో పెళ్లి హడావిడిలో చూసుకోలేదు తర్వాత నేను కాల్ చేయడం వారు స్పందించకపోవడం ఇలా జరిగింది చివరికి ఎలాగోలా లిఫ్ట్ చేశారు. పది నిమిషాలు వారి మాటల ప్రవాహం కొనసాగింది. అమ్మా ఒక కోరిక ఉంది, నా ‘జీవన స్రవంతి’ నవలపై పరిశోధన చేసే వాళ్ళు ముందుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పూర్వ విద్యార్థిని ప్రొఫెసర్ రజని అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్. ఓ. డి. ఆమె ఒక సందర్భంలో నాతో చెప్పింది, సార్ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో మీ పుస్తకాలపై పి.హెచ్.డి. చేయించాలనుకుంటున్నాను అని, ఇదే వారు నాతో మాట్లాడిన చివరి మాట .ఆ తర్వాత పది రోజులకే అంటే ఉగాది ముందురోజు ఉదయం నా సహోదరి , కవయిత్రి పద్మశ్రీ చెన్నోజ్వల ఫోన్ చూపిస్తూ సార్ ‘శివైక్యం ‘చెందారు అనడం ఒక పిడుగుపాటులా తోచింది. ఆత్మీయమైన గురువును కోల్పోయిన సందర్భమది .ఇక ప్రత్యక్షంగా సార్ ను చూసింది మూడు సార్లు మాత్రమే, కానీ ఫోన్లో గంటలు గంటలు సాగిన సంభాషణలో ఎన్నో ప్రాపంచిక విషయాల్ని , వివిధ మనస్తత్వాల విశ్లేషణ జరిగేది. ఇది నా ఒక్కదాని అనుభవం కాదు గ్రూపులోని ప్రతి వారితో వారు ఇలాగే అనుబంధాన్ని పెంచుకున్నారు. ఎవరిని కదిలించినా ఇలాంటి ఎన్నోవిషయాల్ని చెప్తారు.
సర్ , నేను మీ దగ్గర ప్రత్యక్షంగా విద్య నేర్వకపోయినా ,ఈ పరిమిత సమయంలో మీ పరిచయం నాకు ఎన్నో విషయాలు నేర్పిందని సవినయంగా చెప్పుకుంటాను.
మీ కలల పుస్తకానికి మీ శిష్యురాలు అరుణ ధూళిపాళ అక్షర రూపాన్నిస్తే మరో శిష్యులు వేణు నక్షత్రం గారు ‘ఆటా’ వేదికపై ప్రపంచంలోని సాహితీ ప్రియులందరికీ మిమ్మల్ని సగౌరవంగా పరిచయం చేసి గురుదక్షిణ చెల్లించుకున్న శిష్యులయ్యారు. గురుశిష్యుల సత్సంబంధానికి మీరు ముగ్గురు ప్రతీకగా నిలిచారు.
సర్ , మీరు ప్రత్యక్షంగా వెలుగును చూడలేకపోయారేమోగానీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. మీ హఠాన్మరణాన్ని తట్టుకోవడం మాకందరికీ కష్టమే!మీ గంభీర స్వరం తిరిగిరాని లోకానికి శాశ్వతంగా వలస పోవడం మాకు మింగుడు పడని విషయమే! మీ ఆత్మీయపు మాటల్ని మదిలో నింపుకుని సజల నయనాలతో అక్షర సుమాంజలి ఘటిస్తూ, మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మనసారా కోరుకుంటున్న మీ శిష్యురాలు.
చివురులు తొడుగుతున్న
శతపత్రపు సోయగాలు
మకిలి సోకని మాణిక్యాలు
అంతరాల అడుసే అంటని
వికసిత పంకజాలు
లోకంపోకడ తెలియని ముద్దులొలికే ముద్దబంతులు
అక్షరకాంక్షతో తపించే
సప్తవర్ణ క్రాంతులు
ఊహల కొలనులో రెక్కలు
విప్పిన’ పసి’డి కమలాలు
నిశ్చిత లక్ష్యంతో నింగికి నిచ్చెనలేసే ఆశల తారకలు
తెలివికి పదును పెడుతూ చదువుల మధువును
గ్రోలే తేటిపిల్లలు
నవ్వులు కలబోసిన
విరిసీవిరియని
ధవళ పుష్పాలు
కడుపు పంటలై వచ్చి
మీ ఇంట వెలుగులు
నింపే కన్యకామణులు
ఆంక్షల సంకెలలేసి వారి
ఆశయాల్ని సమాధి చేయకండి
బందీఖానాలో బిగించి
పంజరంలో పక్షులను చేయకండి
వివక్షాకూపంలో గింజుకుంటూ
మీ పెద్దరికాన్ని చిన్నబోనీయకండి
వినీలాకాశంలో ఎగురుతూ
స్వేచ్ఛాగీతాలు పాడనివ్వండి
వాళ్ళు ఉగ్గుపాలతో విలువలు
పొందిన మీ కంటిపాపలే !
ఆత్మవిశ్వాసంతో ఎదిగిన
ఈ జ్ఞానప్రసూనాలే
ఆ’నందనవనం’లో
వెలుగుపూలను
పూయిస్తాయేమో!
గడ్డం సులోచనగారితో నా తొలి పరిచయం సోమవారపు కుటుంబంలో . నిరాడంబరత, స్నేహపూరిత పలకరింపు ఆమెలో నన్నాకర్షించిన విషయాలు.
కలంపట్టి రాయమంటూ ప్రోత్సహించిన సహాధ్యాయుడికే తన తొలి రచనను అంకితమిచ్చి కృతజ్ఞత చాటుకున్న స్నేహశీలి.
పుస్తకావిష్కరణ సభలో ‘నానీ లోచనాలు’ పుస్తకంతో ఇల్లు చేరి సమీక్ష రాయాలనుకున్నా కారణాంతరాలతో జరిగిన జాప్యమిది.
అక్షరాలవెంట పరుగులుతీసి ఒజ్జగా మారినా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించిన సందర్భం నేర్పిన అనుభవంతో
“ఇంటి వెలుగు
లైట్ల వల్లకాదు
ఇంట్లో స్త్రీలు
విద్యావంతులు”
అంటూ – పుట్టెడు బాధ్యతలున్నా బొంగరంలా తిరుగుతూ ఇంటెడు చాకిరీ చేసే ఇంతికి విద్యాగంధం తోడైతే పిల్లలలో అక్షరక్రాంతి నింపుతుందంటూ’ ఇల్లాలిని శ్లాఘిస్తూ పుస్తకానికి శ్రీకారం చుట్టారు.

కనిపించని దేవుళ్ళకు సాగిలబడుతూ కళ్ళెదుట ఉండే తల్లిదండ్రులను పట్టించుకోరు .
“చిన్నప్పుడు
అమ్మ అందరి సొత్తు
పెద్దపుడే
వదిలించుకునే విపత్తు “
అంటూ మమతానురాగాలు రంగరించి గోరుముద్దలు తినిపిస్తూ పెంచిన తల్లి పిల్లలను ఎప్పుడూ భారం అనుకోదు కదా! అదే తల్లులు అవసాన దశలో ఆదరణకు దూరమై అలమటిస్తున్న సందర్భాలు నేటి సమాజంలో కోకొల్లలు. కనిపెంచిన అమ్మదనానికి
మలిదశలో ఎందుకీ ‘అంకురయాతన’ అంటూ ఆవేదన చెందుతారు.
జల్లెడను పోలీసుతో పోలుస్తూ , ‘దాక్కున్న తాలును నిగ్గు తేల్చి’ పట్టిస్తుందంటూనే , డాక్టర్ల తెలివిని అభినందిస్తూ’ ప్రాణమున్న బికారి’ని చేస్తాడంటూ నేటి కార్పో’రేటు ‘వైద్యులకు
చురకలంటిస్తారు .అమ్మ ప్రేమలో నైర్మల్యం గూర్చి చెప్తూ అబద్ధాల్ని అమాయకంగా నమ్మేస్తుంది ‘అచ్చం యశోదమ్మ’లా అంటూనే కట్టుబాట్ల సంకెళ్ళల్లో ‘ఆమె’ తెలివితేటలు ‘కట్టడి’ చేయబడతాయి అంటూ ఆవేదన చెందుతారు. ‘నడిరేయి దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలున్నా ‘మహిళలు వీధులలో తిరుగలేని సమాజ స్థితిగతులకు మహిళగా ఆందోళన చెందుతారు.
“సాహితీ మాగాణంలో
కలం సేద్యం
అనంతభావాల
అక్షర నైవేద్యం “
అంటూ కలంతో కవితాసేద్యం చేస్తూ భావాక్షరాలను పండించే కవి ఇంట్లో దొంగలు పడితే సంపద కోసం కాకుండా తన’ కవితలు దోచుకుపోయారంటూ’
ఆవేదన చెందుతాడంటారు ఆమెలోని కవయిత్రి .
‘ప్రయత్న లోపాన్ని వీడితే విజయం తథ్యం’ అంటూ వెలిగే సూర్యుడిని ఆపడం ఎవరితరం కానట్టే , ప్రజాఉద్యమాల్ని అణచివేయడం అసాధ్యం అంటూ తెలంగాణ ఉద్యమం మదిలో మెదిలి, “చరిత్రపుటల్లో
అమరుల త్యాగాలు
తెలంగాణ
జీవన చిత్రాలు”అమరులైన తెలంగాణా వీరులు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో వెలుగొందుతారంటూ’ తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు.
‘పచ్చదనం చెట్టుకెరుక పొట్ట నింపడం అమ్మకెరుక’ అంటూ పర్యావరణానికి మమకారానికి లంకె పెడతారు .
“మొగ్గను గుచ్చినా
దారంతో ఉరేసినా
మల్లె
తెల్లగానే నవ్వుతుంది “
అంటూ విరుల ఒంటిపైనున్న గాయాల జల్లెడను చూసి మనసున్న మనిషిగా విలవిల్లాడిపోతారు .
“పరిణతి లేని
ప్రేమ వ్యవహారం
రెక్కలు రాని పక్షి
గూడు వదిలినట్టు”
అంటూ
అపరిపక్వపు ప్రణయం రెక్కలు రాని పక్షి గూడు వదిలి దారితప్పిన చంద’మంటూ యువతకు చిరు హెచ్చరిక చేస్తారు. క్రమశిక్షణ లేని జీవితాలు, అలవాట్ల పొరపాట్లతో ‘ఆరోగ్యం అనారోగ్యం పాలబడకుండా నడకతో సరిచేసుకోవచ్చంటూ’ చక్కని సూచన చేస్తారు. రాగద్వేషాలు వీడితేనే మనిషిలో మానవత్వం చిగురించేదని హితబోధ చేస్తారు.
లింగ వివక్ష పై మండిపడుతూ – స్త్రీని పూజించే సమాజం మనది అయినా గర్భస్థ శిశువు ‘ఆడ’ని తెలిస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా అంతమొందించే ప్రయత్నం చేస్తారు
“గుడిలో అమ్మని పూజిస్తారు
గర్భగుడిలో ఆడబిడ్డను
హత్య చేస్తారంటూ”
భ్రూణహత్యలపై ఘాటుగా స్పందిస్తూ, చిన్న బుద్ధిగల మనుషుల ‘మనసుల్లోని మాలిన్యాన్ని చీపురుతో
కడిగేయాలంటూ’ కళ్ళెర్రజేస్తారు . ‘గట్టిగా ముడివడని బంధాలు తెగదెంపులతో
దూరమౌతుండడం బాధాకరమంటూ నేటి వివాహ వ్యవస్థ తీరుకు వాపోతూనే ఇల్లాలిని సూర్యుని’తో పోలుస్తూ ఆమె చుట్టూనే పరిభ్రమించే ‘మమతల గ్రహాలు ‘ఇంట్లోని వారంటూ, కలతలు లేని సంసారాలు ‘మమతల కోవెల’లంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ‘ఎదగడానికి తొందర పనికిరాదంటూ’ అదను చూసుకుని అనువైన మార్గం వైపు దృష్టి సారించమని, ‘సద్విమర్శల్ని సహృదయంతో స్వాగతించమని’ అనుభవంతో చెప్తారు.

“ఉచితాలెందుకు?
ఉపాధి కావాలి
ఆశల సుడిగుండంలో
యువత ఉంది”
ఉచితాలతో యువత భవితవ్యం అయోమయంలో పడిపోయి ప్రశ్నలా మారిపోయిందని ఆవేదన చెందుతారు. పట్టణీకరణతో పచ్చని పల్లెలు కాంక్రీట్ జంగల్లుగా మారడం ,పొట్టకూటి కోసం రైతన్న వలస కూలీగా మారిపోయాడంటూ బాధపడి, భూకబ్జాలలో చిక్కి నలిగిపోతున్న భారతావనికి “భరతంపట్టే భీమసేనుల ” అవసరం ఎంతైనా ఉందంటూ ఆశాభావం
వ్యక్తం స్తారు.
‘వర్షించని మేఘపు నీటితడిఅంతా రైతు కళ్ళ’ల్లోనే దాగుంటుందంటూ జాలి పడుతూనే , కన్నీళ్ళను దాచి మనసు భారం కానీయొద్దంటూ ‘వర్షించిన మేఘా’నివై తెలిమబ్బులా సాగిపొమ్మంటూ ఊరడిస్తారు.
” తెలుగుకు తెగులు సోకిస్తున్న” ఆధునిక తల్లుల వింత పోకడలకు తల్లడిల్లిపోతారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అంతా చరవాణి చేతిలో బందీలైన ఏకాకులంటూనే పాపం ‘ఉత్తరం ఉనికి లేకుండా పోయిందని ‘బాధ పడతారు .
ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు మమతానురాగాలు పెనవేసిన ‘లతానికుంజ’మంటూ కౌటుంబిక జీవన మాధుర్యాన్ని అందంగా వర్ణిస్తారు.
“బొమ్మలేయడం
ఈజీకాదు
భావాల చుక్కలకు
గీతలు కలపాలి”
అని చిత్రలేఖనంలోని సాధకబాధకాలను వెల్లబోసుకుంటుంది తనలోని చిత్రకారిణి. పదాల్ని దారంగా మార్చి భావాల కవితాపుష్పాలను మాలికగా అల్లుతుంది ఈమెలోని కవయిత్రి.
గ్రామీణ నేపథ్యమున్న వీరు పంటచేల నాట్యానికి పరవశిస్తారు, వరినాట్లేసే అతివల్లో ‘నేలకు దిగిన రంగుల సింగిడి అందాలను’ చూస్తూఆనందిస్తారు.
“పొలాల్లో
హరివిల్లులా ?
లేక వరినాట్లేస్తున్న
పల్లె పడతులా?
అంటూ అచ్చెరువొందుతారు.
స్వతహాగా ఉపాధ్యాయురాలైన
వీరు “నసుగుతూ మాట్లాడకు స్పష్టత అవసరమంటూ”గట్టిగా మందలిస్తారు. “ప్రశ్నించడం నేర్చుకోమంటూ బెత్తాన్నెత్తి హెచ్చరిస్తారు”. చదువులో ముందుండి జీవితంలో వెనుకబడ్డ అతివల్లోని అసంతృప్తి,అసహనం ఆమె కవితల్లో స్పష్టంగా కనబడుతుంది. ‘గ్రంధాలయాలు జ్ఞాన భాండాగారాలు ‘అంటూ పుస్తక పఠనపు ఆవశ్యకతను, చదువు సార్ధకతను ‘మహిళా సాధికారతను అక్షరాలలో రంగరించి చెప్తారు .
“సాహితీ సముద్రంలో
మునిగాను
అప్పుడప్పుడు
ముత్యాలు దొరుకుతున్నవి”
అంటూ ‘మేలిమి కవిత’ల ఊటకోసం ఆరాటం, ఒకింత నిరాశ కలగలిపిన కళ్ళతో అర్థవంతమైన అక్షరాలకై దోసిళ్ళొగ్గుతారు. .
సమాజపు తీరుతెన్నులను మీ ‘సులోచనాల’తో ఓ కంట గమనిస్తూ మీలో దాగిన సన్నటి అసంతృప్తి సెగను చల్లార్చి మీదైన శైలిలో మంచి కవితా ఝరులు జాలువారుస్తారని ఆశిస్తూ…
భరతనాట్యంలో ప్రప్రథమ భారతీయ మహిళా నృత్య కళాకారిణియైన వీరు ఫిబ్రవరి
29 ,1904 లో మధురై, మద్రాస్ (ప్రెసిడెన్సి బ్రిటిష్ ఇండియా)లో జన్మించారు .తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి శేషమ్మాళ్ గార్లు. సంస్కృత పండితులు, చరిత్రకారులైన నీలకంఠ శాస్త్రిగారు “థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా “లో సభ్యులు .
నాటి సామాజిక పరిస్థితులను అనుసరించి బాల్యవివాహానికి పెద్దలు ప్రయత్నించినప్పుడు తిరస్కరించిన రుక్మిణి ,ఏడవ సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రితో పాటు ఆమె సొసైటీలో చేరారు. కర్ణాటక సంగీతము , భరతనాట్యం లో అభిననివేశం సంపాదించారు . విదేశీయులైన జార్జ్ ఆరుండేళ్ ను 1920లో తన పదహారవ ఏట వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు కాగా, జార్జ్ ఆరుండేళ్ వయసు నలభై సంవత్సరాలు . తల్లిదండ్రులు విముఖత చూపినప్పటికీ అనిబిసెంట్ ఆధ్వర్యంలో వీరి వివాహం జరిగింది.
ఆధ్యాత్మికత పైనున్న ఆసక్తే ఆమెను,’ యంగ్ థియోసాఫిస్టిక్స్ ఫెడరేషన్’ అధ్యక్షురాలిని చేసింది. ‘థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో జార్జ్ అరుండేల్ బోధకులు. వివాహానంతరం దంపతులిద్దరూ ఇరు సంప్రదాయాల్ని పరస్పరం గౌరవించుకుంటూ చక్కని జీవన యానం చేశారు. ఒకానొక సందర్భంలో భర్త గురించి చెప్తూ , “చతుర భాషణులు, జన సమూహంలోఉంటూ,అందరిని చైతన్య పరచడం వారి ప్రత్యేకత అంటారు .వీరి వివాహం సనాతన సాంప్రదాయ వర్గాలకు నచ్చక సంఘం నుండి కొత్తజంటను, ఆమె కుటుంబాన్ని బహిష్కరించినప్పటికీ వారి కలివిడితనం ప్రజల మద్దతుతో తిరిగి సమాజంలో కలిసిపోయారు.

మరోసందర్భంలో తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ మా ఇంట్లో ఆంక్షలు, కట్టుబాట్లు ఉండేవి కావని, సంస్కృతీసాంప్రదాయాల్ని తమవారిని చూస్తూనే నేర్చుకున్నానంటారు. కులమత భేదాలు, సంకుచిత స్వభావాలు ,జంతుబలులు లాంటి మూఢనమ్మకాలు ఉండేవి కావంటారు .
జార్జ్ అరుండేల్ వృత్తి ధర్మం లో భాగంగా వారు ఎన్నో దేశాలను చుట్టివచ్చే అవకాశం వారికి లభించింది .ఆ సందర్భంగా
అన్నాపావ్లోవా బావ్లే అనే రష్యన్ కళాకారిణి చేసిన బ్యాలెరీనా నృత్యాన్నిచూసి, పాశ్చాత్య బాలేట్ వైపు ఆకర్షితరాలైన ఈమె బావ్లే గురువు’ క్లియోనార్టి ‘వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తరువాత బావ్లే సలహాతో
భరత నాట్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం కేవలం దేవదాసీలు మాత్రమే చేసే ఆ నృత్యాన్ని సనాతన వర్గపు స్త్రీలు భరతనాట్యం నేర్చుకోవడం అవమానంగా భావించే సందర్భం. ఐనా అందరి విమర్శల్ని ,అభ్యంతరాలని పక్కకు నెట్టి ‘మీనాక్షి సుందరం పిళ్ళై ‘దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. ‘కేలూనాయర్’ వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు. ‘థియోసాఫికల్ సొసైటీ’ వజ్రోత్సవాల్లో భాగంగా ఇరవై వేల మంది ఆహుతుల మధ్య ప్రదర్శన ఇచ్చి రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంస పొందిన ప్రతిభాశాలి. ‘జేమ్స్ కజిన్’ అనే ఐర్లాండ్ కవిని ఆమె నాట్యం ఎంతగానో ఆకర్షించగా ,అతని ప్రోత్సాహంతో ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ‘ పేరిట 1936 లో నృత్యాలయాన్ని ఏర్పాటు చేశారీదంపతులు .అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ‘కళాక్షేత్రం’గా రూపం మార్చుకుంది. తన తొలి గురువైన సుందరం పిళ్ళై మరియు వారి అల్లుడు చొక్కలింగం పిళ్ళైలను తమ కళాక్షేత్రంలో గురువులుగా నియమించుకుని ,నలుగురు విద్యార్థులతో ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రాన నిలిచిందీనాడు. నాట్యంతో పాటు సంగీతాన్ని కూడా చేర్చినేర్పిస్తున్నారు .తోటలు తామరకొలను సాంప్రదాయిక కట్టడాలతో తన అభిరుచికి తగ్గట్టు ఒక నాట్య దేవాలయంగా తీర్చిదిద్దారీ కళాక్షేత్రాన్ని.
కేవలం దేవదాసీలు మాత్రమే ఈ నృత్యం చేయాలన్న ముద్రను చెరిపేసి ఈ కళారూపాన్ని జన రంజకంగా తీర్చి దిద్దిన
లాస్య ప్రియ.
శ్రీ జార్జ్ అరుండేల్ 1945 లో మరణించేనాటికి రుక్మిణీఆరుండేల్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు .(ప్రముఖ తత్వవేత్త ఐన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు జార్జ్ అరుండేల్ గారి పూర్వ విద్యార్థి.)
1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ని కూడా పొందారీమె.
1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా
శ్రీమతి ఆరుండేల్ ను ప్రతిపాదించినపుడు సున్నితంగా తిరస్కరించారట .రాష్ట్రపతి పదవి కన్నా నాట్యాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అని , ‘2013 లో కళాక్షేత్రలో రుక్మిణీ దేవి స్మారకోపన్యాసం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
గుర్తు చేశారు ‘.

భరతనాట్యానికి మార్పులు చేర్పులు చేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రపంచ ప్రాముఖ్యతను కలిగించారు. దేవదాసి సమాజంలోని టి. బాల సరస్వతి మరికొందరు నృత్య కళాకారుల సహాయ సహకారాలతో ఈ కళను గుడిమెట్లు దాటించి ప్రపంచ వేదిక పైకి తీసుకురావడంలో విశేష కృషి సల్పిన రుక్మిణి ఆరుండేల్ , భరతనాట్యంలో శృంగార అంశాలను తొలగించి భక్తి రసానికి ప్రాధాన్యతను కలిగించి పాఠ్యాంశాల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. ఆహార్యంలో, ఆభరణాలకు, రంగస్థల దృశ్యాలకు కొత్తదనాన్ని జోడించి నృత్య , నాటక ఆకృతినిచ్చి రామాయణంలోని కొన్ని అంశాలను అత్యంత జనాదరణ పొందేలా రూపొందించారు.
1952 ఏప్రిల్ లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తొలి నాట్య కళాకారిణిగా రికార్డు సాధించారు .రెండుసార్లు ఈ పదవినలంకరించిన వీరు జంతు సంక్షేమం కోసం “ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్ ఆక్ట్ “కోసం “జంతు క్రూరత్వ నిరోధక బిల్లు 1960 “తేవడంలోను,”జంతు సంక్షేమ బోర్డు “స్థాపనలో విశేషమైన కృషి చేశారు .ఈ బిల్లు ప్రవేశ పెడుతూ ఆమె చేసిన ప్రసంగానికి ప్రభావితులైన ప్రధాని నెహ్రూ చొరవతో త్వరితగతిన చట్టం రూపుదాల్చింది. ఎన్నో సంస్థలతో కలిసి జంతు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956లో ‘పద్మభూషణ్’ తో సత్కరించగా , ‘దేశికోత్తమ’ బిరుదుతో ‘శాంతినికేతన్’ సన్మానించింది.
నాట్య రీతిలో భగవత్తత్వాన్ని జోడించి , వీరు భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందడమే కాక ,నాట్యాన్ని ఉన్నత శిఖరాన నిలిపిన ఘనత సాధించారు .
ఫిబ్రవరి 24 ,1986న శ్రీమతి రుక్మిణీఆరుండేళ్ హంసమంజీరమై నటరాజ పాదాల చెంత చేరారు .
తెలంగాణకు చెందిన జానపద కళారూపాయల్లో ఒకటి ఈ చెరియాల్ చిత్రలేఖనం.వరంగల్ జిల్లాలోని ‘చేర్యాల’ ప్రాంతంలో పురుడు పోసుకుందీకళ . దీనినే ‘నకాశి ‘కళ అని కూడా పిలుస్తారు.
పురానేతిహాసాలను కథాంశాలుగా తీసుకొని అల్లిక రూపంలో జానపద సాంప్రదాయ రీతుల్లో రూపొందిస్తారు. గతంలో ఆసియా ఖండపు సాంప్రదాయకళా రూపాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొంది భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ’ ఇప్పుడు చేర్యాల’ ప్రాంతంలో మాత్రమే కొంత మనుగడలో ఉంది. .
గతంలో ఫిల్మ్ లేదా కామిక్ స్ట్రిప్స్ లలా ఉండేవి .పురానేతిహాసాలు, స్థానిక అంశాలే ప్రధాన కథా వస్తువులుగా చేసుకొని కథలు అల్లుతారు. ఈ కళారూపానికి శాసనాధారాలు కూడా ఉన్నట్లు దాఖలాలు కనిపిస్తాయి. కొందరు కళాకారులు ఇప్పటికీ ఈ వృత్తినే కొనసాగిస్తున్నారు.
ఈచిత్రాలలో బ్యాక్ గ్ర్రౌండ్ గా ఎరుపు రంగును వాడుతారు . గతంలో ఈ సాంప్రదాయ చిత్రపటాల తయారీలో సహజ రంగుల కోసం తెలుపు రంగును సముద్రపు గవ్వల నుండి , దీపపు మసి నుండి నలుపును, స్వచ్ఛమైన పసుపు నుండి పసుపు రంగును సేకరించి ఇలా సహజ రంగులనే వాడేవారు. నేడు ఆ రంగుల వాడకం తగ్గించి సింథటిక్ కాన్వాస్ పై కృత్రిమ రంగుల మేళవింపులతో చిత్రిస్తున్నారు. ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశం మాత్రం స్థానిక కథలు , వీర గాథలు వారివారి సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ప్రదర్శింపబడేవే.
ఈ కళ స్థానిక కథాంశాల్ని ప్రభావితం చేసేదిగా ప్రసిద్ధిగాంచింది .ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భిన్నమైన శైలుల్ని ప్రతిబింబించేలా పట చిత్రాలు ప్రదర్శిస్తారు .ఆధునిక సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా, కంప్యూటర్, సినిమా రంగాలు ముందంజలో ఉండడంతో ఈ
నకాశి కళ దాదాపుగా అంతరించిపోయిందనే చెప్పాలి. భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతానికే పరిమితమైపోయింది దాంతో ‘చేర్యాల (స్క్రో ల్స్ ) చిత్రపటాలు ‘అనే పేరుతో మాత్రమే మనుగడలో ఉంది.
స్థానిక వృత్తుల నేపథ్యంతోనే ప్రదర్శించేవారు. ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా చేసుకుని పూలు తీగలతో చిత్రిస్తారు. ఈ కళారూపానికి 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, హిందూ, జైన, బౌద్ధ గ్రంథాలలో సైతం ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయి.
ఈ నకాశి కళాకారులు సంచార జీవనం సాగిస్తూ ప్రదర్శించేవారు. ఈమధ్య కాలంలో పురాణాలలోని పొడవైన కథల్ని కుదించి చిత్రిస్తున్నారు. ( పోషకులు లేకపోవడమే ప్రధాన కారణం) చిన్నగా నిడివి తగ్గించి చిత్రించడంవల్ల వీటిని ఫ్రేములలో
భద్రపర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
ఈ నకాశి కళ చిత్రీకరణకోసం ఖాదీ కాన్వాసుకు ఆకృతినిచ్చి ప్రదర్శనకు సమాయత్తం చేయాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తుంది .పత్తి (దూది), బియ్యపు పిండి ,సుద్దమట్టి మిశ్రమాన్ని కలిపి, ఉడికించి చింతగింజల పేస్టు, జిగురు (బంక) కలిపిన మిశ్రమాన్ని మూడుసార్లు వరుసగా ఆరబెడుతూ అప్లై చేసిన పిదప కాన్వాస్ తయారవుతుంది. వీటికోసం వాడే బ్రష్ లకు’ ఉడుత’ల వెంట్రుకలను వాడుతారు బొమ్మలను కొబ్బరి చిప్పలు ,రంపకు చెక్క పొడి, చింతపండు పేస్టుతో తయారు చేస్తారు .కళాకారులు తమతమ నైపుణ్యాల్ని జోడించి చక్కని రూపాన్నిస్తారు. ఈ కళాకారులు రూపొందించిన పెయింటింగ్స్ లోని అంశాలు స్థానిక కథాంశాలు కాబట్టి గ్రామీణ జీవన విధానం ,పండుగలు, పంటచేలు, శ్రామిక జీవన సౌందర్యానికి నృత్య, గీతాలు జోడించి హృద్యంగా చిత్రిస్తారు. చాలా సులభంగా అర్థమౌతాయి కూడా.
మూడు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో బొమ్మలు గీస్తారు. స్ట్రోల్స్ లో నలభై నుండి యాభై ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ప్యానెల్లో ఒక కథాంశంతో కొంత భాగపు వర్ణన ఉంటుంది .ఆర్యుల రాకకు పూర్వం నుండి ఉన్న తొలి చిత్రలేఖన కళారూపాలలో ఒకటి ఈ ‘నకాశి ‘కళారూపం అంటూ స్మితా గుప్తా తన ‘ఇండియన్ ఫోక్ అండ్ ట్రైబల్ పెయింట్స్ ‘ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
కీ. శే. డా. కొండపల్లి శేషగిరిరావు గారు1954 లోనే ఈ కళారూపాన్ని వెలుగులోనికి తెచ్చారు. స్థానిక కళాకారులను హైదరాబాదుకు తీసుకుని వచ్చి పరిచయం చేసారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ( శ్రీ పొట్టిశ్రీరాములు) తెలుగు విశ్వవిద్యాలయం లో ఈ నకాశి కళపై పత్ర సమర్పణ
కూడా చేసారు.
‘ Heart For Art’ అనే యన్. జి. ఓ. సంస్థ సహకారంతో గోవాలో చెరియాల్ చిత్రలేఖన కళపై నిర్వహించిన వర్క్ షాప్ లో , రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలైన డి నాగేశ్వర్ పద్మ దంపతుల కుమారుడు డి .సాయి కిరణ్ వర్మ మాట్లాడుతూ తాను తల్లిదండ్రుల వద్ద కులవిద్యను అభ్యసించానని , మేము కేవలం చిత్రకారులం మాత్రమే కానీ స్ట్రోల్ అంటే పాట చిత్రించేటప్పుడు ఇతరుల మార్గ నిర్దేశకత్వంలో పనిచేస్తామంటూ వివరించారు.
1976లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరియాల్ పెయింటింగ్ ను హస్తకళగా గుర్తించగా, 2008లో మేధాసంపత్తి హక్కుల రక్షణ హోదా కల్పించింది.
2016లో లండన్ లోని యస్. ఓ. ఏ. యస్. విశ్వవిద్యాలయం నుండి చెరియాల్ కళపై డాక్టరేట్ చేసిన అనాయిస్ ‘డాక్టర్ ఫోన్సెకా’ మాట్లాడుతూ ఈ కళారూపం అంతరించిపోకుండా ఉండాలంటే ‘సాంస్కృతిక వారసత్వం’ అవసరమంటూ పేర్కొన్నారు.
దాదాపుగా అంతరించిపోయిన ఈ నకాశి కళారూపానికి జవసత్వాలు నింపాలనే తాపత్రయంతో ఇంకా కొన్ని నకాశి కుటుంబాలు (ముఖ్యంగా వనజ, గణేష్ దంపతులు)శ్రమిస్తున్నాయి. వివిధ వర్క్ షాప్ లలో పాల్గొంటూ ఈ కళపై అవగాహన కల్పించే పనిలో ఉన్నాయి.
ఆధునిక యుగంలో కంప్యూటర్, మీడియా కారణంగా ఆదరణ కరువైంది . అంతరించిపోతున్నఈ కళారూపాన్ని ఆదరించాల్సింది ప్రభుత్వాలే .వివిధ ప్రదర్శనలు నిర్వహించడం, కళారూపాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రోత్సహిస్తే ఈ తెలంగాణ వారసత్వ కళాసంపద మరింత మెరుగై, ప్రపంచానికి చేరువై పది కాలాలపాటు మనగలుగుతుందని ఆశిద్దాం.
స్వచ్ఛమైన నవ్వు , భేషజమెరుగని చక్కటి పలకరింపు సోదరి అరుణ ధూళిపాళ సొంతం. సోమవారం కవి కుటుంబంలో తనతో నా తొలి పరిచయం . తన పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి చేతిలో పుస్తకంతో ఇల్లు చేరిన నాకు, పుస్తకం తిరగేయాలంటేనే మనసు మౌనం దాల్చేది , ఎన్నిసార్లు తిరగేయాలని పట్టుకున్నా కళ్ళు ఎలాంటి భావాలు ఒలకబోస్తాయోనన్న బెంగతో చదవడం మానేసిన సందర్భాలున్నాయి.
స్పందించే మనసున్న కవిలో భావాలు తరంగాలై లేచినపుడు అక్షరాలు ఆరాటంతో జట్టు కట్టి ఆకారం దాలుస్తాయి. భావుకురాలైన అరుణ తన మదిలో అనునిత్యం మెదిలే జ్ఞాపకాలను 53 సంతకాలుగా అక్షరబద్ధం చేసింది. ‘కన్నీటి తరంగం’తో మొదటి సంతకం పెట్టి ‘శిఖర పతాకం’గా ఈ పుస్తకంలో చివరి సంతకం చేసింది.
మూగవేదనలో ఎన్నో సమస్యలు , సంఘర్షణలుంటాయి. జ్ఞాపకాల సంతకాలు కొన్ని కన్నీటి సుడులమధ్య, మరికొన్ని ఉద్వేగాలకు లోనైనపుడు ,ఇంకొన్ని నిస్తేజం ఆవహించినపుడు ఇలా వివిధ భావాల కలగలుపుతో చేసిన జ్ఞాపకాల సంతకాలన్నీ మదిపొత్తంలో భద్రపరిచినవే .
తన మొదటి కవితలో ‘బాల్యం అందమైన ఒక స్వప్నం’/….’బాధ్యతలెరుగని జీవనయానం/ అది ఒక అద్భుత దృశ్య కావ్యం/’ ..అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.
నిజానికి బాల్యం అందరికీ తీపి గుర్తులనేం మిగల్చదు. కొందరికి మినహాయింపులు ఉంటాయి. చిన్ననాడే దూరమైన నాన్న ఆమె తలపుల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాడు . ‘సంగీత సమ్రాజ్ఞిగా /చూడాలనుకున్న తపన/ కరిగిపోయింది నక్షత్రాల్లో/’అంటూ తీరని కోరికతో దూర తీరాలు చేరిన తండ్రిని తలుచుకుంటూ దుఃఖిస్తుంది . అరుణను వెంటాడే మొట్టమొదటి జ్ఞాపకమది.
విధివికటాట్టహాసం చేస్తే జీవితం ఇలా కూడా ఉంటుంది అనడానికి
మరో సాక్ష్యం ‘తాళి కట్టిన బంధం తెగిపోయినా/ ప్రేమపాశాన్ని తెంచుకోలేక /’…అంటూ వాపోతుంది.సప్తపదితో ఒక్కటైన మనోరథుడు అర్ధాంతరంగా చిటికెన వేలు వదిలేసి కనుమరుగైతే! కళ్ళముందు ప్రేమ గుర్తులు ప్రశ్నలా మిగిలినప్పుడు అపురూపంగా పొదివిపట్టుకుని రక్షణ కవచంలా మారాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో మనసున్న వారందరికీ తెలిసిన విషయమే !
‘అన్న ‘హృదయం అన్నీ తానై/నేనే తనకు అన్నీఅయినట్లుగా/పంచి ఇచ్చింది ఆత్మీయతానురాగాలు’/అని గతాన్ని గుర్తుచేసుకుంటుంది. అన్నిట్లో అండగా నిలిచిన సహోదరున్ని ఆత్మీయంగా మనసు పొరల్లో భద్రంగా దాచుకుంది.
కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పిస్తుంది అనే జీవిత సత్యాన్ని జీర్ణించుకుని ఆత్మవిశ్వాసం నింపుకుంటూ ముందుకు సాగడం నేర్చుకున్నానంటూ ‘ విషాద గీతాన్ని నేను/ నైరాశపు రాగాన్ని నేను ‘అంటూ తొలి కవితతోనే జీవిత చిత్రాన్ని కళ్ళ ముందుంచుతుంది.
సుఖదుఃఖాల సారమే జీవితం , పుట్టింది మొదలు గిట్టే వరకు ఎన్నో అనుభవాలు కొన్ని రంగుల మయమైతే, నిరాశ మిగిల్చేవి ఇంకెన్నో ! మదిగదిలో వసివాడని జ్ఞాపకాలే అన్నీ!
గెలుపోటములను
సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తుంది సెలవంటూ వెళ్ళిన బాంధవుడి కోసం కళ్ళు ఇంకా ఆరాటంగా వెతుకుతూనే ఉన్నాయని ఆవేదనతో చెప్తుంది.
బంధాలు ,అనుబంధాల మాయల వలయంలో చిక్కినప్పుడు ఊపిరాడని సందర్భాలుంటాయి, విలువలెరుగని ‘చిన్న మనసుల’ మాటలు ,చేతలు సమ్మెట పోట్లై బాధిస్తున్నప్పుడు జ్ఞాపకంగా మిగిలిన సఖున్ని కలల లోగిలిలో కలిసి మంతనాలాడుతుంది, పోట్లాడుతుంది . అలిగి కన్నీళ్లు కారుస్తుంది .అపసవ్యంగా సాగే బతుకుబాటలో జవాబు దొరకని ప్రశ్నలతో నైరాశ్యం కమ్మేసినపుడు ఏకాంతం బాధిస్తుంటే రేపటి ఆశ కోసం కొత్తదారి వెతుక్కుంటూ ‘అక్షర సమరం చేయడానికి /అంతరంగంలోనికి అడుగెట్టా’/నంటూ ‘సిరా సంతకాలు చేయడానికి’ స్వేచ్ఛగా ముందడుగేస్తుంది.
కాలంతో పాటు బతుకు నడక సాగాలి ఎన్నో మజిలీలను దాటుతూ, ఎగుడు దిగుళ్లను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలని , జీవితాన్ని ఏమరుపాటుతనం తలకిందులు చేసేస్తుందని హెచ్చరిక చేస్తుంది. మానవీయ విలువలు మంట గలిసిపోతున్నాయని ఆవేదన చెందుతూ, ప్రశ్నిస్తూనే ఉంటానని నొక్కి చెప్తుంది .
పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది, కానీ ఒంటరి మహిళగా ఒత్తిళ్ళను తట్టుకుంటూ వాళ్ళను పెంచే క్రమంలో తన మనసునే ఇష్టసఖిగా చేసుకొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఊరట పొందుతుంది.
ఇంటెడు చాకిరీ చేస్తూ అందరికీ తలలో నాలుకైన ఇల్లాలిని వంటింటి కుందేలును చేసిన సమాజమే వేదికలెక్కగానే గృహలక్ష్మి, ధృవతారఅంటూ కీర్తిస్తుందని అసహనం వ్యక్తం చేస్తుంది. స్త్రీ శక్తి స్వరూపిణి , సహనశీలకు అగ్నిపరీక్షలా అంటూ ఆవేశం వెళ్ళగక్కుతుంది .
వాలుకుర్చీని గూర్చి చెప్తుందొక చోట ముప్ఫై నలభై ఏండ్ల క్రిందటి వరకు వాలుకుర్చీలో కూర్చుని సేదదీరని ఇంటి పెద్దలు లేరంటే అతిశయోక్తి కాదు. గుమ్మంవారగా వేసుకొని హాయిగా కునుకుతీస్తూ గతం తాలూకు విషయాలను తలుచుకుంటూ సేదదీరిన వారు ఎందరో కదా! ‘ఒద్దికగా కూర్చుంటుంది ఓ మూల/…మడత పెడితే /గోడకు అతుక్కుంటుంది మౌనంగా/’ అంటూ వాలుకుర్చీని గుర్తు చేస్తుంది. ‘ఒక్క మాటలో చెప్పాలంటే అది/ జ్ఞాపకాలన్నింటినీ/ రాసులుగా పోసి/ దొంతరలుగా పేర్చి/ అరల్లో భద్రంగా దాచిన గుండెతడి /అంటూ కితాబిస్తుంది.
మనిషి జీవితంలో తలగడది ప్రధాన పాత్ర . గుండె తపనలను చల్లారుస్తుంటుందని , గుట్టు విప్పదు /గురుతు తెలియనివ్వదని నర్మగర్భంగా చెప్తుంది.
నిజానికి దిండు అలసినవారి తలకింద ఒదిగిపోయి హాయినిగొలిపే సుతిమెత్తని ఉపధానం. భావోద్వేగాలను, సుఖదుఃఖాలను సమానంగా పంచుకునే ఒరుగుబిళ్ళై బాధలలో ఓదార్పునిస్తుంటుంది .గోపనాన్ని గుమ్మం దాటనీయని నేర్పరి.
నిన్నటి ఓటమిని నేటి అనుభవంగా మార్చుకుని తెలివిగా ఒడిసిపట్టే ప్రయత్నంలో ఎదురయ్యే అవాంతరాలకు బెదరక ముందుకు సాగిపోతే విజయం మీ సొంతమవుతుందంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది.
దేశ రక్షణను తన భుజస్కందాలపై మోసే వీర జవాన్ల త్యాగనిరతిని కీర్తిస్తుంది. సామాజిక రుగ్మతలపై మండిపడి అక్షరాయుధాలతో సరికొత్త సంగ్రామం చేస్తానని గొంతెత్తి నినదిస్తుంది . పల్లె తీరుకు ముగ్ధురాలై అరుగు ముచ్చట్లను అవలోకనం చేసుకుంటుంది .’గుమ్మం ముందు అరుగులు/ నవ్వుల ఆవాసాలుగా నోళ్ళువిప్పి/క్షేమాలను అరుసుకుంటాయి’ అంటూ అరుగు ముచ్చట్లను ఏకరువు పెడుతూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుని సంబర పడుతుంది. మేధామథనానికి అచ్చెరువొంది , పెద్దరికాలను బద్ధలుకొట్టి /విదేశీ కిరీటాలను/ భరతమాత పాదాల చెంతకు చేర్చిన /అరుదైన అంతరిక్ష కావ్యం అంటూ శ్లాఘిస్తుంది. దేశ కీర్తి పతాకాన్ని/ ప్రపంచ శిఖరంపై/..ఎగరేయాలని ఉవ్విళ్ళూరే యువ శక్తిని జాతిరత్నాలు అంటూ కొనియాడుతుంది .
సోదరి అరుణ కలంపట్టి కదులుతున్న వైనానికి ఆశ్చర్యం కలుగుతుంది. పాత జ్ఞాపకాలను గుండె బరిణలో దాచుకుని నూతన చైతన్యంతో మనసు దారిని మళ్ళించి కవనబాటలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ _
రేపటి తరానికి చదువుల
సారాన్ని బోధిస్తూ
బతుకుదెరువుకు బాటలు వేసే దిశా నిర్దేశకులు
అజ్ఞానపు చీకటిలో చిక్కిన
అంతేవాసిలో
సంస్కార సురభిళాలద్ది
జాతి రత్నాలుగా మార్చే శిక్షణాదక్షులు
పాఠాలలో జీవిత పాఠాలను రంగరించి
మంచీచెడుల మర్మాన్ని విప్పిచెప్పి విజ్ఞతను నేర్పే వర్ణప్రవక్తలు
ఎంతటి మేధావికైనా తొలి పాఠాలు నేర్పేది గురువని మరువకు

నైతిక విలువలు నేర్పాల్సిన గురువులే నైచ్యానికి చిరునామాగా నిలిచి
వెకిలి చేష్టలు వింత పోకడలతో భావి జీవితాలతో చెడుగుడాడుతూ గందరగోళంలో పడేసి
మొగ్గ తొడిగే అరవిందాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేస్తుంటే
మద్యంమత్తులో జోగుతూ చదువులమ్మ వాటికను అపవిత్రంపాలు చేస్తుంటే
ఆచార్యుల అడుగుజాడలే శిరోధార్యమన్న అభ్యాసకులను అయోమయంలో కి నెట్టొద్దు
అక్షరాలను శ్వాసిస్తూ జ్ఞానోపాసనతో కాంతులీనే
పుంభావ సరస్వతులున్న
భూమిఇది
గురువును బ్రహ్మను చేసి విద్యాపీఠంపై నిలిపిన
సంస్కృతి మనది
గురువు గుర్తొచ్చినంతనే
అసంకల్పితంగా ముడుచుకునే చేతులు సిరిజోతలై అలరించాలి
(మధిరాపానం చేసి బడిలో వీరంగం చేసిన ఉపాద్యాయురాలిని మీడియాలో చూసి)
