Home బాల‌సాహిత్యం సోమరితనం కూడదు

సోమరితనం కూడదు

by Kura Chidambaram

రామాపురం అనే ఊళ్ళో ఒక సంపన్నుడుండేవాడు. అతడు సంపన్నుడే కాక, మంచివాడు కూడా! తన దగ్గరకు వచ్చిన కుంటి, గ్రుడ్డి, వికలాంగులైన బీదవారిని ఆదరించేవాడు. వారికి అన్నం పెట్టి ఆదరించటమే కాకుండా అలా వచ్చినవారికి చేతనైనంత ధనసాయం చేసి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేవాడు. కష్టపడి పనిచేయాలనీ దేవుడు మనిషికి తినటానికి ఒకే ఒక్క నోరు ఇచ్చినా, కష్టపడని పనిచేయటానికి రెండు చేతులు ఇవ్వటంలోని ఆంతర్యం, మరో చేతితో కలిగినంత ఇతరులకు పెట్టటానికేనని చెప్పేవాడు. మనం అందరం కోరుకునే ధనలక్ష్మీ మన కష్టంలో, మరియు మన చెమటలో ఉంటుంది అని చెప్పేవాడు.

ఆ సంపన్నుడి సహాయంవల్ల ఉపాధి పొందినవారు ఎందరో ఆయన చల్లగా ఉండాలని, నాలుగు కాలాలపాటు  ఇలాగే బీదసాదలకు సహాయం చేయాలని, ఆపన్నులను ఆదుకుంటూ ఉండాలని దీవించేవారు.

ఒకనాడు ఆ సంపన్నుడి ఇంటిముందు ఒక గ్రుడ్డివాడు నిలబడి సాహాయం చేయమని దీనంగా అర్థించసాగాడు.  గ్రుడ్డివాడిని, ఆయన దీనస్థితిని చూసిన సంపన్నుడి గుండె నీరయింది. లోనికి తీసుకుని రమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. లోనికి వచ్చిన గ్రుడ్డివాడి వివరాలు అడిగాడు.

అందులకు ఆ గ్రుడ్డివాడు “అయ్యా! నేను పుట్టు గ్రుడ్డిని. నా తల్లదండ్రులెవరో నాకు తెలియదు. తమ వంటి కరుణ గల ప్రభువుల చలువ వల్ల వారు చూపే దయాదాక్షిణ్యాలవల్ల ఇలా కాలం గడుపుతున్నాను. దయగల మారాజులెవరైనా నాకు ఉపాధి కల్పిస్తే బావుంటుంది” అంటాడు.

గ్రుడ్డివాడు దీనస్థితికి , ఆత్మాభిమానానికి సంపన్నుడి మనసు కరుగుతుంది.

కడుపునిండా తిండి పెట్టించి, కట్టుకోవటానికి క్రొత్త బట్టలు ఇప్పించి, ఏదైనా పనిచేసుకునేందుకు ఆసరాగా కొంత డబ్బు ఇచ్చి పంపుతాడు.

సంపన్నుడు ఇచ్చిన ధనంతో ఆ గ్రుడ్డివాడు ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని, సహాయంగా మరో అనాథ పిల్లవాడిని నియమించుకుని, తన కాళ్లమీద తాను నిలబడడమే కాకుండా, తన శక్త్యానుసారం ఇతరులకు సహాయం చేసేవాడు.

నిన్నటివరకు చింకిపాతలతో, వీధుల్లో అడుక్కునే గ్రుడ్డివానికి ఉపాధి దొరకటమే కాకుండా, అనాథలకు తోచిన సహాయం చేస్తుండటం అదే ఊళ్ళో ఉన్న కొందరు సోమరిపోతులకు కన్నెర్ర అయింది. అసూయ కలిగింది.

వాళ్ళకు కూడా ఆ సంపన్నుడి నుండి ధనం సంపాదించాలన్న దురాశ కలిగింది.

వారిలో, తమకు తామే తెలివైన వారమనే భావించే ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి సంపన్నుడి ఇంటిముందు యాచించసాగారు. అది గమనించిన ఆ సంపన్నుడు

‘కాళ్ళూ, చేతులు, కళ్ళు, ఒళ్ళు – అన్నీ సవ్యంగా ఉన్నా ఎందుకు మీరు యాచించాల్సిన అవసరం కలిగింది’ అని అడుగుతాడు.

జవాబుగా, ఆ సోమరిపోతులు : “అయ్యా మాకు పనిచేయాలనే ఉంది, కాని మా వీపుల మీద సైతానం తిష్టవేసింది. ఏ పని చేయాలన్నా అడ్డుకుంటున్నది” అంటూ ఏడుపు నటించసాగారు.

ఆ సంపన్నుడు ధనవంతుడే కాకుండా తెలివైనవాడు కూడా! వచ్చినవారు సోమరిపోతులని, సహాయం చేసినా దుర్వినియోగం అవుతుందని, గ్రుడ్డివాడిలా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తారని గ్రహించాడు. అలాంటివారికి  గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అలా అనుకుని వారితో ఇలా అంటాడు.

“తమ్ముళ్ళూ, మీ దీనస్థితి నాకు అర్థం అయింది. నేను తప్పక మీకు సహాయం చేస్తాను. కాని మొదట మీ వీపుల్ని ఎక్కి కూర్చున్న సైతాన్ ను నా మంత్రంతో దూరం చేయాలి. అందుకు మీకు సమ్మతమేనా?” అని అడుగుతాడు.

సహాయం అందుతుందన్న సంతోషంలో ఆ సోమరి పోతులు సరేనంటారు.

ఆయన తన సేవకులను పిలిపించి వీరిని ఒక గదిలో బంధించి ఉంచుతాడు. కొరడాలను తెప్పించి వీపుల మీద వాతలు తేలేలా కొట్టించసాగాడు. కారణం అడిగిన ఆ సోమరిపోతులకు సైతాన్ ను పార్రదోలటం అని చెబుతాడు.

దెబ్బలకు తాళలేక సోమరిపోతులు లబోదిబోమంటూ, తమకు బుద్ధి వచ్చిందనీ, ఇకముందు కష్టపడి బ్రతుకుతాము అనీ, వేడుకుని, బ్రతుకు జీవుడా అంటూ బయటపడుతారు.

ఆ సంపన్నుడు ఆ సోమరిపోతులకు బుద్ధి గరిపి పంపివేస్తాడు.

(నీతి: కష్టపడి పనిచేయాలి. ఇతరులను యాచించవద్దు.)

You may also like

Leave a Comment