Home వ్యాసాలు స్త్రీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

స్త్రీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

by Dr. Triveni

ఆధునిక రచనల్లో ప్రాచీన సాహిత్యంలో కన్నా స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తిని కోరే మహిళా చైతన్య భావాల వ్యాప్తి, పరిధి ఇటీవలి దశాబ్దాల్లో ఇంకా విస్తరించింది. స్త్రీ వాదోద్యమ ప్రభావం పురుషుల మీద, పురుషుల రచనల మీద పడడం ఆహ్వానించదగింది. స్త్రీవాదులు కోరే సాంఘిక న్యాయాన్ని ఇప్పుడిప్పుడే పురుషులు అర్థం చేసుకుంటున్నారు. అంగీకరిస్తున్నారు. విషయంలో జరుగవలసిన అభివృద్ధి చాలా ఉన్నప్పటికీ, కనీసం ప్రథమ దశ ప్రారంభమయింది. భూమయ్య చిత్రించినజ్వలితకౌసల్యను దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కావ్యనామమే కావ్య వస్తు స్ఫోరకంగా ఉంది. అయితే భూమయ్య కావ్యం స్త్రీవాద కావ్యం అని నేను ముద్ర వెయ్యటం లేదు. కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీవాద పరిచయం ఉపయోగిస్తుందనే నా సూచన’ (పుట.2)

‘జ్వలిత కౌసల్య’ మొదటి ముద్రణ సందర్భంలో ‘లఘుటిప్పణి’ రచిస్తూ ఆచార్య చేకూరి రామారావు ప్రస్తావించిన అంశం ఇది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1999 నాటికే ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించారు. స్త్రీవాద భావజాలం తెలుగు సాహిత్యంలో  ప్రవేశించి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్న కాలమది. స్త్రీవాద పరివ్యాప్తిలోను, ఉద్యమ రూపంలో కార్యరూపం దాల్చడంలోను సాహిత్యం హితోధిక సాయం చేస్తున్న సమయమది. ఆ పరిమిత కాలంలోనే స్త్రీవాదం ప్రపంచ ప్రమాణాల మీద నిలబడుతూ వినూత్న భావజాలాన్ని ప్రకటించింది. స్త్రీలు వెలువరించిన సాహిత్యమే గాక, ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్లు పురుషుల సాహిత్య మనోగతాలపై ప్రభావాన్ని చూపింది. సంప్రదాయక పౌరాణిక పాత్రల్లో గల స్త్రీల అభినివేశాన్ని  సాహిత్యబద్ధం చేస్తూ నూతన ఒరవడిని సృష్టించారు. ఆధునిక సాహిత్య ధోరణులకు అనుగుణంగా సావిత్రి, పురూరవ, సీత, జాబాలి, వరూధిని, ఊర్మిళ, కౌసల్య, కైకేయి, కచదేవయాని, గాంధారి, పూర్ణమ్మ, కన్యక పాత్రల భావైక స్ఫూర్తిని చిత్రించారు. స్త్రీ పౌరుష కాంక్షను, శక్తి సామర్థాలను, మనోఅభిష్టాన్ని, చింతనాత్మక వ్యధను వెలువరించారు. తద్వారా ఆధునిక సమాజానికి ఒక ఉపదేశాత్మక సందేశం అందించారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని స్త్రీవాద కోణం నుండి అవగాహన చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. సహృదయులు అవలోకిస్తారని ఆశిస్తున్నాను. ఆచార్య అనుమాండ్ల భూమయ్య దృక్పథం స్త్రీవాదం గాకపోయినాÑ వస్తు నిర్దేశం దృష్ట్యా ఈ అంశం నిర్ణయాత్మమైందని భావిస్తున్నాను. పూర్తి కథాంశం కౌసల్య గుండెలలో గూడు కట్టుకున్న అగ్నిజ్వాలను విచ్ఛేదం చేయడం. కౌసల్య మనోగతాన్ని ఆవిష్కరించడం. తద్వారా దీర్ఘకాలంగా ఉన్న మనోవ్యధ నుండి ఉపశమనం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే తన సంసారిక జీవితంలో తీరని కోరికలు, బహుభార్యత్వం వల్ల భర్త నుండి పొందిన ప్రేమానురాగాలు, తోటి సవతులతో పడిన అవమానాలు ఒకటేమి సగటు మహిళ పడే ఆవేదన కౌసల్యలో ఆవిష్కృతమవుతుంది. కౌసల్య మనోవేదన స్త్రీవాద లక్షణాలకు అన్వయింపదగినవే.

మరొక అంశం ‘జ్వలిత కౌసల్య’ ఒక విధంగా చేతనాత్మక కావ్యం. అంతర్గత మధనం, భావాల సంఘర్షణ, అనుభవాల సంచయం అన్ని కలిపి మనో విశ్లేషణ సూత్రాల్లోకి కౌసల్య ఇమిడిపోతుంది. మానసిక వ్యధను ప్రత్యక్షంగా ఈ కావ్యంలో చిత్రించారు కవి. ఎంతో కాలంగా మనస్సులో దాచుకున్న ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టడం మనోవైజ్ఞానిక అంశాలకు అనువర్తించవచ్చు. అచేతనంలో దాగి ఉన్న మానసిక సంవేదనను చేతనత్వంలోకి తీసుకొని రావడం ఇందులోని ప్రధానాంశం. దు:ఖప్రోదిని చేధించడానికి కవి ఈ కావ్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు. తనకు కలిగిన అన్యాయాన్ని మరొకరి విషయంలో కలుగకుండా ఉండడంలో కౌసల్య చేసిన ఉపదేశం సత్ప్రవర్తన దిశగా నడుస్తుంది. కథాగమనాన్ని, పాత్రల ప్రవర్తనా శైలిని కవి అత్యంత నేర్పుతో ప్రదర్శించారు.

ఉపదేశాత్మకంగా కావ్యాన్ని వెలువరిచడంలో కవి ప్రధాన శ్రద్ధ వహించారు. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. స్వతంత్ర కథలను తీసుకొని పాత్రలపరంగా ధర్మప్రభోదం విస్తృతం చేశారు రచయితలు. అంతేగాక సంప్రదాయిక పాత కథల ప్రయోగం నేటి సమాజాన్ని సంస్కరించాయి. సందేశాత్మకమైన గాథలు వ్యవస్థ పునరుద్ధరణకు కృషిచేశాయి. సామాజిక ప్రయోజనానికి ప్రాచీన సాహిత్యంలోని గుణాత్మకమైన వస్తు నేపథ్యం కవులకు తోడ్పాటునందించాయి.

‘జ్వలిత కౌసల్య’ కావ్య స్వభావంలో స్త్రీవాద భావవ్యక్తీరణ మనోవైజ్ఞానికి విశ్లేషణ, ఉపదేశాత్మకం వంటి విభిన్నమైన మౌలికాంశాలను గుర్తించవచ్చు. కవి కావ్య నిర్మాణంలో ప్రకృష్టమైన వస్తువును సరళతరం చేశారు. పద్య రచనా సౌగంధంలో మేటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రామాయణ గాథలోని కౌసల్య మనోవేదనను వాల్మీకి రచనాపరంగా నినదించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఆయోధ్య కాండలో 20వ సర్గలో కౌసల్య శ్రీరాముని ఎదుట తన వేదనను వ్యక్తపరిచిన ఘట్టం ఉంది. మొత్తం ఆరు సర్గలలో వ్యక్తపరిచిన ఆవేదన కవి కావ్యానికి ప్రధానాధారంగా నిలిచింది. ఆ ప్రేరణ వల్లనే ఈ కావ్యం రూపొందింది. శ్రీరాముడు ఈ జన్మకు ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని ప్రమాణం చేయడం ఇందులోని ముఖ్యాంశం. కథాంశాన్ని మొత్తం ఎనిమిది ఉప శీర్షికలలో విభజించారు. సంక్లిష్టమైన కథ ఉప శీర్షికలో ఒద్దికగా నిలిపారు భూమయ్య. కైకేయి వరం, జ్వలిత కౌసల్య, అనంత క్రోధం, మాతృ హృదయం, పితృ వాక్యం, పుత్ర వాత్సల్యం, ఏకపత్నీ వ్రతం, మంగళాశాసనం వంటివి ఈ కావ్యానికి ఒక క్రమణికను సూచించాయి. కథా గమనంలో కార్యోన్ముఖతను సాధించడం కవి కవితా ప్రక్రియలో ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యం. 109 పద్యాలు కలిగిన ఈ కావ్యం నాలుగు ముద్రణలు సంతరించుకోవడం విశేషం. చేకూరి రామారావు, బేతవోలు రామబ్రహ్మం, పేర్వారం జగన్నాథం వంటి విమర్శకులు ఈ కావ్య ముద్రణలో ముందు మాటలు రాశారు. అబ్బూరి ఛాయాదేవి, మలయవాసిని, వాసా ప్రభావతి, వెంకమాంబ, గంగప్ప వంటి సాహితీవేత్తలు స్త్రీ సంవేదనా రూపంలో ‘జ్వలిత కౌసల్య’ను పరామర్శించారు.

తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి ఇంటికి వెళ్ళిన శ్రీరాముడికి ఘోర ఉపద్రవం మీద పడుతుంది. పట్టాభిషిక్తం పొందే వేళలో అరణ్యానికి వెళ్ళాలనే కైక అనుజ్ఞను శ్రీరాముడు శిరసావహిస్తాడు. తన తల్లితో నివేదించి అనుమతి పొందడానికి కౌసల్య భవనానికి వచ్చినప్పటి నుండి కథా ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆచార్య అనుమాండ్ల కౌసల్య మనో చింతనను ప్రత్యక్ష పెట్టడానికి ఆరంభ పద్యాన్ని ప్రయోగించారు. తల్లిదండ్రుల సాపేక్ష కైకేయి వరంలో ఉపేక్ష ప్రత్యక్ష కావ్య కథన ధారకు ఉత్కర్షగా నిలిచింది.

తల్లి కొడుకుల ఆప్యాయతా వాత్సల్యాలను అత్యంత మధురంగా భూమయ్య ప్రవేశపెట్టారు.

స్వాగతింప తన కెదురు వచ్చినట్టి

తల్లి పాదమ్ముల మ్రొక్కె ధర్మమూర్తి

రామచంద్రుండు, కౌసల్య రామునెత్తి

శిరము మూర్కొనె కౌగిట జేర్చి                 (పుట.15)

వర్తమాన కాలంలో తెలుగువారింటి వ్యవహార రూపంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రవేశపెట్టారు కవి. కౌసల్య రామచంద్రుల అనుబంధాన్ని చూపించారు. శ్రీరాముడు శిరస్సు వంచి గౌరవ వందనం చేయడం, కౌసల్య శ్రీరాముడిపై పుత్ర వాత్సల్యాన్ని ప్రకటించడం హృదయ మనోహరంగా భూమయ్య రచించారు.

గతంలో తన తండ్రి కైకకు ఇచ్చిన రెండు వరాలను ప్రస్తుతం తీర్చుకుంటున్నట్లు… తల్లితో నివేదిస్తాడు శ్రీరాముడు. ఒకటి భరతుడికి యువరాజ పట్టాభిషేకం, రెండవది పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయడం. ఈ విషయాలు తెలిపి అడవులకు వెళ్ళడానికి తల్లి కౌసల్య అనుమతిని పొందడానికి వచ్చినట్లుగా తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞను పాటించడం ఉత్తమ ధర్మంగా ప్రకటిస్తాడు. ఒక్కసారిగా రాముడి మాటలు విన్న కౌసల్య ‘స్వర్గమున నుండి పడిన దేవత వోలె నేల పడిపోయె’ అని కవి వర్ణిస్తాడు. శాపవశాన అప్పుడప్పుడు దేవ లోకం నుండి దేవ కన్యలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు భూలోకం మీద ఉద్భవించడం చూస్తుంటాం. భూమయ్య ఈ ఉపమానం ప్రయోగించడంలో తన జన్మను కోల్పోయిన స్త్రీ ధైన్యస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కౌసల్య దు:ఖ వారధికి ఇది అనుసంధానింపబడిరది.

స్త్రీలు తమకు కలిగిన శోకానికి, విషాదానికి ప్రకృతిని ప్రమేయం చేయడం గమనిస్తుంటాం. కౌసల్య తన కుమారునికి కలిగిన విపత్తుకు చింతిస్తుంది. ‘ఇదేమి దినము కత్తులే కిరణములుగా కరకు గుండె దాల్చి సూర్యుడిదేలా ఉదయమునందె’ అంటూ తన విధికి, వ్యధకు విలపిస్తుంది. ఒక్కో దినం గడియను బట్టి శుభాలు, అశుభాలుగా పరిగణింపబడుతాయి. కాలం మీద, సూర్య చంద్రుల కాలగమనం మీద జనులకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు  ఉన్నాయి. ప్రకోపాలు కూడా లేకపోలేదు.

‘పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేమో కాని, ఈ మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తడిచె’

అంటూ కౌసల్య తన జీవిత గాధను వినిపిస్తున్న సందర్భంలో ఒక విషయం స్పష్టమవుతుంది. పుట్టింట్లో తానెంత సుఖం పొందిందో తెలియని తనంలోనే కౌసల్య వివాహం జరిగింది. బాల్యంలోనే దశరథ మహారాజుతో పరిణయం జరగడం కూడా ఆమె దు:ఖానికి ఒక హేతువు. బాల్య వివాహాల మీది దుష్ప్రభావాలు రామాయణ కాలం నుండి భారంగా మారాయని ‘జ్వలిత కౌసల్య’ ద్వారా ప్రత్యక్షంగా తెలుస్తుంది. చివరకు అంతపుర స్త్రీలు అయినా వైవాహిక జీవితంలో దు:ఖ సాగరాన్ని ఈదారనడానికి ఈ దృష్టాంతం తార్కాణంగా నిలుస్తుంది. తాను పుట్టి పెరిగి, ఆడి పాడి, ఆనందంగా గడిపిన రోజులు అనుభవంలో లేని పరిస్థితి ఆమెది. ఇక వివాహం అయిన తర్వాత అత్తవారింటిలో ఏనాడు సుఖం పొందినట్లు ఏ ఆనవాలు వ్యక్తపరచలేకపోవడం ఆమె విధిరాతను తలపోస్తాయి. దీనికి రెండు కారణాలను కవి భూమయ్య ప్రస్ఫుటం చేశాడు. ఒకటి కౌసల్య వివాహానంతరం భర్త నుండి సుఖం పొందలేకపోవడం. దీనికి కారణం దశరథుడి బహుభార్యత్వ ప్రాధాన్యం. కైకేయిపై మోజును పెంచుకోవడం. ఆమెకు దాసుడు కావడం. రెండవది సపత్నుల వ్యవహార ధోరణి. కౌసల్య పట్ట మహిషి అయినా ఆమెకు గౌరవాదరణలు దక్కలేకపోవడం. సపత్నుల పరుష వాక్కులు ఆమె హృదయాన్ని గాయపరచడం. అవమానాల జలధి ఉదృతంగా మారి గుండెలో సుళ్ళు తిరగడం.

న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం నా పతి పౌరుషే

అపి ప్రత్యే2పి పశ్యేయ మితి రామాస్థితం మయా                 అయోధ్య : సర్గ : 20 : శ్లో : 38

అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంత్రితా

పరివారేణ కైకేయ్యా సమావాప్యధవా2వరా                         అయోధ్య : సర్గ : 20 : శ్లో : 42

వాల్మీకి రామాయణంలో శ్లోకాలను అనుమాండ్ల భూమయ్య తన ముందు మాటలో ప్రస్తావించారు. భర్త వల్ల సుఖం లేకపోయిన విషయాన్ని వాల్మీకి రామాయణంలో పై శ్లోకాల్లో తెలుపబడిరది. ఈ కావ్యానికి రామాయణ శ్లోకాల్లో కౌసల్య హృదయ తప్త జ్వాలను కవి ప్రవేశపెట్టారు. ఈ శ్లోకాల ఆధారంగానే కరుణ రసాత్మక గాథగా ఈ కావ్యం రూపాంతరం చెందింది.

ఙ వంధ్యత్వం :

కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం కౌసల్య నోట అద్భుతంగా ప్రకటింపజేశారు భూమయ్య. శ్రీరామ చంద్రుడు రాజ్యానికి యువరాజు పట్టాభిషిక్తుడైనప్పుడే తాను సుఖపడే దశ వస్తుందని భావించింది. కౌసల్య తన కడుపు తీపి మేర రామచంద్రుని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ సమయంలో నిప్పులాంటి వార్త ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయటం అనే తండ్రి ఆజ్ఞను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే కొడుకుగా శ్రీరాముడిని కనకుండా ఉండేదానిని అని ఆమె బాధపడుతుంది. కన్నతీపిని కూడా వద్దనుకునే విషమ పరిస్థితి కౌసల్యకు ఎదురవడమనేది మాతృ హృదయం కలవరపడే విషయం.

నాడు నిన్నునే గనకున్న నష్టమేమి

కలిగెడిది? వంధ్యయను పేరొకటి యే తప్ప

సంతులేదన్న ఏకైక చింత తప్ప

వంధ్యకు మరొక్క చింత రవ్వంత లేదు                  (పుట.20)

ఏ ఇల్లాలు అయినా గొడ్రాలుగా ఉండడం అనే విషయాన్ని కలలోనైనా తలంచదు. కాని కౌసల్య తన నోటి ద్వారా ఆ పద్యాన్ని ఉచ్ఛరించడం అత్యంత వేదనాభరితమైంది. కొడుకును కని అడవుల పాలు చేయడం కంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఉత్తమంగా భావించిన కౌసల్య కడుపుకోతను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య పాత్రలో స్త్రీ దు:ఖ హేతువుకు పరాకాష్టగా వంధ్యత్వమనే శబ్దాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

ఙ కడుపుకోత :

కౌసల్య పరి పరివిధాలుగా శ్రీరాముడి మీద ఉన్న తల్లి ప్రేమను వ్యక్తపరిచిన తీరు కవి తన నేర్పుతో ప్రదర్శించాడు. తన దు:ఖానికి అంతం లేదని వాపోతూ, తనకు ఇంత దు:ఖం అనుభవించే శక్తి లేదని తలపోస్తుంది కౌసల్య. తన మీద దయచూపే ఏ దైవం కనిపించడం లేదని దు:ఖిస్తుంది. ఏ దిక్కు చూసినా శూన్యమే కనిపిస్తుందని తన దురదృష్టానికి చింతిస్తుంది.

కౌసల్య బాల్యంలో తన రామచంద్రుడు ఆడిన ఆటలు, అల్లారు ముద్దుగా పెరిగిన జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను కౌసల్య గుర్తుకు తెచ్చుకోవడం కథా సందర్భాన్ని బట్టి ప్రధానమైనది. వెన్నను కొంత తిని అంతకన్నా మన్నును రుచిగా తిన గోరే రాముడిని చూసి కౌసల్య ఆవేదన చెందేదట. తల్లి చేత తిట్లు తింటూ దెబ్బ తగలకుండా తిరిగేవాడట. ఆటలు ఆడి అలిసిపోయి అమ్మ ఒడిలో చేరి పాలు తాగుతూ, తన కోరిక తీరలేదని ఏడ్చే వాడట. ‘అమ్మ పిలిచె రారా! అన్నము తినిపోవవేగ’ అని కౌసల్య ఎంత పిలిచినా ఆట పాటలలో మునిగి పోయేవాడట. ఇటువంటి శ్రీరాముడి అల్లారు ముద్దు చేష్టలను మరకముందే అడవుల పాలు కావడం కౌసల్యకు తీరని దు:ఖాన్ని మిగిలించింది.

` జాలి చూప / గలుగు దైవ మొక్కరు గాని కానరారు / శూన్య గగనమే ఏ వైపు చూడనైన (పుట.21)

` దెబ్బ తగలకుండ తిరిగెడు పని చేష్ట / కనగ నింత నోచుకొననె లేదొ? (పుట.21)

` తలపు తీరుకున్న ఏడ్చు తీయని పసి ఏడ్పు / వినగనింత నోచుకొననొ నేను? (పుట.21)

` ఆడి పాడుచుండు అందాల రాశిని / కనగ వినగ నోచుకొనగ లేదొ? (పుట.21)

విధి తనతో ఆడుతున్న ఆటకు కౌసల్య ఎంతగా వ్యధ చెందిందో ఈ పద్యపాదాల్లో స్పష్టంగా కవి వ్యక్తపరిచాడు.

ఙ సంతాన పరితాపం :

సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు నోచింది కౌసల్య. ఎంతో కాలంగా అవన్ని ‘ఎడారి నలికిన విత్తనములయ్యె’ నని ఒక శిలగా మారిపోయింది. ఎప్పుడైతే శ్రీరాముడు జన్మించాడో, అప్పుడు కౌసల్య పునర్జన్మ ఎత్తినట్లుగా భావించింది. ఒక తల్లిగా సార్థకం కాని స్త్రీ జన్మ ఊహించలేనిది. కౌసల్య సంతానప్రాప్తి కోసం పరితపించిన సన్నివేశాలు కవి సహజంగానే వర్ణించాడు. తాను సంతానం కోరుకుంటే తన ఇంటిలో సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే అవతరించినట్టుగా భావించింది.

పాల సంద్రమే మా ఇంట పరిమళించె

కల్పవృక్షమే నట్టింట కదలి యాడె

సత్య ధర్మమ్ములమృతమై జాలువారె

చలువ పందిళ్ళు వేసెను చందమామ                               (పుట.22)

శ్రీరాముని పుట్టుక సందర్భాన్ని ఆనంద పరవశాన్ని కౌసల్య వదనంలో కవి అద్భుతంగా వర్ణించాడు. బాల్యం నుండి రామచంద్రుని చూచుకోవడమే తపంగా, అలంకరించడమే పూజగా కౌసల్యకు కాలం సాగింది. అంతలోనే యువరాజు పదవికి రాముడు చేరుకోవడం తల్లికి ఆశ్చర్యమే. ఇంతలోనే వనవాస ఆజ్ఞను తట్టుకోలేకపోయింది. ‘నా ఉరమ్ము పగుల ఏడ్చి ఏడ్చి శిలనైతినెపుడొ, ఇప్పుడేడ్చి ఏడ్చి నేనేమౌదు నింక తండ్రి!’ అంటూ రోదిస్తున్న తీరు కవి నైపుణ్యంలో కరుణను చిందించింది.

ఙ భర్త ప్రేమ లేమి :

భర్తవల్ల సుఖం పొందలేకపోవడమనేవి దీర్ఘకాలంగా కౌసల్య తీరని దు:ఖానికి కారణంగా నిలిచింది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డను వనవాసం పంపడం ధర్మమూర్తి అయిన మహారాజుకు తగునా అని నిలదీస్తుంది. శ్రీరామచంద్రుడు అడవులకు పయనమై వెళ్తుండగా ‘జీవముండునే? కూలీన చెట్టునైతి’ అని కౌసల్య రోదిస్తుంది. తన పెండ్లి అయినప్పటి నుండి శుభంగానీ, సుఖంగానీ అంతవరకు తాను చూడలేదంటూ శ్రీరాముడితో మొరపెట్టుకుంటుంది. తన భర్త ఒక రాజు అయి ఉండగా తాను మాత్రం కళ తప్పి ఉన్నానని బాధపడుతుంది. ఈ సందర్భంలో కవి అద్భుత పోలిక వర్ణించారు ‘సూర్యుని ముఖమొక్కింతైన చూడలేని కమలవనమట్లు’ భర్త ప్రేమనే కనలేని బ్రతుకిదేమి!’ అని తలరాతను నిందిస్తుంది.

నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాస దాసీజనమ్ము కలదు

ఎన్ని ఉండి వీనిననుభవింపలేని

భాగ్యహీనను పతిప్రేమబడయలేక                        (పుట. 24)

సగటు స్త్రీ భర్తనుండి ఆశించేవి ప్రేమానురాగాలు మాత్రమే. కౌసల్యకు ఏడువారాల నగలు, చుట్టూ దాసదాసీ జనము ఉండి కూడా భాగ్యవిహీనురాలైన స్థితిని కవి తన కవితా ప్రతిభలో ప్రదర్శించారు.

ఙ సపత్నుల హేళన :

ఏ ఇల్లాలు అయిన ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది కాని సవితి పోరును భరింపగరాదు. కాని కౌసల్యకు అనునిత్యం సవతుల నుండి పరుష వాక్యాలు, దూషణలు ఎదురవుతూనే ఉంటాయి. సపత్నులతో సమానమైన గౌరవాన్ని పొందలేని తన చిన్నతనాన్ని శ్రీరాముడి ముందు విన్నవించుకుంటుంది. రాజుకు పెద్ద భార్య అయి ఉండి, ప్రజల దృష్టిలో మహారాణి అయి ఉండి కూడా సపత్నులతో పడుతున్న హింసను కౌసల్య విడమరిచి చెప్పింది.

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదాం

అహంత్రోప్యే సపత్నీ నామ వరాణాం వరా సతీ                    (అయోధ్య : సర్గ : 20, శ్లో : 39)

సవతులిందరిలో నాకు సాటివచ్చు

వారెవరు లేరు, నా కంటె వయసులోన

చిన్న వారయు వారు నన్నెన్ని మాట

లాడి కష్టపెట్టెదరొనే ననగరాదు                                         (పుట.24)

వాల్మీకి రామాయణంలో కౌసల్య శ్రీరాముడితో తన సపత్నుల వల్ల పడిన పరుష వాక్కుల తీరు స్పష్టంగా చెప్పబడిరది. అనుమాండ్ల భూమయ్య ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తల్లి అనుభవించిన సపత్నుల వల్ల బాధ, తన సీతకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఏకపత్నీ వ్రతుడిగా ప్రతిజ్ఞ చేశాడు. సపత్నుల హేవగింపు వల్ల పొందిన బాధ ఈ కావ్యానికి మూలాధారంగా నిలిచింది. తల్లి హితబోధ ద్వారా శ్రీరాముడిలో సంస్కరణ భావాన్ని పెంపొందింపజేసింది. కౌసల్య తన దు:ఖం రెట్టింపు కావడానికి రెండు కారణాలు గాక మూడిరటిని తెలుపుతుంది. ఒకటి పతి ప్రేమ లేకపోవడం, రెండు సపత్నుల పరుషవచనాలు, మూడవది శ్రీరాముడి వనగమనం.

ఙ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల లేమి :

యువరాజు పదవిని అలంకరించే కొడుకు ఉండగానే దూషణలకు గురవుతున్నానని కౌసల్య వ్యధ చెందుతుంది. ఇక శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని బాధపడుతుంది. తన భర్త తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదని రాముడితో మొరపెట్టుకుంటుంది కౌసల్య.

నేను రాణినే అయి కూడా కాను, మీ జ

నకుడు నను నిగ్రహించి ఇంతయును స్వేచ్ఛ

నీయలేదు, ఆ తల్లి కైకేయి దాస

జనముతో సాటిగానైన సరకుగొనడు                     (పుట.25)

అంటూ దశరథుడు ఎంతగా ఆమెను కట్టుదిట్టం చేసేవాడో తెలుపుతుంది. భార్యలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమనేది పితృస్వామ్య వ్యవస్థలో మొదటిది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అవసరం లేదనే పురుషాధిపత్య సమాజం అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం వాల్మీకి రామాయణంలోనే తెలుస్తుంది. తాను ఒక పట్టమహిషి కూడా. రాజు స్వేచ్ఛ ఇవ్వకపోవడాన్ని ధిక్కరిస్తుంది కౌసల్య. తన భర్త చులకన భావంతో చూడడం వల్ల దాసి జనంలో తన రాణితనం చెలామణి కావడం లేదని బాధ పడుతుంది. ఇప్పటికీ దాసీజనం ఈ రీతికి నడుచుకొంటున్న సందర్భంలో కైక కొడుకు రాజయిన తర్వాత భయంతో తనను చూడడానికి రారేమోనని కౌసల్య సందేహిస్తుంది. ఏకాంతాన్ని ఎలా భరించగలనని శ్రీరాముడితో నివేదిస్తుంది. ‘కాలమింక నా గళమున బడిన కాలనాగొ ఏమొ!’ అని కౌసల్య చిందిస్తుంది.

ఙ కైకేయి పోరు :

కౌసల్య తన సవతులన్నింటిలో కైక సాధింపును తట్టుకోలేకపోతుంది. ఎల్లప్పుడు పరుష వాక్యాలతో దూషించే కైకేయి తన మీద ఎంతటి క్రోదాగ్నిని చల్లుతుందోననే కౌసల్య వాపోతుంది. కైక వ్యక్తిత్వాన్ని కౌసల్య ఆవేదనలో కవి అత్యంత సహజంగా చిత్రించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత కౌసల్యను కైకేయి బ్రతుకనివ్వదనే మాటను కవి ప్రస్తావించడంలో ఆమె ఎంతటి నియంత స్వభావాన్ని కలిగిందో తెలుస్తుంది.

కాల సర్పమట్లు కడు వంకరగ నడుచు

నడత గల కైక కుబుసమ్ము విడిచె Ñ ఇపుడు

విషము చిమ్ముచు నను కాటు వేయునేమొ?

కన్నతండ్రి! నాయన! నిన్నె కాటువేసె.                  (పుట.26)

అంటూ కైకేయిని కాలసర్పంతో పోల్చుతూ కౌసల్య ఆక్రోశిస్తుంది. కాని తన కష్టాలను, బాధలను కౌసల్య తన ఇష్ట సఖులకు కూడా చెప్పుకోలేదట. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య స్వభావాన్ని చిత్రిస్తూ ‘నా ముఖాన మట్టి విసిరినదని నేను / నట్లె కోపించి మట్టిని ఆమె మీద  / విసరలేను. దానిని తీసివేయమేలు’ అని తెలుపుతారు. కౌసల్య వ్యక్తిత్వంలో నీతి, ధర్మం, మంచితనం ప్రదర్శింపజేశారు కవి.

ఙ సవతుల కలత :

కైకేయి మొదలైన సవతులలో ఎదురయ్యే కలతను ఎదలోనే దాచుకొని ఇంతకాలం సగమైపోయిన కౌసల్య ఈ ముసలితనంలో ఇంకా భరింపలేకపోయింది. పట్టమహీషి అయినందు వల్ల సవతులందరూ తనను అధికంగా బాధిస్తున్నట్లుగా కౌసల్య తెలుపుతుంది. మొదటి భార్యను అయిన నేరం వల్ల నేమో తనను మరింత సవతులు అవమానిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఙ మాతృ ప్రేమ :

లక్ష్మణుడు ఆవేశంగా మాట్లాడిన మాటలు న్యాయమనిపించి భావించిన కౌసల్య శ్రీరాముడి వనవాసానికి అనుమతించడు. తండ్రి లాగా తల్లి కూడా పూజ్యురాలని చెబుతూ అడవులకు వెళ్ళకూడదని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తుంది. ఈ సందర్భంలోనే కవి భూమయ్య కౌసల్యలో పుత్రుడిపై ఉన్న ప్రేమను అనేక విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పటి నుండి కౌసల్యకు కలిగిన బాధనెల్లా రాముడు తన చిట్టి వ్రేళ్ళతో తుడిచిన సన్నివేశాలను గుర్తు చేసారు. ఆ వేదనతోనే రాముడు పసితనంలో ఆడిన ఆట వస్తువులే ఆయన అడవులకు వెళ్ళిన తర్వాత ఆమెకు బ్రతుకు వస్తువులవుతాయని సూచించారు.

క్రూర మృగముల నిలయమ్ము, కోయటన్న

పలుకు దిక్కులేని అడవి పదియునాలు

గేండ్లు పగలు గడచిన రేయియె గడవదు

ఇట్లివియె నాకిరువదెన్మిదేండ్లు తండ్రి!                   (పుట.41)

అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కౌసల్య తలచుకొని బాధపడుతుంది. ఆ రాముడి పసితనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాముడికి మెత్తని గుడ్డ ఒత్తుకొని పోయినా బాధపడే తల్లి మనస్సు అడవుల్లో కఱకురాళ్ళ మీద నిద్రించడం దుర్భరమైందని ఆవేదన చెందుతుంది.

కడుపులో ఉండగా రాముడు తన పాదాలతో తన్నుతుండగా కౌసల్య ఆ పాదాలు ఎంత కందిపోయెనో అని కలత చెందిందట. భూమయ్య వర్ణనలో తల్లి ప్రేమకు తార్కాణంగా కౌసల్యనే నిలుస్తుందని చెప్పవచ్చు. కాని అటువంటి పాదాలు రాయిరప్పలు తాకి రక్తం చిందిస్తాయని తలచుకొని బాధపడుతుంది. ‘తండ్రీ! నీ ముద్దు పాదమందారములకు నా యెదను తొడుగుదునయ్య!’ అంటూ కౌసల్య పేర్కొంటుంది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనం ఈ పద్య పాదం. కవి మాతృ స్పర్శకు గొప్ప చమత్కృతి. తనను కూడా అడవులకు తోలుకొని పొమ్మని కౌసల్య ప్రాధేయపడుతుంది. అడవుల్లోని భయానక పరిస్థితులను రాముడికి తెలియజేస్తుంది.

ఙ లక్ష్మణుడి సేవ :

ఈ కావ్యంలో లక్ష్మణుడి మాటలు కౌసల్య దు:ఖానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుత్ర శోకంతో కుమిలిపోతున్న కౌసల్యను చూసి తన తండ్రిపై ఉగ్రరూపమెత్తుతాడు. రాముడు అడవులకు వెళ్ళకూడదని వారిస్తాడు. తన అన్నకోసం ఏమైనా చేస్తానంటాడు   లక్ష్మణుడు. చివరికి తండ్రిని, కైకను, భరతుడిని బంధిస్తానని శపథం చేస్తాడు. రాముడిపై అచంచల భక్తిని ప్రదర్శిస్తాడు. లక్ష్మణుడి ఆక్రోశం కౌసల్య ఆవేదనను కొంత శాంతింపజేసింది. ‘అన్నకు ఆపద సంభవింపనే నగ్నిని దూకెద ముందుగనే’ అన్న లక్ష్మణుడి మాటల్లో అగ్రజుడి పైగల సోదరప్రేమ, సేవాతత్పరత కనిపిస్తుంది. కవి ఈ పాత్ర కల్పనలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ఙ రాముడి ఏకపత్నీ వ్రతం :

‘జ్వలిత కౌసల్య’గా రగిలిపోతున్న తల్లి దు:ఖాన్ని నివారింపజేస్తూ శ్రీరామచంద్రుడు చల్లగా స్వచ్ఛంగా ఏకపత్నీవ్రతం ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి నిరంతర శోకానికి కారణం తండ్రి ప్రేమ లేకపోవడం, తండ్రి బహుభార్యత్వాన్ని స్వీకరించడం అని గ్రహిస్తాడు. తన తల్లి లాగా సీత దు:ఖించకూడదని నిర్ణయించుకొని మాట ఇస్తాడు.

గడిచినట్టి కాలమ్మేదో గడిచిపోయె

తండ్రి తప్పొప్పులివియని తలపలేను

ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు

ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య.                       (పుట. 57)

అన్న శ్రీరాముడి ప్రతిజ్ఞకు కౌసల్య దు:ఖం తొలిగిపోయినట్లుగా కవి కల్పించారు. ‘ఏదో పరిమళామృత పుష్పమింత సాగివచ్చి కౌసల్య శిరస్సుపై విచ్చుకొనియె’ అని వర్ణిస్తారు. కౌసల్య తనకు జరిగిన పరాభవం తిరిగి తీసుకొని రాలేనిది. తన కాలం చెల్లిపోయింది. తన సీతకు ఇటువంటి దుర్గతి పట్టకూడదని కౌసల్య మనోభావం. ఈ ప్రతిజ్ఞతో కవి తన కావ్యానికి సద్గతిని ఏర్పరిచారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య స్త్రీత్వంలో కౌసల్యను చిత్రించి రాముడిని ధర్మ నిరతివైపు పయనింపజేశారు. మూర్తిమత్త్వ నిర్మాణంలో ‘జ్వలిత కౌసల్య’ను అపూర్వ సృష్టిగా నిలువరింపజేశారు. సంప్రదాయ స్త్రీవాద ధోరణికి ప్రతినిధిగా ఈ కావ్యాన్ని చిత్రించారు. సమకాలీన సామాజిక వీక్షణంలో అంతర్భాగంగా పౌరాణిక ఐతిహాసిక పాత్రల మనోగతాన్ని ఆవిష్కరించారు.

 

:: ఆధారగ్రంథాలు ::

  1. కృష్ణకుమారి, నాయని, ఆచార్య, 2013, విమర్శ విద్యా సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  2. ప్రియదర్శిని, కె.,డా॥, (సం) 2015, ప్రతిభాత్రయి, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  3. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2004, అంతర్వీక్షణం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  4. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2011, (నాల్గవ ముద్రణ), జ్వలిత కౌసల్య, మనస్వినీ దేవి ప్రచురణలు,    హైదరాబాద్‌.
  5. రామారావు, చేకూరి, ఆచార్య (సం) 2003, అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

 

 

ఙ ఙ ఙ

You may also like

Leave a Comment