స్వరాంజలి-7
డా. కృష్ణ కుమారి
9885451014
ఈ వ్యాసంలో రామదాసు గురించి తెలుసుకుందాం. రామదాసు సహజ కవి. ఈతని కీర్తనలు సహజ భక్తి భావవేశంతో, తన్మయత్వంతో ,సుకుమార భావనలతో రచింపబడ్డాయి. అందుకే రక్తి కట్టించే రామదాసు కీర్తనలు భజన గోష్టులలో స్థానం సంపాయించుకున్నాయి. ఆనంద భైరవి రాగాన్ని సంగీత చరిత్రలో మొదటిసారి ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసే. ఈతని సంగీత రచనలను బట్టి రామదాసు ఆశయం పాండిత్య ప్రకర్ష కాదని, సంగీతం ఆతని భక్తి సాధనకు ఉపకరణ మాత్రమే అని అర్థమవుతుంది. అయితే కీర్తనలలోని వివిధ ఛందో రీతులను గమనిస్తే ,దేశీయ గేయ రీతుల పట్ల ఈతనికి గల అవగాహన అర్థమవుతుంది. అన్నమాచార్యుల వారి తర్వాత రచన ద్వారా నవవిధ భక్తిని ప్రదర్శించిన వాగ్గేయకారుడు రామదాసే.
తర్వాతికాలంలో భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి కెక్కిన ఈతని అసలు పేరు కంచర్ల గోపన్న. ఈతను 17 వ శతాబ్దికి చెందిన వాడు. సంస్కృతాంధ్ర భాషలలొ ప్రావీణ్యం కలవాడు. అంతే కాకుండా గోల్కొండ రాజ్యంలోఉద్యోగం చేసిన కారణంగా ఉర్దూ పారశీక భాషలలొ కూడా ప్రవేశం ఉంది. ప్రహ్లాద, పరాశర,నారద,పుండరీకాదులతో రామదాసు సమానుడని త్యాగరాజ స్వామి ప్రశంసించారంటే స్వామి వారి కాలానికే రామదాసుకు గల కీర్తి ప్రతిష్టలు అర్థం చేసుకోవచ్చును. ప్రసిద్ధమైన సప్త తాళా లలోనూ, సుమారు 25,30 రాగాలలో రచింపబడ్డ వీరి రచనలలోని పాండిత్యం లోక విదితమైనప్పటికీ రామదాసు మనసు మాత్రం భక్తి కే పెద్ద పేట వేసింది అనడంలో సందేహం లేదు.సహజ భక్తి భావనతో అప్రయత్నంగా పెల్లుబికిన రచనలు ఇవి. అందుకే ఎంతమంది కలిసి పాడిన ఒకే గొంతులాగా ,శ్రావ్యంగా వినిపిస్తాయి. ఆ లక్షణమే భజనలలో రామదాసు కీర్తనలు భజనలలో ఎక్కువగా వినిపించడానికి కారణం। చెరిగిపోని కీర్తితో,తరగని భక్తితో అమరజీవి అయ్యాడు రామదాసు. అయితే జీవితపు తొలి నాళ్లలో ఈతను ఏ రచన చేసినట్లు అన్పించదు. తర్వాతి కాలంలో ఉద్యోగం లో వచ్చిన కష్టాల వలన కల్గిన ఆవేదనతో ,అప్రయత్నంగా , ఆశువుగా వచ్చిన రచనలు ఇవి. మనలాంటి వారికి కూడా బాధలో ఈ కీర్తనలే నోటివెంట పలుకుతాయి కదా!ఆ కీర్తనలలో గల ఆర్తి అటువంటిది మరి. రామదాసు భక్తి భరిత రచనలలో కొన్ని ఉదాహరణలను గమనించండి.
శరణాగతి:
పల్లవి:రామదైవ శిఖామణి
సుర రాజ మహోజ్వల భూమణి ||
చరణం:నాడే మిమ్ము వేడుకోంటి గా
శరణా గత బిరుదని వింటిగా
వేడుకై మిము పొగడ గంటిగా
నన్ను దిగవిడ నాడ వద్దంటి గా||
శరణా గత వత్సలుడని పేరు పొందిన రామ చంద్రుని కరుణ తనపై ప్రసరింప చేయమని వేడుకుంటున్న ఈ కీర్తనలో శరణాగత భావం కన్పిస్తుంది.
స్మరణం:
పల్లవి:హరిహర రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామ స్మరణ మేమరను||
చరణం:దశరథ నందన దశముఖ మర్ధన
పశుపతి రంజన పాప విమోచన||
దాసత్వం :
పల్లవి:రామ చంద్రులు నాపై చలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా||
చరణం:కటకట వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునో కద
ధర్మమే నీకుండు నమ్మా||
యజమానుడైన భగవంతుని కరుణ లేకపోతే దాసుడైన తనను ఎవరు రక్షిస్తారు అన్న దాసత్వ భావన ఈ కీర్తనలో కన్పిస్తుంది.
చింతనం:
పల్లవి:నారాయణ అనరాదా
మీ నాలికపై ముల్లు నాటి ఉన్నదా||
చరణం:కలుష వారధికి నావ నిన్ను
గలిసే టందుకు చక్కని బాట త్రోవ
ఇలలో తెలివికి దేవదేవ
నరహరి నామ కీర్తనములే లేవా||
ఆత్మలో ఎరుక:
పల్లవి:తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓ రన్నా ||
చరణం:ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము
సత్యం బిక పుట్టుట సున్నా||
భగవంతుని గురించిన జ్ఞానమే మోక్ష ప్రదాయిని అని భావం.
సఖ్యత:
పల్లవి: తక్కువేమీ మనకు
రాముడు ఒక్కరుండు వరకు|
చరణం:భూమి స్వర్గమును పొందుగా గొలిచిన
వామనుండు మనవాడై యుండగ|
భగవంతుని స్నేహితునిగా భావించి , ఆ స్నేహం వలన తన జీవితం ధన్య మైందని తలచడం.
సంకీర్తనం:
పల్లవి: ఏ తీరుగా నను దయ జూచెదవో
ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను
నళిన దళేక్షణ రామా |
చరణం:శ్రీ రఘు నందన సీతా రమణా
శ్రిత జన పోషక రామా
కారుణ్య లయ భక్త వరద
నిను కన్నది కానుపు రామా|
ఈ భవ సాగరాన్ని దాటాలంటే భగవంతుని సంకీర్తనమే సరైన దారి అని చెప్పడం.
అర్చనం:
పల్లవి:అమ్మా !నను బ్రోవవే రఘురాముని
కొమ్మా నను బ్రోవవే !
చరణం:అమ్మా !నను బ్రోవవే సమ్మతి తోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద |
అక్షరాల మాలతో దైవాన్ని అర్చించడం ఇందులో కన్పిస్తుంది.
పాదసేవనం:
పల్లవి:రామ నీదయ రాదుగా పతిత పావన
నామమే నీ బిరుదుగా శ్రీ రామా |
చరణం:ఈవులడగ జాలగా శ్రీ పాద
సేవ మాకు పదివేలుగా రామ
భావజనక నీ భావము తెలిసియు
నీవు దైవమనుచు నీ నమ్ముతున్నాను|
రామచంద్రుని పాదసేవకు మించిన పూజ ఇంకొకటి లేదని భావం.
వాత్సల్య భక్తి:
పల్లవి:బూచివాని పిలువ బోదునా ఓ గోపాల కృష్ణా!
చరణం:బూచివాని పిలువ బోతే వద్దు వద్దు వద్దనేవు
ఆ చిచ్చి జోల పాడి అయి ఉంచిన నిదుర పోవు |
భగవంతుని శిశువుగా భావించుట.
వందనము:
పల్లవి:వందనము రఘునాయక
ఆనందము శ్రీ రఘునాయకా
పొందుగ పాదారవిందము
కనుగొందునా రఘు నాయకా|
చరణం:ఎవరేమన్నారు రఘు నాయకా
నే వెరువ జాల రఘు నాయకా
నవనీత చోర నీ నామమే గతి యని
నమ్మితి రఘు నాయకా|
ఈ విధంగా అనేక రకాలైన భక్తి మార్గాలలో తన భక్తి ప్రపత్తులను రామదాసు ప్రదర్శించాడు. ఆహ్లాదకరమైన భక్తి రచనలకు ప్రసిద్ధి గాంచిన ఉత్తమ వాగ్గేయ కారుడు రామదాసు అనడంలో సందేహం లేదు.