ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ!
నేనొక డిగ్రీ కళాశాలకు, వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా వెళ్ళిన సందర్భంలో ఒక డిగ్రీ విద్యార్ధిని పై పద్యాన్ని చదివి “పురుషులందే పుణ్యపురుషులుంటారా ? స్త్రీలలో ఉండరా ? సారు!” అని ప్రశ్నించింది.
పురుషులంటే మగవారని సామాన్యార్థం. కాని పురుష శబ్దానికి అర్థం తెలిస్తే విషయం ఎంత ఉదాత్తమైందో బోధపడుతుంది. ‘పురీశేతి ఇతి పురుషు’ అని నిర్వచనం. పురమునందు ప్రకాశించువాడని అర్థం. ఇక్కడ పురశబ్దానికి రెండర్థాలున్నాయి. ఒక అర్ధం బ్రహ్మాండమని, రెండవ అర్థం శరీరమని. బ్రహ్మాండంలో ప్రకాశించేవాడు దేవుడని, శరీరంలో ప్రకాశించేవాడు జీవుడని తెలుసుకోవాలి.
అప్పుడు జీవులందు పుణ్యజీవులు వేరుగా ఉంటారనే అర్థం వస్తుంది. మగవారుగాని, స్త్రీలుగాని ఎవరైనా పుణ్యాత్ములేననే విశేషార్ధం స్ఫురిస్తుంది. నేను ఇదే విషయాన్ని స్త్రీ పురుషుల మధ్య తేడాలేకుండా తెలియజేసినప్పుడు ప్రశ్నించిన అమ్మాయి, ఆమె తోటి విద్యార్థినులు విన్నారు. ఎంతో సంతోషించారు.
మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని ఆరంభిస్తూ చెప్పిన “వాగర్ధా వివసంపృత్తా” అనే శ్లోకం పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు తల్లిదండ్రులుగా పేర్కొన్నది. శబ్దార్థాల వలె భార్యా భర్తలు అవినాభావ సంబంధం కలిగిన వారుగా తెలియజేసింది.
మన ప్రాచీన సంస్కృతిలో పురుషునికెంత ప్రాధాన్యమో స్త్రీకంతే ప్రాధాన్యం. యాజ్ఞ వల్కుడు ‘బృహదారణ్యకోపనిషత్తు’లో భార్యాభర్తల సంబంధాన్ని ‘అర్ధభృగలం’తో పోలుస్తాడు. గింజలోని రెండు పలుకుల లాంటివారు భార్యాభర్తలు, వంశాభివృద్ధికి దాంపత్యమే శరణ్యము కదా!
నాకు ఎక్కడా ప్రాచీన సంప్రదాయంలో స్త్రీ పురుషుని కంటే తక్కువ అన్న విషయం కనిపించలేదు.
“త్వమేవ మాతాచ పితాత్వమేవ” అని భగవంతుణ్ణి మాతృమూర్తిగా స్తుతిస్తాం. భారతీయులకు వేదం, భూమి, గోవు, గాయత్రి, తులసి, గంగానది మాతృ సమానులు. ఇంత గొప్ప సంప్రదాయం మనకుండగా మనం విదేశాల నుంచి వచ్చిన చదువుల ఆధారంగా స్త్రీ చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఉందా ? అనిపిస్తుంది.
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలుంటారని మనుస్మృతి చెప్తుంది. అంతేకాదు, ఉపాధ్యాయునికంటే ఆచార్యుడు పదిరెట్లెక్కువగా, ఆచార్యుని కంటె తండ్రి వందరెట్లెక్కువగా, తండ్రికంటె తల్లి వెయ్యిరెట్లెక్కువగా గౌరవానికి అర్హురాలని కూడా మనుస్మృతి చెప్తుంది.
ప్రాచీన కాలంలో ఇన్ని విధాలుగా స్త్రీ ఔన్నత్యం తెలుపబడుతుండగా, స్త్రీని విద్యకు దూరంగా ఉంచిన కొన్ని సందర్భాలు నన్నెంతగానో బాధించాయి. విద్యావేత్త లెవ్వరూ జ్ఞానార్జన విషయంలో స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరు.
యజ్ఞయాగాదులందు భర్తకు భార్య కుడివైపున కూర్చోవడమంటే, అన్ని వ్యవహారాలలో పురుషుని స్త్రీ కుడి భుజం అనే అర్థం స్పష్టమౌతుంది.
ఉపనిషత్తుల కాలానికి వస్తే ఒక జబాల, ఒక మైత్రేయి, ఒక గార్గి స్త్రీ ఔన్నత్యానికి ఎత్తిన స్వర్ణ పతాకలు. జనకుని సభలో గార్గి యాజ్ఞ వల్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం మన సంప్రదాయంలో స్త్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది.
జబాల సత్యకాముణ్ణి పెంచిన విధం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మైత్రేయి యాజ్ఞ వల్యుణ్ణి ఆత్మ గురించి అడిగిన ప్రశ్నలు స్త్రీ సాహసాన్ని, ఆధ్యాత్మిక పరిణతిని తెలుపుతున్నాయి. జీవితంలో సీత అనసూయకంటే రెండాకులు ఎక్కువ చదివినట్లు రామాయణ అరణ్యకాండ తెలియజేస్తుంది. వసిష్ఠుని ధర్మపత్ని అరుంధతి విజ్ఞాన జ్యోతి. అన్న విషయం అందరూ ఎదిగిందే.
పూర్వం ఏ కాలంలోను స్త్రీ విద్యకు దూరంగా లేదు. బహుశా ముస్లింల ఏలుబడిలో స్త్రీలు గడపదాటి బయటికి రాకపోవడం వల్ల వారికి విద్య దూరమైంది. ఇది భారతేదశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఒక విధంగా ఆంగ్లేయులు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారనే దాంట్లో కొత్త దనమేమీ లేదు. భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు అన్న మాట విస్మరించరానిది . ఈ సందర్భంగా
స్వాతంత్ర్యానంతర క్రమంగా స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించింది. కాని మనం ఏనాడు స్త్రీని విద్యకు దూరం చేయలేదు. ఒక్కసారి వేదమంత్రాలను గమనిస్తే, మంత్రార్ధం తెలిసిన ద్రష్టలుగా ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు
సంప్రదాయాన్ని అవగాహన చేసుకొని, మన సంస్కృతిని గౌరవిస్తూ మళ్ళీ స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావులెందరో ఉన్నారు. అటువంటి పుణ్యపురుషుల మూలంగా బాలికలు బాలురతో పాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి తమ ప్రతిభాపాటవాలను చూపుతున్నారు. తల్లి దండ్రులకు గౌరవాన్ని తెస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఒక్క రాజకీయ రంగమనేకాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ స్త్రీల యోగదానం ప్రశంసనీయం. అగ్రరాజ్యాధిపత్యాన్ని కైవసం చేసుకోవడానికి కూడా స్త్రీ శక్తి ఉరకలేస్తుందంటే, స్త్రీలకు సమాజంలో గల స్థానం ఎంత గొప్పదో ఊహించవచ్చు. అయితే కొన్ని దేశాలలో స్త్రీ విద్యగల ప్రాధాన్యం
అంతంతమాత్రమే. కాని భారతీయులు మాత్రం సాంప్రదాయకంగా మహిళాభ్యుదయ సాధనలో విద్యార్జనకు అగ్రతాంబూలమివ్వడం సత్యం.