Home Uncategorized హేమంత ఋతువు – మయూఖ సంపాదకీయం, డిసెంబర్ – 2021

హేమంత ఋతువు – మయూఖ సంపాదకీయం, డిసెంబర్ – 2021

by mayuukha

సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. దైనందిన జీవితంలో రోజులు దొర్లిపోతుంటాయి . భూమండలం తన కక్ష్యలో యధావిధిగా తన ధర్మం నిర్వర్తిస్తున్నది. ఇదంతా సహజ సిద్ధంగా జరిగిపోతుంటుంది. మనకేం పేచీ లేదు. ఉన్నదంతా ‘మన’తోనే! తింటున్నాం, పంటున్నాం, రోజులు దొర్లిపోతుంటాయి . బ్రతుకు గడిచిపోతుంటే చూస్తుంటాం. ఏ జంజాటం లేకుండా ఉన్నామా? ఇదేంటీ అని అనిపిస్తుంది! ఎందుకనిపించదు? తనదైన కష్టం లేనిదే మనుషులు జీవిస్తున్నారా ? లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందరినీ ఒక్క గాటన కట్టలేం కాని, ఈ ‘రైతు’ ఉన్నాడే? అతని శ్రమ ముందు అంతా, అందరూ దిగదుడుపే అనిపిస్తుంది. చాలావరకు ఒక మాట అంటుంటాం. “కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?” అని. చూడండి, ఇందులో ఎంతటి అర్థం దాగి ఉన్నదో! అన్నంతో మొదలవుతుంది బ్రతుకు. అన్నమంటే వరి బియ్యంతో వండే అన్నమనే గాదిక్కడ, తినే పదార్థాలు అని. మనుషులకు, జంతువులకూ తేడా ఏమిటో తెలుసుకోవాల్సిన, తెలుపుకోవాల్సిన అగత్యం ఉండదనుకోవాలి. రైతు లేనిదే మన బ్రతుకు లేదు, రైతు కర్మజీవి. మట్టిని నమ్ముకున్న చైతన్యుడు.
పంచేంద్రియాలున్న మనిషి ప్రకృతిని తనలోకి ఆవాహన చేసుకోవడానికి మనసును కేంద్రీకరిస్తాడు. పంచభూతాల ప్రకృతి రమణీయత ఎన్నటికీ తగ్గదు.
కొండకోనల, వాగువంకలు, చిగురులెత్తే పచ్చికల భూమి ఒకవైపున్నది. సన్నగా వీచే గాలి వీవెనల ఆహ్లాదమంతా ప్రాణవాయువుగ బ్రతికిస్తున్నది. ఎక్కడి నుంచో తెలియని ప్రయాణం సాగిస్తూ నీటి జలాలన్నీ పాయలై, నదులై నీరుగా మన నోటికందిస్తున్నవి . రుచి అరుచులన్నీ, నేర్పిన నిప్పు జాడ తెలిసిన తెలివైంది. ఈ అన్నింటికీ సాక్షిభూతంగా నిలిచింది ఆకాశం. రస, రూప, స్పర్షలతో మనిషి జీవిస్తున్నాడంటే ఈ పంచభూతాల సహాయంతోనే. అటువంటి మనిషి ఎంత బాగా తన బ్రతుకును ఈ కర్మజీవి సాయం తో నే కదా అనుభవిస్తున్నది . ఈ కృషీవలుని శ్రమ దృష్ట్యా పరిశీలించాలి కదా! అది కూడా భారతీయ భావన తగ్గకుండా పరిశీలించాలి. అంతేకాకుండా ప్రపంచ జ్ఞానాన్ని పనితనమున్న మన రైతు కష్టానికి అన్వయించుకోవాలి. ఇదే దర్శనం. దీన్నే సత్యం దర్శనం అంటాం. రాళ్ళను కదిలించి నీళ్ళను తెచ్చుకోవడం అనే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే కష్టానికి తగిన ఫలితం అందాలి. రైతే రాజు అన్నారు. కిరీటం పెట్టకుండా టోపీ పెడుతున్నాం. జీవకారుణ్య భావన ఉండాలి. రైతు పంటసిరికి మంట పెట్టకుండా ఉంటే పదికాలాలు చల్లగా ఉంటాడు , చల్లగా ఉంచుతాడు . “మన్ను బంగారౌ మాన్యాలున్నా సాలెల్లపారే సెలయేరులున్నా మడిలో మొక్కకు తడిలేదన్నా” అని ఏనాడో ఒక కవిత లో అన్నారు పెండ్యాల రాఘవరావుగారు .ఇవ్వాళ గుండెతడి కరువై పోతున్నది. వ్యాపార ధోరణితో చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయిగాని ఆరుగాలం కష్టపడి మట్టిని పిండి బువ్వను పండిస్తున్న ఆ రెక్కల కష్టానికి విలువ ఎవరిస్తున్నారు. విత్తనాల నుండి ధర నిర్ణయాలవరకు ఎన్నెన్ని ముళ్ల కంచెల్ని దాటాలి ఏంటి? . “దున్నిన దుక్కీ దక్కదురన్నా, చేసిన కష్టం చెందదురన్నా, రాచనాలా పట రాజోరి కంటా, దొడ్డు మొద్దూ పంట బీదోనికంట” అని రాఘవరావుగారు కరుణ రసాన్ని గూడు కట్టించారు. దోపిడి వర్గాలనూ అక్షరాలతో పట్టించారు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోని ఈ కవిత ఇప్పటికీ తాజా తనాన్ని కోల్పోకుండా ఉన్నదంటే వర్తమాన పరిస్థితులెంత దారుణంగా ఉన్నాయో కదా అనిపించక మానదు.
మనిషి తనాన్ని మింగేస్తున్న గ్లోబలైజషన్ ప్రభావం నుండి బయటపడలేక సగటు జీవి అతలాకుతలం అయిపోతున్నాడు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతుంటే మానవ విలువల పతనం అంత ఎక్కువైపోతున్నది. ఇటువంటి సమయంలో మట్టిని నమ్ముకుని, ప్రకృతిని నమ్ముకుని పనిచేస్తున్న రైతు ఎంత ఉన్నతుడో కదా అనే విచక్షణ మనలోంచి పోతే ఎట్లా? క్షుద్భాధను తీర్చుకోవడానికన్నా సంబంధం లేని ఎన్నో విషయాల కోసం వెనుక ముందు చూడకుండా ఖర్చులు పెడుతుందీ లోకం. వీటన్నింటిపై నుండి ఆహారపదార్థాలను వృధా చేసే వైనం మరోవైపు. ఇవన్నీ కించిత్ ఆందోళనన్నీ కలిగించడం లేదా?
లోకాసమస్తా సుఖినోభవంతు అని సూక్తిని చెప్పిన మనం రైతులు గురించి పట్టించుకోవడం అవసరం . రైతును హాలికుడు అంటారు. రైతు భార్య ను లేదా మహిళా రైతును ‘హాలిని‘ అంటున్నాను. ఈ హాలిని హాలికుడు చల్లగా ఉంటేనే మనమూ చల్లగా ఉంటాం మరి మీరేమంటారు!!

You may also like

Leave a Comment