Home పుస్త‌క స‌మీక్ష‌ అత్తగారి కథలు

అత్తగారి కథలు

by LATHA MURTI MADDALI

రచయిత గురించి: ఎల్లలు లేని ప్రతిభకు డాక్టర్‌ భానుమతీ రామకృష్ణగారు నిలువెత్తు నిదర్శనం. తెలుగు నాట ఒక సమయంలో పరిచయం అవసరంలేని పేరు డాక్టర్ భానుమతీ రామకృష్ణ. ఆవిడ ప్రముఖ నటి మాత్రమే కాక, గొప్ప రచయిత్రి. అత్తగారి కథలు, నాలో నేను, అత్తగారూ నక్సలైట్లూ, భానుమతి కథానికలు వంటి రచనలు చేశారు. డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ దక్షిణ భారత సినీ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. భానుమతి గారు 1926 వ సంవత్సరం సెప్టెంబరు 7న ప్రకాశం జిల్లా, ఒంగోలులో బొమ్మరాజు సరస్వతమ్మ, వెంకట సుబ్బయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. తండ్రి ద్వారా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించారు. 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు,  పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు. జ్యోతిష్యం, తత్వశాస్త్రాలపై కూడా ఈమెకు మంచి పట్టు ఉండేది. సినీ రంగంలో ప్రముఖులు ఈమెను ‘అష్టావధాని’ అని పిలిచేవారు.
చదువు పై ఆసక్తితో భానుమతి గారు 40 సంవత్సరాల వయస్సు దాటాక మెట్రిక్, పి.యు.సి మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలు అయ్యారు. సినీ జీవితంలో తలమునకలుగా ఉన్నప్పటికీ, సాహిత్యం పై మక్కువతో, రచనా వ్యాసంగం వైపు అడుగులు వేసారు. అనేక కథలు, కథానికలు రచించి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆమె కథలు, నవలలు, వ్యాసాలు సమాజం మీద ప్రభావం చూపే విధంగా ఉంటాయి. ‘నాలో నేను’ అనే పేరుతో తన ఆత్మ కథను రాశారు. ఈ పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. ఆమె రచనల్లో స్త్రీ జీవితాలు, వారి భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అంతే కాక తెలుగు, తమిళ సినీ రంగాల్లో అనేక అవార్డులు, బిరుదులు పొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో ఆమెను సత్కరించింది.

అత్తగారి కథలు సంక్షిప్త సారాంశం:
 భానుమతి గారి అత్తగారి పాత్ర సున్నితమైన హాస్యం పండించడం మాత్రమే కాక, ఆనాటి అత్తగార్లు ( కొంచెం పెద్ద వయసు స్త్రీలలో) కనపడే చాదస్తమూ, కట్టుబాట్లు, పాతకాలపు సాంప్రదాయ సంస్కారాలకు సజీవ రూపం. ఈ పుస్తకంలో ఉన్న 29 కథలను పరిచయం చేయడం కాస్త కఠినమైన విషయం. ఐతే నిజానికి అన్నం ఉడికిందీ లేనిదీ ఒక మెతుకు పట్టుకు చూసినా తెలుస్తుంది అని మన పెద్దలు చెబుతారు. అదే విధంగా భానుమతి గారి కథల గొప్పతనం వీటిలోని ఒక్క కథ చదివినా అర్థం చేసుకోవచ్చు. ఈ అత్తగారు అమాయకంగా ఉంటారు, కానీ తనకు అన్నీ తెలుసుననే భావిస్తారు. ‘అత్తగారు- ఆవకాయ కథలో “ఆవకాయ పెట్టాలా? పెట్టేస్తే పోయె!” అంటూ, “మనకూ, బంధువులకూ కలిపి ఒక ఐదువేల కాయ పెడితే సరిపోతుంది,” అనడంలోనే నిజానికి ఆవిడకు ఆవకాయ గురించి ఏమాత్రం అవగాహన లేదని మనకు అర్థమవుతుంది. “నిమ్మకాయెంతో ఆవకాయ అంతే, కారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు,” అని చెప్పిన అత్తగారు ఒక వారం తర్వాత తెరిచిన ఆవకాయ జాడీ బూజు కట్టి ఉండడం చూసి మారు మాట్లాడకుండా, వంట గదిలో ఒక మూలగా ఉండిపోతారు.
ఆవును పెంచుకోవాలని అత్తగారు పడ్డ తాపత్రయం అత్తగారు – ఆవు కథలో చదివి కడుపుబ్బా నవ్వుకోవల్సిందే. ఇంకొన్ని కథల్లో అత్తా-తోడికోడలీయం, అత్తగారూ – అరటికాయ పొడి, అత్తగారూ – జపాన్ యాత్ర, అత్తగారూ – కట్టుడు పళ్ళూ, అత్తగారూ- అంతరాత్మ, అత్తగారూ- బాల్ పాయింటూ ఇత్యాది కథలు చదువుతున్నంత సేపూ పెదాల మీదకు వస్తున్న నవ్వుని మునిపంటితో ఆపడం ఎంత కష్టం ఔతుందో మాటల్లో చెప్పనలవి కాదు. ఈ కథలను చదివి ఆస్వాదించాలి తెలిసిందే.
ఈ కథల్లోని అత్తగారికి తను చేసే ప్రతి పని పైనా విపరీతమైన నమ్మకం. తీరా ఆ పనిలో ఏవైనా విఘ్నాలు వచ్చినప్పుడు తన తప్పుని ఒకంతట ఒప్పుకోలేరు. దాంతో తప్పును మరొకరిపైకి నెట్టేస్తారు. ఆవకాయ పెట్టడం, చెట్లు నాటడం, వడియాలు పెట్టడం, చాకలి పద్ధులు, కిరాణా లిస్టులు రాయడం ఇత్యాది పనులన్నిట్లో ఏదో ఒక తప్పు దొర్లుతుంది. కానీ దానిని ఆవిడ తెలివిగా ఇతరుల మీదికి నెట్టడం, లేదా దాటవేయడం, మరికొన్నిసార్లు మౌనంగా వంటగదిలో కాసేపు తచ్చాడడం లాంటివి చేస్తూ గడిపేస్తుంటారు. “సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే” అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది ఈ అత్తగారు. తన మనవడు డాక్టర్ చదువు కోసం అస్థిపంజరం తీసుకు రావడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక ఆ చదువే మార్చేయాలంటూ యాగీ చేసిన ఆవిడ, హరికథలో స్వాములోరు అదే అస్థిపంజరం గురించి వివరణ ఇవ్వగానే దాన్ని పూజించేంతగా మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ‘అత్తగారూ – అంతరాత్మ’ కథలో.

అయితే భానుమతి గారి అత్తగారి పాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. అత్తగారు అనగానే సహజంగా సినిమాల్లో సూర్యకాంతం గారి పాత్రలా గయ్యాళితనం ఊహిస్తాం కానీ ఈ అత్తగారిలో ఆ దాష్టీకం ఏ కోశానా లేదు. ఈ కథల్లో అత్తగారూ, కోడలు ఎంతో ఒద్దికగా ఉంటారు. ఇంటి పెత్తనం అంతా అత్తగారిదే. కోడలు ఆవిడతో ఎంతో సామరస్యంగా, వినయ విధేయతలతో  ఉంటుంది. మొత్తంగా ఈ పుస్తకం చదివిన పాఠకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ కథల్లో మనకు అత్తగారి అమాయకత్వం, భయాలు, ఇంకా ఆవిడ గాంభీర్యాన్ని చూపించే కొన్ని వాక్యాలు:

  1. “ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకొని వెళ్ళమని ఆ విమానం తోలే డ్రెవర్ తో చెప్పరా!” (అత్తగారు – జపాన్ యాత్ర)
  2. “ఆ రౌడీ వెధవ దీని వెంట కత్తి పట్టుకు తిరుగుతుంటే కష్టం కదూ! ఘూర్కాకి కాస్త గట్టిగా చెప్పు హిందీలో…. వాడు చచ్చి గీపెట్టినా లోపలికి రానివ్వద్దని….. అన్నట్టు ఘూర్కాల దగ్గర కూడా కత్తి ఉంటుంది కదూ!” (అత్తగారు – కామాక్షి కథ)
  3. “ఆ ముదిరి పండుబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం అయిదు వేల కాయలకు ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను. జాగ్రత్త” (అత్తగారూ -ఆవకాయా)

భానుమతీ రామకృష్ణ గారి కథల్లో ప్రత్యేకమైన, వైవిధ్యమైన, విభిన్నమైన తదితర ప్రాధాన్యతాంశాలు:
 పుస్తకం అంతటా తేలికపాటి హాస్యం పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుంది. హాస్యం ఎక్కువగా ప్రధాన పాత్ర ఐన అత్తగారి యొక్క అమాయకత్వం, ఆమె తన తరువాతి తరం యొక్క జీవనశైలిని అర్థం చేసుకోలేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని అత్తగారి పాత్ర సూర్యకాంతం తరహా అత్తగారిది కాదు కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ఆ నటిని గుర్తు చేస్తాయి. ఈ పాత్ర తెలుగు సాహిత్యాభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సున్నితమైన హాస్యం, చక్కని వాస్తవికత, అద్భుతమైన పాత్రల సృష్టి ఈ పుస్తకాన్ని చిరస్థాయిగా నిలిపాయి.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు ఈ అత్తగారి కథలు. ఈ అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఇందులోని అత్తగారి పాత్ర సజీవ వ్యక్తిగా మనకు సాక్షాత్కరిస్తుంది. హాస్యం అంటే బూతులు కాదని, పాఠకుల హృదయాలను గిలిగింతలు పెట్టే సున్నితమైన హాస్యం పండించడం సాధ్యమే అని భానుమతి గారు ఈ పుస్తకం ద్వారా నిరూపించారు.

నాకు ఈ పుస్తకం ఎందుకు నచ్చిందంటే:
ఇందులోని ప్రతి కథా వినూత్నమైనదే. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలే. కనుక మనం ఈ కథల్లో లీనమైపోతాం. మన ఇంట్లోనో, పక్క ఇంట్లోనో ఇటువంటి బామ్మ (అత్తగారు) మనకు తారసపడుతూనే ఉంటారు. భానుమతి గారు ఉపయోగించిన కల్తీలేని అచ్చ తెనుగు ఎన్నదగినది. కథల్లో హాస్యం మాత్రమే ఉంటుంది అది ఏమాత్రం మోతాదు మించకుండా, వెకిలితనంగా మారకుండా హుందాగా సహజ సుందరంగా నడిపించిన భానుమతి గారు శతథా అభినందనీయులు.
ఒక పాత్ర చుట్టూ అన్ని కథలు అల్లడం బహు క్లిష్టమైన ప్రక్రియ. దానిని అతి సునాయాసంగా చేసి చూపించారు రచయిత్రి. తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే ఇటువంటి ఒక పాత్రను సృష్టించగల సత్తా కొరకు ప్రతి రచయితా, కథకుడూ కలలు కంటారేమో! అందుకే ఈ పుస్తకం, ఈ అత్తగారు నా హృదయంలో ఒక ప్రత్యేక పీఠం వేసుకు కూర్చున్నారు.

పుస్తకం పై నా అభిప్రాయం:
ఈ కథలు చదవడం ద్వారా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ప్రతిక్షణం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుంది. తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఈ “అత్తగారి కథలు.”  మన పుస్తక భాండాగారంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఈ పుస్తకానికి కేటాయించవచ్చు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ముగింపు:
అత్తగారి కథలు” చదవడం ఒక అందమైన అనుభవం. ఈ పుస్తకం ప్రతి కథాసాహిత్య ప్రేమికుడు చదవాల్సినదిగా నేను భావిస్తాను. భానుమతి గారి రచనా కౌశలం, సామాజిక చైతన్యం ప్రతీ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. “అత్తగారి కథలు” నాకు నచ్చిన పుస్తకాల్లో ముఖ్యమైనదిగా నిలిచిపోయింది.

You may also like

23 comments

Harley557 September 25, 2025 - 6:33 pm Reply
Alexia3591 September 26, 2025 - 6:34 am Reply
Sean3454 September 29, 2025 - 4:11 pm Reply
Janice795 October 3, 2025 - 10:40 am Reply
Asia4510 October 4, 2025 - 1:31 am Reply
Edna3184 October 4, 2025 - 1:50 am Reply
Regina114 October 8, 2025 - 3:20 am Reply
Marcus4388 October 8, 2025 - 6:26 am Reply
Terrence2158 October 8, 2025 - 5:16 pm Reply
Jasmine4548 October 9, 2025 - 2:24 am Reply
Janet4510 October 14, 2025 - 7:33 am Reply
Bill986 October 16, 2025 - 10:05 am Reply
Gwen4869 October 17, 2025 - 5:04 pm Reply
Travis2845 October 23, 2025 - 10:10 pm Reply
Lindsey3275 October 27, 2025 - 5:36 am Reply
Faye178 October 31, 2025 - 3:42 am Reply
Weston505 November 1, 2025 - 4:52 pm Reply
Genesis2303 November 5, 2025 - 6:05 pm Reply
Joe2817 November 11, 2025 - 1:13 pm Reply
Autumn1319 November 13, 2025 - 3:27 pm Reply
Armando1789 November 14, 2025 - 3:54 pm Reply
Gemma4856 November 17, 2025 - 7:25 am Reply
Arianna1408 November 21, 2025 - 2:25 pm Reply

Leave a Reply to Armando1789 Cancel Reply