Home ఇంద్రధనుస్సు అనర్ఘ రత్నాలు

శా||  శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు

యేలోకానాం స్థితి మావహంత్యవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం

తేవేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావస్సురైః

భూయాసుః పురుషోత్తమాంబుఝభవ శ్రీకంధరా శ్శ్రేయసే

ఆదికావ్య నిర్మాత నన్నయ మహాకవి తన తెలుగు భారతములో తొట్ట తొలుత ఈ శార్దూల విక్రీడిత పద్యము రాసినాడు. అది సంస్కృతంలో ఉంది. తెలుగు భారతానికి సంస్కృత స్తుతి ఎందుకు?

సంస్కృతంలో రాయడానికి కారణం దేవభాషా వందనం. సంస్కృతంలో రాసిన కారణం మరొకటి ఉంది.

ఇది త్రిమూర్తి స్తుతి. వీరిని సురలు సంపూజ్యం చేస్తున్నారన్నాడు. సురల భాష గీర్వాణి. అందుకే ఈ గైర్వాణం భావం మనోనేత్రం తెరిపించేంత గొప్పది. ఛందస్సు ఉభయ భాషా ప్రచవితం.

వ్యాసప్రోక్త భారతం సంస్కృతం. తెలుగుభాషకు వెన్నుదన్ను వంటిది. “గాసట బీసటల గాథలు తవ్వుకుంటున్న” తెలుగువారికి పంచమ వేదాన్ని రుచి చూపించబోతున్నాడు ఆదికవి. గాసట అంటే గాథా సప్తశతి వంటి ప్రాకృత భాషా కథలు బీసట అంటే బృహత్కథ వంటి పైశాచీ భాషా కథలు తెలుగువారి తొలి కథా సాహిత్యం… తాను రాయబోయేది సంస్కృత మహాకావ్యగాథ. ధర్మం కావాల్సినవారికి ధర్మం. పౌరాణికులకు పురాణం. తత్త్వజ్ఞులకు తత్త్వశాస్త్రం. కృష్ణభక్తులకు కార్ ష్ణ్యం ఐన అలాంటి కావ్యానికి తొలి ప్రార్థనగా త్రిమూర్తుల వర్ణనగా దేవభాషలో రాసి తన సంస్కృత భాషా, కావ్య, కల్పనా ప్రాగల్భాన్ని పండించినాడు.

లక్ష్మీ సరస్వతీ పార్వతులు వరుసగా వక్షము, ముఖమున, శరీరార్థ భాగమున నిలుపుకొని మూడు వేదముల సారం మూర్తిమత్వం పొందిన సకల భువన రక్షణ ప్రభువులు, ఆద్యులు ఐన హరిహర హిరణ్యగర్భులను పద్మోమా వాణీపతులను నన్నయ ఈ శ్లోకమున స్తుతించినాడు.

నన్నయ తన కావ్యాన్ని లోనారసి చూడమన్నాడు. లోతుల్లో కావ్యకళను నిక్ష్తిప్తం చేసినాడని సూన. పై పద్యం చూద్దాం.

ముగ్గురు మాతలు శ్రీ, వాణీ, గిరిజలు, శ్రీ కావ్యారంభ శబ్దం. సంపద్వంతం. మరి బ్రహ్మతో ప్రారంభించాలి కదా త్రిమూర్తి స్మరణ! ముగ్గురు పరమ పురుషులు. లోకముల సృష్టి, స్థితి, లయలకు కారకులు. స్థితిమంతుడు విష్ణువు బ్రహ్మను బొడ్డు తామరలో సృజించినందున విష్ణువే తొలుత స్మరణీయుడైనాడు. ఆ విషయాన్ని అంబుజభవ శబ్దంతో స్మరించినాడు.

ముగురమ్మలు లేక సృష్టి లేదు. స్త్రీ పుంస యోగములో సృష్టి అని సూచన. మానవ దృష్టికి యోగమంటే సంయోగము. కాని ఈ త్రిమూర్తులు తమ లోకపాలనంలో అనగా స్థితి, సృష్టి లయలలో వక్షోముఖాంగములలో తమ స్త్రీలను స్థిరపరచుకొన్నారట. వక్షస్థలంలో లక్ష్మి, ముఖంలో వాణి, అంగార్థంలో గిరిజనులున్నారు. ప్రేమస్థానం హృదయం వక్షస్థలం, వాగ్రూప స్థానం నోరు, శక్తిస్థానం శరీరం కదా! అలా ఉంచినారు. పైగా అవిహతమ్మని స్థిరంగా, శాశ్వతంగా ఉన్నారని, ప్రతిక్షణం ‘లోకానాం స్థితి’కి కారణమైనారు అని వివరణ.

ఆ ముగ్గురి స్థితి ఏమి? వేదస్వరూపం. వేదాలు మూడు. వేదస్థితి మూడు దశలు. అందుకే వేద త్రయమూర్తులు అన్నాడు. అవి ఋగ్ యజుస్సామాలు. ఇవి పరస్పర అర్థమైత్రి కలవి. లోనారసి చూస్తే ఈ మూడువేదాల అంతమైన సారభూత దశ త్రిమూర్త్యాత్మకం ఐన విశ్వం. ‘ఋచస్సామాని జజ్ఞిరే’ అని, వేదాలు మూడేనని తైతి్తరియోపనిషద్వాక్య ప్రమాణం. “వేదాంతేషు యమాహు రేక పురుషం” అని ఈ ముగ్గురు “ఏక పురుషుడే”ని కాళీదాసుని కవితా నిష్కర్ష. అపుడు ముగ్గురు స్త్రీలు ఏకీకృతమైన శక్తి స్వరూపమైన ముగ్గురమ్మల మూలపుటమ్ముగా మారి లోకస్థితి శక్తిగా నిలిచినట్టు నన్నయ సూచన.

పురుష శబ్దం స్థితికి, భవశబ్దం సృష్టికి, శ్రీ శబ్ద (శ్రీ కంధర = విషకంఠ) మనగా విష శబ్దం లయకు సంకేతాలుగా నన్నయ నిష్కర్ష ‘చిరాయ’ శబ్దంలో సృష్టి వయస్సును నిపతించినాడు.

శ్రీ, వాణీ, గిరిజలను, వక్షో, ముఖా, అంగములలో పురుషోత్తముడు, అంబుజభవుడు, శ్రీ కంధరుడు ఊర్థ్వ, భూలోక, పాతాళ నామ లోక్రతయ రూప విశ్వంలో ఏలుటగా క్రమాలంకారంలో పేర్చినాడు నన్నయ.

దధతః అనగా ధరించినారని విశ్వాన్ని, విశ్వ ప్రజలకు శ్రేయస్సును ఇమ్మని ఆ సురలచే సంపూజితులైన వారిని ప్రార్థించినాడు.

శ్రీతో ప్రారంభించి, విషశబ్దం పరిహార్యం కనుక పర్యాయమైన శ్రీ శబ్దంతో మరియు శ్రేయశ్శబ్దంతో  శ్లోకాన్ని ముగిస్తూ కావ్య ప్రపంచ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు త్రిమాతృ త్రిమూర్తి వందనం చేసి తెలుగు సారస్వత ప్రపంచాన్ని ప్రారంభించినాడు ఋషి సదృశుడైన ఆదికవి. “ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోను ధావతి” అన్నట్లు త్రిమూర్తి సంకేతంగా మూడు పర్వాలే రాయబోతున్నట్టు చెప్పి, అంతే అనుసృజించి, మహాకవి నిత్యసత్యవచనుడైనాడు.

(ఈ శీర్షికన ఆంధ్రసాహిత్యంలో అనర్ఘ పద్య రత్నాలను ధారావాహికంగా అందిస్తున్నాం. – సంపా.)

 

 

 

You may also like

Leave a Comment