Home ఇంద్రధనుస్సు అనర్ఘ రత్నాలు

 శ్రీమతికి శ్రీనాథుని ప్రే(క్షేమ) లేఖ

ఉ. శ్రీమదసత్యమధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి, మేలు కావలెన్

మేమిట క్షేమమీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమా,

నామది నీదు మోహము క్షణంబును దీరదు, స్నేహబాంధవీ !

శ్రీనాథుని పద్యాలనేకం స్త్రీ అంగాంగ వర్ణనలతో కావ్యాల్లోనూ, చాటువుల్లోనూ ఉన్నాయి. చాటు పద్యాల్లో అధికంగా ఆయన శృంగారాసక్తిని, భోగ లాలసను సూచిస్తాయి. అందుకే ఆయనకు శృంగార శ్రీనాథుడని పేరు. ఆహార, ఆహార్య, విహారాల్లో ఆయన భోగజీవితేచ్ఛ అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన సంచార జీవనం, నానారాజ సందర్శనం, అంకితోత్సవాలు, వాగ్విజయ సభలు, రాజ సన్మానాలు, శృంగార జీవనం చాటువుల నిండా పరచుకొన్నాయి. స్త్రీ శృంగారాన్ని వర్ణించే ఇతర కవులవి కూడా శ్రీనాథునికి అంటగట్టినవి ఉన్నాయి. కాని శ్రీనాథుని రచనలు అతని ఒడుపు, ఎత్తుగడ, పదబంధాలు, సంస్కృత సమాసాలు ఆయన శైలితో మెరుస్తూ అతనివిగానే ఋజువు చేస్తాయి.

పై పద్యం శ్రీనాథుని ఇతర పద్యాలవలె అన్యకాంతా మోహం, పర స్త్రీ సౌందర్య వర్ణనతో గాక, సభ్యవర్ణనతో భార్యను ఉద్దేశించి రాసిన వర్ణన లేదా లేఖగా కనబడుతుంది. చూద్దాం.

శ్రీమత్ = సంపదలతో లేదా సౌభాగ్యముతో కూడినది. ఈ సంబోధన పుణ్య / గౌరవ స్త్రీలకు వేసే విశేషణం. పైగా లేఖా సంప్రదాయంలో తొలిపదం. ఈ ప్రారంభపదమే ‘లేక’ అనడానికి గుర్తు.

అసత్య మధ్యకు సన్నని నడుము కలదని, చిన్ని వయారికి = చిన్న వయసులోనిదని, ముద్దులాడికిన్ = ముద్దుమురిపాలిస్తున్న నూత్న వధువు అని ఇది పెళ్లి అయిన కొత్తలోనే రాసిన పద్యంలా ఉంది. అసత్యమధ్య అంటేనే నడుం పెరగలేదని మధ్యవయస్కు ప్రౌఢ కాదని తెలుస్తోంది. దీంట్లో (ఈ విశేషణాల్లో) సభ్యత వల్ల భార్యకు వేసిన విశేషణాలుగా భావించవచ్చు. మేలు కావలెన్ = ఆశీస్సులందిస్తున్నాడు. తొలిపదం లేఖ ప్రారంభంగా, తొలి వాక్యాంత క్రియ ఆశీస్సుగా లేఖగా ధృవీకరిస్తు లేదూ? ఇది లేఖే అనడానికి ఇంకా కింద చూడండి.

మేమిట క్షేమము = తన క్షేమం తెలుపుతున్నాడు. ‘ఇట’ అంటే తన ఊరి నుండి భార్యను వదిలి బయల్దేరి, చాలా దూరం వచ్చిన ఈ పద్యం రాసిన ఊరికి (ప్రస్తుతం ఉన్నది) వచ్చేవరకు క్షేమంగా ఉన్నానంటున్నాడు. ఇది లేఖ అనడానికి మరీ కింద చూడండి.

మీ శుభవార్తలు = మీరంటే తన భార్య ఒక్కతే ఐతే ఏకవచనం ఉండేది. భార్యతో బాటు శిశువైన తన సంతానమో లేక తన ‘మదేకపుత్ర’ తల్లి లేదా తండ్రి (జీవితులుగా ఉంటే), అంటే కుటుంబం అంతా అని బహువచనం వాడినాడు. వ్రాసి పంపుమీ = ఈ లేఖ తెస్తున్న శిష్యుడు తన వద్దకు తిరిగి వచ్చేటపుడు తిరుగులేఖ ద్వారా రాసి పంపమంటున్నాడు. అయ్యా! ఇప్పటికైనా ఈ పద్యం ఉత్తరం అని ఒప్పుకుంటారుగా!

నీదు మోహము = నీపై అనురాగం, నా మది క్షణంబును దీరదు = ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావని, స్నేహ బాంధవీ! = స్నేహం (అనురాగం)తో బాంధవ్యం (తాళి గట్టిన బంధుత్వం)తో (తాకి కట్టడం బంధనం, బంధనంతో బంధుత్వం కదా లోకంలో) – పై రెంటిలో స్నేహ బాంధవ్యాలు (అనురాగం, భార్యాత్వం) కల్గిన దానా?

ఇది శ్రీనాథుని రచనే అని చెప్పడానికి పై విశేషణాలే సాక్ష్యమిస్తున్నాయి. అసత్యమధ్య, వయారి, ముద్దులాడ, సామజయాన వంటివి ఆయన తరచూ వాడే పదాలే. ప్రతి కవికీ కొన్ని పద బంధాలు పడికట్టుగా ఉంటాయి. శ్రీనాథుడు “దూరటంకాల…” పద్యంలో రావు సింగమహీ పాటని రాచకొండ రాజ్యసభలో ఎటుల మెప్పించెదో అంటూ “సరససద్గుణ నికురుంబ శారదాంబ” అని సంబోధించినాడు. తానే తిరిగి ఫిరంగిపుర శాసనాన్ని రాస్తూ “సరస సద్గుణ నికురంబ సూరమాంబ” అని శాసనకర్తిని (దాత) పేరును అదే పదబంధాలతో సూచించినాడు. “శ్రీనాథో విద్యాధికారీ శ్రీ వీరవేమభూపతేః” అని శాసనాంతంలో తన పేరును తన ‘విద్యాధికారి’ హోదాను సూచించినాడు.

శ్రీనాథుడు భార్యకు లేఖ రాయడానికి వచనం వాడాలి, కాని పద్యం (ఛందస్సు)లో రాస్తాడా? అని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ అడుగడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటనను ఛందోబద్ధం చేసినాడు. ఆఖరుకు తన ఆత్మహత్యను కూడా “అరగుచున్నాడు శ్రీనాథుడమర పురికి”అని పద్యంలో రాసుకున్న జీవకవి. ఆయనవి దొరికినన్ని చాటువులు మరే కవివి దొరకలేదు.

భార్యకు పద్య లేఖ రాయడంలో తప్పేం లేదు. ఆవిడా కవయిత్రి కావచ్చు. లేదా పద్య సౌగంధ్యానికి పరవశించే పడతి కావచ్చు. శ్రీనాథుని శ్రీమతా? మజాకా? తెలుగు కవులు తమ భార్యల గూర్చి వారి వైదుష్యం సంగతి (వారిజ భవుడెరుగు) పేరైనా చెప్పరైరి (ఒక్క కృష్ణరాయని కావ్యాల్లో తప్ప)

-డా. సంగనభట్ల నరసయ్య

9440073124

విశ్రాంత ప్రాంశుపాలుడు, ప్రాచ్య కళాశాల, ధర్మపురి

(ఈ పద్యం డా. కోడూరి ప్రభాకరరెడ్డి సంకలనం “శ్రీనాథుని చాటువులు” నుండి స్వీకరించాను.)

You may also like

Leave a Comment