ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోకగ మొక్కి నులింతు సైకత
శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షి తానత
శ్రీణికి దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్ష రామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
(6-I. పోతన భాగవతం)
మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!
నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం. విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.
రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!
వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.
అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!
అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి
స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూప. ఉపాసనా రూప.
ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత