రచన : ఒద్దిరాజు సీతారామచంద్రరావు, సరళీకృతం : రంగరాజు పద్మజ
ఒకటవ ప్రదేశం:- ఓరుగల్లు కోట వెలుపల.
ప్రవేశం :- (ఏకాంబరుడు)
ఏకాంబరుడు — (స్వగతం) నేను నిర్ణయించింది ఇంత వరకు జరగకుండా ఉండలేదు. మాలికఫూర్ దండయాత్రను ఈసారి ఎదుర్కోవడం కష్టంగా ఉంది. హిందువులకు గెలుపు ఈసారి తప్పక కలుగుతుందని సూచనగా కూడా కనబడడంలేదు. సమయానుకులంగా మెలగాలి. ఆబీదు ఖానుతో నేను కుదుర్చిన సంధి ప్రస్తుతానికి ఉపయోగకరమే!( ఆలోచించి) కాకపోతే తక్కిన నా లాంటి వారిలో ఒకడిని. ఇంట్లో కూచుని చక్కగా ఆలోచించడానికి కవకాశం లేదు.
[ ఇంటివైపు నడుస్తూ…..]
( రఘుపతి దారిలో కనపడ్డాడు)
రఘుపతి —ఏమిటి? ఏకాంబర స్వామీ? ఏదైనా ఆపద వచ్చిందా? అలా ఉన్నారు?
ఏకా :– అవును! అనేదే వచ్చింది. సభలో జరిగిన సూచనల ప్రకారం నడుచుకున్నా.
రఘు :– కాయా? పండా?
ఏకా:—పండే! కానీ.. ఇంకా…
రఘు:– నీ మనసు పండలేదా ?
ఏకా :– [ ఆలోచనతో… అర్ధమైనట్లు తల ఆడించాడు]
రఘు :– చేసిన ప్రమాణం ఏమైంది ?
ఏకా :— అయ్యేది దేశద్రోహమే ?
రఘు :— [ కొంచెమాలోచించి] మంచిది! జరిగిన విషయం.. చేసిన ప్రతిజ్ఞ… కావలసిన పని… రాబోయే ఫలితం… మొదలైనవి చక్కగ ఆలోచించుకో! నాకు తొందర పని ఉంది. నేను పోయివస్తా!
ఏకా:– ఏ మాత్రమైన ఆశయముంటే మనం ఇలా చేయవద్దు!
రఘు:– నేను పోయి వస్తా. నీకు పిచ్చి ఎక్కుతున్నది. హిందువులు తప్పక ఓడిపోతారు. [వెళ్ళిపోతాడు]
ఏకా:– ఏకో దేవః కేశవోవా, శివోవా [ వెళ్ళిపోయాడు]
రెండవ ప్రదేశం :–
(ఏకాంబరుని ఇంటి మేడ)
ప్రవేశం: అన్నపూర్ణ.
అన్నపూర్ణ [ దుఃఖంతో ] ఏ దేశం వారైనా తన దేశం అశాంతిలో ఉన్నప్పుడు ప్రాణాలర్పించైనా సరే సరిదిద్దుకుంటారు. అలా కాక ఆ విషయం గురించి ఆలోచించడమో- పనిచేయడమో చేయక ఆ దేశపు వారే తమ దేశాన్ని ముస్లింలనే మంటలలో పడవేస్తున్నప్పుడు ఇక కాపాడేదెవరు. ఆ దేవుడే దిక్కు!
మంచి తెలివైన ఆలోచనలు చేయగల బృహస్పతల వంటి మంత్రులు ఎత్తుగడలన్నిటినీ దేశ విప్లవ కారులైన నీచుడి సహాయంతో చక్రవర్తి సైన్యం నాశనమౌవుతోంది. [ ఏడుస్తూ ] కష్టం మీద కష్టం ! వస్తోంది. నేను చూసిన దాన్ని బట్టి చేసిన ఆలోచిస్తే కారణాలే లేన్నట్లు అనిపిస్తుందా? అనిపిస్తే నేనేమి చేయాలి? పతివ్రతగా ఉండడమా? దేశాభిమానం చూపడమా ! [ విచారించి] దుఃఖంతోనూ; స్త్రీల స్వభావ దృష్టితోనూ; ధైర్యంతోనూ; పురుషభావంతోనూ ” నేను స్త్రీనైనా కాలానికి తగినట్టు… ఈ సమయంలో , అనుకున్న పని చేయాలనుకోవడం వల్ల రానున్న చెడుపేరుకు శాంతంగా “తల వంచుకోవలసిందే!.
[ వెనుక వైపు తిరిగి చూస్తే ఏకాంబరుడు వస్తూ కనబడ్డాడు.]
ఏకా:—దగ్గరకు వచ్చాడు.
అన్న:– [ భర్త వైపుచూసి కళ్ళలో కమ్మిన నీరు లోపల లోపలనే దాచుకొని.]
ఏకా:– [సందేహంతో కూడుకొన్న కంఠంతో]
ప్రియా! ఎందుకో .. ఏమిటో ఆలోచిస్తున్నట్టనిపిస్తున్నది.
అన్నపూర్ణ:– [ స్వగతం] లోలోన[ పైకి ]
విచారించుటకు వేరే విషయమేముంది? ఓరుగల్లులోనే కాదు! ఆంధ్ర దేశం మొత్తం అట్టుడుకుతున్న విషయమే! మాలిక్ కఫూర్ ముట్టడి గురించి…..
ఏకా:- నీకు దాని వల్ల కలిగిన… కలిగే అపాయమేముంది?
అన్నపూర్ణ:– ఆత్మకు కలిగిన అపాయాలు అవయవాలకు మాత్రం కాదా?
ఏకా:– ఆత్మ- అవయవాలనే భావం స్వదేశీయుల మధ్య ఉంటే కదా?
అన్నపూర్ణ:— ఉండడం మంచిదా? ఉండకపోవడం మంచిదా!తలరాతలనుకోవాలా!
ఏకా:— తలరాత లెక్కడివి? సమయాన్నిబట్టి తలరాత మారుతుంది.
అన్నపూర్ణ:– తలరాత మారితే ప్రకృతి మారుతుందా?
ఏకా:— ఏమిటీ ? అలా అడుగుతున్నావ్? మారాల్సి వస్తే మారడమే! అంతకంటే గత్యంతరం ఉంటుందా?
అన్నపూర్ణ:– గతిలేకపోతే మారడం సరియైనదే కావచ్చు! కాని, ఏదైనా మార్గం ఉన్నప్పుడు మారడం ఎందుకు?
ఏకా:– మారడం చేతగాని వారికి స్వాతంత్య్రం ఎక్కడుంటుంది?
అన్నపూర్ణ:—- జాతి, లింగ భేదం లేక నీ బాటను నడవడం [ నిన్నసరించడం] సరియైనదేనా?
ఏకా:— ఔను!
అన్నపూర్ణ:— అయితే మీరు మిమ్మల్ని మార్చుకున్నారా?
ఏకా:— పూర్తిగా .
అన్నపూర్ణ:— ఐతే నేనో?
ఏకా:– నీ ఇష్టంగా నిన్ను మార్చుకో!
అన్నపూర్ణ:– [ లోలోన ] పెద్ద అడ్డుతొలగింది. [ పైకి ] మీ యాజ్ఞ నేను తలదాలుస్తాను.. ఇప్పటికి ఒక బెంగ తీరింది.
ఏకా:– ఇంకా నీకు రంధి ఎందుకు?
అన్నపూర్ణ:— ఏమీలేదు! మీరు చేస్తున్న పని గురించి..
ఏకా:– [ లోలోపల] స్త్రీలు చాలా తెలివైన వారు చక్కగా ఆలోచిస్తారు.. నేను చెప్పకుండానే నా తీరు కనిపెట్టినట్టున్నది. [ పైకి] నేనేం చేస్తున్నానో నీకు తెలుసా?
అన్నపూర్ణ:– నిద్రాహారాలు లేకుండా…
ఏకా :— అనుమానం ఎందుకు?ఏం అడగాలనుకుంటున్నావో అడుగు!
అన్నపూర్ణ:– ఇంటికిరాక… ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నారని?
ఏకా:— ఊరిపై ఊరు పడినట్లున్నప్పుడు నిద్ర… ఆహారం… ఇల్లు… సంసారం…. ఇవన్నీ పట్టించుకుంటారా? ఎవరైనా?
అన్నపూర్ణ:— ఇవాళ యుద్ధానికి విశ్రాంతిస్తున్నట్లు
చాటించారు కదా?
ఏకా:– ఔను! ఐతే ?
అన్నపూర్ణ:– విశ్రాంతి ఇచ్చినప్పుడైనా ఇంటికి రావచ్చు కదా?
ఏకా:– కొంత మందిని కలువలసిన వారితో కలిసిరావడంతో.. ఆలోచనలు చేయాల్సి రావడానికి ఆగిపోవలసి వచ్చింది….
అన్నపూర్ణ:– ఆలోచనలన్నీ తురకల తోటేనా?
ఏకా:– [ తనలో] ఇది చమత్కారమా?
అన్నపూర్ణ:– తురకల తోటేనా?
ఏకా:– ఓ! అలా అనుకున్నావా?
అన్నపూర్ణ:— ఊరికే అనుకోవడమే కాదు ఊహ కూడా కాదు!
ఏకా:— ఎవరు చూసారు? ఎక్కడ చూసారు? నన్ను?
అన్నపూర్ణ:– ఎవరు చూస్తే ఏమిటి? ఆబీదు ఖానుతో మీకేం పని? ఆ పనేంటో నేను తెలుసుకోవచ్చా?
ఏకా:– [లోలోపల] స్త్రీలకు కర్ణ పిశాచాలుంటాయని మాత్రమే అనుకుంటారు! కానీ నేత్ర పిశాచాలు కూడా ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను! కానీ…… కేవలం దేశ క్షేమం కోసమే కావాల్సిన పని- చేస్తే కలిగే ఫలితం తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడే చెప్పవద్దని దాచితే , బట్టబయలు చేస్తున్నది. ఇన్ని విషయాలు తెలుసుకున్నది ఆకొంచెం తెలుసుకోకుండా ఉంటుందా!
అన్నపూర్ణ:— ఆబీదుఖానుతో మీకేం పని ఉన్నదో చెప్తారా?
ఏకా:– నీకెందుకా? విషయం ?
అన్నపూర్ణ:– నా మనసు మార్చుకోవచ్చని నాకు మీరాజ్ఞ ఇచ్చింది మరచిపోకండి!
ఏకా:- మరువను!
అన్నపూర్ణ:– ఇంకా ఏమిటి?అందుకే అడుగుతున్నాను.
ఏకా:– [ అనుమానిస్తూ] అలా ఐతే నువ్వు తెలుసుకొన్నవో?లేక అనుకున్నవో? అది నిజమే? [ చెవి పైకెత్తి]
అదిగో ప్రియా! కిందనుండి ఎవరో పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి [ వెళ్ళి పోయాడు]
అన్నపూర్ణ:- దేవుడా! నాకింత పరీక్ష ఎందుకు పెట్టావు? సరే! పరీక్ష పెట్టదలిస్తే , దేశం పరుల పాలయ్యే మహా కష్ట సమయంలోనా? అది కూడా భార్యాభర్తల విషయంలోనా? ఈశ్వరా! ఎంతటి దురవస్థ? నేను దేశభక్తైనా మానుకోవాలి! లేదా పతిభక్తైనా మానుకోవాలి! కదా? ఇదివరకు జరిగిన దండయాత్రలో దేశాన్ని రక్షించు కుంటామని మహిళలు చేసిన ప్రతిజ్ఞలలో నేనూ ప్రతిజ్ఞ చేసాను కదా? ఇప్పుడు నా భర్త నేను చేసిన ప్రతిజ్ఞను మార్చుకొమ్మని బలవంత పెడుతున్నారు. అలా చేస్తే దేశభక్తిని విడిచిపెట్టడమా? లేక పతిభక్తిని విడిచి పెట్టడమా అని ఆలోచిస్తూ…… [వెళ్లిపోతుంది]
౩వ ప్రదేశం — ఓరుగల్లు బయట యుద్ధభూమి.
ప్రవేశం– కాకతీయ సైన్యం– మాలిక్ కాఫూర్ సైన్యం యుద్ధం చేస్తూ…
యోధుడు:– నువ్వూ హిందువు! నేనూ హిందువునే! నువ్వు అడ్డు తొలగు ! నాకు శత్రువు మాలిక్కాఫూర్ . అతని తర్వాత అతని సేనాపతి ఆబీదుఖాను! అంతే కానీ నువ్వుకాదు!
ఏకాంబరుడు:– నేను తొలగిపోను! నీకే శక్తి ఉంటే నన్ను గెలిచి, నా స్నేహితుడు , నా ప్రభువుతో యుద్ధం చేయి!
యోధుడు:– నువ్వు ఈ ప్రతాపరుద్ర మహారాజు సేవకుడవు కదా! నీకు ఆభీద్ ఖాన్ మరియు మాలికపూర్ ప్రభువు ఎట్లా అయ్యారు! ఎప్పుడయ్యారు?
ఏకా:– వారికింద ఉద్యోగం చేయడం వల్ల!
యోధుడు:– కాకతీయుల కొలువు చేయడమంటే.. కాకతీయ ప్రభుత్వాన్ని మోసం చేయడమేనా?
ఏకా:- [ స్వగతం] ఇతడెవరు? ఓరుగల్లు సైన్యంలో నేను ఎన్నడూ చూడనే లేదు.
యోధుడు:– మాట్లాడడం లేదెందుకు జవాబు చెప్పు? ఒక మాట మాట్లాడు!
నీ దగ్గర నీ ప్రభువును వంచించే గుణంవుంటే…. ప్రాణాలు కాపాడుకోవాలంటే అలాగే మోసంచేస్తావా?
ఏకా:- నువ్వు నన్ను నిలదీసే అంత మొనగాడివా?
యోధుడు:– అలా అనడం లేదు!
జయాపజయాలు దైవాధీనం!. నేను తప్పక నిన్ను ఓడిస్తాననడంలేదు. కానీ దేశభక్తి ఆవేశంతో నిన్ను చంపడానికి కత్తి పట్టవలసి వచ్చింది. నీవు ధనాశతోనో.. కొత్త పరిచయాలవల్లనో నీ ప్రభువును… ఎవరి దయాదాక్షిణ్యాలతో నువ్విన్నాళ్లు పోషింపబడ్డావో… ఆ ప్రభువును మోసం చేస్తున్నావు! నేను- నువ్వు ఒక్కదేశానికి చెందిన వాళ్ళమే! ఒక చోటున కాపురం ఉన్న వాళ్ళమే! కాబట్టి ఉండవలసినంత సంబంధం ఉండడం వల్లనే నిన్ను ఇక్కడినుండి పొమ్మని అంటున్నాను.
నా శత్రువును, నా దేశ శత్రువును నాకు ఒప్పగించమని చెప్పాను! కానీ నీవు వినలేదు! ఏమాత్రం చెవిన పెట్టలేదు. నిన్ను గెలవాలంటే.. నువ్వే నాకు ఆజ్ఞనిచ్చి, ప్రోత్సహించావు. ఇక నేను దేశక్షేమం కోసం చేయాల్సిన పనికి ఆలస్యం చేయవద్దు. అయినా కూడా చెప్తున్నాను. సాధ్యమైనంత ఆలస్యం…
ఏకా:- నువ్వు… నువ్వు.. దేశ హితైషివా? అది ఎలాగో చూస్తాను. నీ దేశమెలా నీచే… నీ వంటి వారిచే… కాపాడబడుతుందో చూస్తాను ![ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తారు. ఇద్దరి కంఠాలకు, అవయవాలకు గాయాలౌతాయి.]
యోధుడు:– ఇగో తప్పించుకో! [ ఆబీదుకాను వైపు నడుస్తాడు]
ఏకా:– తన రక్షణ కొరకు పాటుబడేవాడు పంద. నా కొత్త ప్రభువు కొరకు నేను రక్షకుడను.
[ ఆబీదుఖానికి అడ్డంగా నిలిచి, అతనిని తన వైపునకు తీసుకొని]
యోధుడు:– అలా అయితే నీ ఖర్మ! ఇనుముతో అగ్ని…[ బల్లెంతో ఇద్దరూ పొడుచుకున్నారు. ఏకాంబరుడు, ఆబీదుఖాను కింద పడిపోయారు.]
యోధుడు:- [ బల్లేలను కింద పడవేసి, పరుగున పోయి ఏకాంబరుని తలను తొడపై పెట్టుకొని కూర్చుని] నాధా! ఎటువంటి రోజు వచ్చింది? [తేరిపార చూసి ] ఇక ఎక్కడి నాధుడు? చేతులారా చంపుకొన్న పిశాచికి ఈ లోకంలో నాథుడు ఎక్కడుంటాడు? దేవుడా! మా ఇద్దరి ప్రేమ సామ్రాజ్య దాంపత్యాన్ని చెడగొట్టటానికే నా భర్తకు దేశద్రోహ బుద్ధి కలిగించి, మా చరిత్ర… చారిత్రక ప్రపంచంలో శాశ్వతంగా ఉంచాలనుకొని నాకు నా భర్తకు వ్యతిరేకంగా ఆలోచించే బుద్ధినిచ్చావా? నా నాధా! నువ్వెందుకు దేశద్రోహుల కుతంత్రంలో చిక్కి, నాకిలాంటి వైధవ్యం నేనే తెచ్చుకునేలా చేసావు? నా ఆశయం మార్చుకొనేందుకు నాకెందుకు అనుమతినిచ్చావు? నిన్ను అనుసరింపమని నన్ను ఎందుకు చెప్పలేదు? ఇప్పటికైనా నిన్ను అనుసరించకుంటే నాకు గతి ఏమిటి? దేవుడా ! నిశ్చయంగా నేనే పతివ్రతనైతే దేశహితం కోసం ప్రాణం కంటే ఎక్కువైన నాభర్తని చేతులారా చంపుకొన్న పాపినని కోపగించుకోకుండా… ఎన్ని జన్మలలోనైనా ఈ మహామహునకే భార్యనయ్యేలా దీవించు తండ్రీ! ఏ జన్మలో నైనా ఈ మా ఇద్దరికీ గాఢమైన… నిశ్చలమైన దేశభక్తిని ఇవ్వు!
[ బాకుతో ఛాతీలో పొడుచుకొని భర్త శరీరం పై ఒరిగిపోయింది]
(సమాప్తం)