Home అనువాద సాహిత్యం అపరిచిత – కథ

అపరిచిత – కథ

by Sudharshan Chintapatla

మూలం : రవీంద్రనాథ్ టాగూర్,    అనువాదం : చింతపట్ల సుదర్శన్

నా వయస్సు ఇరవైయేడేళ్లు. ఇప్పటివరకూ జీవితంలో చెప్పుకోదగ్గట్టుగా ఏమీ సాధించకలేకపోయినా, నా కంటూ ఒక స్వంత జీవితం ఉందని దానికి ఓ విలువ ఉందని ఇప్పుడే తెలిసింది. ఈ విషయానికి సంబంధించి మరువలేని సంఘటలను వివరంగ చెప్తాను.

మా నాన్నగారు ఒకప్పుడు చాలా పేదరికం అనుభవించారు. కాని ప్లీడరు వృత్తి బాగా కలిసివచ్చి చాలా డబ్బు సంపాదించారు. సంపాదించిన దాంతో సుఖపడే తీరిక మాత్రం ఆయనకు ఉండేది కాదు. చివరిశ్వాస తర్వాతే ఆయనకు విశ్రాంతి లభించింది. మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె మేం ధనవంతులం అనే ఆలోచన నాలో కల్పించింది. ఆమె అతిగారాబంగా పెంచడంవల్ల నేను అసలు ఎదగనే లేదు.

మా అమ్మ సోదరుడు నాకు సంరక్షకుడుగా ఉండేవాడు. మా మేనమామ నాకంటే ఆరేళ్ళు పెద్దవాడు. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలపై అజమాయిషీ చేసేవాడు. ఆయన కారణంగా నేను ఏ బాధ్యతా తెలియని వాడినయ్యాను. పెండ్లి కావలసిన కుమార్తెలు, ఉన్న తల్లిదండ్రులకు నేను అన్ని అర్హతలు ఉండి ఉన్నత కుటుంబానికి చెందిన బ్మహ్మచారిని. పొగ త్రాగడం వంటి చెడు అలవాట్లేమీ లేవు. నేను చాలా విధేయుడినైన కొడుకుని. అవిధేయత చూపే శక్తి నాకు లేదు. ఒక స్త్రీ కనుసన్నల్లో పెరిగిన వాణ్ణి కాబట్టి ఏ స్త్రీకయినా మంచి భర్తను కాగలను.

సంపన్న కుటుంబాలవారు నా సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. కాని నా విధిని నిర్ణయించే మేనమామ సంపన్నుల కుమార్తెల పట్ల వ్యతిరేకి. మా ఇంటికి వచ్చే వధువు వినయ విధేయతలే ఆయనకు ముఖ్యం. నాకు పిల్లనివ్వ వచ్చే వధువు తండ్రి ధనవంతుడై ఉండకూడదు కాని కట్నం క్రింద కొంత ధనం వెచ్చించగలిగి ఉండాలి.

కాన్పూర్ లో ఉద్యోగం చేసే నా స్నేహితుడు హరీష్ కలకత్తా నించి వచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకు తెల్సిన ఓ అందమైన అమ్మాయి ఉందని చెప్పి నా మనశ్శాంతిని హరించాడు.

నేను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం వెదుక్కోవలసిన అవసరం లేదు, చెయ్యనక్కర్లేదు. ఊరికే గోళ్లు గిల్లుతూ కూర్చోవడానికి కావలసినంత సమయం ఉంది. కుటుంబ విషయాలు చూసుకునే సమర్థత లేదు. నా ప్రపంచం అంతా అమ్మ మా మేనమామ మాత్రమే. ఇలా నిస్సార జీవితం గడుపుతున్న నా దగ్గర హరీష్ అమ్మాయి ప్రస్తావన తెచ్చాడు. నాలో కుతూహలం పెంచాడు. నన్ను రెచ్చగొట్టాడు.

హరీష్ తో నేను ఈ విషయాన్ని మామకు చెప్పమన్నాను. హరీష్ కు వ్యవహారం నడిపే యుక్తి ఉన్నది. మామకు నచ్చే విధంగా అమ్మాయి తండ్రి వివరణ యిచ్చాడు హరీష్. ఆ కుటుంబం గతంలో సంపదతో తులతూగినదేకాని ప్రస్తుతం సంపద దాదాపు ఖాళీ అయినా అమ్మాయి పెళ్లికి తగినంత మిగిలే ఉన్నది. ఇదివరలోలా జీవితం గడిపే పరిస్థితి లేనందువల్ల ఆయన స్వస్థలం వదిలి పడమరవైపు వచ్చి కాన్పూర్ లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పాడు.

ఇవన్నీ కలిసొచ్చే విషయాలే. ఒక్కతే కూతురు కనుక ఆమె తండ్రి తను దాచి వుంచిన డబ్బును అణాపైసలతో సహా ఖర్చు పెడ్తాడు. కాని అమ్మాయి వయస్సు పదిహేను దాటడానికి కారణమేమిటని అడిగాడు మామ. అర్హులైన వరుల ఖరీదు ఎక్కువని వారి అంచనాలు తారా స్థాయిలో ఉంటున్నవని అందువల్ల, సరైన సంబంధం కోసం వధువు తండ్రి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడంవల్ల అమ్మాయికి ఆ వయస్సు వచ్చిందన్న యిచ్చిన జవాబు మామకు సంతృప్తి కలిగించింది.

మామకు కలకత్తా తప్ప మరే ప్రాంతమైనా అండమాన్ నికోబార్ లాంటిదే. ఒకవేళ తనే గనక ధర్మశాస్త్రం లిఖించిన మనువు అయి వుంటే హౌరాబ్రిడ్జి దాటి పోవడాన్ని కూడా నిషేధించి ఉండేవాడు. అందువల్ల నేను కాన్పూర్ కు వెళ్ళి అమ్మాయిని చూస్తాననే సాహసం చెయ్యలేకపోయాను.

మా తరఫున పెళ్ళి సంప్రదింపులు జరపడానికి కాన్పూర్ వెళ్ళాడు మా పెదనాన్న కొడుకు బిన్ను. మామూలుగా అయితే బిను అన్నయ్య ఏ విషయాన్నైనా తేలిక చేసి మాట్లాడే రకం. మనం అద్భుతంగా ఉంది. అంటే ఆఁ ఓ మోస్తరుగా ఉంది అనే మనిషి. కాన్పూర్ వెళ్ళి వచ్చిన అన్నయ్య ‘ఏ వంకా పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి స్వచ్ఛమైన బంగారం అనుకో’ అన్నాడు.

2

పెళ్లి జరిపించడానికి వధువు తరఫువాళ్ళే కలకత్తాకు రావల్సి వచ్చిందని నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. అమ్మాయి తండ్రి శంభునాథ్ బాబు హరీష్ ను పూర్తిగా విశ్వసించినట్టుంది. అందువల్ల పెళ్ళికి మూడురోజుల ముందు ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మాత్రమే నన్ను చూశాడు. నలబై సంవత్సరాల వయస్సులో ఉన్నా ఆయన స్ఫురద్రూపి. మీసాలు తెల్లబడుతున్నవిగాని తలవెంట్రుకలు మాత్రం ఇంకా నల్లగానే ఉన్నవి. నన్ను చూసి ఆయన సంతృప్తి చెందాడనే అనుకుంటాను. అయితే ఆ సంగతి ఆయన స్పష్టంగా తెలియనివ్వలేదు. మితభాషేకాని మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడ్తాడు. మామ సందర్భం దొరికినప్పుడల్లా నగరంలోని ధనికుల కుటుంబాలలోమా కుటుంబమే ఉత్తమమైనదని చెప్పినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. కనీసం అలాగా అన్నట్టు తల కూడా ఆడించలేదు. మామ ఎవరినీ తేలిగ్గా వదిలేవాడు కాదు కానీ శంబునాథ్ బాబులో చురుకుదనం లేదని సరి పెట్టుకున్నాడు. ఇది ఒక రకంగా ఆయనకు నచ్చింది. అమ్మాయి తండ్రి నోరు మెదపకుండా ఉండడం ఆయనకు ఇష్టమైన విషయమే.  శంబునాథ్ బాబు సెలవు తీసుకుంటాను అన్నప్పుడు బయటవేచి ఉన్న బండివరకు వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పలేదు.

కట్నం కింద యివ్వాల్సిన మొత్తం నిర్ణయింపబడింది. ఆర్థిక విషయాలలో ఎలాంటి నసుగుడూ మామకు ఇష్టం వుండదు. అందువ ల్ల డబ్బుతోపాటు యివ్వవలసిన బంగారం నాణ్యత బరువు కూడా ఖచ్చితంగా నిర్ణయించాడు. ఈ లావాదేవీలలో నేను తలదూర్చలేదు.  అనుకున్న దానిలో చిన్నమెత్తు తేడా వచ్చినా మామ ఒప్పుకునే మనిషి కాదని నాకు తెలుసు. మాకు డబ్బు అవసరం లేకపోయినా, అవతలివాళ్ళు అడిగినంత యివ్వ లేకపోయినా ఎట్టి పరిస్థితిలోనూ మా కుటుంబ ప్రతిష్ఠే గెలిచితీరాలని మామ పట్టుదల.

పెళ్ళిలో పసుపుకు సంబంధించిన వేడుక వైభవంగా జరిగింది. లెక్కవేయడానికి ఒక గుమాస్తాను పెట్టుకోవలసినంత మంది మా బంధువులు వధువుకు బహుమమతులు యిచ్చారు.

బ్యాండు మేళంతో బ్రహ్మాండమైన ఊరేగింపు పెళ్ళి మండపానికి చేరింది. బంగారు జలతారు చొక్కాతో మెడనిండా బంగారు గొలుసులతో వేళ్ళకు ఉంగరాలతో ధరల చీటీ అంటించబడి షోకేసులో ఉండే వస్తువులా వెళ్ళాను.  మా మామ పెళ్ళి జరిగే ప్రదేశం చూడగానే ఎంతో నిరాశకు గురయ్యాడు. మా వాళ్లకు ఆ స్థలం సౌకర్యవంతంగా లేదని ఏర్పాట్లు ఘనంగా లేవని చిరాకు పడ్డాడు. శంబునాథ్ బాబు ఆహ్వానించిన విధానం కూడా ఆయనకు నచ్చలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో గొడవ మొదలవుతుంది అనుకున్నా, కానీ నల్లగా లావుగా ఉన్న బట్టతల మనిషి శంబునాథ్ బాబు లాయర్ మిత్రుడు నడుముకి శాలువా చుట్టుకుని మా మధ్యకు వచ్చి తలవంచి చిరునవ్వు నవ్వుతూ చేతులు జోడించి అందరికీ నమస్కరించి దాన్ని నివారించాడు.

నేను మండపంలో కూర్చోగానే మా మామ శంబునాథ్ బాబును పక్కకు తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య యేం జరిగిందో తెలియదుకాని శంబునాథ్ బాబు వచ్చి ‘బాబూ! ఓసారి నా వెంట వస్తావా’ అన్నాడు. మామకు వధువుకు యిచ్చే బంగారం నాణ్యత విషయంలో మోసం జరగవచ్చునని భయం. అందుకే బంగారం నాణ్యతను చూడటానికి, తూచడానికి కంసాలిని వెంట తీసుకువచ్చాడు.

నేను శంబూనాథ్ బాబు వెంట గదిలోకి ప్రవేశించేప్పటికి మంచం మీద మామ ఆ పక్కన నేలమీద త్రాసు, తూకపురాళ్ళతో కంసాలి కనిపించారు.

శంబునాథ్ బాబు నావైపు తిరిగి ‘పెళ్ళి జరగడానికి ముందే బంగారం అంతా పరీక్షించాలంటున్నారు. మరి మీరేమంటారు?’ అన్నాడు.

నేను తలదించుకుని మౌనంగా ఉన్నాను. ‘వాడి ముఖం వాడేం చెప్తాడు. నేను ఏది చెప్తే అదే!’ అన్నాడు మామ. ‘ఇది నిజమేనా? ఆయన చెప్పిందే వేదవాక్కా, తమరు నోరు విప్పరా?’ అన్నాడు శంబునాథ్ బాబు. నేను విషయం నా పరిధిలో లేదు అన్నట్టు తల ఊపాను.

‘అలాగయితే కాస్సేపు ఆగండి. నేను వెళ్ళి అమ్మాయి మీద ఉన్న నగలన్నీ తీయించి తెస్తాను’ అన్నాడు శంబునాథ్ బాబు.

‘అనుపమ్’ ఇక్కడ ఉండి చేసేది ఏమీ లేదు. వాణ్ణి మండపానికి వెళ్లనివ్వండి’ అన్నాడు మామ.

‘వీల్లేదు. అతనూ ఇక్కడే ఉండాలి’ అంటూ వెళ్లిన శంభునాథ్ బాబు ఒక ఉత్తరీయంలో బంగారు నగలు మూటకట్టి తెచ్చి మామ కూచుని ఉన్న మంచం మీద విప్పి పోశాడు.

‘నగలలో ఒకటి చేతిలోకి తీసుకుని ‘పరీక్షించే అవసరం లేదు అన్ని నగలూ కల్తీలేని బంగారంతో చేసినవే. ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన బంగారం కనిపించదు’ అన్నాడు కంసాలి. తర్వాత ఒక నోటు పుస్తకంలో వివిధ నగల జాబితా రాశాడు. చివరికి అమ్మాయికి యిస్తామన్నదాని కంటే శంబునాథ్ బాబు తెచ్చిన బంగారం కాస్త ఎక్కువగా ఉందని తేలింది.

ఆ నగలలో ఒ క జత చెవిరింగులు ఉన్నాయి. కంసాలి వాటిని పరిశీలించి వీటిలో బంగారం చాలా తక్కువగా ఉంది అన్నాడు. ‘అవి మీ బంధువుల్లో ఎవరో మా అమ్మాయికి బహుమతిగా యిచ్చినవి’ అంటూ శంబునాథ్ బాబు ఆ చెవి రింగులు మామ చేతిలో పెట్టి ‘ఇవి మీ దగ్గరే ఉంచండి’ అన్నాడు.

మామ ముఖం అవమానంతో ఎర్రబడ్డది. ఏం మాట్లాడాలో తెలియక నావైపు తిరిగి ‘అనుపమ్ ఇక నువ్వు మండపానికి వెళ్ళి కూర్చో’ అన్నాడు.

శంబునాథ్ బాబు నన్ను వారించాడు. ‘అవసరం లేదు, ముందు భోజనాలు కానివ్వండి’ అన్నాడు. ‘భోజనమా? పెళ్ళి కాక ముందే భోజనమా? ఈ మాట ఇదివరకెన్నడూ విన్లేదు’ అన్నాడు మామ.

శంబునాథ్ బాబుపైకి కనిపించేటంత సాత్వికుడు కాదు. లోపల చాలా గట్టివాడు. మా వాళ్ళను ముందు భోజనం చెయ్యమని ఒత్తిడి చేశాడు. మామను భోజనం చెయ్యడానికి ఒప్పించాడు. వరుని వెంట వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేశారు. భోజనం మామూలుగానే వుంది కానీ రుచికరంగా ఉండి మర్యాదగా వడ్డించబడటం వల్ల అందరికీ తృప్తి కలిగింది.  అంతా తిన్నాక శంబునాథ్ బాబు నన్ను కూడా తినమన్నాడు. ‘అదెలా కుదురుతుంది. పెళ్ళి కాకుండానే వరుడు ఎలా భోం చేస్తాడు’ అన్నాడు మామ.

మామ మాటలు పట్టించుకోకుండా ఆయన నాతో ‘మీరు భోజనం చేస్తే ఏ ప్రమాదమూ ముంచుకురాదు’ అన్నాడు.

నేను మామ మాటకి ఎదురు చెప్పింది లేదు. అది మా అమ్మ ఆజ్ఞతో సమానం నాకు. అందువల్ల భోజనం చెయ్యడానికి ఒప్పుకోలేదు.

శంభునాథ్ బాబు మామవైపు తిరిగి ‘మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. మేం సంపన్నులం కాము. మీ స్థాయికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయాం. ఆలస్యం అవుతున్నది. ఇంక ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోను. అందువల్ల…..’

మధ్యలో అందుకుని మామ ‘అవునవును ఇక మనం మండపానికి వెళ్దాం’ అన్నాడు.

శంభునాథ్ బాబు ‘మీ తిరుగు ప్రయాణానికి బండ్లను పిలిపించనా?’అన్నాడు.

అదిరిపడ్డాడు మామ. ‘వేళాకోళానికి యిది సమయమా?’ అన్నాడు.

శంబునాథ్ బాబు ‘పరిహాసం ఆడటం మీకు మాత్రమే తెలుసు. నేను దానిని కొనసాగించదల్చుకోలేదు’ అన్నాడు.

మామ నిశ్చేష్టుడై నిలబడ్డాడు.

‘నా బిడ్డకు యివ్వాల్సిన బంగారం విషయంలో మోసం చేస్తానని భావించిన కుటుంబానికి నా కూతురుని యివ్వలేను’ అన్నాడు శంబునాథ్ బాబు. ఈసారి ఆయన నావైపు చూడలేదు. ఏ రకంగానూ విలువలేని మనిషినైన నాతో మాట్లాడ్డం అనవసరం అనుకున్నట్టున్నాడు.

ఆ తర్వాత యేం జరిగిందీ చెప్పడానికి నోరు రావడం లేదు. మా వాళ్ళు అక్కడ్నించి బయటకు వెళ్ళడానికి ముందు అక్కడ ఉన్న  కుర్చీలను విరగ్గొట్టారు. మండపాన్ని ధ్వంసం చేశారు.

మేం తిరిగి వచ్చేప్పుడు బ్యాండు మేళం లేదు. దీపాలు పట్టుకునే వాళ్ళు లేరు. ఆకాశంలోని చుక్కల వెలుతురులో నిశ్సబ్దంగా వెనక్కు వచ్చేశాం.

3

బహుశా బెంగాల్ లో యిలా పెళ్లివారి ఇంటి నుంచి తరిమివేయబడ్డ ఏకైక పెళ్ళి కొడుకును నేనేనేమో! మా కుటుంబంలో అందరూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాడు కూతురి పెళ్లి ఎలా చేస్తాడో చూద్దాం అన్నారు. మామ వధువు తండ్రి మీద పరువు నష్టం దావా వేస్తానన్నాడు కానీ బంధువులు అది మనకే అప్రతిష్ట అనడంతో ఊరుకున్నాడు.

నాకు బాగా కోపం వచ్చింది. ఏదో ఒకనాడు శంబునాథ్ బాబు నా కాళ్లమీద పడి క్షమాపణ అడిగి తన కూతురును నాకు యివ్వడానికి రావాలని కోరుకున్నాను. నా ఈ కోపానికి మరొక బాధ కూడా జత కూడింది. నేను వెళ్ళడానికి వీల్లేని గోడ వెనుక, సిగ్గుతో, గంధం రాసుకున్న ముఖంతో, ఎర్రటి పెండ్లి చీరలో నిలబడి ఉన్న ఆమె నా ఊహా లోకంలో వసంత కాలంలో వికసించే పుష్పాలతో నిండి ఉన్న తీగలా కనిపించేది. గాలిలో ఆ తీగ పరిమళాన్నిఆస్వాదించేవాణ్ణి. ఆ తీగ ఆకుల సవ్వడి వినేవాణ్ణి. నాకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆమె హఠాత్తుగా అందనంత దూరం వెళ్ళిపోయింది.

ఆమెను చూసి వచ్చి బినూ అన్నయ్య  చెప్పినదాన్నిబట్టి ఆమె అసాధారణమైన అందగత్తె అని ఊహించుకున్నాను. కనీసం ఆమె ఫోటో కూడా చూడలేదు. ఆమె రూపం నా మనసులో అస్పష్టంగా ఉండిపోయింది. ఆమె నా ఫోటో చూసిందని హరీష్ చెప్పాడు. బహుశా నచ్చే ఉంటాను. ఆమె నా ఫోటోను దాచుకుని రహస్యంగా చూస్తూ ఉండి ఉంటుందని, ఆమె నా ఫోటో పైకి వంగి చూస్తున్నప్పుడు ఆమె తల వెంట్రుకలు దాన్ని కప్పేస్తుంటాయని, ఆమె నా ఫోటో చూస్తున్నప్పుడు ఎవరైనా వస్తే దాన్ని తన చీరమడతలో దాచేస్తుంటుందని రకరకాలుగా ఊహించుకునే వాణ్ణి.

సంవత్సరం గడచిపోయింది. నా పెళ్ళి గురించి మాట్లాడటానికి మామ ఇబ్బంది పడితే అమ్మ జరిగిన అవమానాన్ని మరచిపోయే వరకూ పెళ్ళి మాట తలపెట్టకూడదనుకుంది.

ఆ అమ్మాయికి ఒకమంచి సంబంధం వచ్చినా ఒప్పుకోలేదని తను యింక పెళ్ళి చేసుకోనని ఒట్టు పెట్టుకుందని తెలిసింది. ఆమె నా కోసం పరితపిస్తుందనుకున్నాను. ఆమె దుఃఖాన్ని చూసి భరించలేక మామ మా ఇంటి గుమ్మం ముందు నిలబడతాడని ఊహించుకున్నా. మళ్ళి పెళ్ళి యేర్పాట్లు జరిగితే జరిగిన అవమానానికి ఆ పెళ్ళిని రసాభాస చేసి బదులు తీర్చుకోవాలని కూడా అనిపించేది.

కానీ నా ఊహాలేవీ నిజం కాలేదు. కథలో నేననుకున్నదేమీ జరగలేదు.

అమ్మకు తోడుగా తీర్థయాత్రకు బయలుదేరాను. మామ ఎలాగూ హౌరాబ్రిడ్జి దాటి రాడు కనుక నాకా అవకాశం వచ్చింది. రైల్లో దాని లయబద్ధమైన కదలికకు ఒకదానికొకటి పొంతనలేని కలలు కంటూ నిద్రపోయాను. రైలు ఒక స్టేషన్లో ఆగింది. అది కూడా కలేనేమో అనుకున్నా. స్టేషన్లో దీపాల మసకవెలుతురు ఉన్నది. అమ్మ తన బెర్తుమీద నిద్రపోతున్నది. మా బ్యాగులు చుట్టుపక్కల అస్తవ్యస్తంగా పడున్నవి.

హఠాత్తుగా ‘తొందరగారా ఇక్కడ ఈ కంపార్టుమెంట్ లో ఖాళీ ఉన్నది’ అన్న శబ్దం వినపడింది. నా చెవులకు అది సుమధుర సంగీతంలా వినిపించింది. ఈ అర్ధరాత్రివేళ ఎక్కడ ఉన్నానో తెలియని చోట ఒక అమ్మాయి బెంగాలీ భాషలో మాట్లాడటం వింటుంటే బెంగాలీ భాష ఎంత తియ్యనిదో అనిపించింది. అది కేవలం ఒక స్త్రీ గొంతుక మాత్రమే కాదు నేను ఎప్పుడూ విని ఉండని సుస్వర సంగీతం.

భౌతికంగా కనిపించే రూపం కంటే మనుషుల కంఠధ్వని నాకు ఆసక్తికరంగా అనిపించేది. నేను కిటికీ తెరిచి చూశాను. ఆ చీకట్లో గార్డు తన ఒంటికన్ను లాంతరు పైకి ఎత్తి పట్టుకోవడంతో రైలు కదిలింది. లేచి కిటికీ పక్కనే కూర్చున్నా, నక్షత్రాలు వెలుగుతున్న ఆకాశంలో ఒక వ్యక్తి రూపం లీలగా నన్ను కమ్మేసింది. ఆ అపరిచిత కంఠధ్వని నా హృదయంలోకి చొరబడి అత్యంత సమీప వ్యక్తి కోసం దాచిన చోటును ఆక్రమించేసింది. లయబద్ధంగా విన వస్తున్న రైలు శబ్దంలో ఒక పాట పల్లవి పదే పదే నా చెవులకు వినిపించసాగింది. ‘ఇక్కడ ఈ కంపార్టుమెంటులో ఖాళీ ఉన్నది’.  ఓ నా సంగీత స్వరమా ఇక్కడ కావలసినంత ఖాళీ ఉన్నది. నేనింక క్షణం ఆగలేను అనుకున్నా.

ఆ రాత్రి నిద్రపట్టలేదు. నేను చూడని ఆ స్వరం ఉన్న మనిషి తెల్లవారకముందే ఎక్కడ దిగిపోతుందోనన్న భయంతో రైలు ఆగిన ప్రతిస్టేషన్లో కిటికీలోంచి బయటకు తొంగి చూశాను.

మర్నాడు ఒక జంక్షన్లో రైలు ఆగింది. మేము రైలు మారాలి. మా దగ్గర ఫస్టుక్లాసు టికెట్ ఉండటంవల్ల సమస్యే ఉండదు అనుకున్నా. కాని ఓ బ్రిటిష్ సైనికాధికారి తన సహాయకులతో ప్లాట్ ఫాం మీద ఉన్నాడు. ఇక ఫస్టు క్లాస్ లో స్థలం దొరుకుతుందన్న ఆశ వదులుకున్నాను. విపరీతమైన జనం ఉన్నారు. అమ్మకు సౌకర్యంగా ఉండేచోటు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. ఒక్కో కంపార్టుమెంటు లోకి తొంగి చూస్తూ వెళ్తున్న నాకు సెకండ్ క్లాస్ బోగీలో నుంచి ఓ స్త్రీ స్వరం వినవచ్చింది. ఆమె అమ్మతో ‘ఈ కంపార్టుమెంటులోకి రండి ఇక్కడ ఖాళీ ఉన్నది’ అంది.

ఉలిక్కిపడ్డాను. రాత్రంతా నన్ను వెంటాడిన కంఠధ్వని యిదే! పల్లవి కూడా అదే ఇక్కడ

ఈ కంపార్టుమెటులో ఖాళీ ఉన్నది. నేను క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ కంపార్టుమెంట్ లోకి వెళ్ళాను. లగేజీ తేవడానికి సరిపోయే టైం లేదు.  ఆ అమ్మాయి సూట్ కేసులు పరుపు చుట్టలు కదుల్తున్న రైల్లోకి తేవడానికి సాయం చేసింది.

ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని వివరించడం చాలా కష్టం. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. ఇప్పటి దాకా నా మనసులో ప్రతిధ్వనించిన స్వరం ఒక వ్యక్తి రూపంలో నా ముందు ఉన్నది. అమ్మ కూడా ఆ అమ్మాయి నుంచి చూపు తిప్పుకోలేకపోయింది. ఆమెకు పదహారు పదిహేడేళ్ళ వయస్సుండవచ్చు. ఆమె కదలికలు, ముఖ కవళికలు చాలా సహజంగా ఉన్నాయి. ఆమె అందంలోని స్వచ్ఛతకు సాటిలేదు. చుట్టు పక్కల ఉన్న మనుషుల మధ్య ఆమె ప్రత్యేకంగా కనిపిస్తుంది.  తను పెరిగే కొమ్మమీద పొడుగాటి కాడపై వికసించే తెల్లని లిల్లీ పువ్వులా ఉన్న ఆమె చుట్టూ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళంతా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నేను పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ వారి మాటలు వినడానికి చెవులు రిక్కించాను. తన కంటే చిన్న వయస్సు వాళ్ళ మధ్య ఉన్న ఆమె కూడా చిన్న పిల్లలాగే కనిపించింది. ఆ అమ్మాయిలు ఒక కథల పుస్తకంలోని కథలను ఆమె చేత పదే పదే చదివించుకుంటున్నారు. ఆమె స్వరంలోని మాధుర్యమే అందుకు కారణం అనుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడాలని అమ్మకు కూడా ఆసక్తి కలిగినట్టు నా కనిపించింది. అయితే ఎప్పుడూ ఒంటరిగా ఉండే ఆమెకు కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి మొహమాటం. అందువల్ల మాట్లాడ లేకపోయింది.

రైలు మరొక జంక్షన్లో ఆగింది. కొంతమంది బ్రిటీష్ వాళ్ళు బహుశా సైనికాధికారికి సంబంధించిన వాళ్లు రైల్లో ఎక్కడానికి ప్రయత్నించసాగారు. వాళ్లు మా కంపార్టుమెంటు ముందు చాలాసార్లు అటూ ఇటూ నడిచారు. అమ్మ భయంతో బిగుసుకుపోయింది. నిజం చెప్పాలంటే నాకూ భయంగానే ఉంది.

రైలు కదల్డానికి కొద్దిసేపటి ముందు ఒక రైల్వే అధికారి లోపలికి వచ్చి పేర్లు ఉన్న రెండు చీటీలను మా రెండు బెర్తులకు అంటించి ‘దొ       రలు ఈ బెర్తులను ముందే రిజర్వు చేసు కున్నారు మీరు ఖాళీ చేసి మరెక్కడయినా స్థలం వెదుక్కోండి’ అన్నాడు. నేను వెంటనే లేచి నిలబడ్డాను. కానీ ఆ అమ్మాయి హిందీలో ‘లేదు లేదు ఇక్కణ్ణించి ఎవరూ కదలరు’ అంది. ఆ మనిషి ‘ఖాళీ చెయ్యాల్సిందే’నన్నాడు గట్టిగా. ఆ అమ్మాయి కదలకపోవడంతో బ్రిటీష్ వ్యక్తి అయిన స్టేషన్ మాస్టర్ ను పిలిచాడు. స్టేషన్ మాస్టర్ వచ్చి ‘క్షమించాలి’ అంటూ పోర్టర్ను పిలిచాడు. లగేజీ తీసెయ్యడానికి, ఆ అమ్మాయి కళ్లు ఎర్రబడ్డాయి. నావైపు చూస్తూ ‘కదలవద్దు. కూచున్న చోటు నుంచి లేవకండి’ అంటూ స్టేషన్ మాస్టర్తో ఇంగ్లీషులో ‘అబద్ధం ఈ బెర్తులు రిజర్వు చేయబడ్డవి కాదు’ అంటూ పేర్లు ఉన్న ఆ చీటీలని చించి ప్లాట్ ఫాంపైకి విసిరేసింది. అప్పుడే యూనిఫాంలో ఉన్న ఇంగ్లీషు వ్యక్తి లోపలికి రాబోతూ ఆమె మాటలు విన్నాడు. ఆమె చేసిన పనిని గమనించాడు. ఏమీ మాట్లాడకుండా  స్టేషన్ మాస్టర్ భుజం మీద చేత్తో తడుతూ పక్కకు తీసుకువెళ్లాడు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ ఒ        క అదనపు బోగీని తగిలించుకుని రైలు ఆలస్యంగా బయలుదేరింది. అవమానాన్ని దాచుకోవడానికి నేను కిటికీ లోంచి బయటకు చూస్తున్నట్టు నటించాను.

రైలు కాన్పూర్ లో ఆగింది. అమ్మాయి తన సామాను సర్దిపెట్టుకుంది. ఆమెకు సాయం చెయ్యడానికి వచ్చిన నౌకరు సామాను దించుతుంటే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయితో ఇగ ఆగలేక అడిగింది అమ్మ.

‘నీ పేరేమిటమ్మా?’ ఆ అమ్మాయి ‘కళ్యాణి’ అంది.

నేను అమ్మా ఉలిక్కి పడ్డాం. ‘మీ నాన్నగారు’ అంది అమ్మ. ఆయన ఇక్కడ వైద్యుడు. పేరు శంబునాథ్ బాబు అంటూ ఆమె రైలు దిగి వెళ్ళిపోయింది.

ఉపసంహారం

మేనమామ ఆంక్షలను ధిక్కరించి, అమ్మ అభ్యంతరాలను లెక్కచేయకుండా నేను కాన్పూరుకు వెళ్ళాను. కళ్యాణిని ఆమె తండ్రినీ కలిశాను. చేతులు జోడించి నమస్కరించాను. నా మాటలు శంబునాథ్ బాబును కదిలించాయి కాని కళ్యాణి మాత్రం పెళ్ళి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. నేను ఎందుకు అని అడిగితే మాతృసేవ అన్నది. మా పెళ్ళి విఫలం అయిన తర్వాత ఆమె తన జీవితాన్ని ఆడపిల్లలకు చదువు చెప్పడానికి అంకితం చెయ్యాలని నిర్ణయించుకుందని అదే ఆమె మాతృభూమికి చెయ్యాలనుకుంటున్న సేవ అని తర్వాత నాకు తెలిసింది.

నేను ఆశ వదులుకోలేదు. నా హృదయాన్ని ఆక్రమించిన సంగీతం ఎప్పటికీ అలాగే నిలిచిపోయింది. తెలియని అలౌకిక ప్రపంచం నుంచి వచ్చే వేణునాదంలా అది నన్ను తన వెంట లాక్కుపోతున్నది. ఆ రాత్రి చీకట్లో ‘ఇక్కడి ఈ కంపార్టుమెంటంలో ఖాళీ ఉన్నది’ అన్న ధ్వని నా జీవితానికి పల్లవిగా మారింది. అప్పుడు నా వయస్సు ఇరవై మూడు. ఇప్పుడు ఇరవై యేడు. అయినా నేను నా ఆశను వదులుకోలేదు. కానీ మేనమామని వదిలేసు కున్నాను. ఏకైక సంతానాన్ని అయినందువల్ల అమ్మ నన్ను వదిలేసుకోలేకపోయింది. నేనామెకోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను. ఓ అపరిచిత యువతీ నా హృదయం చెప్తున్నది నేను నీ వాణ్ణి మాత్రమే అని, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోలేను. కానీ ఇప్పుడు నా లక్ష్యం ఏమిటో తెలుసుకున్న అదృష్టవంతుడిని.

 

 

అపరిచిత

బెంగాలీమూలం : రవీంద్రనాథ్ టాగూరు, తెలుగు : చింతపట్ల సుదర్శన్

1916లో టాగూర్ రాసిన ‘అపరిచిత’ ఆధునిక స్త్రీ ఆలోచనా విధానాన్ని, స్వాభిమానాన్ని తెలియజేస్తుంది. పురుష దురహంకారాన్ని, నిరసించే ఈ కథలో అనేక కొత్త కోణాల్ని ఆవిష్కరించాడు టాగూర్.

వివాహ సమయంలో వధువు తండ్రి శంబునాథ్ తను యిచ్చే బంగారాన్ని వరుని మేనమామ తూకం వేయించడం అవమానంగా భావించి, వివాహాన్ని రద్దుచేసి మగపెళ్ళివారిని వెళ్ళిపొమ్మనడం విప్లవాత్మకమైన సంఘటన.

వివాహం రద్దయిన తర్వాత వరుడు అనుపమ్, వధువు కళ్యాణి రైల్లో కలుస్తారు. అనుపమ్ ఆమెను చూసి ఉండలేదు కాబట్టి గుర్తుపట్టడు. రైల్లో రిజర్వేషన్ లేని సీట్లకు చీటీలు తగిలించడం సహించ లేని కళ్యాణి వాటిని చంపి ముక్కలు చేసి విసిరేస్తుంది. బ్రిటీష్ ఇండియాలో ఒక భారతీయ స్త్రీ సాహసం ఇది.

ఆమె ఎవరో తెలిసిన తర్వాత అనుపమ్ తమ తప్పు ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటానంటాడు కాని కళ్యాణి స్త్రీ విద్యకు, స్త్రీల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేస్తానని తిరస్కరిస్తుంది.

వంద సంవత్సరాల క్రిందటిదైనా ఈ కథాంశం అత్యంత ఆధునికం. దేశభక్తికి, ధైర్యానికి, ఉదాత్తతకు, స్త్రీ స్వేచ్ఛకు ఉదాహరణ ఈ అపరిచిత.

You may also like

Leave a Comment