Home ఇంద్రధనుస్సు అస్తమించిన అగ్రశ్రేణి పండితులు

అస్తమించిన అగ్రశ్రేణి పండితులు

by Acharya Phanindra

ఆచార్య రవ్వా శ్రీహరి గారిని నేను తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు, కలుసుకొని నా తొలి గ్రంథం “ముకుంద శతకం” ప్రతిని అందజేసాను. రవ్వా శ్రీహరి గారు, మా మాతామహులు శ్రీమాన్ ఆచి వేంకట నృసింహాచార్యులు గారు దాదాపు 90 ఏళ్ళ క్రితం చదువుకొన్న సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలోనే – 60 ఏళ్ళ క్రితం చదువుకొన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్థులైన ఈ ఇరువురే సీతారాంబాగ్ స్వామి వారైన శఠకోప రామానుజాచార్యులు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇది శ్రీహరి గారు నాకు స్వయంగా చెప్పిన విషయం.

రవ్వా శ్రీహరి గారు 1943 సెప్టెంబరు 12 వ తేదీ నాడు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా (ఇప్పటి
యాదాద్రి భువనగిరి జిల్లా) లోని వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న నాడే తల్లి మరణించడంతో, ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. వారు తొలుత 1967 లో
ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా  పనిచేసారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించారు.
సంస్కృతాంధ్ర భాషలలో అగ్రశ్రేణి పండితులైన శ్రీహరి గారితో తరువాతి కాలంలో .. చాల సభలలో కలిసిన సౌభాగ్యం నాది. మా యువభారతి సభలలో కూడ వారు చాల ప్రసంగాలు చేసారు.
అసమగ్రంగా మిగిలిన మన తెలుగు నిఘంటువులను సమగ్రం చేసే ప్రయత్నంగా నిర్మించిన “శ్రీహరి నిఘంటువు” వారు తెలుగు భాషకు చేసిన ఉత్కృష్టమైన సేవ.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడ బాధ్యతలను నిర్వహించిన శ్రీహరి గారు ఆచార్య సి. నారాయణరెడ్డి గారి “ప్రపంచ పదులు” కృతిని సంస్కృతంలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. గుర్రం జాషువా గారి “గబ్బిలం”, “ఫిరదౌసి” కావ్యాలను కూడ సంస్కృతంలోకి అనువదించారు. వారు ఎంతటి సంస్కృత పండితులో, అంతగా .. అనేక తెలుగు మాండలికాలలో విశిష్టమైన కృషి చేసిన మహా భాషా శాస్త్రవేత్త. ఐదారేళ్ళ క్రితం తెలుగు అకాడమీలో నేను తెలంగాణ భాషా సాహిత్యాలపై చేసిన ప్రసంగాన్ని వారు ప్రశంసించడం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలుగజేచేసింది.
ఆచార్య శ్రీహరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి “మహామహోపాధ్యాయ” బిరుదాన్ని స్వీకరించిన ఘనులు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశారు.
ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో తెలుగులో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు,
నల్లగొండ జిల్లా ప్రజలభాష వంటి విమర్శ గ్రంథాలు మరియు సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయీ వ్యాఖ్యానం వంటి వ్యాకరణ గ్రంథాలు వీరి ఇతర ప్రధాన రచనలు.
ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంతటి పండితులో, అంతకు మించిన సహృదయులు. నన్ను పుత్ర సమానునిగా ఆదరించేవారు.
79 ఏళ్ల వయస్సులో రవ్వా శ్రీహరి గారు గుండెపోటుతో హైదరాబాదులో 2023, ఏప్రిల్ 21నాడు పరమపదించారు.
ఆ మహనీయుని మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు.

You may also like

Leave a Comment