Home ఇంట‌ర్వ్యూలు అస్తిత్వం రూపొందాలంటే సాహిత్యం అవసరం- నందిని సిధారెడ్డి

అస్తిత్వం రూపొందాలంటే సాహిత్యం అవసరం- నందిని సిధారెడ్డి

by Aruna Dhulipala

తెలంగాణ ఉద్యమకారులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి సాహిత్య అకాడెమీ అధ్యక్షులు, ‘నంది’ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డా. నందిని సిధారెడ్డి గారితో మయూఖ ముఖాముఖి
                                    – అరుణ ధూళిపాళ

“నా తొవ్వ, నా ప్రయాణం, నా సంపద కవిత్వమే” అని తెలంగాణ భాషా వికాసం కోసం నిరంతరం తపించి, రాష్ట్రసాధన కోసం ప్రజలను చైతన్య బాటలో నడిపించిన పల్లెతల్లి ముద్దుబిడ్డ డా. నందిని సిధారెడ్డి గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్.

1. “బందారం కనిపెంచిన మందారం”గా ప్రసిద్ధి పొందిన మీరు మీ జననం, ఆ ఊరిలో మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలపండి.
జ :-    నా మొదటి కవితా సంకలనం ‘భూమిస్వప్నం’ పుస్తకానికి ముందుమాట రాస్తూ దేవిప్రియ ఈ మాట అన్నారు. నేను పూర్వపు మెదక్ జిల్లాలోని బందారం అనే గ్రామంలో జన్మించాను. మా అవ్వ (అమ్మ) రత్నవ్వ. మా బాపు నర్రా బాల సిద్ధారెడ్డి. వాళ్లిద్దరూ వ్యవసాయ దారులు. ఊళ్ళో జానపద, సాంస్కృతిక వాతావరణం బాగా ఉండేది. మా బాపుకు తాను చదువుకోలేదు కాబట్టి తన పిల్లల్ని బాగా చదివించాలని కోరిక. అందుకే మమ్మల్ని బాయి దగ్గరికి పోనిచ్చేవాడు కాదు. ఒకసారి నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు నేను బాయి దగ్గరికి పోయి ఇంటికి ఆలస్యంగా వచ్చానని నన్ను తిట్టడమే కాకుండా స్కూల్ కి వచ్చి సార్ ను కూడా మందలించాడు. సార్ నన్ను కొట్టిండు (నవ్వుతూ). నాకు కూడా చదువుకోవడం చాలా ఇష్టంగా ఉండేది. మా ఇంటి ముందు మా బాపు దగ్గరికి వాళ్ళూ వీళ్ళూ రావడం పంచాయతీలు చెప్పడం అట్లా ఒక పురుష ప్రపంచం వుండేది. ఇంటి వెనుక మా అమ్మ దగ్గరికి సమస్యలు, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే స్త్రీల ప్రపంచం ఉండేది. ఎన్నో సమస్యలను తీర్చే మా బాపు అప్పుడప్పుడు తాగి అమ్మను కొట్టేవాడు. అందుకే ఆమెకు కూడా అది ఒక ఊరట. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుండేవాడిని. చదువుకునే వాళ్లకు నిద్ర కూడా పట్టదని, కష్టం ఎక్కువని చెప్పుకునేవారు. ఈ కష్టమేందో నేనూ పడాలి అనుకునేవాడిని. మా ఊళ్ళో 5వ తరగతి వరకు మాత్రమే ఉండేది. అక్కడ నేను 4వ తరగతి దాకా చదువుకున్నాను.

2. తరువాత మీ విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది?
జ :-    మా ఊళ్ళో సత్యనారాయణ అని గజ్వేల్ దగ్గర వర్గల్ లో హెడ్మాస్టర్ గా పని చేసేవాడు. వాళ్ళ నాన్న రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మా నాన్నకు గైడ్ గా ఉండేవాడు. సలహాలు, సూచనలు ఇచ్చి మా నాన్నకు అక్షరాలు నేర్పించినవాడు. ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ ఇంటిని, మామిడితోటను చూసుకోవడానికి, వాటి డబ్బులను వసూల్ చేసుకోవడానికి ఎండాకాలం వస్తుండేవాడు. మా నాన్న ముందు జాగ్రత్తగా తన స్కూల్లో నన్ను చేర్చుకోమని అడిగాడు. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలడిగి నన్ను 5వ తరగతి చదవకుండానే 6వ తరగతిలో చేర్చుకుంటానని నన్ను వర్గల్ తీసుకుపోయిండు. అప్పటివరకు నేను మా అవ్వ, బాపులను విడిచి ఎక్కడికీ వెళ్ళలేదు. నెలరోజులకే ఉండలేక పోయాను. జ్వరం వచ్చింది. మా బాపుకు ఉత్తరం రాద్దామనుకొని 5 పైసల కార్డు సంపాదించి, స్కూల్లోనే హిందీ క్లాసులో ఉత్తరం రాస్తుంటే సార్ గమనించి ఉత్తరం చదివిండు. గమ్మత్తు ఏంటంటే అడ్రెస్ సత్యనారాయణ సార్ దే రాసిన. అప్పుడాయన ఆ అడ్రెస్ కొట్టేయించి మా బాపు అడ్రెస్ కి ఉత్తరం రాయిస్తే మా అమ్మ చూసి శోకాలు పెట్టి ఏడ్చిందట. మా బాపు మనిషిని తోలించిండు. నేను ఊరికి చేరుకున్న. 7వ తరగతి మా ఊరుకు దూరంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్కటూరులో చదువుకున్నా. 5 కి.మీ. దూరంలో ఉన్న దుద్దెడలో స్కూల్ వున్నా మా బాపు చేర్పించలేదు. ఆయన ఉద్దేశ్యంలో పిల్లలు సరిగ్గా చదవాలంటే రోడ్డు, హోటలు లేని ఊరు కావాలి. వాటివల్ల పిల్లలు తొందరగా చెడిపోతారని ఆయన భావన. వెల్కటూరులో అవి లేవు కాబట్టి అక్కడ చేర్పించాడు. మా బాపును చూసి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇంకో 20 మంది వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించారు. అట్లా అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నా.

3. అనేక వేదికలపైన, మీ రచనల్లో చాలాచోట్ల మీ నాన్నగారి గురించి ప్రస్తావిస్తూనే వుంటారు. మీ జీవన గమనంలో ఆయన ప్రభావం ఎటువంటిది?
జ :-     మా బాపు నా హీరో. చదువుకోలేదు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడు. ప్రతీ దాంట్లో జోక్యం చేసుకొని ఊరు బాగు పడాలనే ప్రయత్నం చేస్తుండేవాడు. రెండవది నన్ను చదువుకొమ్మని నాలో ఆసక్తిని కలిగించిందీ ఆయనే. ఆయన ఎక్కడ ఏ వార్త విన్నా ఒక నోట్ బుక్ లో రాసుకునేవాడు. అంతేకాక దానికింద తన భావాన్ని కామెంట్ గా రాసుకునేవాడు. అది బాగా ఇష్టంగా చదివేవాణ్ణి. కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో గ్రామ రక్షక దళాలలో ఆయన పాత్ర ఉంది. దాదాపు పది ఊళ్ళల్లో రజాకార్లు రాకుండా అడ్డుకోవడానికి దళాలు ఏర్పాటుచేసి రాత్రిపూట కావలి కాసేవాడు. మార్క్సిస్ట్ పార్టీతో కూడా ఆయనకు సంబంధం ఉంది. మంచి గొంతు కానప్పటికీ మావూరి పోలీసు పటేల్ మీదనో, ఊరి సర్పంచ్ మీదనో పాటలు కట్టి పాడేవాడు. ఊళ్ళో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వేదికల మీద మాట్లాడేవాడు. స్కూల్ విద్యా కమిటీ సభ్యునిగా ఉండేవాడు. ఇవన్నీ నాకు ఆకర్షణీయంగా ఉండేవి. పాటల పట్ల నాకు ఆసక్తి కలగడానికి ఆయన ఒక కారణం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి చల్లారిన రోజులు. కారణం తెలియదు కానీ ప్రభుత్వం 250 పుస్తకాలను పంపింది. దాంతో మా ఊళ్ళో ఒక లైబ్రరీ ఏర్పాటయింది. ఆ పుస్తకాలు మొత్తం నేను చదివాను. అప్పుడు మా బాపు “చదువుడు గొప్ప కాదురా! రాసుడు గొప్ప” అన్నాడు. అది నాకు గొప్ప ఇన్స్పిరేషన్. అట్లా చదవడం, రాయడం, పాటలు, ధైర్యంగా ప్రజల కోసం పని చేయడం వీటన్నిటి పట్ల ఆసక్తికి ఆయనే కారణం. నాలో ఒక ఉద్యమకారుడున్నాడన్నా, పాట కారుడున్నాడన్నా, రచయిత ఉన్నాడన్నా ఆయన ఆదర్శమే. అందరు మంచిగుండాలన్నదే ఆయన కోరిక. అయితే నాకు ఆయనలో నచ్చని గుణం ఒకటున్నది. సాయంత్రం కల్లు తాగినప్పుడు అప్పుడప్పుడు అమ్మను కొట్టేవాడు. ఈ విషయంలో చాలా కోపం వచ్చేది. మా బాపు 8 నెలల వయసులో తల్లిని, మూడు, నాలుగు  ఏండ్లకే తండ్రిని, 5 ఏండ్లకు తనను చూసుకునే బాపమ్మను కోల్పోయాడు. పెంచిన పెద్దన్న జాగా, పాలు ఉన్నప్పటికీ చిన్న జీతగానిలా పనులు చేయించడం, పెద్దమ్మ, వదిన తనను తేడాగా చూడడం, సరియైన తిండి కూడా పెట్టకపోవడం చేశారట. ఆ కష్టమంతా బాయి దగ్గర ఉన్న జీతగాండ్లతో చెప్పుకొని బాధ పడేవాడట. అట్లా ఒకరిద్దరు జీతగాండ్లతో కలిసి పల్లీలు కాల్చుకొని, కుండలో పెట్టుకొని, భూమిలో పాతి, ఆకలైనప్పుడు తినేవారట. చాలా దుర్భర జీవితాన్ని అనుభవించాడు (కన్నీళ్లు పెట్టుకుంటూ). ఇంత బాధ నుండి ధైర్యంగా బయటపడి, తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకున్నాడు. పది ఊళ్లకు నాయకుడు. ఏ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా బాపును తీసుకుపోయేవారు. మేము పెరుగుతున్న దశలో ఫలానా ఆయన కొడుకని మాకు మంచి ఆదరణ ఉండేది. చొచ్చుకుపోయే గుణం, పదిమందికి మంచి చేయాలన్న మానవీయ కోణం ఆయనలో ఉండేది. చిన్నతనంలో ఆయన కష్టాన్ని చూసినవాళ్ళు అప్పుడప్పుడు మాకు చెప్పి బాధపడేవాళ్ళు. ఈ అనేక విషయాల్లో ఆయన నాకు ఆదర్శవంతుడు.

4. మీరు తెలుగుభాషానురక్తులు కావడానికి, కవిత్వం పట్ల ఆసక్తికి ఏ విధమైన సాహిత్య వాతావరణం తోడ్పడింది?
జ :-  మా ఇంట్లో సాహిత్యానురక్తి ఏమాత్రం లేదు. కానీ పరోక్షంగా ఎక్కడో కవికి సంబంధించిన వాతావరణం ఉండింది. నాకు తెలుగు, లెక్కలు అంటే చాలా ఇష్టంగా ఉండేది. గణితంలో చాలా గొప్పవాడిని అవుతానని మా సార్లు అంటుండేవాళ్ళు. 4, 5 తరగతులలో “అరుగులన్నిటి యందు ఏ అరుగు మేలు?” అనే గేయం ఉండేది. ఏడు చేపల కథ, శిబి చక్రవర్తి కథ వీటివల్ల కొంత ఇన్స్పిరేషన్ పొందాను. 7వ తరగతిలో కంకంటి పాపరాజు రచించిన ‘ఉత్తర రామాయణం’లోని కరుణరసంతో కూడిన పద్యాల వల్ల మనుషుల్లో ఉండాల్సిన హృదయపు తడి అర్థమైంది. మా ఊళ్ళో జానపద సంస్కృతి ఉండేది. చేను దున్నినప్పుడు, నాట్లేసినప్పుడు, కోత కోసేటప్పుడు, మోట కొట్టేటప్పుడు, పీర్ల పండుగ సమయంలో నిప్పుల మీద నడుస్తున్నప్పుడు, బతుకమ్మ, బోనాలు మొదలైన పండుగలప్పుడు నిరంతరం అద్భుతమైన పాటలు పాడేవాళ్ళు. ఇవేకాక ఊళ్ళో ఒగ్గు కథ, చిందు భాగోతాలు, శారద కాండ్రు ఇలాంటి వాళ్ళందరూ పౌరాణిక గాథలు, వీరగాథలు చెప్పేవాళ్ళు. ఈ వాతావరణమంతా ఉన్నా ఒక రూపం నాలో ఏర్పడలేదు. 9వ తరగతిలో మా సీనియర్ అంజిరెడ్డి మా తెలుగు సార్ చారికి పద్యాలు రాసి చూపిస్తే అందరూ మెచ్చుకునేవారు. పద్యాలు రాస్తే ఇంత పేరొస్తుందా? అనుకునేవాణ్ణి (నవ్వుతూ). అప్పటికే కరుణశ్రీ పద్యాలు చాలా ఇష్టంగా ఉండేవి. ఛందస్సు తెలియకపోయినా ఉత్పలమాల అక్షరాలను బట్టి పద్యం రాసి సార్ కు చూపిస్తే పద్యం రాయాల్సిన పధ్ధతి అది కాదని చెప్పారు. ఆయనకు బదిలీ అయి అష్టకాల నరసింహ శర్మ గారు మాకు తెలుగు టీచరుగా రావడం నాకు టర్నింగ్ పాయింట్. ఆయన రావడంతోనే ఆయన రాసిన ‘శిథిల విపంచి’ అని ఖండికలు ఉన్న పుస్తకాన్ని విద్యార్థులకు చారణాకు ఇచ్చారు. అవన్నీ కంఠస్థం చేశాను. ఆయన క్లాసులో పద్యాలు రాసుకుంటుంటే కవిసమ్మేళనం అనేది ఒకటుంటుందని తెలిసింది. ఆయన మాకు “నీ జీవితోద్దేశ్య మేమిటి?” అని అంశంతో వ్యాసరచన పోటీ పెట్టారు. ఎమ్. ఎల్. ఏ. కావాలని రాశాను. వెల్కటూరుకు వచ్చిన వల్లూరి బసవరాజు అనే మంత్రి వచ్చినప్పుడు కాన్వాయ్ తో ఆయనకు కలిగిన మర్యాద, పిల్లలకు స్కూల్ బంద్ చేయించి ఆయనకు స్వాగతం చెప్పించడం వీటితో అదే గొప్ప అనుకున్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్  వచ్చింది. బహుమతిగా నాకు మరిపెడగ బలరామాచారి రాసిన ‘మేనకా విశ్వామిత్రం’ పుస్తకం ఇచ్చారు. మా స్నేహితునికి సెకండ్ ప్రైజ్ గా ‘సూరదాసు పదాలు’ ఇచ్చారు.  నాకిచ్చిన పుస్తకములో పద్యాలు, గేయాలు ఉంటాయి. అదొక ఇరవైసార్లు చదివి ఉంటాను. అది నన్ను బాగా ఆకర్షించింది. దీనివల్ల సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఇక ఆగలేదు. అదే సమయంలో పద్యాలు రాయి. కానీ వచన కవిత్వం కూడా ఉంటుందని నరసింహరామశర్మ చెప్పారు. ఉమాపతి పద్మనాభ శర్మ, రుక్మాభట్ల కృష్ణమూర్తి, విఠాల శ్రీకాంత శర్మ, జాలపల్లి చంద్రారెడ్డి ఈ నలుగురు కలిసి రాసిన ‘ఋతచేతన’ పుస్తకాన్ని ఇచ్చారు. అప్పటినుండి వచన కవిత్వం రాయడం ప్రారంభించాను. 9వ తరగతిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆక్టివ్ గా ఉన్నాను. పదవతరగతిలో ఉన్నప్పుడు చలం ఆనందం, విషాదం అనే రెండు పుస్తకాలు చదివాను. తాత్వికత వల్ల అప్పుడు అర్థం కాలేదు. శరత్ సాహిత్యాన్ని కూడా చదివాను. తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన ‘మా ఊరి కథలు’ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇట్లా ఎన్నో పుస్తకాలు, నరసింహరామశర్మ గారి ప్రోత్సాహం ఇవి నా ఆలోచనలను కవిత్వం వైపు తీసుకు పోయాయి.

5. ఎమ్ ఫిల్. పరిశోధనాంశంగా “ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు” అని ప్రాచీన కావ్యాలలోని ఉదాహరణలను ఉటంకిస్తూ అనేక విషయాలను విశ్లేషించారు కదా! అటువంటి వైవిధ్య అంశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
జ :-   నేను మాథ్స్ పూర్తి చేసి టీచరుగా చేయాలనుకున్నాను. కానీ డిగ్రీ సెకండ్ ఇయర్ నుండి పూర్తిగా కవిత్వం తప్ప మరేమీ లేదన్నంతగా  మునిగిపోయిన. మా గురువు చుక్కా రామయ్య ఎంత చెప్పినా వినలేదు. డిగ్రీలో ఫెయిలయ్యాను. ఎమ్. ఏ తెలుగు చేయడానికి డిగ్రీలో స్పెషల్ తెలుగుతో ఎక్స్ టర్నల్ చేసే అవకాశం ఉంది. అది చేసి ఎకనామిక్స్, తెలుగు, పొలిటికల్ సైన్స్ తో డిగ్రీ పూర్తి చేసి ఎమ్.ఏ తెలుగులో చేరాను. ఇక్కడ సి. నారాయణరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. 9వ తరగతిలో ఉన్నప్పుడు (1969) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో స్కూళ్ళు బంద్ చేశారు. మా ఇంట్లో రేడియో లేదు కాబట్టి హైదరాబాద్ లో జరిగే వార్తలను తెలుసుకోవడానికి అవుసుల రామాచారి ఇంటికి ప్రతిరోజూ వెళ్ళేవాడిని. అది గమనించిన మా బాపు 3 నెలల తరువాత ఒక ఎద్దును అమ్మి ఆ డబ్బుతో రేడియో తీసుకువచ్చారు. ఆయనకు కూడా రేడియో ఇష్టమే. మా వాడకు మొదటి రేడియో అది. ఆ రోజు రేడియో వింటున్నప్పుడు మఖ్డుమ్ మొహియొద్దీన్ అనే ఉర్దూ కవి చనిపోయాడని వార్త తెలిసింది. ఆయన శ్రద్ధాంజలి కార్యక్రమం ప్రసారమైంది. అందులో సినారె గారు ఆయనను కీర్తిస్తూ “నూరు శరత్తులు నోరారా పాడవలసిన బుల్బులీ, నూరు వసంతాలు దోర వెన్నెల కురియవలసిన జాబిలీ, వెళ్లిపోయావా నేస్తం ప్యారే మఖ్డుమ్, మేరే హమ్ దమ్” అని కవిత చదివారు. కవిత్వం ఇలా చదవడం నేను ఎప్పుడూ వినలేదు.  ఆయన చదివే విధానము, కవిత రెండూ నన్ను ఆకట్టుకుని సినారె గారి మీద అభిమానం ఏర్పడింది.నరసింహరామశర్మ గారు ‘యువభారతి’ సంస్థను పరిచయం చేశారు. అందులో ప్రచురింపబడిన సినారె గారి ‘మందార మకరందాలు’ చదివాను. ఆయన మీద మరింత గౌరవం పెరిగి ఆయన దగ్గర చదువుకోవాలన్న కోరిక పెరిగింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు తెచ్చిన ‘మంటలు-మానవుడు’ చదివాను. నా కోరిక నెరవేరి పీజీలో ఆయన నాకు గురువయ్యారు. ఆయన మాకు ప్రాచీన కవిత్వంలో ‘విజయ విలాసం’, ‘కళాపూర్ణోదయం’, ఆధునిక కవిత్వంలో ఎంకిపాటలు, మహా ప్రస్థానం, జాషువా కవిత్వం చెప్పారు. నా సీనియర్ విద్యార్థులను చూసి నాకు కూడా డాక్టర్ అనిపించుకోవాలని కోరిక కలిగింది. దానికోసం వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. గుంటూరు శేషేంద్రశర్మ గారు ‘మండే సూర్యుడు’, కె. శివారెడ్డి గారు ‘రక్తం సూర్యుడు’ అని రాశారు. 1970 – 75 మధ్య విప్లవ కవిత్వం వచ్చిన సమయంలో సూర్యుని మీద రచనలు బాగా వచ్చాయి. నేను కూడా “సూర్యుడు నాడు దేవత, నేడు విప్లవ ప్రతీక” అని వ్యాసం రాశాను. అది చాలామందికి నచ్చింది. శేషేంద్రశర్మ గారిని, శివారెడ్డి గారిని తులనాత్మకంగా పరిశీలిస్తూ ‘ఇద్దరు కవితా సూర్యులు’ అని నేను రాసిన వ్యాసం ‘భారతి’ లో అచ్చయ్యింది. నారాయణరెడ్డి గారు ‘ఉదయం నా హృదయం’ అని రాశారు. నేను ఎంచుకున్న అంశాలలో ఎవరూ ఇంతవరకు చేయని అంశం సూర్యుని పైన చేయుమని చెప్పిన ఆయన సూచనను అనుసరించి చేశాను. గైడ్ కూడా ఆయనే. అట్లా1981లో నా ఎంఫిల్ పూర్తయింది.

ముఖాముఖి గ్రహీత అరుణదూూళిపాళ నందిని సిిధారెడ్డిగారితో

6. మీరు వెలువరించిన సిద్ధాంత గ్రంథం “ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత – అధివాస్తవికత” లో మీరు నిరూపించిన అంశాలేవి?
జ :-    ఎమ్ ఫిల్ అయిపోయాక జానపద సాహిత్యం మీద పి హెచ్ డి చేయాలన్న ఆసక్తి ఉండింది. ఆర్ట్స్ కాలేజీ అంతా జానపద సాహిత్యం వెలుగుతున్న రోజులవి. రామరాజు గారిది జానపద సాహిత్యం కావడం, నేను పల్లీయుడిని కావడం, మెదక్ జిల్లా జానపద సాహిత్యంపై అంతవరకు ఎవరూ చేయకపోవడం వల్ల ఊరూరా తిరిగి సేకరించాలనుకున్నాను. లేదా “తెలంగాణ రైతాంగ పోరాట సాహిత్యం” గురించి చేద్దామనుకున్నా. అప్పటికే “తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల” మీద వరవరరావు గారు చేసి ఉండడంతో కవిత్వం మీద చేయాలనుకున్నా. సినారె గారు వద్దన్నారు. దాంతో ‘తెలుగు కవిత్వం – వాస్తవికత’ అనుకున్నా. దానికి పద సౌందర్యంతో పాటు ‘Realism’ తో పాటు ‘Surrealism’ కూడా చేయమని అధివాస్తవికత చేర్చారు సినారె గారు. దీనికి కూడా ఆయనే గైడ్. 1984లో పి హెచ్ డి పూర్తి అయినప్పటికీ హాస్టల్ సీటు పోతుందని 1986లో ఉద్యోగం వచ్చాక సబ్మిట్ చేశాను. అదే సంవత్సరంలో డాక్టరేట్ తీసుకున్నాను. వాస్తవికత లేకుండా కవిత్వం లేదనే విషయాన్ని దీంట్లో నిరూపించాను. చాలామంది కాల్పనికం అంటారు కానీ యథార్థం నుండి కల్పన పుడుతుంది. కల్పనాశక్తి లేనిదే ఎవరూ కవి కాలేరు. కల్పనకు బేస్ వాస్తవికత. అది లేనిది కవితా శక్తి లేదు. ఒక్క మన తెలుగు కవిత్వం అనే కాదు. ప్రపంచ కవిత్వం ఏదైనా దాంట్లో వాస్తవికత ఉన్నప్పుడే సహృదయుని చేరుతుంది. అధివాస్తవికత కూడా అప్పటివరకు ఎవరూ తీసుకోలేదు. ఎట్లా వస్తే అట్లా రాయడమే అధివాస్తవికత. దానికి ఎడిటింగ్ లేదు. అది కల్పన కావచ్చు. వాస్తవికత కావచ్చు. సమాజం ఒప్పుకుంటుందా లేదా సంబంధం లేదు. ఒకరకంగా స్వేచ్ఛా కవిత్వం. దానికైనా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ దీనికట్లా కాదు. మనసులో ఏది తోస్తే అది రాయడమే. ప్రధానంగా చెప్పాలంటే వాస్తవికతకు బేస్ భౌతిక జీవితం అయితే అధివాస్తవికతకు బేస్ మానసిక జీవితం. భౌతిక జీవితం సమాజాన్ని, కుటుంబాన్ని ఆశ్రయించి ఉంటుంది. కానీ మానసిక జీవితం భావ పరంపర లోంచి వచ్చేది. ఇవన్నీ దీంట్లో నిరూపించాను.

జ :-    నేను కవిత్వం పట్ల ఇష్టంతో అభిమానంతో నడుస్తున్న సమయంలో 1973 వచ్చేసరికి విప్లవ కవిత్వం వికాసదశలో ఉంది. నేను డిగ్రీ కళాశాలలో సెకండియర్  ఉన్నప్పుడు ‘నవ సాహితీ సంస్థ’ అని ఉండేది. దానికి గులాబీల మల్లారెడ్డి కన్వీనర్. సరిపల్లి కృష్ణారెడ్డి అడ్వైజర్. నెల, రెండు నెలలకొకసారి మీటింగులు జరిగేవి. విద్యార్థులను సమ సమాజం వైపు చైతన్యం చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఒకసారి అక్కడ జరిగిన కవిసమ్మేళనంలో వేదిక మీద వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కవిత చదివాను. దానికి కూడా ఒక ప్రేరణ ఉంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చివరలో నేను సిద్దిపేట శాఖా గ్రంథాలయానికి తరచూ వెళ్ళేవాడిని. శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, ఆరుద్ర ‘వెన్నెల వేసవి’ లాంటి పుస్తకాలు చదివాను. నవంబర్ 14 నెహ్రూ జయంతి సందర్భంగా లైబ్రరీ  వారోత్సవాలు చేస్తారు. అక్కడ జరిగిన కవిసమ్మేళనంలో మహమూద్ పాషా పరిచయం అయ్యాడు. నా భావజాలాన్ని గ్రహించి, అప్పటికే తీవ్రమైన కవిత్వం రాస్తున్న భగవంత్ రెడ్డిని పరిచయం చేయించాడు. ఆయన ద్వారా దిగంబర కవుల గురించి తెలిసింది. ఈ నేపథ్యంలో విప్లవ కవిత్వంతో పరిచయం ఏర్పడింది. మల్లారెడ్డి ఫైనలియర్ అయిపోయి నేను ఫైనల్ కు రావడంతో ఆ సంస్థకు నేను కన్వీనర్ ని అయ్యాను. సరిపల్లి కృష్ణారెడ్డికి విప్లవోద్యమాల గురించి, విప్లవ కవిత్వం గురించి బాగా తెలుసు. ఆయనతో చర్చల్లో వాటికి సంబంధించిన అవగాహన బాగా ఏర్పడింది.
         ఈలోపు మల్లారెడ్డి ‘గులాబీ’ అనే పత్రికను ప్రారంభించాడు. కవిత్వ ఎడిటింగ్ బాధ్యత నాకు అప్పగించాడు. ఆ టైమ్ లోనే ‘దివిటీ’ పుస్తకం వేశాము. కృష్ణారెడ్డి నాకు విప్లవ భావాలున్న భూపాల్ ను పరిచయం చేయించాడు. మా బాపుకు ఆయనను పరిచయం చేయమన్నాడు. మా బాపుకు కూడా ఇష్టమే కాబట్టి భూపాల్ ను సైకిల్ మీద ఎక్కించుకొని పది ఊళ్ళు తిప్పాడు. కానీ తర్వాత ఆయన నక్సలైట్ అని తెలిసింది. ఎమర్జెన్సీలో గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో ఆయన మరణించాడు. దాంతో జాగ్రత్త పడ్డాను. నవ సాహితి, సరిపల్లి కృష్ణారెడ్డి, భూపాల్ వీళ్ళ ద్వారా కొంత, కాలేజీలో ఉన్న వాతావరణం వల్ల విప్లవం ఎంత ప్రభావితం చేసిందో హైదరాబాద్ కు వచ్చిన తరువాత సినారె, కె. శివారెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ వీళ్ళ నుండి కవిత్వం పట్ల అంతే ప్రభావితుడనయ్యాను. కవిగా ఉండాలంటే విప్లవోద్యమం వైపు ఇంతకన్నా ఎక్కువ వెళ్లొద్దు అని అర్థమైంది.

8. ఆధునిక దృక్పథం కలిగిన తొలి మినీ కవితల సంకలనంగా, మినీ కవితా విప్లవంగా, ముగ్గురు కవులు పట్టిన దివిటిగా గుర్తింపు తెచ్చుకున్న ‘దివిటి’ మినీ కవితా సంకలనాన్ని గురించి తెలపండి.
జ :-   డిగ్రీ రెండవ సంవత్సరంలో కవిత్వం విరివిగా రాయడం, కవిత్వమే జీవితం, అదే నా మార్గం అన్న స్థాయికి వెళ్ళిపోయాను. వచన కవిత్వ రూపాలను చూస్తున్న ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘కొత్తకలాలు’ అనే శీర్షికతో చిన్న కవితలు వేసేవాళ్ళు. అది 1974లో కొత్త ట్రెండ్ అయింది. స్పేస్ ప్రాబ్లమ్ వల్ల చిన్న కవితలను రాసి పంపితే త్వరగా అచ్చయ్యేవి. కవిత్వ వ్యతిరేకి అనుకునే ‘ఈనాడు’ పత్రికలో కూడా ‘కొత్తపాళీ’ అనే శీర్షికతో రోజుకొక కవిత వేసేవాళ్ళు. అట్లా చాలామందికి అవకాశం వచ్చేది. అప్పుడు అందరం మినీ కవితలు రాయడం ప్రారంభించాం. ఆగం రెడ్డి, నేను ఇద్దరం సినిమాల మీద ఉన్న పిచ్చితో విరివిగా చూసేవాళ్ళం. ఆగం రెడ్డి స్నేహితుడు కర్ణాల బాలరాజు. నాకు ఎప్పటికైనా నారాయణరెడ్డి గారు లాగా సినిమా పాటలు రాయాలని కోరిక ఉండేది. రోజుకొక పాట రాసేవాణ్ణి. దాదాపు 200 పాటలను రాసిన. బాలరాజు నిజామాబాద్ లో ఏదో డ్యూటీలో చేరాడు. ఆయన ఉంటున్న ఇంటి ఓనర్ కొడుకు బెడిద రాజేశ్వర్. ఆయనకు కవిత్వం అంటే పిచ్చి. నేను బాలరాజుకు కందపద్యంలో ఉత్తరం రాస్తే అది చూసి ఆయన పద్యాలతో నాకు ఉత్తరం రాశాడు. అట్లా ఇద్దరం పద్యాలలో కలం స్నేహంతో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. రాజేశ్వర్ ఒకసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు కందుకూరి శ్రీరాములును పరిచయం చేయించాడు. నేను, కర్ణాల బాలరాజు, శ్రీరాములు మినీ కవితల్ని రాసేవాళ్ళం. ‘గులాబి’ పత్రికలో కూడా మినీ కవితలను వేసేవాణ్ణి. అంతవరకు మినీ కవితల పుస్తకం ఎవరూ వేయలేదు కాబట్టి మేము వేయాలనుకున్నాం. కుత్ బీ గూడలో మురళి పవర్ ప్రెస్ ఉండేది. గులాబి అక్కడే ప్రింట్ అయ్యేది. ‘దివిటి’ అనే పేరుతో మేం కూడా అక్కడే పుస్తకం వేసాం. ఆవిష్కరణకు కె. శివారెడ్డి సార్ ని పిలవాలని అనుకున్నాం. కాలేజీకి వెళ్లి ఆయన్ని కలిస్తే అన్నీ చూసుకుంటాడని రాజేశ్వర్ చెప్పాడు. శివారెడ్డి సార్ జాంబాగ్ వివేకవర్ధని కాలేజీలో లెక్చరర్ గా చేసేవాడు. ‘దివిటి’ పనుల కోసం హైదరాబాద్ చేరుకున్నాను. రెడ్డి హాస్టల్ లో ఉన్న చెట్టుకింద గద్దె మీద పడుకున్నాను. ఆయన కాలేజీకి వెళ్లి వచ్చే సమయానికి ఆయన్ని కలిశాను. ఆవిష్కరణకు సిద్దిపేటకు రమ్మని అడిగాను. ఆయన నన్ను చూసి ” అవన్నీ తర్వాత ముచ్చట. ముందు ఏమైనా తిందువు గానీ రా” అని తల్లి మనసుతో ఆదరించి హోటల్లో టిఫిన్ పెట్టించారు. “సిద్దిపేటకు దేవీప్రియను తీసుకొని వస్తానని అధ్యక్షుడుగా ఆయన ఉంటాడని, మిగతా ఏర్పాట్లు చేసుకోమని” మాటిచ్చారు. ఆ పుస్తకానికి ఉమాపతి పద్మనాభ శర్మ, బెడిద రాజేశ్వర్ ముందుమాటలు రాశారు. ముఖచిత్రం నేనే వేశాను. చుక్కారామయ్య గారిని వక్తగా పిలిచాం. మరొక వక్త మా తెలుగు లెక్చరర్ ముదిగొండ వీరభద్రయ్య గారు. మా ప్రిన్సిపాల్ ఛీఫ్ గెస్ట్ గా ఆవిష్కరణ జరిగింది. బెల్లంకొండ సంపత్ ఈమధ్య దీనిమీద ఒక వ్యాసం రాశాడు. అది ‘వివిధ’ పత్రికలో వచ్చింది. దాన్ని చూసి ఇద్దరు ముగ్గురు అంతకుముందు కూడా మినీ కవితా సంపుటి వుందేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. 1974 అక్టోబర్ కంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వచ్చి ఉంటే మేము ఒప్పుకుంటామని బహిరంగంగానే చెప్పాం. కానీ ఇంతవరకు ఎక్కడా తెలియలేదు. అందువల్ల ఇదే మొదటిది అని చెప్పొచ్చు. రాసింది ముగ్గురం. దివిటి మూడక్షరాలు. దానిపై త్రిమూర్తుల మినీ కవితా సంపుటి అని వేశాం.

9. ‘మంజీరా రచయితల సంఘం’ ఆవిర్భావానికి పునాది ఎప్పుడు పడింది?
జ :-   నాలో ఉద్యమ కార్యకర్త ఉన్నాడని చెప్పిన కదా! కార్యకర్తృత్వం కూడా నాకు ఇష్టం. సలంద్ర అనే కవి ప్రేరణతో ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్’ అని ఒకటి పెట్టినం. 1984 ఫిబ్రవరిలో నాకు మెదక్ లో జాబ్ వచ్చింది. నారాయణరెడ్డి గారి దగ్గరకు వెళ్ళి చెబితే “సాహిత్యం, కవిత్వం, కవులు అక్కడ లేరు కదా! ఎట్ల బతుకుతవ్?” అన్నారు. “సాహిత్యకారులను తయారు చేసుకుంటాను. కవుల మధ్యనే జీవిస్తాను సార్” అన్నాను (నవ్వుతూ). ఏలేశ్వరం నాగభూషణాచారి, ఆయన బావమరిది మోత్కూరు అశోక్ కుమార్ ఇంకా కొంతమందితో కవిత్వ వాతావరణాన్ని సృష్టించుకున్నాను. అక్కడ అప్పటికే TNGO సంఘ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, లియాఖత్ అలీఖాన్, శేషగిరి మొదలైన వాళ్లతో కలిసి ‘మెదక్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాం. 1985 తరువాత దాన్ని జిల్లాకు విస్తృతం చేయాలనే ప్రపోజల్ వచ్చింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న శాఖమూరి అప్పారావుతో నాకు పరిచయం ఉండింది. విరసంలో నేను చేరదలచుకోలేదు. మెదక్ జిల్లాలో ఒక సాహిత్య సంఘం పెట్టాలనే ఆలోచన, మెదక్ స్టడీ సర్కిల్ ను విస్తృతం చేయాలనే ఆలోచన వచ్చాయి.  నాకు అప్పటికే సంగారెడ్డిలో అమ్మంగి వేణుగోపాల్, సిద్దిపేటలో ఉన్న కొమురవెల్లి అంజయ్య మొదలైన వాళ్ళు తెలుసు. అప్పుడు మెదక్ లో రెండే రెండు సంఘాలున్నాయి. ఒకటి మెదక్ మండల సాహిత్య పరిషత్తు. ఇది అంతా వైదికులది.  రెండోది మెదక్ జిల్లా రచయితల సంఘం. ఇది అచ్చంగా వైష్ణవులదే. ఈ రెండూ సాంప్రదాయ కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చేవి. ఉమాపతి పద్మనాభ శర్మ వలన ఈ గ్రూపులో అప్పుడప్పుడు కథలు, వచన కవిత్వం వస్తుండేవి. ఆధునిక సాహిత్యాన్ని ప్రచారం చేసే సంస్థ ఇంకోటి లేదు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒక సాహిత్య సంస్థ అవసరమనిపించింది. మెదక్ జిల్లా పేరుతో రెండు సంస్థలు ఉన్నాయి. మెదక్ లో పనిచేయడం వల్ల మంజీర నదితో అనుబంధం ఏర్పడింది. దాశరథి గారు మంజీర నది మీద “ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర, ఎవరి కజ్జెల భాష్పధారవే మంజీర” అంటూ అద్భుతమైన పద్యాలు రాశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘మంజీరా రచయితల సంఘం’ అనే పేరుతో సిద్దిపేటలో జూలై 20, 1986లో నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. చంద్రశేఖర్ రావు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొమురవెల్లి అంజయ్య  చంద్రశేఖర్ రావు ద్వారా కొంత ఆర్థిక సహాయం చేయించాడు. వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను, ఉపాధ్యక్షునిగా అమ్మంగి వేణుగోపాల్, కార్యదర్శిగా అంజయ్య ఉన్నాం.

10. మరసం ప్రధాన ఉద్దేశ్యమేంటి? దానిని ఎలా బలోపేతం చేయగలిగారు?
జ :-    మంజీరా నది ఏడుపాయల వలె దీన్ని కూడా ఏడు శాఖలుగా విస్తరించాలనుకున్నాం. అందుకే సిద్దిపేటతో పాటు మెదక్, గజ్వెల్, సంగారెడ్డి, పటాన్ చెర్వు, నర్సాపూర్, దుబ్బాకలలో కలిపి జీవనదిలా ఉండే సాహిత్యాన్ని సృష్టిస్తూ ఏడు శాఖలుగా విస్తరింప చేశాం . ఆధునిక సాహిత్యాన్ని ప్రచారం చేయడం, చెల్లాచెదురుగా ఉండే రచయితలను ఏకత్రితం చేయడం, సమసమాజ స్థాపన, శాస్త్రీయంగా మానవ విలువల కోసం పనిచేయడమనే ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగినం. అప్పటికే జిల్లాలో కవులు, రచయితలు ఉన్నారు. సాహిత్యాభిమానులైన వాళ్ళూ వస్తున్నారు. వాళ్లందరికీ ఒక వేదికంటూ లేదు. శాఖమూరి అప్పారావు ప్రభావంతో మరో వైపు విప్లవోద్యమం పనిచేస్తున్నది. వాళ్ళు ఏదీ రాయకపోయినా కలుసుకోవడానికి, చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరం ఉండింది. ఉదయం, ఈనాడు పత్రికలు జిల్లా ఎడిషన్స్ ని పెట్టాయి. దాంతో విలేఖరుల సంఖ్య బాగా పెరిగింది. అప్పుడు మేము పుస్తకాల్లో రాసే రచయితలే కాక, పత్రికల్లో రాసే రచయితలు కూడా అంటూ రచయితల నిర్వచన పరిధిని పెంచాం. మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘం ఏర్పడింది. అదీ, మరసం రెండూ కలిశాయి. గ్రామాల్లో వచ్చిన కొత్త చైతన్యం, కవుల్లో వచ్చిన యౌవనోత్సాహం, జర్నలిస్టులలో విస్తరిస్తున్న వాతావరణం ఇవన్నీ ఒకేసారి కలవడం వల్ల మరసం బలోపేతమైంది. మాకు రాజకీయ నాయకులతో, ప్రభుత్వంతో ద్వేషం లేదు. మంత్రులను, శాసన సభ్యులను పిలిచి కార్యక్రమాలను ఓపెన్ ప్లేస్ లో చేసేవాళ్ళం. జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. సాహిత్య సభలు అట్లా జరగడం ఊహించలేము. ప్రజా ప్రతినిధుల్ని సభలకు ఆహ్వానించడం రచయితలు, జర్నలిస్టులు,  కలిసి పనిచేయడం వల్ల మరసం అంత గొప్పగా అవతరించింది.
          గ్రామాలలో స్త్రీలను చైతన్య పరచడం ద్వారా సభలకు బాగా హాజరయ్యేవాళ్ళు. స్త్రీలు, హమాలీలు, కూలీలు, రైతు కూలీలు, బీడీ కార్మికులు వీళ్ళందరి మీటింగులకు నన్ను మాట్లాడడానికి పిలిచేవాళ్ళు. అందుకే ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. సారా వ్యతిరేకోద్యమం వచ్చినప్పుడు సంపూర్ణ మద్యపాన వ్యతిరేక దినం చేయాలని మేము జర్నలిస్టులం తిరిగాం. గుట్కా మానేయాలంటూ చేసే ఉద్యమాలు, అందాల పోటీలు వద్దంటూ చేసే ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేకోద్యమాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొన్నాం. ఆంధ్ర ప్రాంత రచయితలతో కూడా సంబంధాలుండేవి. ఈ రకంగా ప్రజలతో , వారి జీవితం, సమస్యలతో మమేకమై ఉండడం, అటు సాంస్కృతిక రంగాన్ని, ఇటు పత్రికా రంగాన్ని సమ్మిళితం చేసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

11.తెలంగాణ  పోరాటోద్యమ మలిదశ వైపు మీ నడక ఏవిధంగా కొనసాగింది? అందులో మరసం, తెలంగాణ రచయితల వేదికలు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?
జ :-     1996 మరసం మంచి ఊపుకు వచ్చిన సమయం. దశాబ్ది ఉత్సవాలు రెండురోజులు భోజనవసతి ఏర్పాటుచేసి ఘనంగా నిర్వహించాం. 1996 నవంబర్ 1వ తేదీన అనుకోకుండా నేను హైదరాబాద్ కు రావడం, అదే రోజు అక్కడ గాంధీభవన్ లో జరుగుతున్న తెలంగాణా వాదుల సమావేశానికి హాజరయ్యాను. టంక శాల అశోక్, జ్వాలాముఖి కలిశారు. ఆ సమావేశం గురించి అందరికీ అసంతృప్తి ఉంది. ఇదిట్లా కాంగ్రెస్ వాళ్ళతో కాదని మనమే టేకప్ చేద్దామనుకున్నాం. అదేరోజు వరంగల్ లో అమరుల దినోత్సవం అని ఊరేగింపు చేసారు. పదిరోజుల తర్వాత ప్రణాళిక చేసుకుందామని వచ్చాను. జ్వాలాముఖి వెనుకడుగు వేసిండు. నవంబర్ 24 న మరసం మీటింగులో తెలంగాణ ఇష్యూ బలపడుతోంది కాబట్టి మనం కూడా దానికోసం పనిచేద్దామని ప్రతిపాదన తెచ్చాను. ఆంధ్రా వాళ్ళతో ఇబ్బంది లేకుండా “మా ఉద్యమం ఆంధ్రాలోని పేదవాళ్ళు, కూలీలతో కాదని, ఆంధ్ర దోపిడీదారులతోనేన”ని క్లారిటీతో తీర్మానించాం. ఈ తీర్మానంతో పత్రికా ప్రకటన ఇచ్చాం. తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ తెలంగాణలో తీర్మానం చేసిన మొదటి సాహిత్య సంస్థ ‘మంజీరా రచయితల సంఘం’ అని తెలిపాం. కాంగ్రెస్ వాళ్లు వాళ్ళ మీటింగుకు నన్ను పిలిచి మాతో కలిసి చేయమన్నారు. మేము ఒప్పుకోలేదు.
         ‘తెలంగాణాలో ఏం జరగబోతుంది?’ అనే ఒక పుస్తకాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య రాయగా కాళోజీ దాన్ని ఆవిష్కరించారు. 1997 జనవరి 1వ తేదీన పాశం యాదగిరి, ఇన్నయ్య మొదలైన వాళ్ళు మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. పూర్తి స్థాయిలో సమయం కేటాయించుమని అడిగారు. సరేనన్నాను. మార్చి 8, 9 తేదీలలో భువనగిరిలో రెండు రోజులు బహిరంగసభలు నిర్వహించారు. 8వ తేదీన జరిగిన హైదరాబాద్ ఊరేగింపులో పాల్గొని భువనగిరి వెళ్ళాను. తెలంగాణ సంస్కృతి మీద నేను మాట్లాడాను. తెలంగాణ సంస్కృతి గురించి చర్చలు జరిగాయి. గద్దర్, బెల్లి లలిత పాటలు పాడారు. సిద్దిపేటలో జరిగిన తెలంగాణ సదస్సుకు ముందురోజు ఆగస్టు 17, 1997 షేక్ బాబా కోరిక మేరకు  ‘నాగేటి చాల్లల్ల’ పాట గంట సేపట్లో రాశాను. అది చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వరంగల్ సభకు వెళ్తున్నప్పుడు అమరుల మీద పాట రాస్తే బాగుంటుందని షేక్ బాబా అన్నాడు. బస్సులో కూచొని వరంగల్ పోయేలోపు ‘జోహారులూ జోహారులూ’ పాట రాసిచ్చాను.
        నవంబర్ 1,1998 న ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’ అనే సంస్థ పెట్టినప్పటికీ అది ఎక్కువగా ముందుకు పోలేదు. నక్సలైట్ల మీద నిర్బంధం పెరిగి బెల్లి లలితను చంపారు. మరో గాయకుడు అయిలయ్యను కాల్చి చంపారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పదం వినిపించకుండా కఠినంగా వ్యవహరించాడు. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఉద్యమం జీరోకొచ్చింది.ఆ సమయంలో కె. శ్రీనివాస్ నాతో మీరు దిగి సాహిత్య సంస్థ పెడితే బాగుంటుందని సూచించాడు. 2001వ సంవత్సరంలో ఏప్రిల్ లో కేసీఆర్ పార్టీ పెట్టారు. అక్టోబర్ లో మరసం 15వ వార్షికోత్సవ సందర్భంగా రెండురోజుల సభలు జరిగాయి. అందులో రచయితలుగా మనవంతు బాధ్యతగా ఒక సంస్థ పెట్టాలని ‘తెలంగాణ రచయితల వేదిక’ పెట్టాం. జనవరిలో కరీంనగర్ వేదికగా దాదాపు 60 మంది రచయితలు వచ్చారు. అందరి దగ్గరికీ నేను తిరిగాను. రచయితల వేదిక నియమావళి తయారుచేసుకున్నాం. నేను అధ్యక్షునిగా మొదటి సదస్సు వరంగల్ లో జరిగింది. వేణు సంకోజు కార్యదర్శి. రచయితలు కాకుండా ఇతరులు రావడం ఆశ్చర్యకరం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడుమని కేసీఆర్ కొంతమందిని పంపించారని తెలిసింది. ఆ సదస్సులో కవిగానం, తెలంగాణం పేరుతో కవిత్వం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతీ మూడు నెలలకొకసారి ఒక మీటింగ్ జరపాలని నిర్ణయించాం. ‘సోయి’ అనే పత్రిక పెట్టి కె. శ్రీనివాస్ కు ఆ బాధ్యతలు అప్పగించాం. నేను ఎడిటర్ గా ఉన్నాను. 13 సంచికలు తెచ్చాం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లా అన్ని జిల్లాల్లో తిరుగుతూ శాఖలు ఏర్పాటుచేసి ఏడాదికి మళ్లీ సిద్దిపేటలో ఆ సంస్థ వార్షికోత్సవం చేశాం. రెండవ వార్షికోత్సవం హైదరాబాద్ అంబేద్కర్ భవన్ లో చేశాం. అప్పటినుండి కేసీఆర్ కూడా ప్రోత్సహించడం జరిగింది. ‘తెలంగాణం’ అనే పేరుతో దేశపతి శ్రీనివాస్ పాటల క్యాసెట్ ను తీసుకొచ్చాం. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగతంగా నేను, మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక చాలా కృషి చేశాం. 2004 నుండి ఉద్యమం ఊపందుకుంది.

నందిని సిధారెడ్డి రచనలు

12. మీరు ఉద్యమకారులు కావడానికి ఎవరి ప్రభావం ఉంది? ఉద్యమవీరులతో మీ అనుభవాలు ఎటువంటివి? ప్రత్యక్షంగా మీరు పాల్గొన్న ఉద్యమాలు ఏవి?
జ :-   ఉద్యమంలోకి రావడానికి మొదటి కారణం, ప్రేరణ మా బాపే. ఆయన సిపిఐలో పని చేసిండు. వార్తల్లో ఎవరైనా సిపిఐ నాయకులు జైలుకు పోతే “మీరట్లా పోతార్రా?” అనేవాడు (నవ్వుతూ). డిగ్రీకి వచ్చిన తర్వాత సరిపెల్లి కృష్ణారెడ్డి, భగవంత్ రెడ్డి. ఆ తర్వాత భూపాల్. క్యాంపస్ లో ఎక్కువగా విద్యార్థి సంఘాలతో మిళితమై ఉండేవాణ్ణి. కవిత్వంలో కూడా విప్లవ భావాలే ఎక్కువ ప్రచారంలో నడుస్తున్నాయి. కాబట్టి విప్లవోద్యమాలతో నడవడానికి విప్లవ కవిత్వంతో పాటు వరవరరావు, శివారెడ్డి, కె.వి.రమణారెడ్డి లాంటి పెద్దలు కూడా కారణం. అట్లాగే గద్దర్ పాటలు నాకు ఇన్స్పిరేషన్. అవి యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరనుండి అందరినీ ఆకట్టుకునేవి. అదే క్రమంలో విమోచన గ్రూప్ కూర రాజన్న వంటివాళ్ళ పరిచయం, ఉద్యోగం వచ్చిన తర్వాత శాఖమూరి అప్పారావు లాంటి వాళ్ళ పరిచయం నాలో విప్లవ భావాలను పెంచింది. లోపల పనిచేస్తున్న వాళ్లలో సముద్రుడు అనే కవి ఉండేవాడు. ఆయన పేరు కనకరాజు. కవిత్వమంటే పిచ్చి. ఆయన మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా వచ్చి నన్ను కలిసేవాడు. మరొక కవి సదానందం. ‘కౌముది’ పేరుతో రాసేవాడు. ఆయన కూడా నన్ను కలిసేవాడు. కవుల దగ్గరికి తీసుకుపొమ్మనేవాడు. ఆయన, నేను కలిసి ప్రయాణం చేయాలంటే భయం. ఇవన్నీ ఒకవైపు, మరొకవైపు ప్రజాఉద్యమాల్లో పాల్గొనడం. సారా వ్యతిరేకోద్యమంలో భాగంగా సంపూర్ణ మద్య నిషేధంలో ప్రత్యక్షపాత్ర వహించాను. ఎన్ టి ఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేయడం జరిగింది. కల్లు వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నాను. విప్లవోద్యమాన్ని వందశాతం అభిమానించాను. కానీ కార్యాచరణలో నేను లేను. నేను తిరిగిన ప్రాంతం, నేను రాస్తున్న కవిత్వమే దీనికి భూమిక. నిజాయితీగా ఉండాలన్న దృక్పథంతోనే ప్రజాఉద్యమాల్లో పనిచేశాను.

13. ప్రత్యేకంగా “తెలంగాణ రచయితల సంఘం” స్థాపనకు కారణం ఏమిటి? దాని ద్వారా మీరనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయని అనుకోవచ్చా?
జ :-    2007 సంవత్సరం వచ్చేసరికి తెలంగాణ రచయితల వేదికలో సామాజిక సమీకరణల ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు తెలంగాణ భావోద్వేగం, తెలంగాణ సాహిత్యం, అస్తిత్వాలు మాత్రమే ప్రధానంగా ఉండాలి. సమీకరణలు అనేసరికి నేను స్వచ్ఛందంగా తప్పుకున్నాను. మామూలు సభ్యులుగా ఉంటామన్నా అధ్యక్షుడు, కార్యదర్శి ఏనాడూ సర్వసభ్య సమావేశాలు పెట్టలేదు. దేనికీ పిలవలేదు. సామాజిక సమీకరణల్లో ఒదగని చాలామంది రచయితలు ఇంకొక సంఘం పెడితే బాగుండన్నారు. అప్పుడు నేను “పోటీ సంఘం పెట్టకూడదని, ఒక ప్రాంతానికి సంబంధించిన భావోద్వేగాలతో పనిచేస్తున్నప్పుడు మనలను మనమే పలుచన చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రం కోసం, మనమీద ఇతరుల ఆధిపత్యం లేకుండా చేయాలని పోరాడుతున్నాం. కాబట్టి ఇంకో సంఘం వద్దు” అన్నాను. ఇక రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో, తెలంగాణాలో సాహిత్య, సాంస్కృతిక వికాసాలు ఎట్లా జరగాలి? రచయితలు ఇప్పుడు ఏ పాత్ర వహించాలి? అనే దానికోసం మనకొక సంస్థ కావాలనుకున్నాం. అంతకుముందే దాశరథి, నారాయణరెడ్డి అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండి నడిపిన సంస్థ ఆగిపోయి ఉంది. అదే పేరుతో కొత్త సంస్థ కాకుండా దానినే తీసుకొని కొనసాగింపుగా నడిపిద్దామనుకున్నాం. నా అధ్యక్షతన, వి. శంకర్ కార్యదర్శిగా ఆక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టాం. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా పునర్నిర్మాణం జరగాలి. అన్న ధ్యేయంతో ముందుకు నడిచాం. ఇప్పటికీ మేము అనుకున్న లక్ష్యం నెరవేరిందని, నెరవేరుతుందని అనుకోవడం లేదు. దానికి కారణాలు అనేకం. అంటే ఒక రాష్ట్రం లాగా భౌగోళికంగా వెంటనే జరిగే ఏర్పాటు కాదది. అదొక సుదీర్ఘ క్రమం. సుదీర్ఘ పరిణామం. దానికి అడుగులైతే పడ్డాయి. ఇంకా పరిణామం, వికాసం జరగాల్సి ఉంది. మేమింకా ప్రయత్నించాలి. అందరితో రాయించడం, భావాలకనుగుణంగా ఒక వేదిక ఉండడం, ఎప్పటికప్పుడు తెలంగాణ భావోద్వేగ ప్రయాణానికి దిక్సూచిగా ఉండడం ‘తెలంగాణ రచయితల సంఘం’ ముఖ్య ఉద్దేశ్యాలు. ఇవన్నీనెరవేర్చుకునే దిశగా నడుస్తున్నది. అసలు కృషి అంతా ముందే ఉన్నది.

14. తెలంగాణ తొలి సాహిత్య అకాడెమీ అధ్యక్షులుగా తెలంగాణ యాసను, భాషను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలిగారు?

జ :-   ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ’ ఏర్పాటు అనేది తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వికాసానికి ఒక మంచి అడుగుగా నేను భావిస్తున్నాను. రాష్ట్రం ఏర్పాటు ఎంత గొప్ప విషయమో సాహిత్య అకాడెమీ ఏర్పాటూ అంతే. 1984లో ఎన్టీఆర్ మూసివేసిన అకాడెమీ అది. ఆయన నార్ల వెంకటేశ్వర రావు నేతృత్వంలో కమిటీ ఏర్పరచి పరిశీలించమని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఉన్న  సాహిత్య, సంగీత నాటక, లలిత అకాడెమీలకు డబ్బులు దండగ అని వెంకటేశ్వరరావు కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎన్టీఆర్ వాటిని రద్దు చేశాడు. క్రియాశీలకంగా పనిచేసే ఆ సంస్థలు రద్దు అయినాక మళ్లీ 34 ఏండ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడెమీ ఏర్పాటు చేయడం నా దృష్టిలో ఒక మంచి మెట్టు. తెలంగాణకు సంబంధించిన భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నప్పుడు భాష మీద తీవ్రమైన అసంతృప్తి, వాదోపవాదాలు జరిగాయి. కానీ తెలంగాణ వచ్చినాక ఈ భాషను కాదన్నవాళ్లే దాన్ని గుర్తించే పరిస్థితి వచ్చింది. కాబట్టి సాహిత్య అకాడెమీ కృషి అనే కాకుండా రాష్ట్రం రావడంతో అంతవరకు మాండలికం అన్నవారు తెలంగాణ భాషను గుర్తిస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో, సాహిత్యంలో, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ భాషను మాట్లాడే విధంగా వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు సినిమాల్లో విలన్లకు, హాస్య పాత్రలకు పరిమితమైన భాష ఈరోజు హీరో, హీరోయిన్లతో కూడా మాట్లాడించేంత అభివృద్ధి జరిగింది. భాష అనేది ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటుంది. మరొక ప్రాంతపు ఆధిపత్యం వలన దీన్ని మాండలికానికి పరిమితం చేసి హద్దులు గీయడం జరిగింది. రాష్ట్రావిర్భావంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు ఈ భాషను మాట్లాడడానికి పౌరుడు కానీ, సినిమాల్లో కానీ, సాహిత్యంలో గానీ రాయడానికి ఒక రచయిత భయపడటం లేదు. భాష వికాసం చెందడం ఒక సుదీర్ఘ పరిణామం. రెండు వేల సంవత్సరాల భాషా పరిణామంలో వంద సంవత్సరాలకు పైగా ఆంధ్ర ఆధిపత్య పరిణామం ఉంది. ఒక 60, 70 ఏండ్ల వరకు  భాషా పరిణామం జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను.

15. అన్ని ప్రాంతాల మాదిరిగా తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని బట్టి దాన్ని మాండలికం అనకుండా ‘భాష’గా పేర్కొనాలని అనడానికి గల కారణాన్ని వివరించండి.
జ :-   రచయితలం మేమే దీన్ని ముందుకు తీసుకొచ్చినం. ఒక మండలంలోని భాషను మాండలికం అంటారు. ఆ పద వ్యుత్పత్తి లోనే మనకు  అర్థమవుతుంది. అప్పుడు తెలంగాణ పది జిల్లాల భాషను మాండలికం అన్నారు. జిల్లాల వారీగా మాండలికాలు వేరు. మరి పది జిల్లాలకు కలిపి ఒక భాష , ఉనికి ఉన్నప్పుడు దాన్ని మాండలికం అని ఎట్లా అంటారు? ఆంధ్ర ప్రాంతంలో రెండు జిల్లాలకు సంబంధించిన మాండలిక క్రియలను ఒక ప్రామాణిక భాషగా ఏర్పరచుకున్నారు. వచ్చాడు, వచ్చిండు అనే పదాలను చిన్నయసూరి గ్రామ్యాలని చెబుతూ “లక్షణ విరుద్ధంబైన భాష గ్రామ్యంబు” అన్నాడు కదా! మరి ‘వచ్చాడు’ ప్రామాణికమైతే, ‘వచ్చిండు’ కూడా ప్రామాణికమే కావాలి. రాయలసీమలో ఇప్పటికీ క్రియా పదాల్లో ‘వచ్చినాడు’ అని గ్రాంథికం కనిపిస్తుంది. దాన్ని వ్యతిరేకించి ఆంధ్రులు వ్యావహారికం కావాలని కొట్లాడినారు. అదే వ్యావహారికంలో మనం ‘వచ్చిండు’ అంటే ప్రామాణికం కాదంటున్నారు. అంటే వాళ్ళది
గ్రాంథిక వాదమా? ప్రామాణిక వాదమా? వ్యావహారిక వాదమా? వాళ్ళది వ్యావహారిక వాదమైతే, మాదీ వ్యావహారికమే అని కొట్లాడినం. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భాషను భాషగానే గుర్తించాలి కానీ మాండలికంగా కాదు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగానే తీసుకున్నాం.

16. సాహిత్య అకాడెమీ ఛైర్మెన్ గా ప్రపంచ తెలుగు మహాసభలను అనూహ్యరీతిలో నిర్వహించిన మీరు ఆ కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించినదేది?
జ :-     1975లో జరిగిన ప్రపంచ మహాసభల్లో కేసీఆర్ విద్యార్థిగా పాల్గొన్నారు. ఆ అనుభూతితో రాష్ట్రం ఏర్పడ్డాక ప్రపంచ మహాసభలను, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా ప్రతిష్టాత్మకంగా జరిపించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షునిగా ఈ బాధ్యతలన్నీ చూడమని నాకు అప్పగించారు. అంతవరకు జరిగిన నాలుగు ప్రపంచ మహాసభలకంటే ఘనంగా జరగాలని,  అంతకు ముందు వాటికి కొనసాగింపుగా కాక కొత్తరాష్ట్రం ఏర్పడింది కాబట్టి ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు జరగాలని ఆయన కోరిక. ఐదు వేదికల మీద వివిధ అంశాలకు విభిన్న పార్శ్వాలతో, వివిధ రంగాలలో చర్చా వేదికలు, సాహిత్య సదస్సులు జరగాలని నా బలమైన కోరిక. ఒకటి రవీంద్ర భారతి మెయిన్ హాల్, రెండవది రవీంద్రభారతి మినీహాల్, మూడవది ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, నాలుగవది తెలుగు విశ్వవిద్యాలయం, ఐదు తెలంగాణ సారస్వత పరిషత్తు. బాలల సదస్సు, మహిళల సదస్సు, కవుల సదస్సు, అవధానం, శతావధానం, కథా ప్రక్రియ, విమర్శ, నవల, కవిత్వం వీటన్నిటి మీద ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి, ఎక్కడా ఇది జరగలేదు అనకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఎక్కడికక్కడ నిర్వహణా బాధ్యతలు అప్పగించి ప్రతీ వేదికకు ఒక కమిటీ, ఇంకా ఇతర కమిటీలు వేసి, ఈ ఐదు వేదికల మీద కార్యక్రమ నిర్వహణ ఎట్లా జరుగుతుందో అన్నిచోట్లా తిరుగుతూ పర్యవేక్షించాను. మంచి పేరు వచ్చింది. బహుశా ఐదు రోజులు నిరాఘాటంగా కవి సమ్మేళనం జరిపిన చరిత్ర ఇంతవరకు ఏ మహాసభలకు లేదు. అంతగా జరిగినా ఇంకా కవులు మిగిలిపోయారు. కేసీఆర్ కోరిక మేరకు ప్రధాన వేదికపైన దేశ విదేశాలు ఆశ్చర్య పోయేలా అట్టహాసంగా, ఆడంబరంగా జరిగాయి. సాహిత్య కారులందరూ నివ్వెరపోయేటట్లు ఒక క్రమ బద్ధమైన ప్రణాళికను రూపు దిద్దడం జరిగింది. ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచినా అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ విషయాలు మళ్లీ ప్రస్తావనకు రావడం గొప్పతనం. రచయితల సభలుగా, భాషా సాహిత్య సభలుగా ప్రత్యేకంగా నిర్వహించాలని కేసీఆర్ బలమైన కోరిక. అందువల్ల అంత ఘనంగా నిర్వహించగలిగాం. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది.
        మొదట తెలుగు మహాసభలుగా జరపడమా, తెలంగాణ మహాసభలుగా జరపడమా అన్న విషయంలో పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో చాలా క్లారిటీ తెచ్చుకున్నాం. తెలంగాణలో జరిగిన తెలుగు వికాసాన్ని చూపించే సభలుగా నిర్వచనం ఇచ్చుకొని తెలంగాణ ప్రతిభను, తెలంగాణ భాషను, తెలంగాణ సాహిత్యాన్ని అద్భుతంగా చూపెట్టాం. హైదరాబాద్ అంతటా 120 ద్వారాలు పెట్టాం. రచయితలలో దున్న ఇద్దాసుతో సహా, యాదగిరిగుట్టలో ఈగ బుచ్చిదాసు అని ఒక సంకీర్తనాచార్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. అలాంటి వాళ్ళందరి పేర్లతో ద్వారాలు ఏర్పాటు చేశాము. బుచ్చిదాసు మనుమడు అది చూసి మా తాత ఇంత గొప్పవాడు అని నాకు తెలియదు అన్నాడు. అట్లా తెలంగాణ రచయితలకు, కళాకారులకు గొప్ప గుర్తింపు వచ్చింది. సాహిత్య అకాడెమీ 120 ప్రధాన పుస్తకాలను ప్రచురించింది. దాంట్లో 80 సంవత్సరాల కింద రాచకొండ సర్వజ్ఞ సింగ భూపాలుని ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకార శాస్త్రాన్ని కూడా వెలువరించాం. జరిగిన దానికంటే జరగాల్సింది చాలా ఉంది. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ.

17. మీరు రాసిన మొదటి పాట “నాగేటి చాల్లల్ల నా తెలంగాణ” అనే దానికి ‘నంది’ అవార్డు వచ్చిన నేపథ్యం తెలుపుతూ మీ అనుభూతిని వివరించండి.
జ :-     1997 ఆగస్ట్ 17న సిద్దిపేటలో తెలంగాణ సదస్సు జరిగింది. షేక్ బాబా ముందు రోజు రాత్రికి మాఇంటికి వచ్చి ఉన్నాడు. “సర్! ఒక పాట రాయొచ్చు కదా!” అన్నాడు. నాకూ రాయాలని ఉంది. గంటసేపట్లో ‘నాగేటి చాల్లల్ల’ పాట రాసి ఆయనకు ఇచ్చి ట్యూన్ చేసుకొని పాడమని చెప్పిన. దేశపతి శ్రీనివాస్ కోరస్ ఇచ్చాడు.  ఆ తర్వాత జరిగిన అనేక సభల్లో ఈపాట తప్పనిసరిగా ఉండేది. దాంతో విస్తృతంగా గుర్తింపు వచ్చింది. నేను పొంగిపోయాను. దేశపతి శ్రీనివాస్ పాడుతుంటే వేదికల మీద పాడుతుంటే సభలో చాలామంది లేచి నృత్యం చేసేవాళ్ళు. అది చూసి ఎంతో పరవశించి పోయేవాణ్ణి. దర్శకుడు, గాయకుడు ఆర్. నారాయణమూర్తిని ఈ పాట బాగా ఆకర్షించింది. ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కలుస్తానని చెప్పి వచ్చి కలిశాడు. ‘వీర తెలంగాణ’ సినిమాలో దాన్ని పెట్టడానికి అనుమతి అడిగాడు. ఆపాట ఎప్పుడో ప్రజాపరమైంది. సరేనన్నాను. చాలా బాగా వచ్చింది. దానికి 2010లో నంది అవార్డు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండిందప్పుడు. తెలంగాణోద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న రోజులు. అటువంటి సమయంలో సినిమా రంగంలో నా పాటకు పురస్కారం ఇవ్వడం గొప్పతనం. ఆ జ్యూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకొక సంతోషం ఏంటంటే నారాయణరెడ్డి గారిని చూసి సినిమాలకు పాటలు రాయాలని కోరిక ఉండేదని చెప్పిన కదా! విప్లవోద్యమంలో అడుగు పెట్టిన తర్వాత ఆ కోరిక వదిలేశాను. కానీ తెలంగాణ ఉద్యమం సినిమాను నా ఇంటిదాకా తీసుకువచ్చింది (నవ్వుతూ). పాటను సినిమాలో పెట్టడమే ఊహకందనిది. అట్లాంటిది నా మొదటి పాటకు నంది అవార్డు రావడం అంతకంటే ఊహకందనిది. అందుకే చాలా ఆనందం కలిగింది. సినిమారంగంలో కూడా ఒక గుర్తింపు తెచ్చింది. వేదిక మీద ఉత్తమ నటులు, ఉత్తమ రచయితలు, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీతకారుల మధ్య నేను నిలబడడం పరవశాన్ని కలిగించింది. ప్రత్యేకంగా ఛానళ్ల వాళ్ళు దాన్నొక ప్రత్యేక వార్తగా చెప్పడమే కాక ఇంటర్వ్యూలు చేశారు.

18. “పాటలంటే చానా ఇష్టమ” ని చెప్పుకునే మీ పాటల  ప్రస్థానం ఎట్లా కొనసాగింది?
జ :-     మా బాపు వల్ల నాకు పాటల మీద ఆసక్తి కలిగిందని ఇందాక చెప్పిన కదా! పాటలు రాయాలనే కోరికతో రాస్తూ వచ్చాను. నాలో గాయకుడు లేనందువల్ల అవి కాగితాల్లో, పుస్తకాల్లో ఉండిపోయాయి. నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్ ‘నకులుడు’ అని పాటలు పాడుతుండేవాడు. నేను రాసిన “ఇది నిశిరాత్రి మది నిశిరాత్రి, చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి” అనే పాటను అతను పాడితే నన్ను అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మంజీరా రచయితల సంఘ’ సంస్థాగీతం రాశాను. మొదట బాలమల్లు అనే గాయకుడు పాడిండు. తర్వాత దేశపతి శ్రీనివాస్ పాడుతున్నాడు. తిరిగి నేను పాటలు రాయడానికి ప్రేరణ రసమయి బాలకిషన్. మద్యపాన వ్యతిరేకోద్యమ సమయంలో నన్ను పాటలు రాయమన్నాడు. ఏదైనా ట్యూన్ ఇస్తే రాస్తానన్నాను. ఆయన రెండు, మూడు ట్యూన్లు ఇచ్చాడు. నేను నాలుగు పాటలు రాసి ఇచ్చాను. శ్రీనివాస్, బాలకిషన్ పాడేవాళ్ళు. ఎక్కడ ఊరేగింపు జరిగినా, ప్రదర్శనలు జరిగినా ఈ పాటలతోనే మొదలయ్యేవి. “బీడీలు చేసేటి చెల్లెమ్మా, నీవు బీరాన నిద్దుర లేవమ్మా!”, తవ్వెడొడ్ల మూడుసోళ్ల కైకిలెందుకే పిల్లా కైకిలెందుకే” ఇట్లా తాగుడు వద్దని సందేశమిస్తూ రాసిన పాటలు, షేక్ బాబా అడిగితే రాసిన రెండు పాటలు, ‘నాగేటి చాల్లల్ల’ పాట తెలంగాణ వైభవాన్ని తెలిపేది. మరి తెలంగాణలో దుఃఖం కూడా ఉంది కదా! అని అనిపించి ” తెలంగాణ వట్టి త్యాగాల పట్టి” అనే పాట రాసిన. సినిమాల్లో మళ్లీ రెండవసారి అవకాశం ఇచ్చింది ఎన్. శంకర్. ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో డ్యూయెట్ రాయమన్నాడు. “50 దాటిన వయసులో డ్యూయెట్ ఏం రాస్తాను?” అన్నాను (నవ్వుతూ). ఆయన బలవంతం మీద ” ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లూగేనా?” అంటూ రాసిన. అది యూత్ లోకి బాగా వెళ్ళింది. అందులో గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ నేను ముగ్గురం మూడు డ్యూయెట్లు రాసినం. ఉద్యమం గురించి గద్దర్ రాసిన “పొడుస్తున్న పొద్దు మీద” అనే పాట చాలా హిట్టయింది. రెండవది నా పాట హిట్టయింది. అందులో నేను విశేషంగా తెలంగాణ భాష, వ్యావహారిక పదాలు ఉపయోగించడం వల్ల దానికొక అందం వచ్చింది. ‘బందూక్’ అనే సినిమాలో కూడా ఒక పాట రాశాను. సునీల్ హీరోగా వచ్చిన ‘టు కంట్రీస్’ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ మీద పాట రాయమని శంకర్ అడిగాడు. సినిమా హిట్టవలేదు. కానీ ఆ సినిమాలో ఈ పాటే బాగుందని అందరూ ప్రశంసించారు. ఇట్లానే ఎవరైనా అడిగితే రాస్తున్నాను.

19. ఒక విమర్శకులుగా మీ విమర్శనాత్మక దృక్పథాన్ని తెలపండి.
జ :-   నేను అకడమిక్ గా వచ్చినవాణ్ణి కావడం, పిహెచ్ డి. కూడా చేసి ఉండడం వల్ల విమర్శ ఇష్టంగా ఉండేది.
నేను సాహిత్య వ్యాసాలు కూడా రాశాను. విస్మరించబడిన రచయితల మీద, తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ మాండలికం పైన, తెలంగాణ భాష పైన రాసిన కవులు తొక్కుడు బండ కృష్ణమూర్తి, ‘తొక్కుడుబండ’ పుస్తకం రాసినందుకు ఆయనకాపేరు వచ్చింది. పంచరెడ్డి లక్ష్మణ్ అనే ఆయన ‘ఇసిత్రం’ రాశాడు. దేశరాజు మహారాజు ‘గుడిసె గుండె’ అని ఇవన్నీ అచ్చం తెలంగాణ మాండలిక భాషలోనే ఉంటాయి. ఒక ప్రయోగాత్మకంగా రాశారు వాళ్ళు. దాన్ని తెలుగు సాహిత్యం గుర్తించాల్సి ఉండె. గుర్తించలేదు కనుక వాటి మీద విమర్శ వ్యాసాలు రాశాను. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ నిర్మాణం జరగాలని తెలంగాణ భాష, సాహిత్యం మీద వ్యాసాలు రాశాను. ఇవన్నీ కలిపి ‘ఇగురం’ అనే పుస్తకం వేశాను. ఇతరత్రా వ్యాసాలు, కేతవరపు రామకోటి శాస్త్రి విమర్శ ప్రస్థానం మీద, ఆయన విమర్శలో పునర్మూల్యాంకనం ఎట్లా ఉంటుంది? అనే దాని మీద రాసినవి కలిపి విశాలాంధ్ర వాళ్ళు ‘ఆవర్తనం’ అనే పుస్తకం వేశారు.

20. నృత్య రూపకాలవైపు మీరు దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా?
జ :-    నిజానికి అది నేననుకున్నది కాదు. కానీ ఇందిరా పరాంకుశం అని కూచిపూడి నర్తకి ఒకసారి ఫోన్ చేసి నన్ను కలవాలనుకుంటున్నట్లు తెలిపింది. తెలంగాణ మీద తనకు ఒక నృత్య రూపకం కావాలని అది మీరే రాయగలరని టంకశాల అశోక్ చెప్పారని చెప్పింది. అంతవరకు నృత్యరూపకం రాసిన అనుభవం లేదు. కనీసం చూడను కూడా లేదు. ఆమె ఒక స్క్రిప్ట్ పరిశీలించుమని ఇచ్చింది. తెలంగాణ చరిత్ర మీద రాయడం కాబట్టి దాన్నొక ఛాలెంజ్ గా అనుకున్నాను. ఒక ఉత్సుకత కూడా కలిగింది. నా పద్ధతిలో నేను రాసి ఇచ్చాను. తరువాత తెలంగాణ చరిత్రకు సంబంధించి మరొకరు రాసిన నృత్యప్రదర్శన చూశాను. దానికంటే నేను రాసిందే బాగుందనిపించింది. దాంట్లో ఇటీవలి  చరిత్రనే రాశారు. నేను లోతుల్లోకి వెళ్లి పూర్వం నుండి ఉన్న చరిత్రను పరిశీలించి తెలుగు భాషకు ఉండే మూలాల్ని అంతా పరిశీలించి భాష, సాహిత్య, సాంసృతిక కోణంలో రాశాను. ఆ రూపకానికి డి.వి.ఎస్.శాస్త్రి సంగీతాన్ని రూపొందించాడు. ఇందిరా పరాంకుశం వాళ్లకు త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ అని వాళ్ళకొక నృత్యకళాసంస్థ ఉంది. మే లో ఆ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే పేరుతో నేను రాసిన రూపకాన్ని ప్రదర్శించారు. దాన్ని చూస్తున్నప్పుడు ఇది నేనే రాశానా? అనిపించింది. రవీంద్రభారతి వేదిక మీద ఏడెనిమిది మంది నృత్యకారులు నృత్యం చేస్తుంటే పులకించిపోయాను. ప్రారంభంలోనే ‘నమో తెలంగాణ మాత’ అనే వందన గీతం ఒకటి ఉంటుంది. అది పాడుతున్నప్పుడే చాలా ఆనందం కలిగింది.
          ఇందిరా పరాంకుశం గొప్ప నర్తకీమణి. అభినయాత్మకంగానే కాక అనుభూతి పరంగా నటించింది. నేను ఎంత ఆర్ద్రంగా రాశానో అంతటి భావాన్ని ఆమె ప్రదర్శించింది. అందులో ఒకచోట కులీకి, భాగమతికి మధ్య ఉన్న ప్రేమకు సంబంధించిన చిన్న బిట్ ఉంటుంది. అంత చిన్నదాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించింది. ఆ ఒక్క బిట్ కోసం మరోసారి ప్రదర్శన చూశానని ఎవరో ఆమెకు చెప్పారట. సినిమాలాగా రోజూ ప్రదర్శించేది కాదు కదా. మళ్ళీ ఎక్కడో ప్రదర్శన జరిగినప్పుడు గుర్తుపెట్టుకొని వెళ్లి చూడడం గొప్ప విషయం. ఆ రూపకం నాకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఒకరిద్దరు రాయమని అడిగారు. మళ్ళీ ఒకసారి ఆమే దాశరథి మీద రాయమన్నది. అది కూడా బాగా సంతృప్తినిచ్చింది. అన్నదాత మీద రాయమని అడిగింది. రైతుల ఆత్మహత్యలు, కష్టాల నేపథ్యంలో రాసిన ఆ రూపకానికి కూడా బాగా గుర్తింపు వచ్చింది. అనేక సార్లు ప్రదర్శింపబడింది. CPM వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళ ద్వారా కూడా ఇది ప్రదర్శింపబడింది. ఆమె డబ్బు కొరకు కాకుండా ప్రజల్లోకి వెళ్లడం కోసం ఒక చిన్న గ్రామంలో కూడా ప్రదర్శించింది. ఇప్పుడు నవంబర్ 28న ‘సుందరయ్య విజ్ఞాన కేంద్రం’ లో ప్రదర్శన ఉంది. నా కవిత్వ ప్రయాణంలో ఇది నాకు ఒక మేలి మలుపు. చాలా ఆనందాన్ని కలిగించిన విషయం.

21. మీ సంపాదకత్వంలో వెలువడిన మంజీర, సోయి, జంబి పత్రికల నిర్వహణను గురించి తెలపండి. సంపాదకులుగా మీ అనుభవాలను వివరించండి.
జ :-    ఈ మూడు పత్రికలు కూడా అవసరార్థం వచ్చినవే. మంజీరా రచయితల సంఘాన్ని మెదక్ స్టడీ సర్కిల్ ను నిర్వహిస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కవుల, రచయితల రచనలను ప్రోత్సహించాలని, సంస్థ యొక్క కార్య కలాపాలను బయటకు చెప్పడానికి ‘మంజీర’ అనే పత్రికను ప్రారంభించాం. దాదాపు ఏడెనిమిది సంచికలు వేశాం. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత తెలంగాణ భావోద్వేగాలను, తెలంగాణ భావజాలాన్ని పరిచయం చేయడం కోసం ఒక పత్రిక అవసరమని భావించి ‘తెలంగాణ రచయితల వేదిక’ నుంచి ‘సోయి’ పత్రిక తీసుకొచ్చాం. ఆ ఉత్సాహం ఎంత బలంగా ఉండేదంటే డబ్బులకోసం కొంచెం వెనుకడుగు పడుతున్న సమయంలో జిగురు ఐలయ్యఅని గోదావరిఖనిలో ఒక కార్మికుడు పదివేల రూపాయలు ఇవ్వడం మరిచిపోలేనిది. అట్లా పది పన్నెండు సంచికలు తీసుకొచ్చినం. అదొక గొప్ప విషయం. ‘తెలంగాణ రచయితల సంఘం’ పెట్టే ముందు ఇంకొక పత్రిక పెట్టాలనుకున్నాం. అమెరికాలో సెటిలయిన ఇద్దరు మిత్రులు డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో ‘జంబి’ అనే పత్రిక ప్రారంభం చేసినం. పనిభారమంతా నామీద పడడంతో మూడు సంచికలు వచ్చిన తర్వాత ఆపివేయాల్సి వచ్చింది. సంపాదకునిగా చేయడం ఇష్టమే కానీ చాలా శ్రమతో కూడుకున్నది. ‘సోయి’ రచనలకు ఒక బారికేడ్ పెట్టుకోలేదు కాబట్టి అన్ని సంచికలు తీసుకురాగలిగాం. ‘జంబి’ లో అట్లా వేయలేకపోయాం. నాకు వీలు పడకపోవడం కొంత, వయసురీత్యా కొంత, ప్రూఫుల దగ్గర నుండి నేనే చూడాల్సి రావడం వల్ల కుదరక ఆపేశాను. అకాడెమీ అధ్యక్షుడుగా నేను, కార్యదర్శిగా ఏనుగు నరసింహారెడ్డి ఉన్నప్పుడు ‘పునాస’ అనే త్రై మాసిక పత్రిక తెచ్చాం. ఒక విడి పత్రిక తేవాలని ఉన్నా వయసును దృష్టిలో పెట్టుకొని క్రియేటివ్ సైడ్ ఉంటేనే బాగుంటుందనిపించింది.

22. కవిగా, రచయితగా అర్థ శతాబ్దం పైగా రచనలు చేస్తున్న మీనుండి వెలువడిన రచనలేవి? అందులో మీకు అమిత సంతృప్తినిచ్చిందని చెప్పేదేదైనా ఉందా? జ :-   నేను నా కవిత్వాన్ని 8 సంపుటాలుగా, ఒక పాటల సంపుటి కలిపి 9 పుస్తకాలు వచ్చాయి. రెండు విమర్శ గ్రంథాలు, ఒక కథా సంపుటి, రెండు థీసిస్ లు తీసుకొచ్చాను. వీటిలో ‘భూమిస్వప్నం’ బాగా సంతృప్తి, గుర్తింపులనిచ్చింది. ఒక ఇరవై సంవత్సరాలు రాసిన కవిత్వమంతా వడబోసి దాన్ని తెచ్చాను. ఆ తర్వాత ఉత్సాహంతో రాసినటువంటి ‘ప్రాణహిత’ లో నాకు నచ్చిన చాలా కవితలుంటాయి. నాకు గుర్తున్నంత వరకు కాకతీయ యూనివర్సిటీలో అది టెక్స్ట్ బుక్ గా ఉంది. నేను విన్నంతవరకు వేంకటేశ్వర యూనివర్సిటీలో కొంతకాలం టెక్స్ట్ గా ఉంది. తెలంగాణ ఉద్యమం నా జీవితంలో భాగమైంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన చాలా కవితలు ‘నది పుట్టువడి’ లో వచ్చాయి. రిటైర్మెంట్ తర్వాత వేసిన ‘ఇక్కడి చెట్ల గాలి’ కవిత్వ సంపుటిలో కూడా నాకు నచ్చిన చాలా కవితలున్నాయి. ఈ నాలుగు నాకు బాగా ఇష్టమైనవి.

23. తెలంగాణోద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత సాహిత్య పరంగా వచ్చిన పరిణామక్రమాన్ని వివరించండి.
జ :-    తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన సాహిత్యమంతా ఉద్యమ సాహిత్యం. రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణ, పునరుజ్జీవన, పునర్వికాస సాహిత్యం వచ్చింది. ఈ క్రమం జరగాల్సినంత వేగంగా జరుగలేదు. ఇంకా జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ఆనాడు అధికారంలోకి వచ్చిన ఉద్యమపార్టీ గానీ ఉద్యమస్ఫూర్తితో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పూర్తి కృషి చేయలేదు. నేను ఈ విషయం గురించి ప్రస్తావించిన ప్రతీసారి నీళ్లు, నిధులు, నియామకాలు అయిపోయిన తర్వాత గానీ చేయము, చేయలేము అన్నారు. ఇది అప్పటిదాకా ఆగేది కాదు. సుదీర్ఘకాలం జరగాల్సిన పని. ఇది ఒక ప్రాజెక్టు నిర్మాణం కాదు. అంత శ్రమ కూడా అవసరం లేదు. కవులు, గాయకులు కోరుకుంటున్నది. అన్నిటితో పాటు ఒక పాయగా నడవాల్సింది. జరగలేదని నేననను. కొంత జరిగింది.
        ఒక తెలంగాణ ఉద్యమ ప్రేమికునిగా, తెలంగాణ సాంస్కృతిక ప్రేమికునిగా జరిగిన పరిణామాన్ని పాజిటివ్ గా, సానుకూలంగా గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు ఒకటి భాషకు సంబంధించిన మార్పును చూశాను. సినిమా రంగంలో, సాంస్కృతిక రంగంలో, కళారంగంలో భాషకు ఒక గుర్తింపు వచ్చింది. రెండవది అప్పటికి లక్షరూపాయల పురస్కారాలు లేవు. కాళోజీ, దాశరథి పురస్కారాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో దాశరథిని ఒప్పుకున్నారు కానీ కాళోజీని ‘ఒక కవేనా?’ అన్నారు. కాదన్న వాళ్ళు కూడా నా చుట్టే ఉన్నారు. తెలంగాణ వచ్చాక కాళోజీకి గుర్తింపు వచ్చింది. దాశరథిని కూడా ఉద్యమకాలంలో ఆయన రాసిన పద్యాలను చూసి గుర్తించినా, ఎన్ టి రామారావు ఆయనను అవమానించి ఆస్థానకవి పదవినే రద్దు చేశాడు. ఒక ఉద్యమ కవి తినడానికి తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక అవస్థ పడ్డాడు. ఆస్థానకవిగా ఉండడం వల్ల ప్రభుత్వానికి అమ్ముడు పోయిండని కాకతీయ యూనివర్సిటీకి రానివ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు గొప్ప గుర్తింపు వచ్చింది. కవిత్వం ఆగిపోదనడానికి సాక్ష్యమిది. పోతన తర్వాత రాజ్యాధికారాన్ని ఎదుర్కొన్న అంత గొప్పకవి దాశరథి. రాష్ట్రం ఏర్పడ్డాక కాళోజీ, దాశరథి పేర్ల మీద లక్షరూపాయల పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రతి ఏటా ఇవి ఇవ్వడం జరుగుతున్నది. కాళోజీ పేరు మీద ఒక వైద్య విద్యాలయం, ఒక యూనివర్సిటీ పెట్టారు. సాంస్కృతిక కేంద్రం నిర్మాణం జరుగుతున్నది. గోల్కొండ ఖిలాలో స్వాతంత్ర్య దినోత్సవం జరగడం ఒక చరిత్ర. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంతోమంది పండితులు, విదుషీమణులు పురస్కారాలు అందుకుంటున్నారు.

24. మొదట ఛందో బద్ధమైన పద్య రచన చేసిన మీరు వచన కవిత్వం పట్ల అనురక్తులవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం వచన కవిత్వం ఏ దశలో ఉందని మీరు భావిస్తున్నారు?
జ :-    ఛందోబద్ధంగా రాయాలని కూడా నేను కచ్చితంగా అనుకోలేదు. కాలక్రమంలో పద్యం రాస్తున్నప్పుడు వచన కవిత్వం కూడా ఉంటుందని తెలిసిందని ఇంతకు ముందు చెప్పిన కదా! శ్రీశ్రీ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత సాహిత్యంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పును గుర్తించాల్సిన అవసరం ఉందని భావించారు. ఇవాళ ఒక ప్రధానమైన రూపాన్ని సంతరించుకొని వచన కవిత్వం నిలబడింది. దాంట్లో కూడా ప్రతిభావంతులైన కవులున్నారు. వేల పుస్తకాలు వచ్చాయి. వాటిని కూడా గౌరవ స్థానంలో నిలబెట్టి చరిత్ర రాసుకోవాల్సిన అవసరం ఉంది. 

25. నర్రా సిద్ధారెడ్డి అనే మీ పేరును ప్రత్యేకంగా నందిని సిధారెడ్డిగా మార్చుకోవడానికి కారణం ఏమిటి?

జ :- ప్రత్యేకంగా కారణం ఏమీ లేదమ్మా! నర్రా అనేది మా ఇంటి పేరు. మా పక్క ఊళ్ళో నర్రా సిద్ధారెడ్డి పేరుతో ఒకాయన ఉన్నాడు. మా ఊళ్ళో నర్రా సిద్ధారెడ్డిలే నలుగురున్నారు. నేను చదువుకునే రోజుల్లో మరో సిద్ధారెడ్డి ఉండేవాడు. నేను రాసిన కవితలు పత్రికలలో ప్రచురింపబడినప్పుడు ఆయన అనుకొని అందరూ అభినందిస్తుంటే ‘నేను కాదు’ అని కూడా చెప్పేవాడు కాదు. నాకప్పుడు మార్చుకోవాలనిపించింది. మా సీనియర్స్ లో ‘గులాబీల’ మల్లారెడ్డి ఇంటి పేరు వేరేది ఉంటే అది బాగాలేదని మార్చుకున్నాడు. ఆనందం అనే ఆయన తన ఇంటి పేరును ‘మల్లెల’ అని మార్చుకున్నాడు. నర్ర అంటే ఎద్దు అని అర్థం. నంది తిమ్మనను దృష్టిలో పెట్టుకొని నంది అంటే అర్థం ఒకటే అవుతుంది కదా అని నంది సిద్ధారెడ్డి అని మార్చుకున్న. నాలుగైదు కవితలు అదే పేరుతో అచ్చు కూడా అయ్యాయి. ఉమాపతి పద్మనాభ శర్మ అది సంపూర్ణంగా లేదని ‘నందిని’ అని మార్చారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైనప్పుడు ఎవరో వచ్చి ‘ఫిడేలు రాగాల డజను’ పట్టాభిని అభినందించారట. అప్పుడాయన నేను ఆ పట్టాభిని కాను. పఠాభిని అన్నాడట. అట్లా ఆయన పేరును మార్చుకున్నాడు. అట్లాగే చిన్న నీటి పారుదల శాఖామంత్రి శీలం సిద్ధారెడ్డి అని ఉండేవాడు. నన్ను కొంతమంది ఆయనగా అనుకునేవారు. అందుకే పఠాభిని ఆదర్శంగా తీసుకొని సిద్ధారెడ్డి అన్నదాన్ని కూడా సిధారెడ్డి అని మార్చుకున్నా.

26. ‘అనిమేష’ ను ఉపద్రవ గాథగా దీర్ఘకవితగా మలిచారు కదా! దాని గురించి వివరించండి.
జ :-    ‘అనిమేష’ రాయాలని ప్రత్యేకంగా అనుకోలేదు. కానీ ఒక కావ్యం రాయాలని ఉండింది. అది చాలాకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు కరోనా రావడం, చాలాకాలం ఖాళీగా ఉండడంతో కరోనా వైరస్ గురించి, అది సైంటిఫిక్ గా, కల్చరల్ గా తీసుకొచ్చిన మార్పులు, మనిషి ఎదుర్కున్న హెచ్చరికలు, పర్యావరణం వీటన్నిటి మధ్య ఒక కావ్యం రాయాలనిపించింది. మానవ సంబంధాలు క్రూరంగా హింసించబడ్డాయి. హృదయవిదారకమైన సంఘటనలు, వలస కార్మికులు వాహన సదుపాయాలు లేక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం లాంటి వాతావరణం చూసిన తర్వాత రాశాను. అనిమేష అంటే రెప్పపాటు లేనిది ప్రకృతి. ప్రకృతికి మనం కోపం తెప్పించినం గనుక ఆ కోపాన్ని, వైపరీత్యాన్ని అనుభవించినం అన్న అర్థంలో అది రాయడం జరిగింది.

27. మీ ‘చిత్రకన్ను’ కథా సంపుటి పేరే వినూత్నంగా ఉంది. ఆ పేరుతో ఉన్న కథలో చిత్రించిన సన్నివేశం యథార్థంగా జరిగినదా? ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో రాసినదా?
జ :-    కథలు రాయడమనేది నాకు ముందు నుండి ఉన్న కోరిక. చాలా ఇష్టంతో కథలు రాసిన. విద్యార్థి దశలో మెస్ ఛార్జీలు కట్టలేని స్థితిలో కథల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించుకొని చదువుకున్న సందర్భాలున్నాయి. అట్లా కథలతో ఒక అనుబంధం ఉంది. ఊరు నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి ఆ అనుభవంతో రాసిన. చాలాకాలం పుస్తకం వేయలేదు. నాకు కథలు రాయడం రాదని వాసిరెడ్డి నవీన్ అన్నాడు. మానవ సంబంధాల గురించి రాస్తున్నావు కానీ విప్లవ పోరాటం గురించి రాస్తలేవు అని అల్లం రాజయ్య అన్నాడు. మా ఊళ్ళో విప్లవ పోరాటం లేదు. అందుకే రాయలేదు. అంతకు ముందు రాసిన కథల్ని ‘చిత్రకన్ను’ పేరుతో పుస్తకం వేశాను. మా ఊళ్ళో జరిగిన వాస్తవ సంఘటన. ఒకామె చనిపోతే శవదహనానికి డబ్బులు ఇచ్చే విషయానికి సంబంధించిన సంఘటన. క్లైమాక్స్ మటుకు ఊహించి రాసింది.

28. ‘బందారం కథలు’ పేరుతో మూసీ పత్రికలో వస్తున్న మీ ఊరి కథలను త్వరలో పుస్తకరూపంలో వెలువరిస్తారని ఆశించవచ్చా?
జ :-     బందారం కథలు రాయాలని చాలా కాలంగా నా మనసులో మగ్గుతున్న కోరిక. విద్యార్థి దశలో తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన ‘మాఊరి కథలు’ చదివాను. అప్పటినుండే బందారం కథలు రాయాలని అనుకున్నాను. కానీ ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. మూసీ పత్రిక నిర్వహణలో భాగం పంచుకుంటున్న అట్టెం దత్తయ్య నన్ను పత్రిక కోసం ఏదైనా రాయమన్నప్పుడు బందారం కథలు అనుకున్నాను. వేముగంటి రఘునందన్ నన్ను ‘మీవూరి కథలు రాయుమని’ ఎప్పుడూ అంటుండేవాడు. నేను రాయకపోయేసరికి శంకరమంచి సత్యం రాసిన అమరావతి కథలు, ఇంకో రెండు మూడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. తరచుగా అడుగుతూ ఉండేవాడు. వీటన్నిటి ప్రేరణతో బందారం కథలు 24 రాశాను. మూసీ పత్రికలో వచ్చాయి. అవన్నీ సంపుటిగా వేయబోతున్నా. త్వరలోనే వస్తుంది.

29. వర్తమాన తెలంగాణ సాహిత్యంలో ప్రత్యేకముద్ర వేసుకున్న మీరు ఇంకా ఏమైనా రచనలు చేస్తున్నారా?
జ :-     ప్రస్తుతానికి నేను ఖాళీ సమయం ఎక్కువగా ఉంటున్నది కాబట్టి పాటలు రాస్తున్నాను. యూట్యూబ్ వచ్చాక పాటలకు మంచి గుర్తింపు వస్తున్నది. నేను రాయాలనుకున్న ప్రాజెక్టులలో మా బాపు గురించి ఒక నవల రాసిన. అది అచ్చు వేయాల్సివుంది. ఆయన కథానాయకుడు. ఆయన జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రాసిన. అది కూడా త్వరలో అచ్చవుతుంది.

30. ఒక జాతి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడంలో కవుల పాత్ర ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు? ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఆధునిక కవిత్వం ఆ స్థాయిలో ఉందని అనుకోవచ్చా?
జ :-     ఎప్పుడైనా ప్రాంతీయ అస్తిత్వం కీలకమని నేను భావిస్తాను. అది ఎంత కీలకమో జాతి అస్తిత్వం కూడా అంతే కీలకం. ఏదైనా ఒక అస్తిత్వం రూపొందాలంటే దానికి సాహిత్యం అవసరం. అందుకు రచయితల కృషి అవసరం. అస్తిత్వాన్ని గుర్తించి దాన్ని బయటి ప్రపంచానికి చెప్పి నిరూపించేది సాహిత్యకారులు.  ప్రాంతీయ అస్తిత్వం లేకుండా ఏ రచనా రాదు. అది అనివార్యం. స్థల, కాల, ప్రాంతీయ, లింగ, మత అస్తిత్వాలు ఏవైనా అవి ఉనికిలోకి రావాలంటే రచయితలే కీలకం. ఇక జాతి అస్తిత్వం అంటే ఒక జాతిలో దేశం, మతం, ప్రాంతం, భాష ఇట్లా వివిధ అంశాల ఆధారంగా వివిధ జాతులు ఉంటాయి. అనేక కోణాల్లో అస్తిత్వాలు ఉంటాయి. ఇవన్నీ బలంగా ఉండాలంటే రచయితలు కూడా బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నది. భవిష్యత్తులో జరగాలి. ఇది నిరంతర ప్రక్రియ.

31. కవిత్వం, కథ ఈ రెండింటిలో తక్కువకాలంలో ప్రజలను చైతన్యపరిచేది ఏది? ఇప్పటి సాహిత్యం ఆ దిశలోనే ప్రయాణిస్తోందంటారా?
జ :-    ఈ రెండింటిలో కథ ప్రజలను ఎక్కువగా చైతన్య పరుస్తుంది. వీటికంటే ముఖ్యంగా పాట ప్రజలకు
తొందరగా చేరువవుతుంది. పాట కంటే నాటకం, నాటకం తర్వాత నృత్య రూపకం. పాటలో కూడా గానం, సాహిత్యం రెండూ ఉంటాయి. ప్రదర్శన కూడా ఉంటుంది. కవిత్వం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ కథ సూటిగా హృదయాన్ని చేరుతుంది.

32. ప్రస్తుత సామాజిక స్థితిగతులను అనుసరించి తరువాతి తరానికి మీ అనుభవపూర్వకమైన, మార్గదర్శక సూచనలు ఇవ్వండి.
జ :-   ఇప్పటివారిలో ముఖ్యంగా అధ్యయనం తగ్గిపోయింది. అధ్యయనం చేయాలన్నది నా ప్రధాన సూచన. ఎందుకు చదవాలన్నది కొంతమంది ప్రశ్న. చదవక పోవడం వల్ల భాష, పదాలు, సమాసాలు, వాక్య నిర్మాణాలు తెలియకుండా పోతున్నాయి. భావం కలుగుతున్నది. కానీ భావవ్యక్తీకరణకు సరిపోయినంత భాష వాళ్ళ దగ్గర లేదు. పదాలు తెలియనప్పుడు, వాటి అర్థం తెలియనప్పుడు, సరైన భాషా పదాలు లేనప్పుడు భావం వ్యర్థమవుతుంది. సరిగా వ్యక్తం కాదు. రెండవది ఎవరైనా సమకాలికంగా జీవించాలి. నీ చుట్టూ వున్న వస్తువుల నుండే వస్తువును తీసుకోవాలి. పుస్తకాలు చదవడం భాషను, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చుట్టూ వున్న మనుషుల జీవితాలను చదివితే వస్తువులు, వ్యక్తిత్వాలు, ఆదర్శాలు, విలువలు, ఘర్షణలు, బాధలు, కష్టాలు అన్నీ దొరుకుతాయి. అందుకే మానవ సంబంధాలు కలిగి ఉండాలి. మూడవది దాన్ని ప్రాథమికంగా చేసి కొంత త్యాగం కూడా చేయవలసి ఉంటుంది. ఏదీ వదులుకోకుండా, వెదుకకుండా నీ దగ్గరికి రాదు. దాని కోసం సమయం వెచ్చించాలి. శ్రద్ధ, ఏకాగ్రత లేకుండా, సమయం ఇవ్వకుండా నేను రాసిందే చెలామణి కావాలంటే కాదు. పోటీ ప్రపంచంలో నీకంటూ ఒక ముద్ర, నీ అస్తిత్వం, నీ శైలి, నీ వ్యక్తిత్వం అనివార్యంగా ఉన్నప్పుడే కవిత్వమైనా, కథైనా రాణిస్తుంది. అధ్యయనం, శ్రద్ధ, అంకితభావం, చిత్తశుద్ధి సమయం వెచ్చించడం చేస్తే తప్ప నిలబడలేరు అన్నది కొత్త తరానికి నా సూచన.

చాలా సంతోషం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మీ జీవన ప్రయాణంలో వివిధ కోణాలను మాకు తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారాలు🙏🏼

You may also like

Leave a Comment