“దీపాయ బ్రహ్మరూపాయ, విష్ణు రూపాయతే నమః |
రుద్రరూప నమస్తుభ్యం, దీప రూపాయతే నమః ||
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం త్రిమూర్తి స్వరూపం. దీపం జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీక. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దుర్గతులను తొలగించడం, పూర్వీకుల క్షేమాన్ని ఆశించడం, దారిద్ర్యం నాశనమై ఐశ్వర్యాన్ని పొందడం అనే మూడు భావాల సమ్మేళనం ఈ దీపావళి. ఈ పండుగలో జ్ఞానం పొందడం, పితృదేవతారాధన, లక్ష్మీ ఆరాధన ప్రధానమైనవి.
ఈ దీపావళి ఉత్తర భారతదేశంలో అయిదు రోజుల పండుగ. దక్షిణ భారతంలో ముఖ్యంగా మన తెలుగువారికి మూడు రోజుల పండుగ. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు మనం పండుగ జరుపుకొంటే ఉత్తరాది వారు, ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాతీయులు ఈ మూడు రోజులకు తోడు ధనత్రయోదశి (ధన్ తేరాస్), యమ ద్వితీయలను కూడా జరుపుకొంటారు. దీపావళి గుజరాతీలకు సంవత్సరాది కూడా.
పండుగ నేపథ్యం :
దీపావళికి సంబంధించిన పౌరాణిక, చారిత్రకాంశాలు గాథలుగా చెబుతారు. వాటిలో –
- విష్ణుపురాణం ప్రకారం – విష్ణువు వామన రూపంలో వచ్చి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపి ధర్మాన్ని రక్షించిన రోజున దీపావళి జరుపుకోవడం ప్రారంభమైంది.
- రావణ వధానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగిరాగా, ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడే ఆయనకు పట్టాభిషేకం జరగ్గా ప్రజలంతా ఆనందంతో దీపాలు నగరమంతా వెలిగించి పండుగ జరుపుకున్నారని, నాటినుండి ప్రతియేటా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారట.
- శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళి నరకాసురుని చంపగా ప్రజలు ఆనందంతో దీపావళి జరుపకున్నారట.
- ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జన్మదినం ఈ రోజు కావున ఆనందంగా దీపాలు వెలిగించి ఈ పండుగ జరుపుకుంటున్నారట.
- విక్రమాదిత్యుడు ఈ రోజుననే నవరత్న ఖచిత సింహాసనం అధిష్ఠించాడని, విక్రమ శకం ఆరంభమైన నేడు దీపావళి జరుపుకున్నారని, అదే సంవత్సరాదియని చెబుతారు.
- జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఈనాడు శరీరాన్ని పరిత్యజించగా, దేవలోక వాసులు దీపకాంతులతో ఆయనను ఆహ్వానించారనే విశ్వాసంతో ఇక్కడ దీపావళి జరుపుకుంటారు.
ఈ గాథలు గాక, కఠోపనిషత్ ప్రకారం నచికేతుడు యమధర్మరాజు దగ్గర ఉపదేశం పొంది భూలోకానికి రాగా ఆనాడు జనం దీపావళి జరుపుకున్నారని, ధర్మరాజు పట్టాభిషేకం నాడు దీపావళి జరుపుకున్నారని, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి జన్మించగా దీపాలు వెలిగించారని – ఇలా అనేక పురాణ కథలు ప్రచారంలో వున్నాయి.
వీటన్నిటినీ పరిశీలిస్తే ప్రతియుగంలోనూ ప్రజలు తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారని తెలుస్తుంది.
నరక చతుర్దశి : ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు అభ్యంగస్నానం చేసి, దీపదానం, యమ తర్పణం చేయడం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారని, అందువల్ల దానికి “నరక చత్తురశి” అనే పేరు వచ్చిందంటారు. కాని లోకంలో దీపావళి పండుగకు సంబంధించి “నరకాసురుని వధ” గురించి ప్రముఖంగా చెబుతారు. భాగవత, హరివంశాల్లో ఈ కథ ఉంది. ఇది అందరికీ తెలిసిన కథే. కాని దీన్ని జ్యోతిశ్శాస్త్రంతో సమన్వయించి, డా. తిరుమల రామచంద్రగారు చక్కగా వివరించారు. ‘………. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్ఠించి (నరకుడు భూదేవి కుమారుడు. మేషరాశి భౌముని రాశి. అది నరకునిలా మూర్ఖత మూర్తీభవించింది), నరకుని మీదకు యుద్ధానికి వెళ్ళిన కృష్ణుడు అంటే సూర్యుడు, సత్యభామ = చంద్రుడు, నరకుడు పడిపోగానే ఆకాశపుటంచుల మీద దీనచ్ఛాయలతో ఉన్న కన్యారాశి (కన్యల గుంపు) నరకుని (మేషరాశి) బంధం నుంచి విడివడి, తమను విడిపించిన సూర్యుని (కృష్ణుని) నాయకునిగా చేరుకొంది. దీన్ని పురాణ కథతో అతికించినారు” అని చెప్పారు.
ఈ నరకాసుర వధ ఘట్టాన్ని శ్రీ పాటిల్ నారాయణరెడ్డి గారు, స్త్రీ స్వాతంత్ర్యం – వైజ్ఞానిక విషయాలతో సమన్వయించి చూపారు. స్త్రీల స్వాతంత్ర్యాన్ని హరించిన రాజును సంహరించి శ్రీకృష్ణుడు “సమాజ సుధాకరుడు” అయ్యాడన్నారు. పోలిశెట్టి బ్రదర్స్ ప్రకృతిలో జరిగే మార్పులకు ఈ కథ ప్రతీక అని విశ్లేషించారు. మొత్తంమీద “నరకాసుర వధ” కథ దీపావళికి సంబంధించిన కథ అయినా కాకపోయినా దీన్నుంచి మనకెన్నో విషయాలు తెలుస్తాయి. నరక శబ్దానికి “దుర్గతి” అని అర్థం. దాన్నుంచి తరింపచేయగల చతుర్దశి “నరక చతుర్దశి”. నరకం అంటే కష్టం, దుఃఖం. వాటి నుంచి ఉద్ధరించేది అని చెప్పుకోవచ్చు.
ఈనాటి కర్తవ్యం : అభ్యంగ స్నానం చేసి, యమతర్పణం చేసేవారికి యమదర్శనం ఉండదని శాస్త్రవచనం. “చంద్రోదయ కాలే నరక చతుర్దశీ ప్రయుక్త తైలాభ్యంగం కుర్యాత్ ”. ఆరోజు చంద్రోదయ కాలం అంటే తెల్లవారు జామున తలంటి పోసుకోవాలి. అభ్యంగ స్నానం ఎందుకంటే,
“తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథైవసేత్ |
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ||”
దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి వసిస్తారు. కాబట్టి అలక్ష్మి (దరిద్రం, అభాగ్యం) తొలగిపోవడానికి తైలంతో ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేయాలి. అంతకుముందే ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి. నూతన వస్త్రాలు ధరించాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక 11 లేదా 21 దివ్వెల్ని వెలిగిస్తారు. కొన్నిచోట్ల నరకుని దిష్టిబొమ్మల్ని తగలబెడతారు.
వామన పురాణంలో ఈ చతుర్దశి నాడు “దీపదానం” చేస్తే పితృదేవతలకు స్వర్గనివాసం కలుగుతుందని జనులు విశ్వసిస్తారని చెప్పబడింది.
“చతుర్దశ్యాంతుయేదీపాన్ నరకాయ దదాతిచ
తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమవాప్నుయాత్ ||”
ఈ రోజు “పితృదేవతారాధన” కూడా కర్తవ్యమన్నారు. అలాగే “యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ” అని యమధర్మరాజును పూజించి, ఆయనకు తర్పణం ఇవ్వాలి. ఈ చతుర్దశిని “ప్రేత చతుర్దశి” అని కూడా అంటారు. ఈరోజు నువ్వులతో, మినుములతో చేసిన పిండివంటలు ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. శీతాకాలం ప్రవేశించిన సమయం కాబట్టి ప్రజల ఆరోగ్య రక్షణకు కావలసిన ఆహారాన్ని స్వీకరించమని మన శాస్త్రాలు చెప్పాయి.
దీపావళి విశిష్టత : దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే దినం కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. దీపాలను అలంకరించి వెలిగించడం ఈనాటి ప్రధాన కార్యక్రమం. పాల సముద్రం నుంచి వచ్చిన వెలుగే లక్ష్మీదేవి అని, భూమి మీద సంపద అభివృద్ధి చెందడానికి కారణం ఆ వెలుగే కాబట్టి దాన్నందించిన లక్ష్మిని “ధనలక్ష్మి”గా భావించి, దీపావళినాడు లక్ష్మీ పూజ చేయడం సంప్రదాయంగా వచ్చిందని పద్మపురాణం చెబుతూంది.
బలి చక్రవర్తి చివరి కోరిక ప్రకారం జనులు ఏటా మూడు దినాల పాటు పండుగ జరుపుకునేందుకు, అతని పేర దీపాలు వెలిగించేందుకు విష్ణువు అతనికి ప్రసాదించిన వరం ఫలితంగా దీపావళి నాడు దీపాలు వెలిగించే సంప్రదాయం ఏర్పడిందని “సనత్కుమార సంహిత” చెబుతూంది.
దీపావళి కర్తవ్యం – సందేశం : పాలసముద్రం నుంచి వెలువడ్డ దివ్యశక్తి శ్రీమహాలక్ష్మి, మన దగ్గరున్న ధనం పాలనుంచి వచ్చినట్లు స్వచ్ఛంగా ఉండాలని చెబుతుంది శాస్త్రం. అంటే, ప్రతి మనిషీ నీతి, నిజాయితీతో బతకాలని దీనిలోని అంతరార్థం, సందేశం.
ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని మనసారా పూజించి, ఆమెనిలా ప్రార్థించాలి.
“శ్రీరూపేంద్ర సదనే మదనైకమాతా
జ్యోత్స్నా ఇసి చంద్రమసి చంద్రసహోదరస్యే
సూర్యే ప్రభాసిత జగత్ త్రితయే
ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే !”
దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శుభప్రదం. వృక్షరూపంలో అలంకరించి దానిపై దీపాలుంచాలి. తులసి దగ్గర, గుమ్మాల దగ్గర, వాకిట్లో దీపాలు వెలిగించి, అర్ధరాత్రి తప్పెట్ల మోతతో అలక్ష్మిని వెళ్ళగొట్టాలి.
బాణాసంచా కాల్చడం :
“చిటపట టుప్పుటప్పనెడి సీమ టపాకుల పెట్టె లెన్నియు
ద్భటముగ ఢమ్ముడమ్మను టపాకులవెన్ని మతాబులెన్ని పి
క్కటిలెడి ఝల్లులెన్ని, మతి కాకరపూవతులెన్ని గాలురో
దిటముగ దెల్పనా తరమె దివ్వెల పండుగ రేయి నర్భకుల్” – దాసు శ్రీరాములు
దీపావళినాడు వెలుతురిచ్చే, చప్పుడు చేసే బాణాసంచా కాల్చడం దేనికి? మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగివచ్చి, భూలోకంలో తిరుగుతూ ఉండే పితృదేవతలు ఈ రోజు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళతారు. వారికి వెలుతురు చూపడం కోసం నరలోకవాసులు చేతులతో కాగడాలు పట్టుకొని ఆకాశంవైపు చూపాలని శాస్త్రవచనం. ఆ కాగడాలే నేడు దీపావళినాడు మతాబులు కాల్చడంగా మారింది. అలక్ష్మిని వీధుల వెంట సాగనంపే వాద్యధ్వనులకు మారుగా టపాకాయలు కాలుస్తున్నారు.
సస్యాలను పాడుచేసే కీటకాలు పుట్టే సమయం ఇది. ఆ కీటకాలు నశించడానికి దీపాలు, టపాకాయలు దోహదం చేస్తాయి. ఈనాటినుంచి ఆకాశదీపం వెలిగించడం ప్రారంభిస్తారు. కార్తీక మాసాంతం వరకు ఇది సాగుతుంది. దీనివల్ల పితృదేవతలకు దారిచూపడమే కాకుండా, సస్యరక్షణకు దోహదం కలుగుతుంది.
ఉపసంహారం : దివ్వెల పండుగ దీపావళి. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గంలో పయనించమని చెప్పే పండుగ. “తమసోమాజ్యోతిర్గమయ” అనే ఉపనిషద్వాక్య సందేశం దీనిలో కనిపిస్తుంది. దేశ, విదేశాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఆరోగ్యం, ఆనందం, సామాజిక (సస్య) ప్రయోజనాలతో కూడుకున్న ఈ పర్వదినం మానవాళి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని కోరుకుందాం.
“సర్వే భవంతు సుఖినః సర్వేసంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖభాక్ భవేత్ ||