Home వ్యాసాలు ఆషాఢం – విశిష్ఠత

ఆషాఢం – విశిష్ఠత

by Vijaya Goli

భారతీయ హిందూ సంస్కృతి లో ప్రతి పురాతన సాంప్రదాయానికి శాస్త్రీయ కారణం ఉంటుంది . అలాగే మన తెలుగు నెలలు ఛైత్రము నుండి ఫాల్గుణం వరకు ప్రతి మాసం ప్రత్యేకమైనదే.ప్రతి మాసానికి ఆ సమయపు వాతావరణాన్ని బట్టి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ,శాస్త్రీయ బద్ధంగా ఉంటాయి.ఇపుడు మనం ఆషాఢ మాసం గురించి విశ్లేషించుకుందాము.
ఈ సంవత్సరం జూన్ 24ఆదివారము నుండి మొదలుగా జులై 21 వరకు ఆషాఢ మాసం వుంది .
ఆషాఢమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తు కొచ్చేది వానలు .
తెలుగు నెలలలో ఛైత్రం తర్వాత ఆషాఢం నాల్గవ నెలగా వస్తుంది .ఆషాఢ పౌర్ణమి ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రాలతో కలిసి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంగా పరిగణించారు .
ఈ నెల నుండే వర్షాకాలం మొదలవుతుంది. అప్పటి వరకు వున్న వేసవి తాపాన్ని చల్ల బరుస్తూ ..చిరు జల్లులతో వాతావరణం చాలా ఆహ్లాద కరంగామారుతుంది .
ప్రకృతి ఆకుపచ్చని చీర కట్టిన పెద్ద ముత్తైదువలా ఉంటుంది . వర్షంలో తడిచి …పచ్చగా కొత్త చిగురులతో నిగారింపు తేలుతుంది .ఆకాశమంతా ఒక్క సారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చి …ఆమబ్బుల మధ్య మెరుపు తీగల నాట్యం కనుల విందుగాకనిపిస్తుంది .అదేసమయంలో ఒక్కోసారి దేవ దానవ యుద్ధాన్ని స్పురణకు తెస్తూ భయపెడుతూ ఉరుములు ..ఒక్కోసారి శుభకార్యాలను గుర్తు చేస్తూ మంగళ వాద్యాలుగా వీనుల విందు చేస్తాయి .నదులు ,చెరువులు పొంగి పొర్లుతూ వుంటాయి. అంతలోనె మబ్బులన్నీ చెదిరిపోయి వెండి వెలుగులతో సూర్యుడు వేడుక చేస్తాడు. అప్పడప్పుడు హరివిల్లులు దాగుడు మూతలాడుతూ అల్లరి చేస్తాయి.వ్యవసాయానికి కూడా చాలా అనువైన సమయం .
శుభకార్యాలు చేయక పోయినా ఆధ్యాత్మికతను అంతరించుకున్న మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం అంతా విష్ణు చింతన మంచిదంటారు .
ఏకాదశి నుండి విష్ణుమూర్తి క్షీర సముద్రంలో యోగ నిద్రలో శయనిస్తాడని ,ఆరోజును శయన ఏకాదశిగా ,తొలి ఏకాదశిగా ఉపవాస వ్రతాలు ,సముద్ర స్నానాలు చేస్తారు . దక్షిణాయనం ప్రారంభ దినంగా కూడా శాస్త్రం చెపుతుంది .సాధు సన్యాసులు చేసే చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజు నుండే మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి తో ముగుస్తాయి .అలాగే భాను సప్తమి ఆ రోజు పగలు ,రాత్రి సమంగా ఉంటాయి.
ఈ మాసం లోనే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి .ఆడవారికి విశిష్ఠమైన బోనాల పండుగ కూడా ఆషాఢం లోనే ఆరంభ మవుతుంది. ప్రకృతి ప్రసాదించే పచ్చని కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ఆరాధిస్తారు.మొదటి పంటగా అమ్మ వారికి నైవేద్యం పెడతారు.
ఆషాఢమంతా కూడా ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తులు పరవశం చెందుతారు .ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమగా ,వ్యాసపూర్ణిమగా పిలువబడుతుంది . గురుపూజ ఉత్సవాలు జరుగుతాయి .పితృ తర్పణాలకు ప్రత్యేకమైన మాసంగా కూడా పరిగణిస్తారు .
ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా చెప్పారు .వేసవి వల్ల వేడెక్కిన భూమి ఒక్క సారిగా వర్షాలతో చల్ల పడటం వలన వాతావరణం లో వచ్చే మార్పులతో
ప్రజల్లో రుగ్మతలు పెరుగుతాయి . అధిక వర్షాల వలన కాలువలు నదులలో కాలుష్యం చేరటం వలన అంటు రోగాలు ప్రబలుతాయి . చిత్తడి నేలల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి .ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతారు . ఆషాఢం ఆడవారు గోరింట తప్పక పెట్టు కోవాలని వారి ఐదోతనానికి ముడి పెడతారు .అసలు శాస్త్రీయ కారణం …వర్షం వలన తడి ఆరక గోళ్ళు ,కాలి వేళ్ళు పుండ్లుగా మారుతాయి .గోరింట ఔషధ గుణాలు ఉన్న
మొక్క . చర్మ రక్షణగా పనిచేస్తుంది. అందువలన ఆడవారిని తప్పక గోరింటపెట్టుకోవాలని చెపుతారు .
కొత్తగా వివాహమైన జంటలు కలిసి ఉండ కూడదనే ఒక సాంప్రదాయం కూడా ఉంది .ఆషాఢ మాసం నెల రోజులు ఆడపిల్లను పుట్టింటికి పంపి.ఆషాఢం వెళ్ళగానే ఆషాఢ పట్టీ అనే వేడుకతో అల్లుడిని స్వాగతిస్తారు .వారి ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి వేడుకలు చేసుకుంటారు .కానీ..
నిజానికి శాస్త్రీయంగా …ఆషాఢంలో ఆడపిల్ల గర్భం దాలిస్తే …ప్రసవం నిండు వేసవిలో అంటే ఏప్రిల్ మే నెలల్లో వస్తుంది .ఆ సమయం ప్రసవానికి అనువైనది కాదు కాబట్టి ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు .
ఇలా ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని శాస్త్రీయ కోణం లో ఆలోచిస్తే మన పండుగలు ,వేడుకల్లో ఎంత విలువైన సందేశాలున్నాయో అర్ధ మవుతుంది .ఆషాఢ మాసం ప్రతి రోజూ కూడ ఆధ్యాత్మికతను సంతరించుకుని వుంటుందనటానికి ఎలాంటి సందేహం లేదు .

You may also like

Leave a Comment