మహా మహోపాధ్యాయ, కవి పండితులు, నిఘంటు నిర్మాతలు, గుణ గరిష్ఠులు, ఆచార్య వరిష్ఠులు, సంస్కృతాంధ్రభాషా సాహిత్యాలలో పండితులు నిగర్వి నిరాడంబురులు ఆచార్య రవ్వా శ్రీహరిగారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి భాషామతల్లి సేవలో జీవనయానం కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆచార్య రవ్వాశ్రీహరిగారు. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠం నుండి దిద్దుకున్న సంస్కృత భాషా తిలకం ఉపకులపతి పీఠమెక్కి విద్యా ప్రభలు పంచింది. ఎం.ఎ.(తెలుగు) ఎం.ఎ.సంస్కృతం, భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాను పొందిన ప్రతిభ వారిది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఒరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా, ఉపన్యాసక వృత్తిలోకి అడుగిడినారు. సీనియర్ తెలుగు పండితుని నుంచి ప్రొఫెసరందాకా ఆదర్శవంతమైన అద్భుతమైన బోధన చేసిన ఉత్తమ ఆచార్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ద్రావిడ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన పరిపాలనా దక్షత వీరిది. రవ్వా శ్రీహరిగారు వివిధ విశ్వవిద్యాలయాలలోని విద్యా సంఘాలతో లెక్కకు మిక్కిలి పదవులు నిర్వహించిన ఘనత వీరిది.
శ్రీహరిగారు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీహరి నిఘంటువు. తెలుగు సారస్వత క్షేత్రంలో నిలిచిపోయే అనేక అంశాలను అనుశీలించారు. తెలుగు నిఘంటువులున్నంత కాలం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు ‘శ్రీహరి నిఘంటువు’ కూడా నిలిచిపోతుందని పరిశోధకుల అభిప్రాయం.
మరొక అద్భుత గ్రంథం సంకేత పదకోశం. దీనిలో మనకు కావల్సినన్నివ్యాకరణ, తర్క, మీమాంస, జ్యోతిష, అలంకారాల ఆయుర్వేద మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పదాల కూర్పు జరిగింది. రెండవ ముద్రణలో మరిన్ని అంశాలను చేర్చి పాఠకులకు ఆసక్తిని కలిగించారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల్లోని అచ్చ తెలుగు పదాలను, క్లిష్టమైన భాషాంశాలను భక్తి భావ సంపన్నతను, సంగీత ప్రావీణ్యతను భాషా ప్రయోగ చతురతను ఎన్నింటినో అన్నమయ్య పదకోశంలో వివరించిన విజ్ఞానవంతులు ఆచార్యులు. తెలంగాణా భాషా ప్రాచీనతను, ప్రామాణికతను ఎత్తి చూపిన శ్రీహరిగారి రచన తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు. తెలంగాణాలో వాడుకలో వున్న ఎన్నో పదాలకు అర్థాలను తెల్పినారు. నల్లగొండ జిల్లా ప్రజల భాష….. మాండలిక పదకోశం నిర్మించినారు. వ్యాకరణ పదకోశము, వాడుక తెలుగులో అపప్రయోగాలు, లఘుసిద్ధాంత కౌముది, పాణినీయ అష్టాధ్యాయి తెలుగు అనువాదం , కాశీకాసహితం ౨ సంపుటాలు) సంస్కృత రచనలలో సంస్కృత సూక్తి ముక్తావళి సంస్కృత న్యాయాలు, సంస్కృత నీతి రత్నాకరం, సంస్కృత న్యాయదీపిక అనువాదాలలో డా|| సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా ఫిరదౌసి, గబ్బిలం వేమన శతకం శేషప్ప నరసింహ శతకం, మాతృగీతమ్, స్వీయరచనలు సంస్కృతీ వైజయంతితోపాటు అనేక రచనలకు సంపాదకత్వం వహించిన కవి పండితులు, భాషావేత్త, వీరి సాహిత్య వ్యాసాలు చాలావరకు పరిశోధనాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. రవ్వాగారి గ్రంథాలలో ప్రామాణికత, శాస్త్రీయ స్పష్టంగా గోచరిస్తుంది. తెలుగులో భాషా సాహిత్యానికి సంబంధించిన వీరి రచన ఉదయభారతి. ఇందులో తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాలకు వ్యాసాలు, వ్యాకరణ సంబంధితాలున్నాయి. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, భాస్కర రామాయణు – విమర్శనాత్మక పరిశీలనము (సిద్ధాంత గ్రంథము)
శ్రీహరిగారి రచన భాషా విశేషాంశాలు, వ్యాకరణ సంబంధితాలు, సాధికారతతో చెప్పి పరిశోధకులకు, భాషా ప్రియులకు అనేక విషయాలు తెల్పి ఇంకా తెల్పవలసిని అనేకం ఉన్నాయంటూ భావి పరిశోధకులకు వదిలివేసినారు.
నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలోని నిరుపేద చేనేత కుటుంబంలో 5 మే 1943న రవ్వా వేంకటటనరసమ్మ,నరసయ్య దంపతులకు జన్మించినారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో భువనగిరిలో 5వ తరగతి వరకు చదివినారు. తల్లగారి మరణంతో చదువుకు అవాంతరం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి శ్రీహరి గారిని చదివించలేనని తెలియజేశారు. దినపత్రికలోని యాదగిరి దేవస్థానము సంస్కృత విద్యాపీఠం ఉచిత చదువును భోజనాల్ని కల్పిస్తారని తెల్సుకొని అక్కడ చేరిన ఆచార్యులవారి జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుండి బయలుదేరి ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన ఉభయభాషా ప్రౌఢి.
ఆచార్య శ్రీహరిగారి పంచశతి (75 సంవత్సరాలు) పురస్కరించుకొని ‘శ్రీహరి విజయం’ పుస్తకం వేయడం జరిగింది. దీనిలో అనేక వ్యాసాలు సాహితీవేత్తల అభిప్రాయాలు, రచనలు వీరి సంబంధిత సాహిత్య విశేషాంశాలు పొందుపరచబడినాయి.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన, నిఘంటువు నిర్మాణం వీరి ప్రతీ అక్షరం వినూత్నం. వీరీ విశేష కృషికి పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. సంస్కృతి విద్యాపీఠ్ తిరుపతి వారి మహామహోపాధ్యాయ కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం (అనువాద రచనకు), తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, జాషువా సాహిత్య పురస్కారం, న్యూజెర్సి అమెరికావారి బ్రౌన్ పురస్కారం, సౌశీల్య పురస్కారం, పరవస్తు చిన్నయ సూరి జాతీయ పురస్కారం లాంటి చాలా పురస్కారాలు పొందినారు.
ఆచార్య రవ్వా శ్రీహరిగారంటే నడిచే విజ్ఞాన సరస్వం. వీరి గురించి రాయటం ఒడవని ముచ్చట. ఇలాంటి మహానుభావులపై అత్యంత ఇష్టంతో, జాగరూకతతో అల్పుడిని అంటూ అనల్పమైన శ్రీహరిగారి తెలుగు రచనలు – సమగ్ర పరిశీలనపైన డా|| సి.యాదగిరి ఆచార్య సాగి కమలాకరశర్మగారి వద్ద పరిశోధన చేసి పట్టాను పొంది తెలుగు ఉపాధ్యాయులు కాకున్నా డా || యాదగిరి గారు తమ పరిశోధనలో ఎన్నో విషయాలను తేటతెల్లం చేసినారు. ఇంకా రవ్వాగారి మీద చాలా పరిశోధనలు రావాల్సి ఉంది.
ఆచార్య రవ్వా శ్రీహరి గారి కలం నుండి ఇంకా ఎన్నోరావల్సి ఉండేది. అనారోగ్య కారణాల వలన పూర్తి కాలేకపోయినాయి. ప్రస్తతం డా||సి.యాదగిరి గారు పరిశోధనలో భాగంగా శ్రీహరి చేసిన ఇంటర్వ్యూ యదాతథంగా మీకు అందిస్తున్నాం.
-కె.ఎస్.అనంతాచార్య
వెలువర్తి వెలుగు రవ్వ!!
సార్ మీ బాల్య విశేషాలు తెలియజేయండి?
మా అమ్మమ్మగారి ఊరు రామన్నపేట తాలుకాలోని ‘మునిపంపుల’ గ్రామం. అక్కడ చదువు బాగా ఉంటుందని మా అమ్మగారు ప్రాథమిక విద్యాభ్యాసం కోసం అక్కడే ఉంచినారు. నాలుగవ త
రగతి వరకు అక్కడే చదివినాను.
పల్లెటూరి చదువుల ప్రభావం వివరించండి?
‘మునిపంపుల’ పల్లెటూరైనా అక్కడి తల్లిదంద్రుడుల తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తమ పిల్లలను చక్కని విద్యావంతులుగా చేయాలని వారికి ఆసక్తి ఉండేది. అందువల్ల అక్కడి అధ్యాపకులందరు కూడా చక్కగా విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని మంచి విద్యావంతులుగా సిద్ధం చేసేవారు.
ఉన్నత పాఠశాల చదువులవరకు ఏమైనా విశేషాలు తెలియజేయండి?
మునిపంపులలో నాల్గవ తరగతి అయిపోగానే ఉన్నత పాఠశాల విద్యభ్యాసం కోసం భువనగిరిలోని ప్రాథమికోన్నత పాఠశాల లో చేరడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం మాత్రమే చదివి 5వ తరగతి పూర్తి చేసుకున్నాను.
పాఠశాల చదువులు వదిలిపెట్టి గురుకుల విద్యకు ఎలా వచ్చారు?
5వ తరగతి పూర్తి చేసిన సంవత్సరమే వేసవి సెలవులలో మా అమ్మగారు పరమపదించడంవల్ల నా చదువు కొనసాగే సూచనలు సన్నగిల్లినాయి. ఇక పై తరగతులు చదివించడం, కుటుంబ ఆర్థిక కారణాల కారణంగా సాధ్యం, కాదని మా, నాన్నగారు చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ సమయంలోనే ఒకరోజు పత్రికలో యాదగిరి దేవస్థానంవారి సంస్కృత విద్యాపీఠం ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలు ఉంటాయని, ఫీజులేవి ఉండవని సంస్కృతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఎంట్రెన్స్ పరీక్షకు బోధన ఉంటుందని తెలియచేసినారు. ఆ ప్రకటన చూసి యాదగిరి గుట్ట సంస్కృత విద్యాపీఠంలో చేరడం జరిగింది. అక్కడే నాలుగు సంవత్సరాలు సంస్కృత విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత సికింద్రాబాద్ లోని మున్నాలాల్ సంస్కృత కళశాలలో ఒక సంవత్సరం చదివి ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడను కావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాలు సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేసి బి.ఓ.ఎల్. పట్టాను ప్రథమ శ్రేణిలో సంపాదించినాను.
సంస్కృత కళాశాలలో మీ చదువు ఎలాంటి నియమాలతో కొనసాగేది?
నేను చదువుకున్నటువంటి సంస్కృత పాఠశాలలో ఇంచుమించు అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. నలు
గురైదుగురు మాత్రమే బ్రాహ్మణేతరులు ఉండేవారు. వీరు కూడా బ్రాహ్మణ విద్యార్థుల మాదిరిగా బ్రాహ్మణ ఆచారాలను పాటించాల్సి ఉండేది. విద్యార్జనే ప్రధానంగా పెట్టకున్నవాణ్ణి కనుక వారి నియాలన్నింటిని నేను కూడా తు.చ. తప్పకుండా అనుసరించేవాణ్ణి. ఆ నియమాలన్నీ కూడా తరువాతి కాలంలో నా క్రమశిక్షణ జీవితానికి మంచి పునాదులు వేసాయి.
గురువుల ప్రభావం మీ మీద ఎలా ఉండేది?
తొలిదశలో కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సంస్కృత అక్షరాభ్యాసం చేయించిన గురువులు. వారు అప్పుడే మైలాపూర్ సంస్కృత కళాశాలలో (మద్రాస్/ చెన్నై) శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులై యాదగిరి విద్యాపీఠంలో సంస్కృత అధ్యాపకులుగా చేరినారు. వారు మంచి అధ్యాపకులు, అంతేకాక విద్యార్థుల యొక్క క్రమశిక్షణపై మంచి శ్రద్ధ కలవారు. అందువల్ల వారి శిక్షణలో తొలిదశలో సంస్కృతాన్ని చక్కగా అధ్యయనం చేయడానికి పునాదులు పడ్డాయి. వారు తొలి దశలో వేసిన పునాదే నాకు తర్వాతి కాలంలో ఎంతో లాభాన్ని చేకూర్చింది. తొలి దశలో వారి ప్రభావం నాపై ఎంతగానో పడింది. ఆ తర్వాత నాకు వ్యాకరణ విద్యను ప్రసాదించినటువంటి గురువులు ముగ్గురు. ఒకరు కోయిల్ కందాడై శఠగోప రామానుజాచార్యులుగారు, శ్రీమాన్ ఖండవల్లి నరసింహశాస్త్రిగారు, శ్రీమాన్ అమరవాది కృష్ణమాచార్యులవారు. ఈ ముగ్గురూ వ్యాకరణ గురువులు. మునిత్రయం అనదగినవారు నాకు సంస్కృత వ్యాకరణాన్ని మహాభాష్యాంతం అనుగ్రహించిన గురువులు. వీరు నన్ను పుత్రునిలాగా భావించి నా విద్యాభ్యాసంతోపాటు నా యోగక్షేమాలు కూడా చూస్తూ నన్ను ప్రోత్సహించినవారు. వీరి ప్రభావం నా మీద అమితంగా పడిందని చెప్పవచ్చు.
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుంచి వచ్చిన మీకు అధ్యయనంలో కలిగిన అనుభవాలు ఏమిటి?
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చిన నాకు సంస్కృత అధ్యయనంలో, శాస్త్ర అధ్యయనంలో కాని ఏ విధమయిన ఆటంకాలు ఏర్పడలేదు. మా అధ్యాపకులు అందరూ బ్రాహ్మణులే. అయినా నన్ను చాలా అభిమానంతో, ప్రేమతో చూచుకునేవారు. నేను బాగా చదువుతానని అందులోను బ్రాహ్మణేతర కుటుంబం నుండి వచ్చి వ్యాకరణ శాస్త్రాన్ని చక్కగా బ్రాహ్మణ విద్యార్థులతో సమానంగా అధ్యయనం చేస్తున్నందుకు వారెంతో సంతోషపడి నన్ను ప్రోత్సహించేవారు. ఒకసారి పరీక్షలో నేనెంతో బాగా రాసిన సమాధాన పత్రానికి సంతుష్టులయిన మా గురువుగారు శ్రీమాన్ శఠగోప రామానుజాచార్యుల వారు ఎంతో ఆనందించి నా పై తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ నా సమాధాన పత్రాన్ని వారికి చూపి నన్నెంతో ప్రశంసించినారట. ఈ విషయం విన్ననాడు నాకు మా గురువుగారు ఎంత విశాల హృదయులో అవగతమయింది. అంతేకాక నా మరో గురువు శ్రీ అమరవాది కృష్ణమాచార్యులవారు. నేను కళాశాల విడిచిపెట్టిన తర్వాత కూడా విద్యార్థులందరికీ కూడా నా గురించి చెబుతూ నన్ను ప్రశంసిఁచేవారని అప్పటి ఆ విద్యార్థులు వచ్చి చెప్పేవారు. వారి విశాల హృదయానికి నా జోహార్లు. కనుక విద్యాభ్యాస దశలో సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చినా నన్నందరూ అభిమానించారే కాని నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు.
సంస్కృతంలో డిగ్రీలు సాధించినా తెలుగు ఉపన్యాసకులుగా మీ అనుభవాలు?
నేను మౌలికంగా అధ్యయం చేసింది సంస్కృతమే కాని ఆ రోజుల్లో సంస్కృతం చదువుకున్న పండితులందరికీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగానే ఉద్యోగానికి అవకాశం ఉండేది. సంస్కృత అధ్యాపకుల ఉద్యోగాలు ఉండేవి కావు. కనుక నేను కూడా తొలి దశలో ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగానే చేరి 5,6 సంవత్సరాలు పనిచేసినాను. తెలుగులోను, సంస్కృతంలోను, ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయినాను. అయితే సంస్కృత శాఖలో నాకు అవకాశం రాకపోవడంతో తెలుగుశాఖలో ఉపన్యాసకునిగా చేరడం జరిగింది. అయితే సంస్కృతంలోలాగా తెలుగులో కూడా నేను ప్రావీణ్యం సంపాదించి తెలుగుశాఖలో కూడా ఉత్తమ అధ్యాపకుడిగా పేరు సంపాదించుకున్నాను.
భాషా పరిశోధనలకు ఎందుకు పూనుకున్నారు?
నాకు అభిమాన విషయం సంస్కృత వ్యాకరణం. అందులో మహాభాష్యాంతం చదువుకున్నాను. ఆ కారణంగా తెలుగు వ్యాకరణాలను కూడా బాగా అద్యయనం చేయడం జరిగింది. పాణినీయ వ్యాకరణంలో భాషా శాస్ర్తానికి సంబంధించిన మౌలికమైన అనేకాంశాలు ఉన్నాయని ఆధునిక భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక భాషా శాస్త్రం కూడా కొంత అధ్యయనం చేయడంవల్ల భాషా పరిశోధనపై నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది.
వ్యాకరణ శాస్త్రంలో సాధించిన విజయాలు వివరించండి?
నేను అటు సంస్కృత వ్యాకరణాన్ని ఇటు తెలుగు వ్యాకరణాన్నిఇటు తెలుగు వ్యాకరణాన్ని రెండింటిని అధ్యయనం చేయడంవల్ల రెండింటిలో కొంత కృషి చేయడం జరిగింది. విశ్వవిద్యాలయంలో, కళాశాలలో అనేక సంవత్సరాలు బాల వ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, ఆంధ్రశబ్ద చింతామణి మొదలైన అనేక వ్యాకరణ గ్రంథాలను బోధించడం జరిగింది. సంస్కృతంలో లఘుసిద్ధాంత కౌముది గ్రంథంలో తెలుగు విద్యార్థులకు అవసరమయ్యే కొన్ని భాగాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథాన్ని ఇటీవల కాశికావృత్తితో పాటుగా అనువాదం పూర్తి చేయడం జరిగింది. దీనిని తెలుగు అకాడమీ వారు రెండు సంపుటాలలో ముద్రించి వెలుగులోకి తెచ్చినారు.
నిఘంటు నిర్మాణంలో అనుభవాలు తెలియజేయండి?
మొట్టమొదటగా నేను తెలుగు అధ్యాపకుడిగా చేరి అధ్యాపన చేస్తున్నప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలే నా నిఘంటు నిర్మాణ కార్యక్రమానికి దోహమయినాయని చెప్పవచ్చు. నేను రచించిన నిఘంటువులన్నీ విద్యార్థులు యొక్క అవసరాలను తీర్చడం కోసమే. అయితే నిఘంటు నిర్మాణం అనేది చాలా శ్రమతో కూడిన పని. ఎంతోమంది సమష్టిగా చేయవలసిన పని, అయినా నాకా ప్ర్రకియపై ఉన్న అభిమానమే నాచే అనేక నిఘంటువులను నిర్మింపచేసింది. నిఘంటు నిర్మాణం వల్ల భాషకు సంబంధించిన అనేకాంశాలను నేను క్రొత్తగా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా “శ్రీహరి నిఘంటువు” నిర్మాణ సందర్భంలో తెలుగు సాహిత్యంలోని అనేక గ్రంథాలను పరిశీలించే అవకాశం కలిగింది. అనేక నిఘంటువులను పరామర్శించే అవకాశం కూడా కలిగింది.
సంస్కృతం నుండి తెలుగుకు, తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదాలు ఎందుకు చేయాలనుకున్నారు? వాటి నేపథ్యం, అనుభవాలు వివరించండి?
నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు సంస్కృత శ్లోక రచనపై ఎందుకో ఆసక్తి కలిగింది. మొట్టమొదటగా కాళహస్తీశ్వర శతకంలోని ఒక పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. ఆ శ్లోకాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతశాఖ ప్రచురించే ‘జయంతి’ పత్రికలో ప్రచురింపబడ్డాయి కూడా. కొంతమంది అవి బాగున్నాయన్నారు. ఆ ఉత్సాహమ తెలుగులోని రచనలను సంస్కృతంలోకి అనువదించడానికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ పదులు, ఫిరదౌసి, గబ్బిలం, నరసింహశతకం గ్రంథాలను, అన్నమయ్య సూక్తులను సంస్కృతీకరించడం జరిగింది.
‘విశ్వంభర’ లాంటి సినారె మహా కావ్యాలు ఎన్నో వుండగా, ‘ప్రపంచ పదులు’ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
‘విశ్వంభర’లోని విషయం గహనమైంది. ‘ప్రపంచపదులు’లోని విషయం ప్రతి వ్యక్తిని స్పృశిస్తుంది. ఇదొక శతకం లాగా వుంది. ‘విశ్వంభర’లో గాఢత్వముంది. సులభ గ్రాహిత్యం తక్కువ. బాగా ఆలోచిస్తే గానీ అది అర్థం కాదు. ‘ప్రపంచపదులు’ అలా కాదు. శతకాల మాదిరిగా అందులోని భావాలు సమాజంలోని అందరికీ సంబంధించినవి. భాష కూడా సరళంగా వుంటుంది. సులభంగా అర్థం అవుతుంది. ఈ కారణాలచేత ‘ప్రపంచపదులు’ సంస్కృతంలోకి అనువదిస్తే అది అందరినీ ఆకర్షిస్తుందని భావించాను. అంతేకాకుండా ఇందులోని ఛందస్సులోనూ ఒక విశేషముంది. ముఖ్యఁగా సంస్కృతంలో ఒక కొత్త ఛందస్సును – రుబాయి ఛందస్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది అనువాదం చేస్తే , అందుచేత అదే ఛందస్సులో సంకలనంలోని 108 కవితలు అనువదించాను. అనువాదం అంటే సాధారణంగా భావాన్ని తీసుకుని ప్రాచీన ఛందస్సులైన చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం ఇత్యాదుల్లో పొందుపరుస్తారు. కానీ నేను, నారాయణరెడ్డిగారు ఏ ఛందస్సును, ఏ మాత్రా ఛందస్సును ఆశ్రయించి ఆ రుబాయిలను వ్రాశారో, అదే పద్ధతిలో సంస్కృతంలో వ్రాశాను. సంస్కృతంలో సంప్రదాయ పద్దతులకు భిన్నంగా వ్రాయడం సాధారణంగా ఉండదు. అయినా నేను ఆధునికంగా వ్రాశాను.
నారాయణరెడ్డిగారి కవిత్వం ఎక్కువగా శబ్దాశ్రయ చమత్కారానికి చెందింది కదా? సంస్కృతంలోకి మీరు ఎలా అనువదించారు?
చాలావరకు ఆయన చూపినటువంటి శబ్దాలకు సంబంధించిన సొగసులన్నీ సంస్కృతంలో తీసుకురావడానికి ప్రయత్నించాను. ఎక్కడో కొన్ని రాలేదు కానీ ఎనభై శాతం దాకా వారు శబ్దాలంకారాల్లో చూపిన సొగసును సంస్కృతంలో తెచ్చాను. అదే ఛందస్సులో అంత్యప్రాసలతోపాటు అనువదించాను. మూల రచనలాగే నా అనువాదం లయాత్మకంగా, సరళంగా వుంది.
లోగడ మీరేమి సంస్కృతీకరించారు?
మొట్టమొదటి నుంచీ నేను సంస్కృతంలో కృషి చేసినప్పటికీ సంస్కృతంలో ఈ అనువాద ప్ర్రకియను మాత్రం ఈ ‘ప్రపంచ పదులు’తోనే ప్రారంభించాను. దీని తర్వాత మహాకవి జాషువా ‘ఫిరదౌసి’ కావ్యాన్ని సంస్కృతంలోకి తెచ్చాను. ఆయన మహాకావ్యం ‘గబ్బిలం’ ‘తైలపాయిక’ శీర్షికన సంస్కృతీకరించాను. ఇవి కాకుండా నేరుగా సంస్కృతంలో శతక రూపంలో ‘మాతృగీతిక’ను ఎప్పుడో వ్రాశాను. మొదట పరిశోధన, నిఘంటు సంబంధ కృషి చేశాను. కవిత్వపరమైన కృషి చాలా ఆలస్యంగా ప్రారంభించాను.
సంస్కృతంలో పాఠకులు చాలా తక్కువగా ఉన్నారు కదా? అలాంటప్పుడు మీ ప్రయత్నం పాఠకులకు ఎంతవరకు చేరుతుందని భావిస్తున్నారు?
సంస్కృత పాఠకులను మనం మొత్తం దశంలో పరిగణలోకి తీసుకోవాలి. విదేశాలలో కూడా సంస్కృతం వుంది. మన దేశంలో ఎంత శ్రద్ధతో సంస్కృతం చదువుతున్నారో, అంత శ్రద్ధగా విదేశాలలోనూ సంస్కృతం చదువుతున్నారు. ఆ మధ్య కార్డోనా అనే గొప్ప సంస్కృత జ్ఞాని ఇక్కడికి వచ్చారు. ఆయన కాశీలో వుండి సంప్రదాయ పండితుల వద్ద మహాభాష్యం, వ్యాకరణం చదువుకుని గొప్ప భాషావేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఇలా ఇఁకా చాలామంది వున్నారు. సంస్కృతం విశ్వవ్యాప్తమైన భాష. కాబట్టి మన దేశంలో, విదేశాలలో సంస్కృతం చదువుకునేవారు పెద్ద సంఖ్యలో వున్నారు. వారు ఈ గ్రంథాలు చదివితే చాలు.
మరి సంస్కృతం మృతభాష అని కొందరు హేతువాదులే వాదిస్తున్నారు. మీరేమంటారు?
మృతభాష అంటే వారి దృష్టి – వ్యవహారంలో లేని భాష అని. వ్యవహారానికి ఉపయోగించని భాషలు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానమంతా ఈ సంస్కృత భాషలోనే వుంది. అందుచేత సంస్కృత భాష విషయంలో ఇది దురభిప్రాయం. ఇలా ఎందుకు జరిగిందంట – సఁస్కృత భాషలో అనేక సాంకేతిక రంగాలకు చెందిన శాస్ర్త గ్రంథాలు వున్నప్పటికీ కేవలం ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం మాత్రమే ఇంతకాలంగా ఇతర భాషలలోకి వచ్చాయి. మిగతా శాస్త్రాలు ఇతర భాషల్లోకి రాలేదు.
ఈ తరుణంలోనైనా మిగతా సాంకేతిక శాస్త్రాలను కూడా ప్రాంతీయ భాషలలోకి తేవచ్చు కదా?
అనువాదం చేయవచ్చు. కానీ ఆ పరిభాషిక పదాలు ప్రస్తుతం అర్థం కావు. అవి వ్యవహారంలో లేవు కాబట్టి క్లిష్టంగా వుంటాయి. నేను భరద్వాజ విమాన శాస్త్రం చదివాను. ఇలా ఇంకా ఎన్నో శాస్త్రాలు వున్నాయి. మైసూరు విశ్వవిద్యాలయం వారు “శివతత్త్వ రత్నాకరం” అనే గొప్ప గ్రంథం ప్రచురించారు. అందులో నగరం ఎలా కట్టాలి? ఏ భవన ఎలా నిర్మించాలి? తోటలు ఎలా, ఎక్కడ వుండాలి? తోటల్లో ఎలాంటి చెట్లు పెంచాలి? ఊళ్ళో ఎలాంటి చెట్లు పెంచాలి? వాటికి ఎలాంటి ఎరువులు వేయాలి? ఇత్యాదులు అన్నీ చెప్పారు. మేఘాల గురించీ చెప్పారు. అవి ఎన్ని రకాలు, ఎలాంటి మేఘం వర్షిస్తుంది లాంటి వెన్నో వున్నాయి. అలాగే – ‘రత్నశాస్త్రం’, ‘లోహశాస్త్రం’, ‘జలార్గళ శాస్త్రం’ వుంది. ఇందులో విమానశాస్త్రం హిందీలోకి వచ్చింది. మిగతావి అన్నీ సంస్కృతంలో మాత్రమే వున్నాయి. వాటిని ప్రస్తుతం ఇతర భాషలలోకి పారిభాషిక పదాలు వెదికి అనువదించడం చాలా కష్టం. శ్రమపడి ఒకవేళ ఎవరైనా అనువదించినా ఆ పారిభాషిక పదావళి ఎవరికీ అర్థం కాదు. భూకంపాలు ఎప్పడు వస్తాయి? అనే అంశంపై ఈ మద్య తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వారు ఇప్పటి శాస్త్రంతో పోల్చుతూ, వరాహమిహిరుడు ప్రభృతులు ఏమి చెప్పారో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే మహాభారతంలోని వాస్తు విజ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఆ మధ్య తెలుగులో ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం వచ్చింది.
సంస్కృతంలో విజ్ఞానం ఇంత వుండగా, ఆ భాష గురించిన దురభిప్రాయం కేవలం మన దేశంలోనే వుంది. అన్ని విదేశాలలోనూ సంస్కృతం పట్ల గౌరవభావమే ఈనాటికీ నెలకొని వుంది. నిజానికి హేతువు లేని వాదాన్ని మన దేశంలో హేతువాదులే చేస్తున్నారు. ‘ధ్వన్యాలోకం’, ‘రసగంగాధరం’ లాంటి గ్రంథాలు ఇంకెక్కడా, ఏ భారతీయ భాషలోనూ లభించవు. భరతుని నాట్యశాస్త్రమంత గొప్ప గ్రంథం ఏమొచ్చింది? వాత్స్యాయనుడి కామసూత్రమంత గొప్ప కామశాస్ర్త
గ్రంథం ఏమొచ్చింది? అలాగే పాణిని ‘అష్టాధ్యాయి’ అంత గొప్ప వ్యాకరణం ఇంతవరకు రాలేదు. కార్డొనా పాణినిని క్షుణ్ణంగా పఠించాడు. చెప్పగలడు. మనవాళ్ళు కొంత చాదస్తం చేశారు. అయితే దాన్ని మనం పక్కనపెట్టి భాషను చదవాలి. అందులోని శాస్త్రాలు తెలుసుకోవాలి.
ఆంగ్లం ఇత్యాది ఆధునిక భాషలపై మోజు చూపుతున్న ఈ తరుణంలో మీరు సంస్కృత భాషా రంగంలోకి ఎలా ప్రవేశించారు?
అది విచిత్రంగా జరిగింది. నేను నాల్గవ తరగతిదాకా మా ఊళ్ళో చదివాను. ఐదవ తరగతి భువనగిరికి వెళ్ళి చదివాను. ఆ వేసవిలోనే మా అమ్మగారు పోయారు. అంతటితో నా చదువు కూడా ఆపేయ్యమన్నారు. భువనగిరిలో చదివితే డబ్బు కావాలి. నెలకు పదిహేను సేర్ల దాకా బియ్యం, ఖర్చులకు ఐదు రూపాయలు కావాలి. ఆ డబ్బు వీలు కాదు పంపన్నన్నారు మా నాయనగారు. ఆ సమయంలో యాదగిరి గుట్ట దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పెడుతున్నట్టు, అక్కడ ఉచితంగా విద్య చెప్పడమే కాకుండా భోజన వసతి కల్పిస్తున్నట్టు పత్రికలో వార్త వచ్చింది. అది చూసి నేను, నా తోటి మరో నలుగురు స్నేహితులు కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాం. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, మందుముల నరసింగరావుగారు అక్కడ కమిటీలో వున్నారు. వారి సహృదయతవల్ల నేను 1953లో అందులో చేరాను. అప్పుడు నాకు పది సంవత్సరాలు. నిజానికి మాకు అప్పుడు సంస్కృతం అంటే ఏమిటో తెలియదు. ఉచితంగా విద్య నేర్పుతారు, భోజనం పెడతారనీ, ఇంటి నుంచీ బయటపడవచ్చునని బయలుదేరాం.
అయితే ఒక షరతు పెట్టి లక్ష్మణశాస్త్రిగారు మమ్ములను తీసుకున్నారు. మూడు మాసాల పరీక్షలో ఉత్తీర్ణులయితే చదువు కొనసాగిస్తాననీ, తప్పితే తప్పించివేస్తానని చెప్పారు. దానికి కట్టుబడి చేరాం. చివరికి నేనొక్కణ్ణే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయ్యాను. మిగతా నా స్నేహితులను ఇంటికి పంపారు. అమరకోశం, శబ్దమంజరి ఇత్యాదులు సంప్రదాయబద్ధంగా చెప్పారు. అక్కడ ఐదు సంవత్సరాలు చదివితే ‘ఎంట్సన్స్ కు’ పంపుతారు. నేను ‘ఎంట్రన్స్’ ఆ తర్వాత డి.ఒ.ఎల్., బి.ఒ.ఎల్. – అన్నింట్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. బి.ఒ.ఎల్.లో ప్రథమ శ్రేణిలో మొదటిర్యాంకు. వ్యాకరణం ప్రత్యేకంగా చదివాను. నేను పద్దెనిమిదిన్నర సంవత్సరాలకే బి.ఒ.ఎల్ పూర్తి చేశాను. దాన్ని ‘శిరోమణి’ అని మద్రాసులో, ‘విద్వాన్’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంటారు. మొత్తం తొమ్మిది సంవత్సరాలు సంస్కృతం చదివాను. అందులో ఐదేండ్లు యాదగిరిగుట్టలో, నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శఠగోప రామానుజాచార్యుల అధ్యాపకత్వంలో ఎంతో నేర్చుకున్నాను. బి.ఒ.ఎల్. కాగానే వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో (1962)లో అధ్యాపకుడిగా చేరాను. అంతకుముందు ప్రైవేట్ గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. పండిట్ శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. ఇక్కడ ఐదు సంవత్సరాల అధ్యాపక వృత్తిలో వుండి ఎం.ఏ సంస్కృతం ప్రథమ శ్రేణిలో ప్రథమ ర్యాంకుతో 1967లో ఉత్తీర్ణుడనయ్యాను. బంగారు పతకం పొందాను. వెంటనే ఆంధ్ర సారస్వత పరిషత్తువారి కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరాను. ఇక్కడ చేరాక తెలుగులో ఎం.ఏ. చేసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అంతకముందే బి.ఒ.ఎల్. కూడా తెలుగులో పూర్తి చేశాను. ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు పనిచేశాక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా చేరాను. అక్కడే ‘భాస్కర రామాయణంపై’ పరిశోధన డాక్టర్ బి.రామరాజుగారి పర్యవేక్షణలో చేశాను. అలాగే భాషా శాస్త్రంలో పి.జి.డిప్లొమా కూడా ప్రథమ్రశేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. రీడర్ అయ్యాను. ఐదు సంవత్సరాలు పనిచేశాక ప్రొఫెసర్ అయి, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధిపతిగా తొమ్మిదేండ్లు పనిచేశాను. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా 3 ½ సంవత్సరాలుగా చేశాను.
పరిశోధన రంగంలో మీరు అనుసరించిన పద్ధతులు వివరించండి?
ప్రధానంగా నా పరిశోధన సాహిత్యానికి, భాషకు సంబంధించినది. సాహిత్యంలో ప్రధానంగా ప్రాచీన సాహిత్యం పైనే కృషి చేయడం జరిగింది. భాస్కర రామాయణంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రచించినాను. ఇంతకుపూర్వం సాహిత్యం రంగంలో నిష్ణాతులయిన వేటూరి ప్రభాకర శాస్త్రి, మానపల్లి రామకృష్ణకవి, నిడదవోలు వెంకట్రావు, ఆచార్య బిరుదురాజు రామరాజు మొదలైన పరిశోధకులు అనుసరించిన పద్ధతినే నేను అనుసరించడం జరిగింది. భాషా రంగంలో కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. ఇందులో ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు నాకు మార్గదర్శకులు.
ఉపన్యాసకులుగా మీ అనుభవాలు తెలియజేయండి?
ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 1967లో ఆంధ్రసారస్వత పరిషత్ వారు నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరినాను. ఆ రోజుల్లో ప్రాచ్య కళాశాలలో తెలుగు సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్న ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేవారు. పాఠ్యప్రణాళికలో కూడా మంచి స్థాయి గల గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. వయస్సులో నాకంటే పెద్దవాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల పాఠ్యాంశాలను బాగా చదువుకొని పాఠాలు చెప్పవలసి ఉండేది. ఆ కళాశాల సాయం కళాశాల కనుక నేను ఉదయమంతా కూడా ఈ పాఠ్యాంశాలను బాగా చదువుకని పాఠం సిద్ధం చేసుకుని వెళ్ళడంవల్ల నా విజ్ఞానం బాగా పెరగడానికి అవకాశం కలిగింది. మౌలికంగా నేను చదువుకున్నది సంస్కృతమే అయినా తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణాలు ఇవన్నీ నేను స్వయంగా చదువుకుని అధ్యాపనం చేసే అవకాశం లభించింది. ఈ కళాశాలలోని బోధన, తెలుగులో మంచి పాండిత్యం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను తెలుగుశాఖలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఈ విశ్వవిద్యాలయాలలో ప్రధానంగా నేను వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం ఈ విషయాలను బోధించేవాణ్ణి. విద్యార్థులకు ఈ విషయాలు బోధించేటప్పుడు పరిశోధనాత్మక దృష్టిని, తులనాత్మక పరిశీలనా దృష్టిని అలవరచుకోవడం జరిగింది. వ్యాకరణం, సంస్కృతం ఇవి కొంత కఠినమైన అంశాలయినా విద్యార్థులు చాలా శ్రద్దగా వినేవారు. పరీక్షలలో కూడా బాగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకునేవారు. విద్యార్థులకు వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం చెప్పేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. వ్యాకరణం చెప్పేటప్పుడు ప్రధానంగా ఆయా వ్యాకరణ గ్రంథాలలోని ఉదాహరణలే కాక తక్కిన సాహిత్యంలోని ఉదాహరణలు కూడా చెప్పడంవల్ల విద్యార్థులకు ఆయా గ్రంథాల పరిచయం కూడా కలిగేది. నిజంగా ఉపన్యాసకుడిగా ఉంటూ విద్యార్థులకు పాఠాలు బోధించడం భగవంతుడిచ్చిన ఒక వరంగా భావించినాను.
తెలుగుశాఖ అధ్యక్షులుగా మీ అనుభవాలు వివరించండి?
కేంద్ర విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో నేను తెలుగుశాఖకు సుమారు 8,9 సంవత్సరాలు అధ్యక్షునిగా ఉన్నాను. అధ్యక్షునిగా ఉన్న కాలంలో నాకు నా సహాధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సహకరించినారు. అందువల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు. విద్యార్థులంతా కేవలం చదువుమీదనే శ్రద్ధ కలవారు కావడం చేత అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో నిమగ్నులై ఉండడంవల్ల మా తెలుగు శాఖలోని కార్యక్రమాలన్నీ సజావుగా సాగేవి. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండటంవల్ల పరిపాలనలో నాకేవిధమైన ఇబ్బంది కలుగలేదు. నేను అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఎంతోమంది విద్యార్థులు యుజిసివారి జె.ఆర్.ఎఫ్.స్కాలర్ షిపంలను పొందినారు. ప్రతి సంవత్సరము ఒకటి, రెండు సెమినార్లు నిర్వహిస్తుండడంవల్ల విద్యార్థులలో పరిశోధనాసక్తి బాగా వృద్ధి చెందింది. పాఠ్యంశాలు నిర్ణయించడంలో మా శాఖకు స్వాతంత్ర్యం ఉండడంవల్ల ఎప్పటికప్పుడు సమయానుకూలంగా విద్యార్థులకనుగుణమైన క్రొత్త పాఠ్యంశాలను నిర్ణయించే అవకాశం ఉండేది.
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా మీ అనుభవాలు తెలుపండి?
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉండగా నాకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇది ద్రావిడ భాషల యొక్క తులనాత్మక అధ్యయనానికి, ద్రావిడ సంస్కృతి అధ్యయనానికి ఏర్పడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి నేను రెండో ఉపాధ్యక్షుణ్ణి. విశ్వవిద్యాలయం స్థాపించిన నాలుగవ ఏట (సంవత్సరం) నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టినాను. అప్పటికి ఆ విశ్వవిద్యాలయానికి కొన్ని భవనాల నిర్మాణం జరిగినా విద్యాత్మకంగా మంచి పునాదులు వేయడం జరుగలేదు. రెండు, మూడు శాఖలు మాత్రమే అప్పటికి ఉండేవి. అధ్యాపకులు కూడా ఆరేడుగురు మాత్రమే ఉండేవారు. నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత క్రొత్త శాఖలను ఏర్పాటు చేయడమే కాక ఆ శాఖల్లో అధ్యాపకుల నియామకాన్ని కూడా చేపట్టడం చేత దానికొక స్వరూపం ఏర్పడింది. విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చేరడం జరిగింది. భవనాల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మొత్తంమీద నేను ఉపాధ్యక్షుడుగా ఉన్న మూడున్నర (3 ½) సంవత్సరాలలో ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కృషిచేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అధ్యాపకులు విద్యార్థులు, అధికారులు అందరూ సహకరించడంవల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని నా పరిపాలనా కాలంలో నా శక్తి మేరకు అభివృద్ధి పథంలో నడిపింపగలిగాను.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ముఖ్య సంపాదకులుగా మీ పరిశ్రమ, ప్రయోజనాలు వివరించండి?
అధ్యాత్మిక ప్రచారం కోసం గ్రంథ ప్రచురణను ఒక ప్రధాన సాధనంగా చేసుకున్న దేవస్థానాలలో ఏకైక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. దేవస్థానంలో జరుగుతున్న గ్రంథ ప్రచురణల కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేక అధికారి అవసరమని భావించి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐ.ఎ.ఎస్ గారు తృప్తినిచ్చినటువంటి వృత్తి అధ్యాపక వృత్తి. అధ్యాపనంవల్ల కలిగే ఆనందం ఎంతో గొప్పది. ఒక్కొక్కసారి ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకొని దానిని విద్యార్థులకు చెప్పినపుడు కలిగే ఆనందమే వేరు. పరిపాలనలో కొన్ని మంచి పనులు చేయవచ్చు. కాని పరిపాలనలో అందరి మన్నన పొందడం కష్టమే. దానివల్ల కలిగే తృప్తి తాత్కాలికమే అని భావిస్తాను. అధ్యాపక వృత్తిలో ఎంతో మందికి జ్ఞానభిక్షపెట్టి వారిని సమున్నత స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు అధ్యాపనమంటే ఎంతో ఇష్టం. కుప్పంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించేవాడిని.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వాటిలో మీకు ఇష్టమైన అంశం ఏది? ఎందుకు?
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వీటిలో అన్నీ నాకు ఇష్టమైన అంశాలే. ఈ అంశాలన్నింటిలో ఇంతో అంతో నేను కృషి చేయడం జరిగింది. కొన్ని గ్రంథాలు కూడా రచించినాను. వాఙ్మయానికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ విశిష్టమైనదే. ఈ ప్రక్రియలన్నీ సాహిత్యానికి అవసరమైన అంశాలే.
మీ మాండలిక భాషా సంబంధ కృషి గురించి తెలుపండి?
చిన్ననాటి నుండి నాకు మాండలికాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలంటే ఎంతో ప్రాణం. చిన్నతనంలో ఇంట్లో మా అమ్మమ్మ వాడే ‘కొర్కాసు’, ‘సోయి’ వంటి మాండలిక పదాలు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి. నేను ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నప్పుడు మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలను అధ్యయనం చేస్తూ “నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదాలకెన్నింటికో కావ్య ప్రయోగాలను గుర్తించి వాటికి కూడా ‘తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు’ అని ఒక నిఘంటువును కూర్చినాను. ఈ రెండు నిఘంటువలేకాక అనేక మాండలిక పదాలను – వివిధ జిల్లాలకు సంబంధించిన వాటిని నా ‘శ్రీహరి నిఘంటువు’ కూడా చేర్చినాను.
ఈ రెండు నిఘంటువులకు కూడా విపులమైన పీఠికలను కూడా సంతరించినాను. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశానికి వ్రాసిన పీఠికనే నల్లగొండ జిల్లా ప్రజల భాష అనే పేరుతో ముద్రించాను.
వీటితోపాటు మాండలికాలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలను కూడా రచించడం జరిగింది. ఇటీవలే ప్రచురించిన అన్నమయ్య పదకోశంలోను, ‘అన్నమయ్య’ పదకోశంలోను, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ అన్న గ్రంథాలలో రాయలసీమ మాండలిక పదాలను, ఇతర మాండలిక పదాలను కూడా పేర్కొని అన్నమయ్యకు మాండలిక ప్రయోగాలపై ఉన్న అభిమానాన్ని వివరించడం జరిగింది.
ఆంధ్రసారస్వత పరిషత్తు మరియు వివిధ సాహిత్య, విద్యా విషయిక సంస్థలతో మీకు గల సంబంధం తెలుపండి?
నాకు మొట్టమొదటగా సంస్కృత భాషపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించటానికి, సంస్కృత భాషా వ్యాప్తికీ ఏర్పడిన ‘సురభారతీ’ సమితితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. జస్టిస్ అల్లాడి కుప్పుస్వామిగారు, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడుగారు మొదలైన ప్రముఖులెందరో ఈ సమితిలో ఉండేవారు. ఈ సంస్థకు నేను కొంతకాలం సంయుక్త కార్యదర్శిగా ఉండినాను. తర్వాత తెలుగుభాషా సాహిత్యాలకు తెలంగాణాలో ఎనలేని సేవచేస్తున్నఆంధ్రసారస్వత పరిషత్తులో సభ్యుడిగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా ఉండి యథాశక్తి సేవలను అందించడం జరిగింది. ఆంధ్రసారస్వత పరిషత్తు ట్రస్టులో కూడా ఇప్పటివరకు నేను సభ్యునిగా ఉన్నాను. ఇవికాక సంస్కృత భాషా ప్రచారసమితి (హైదరాబాద్)కి కులపతిగాను, సరస్వతీ విద్యాపీఠానికి (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షునిగాను ఉండి నా సేవలను అందించడం జరిగింది.
సాహిత్య సంస్థలతోనే కాక అనేక విద్యా సంస్థలతోను నాకు సంబంధం ఉంది. హైదరాబాద్ లోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలకు ఉపాధ్యక్షునిగాను, త్రిలింగ విద్యాసమితికి అధ్యక్షునిగాను, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పాలకమండలి సభ్యునిగాను, తెలుగు అకాడమి పాలకమండలి సభ్యునిగాను, ఇంటర్ మీడియట్ బోర్డు పాలకమండలి సభ్యునిగాను, ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ పాలకమండలి సభ్యునిగాను ఇలా ఎన్నెన్నో సంస్థలతో సంబంధం ఉంది. అన్నమయ్య పదకోశ నిర్మాణానికి పూనుకున్నాను. అనేక పండితులను సంప్రదించి వివిధ ఆకారాలను పరిశీలించి, కొన్ని మారుమూల నిఘంటువులను పరిశీలించి నా శక్తి మేరకు నిఘంటువును సిద్ధం చేయడం జరిగింది. ఇది సమగ్రమైన నిఘంటువని భావించడం లేదు. నిజంగా ఏ నిఘంటువూ సమగ్రం కాదు. పండితుల సూచనతో ఈ నిఘంటువును సమగ్రం చేయడానికి ప్రయత్నించాను.
అన్నమయ్య భాషా వైభవంపై మీ కృషిని తెలియజేయండి?
అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించే భాషా వైభవం ఎంతో గొప్పది. తెలుగు భాష యొక్క సహజమైన విరాట్ స్వరూపం ఆ సంకీర్తనల్లో గోచరిస్తుంది. అచ్చమైన తెలుగు పదాలు, మాండలికపదాలు, లోకోక్తులు, పదబంధాలు మొదలైన వాటివల్ల అన్నమయ్యకు తెలుగుభాషపై ఉన్న ప్రేమతోపాటు ఆయనకున్న సర్వతోముఖమైన పాండిత్యం వ్యక్తమవుతుంది. సంస్కృత దీర్ఘ సమాసాలతో రచనలు చేసే కాలంలో అలతి అలతి అచ్చ తెలుగు పదాలతో వ్యావహారిక భాషలో గొప్ప గొప్ప భావాలను అతి హృద్యంగా వర్ణించడం ఆయనకే చెల్లు. ఒక విధంగా వ్యావహారిక భాషకు, వ్యావహారిక భాష ఉద్యమానికి అతడే ఆద్యుడని చెప్పవచ్చు. అన్నమయ్య ప్రదర్శించిన ‘తెలుగు భాషా వైభవం’ నన్నెంతో ఆకర్షించింది. భాషా విశేషాలకు అన్నమయ్య సంకీర్తనలు పెన్నిధులని చెప్పవచ్చు. అందుకే అన్నమయ్య భాషపై నేను ‘అన్నమయ్య భాషవైభవం’, ‘అన్నమయ్య – అచ్చ తెలుగు, అన్నమయ్య నవ్వులు’ అన్న గ్రంథాలను ప్రచురించడం జరిగింది.
ఆధునిక కాలంలో తెలుగు పరిశోధకులకు అలబ్ధవాఙ్మయం గురించి మీ సలహాలు?
ప్రాచీన కాలంలో వివిధ కవులు రచించిన కావ్యాలన్నీ మనకిప్పుడు లభించడం లేదు. మన అలసత, అజ్ఞానం వల్ల పూర్వకవులు రచించిన ఎన్నెన్నో గ్రంథాలను ఎర్రన రామాయణం వంటి అమూల్యమైన గ్రంథాలను పోగొట్టుకున్నాం. ప్రస్తుతం మనకు లభ్యంకాని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సంకలన గ్రంథాలు, కావ్యపీఠికలు మొదలైన ఆధారాల ద్వారా ఈ గ్రంథాల ఆచుకీ తెలియవస్తుంది. ఈ అలబ్ధ వాఙ్మయంపై మానవలి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మహామహులు కృషిచేసిన విషయం తెలిసిందే. వారి ఆదర్శంతో ఈ విషయంలో నేను కొంత కృషిచేసి తెలుగులో అలబ్ధ వాఙ్మయం, అలబ్ధ కావ్య పద్యముక్తావళి అని రెండు గ్రంథాలను రచించడం జరిగింది. ప్రాచీన సాహిత్యంపై అభిమానం కలిగిన పరిశోధక విద్యార్థులు ఈ రంగంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన ప్రాచీనులు వివిధ ప్రక్రియలతో ఎంతో శ్రమించి రచించిన అమూల్య గ్రంథాలను గురించి తెలియవస్తుంది. అంతేకాక ఆయా గ్రంథాలు ఎవరి దగ్గరనైనా ఉంటేవాటిని సంపాదించి లోకానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర రచనకు కూడా దోహదకారి అవుతుంది.
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి మీ సూచనలు?
పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత సాహిత్యానికి, తెలంగాణా ప్రాంత కవులకు, తెలంగాణ భాషకు ఏ కారణం చేతనో ప్రాధాన్యం దక్కలేదు. తెలంగాణాలో గొప్ప గొప్ప కావ్యాలు రచించిన కవులు ఎంతోమంది ఉన్నావారిని గురించిన అధ్యయనానికి ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణాలో మరింగంటి కవులు మొదలయిన కవి కుటుంబాలు ఎన్నో ఉండినట్లుగా, ఆయా కుటుంబాలలోని కవులు తరతరాల సాహిత్యాన్ని పండించినట్లుగా మనకు తెలుస్తుంది. కనుమరుగై వెలుగులోకి రాని తెలుగు కవిపండితులను గురించి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కనుక ఇక్కడి కవి పండితులు తెలంగాణా ప్రాచీన కవులను, పండితులను గూర్చి పరిశోధనలు చేసి వారి వైశిష్ట్యాన్ని వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక తెలంగాణా భాషను గురించి – పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా భాష ఎంతో ఈసడింపుకు గురైంది. తెలంగాణా మాండలికాలకు, విశిష్ట ప్రయోగాలకు రచనలో ఏ మాత్రం స్థానం లేకుండా ఉండేది. ఎక్కడైనా తెలంగాణా రచయితలు తమ మాండలిక పదాలను రచనలలో వాడినా పరిహాసానికి గురయ్యేవారు. తెలంగాణా భాషలో ప్రాచీనమైన పలుకుబడులు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు కోలెన్, తల (సమయం), సంచకారి మొదలైనవి. తెలంగాణా భాషలో పదబంధాలు, సామెతలు ఎన్నో విశిష్టమైనవి ఉన్నాయి. అవన్నీ తెలుగుభాషకు అమూల్యమైన అలంకారాలు. వాటినన్నింటినీ ప్రస్తత రచయితలు తమ భాషలో వాడుకుంటూ తెలంగాణా భాష యొక్క వైశిష్ట్యాన్ని ప్రయోగ విశేషాలను అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలంగాణాలో ప్రత్యేకంగా వాడబడే మాండలిక పదాలకు, పదబంధాలకు, సామెతలకు ప్రత్యేకంగా నిఘంటువులు రావలసిన అవసరం ఉంది. తెలంగాణా భాషాభిమానులు ఇందుకు పూనుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాకరణ అధ్యాపకులకు మీ సూచనలు?
భాష అనేది వ్యాకరణ యుక్తంగానే వ్యవహరింపబడుతుంది. అయితే ప్రతి వ్యవహర్త తాను వ్యాకరణ యుక్తంగానే మాట్లాడినా, తాను మాట్లాడుతున్న భాషలోని నియమాలను వివరించలేదు. వ్యాకర్త మాత్రమే మనం మాట్లాడుతున్న భాషలోని భాషా నియమాలను గ్రహించగలడు. ఆ భాషా నియమాలే ఒక విధంగా వ్యాకరణం.
వ్యాకరణాన్ని బోధించే అధ్యాపకులు ప్రధానంగా వ్యాకరణ గ్రంథాలలో ఉన్న ఉదాహరణలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తారు. అలా కాకుండా ఆయా కావ్యాలలోని ప్రయోగాలను కూడా విద్యార్థులకు తెలియచేయాలి. ఉదాహరణకు “ఉపయోగంబునందు ఆఖ్యాతకు తోడ వర్ణకంబగు” అనే బాల వ్యాకరణ సూత్రానికి బాల వ్యాకరణంలోని ఉదాహరణ మాత్రమే చెబుతారు. కాని మహాభారతం మొదలైన గ్రంథాలలోని ప్రయోగాలను వెదకి వాటిని కూడా విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. విద్యార్థులే స్యయంగా ఆ ప్రయోగ విశేషాలను గమనించే విధంగా ఉపాధ్యాయుడు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. వ్యాకరణాన్ని కేవలం ఉపాధ్యాయుడు బోధించడం కాకుండా విద్యార్థులచే భాషా ప్రయోగాలలోని విశేషాలను గమనింపచేసే విధంగా ప్రయత్నం చేస్తే విద్యార్థికి వ్యాకరణం అంట ఆసక్తి కలుగుతుంది. వ్యాకరణమంటే అదొక కొరకరాని కొయ్య అనే భావం తొలగిపోతుంది.
మీరు అభిమానించే ప్రాచీన కవులు వారి ప్రత్యేకతను తెలుపండి ?
ప్రాచీన కవుల్లో నాకు బాగా నచ్చిన కవులు నన్నయ్య, తిక్కనలు. నన్నయ కాలానికి తెలుగులో కావ్య రచన అంతగా సాగలేదు. కావ్యాలు రాలేదు. కనుక తెలుగు సమగ్ర కావ్య రచనకు అనుగుణంగా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.