Home ఇంద్రధనుస్సు కథాసాహితి కడలి తరంగం – వడలి రాధాకృష్ణ

కథాసాహితి కడలి తరంగం – వడలి రాధాకృష్ణ

తెలుగు సాహిత్యంలోని కథాసాహితి ప్రక్రియలో ఆధునిక కాలంలో కృషి చేసిన కథా రచయితలలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని కథారచన చేసినవారు “కథాసుధానిధి” వడలి రాధాకృష్ణ గారు. ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంతో మమేకమైన “కథాప్రపూర్ణ” వడలి రాధాకృష్ణ గారి కలం నుండి 600 కథలు జాలువారాయి. “కథాబ్రహ్మ”, “కథా విరించి” లేఖిని నుండి కథలే కాకుండా 400 కు పైగా కవితలు వెలువరించబడినాయి. అనేక కథా సంకలనాలకు ప్రధాన సంపాదకత్వం వహించి “భావకవితాభారతి” వడలి రాధాకృష్ణ గారు. సాహీతీవేత్తలకు “సాహితీమిత్ర” గా కవులకు “కవిమిత్ర” గా కథారచయితలకు “కథకరత్న” గా ప్రసిద్ధిచెంది కథాసాహితి కడలి తరంగమైన వడలి రాధాకృష్ణ గారి “మనసు మూలాల్లోకి” మన “అంతర్నేత్రం” దృష్టి సారిస్తే ఆ “మనసు చెప్పిన కథలు”, “వడలి రాధాకృష్ణ కథలు” గా ఆవిష్కృతమవుతాయి. కడలి తరంగమైన వడలి “మంచినీటి సముద్ర” కెరటం. “జీవనది”, “మంచినీటి సముద్రం” తో సంగమిస్తే కడలి కెరటాలు వడలి కథలై కథాసరిత్సాగర మవుతాయి. “చీకటి పున్నమి” కాంతులను మన “దోసలి సందిట” పెట్టుకొని “గూటిపడవ”లో ప్రయాణించి కథాసాహితి కడలి తరంగ ఆవిర్భావ తీరానికి చేరుదాం.

వడలి వెంకట సుబ్బారావు – సూరమ్మ పుణ్యదంపతులకు 1963 సెప్టెంబర్ 5వ తేదీన (సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించిన రోజున) వడలి రాధాకృష్ణ గారు జన్మించారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ అని నామకరణం చేయడం వెనుక గల కారణం రాధాకృష్ణన్ గారు పుట్టిన తేదీ, రాధాకృష్ణ గారు పుట్టిన తేదీ సెప్టెంబర్ 5వ తేదీ కావడమే. స్నాతకోత్తరస్థాయిలో (పోస్టు గ్రాడ్యుయేషన్) మూడు పట్టాలు పొందారు. 1) ఎం.ఏ. (ప్రభుత్వ పాలనా శాస్త్రం), 2) ఎం.బి.ఏ., 3) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, పిలానిలో ఎం.ఈ. (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్). సైన్స్ నుండి యం.ఇ.; ఆర్ట్స్ నుంచి ఎం.ఏ.; కామర్స్ నుంచి ఎం.బి.ఏ. డిగ్రీలు విభిన్నరంగాలలో సాధించిన వడలి రాధాకృష్ణ గారు ప్రస్తుతం చీరాలలోని ఐ.టి.సి.లో ప్రోసెసింగ్ మేనేజర్గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి అయిన కథారచనలో మేటిగా నిలిచి నేటి ఆధునిక కథా రచయితలను, సాహితీవేత్తలను గౌరవిస్తూ, వారి గ్రంథాలను ఆవిష్కరిస్తూ, సాహితీసేవలో తరిస్తున్నారు. 2005వ సంవత్సరములో చీరాలలో “సహజ సాహితీ” అనే సాహితీ సంస్థను నెలకొల్పారు. “సహజ సాహితీ”

ఆధ్వర్యములో ప్రసిద్ధ చిత్రకారులు, కవి, గాయకులు, సంగీత దర్శకులు, కథారచయిత అయిన శ్రీ కోన రమణరావు గారు రచించిన “విరిసిన వెన్నెల” కథా సంపుటిని; రెక్కలు ప్రక్రియలో రచనలు చేసిన పోగుల విజయశ్రీ గారి “ఉదయరాగాలు” ను ఆవిష్కరించారు. సాహితీ మిత్రులైన శ్రీనివాసగౌడ్ గారు, పోగుల విజయశ్రీ గారు, వంగర పరమేశ్వరరావు గారు మొదలగు వారితో కలిసి అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. చీరాలలోని ప్రముఖ సాహితీ సంస్థలైన అప్పాజోస్యుల విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్కు; కళాంజలికి; సాహితీ స్రవంతికి; శ్రుతిభారతికి విశిష్ట సేవలందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలో వడలి రాధాకృష్ణ గారి రచనలు, కథాసంకలనాలు ప్రచురితమయ్యాయి. రాధాకృష్ణ గారి కథా సంకలనాలలో “జీవనది”; “గూటిపడవ”; “అంతర్నేత్రం”; “మనసు మూలాల్లోకి”, “చీకటి పున్నమి”, “వడలి రాధాకృష్ణ కథలు”; “మంచినీటి సముద్రం”; “దోసిలి సందిట” మొదలగునవి కథా సాహితీ ప్రపంచంలో అటు పాఠకులను, ఇటు పరిశోధకులను అలరిస్తూ ప్రజాదరణ పొందాయి. వడలి రాధాకృష్ణ గారి కథా సంకలనాల మీద విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలో పరిశోధనలు జరిగి, యం.ఫిల్.; పి. హెచ్.డి. డిగ్రీలు పొందిన పరిశోధక విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థి పెదలంక సుధాకరబాబు “జీవనది” కథా సంకలనంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన నన్నయ ప్రాంగణములో తెలుగు పరిశోధక విద్యార్థి బొంతా రమేష్ “వడలి రాధాకృష్ణ – కవితానుశీలన” అనే అంశంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయములో తెలుగుశాఖలో పనిచేసిన ఆచార్య తేళ్ళ సత్యవతి గారి పర్యవేక్షణలో శ్రీ యల్. జ్యోతీశ్వర నాయుడు అనే తెలుగు అధ్యాపకులు “వడలి రాధాకృష్ణ రచనలు” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. బొబ్బిలికి చెందిన శ్రీ కర్రి రాంబాబు అనే తెలుగు పరిశోధక విద్యార్థి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి పర్యవేక్షణలో “వడలి రాధాకృష్ణ రచనలు-సమాలోచన” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.

“భావకవితా భారతి” అనే బిరుదును కలిగియున్న వడలి రాధాకృష్ణ గారు “జలఖడ్గం”; “శిశిరచిత్రాలు”, “వట్టివేళ్ళు” (నానీలు) అనే మూడు కవితా సంపుటాలను వెలువరించారు.

కథారచనలు, కవితా సంపుటాలను వెలువరించడమే కాకుండా 30 కి పైగా ఇతర కవుల, రచయితల సంకలనాలకు ముందుమాటలు వ్రాయడం వలన వడలి రాధాకృష్ణ గారు పీఠికా రచయితగా సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. తాను ప్రధాన సంపాదకులుగా ఉండి నాలుగు కథాసంకలనాలకు, రెండు కవితాసంకలనాలకు, రెండు మినీ కథాసంకలనాలకు ప్రధాన సంపాదకత్వ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన ఘనత కూడా వడలి రాధాకృష్ణ గారికే దక్కుతుంది. వారు ప్రధాన సంపాదకత్వం వహించిన కథా సంకలనాలు – “కథాపురి”, “నాలుగు నాలుగుల పదహారు”, “ఐదు కలాలు ఐదేసి కథలు”; “కథానికా కదంబం”; కవితా సంకలనాలు – “మలిసంధ్య”; “అనేక అడుగులు-ఒక ప్రస్థానం”; మినీ కథా సంకలనాలు – “మినీ కథావసంతం”, “కాలుతున్న కాలం” (కరోనా మినీ కథా సంకలనం).

సాహితీ రంగాలలో విశేష కృషి చేసిన వడలి రాధాకృష్ణ గారిని రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు బిరుదులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. వాటిలో ముఖ్యంగా సెట్ సంస్థ, చీరాల వారు “సాహితీమిత్ర” బిరుదును; పి.యం.కె.ఎఫ్. సంస్థ, ఒంగోలు వారు “కవిమిత్ర” బిరుదును; శ్రీ చైతన్యభారతి సాహితీ సమాఖ్య, మార్కాపురం వారు “కథావిరించి” బిరుదును; భావతరంగిణి మచిలీపట్నం వారు “కథకరత్న” బిరుదును; గుఱ్ఱం జాషువా కళా సమితి, దుగ్గిరాల వారు “కథాప్రపూర్ణ” బిరుదును; కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లు వారు “కథాసుధానిధి” బిరుదును; పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు “భావ కవితా భారతి” బిరుదును; విశ్వభారతి, ఒంగోలు వారు “కథాబ్రాహ్మి” బిరుదును; సాహితీ స్రవంతి, చీరాల వారు “సాహితీవాచస్పతి” బిరుదును ప్రదానం చేశారు.

“సహజ సాహితి” సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, చీరాల వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలులో కార్యనిర్వాహక సభ్యునిగా విశిష్ట సేవలందిస్తున్న వడలి రాధాకృష్ణ గారికి రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు ఎన్నో పురస్కారాలను ప్రదానం చేశాయి.

రజనీ కుందుర్తి, హైదరాబాద్ సాహితీపురస్కారం; తిక్కన రచయితల సంఘం, నెల్లూరు వారి సాహితీపురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహితీపురస్కారం, డా॥ రావూరి భరద్వాజ స్మారక సాహితీపురస్కారం, “మల్లెతీగ” మాసపత్రిక జాతీయస్థాయి ప్రతిభాపురస్కారం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిచే ప్రతిభాపురస్కారం, భువనగిరి-తేజ ఆర్ట్స్ జాతీయ సాహితీపురస్కారం, మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారు వట్టివేళ్ళు నానీల సంపుటికి యిచ్చిన ప్రతిభాపురస్కారం, డా॥ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీపురస్కారం – 2007, శ్రీమతి పోగుల వెంకట రత్తమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం – 2008, గూడూరుకు చెందిన శ్రీమతి ఇ. రత్తమ్మ శ్రమశక్తి పురస్కారం -2010, చీరాల – పసుమర్తి పార్థసారథిరావు ప్రతిభాపురస్కారం-2011, నెల్లూరు డా|| నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం – 2013, కడప డా|| కవితా స్మారక సాహితీపురస్కారం-2014, వేద విజ్ఞాన పరిషత్ శ్రీ సేవాశక్తి పీఠం సాహితీపురస్కారం-2017, చీరాల యర్రమిల్లి నరసింహారావు సాహితీపురస్కారం- 2019.

ఆకాశవాణి విజయవాడ, మార్కాపురం కేంద్రాలవారు వడలి రాధాకృష్ణ గారి కథలను, కవితలను ధారావాహికల రూపంలో ప్రసారం చేశాయి. ప్రముఖ హాస్య నటులు శ్రీ యల్.బి. శ్రీరామ్ గారు వడలి రాధాకృష్ణ గారి రచనను “పసుపు కుంకుమ” పేరుతో లఘు చిత్రంగా చిత్రీకరించారు. అనేక అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు.

కథారచయితగా, కవితాసంకలనాలకర్తగా, ప్రధాన సంపాదకునిగా, పీఠికారచయితగా, సహజ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘ కార్యనిర్వాహక సభ్యునిగా, అవధానపృచ్ఛకునిగా, జాతీయ స్థాయి విశిష్ట సాహితీ పురస్కారాల గ్రహీతగా, వక్తగా, సాహితీ సమావేశాల రూపకర్తగా, గ్రంథ ఆవిష్కర్తగా తెలుగు సాహితీ లోకంలో ప్రఖ్యాతి చెందిన వడలి రాధాకృష్ణ గారు నేటి యువ కథారచయితలకు మార్గదర్శకంగా నిలిచి స్ఫూర్తిదాయకమవుతున్నారు.

You may also like

Leave a Comment