Home వ్యాసాలు కళ’ను ‘కల’ను కలిపిన తపస్వి విశ్వనాథ్ 

కళ’ను ‘కల’ను కలిపిన తపస్వి విశ్వనాథ్ 

by C.S. Rambabu

విధి ఎవరి రాతను ఎలా లిఖిస్తుందో ఎవరూ ఊహించలేరు.బాల్యంలో సినిమా చూడటం కోసం రెండేండ్ల బండిలో ప్రయాణించిన బాలుడు పెద్దయ్యాక తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగ్గ దర్శకుడవుతాడని ఎవరూహించారు.ఆ బాలుడే విధాత తలపున ప్రభవించిన విశ్వనాథుడు.అనతికాలంలోనే

కళాతపస్విగా వాసికెక్కాడు.ఆనతినిచ్చిన విధాతకు తన చిత్రమాలిక కానుకగా సమర్పించాడు. ఆయనే ఒకచోటంటారు.నేనేదీ ప్లాన్ చేసుకోలేదు.అన్నీ అలా జరిగి పోయాయని.

విచిత్రమేమిటంటే కె.విశ్వనాథ్ గారి తండ్రిగారికి జాతకాలు చూస్తారని మంచి పేరుండేది.

తన కుమారుడు ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఆ తండ్రి ఊహించారో లేదో మరి.విశ్వనాథ్ తండ్రి చాటు బిడ్డ.గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే వారి బంధువొకరు వాహిని స్టూడియోలో చేరితే బావుంటుంది, అక్కడ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పగానే తండ్రి ఆజ్ఞ మేరకు వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్ లో చేరారాయన.తండ్రి వాహిని డిస్ట్రిబ్యూషన్ లో ఉండేవారు.

ఆయనక్కడ పనిచేస్తుండగానే ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టిలో పడ్డారు.ఏపని చేసినా అందులో నిమగ్నమై పనిచేయటం విశ్వనాథ్ లో ఉందని ఆయన గమనించారు.అప్రెంటిస్ గా ఆహ్వానించారు.దర్శకత్వ మెళకువలు నేర్పారు.మూగమనసులు సెకండ్ యూనిట్ దర్శకుడు విశ్వనాథే.ఇంకో పక్క వాహిని స్టూడియోలో ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి.ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక టీంలా ఉండేవారని తెలిసిందేకదా.విశ్వనాథ్ కి పనిపట్ల ఉన్న శ్రద్ద. 

అక్కినేని వారిని ఆకట్టుకుంది.ఓ శుభ ముహూర్తాన తమతో కలిసి తమ కంపెనీలో (అన్నపూర్ణ ప్రొడక్షన్స్)

దర్శకత్వ శాఖలో చేరమని ఆహ్వానించారు.చేరాలా వద్దా అని విశ్వనాథ్ చాలామంది సలహా అడిగారు.వారందరి అభిప్రాయాలు మరింత సందిగ్ధంలోకి నెట్టాయి వారిని.

గురువైన ఆదుర్తి కూడా నిర్ణయం నీదే అనేశారు.

విశ్వనాథ్ గారి సందేహానికి కారణం,ఆయన త్వరలో వాహిని సౌండ్ చీఫ్ కాబోతున్నారు.అది వదులుకోవటం సబబేనా అని.అప్పుడు ఆయన వెన్నుతట్టి వెళ్ళమని చెప్పిన వారు చక్రపాణి గారు.అలా సౌండ్ రికార్డిస్ట్ విశ్వనాథ్, దర్శకుడిగా మారటానికి వారధి అయ్యారు విజయా ప్రొడక్షన్స్ సారధి చక్రపాణి.

దర్శకుడిగా ఆయనకు బ్రేక్ నిచ్చింది అన్నపూర్ణ సంస్థ.

ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం.1965 లో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ కథకు నంది పురస్కారం పొందింది.

కె.విశ్వనాథ్ గారికి పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్న మాట జగద్విదితం.ఆయన పాటెప్పుడూ కథను ముందుకు తీసుకెళ్ళాలి గానీ, కథా గమనానికి అడ్డుపడకూడదనేవారు.పాట ప్రేక్షకుడు టీ తాగడానికో,సిగిరెట్ తాగడానికో రిలీఫ్ కాకూడదనేది వారి స్థిర అభిప్రాయం.స్క్రిప్ట్ రాసుకునే సమయంలోనే పాట అక్కడెందుకుండాలి,ఎలా ఉండాలో రాసుకునేవారుట.

చాలా పాటలకు పల్లవులు ఆయనే సమకూర్చేవారని

ఈమధ్య తెలిసిన నిజం.ఆత్మగౌరవం లోని “అందెను నేడే అందని జాబిల్లి” పాట పల్లవి ఆయనదే.చరణాలు ఆత్రేయ రాశారు.ఆత్రేయ ఆ పాట పారితోషికం లో

నీ వాటా కుడా ఉందని కొంత ముట్టజెప్పారని విశ్వనాథే స్వయంగా పేర్కొన్నారు.దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పల్లవులు ఉండేవి.అది తన ప్రతిభ కన్నా గీతరచయితల ఔదార్యం అని వినయంగా అంటుండేవారు కళాతపస్వి.ఒక సభలో డా.సి.నారాయణరెడ్డి తను, విశ్వనాథ్ జంటకవుల వంటివారమని ముసిముసి నవ్వుల మధ్య చెప్పారు.

జీవన జ్యోతి చిత్రం లోని “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు,సద్దు చేశాడంటే ఉలుకులికి పడతాడు”

పాట పల్లవి విశ్వనాథ్ ఇస్తే, నారాయణ రెడ్డి గారు పూర్తి చేశారు.

తను లయలో పలుకుతానో తెలియదని, సంగీత దర్శకులు తన పల్లవికి లయ కల్పిస్తారని ఓసారన్నారు విశ్వనాథ్.

పాటల పల్లవులు గురించి ఇంకొన్ని తర్వాత.సినిమాల్లో పాట అవసరం లేదంటారు విశ్వనాథ్.కానీ వారి సినిమాల్లో పాటలూ ఎక్కువే.వాటి నిడివీ ఎక్కువే.పాట అవసరం గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు పాట ఎప్పుడొస్తోందో వూహించగలుగుతున్నాడు.అలాకాకుండా పాటను ప్రేక్షకుడు ఉహించని చొప్పించటం నాకు నేను పెట్టుకున్న నియమం.దానితోపాటు పాట కథను ముందుకు తీసుకెళ్ళాలి అని బలంగా నమ్మాను అనేవారు.వారు చెప్పినట్టు వారి చిత్రాలలోని పాటలు కథలో భాగంగా కనిపిస్తాయి.

శంకరాభరణం సినిమా విశ్వనాథ్ ని శిఖరారోహణం చేయించింది.అంతకుముందు చేసిన సినిమాలొకెత్తు.ఆతర్వాత చేసిన సినిమాలొకెత్తు.అంతకుముందు చిత్రాలన్నీ కుటుంబ కథా చిత్రాలయితే, శంకరాభరణం తరువాత ఆయన చిత్రాలన్నీ సంగీత, నృత్యాల ప్రతిబింబాలయ్యాయి.ఆవిధంగా శంకరాభరణం వారినో చట్రంలో బిగించిందా అనిపిస్తుంది.విశ్వనాథ్ చిత్రాలను గుర్తు తెచ్చుకోండి. నిండు హృదయాలు,ఉండమ్మా బొట్టు పెడతా,జీవిత నౌక, నేరము-శిక్ష,శారద,కాలం మారింది,

చెల్లెలి కాపురం,జీవనజ్యోతి, సీతామాలక్ష్మి, చిన్ననాటి స్నేహితులు,అమ్మమనసు, ప్రేమబంధం, సిరిసిరిమువ్వ..ఇలా ఎన్నో చిత్రాలు.. ఇవన్నీ శంకరాభరణం ముందు కాలం నాటివి.ఆ తరువాత వచ్చినవి శుభలేఖ,సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం,స్వయం కృషి, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు,శ్రుతిలయలు,స్వాతి కిరణం,సూత్రధారులు ,శుభసంకల్పం మొదలైనవి.

ప్రతి చిత్రం కూడా ఏదో ఒక ఉద్వేగాన్ని పట్టి చూపేదే.

కథలు ఎంపిక గురించి మాట్లాడుతూ విశ్వనాథ్ ఒక మాటంటారు.తన నిర్మాత అనుకున్న కథనే తీస్తానని

చెబుతానని 

చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే తన కథతో తీస్తానని అంటారు.కానీ నిర్మాత చివరికి విశ్వనాథ్ కథనే తీయటం అనేక సందర్భాల్లో జరిగింది.

విశ్వనాథ్ సినిమాలలో హాస్యం చవకబారుగా ఉండదు.

పాత్రలు నేలవిడిచి సాము చేయవు.నా పాత్రలన్నీ జనజీవనంలోంచి పుట్టినవే.ఒక బాబయ్యో,ఒక మామయ్యో అల్లు రామలింగయ్య గానో, సాక్షి రంగారావు గానో పలకరిస్తారని ఒకసారన్నారు.హీరో నేరేటివ్ అలవాటు అయిన మనకు గా విశ్వనాథ్ చిత్రాలలో పాత్రలు సినిమాను నడిపిస్తాయి.సన్నివేశ కల్పనా చాతుర్యం ఆశ్చర్యపరుస్తుంది.

శంకరాభరణం లో శంకరశాస్త్రి, స్వర్ణ కమలంలో మీనాక్షి,

సిరిసిరిమువ్వ లోని హేమ,జీవన జ్యోతి లోని శోభ,శారద లోని శారద..ఇలా ఆయన చిత్రాలలోని పాత్రలను పరిశీలిస్తే నటులు కనిపించరు.హీరోలు కూడా పాత్రల్లో ఒదిగిపోవటం చూస్తాం.అదే స్వయంకృషి చిత్రంలో మెగాస్టార్ పక్కకు వెళ్ళిపోయి నటుడు చిరంజీవి తన పాత్రతో శ్రమలోని ఔన్నత్యాన్ని చూపుతాడు.

ప్రతి సినిమా దర్శకుడు సందేశాన్నిచ్చే ప్రయత్నమే చేస్తాడు కదా.ఇందులో ప్రత్యేకత ఏముందని అన్న ప్రశ్న రావొచ్చు.

సినిమా కళగా కన్నా వ్యాపారంగానే అభివృద్ధి చెందింది. ప్రేక్షకులకు వినోదమే ప్రధానమని నిర్మాత,దర్శకులు భావించి కథను తెరకెక్కించటంలో

అసలు కథను మరిచి, కమర్షియల్ ధోరణులతో సినిమాను నిర్మించి కుటుంబమంతా కలిసి చూడాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నవేళ విశ్వనాథ్ చిత్రాలు కొంత హాయిని కొంత కాంతిని పంచుతాయి విసుగుతెప్పించే విన్యాసాలు, పోరాటాలు,ద్వంద్వార్థాల సంభాషణలు,ఐటం సాంగ్స్,డ్రిల్లు లాంటి డాన్సులు ఉండేవి కావు.

అలాగే విశ్వనాథ్ చిత్రాలకు ఎవరు సంభాషణలు రాసినా వాటిలో చమత్కారం ఉంటుంది.చిలిపిదనముంటుందే తప్ప జుగుప్స ఉండదు.మాటలు రాసిన జంధ్యాల,ఆకెళ్ళ,సాయినాథ్,

ఎమ్.వి.యస్.హరినాథరావు మొదలైన వారంతా తమ పెన్నుకు వెన్ను,దన్ను దొరికాయని సంబరపడినవారే.

పాత్రల మధ్య చిక్కని అనుబంధం వారి చిత్రాల్లో మనం గమనించవచ్చు.

విశ్వనాథ్ చిత్రాలలో సామాజిక సందేశాలు ఉన్నాయి.

శుభలేఖ చిత్రం వరకట్నాన్ని ప్రశ్నిస్తుంది.శుభోదయం మనలో ఉండే సోమరిపోతుతనాన్ని బాధ్యతారాహిత్యాన్ని చూపుతుంది.శ్రుతిలయలు విజయం తలకెక్కిన మనిషి పతనాన్ని, స్వాతి కిరణం

గురువు కూడా అసూయకు అతీతుడు కాదని చెబుతుంది.ఇక సప్తపది ప్రేమెప్పుడూ కులం గోడలు ఛేదించేదే అంటుంది.సాగరసంగమం మాత్రం జీవితంలో వైఫల్యాన్ని కథగా చెబుతుంది.స్వర్ణకమలం

నాట్యకళలోని ఉదాత్తతను చూపుతుంది.

ఎనభై,తొంభై దశకాల్లో విశ్వనాథ్,బాపు,దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు అగ్రదర్శకులు.

విశ్వనాథ్ చిత్రాలు వారితో పోటీపడావా అంటే లేదనే చెప్పాలి.ఎవరి ధోరణి వారిదే అయినా విశ్వనాథ్ కి ప్రత్యేక స్థానాన్నిచ్చారు ప్రేక్షకులు.

శంకరాభరణం చిత్రం తెలుగు సినిమాకు అంతకుమించి

భారతీయ చిత్రానికో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.ప్రతి ఫ్రేములోనూ 

శాస్త్రీయసంగీతాన్ని నింపుకుని కొత్త నటుడిని, ప్రధాన పాత్రలో పరిచయం చేయాలంటే ఎంత దమ్ము ,ధైర్యం కావాలి.రిస్కు తీసుకునే నిర్మాత ఎక్కడ దొరకాలి.అలా

ధైర్యం చేశారు ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు.శంకరశాస్త్రి పాత్రకు కేవలం రంగస్థల అనుభవమున్న జె.వి.సోమయాజులు ని ఎంచుకున్నారు. మసకబారుతున్న శాస్త్రీయ సంగీత వెలుగులని పరిరక్షించే ప్రయత్నం విశ్వనాథ్ ది.

తనకు బ్రేక్ నిచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్ర పోషించాలని ఉబలాటపడ్డారని అప్పట్లో ఓ వార్త వ్యాప్తిలో ఉండేది.అదేవిధంగా బాలమురళీకృష్ణ నటించి, సంగీతాన్ని సమకూర్చాలని ఆరాటపడినట్లు మరోకధనం.ఆ స్క్రిప్ట్ కొత్త నటుడితోనే పండుతుందనుకున్న విశ్వనాథ్ అలాగే సాగారు.ఒక సంగీత కళాకారుడికి కళతోపాటు మానవత్వం ఉండాలని సూచిస్తారు.

అదే స్వాతి కిరణం లో కళాకారుడి అహం అసూయలు

ఎలా దెబ్బతీస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు.శంకరాభరణాన్ని తలపై మోసిన ప్రేక్షకులే స్వాతి కిరణం చిత్రాన్ని తిరస్కరించారు.రెండింటిలోను గొప్ప పాటలున్నాయి.వేటూరి విశ్వరూపం శంకరాభరణం చూపితే, సిరివెన్నెల సౌకుమార్యం స్వాతి కిరణం చూపిస్తుంది.

మళ్ళీ శంకరాభరణం విషయానికొస్తే, అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించని పంపిణీదారులు ఆ తర్వాత లెంపలేసుకున్నారు.

సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని లీనమయేలా చేయటం అన్నిసార్లు జరగదు.మాయాబజార్ గురించో, లవకుశ గురించో ఎంత గొప్పగా చెప్పుకుంటామో

ఆతర్వాత అంతటి గౌరవాన్ని పొందింది శంకరాభరణం.

చెప్పులు బయటే ఉంచి థియేటర్ లో సినిమా చూశానని ఒక కార్పొరేట్ సిఇఒ చెప్పారని విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.96 ‌సార్లు చూశానని

ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడుట విశ్వనాథ్ గారికి.ఆయన దగ్గర డబ్బులు కూడా పుచ్చుకోలేదుట.తమిళనాట కూడా తెలుగు శంకరాభరణం నడిచింది ఆరోజుల్లో.ముప్ఫైఏళ్ళ తర్వాత కానీ అనువాదం చేయలేదు.సినిమాని అంతగా హర్షించని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ సినిమాని చూసి రాసిన సమీక్ష మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

“శంకరశాస్త్రి పాత్రలో ప్రత్యేకత ,ఆయన సంగీత విద్వాంసుడు కావటం కాదు.సంగీతవిద్వాంసులు చాలామంది ఉంటారు.చిత్తశుద్థీ,ఆత్మగౌరవం,కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే కరుణ స్వభావం ,సమాజపు సంకుచిత్వాన్ని లక్ష్య పెట్టని ధీరత్వం,నమ్మిన లక్ష్యాన్ని నుంచి చలించని పట్టుదలా,సహజ గంభీరమైన ప్రవర్తనా లక్షణాలే ఆయన ప్రత్యేకత.

ఈ చిత్రాన్ని నిజ జీవితంలా చిత్రించిన దర్శకుడు, సంభాషణల రచయిత, పాత్రధారులు కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు.”

బలమైన పాత్రను సృష్టించడం దర్శకుడికి ఎప్పుడూ సవాలే.ఆ సవాలును స్వీకరించి తన చిత్రాల్లో బలమైన పాత్రలు,వాటి ప్రవర్తనా తీరును నిర్దేశించగలగటం కేవలం కె.విశ్వనాధ్ కే సాధ్యం.

సినిమా మాధ్యమం తనకో దేవాలయం లాంటిదని విశ్వనాథ్ అంటుండేవారు.అందుకే తన ప్రతిచిత్రాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించేవారు.ఆయన సినిమాలన్నీ కనక వర్షం కురిపించేవి కావు.కానీ ప్రేక్షకుడికి చక్కటి విలువలను, విలువైన పాటలను

బిగువైన కధనాన్ని అందించటంలో వెనకబడుండేవి కావు.నిర్మాతకు మాట రానిచ్చేవికావు.విశ్వనాథ్ లేకపోతే వేటూరి, సిరివెన్నెలల పాటల వెన్నెల మనకు దొరికేది కాదు.చాలా పాటలకు పల్లవులు విశ్వనాధ్ సూచించేవారని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా.

“రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అని మాటసాయం చేస్తే ఉండమ్మా బొట్టు పెడతాలోని ఆ గొప్ప పాటను నారాయణ రెడ్డి గారందించారు.అలాగే సిరివెన్నెల లోని చందమామ రావే,జాబిల్లిరావే అన్ని అన్నమయ్య పల్లవిని సూచిస్తే అది పాటై ప్రకంపించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలో.నా సూచనను అంగీకరించిన తన గీతరచయితలెంతో గొప్పవారని విశ్వనాథ్ అంటుండేవారు.

ఏ సన్నివేశాన్నయినా నటించి చూపడం విశ్వనాథ్ కి అలవాటు.అదే అనంతరకాలంలో వారిని నటుడిని చేసింది.లేటు వయసులో ఎంత ఘాటు నటనయో అని అనిపించేలా చేసింది.దర్శకత్వం చేసినంత సేపు వారు ఖాకీ డ్రెస్ ధరించేవారు.దానికి వారేవో కారణాలు చెప్పినా అది సాంకేతిక నిపుణులకు కర్తవ్యాన్ని, క్రమశిక్షణను, నటీనటులకు ఏకాగ్రతను బోధించింది.

 అభ్యుదయవాదులు గా చెలామణీ అయ్యేవారు విశ్వనాథ్ చిత్రాలను విమర్శించే ప్రయత్నం చేశారు.వాటిని ప్రేక్షకులూ పట్టించుకోలేదు.సినీపరిశ్రమా పట్టించుకోలేదు.

2017లో విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన వేళ ఆకాశవాణి తరఫున ఈ వ్యాసకర్త ఓ ప్రశ్న వేశారు.మీ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తే రాబోయే తరాలకు ఉపయోగం కదా అని.దానికి సమాధానంగా వారో ప్రశ్న వేశారు.ఎవరైనా నా చిత్రాలను పరిశీలించి

నా పాత్రలను విశ్లేషిస్తే అది చాలు,నా జీవిత చరిత్ర అక్కర్లేదని నవ్వుల మధ్య అన్నారు ఆరోజున.

కానీ వారారోజున అన్నమాటను నిజం చేస్తూ 2021లో “అనామకుడు” కలం పేరుతో అనేక కథలు రాసిన డా.ఏ.యస్.రామశాస్త్రి “విశ్వనాథ విశ్వరూపం” పేరుతో విశ్వనాథ్ చిత్రాలను విశ్లేషించారు.

“విశ్వనాథ్ గారి చిత్రాలు అమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే భోజనాలు.కుటుంబమంతా హాయిగా కూచుని తినే ఇంటి భోజనాలు.అందుకే ఎన్నిసార్లు తిన్నా రుచిగా తృప్తిగా అనిపిస్తాయే కానీ విసుగు పుట్టదు.వెగటు కలగదు” అంటూ విశ్వనాథ్ సినిమాలను అమ్మ వంటతో పోల్చారు.

తెలుగు సినిమా 

రొటీన్ రొచ్చులో కూరుకుపోయిన ప్రతిసారీ కాస్త ఊపిరిపోశారు విశ్వనాథ్.తనో కళాఖండం తీశానన్న అతిశయమెన్నడూ లేనివాడు ఆయన.తన పరిధిలో,తన అభిరుచి మేరకు భారతీయ సంగీతానికీ,నృత్యానికి వెండితెరపై వెలుగులు పంచాడు.సగటు ప్రేక్షకుడి గుండె తలుపు తట్టాడు.

అతని హృదయాన్ని గెలుచుకున్నాడు.సినిమా దేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన అసలు సిసలు భక్తుడు.

అందుకే విశ్వనాథ్ తన చిత్రాలతో మనందరిలో శాశ్వతంగా నిలిచిపోయారు.

సి.యస్.రాంబాబు

You may also like

Leave a Comment