Home పుస్త‌క స‌మీక్ష‌ కవితా సమీక్ష

ఆడుతు పాడుతు పని చేస్తుంటే… అలుపూ సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది-మనకూ కొదవేమున్నది
అన్న సినీ గీతంలోని శ్రామిక సౌందర్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్న డా.కొండపల్లి నీహారిణి గారి *హాలిని కవితలోని సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం రండి!

అతను దుక్కిదున్నే నాగలి,గొర్రు దోలే శ్రమ అయితే ఆమె ఎండపూట సేదదీర్చి, కడుపు నింపే సద్దిమూటల గంప,వెనువెంటనే నాట్లు వేసే పనితనం ఆమె
అంటూ హాలికుని శ్రమను,వెంటనే ఉంటూ శ్రమలో పాలుపంచుకోవడమే కాక, శ్రమతో అలిసిన పెనిమిటిని సేదదీరుస్తూ కడుపు నింపే ఇల్లాలి మనస్తత్వాన్ని ఎండపూట సద్దిమూటల గంప అంటూ వివరించారు తన కవితలో.

ఎరువు బలం అతడు
పొలం కోస్తూ అతడు
వరికట్టలు దులిపికొట్టే బలం
చెలకలో కర్రుతో చాలుదీస్తూ అతడు

కలుపుదీసే ఒడుపు
సంచులందించే చైతన్యం
బండెడు కుప్పను ఒకచోట వేస్తూ ఆమె
ధాన్యం తూర్పారబట్టే నైపుణ్యం
వెనువెనుక విత్తనాలను జారవిడుస్తూ ఆమె

పై పదబంధాల్లో పురుషుని యొక్క సహజ శరీర ధారుడ్యాన్ని,స్త్రీ సుకుమారత్వాన్నే కాక, వెనువెంట నీడలా ఉంటూ
పని అందిపుచ్చుకునే ఆమె చైతన్యాన్ని,ఒడుపును,
చాకచక్యాన్ని,నైపుణ్యాన్ని విశదపరిచారు తన కవితలో.

కృషిరాశిని చూస్తూ గర్విస్తూ అతడు
కుటుంబానికి అన్నమై సహకరిస్తూ ఆమె
అన్న వరుసల్లో పురుషుడు తన ఇంటిపేరు నిలబెట్టే సంతానాన్ని నా సంతానం అంటూ గొప్పగా చెప్పుకునే మనస్తత్వాన్ని, ఇంటిలోనివారందరి కడుపు నింపి తృప్తి పడే ఇల్లాలి బాధ్యతను,మనస్తత్వాన్ని చక్కగా పొందుపరిచారు.

తోటవైపు నమ్మకాల అడుగులేస్తూ అతడైతే
అతని అడుగుజాడల్లో నడిచి బుట్టల్లో ప్రగతికాయలు పేరుస్తూ ఆమె…అంటూ అతని నమ్మకాన్ని నిజం చేయటానికి ప్రగతిదారులు వేసేది ఆమేననే వాస్తవాన్ని ఎంతో అందంగా చెప్పారు.

వెన్నెముకలాంటి దేశకీర్తి
అతడైతే
నీడలా వెన్నంటే భుజకీర్తి
ఆమె…
అంటూ ఆకాశంలో సగమైన అర్థభాగ ఘనతను చాటిచెప్పారు.అందరూ గుర్తించేలా స్త్రీ శ్రమశక్తికి గుర్తింపునిచ్చారు.

ఆరుగాలం చెమటను పుడమితల్లికి ధారబోసే హాలికుడు అతడైతే
అనునిత్యం పనిపాటల పథగామి శ్రమశీలిని

ఆమెనే హాలిని
అంటూ స్త్రీ శక్తిని ఒక చక్కని నామధేయంతో అలంకరించారు,కిరీటధారణ చేసారు తన కవితతో.

అందరూ హాలికుని ఆరుగాలం శ్రమ గురించే ఆలోచిస్తారు తప్ప,అతనితో సమానంగా శ్రమ చేస్తూ, వెన్నంటి ఉండే హాలిని శ్రమను గుర్తించేవారు అరుదు.ఒకవేళ గుర్తించినా,
ఆమె శ్రమ సౌందర్యం కన్నా,శరీర సౌందర్య వర్ణనపైనే దృష్టి సారిస్తారు.

తరుణి మరియు మయూఖ పత్రిక సంపాదకురాలు

డా.కొండపల్లి నీహారిణి గారు స్త్రీ కోణంనుంచి ఆలోచించేలా కవితలు వ్రాస్తూ,

అందరూ వ్రాసేలా స్ఫూర్తినిచ్చే ఈ సూక్ష్మకావ్యం కావ్యశిల్పం, ఎత్తుగడ,
ప్రాసలతో కూడిన పదబంధాలు,
భావగణాల విభజన,లోతైన అంతర్లీన భావన గొప్పగా ఉన్నాయి.

ప్రముఖ కవి బుర్రా వెంకటేశం,ఐ. ఎ.ఎస్.
గారు రూపొందించిన సూక్ష్మకావ్యం అనే ప్రక్రియలో వ్రాయబడిన ఈ కవిత శ్రామిక స్త్రీల శ్రమకు
వేసిన అభినందనల మాలిక!

విశిష్టమైన కవితను అందించినందుకు
అభినందనలు నీహారిణి గారూ

You may also like

Leave a Comment