Home పుస్త‌క స‌మీక్ష‌ కసిరెడ్డి జలంధర్ రెడ్డి ఆశ నిండిన శ్వాస

కసిరెడ్డి జలంధర్ రెడ్డి ఆశ నిండిన శ్వాస

by Narendra Sandineni

కవితా సంపుటి పై పుస్తక సమీక్ష

కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల,తెలుగు బాషోపాధ్యాయుడు,కసిరెడ్డి జలంధర్ రెడ్డి కలం నుండి జాలువారిన ఆశ నిండిన శ్వాస కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.కవి జలంధర్ రెడ్డి తొలి కవితా సంపుటి జనవరి 2023 సంవత్సరంలో భవానీ సాహిత్య వేదిక నుండి ప్రచురింపబడింది. ఇందులో ముప్పై అయిదు కవితలతో అలరారుతూ ఉంది.ఈ పుస్తకాన్ని కవి జలంధర్ రెడ్డి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు కసిరెడ్డి రుక్కమ్మ బాల్ రెడ్డి గారలకు అంకితం ఇవ్వడం ముదావహం.వైరాగ్యం ప్రభాకర్ ముందుమాటలో ఆశ నిండిన శ్వాస కవితా సంపుటిలో సమకాలీన అంశాలు,సందేశాత్మక కవితలతో పాటు నిత్య సత్యాలు,మానవుడు అనుసరించదగు మార్గాలు ఉన్నాయి. సామాన్యుడిగా కనిపించే జలంధర్ రెడ్డిలో ఒక అసాధారణ కవి ఉన్నాడని ఈ సంపుటి నిరూపిస్తుంది.వారి కలం నుండి మరిన్ని కవితా సంపుటులను ఆశిస్తునన్నారు.లేదాళ్ళ రాజేశ్వర రావు ముందు మాటలో మానవత్వం నిండిన అచ్చమైన అమాయకత్వం అతడు.ఆ సగటు మనిషి ఆశ నిండిన శ్వాసలే ఈ కవితలు అన్నారు. విశ్వ మానవాళికి కరోనా రూపంలో పెద్ధ విపత్తు వచ్చింది.చైనాలోని ఊహన్ నగరం నుండి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది.కరోనా వైరస్ గాలి ద్వారా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.కరోనా వైరస్ మొదటి వేవ్ లో పెద్దగా ప్రభావం లేకున్నప్పటికీ,సెకండ్ వేవ్ లో లక్షలాది మంది విగత జీవులయ్యారు.

కవి జలంధర్ రెడ్డి ఆ బాధాకర దృశ్యాలను కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోయి వేదనతో ఆశ నిండిన శ్వాస పుస్తకాన్ని అక్షరీకరించారు.కరోనా వైరస్ భయానికి గృహ నిర్బంధంలో ఉండాలి.ఎప్పటికప్పుడు సానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకోవాలి. తుంపర్ల ద్వారా గాలి ద్వారా వ్యాపించే వైరస్ మానవాళికి పెను ముప్పుగా మారింది.ఇప్పటికీ ఆ భయానక దృశ్యాల జాడ వీడ లేదు.ఆ విపత్తు వల్ల సర్వమానవాళి బాధలను ఎదుర్కొన్నారు.కవి కరోనా వైరస్ చూపించిన పెనుభూతాన్ని కళ్ళకు కట్టినట్లు ఆశ నిండిన శ్వాస కవిత ద్వారా తన భావాలను చక్కగా వ్యక్తీకరించారు.మనిషిని ఆవహించిన నిర్వేదం/ఘనీభవించి అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది/అచేతనున్ని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది/కరోనా వైరస్ మనల్ని ఆవహించినప్పుడు కరోనాతో అనుదినం సహజీవనం చేయవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అలాంటి మనిషిని నిర్వేదం అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది.వేదం అంటే ప్రమాణం,ఆచరించదగినది. వేదం కానిది నిర్వేదం అని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే మౌన రోధన,మానసిక క్షోభ,ఒక విధమైన వైరాగ్య స్థితి.కవి కరోనా రక్కసి వల్ల కలిగిన భయానక స్థితిని కళ్ళకు కట్టినట్లు కవితలో చెప్పారు.కరోనా వైరస్ మనిషిని స్పృహ లేని వ్యక్తిని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది.భయంతో ఉన్న వ్యక్తి అభద్రతాభావపు సుడిగుండంలోకి జారిపోతాడు. సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడు.నదుల్లో సరదాకని ఈత కొడుతూ ఉంటారు.ఒక్కోసారి నదిలో ప్రమాదవశాత్తు ఈత నేర్చిన వాళ్లు సైతం సుడిగుండంలో చిక్కి ప్రాణాలు కోల్పోతారు.శవం కూడా లభ్యం కాదు.భయం ఎలాంటిదంటే అభద్రతా భావపు సుడిగుండం లాంటిది అని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఊపిరాడని వేళ/గుప్పెడు ప్రాణ వాయువు కోసం/ఆశతో దేహం తల్లడిల్లుతుంది/కరోనా సోకిన వ్యక్తికి ఊపిరాడదు.ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలుస్తుంది.కరోనా వైరస్ బారినపడి వేలాది మంది హాస్పిటల్లో సరైన ఆక్సిజన్ లభ్యం కాక ప్రాణాలు కోల్పోయారు.ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.ప్రభుత్వాల నిర్లక్ష్యం,చేతగానితనం వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.ఒంటరి గదిలో ముసిరిన చీకట్లు/కరిగి పోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంటాయి/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా చీకటి ముసిరిన గదిలో ఉండాలి.ఆ వ్యక్తికి ఒంటరితనం కరిగిపోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంది అన్నది నిజం అని చెప్పవచ్చు.ఈ చీకట్లో కొత్త వెలుగులు/మోసుకొస్తాయేమోనన్న ఆశ వెంటాడుతుంది/ఈ చీకట్లో ఉన్న వ్యక్తికి కూడా కొత్త వెలుగులు వచ్చి బతకాలనే ఆశ ఉంటుంది.ఆశే మనిషిని బతికిస్తుంది.బతుకులో వెలుగును వెతుకుతాం.ఇవ్వాళ కాకున్న రేపైనా వెలుగు వస్తుందనే ఆశతో మనిషి బతుకుతాడు.ఒంటరి ప్రస్థానపు చేదు నిజాలు/చితాగ్ని కెరటాల్లా/ అనాధృతంగా దహన మౌతున్న దేహాలు/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా ఉండి కోలుకుంటాడంటే కరోనా తీసుకుపోయింది.చేదు నిజాలు అంటే జీర్ణించుకోలేని వాస్తవాలు.అనుకున్నది ఎప్పుడు జరగదు.అనుకోలేనిది జరుగుతుంది.చనిపోయిన వ్యక్తిని మనం చితిని పేర్చి దహనం చేస్తాం.కానీ అనాధృతంగా దహనమౌతున్న దేహాలు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కరోనా వైరస్ దాడిలో ప్రాణహాని కలిగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లి పోయారు.చనిపోయిన లక్షలాదిమంది బాధితుల కుటుంబాలకు ఆ సంఘటనలు సరి కొత్త భాష్యాలు చెపుతాయి అంటున్నారు.జీవితంలో మనం ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం.కొన్ని సంఘటనలు మనను సన్మార్గం వైపు నడిపిస్తాయి.కొన్ని సంఘటనలు మనను చెడు మార్గం వైపు నడిపిస్తాయి.కరోనా దాడి మనందరికీ ఒక గుణపాఠం నేర్పింది అని కవి ఘంటాపథంగా చెపుతున్నారు.కాలజ్ఞానం వ్రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గాలి ద్వారా వ్యాధులు వ్యాపించి లక్షలాదిమంది చనిపోతారని వ్రాశారు. మహానుభావుడైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట నిజం అయింది.అన్ని మరణాలకు ఆర్త నాదాలు ఉండవు/కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా ఇవ్వరు.హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకుపోయి దహనం చేస్తారు. బంధువులు అందరు ఇక్కడ శవాన్ని చూసి విలపించే అవకాశం లేదు.కొన్ని దుఃఖాలు నిశిత నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి/కొన్ని విషాదాలు కారు చీకట్లో కళ్ళు తెరుచుకు చూస్తుంటాయి/ఈ వాక్యాలు ప్రతీకలా ఉన్నాయి.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు/రేపటి ఆశ శ్వాసల కోసం/దాచిపెట్టుకోవాలి/వేదనల నుండి కూడా శక్తి వెలువడుతుందని,అలాంటి శక్తిని రేపటి ఆశా శ్వాసల కోసం దాచిపెట్టుకోవాలి అని కవి ఎంతో అనుభవంతో మనకు చెబుతున్నారు.మనలను ఆశ శ్వాసలపై దృష్టి పెట్టాలని మనలో చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.శ్వాస మీద ధ్యాస పెట్టు అని పతంజలి మహర్షి మరియు మొదలగు యోగి పుంగవులు తెలియజేశారు.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు రేపటి ఆశ శ్వాసల కోసం దాచి పెట్టుకోవాలి అన్నది అద్భుతంగా ఉంది. మాతృమూర్తి కవితలో అమ్మ అంటే ఆత్మ/ మమకారపు మాధుర్యం/నవ మాసాలు మోసి, పురుటి వేదనలో/మరో జన్మ ఎత్తి/తాను మరో జీవికి జన్మనిస్తుంది/మైమరచి తన్మయత్వం పొందుతుంది అని అంటారు.మనం పురాణాల్లో మాతృదేవోభవ అని చదువుకున్నాం.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించే దైవం.అమ్మ మనల్ని కని పెంచుతుంది.అమ్మ లేని జన్మ లేదు.అమ్మ లేని లోకం లేదు.అమ్మంటే ఆత్మ.ఆత్మ అంటే జీవుడు మరియు జీవాత్మ స్వరూపం.అమ్మ స్వరూపంతోనే మనం భూమి మీదికి వస్తాం.ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అమ్మంటే మమకారపు మాధుర్యం అన్నారు. మమకారం అంటే బలమైన అభిమానం.అమ్మ ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.అమ్మ యొక్క మమకారపు మాధుర్యాన్ని మనమంతా ఎరిగి యున్నాం.తల్లి జంతువులు మరియు తల్లి పక్షులు ఎంతో ప్రేమగా మమకారపు మాధుర్యంతో మెదులుతాయో మనమంతా చూసి యున్నాం. అమ్మ యొక్క మమకారపు మాధుర్యం వర్ణించడానికి కలం సరిపోదు.స్వార్థం లేని బలమైన ప్రేమతో కూడుకొని ఉంటుంది.అమ్మ నవ మాసాలు కడుపులో మోసి పురిటి నొప్పులను భరించి మరో జన్మ ఎత్తుతుంది మరియు మరో జీవికి జన్మ నిస్తుంది.అమ్మ ఆ పసి పాప లాలనలో తనను తాను మైమరిచి తన్మయత్వం పొందుతుందనే భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.అమ్మకు కలిగిన ఆనందాన్ని మైమరిచిపోయిన తన్మయత్వం కవుల కల్పనలకు కూడా అందదు.మన ఇంటి దేవాలయాల్లో అమ్మ దేవతగా కొలువై ఉంటుంది. మన అమ్మను మనం ప్రేమతో నిత్యం వెలిగించుకుందాం.అమ్మను దేవ దీపంగా వెలిగించుకున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయని మనమందరం ఎరిగినదే.కవి అమ్మలో దైవాన్ని చూస్తున్నాడు.అమ్మలు అందరు దైవ స్వరూపాలే అమ్మపై సాటిలేని ప్రేమను వ్యక్తం చేసిన తీరు అద్భుతం.ఇంకెన్నడు ? కవితలో మనుషుల్లో కుల మత ద్వేషాలు మాసి/వసుధైక కుటుంబముగా విలసిల్లు రోజు/ఐక్యభావమున సహజీవనం గడిపి/ శాంతి సౌఖ్యములను నెలకొల్పు రోజు/ ఎన్నడు..ఇంకెన్నడు/అని అంటున్నారు.మనుషులు కుల మతాల పేరిట ద్వేషంతో మెలుగుతున్నారు. మనుషుల్లో ద్వేష భావం సమసిపోయి విశ్వమంతా ఒకే కుటుంబముగా కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటే శాంతి, సౌఖ్యములు నెలకొంటాయి.శాంతి సౌఖ్యములు ఎన్నడు,ఇంకెన్నడు అని ప్రశ్నించడం చక్కగా ఉంది. చిరంజీవులు కవితలో మాతృభూమి రక్షణలో/మీ వీరత్వం విజయ సంకేతం/ మీ ధీరత్వం ఆత్మ విశ్వాస కేతనం/మీ పట్టుదల,నిబద్ధత మాకు నిత్య స్ఫూర్తి/మీ నిస్వార్థం,నిజాయితీ మాకు నిరంతర దీప్తి/మీరే మా ధైర్యం,స్థైర్యం/మీరే మా బలం, భవిత/శాంతిని స్థాపించే సమరంలో/మీ మరణం చివరి చరణం కారాదు/మీ త్యాగం ఆఖరి వాక్యం కారాదు/చిరంజీవులు మీరు/అని అంటున్నారు.దేశ రక్షణ కొరకు సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండి కృషి చేస్తున్నారు.కవి సైనికులను చిరంజీవులు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఇంటి దీపాలు కవితలో ఇంటర్ ఫలితాల్లో లోపాలు/ఆరిన ఇంటి దీపాలు/అపజయం విజయానికి పునాది/పడరాదు మనాది../ఈ దేశానికి మీరే భవిత/విద్యార్థులారా!/ఎవరికుండదు బాధ/ చెట్లకు లేదా బాధ/శిశిరంలో ఆకులు రాలి మోడులై/ వసంతంలో చిగురిస్తాయి/పుడమికి లేదా వ్యథ/ గ్రీష్మంలో పగులు బారి/తొలకరితో పులకరిస్తుంది/ మరల ప్రయత్నం మానవ లక్షణం/నిరాశ నిస్పృహలతో/జారిపోయిన గుండెలతో/ రాలిపోవద్దు../మేధావుల్లో కూడా కొందరు మొదట పరాజితులే అని అంటున్నారు.ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేక నిరాశ నిస్పృహలతో కొందరు విద్యార్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించడం మంచిది కాదు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మరల ప్రయత్నించి పరీక్షలు రాసి విజయం సాధించాలి అని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.ఋతువిలాపం కవితలో కాలాన్ని నమ్మి/నార్లు పోసిన రైతుతో పాటు/చాలీచాలని తడితో/భరించలేని ఎండల వేడి/తట్టుకోలేని నారుమడుల/విలాపం/దున్నిన దుక్కులు/వర్షించని మేఘాల వంక/బేల దృక్కులు/అని అంటున్నారు. ఋతువిలాపాన్ని అతివృష్టి,అనావృష్టి,కరువు కాటకాలతో రైతులు అనుభవిస్తున్న కష్టాలను వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.సాంత్వన కవితలో మనుగడ ప్రశ్నార్థకమై/మనసుకు సాంత్వనము లేక/నిరాధార బాధాకర జీవనం/ దురాచారంగా మారిన/ప్రాచీనాచారం చివరకు/ చారిత్రక పతనం/హృదయ వేదనగా మిగిలిన/ సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లదు/అని అంటున్నారు.సుప్రీంకోర్టు తలాక్ విధానం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.ముస్లిం స్త్రీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయానికి అడ్డుతెర.సమానత్వ సామాజిక న్యాయానికి విజయం అని కవి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.అంతరంగం కవితలో అందం../వదనంలో ఉండదు/అంతరం ఆవిష్కరిస్తుంది/నలుగురితో నవ్వుతూ మాట్లాడు/ నలుగురిని నవ్వుతూ పలుకరించు/ఆ పలుకరింపుతో/అనురాగ పరిమళం పంచు/ పలుకరింపు చిన్నది అయినా../మనస్ఫూర్తిగా పలుకరిస్తే చాలు../నీకన్నా అందంగా/ ఎవరూ కనిపించరు/ఆనందమే అందం/ఆనందమే../జీవిత మకరందం/మనిషి కన్నా/మనసు గొప్పది/అని అంటున్నారు.మనిషి అంతరంగాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.కాలం శ్రమ కవితలో మానవుల్లో కొందరు/శ్రమను నమ్ముతారు/మరి కొందరు/ కాలాన్ని నమ్ముతారు/లక్ష్యంతో శ్రమించి/విజయం సాధించే వారు కొందరు/మరి కొందరు/కాలానుగుణంగా శ్రమిస్తూ/విజయం సాధిస్తారు/కాలం గమ్యం వైపు అడుగు వేయిస్తే/శ్రమ గెలుపుకి దగ్గర చేస్తుంది/ మనిషి జీవితంలో/కాలం – శ్రమ/జీవన గమన చక్రాలు/ అని అంటున్నారు.మనిషి జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు శ్రమను నమ్ముకుంటేనే విజయం వైపు అడుగులు పడతాయి అని చెప్పిన తీరు బాగుంది.జాగరూకత కవితలో ఓటరన్నా!జర పదిలం/మైకానికి,పైకానికి ఆశ పడకు/మనిషిని చూడు వాని నడవడి చూడు/ చేసిన బాసలు మరచి/ముఖం చాటేసే కపట నాయకుల/కనిపెట్టుకుని వుండని తరుణంలో/ రాజకీయాల్లో జరిగెడి/తప్పులే పునరావృతం/ నిన్నటి నీడలు రేపటి జాడలు/అని అంటున్నారు. ఓట్ల కోసం వచ్చే కపట రాజకీయ నాయకులు చూపించే నక్క వినయాలు నమ్మకూడదు. అమాయకంగా వారిని నమ్మి ఓటు వేయకూడదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకుల పట్ల జాగరూకతతో ఉండాలి.లేకుంటే మోసపోతావు అని తెలియజేసిన హెచ్చరిక ఒక చురకలాగా ఉంది. అపర చాణక్యుడు కవితలో శతవసంతాల సౌమ్యవాది/ఆర్థిక సంస్కరణల సారధి/నిరాడంబర జీవి,పి.వి./తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని,జాతి గౌరవాన్ని/దిగంతాలకు చాటి/రాజనీతికి మెరుగులద్దిన/విప్లవ తపస్వి/అపర చాణక్యుడు/ బహు భాషా కోవిదుడు/మనీషిగా,హిమనగమంతా ఎదిగిన సామాన్యుడు/ అని అంటున్నారు. తెలంగాణకు చెందిన పి.వీ.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించారు.అలాంటి మహనీయుని స్మరించుకోవడం మరియు కవితలో అపర చాణక్యుడు అని పేర్కొన్న తీరు చక్కగా ఉంది. జనమెరిగిన కాళోజి!కవితలో తెలంగాణ వాడుక భాషను/తన భాషగా కాక జన భాషగా/మలచిన మన గొడవ’అతడు/పరభాష వ్యామోహంలో మ్రగ్గే/తెలుగు వాళ్ళని/తల్లి భాషను నేర్చుకొమ్మని/ చురకలంటించగలడు/అని అంటున్నారు.కాళోజి నారాయణరావు స్మృతిలో రాసిన కవిత బాగుంది. తెల్ల కొలనులో నల్ల కలువలు కవితలో ప్లీజ్ ఒదలండి ఊపిరాట్టం లేదు/నిరాయుధ జార్జి ఫ్లాయిడ్ వేదనాభరిత ఆవేదన/పెడ రెక్కలు విరిచి,సంకెళ్ళతో బంధించి/మెడపై మోకాలితో నొక్కి/ఊపిరి తీసిన తెల్ల పోలీస్/మరణ యాతన/ సోషల్ మీడియా సాక్షిగా దారుణ ద్వేషం/అని అంటున్నారు.అమెరికాలో జాతి వివక్షకు బలి అయిన జార్జి ఫ్లాయిడ్ మరణం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.తెల్ల జాతి వాళ్లు నల్లజాతి వాళ్లపై వివక్ష ఇంకా కొనసాగడం తీవ్రమైన బాధను కలిగిస్తుంది. జాతి వివక్ష సమసి పోవాలి.అప్పుడే తెల్లకొలనులో నల్ల కలువలు వికసించేది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.అశ్రునివాళి కవితలో మారుతున్న జీవనశైలిలో/అసహనంతో/మనుషుల్లో పురుడు పోసుకుంటున్న/ఉన్మాద మనస్తత్వం/ విచక్షణను కాలరాస్తున్న ఆవేశం/విధి నిర్వహణలో నున్న అధికారిని/పట్టపగలు/కార్యశాలలో సజీవ దహనం/కౌలు రైతుకూ,భూ యజమానికి/మధ్య వైరం/విజయా రెడ్డిని బలిగొన్న ప్రతీకార జ్వాల/ అభం శుభం ఎరుగని పసి మొగ్గలు/మాతృ ప్రేమకు దూరమైన అభాగ్యులు/అని అంటున్నారు.రెవెన్యూ అధికారి విజయా రెడ్డి తాను పనిచేస్తున్న ఆఫీసులో సజీవ దహనం చేశారు.అట్టి దుర్ఘటన వల్ల విజయా రెడ్డి పిల్లలు తల్లి ప్రేమకు దూరమై పోయిన అభాగ్యులు అని ఆవేదనతో అశ్రునివాళి కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.ఆలోకనం కవితలో నా ఆలోచనలు/అనుభవాలు/అనుభూతులుఅన్నీ/ ఎవరితోనూ పంచుకోలేను/నాలో నేనే నదిలా ప్రవహించుకుంటూ/నిశ్శబ్ద నిశీధిలో స్వప్నిస్తూ/ దోసెడు భావాల్ని/పిడికెడు మనస్సులో సొగసుగా నింపుకుంటాను/ఒక్కొక్కటిగా నిన్నటిని నెమరేచుకుంటూ/వ్యోమ గామినై జగాలన్నీ చరిస్తుంటాను/విశ్వ యవనికపై/ప్రేమనై ఆవిష్కరించబడుతాను/అని అంటున్నారు.

తన మనసులో కలిగిన భావాలను కవి చెప్పిన తీరు బాగుంది.గ్రీష్మ హవనం కవితలో తన విశ్వ రూపంతో/నిప్పుల కొలిమిలా జ్వలిస్తున్న భానుడు/ ఎండలు నిదాఘమై నిప్పులు చెరుగ/జల
ఊటలు తగ్గి,బీటలు వారి/ఎండిపోయిన పంట పొలాలు/హాలికుల మనో వేదన/తిండి లేక,దాహార్తి తీరక/జీవన ప్రస్థానంలో/చావు బతుకుల నడుమ/ కొట్టుమిట్టాడుతున్న మూగజీవుల దైన్యం/దినమొక గండముగ సామాన్యుల కష్టాలు/తీవ్ర వడ గాడ్పుల విసురులు/తట్టుకోలేని రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు/పిట్టల్లా రాలుతున్న దారుణస్థితి/అని అంటున్నారు.ఎండల వల్ల రైతులు సామాన్యులు పశు పక్షులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వాళ్లు అనాథలు కవితలో వాళ్ల మనసులు/రాళ్ల మధ్య అద్దంలా/ముళ్ళ మధ్య పువ్వుల్లా/విచ్చుకుంటాయి /వాళ్ల ప్రేమ సముద్రమయితే/ఆకాశమంత ఆకలి/ పగలంతా తీరని వేదన/రాత్రంతా ఒడువని దుఃఖం/ బతుకంతా కాయ కష్టం/కళ్ళ మీద వాలిన ఆకలిని/కడివెడు నీ(కన్నీ)ళ్లతో నిద్ర పుచ్చుకుంటూ/ సజీవ సమాధుల్లో జీవిస్తుంటారు/వాళ్ల గుడిసెల్లో ఆకలి గిన్నెల భాష తెలుస్తుంది/వాళ్లు అనాథలు/ అని అంటున్నారు.ఒక వ్యక్తికి ఎవరు లేని స్థితి అనాథ.అనాథల గురించి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.ఆనంద రహస్యం కవితలో కొన్ని పుట్టుకతో వొస్తాయి/కొన్ని నేర్చుకుంటాం/కొన్నింటిని నేర్చుకుంటేనే వికాసం/ఎగరడం పక్షులకు/ఈదడం చేపలకు సహజాతాలు/మనం అభ్యసించవలసింది ఆనంద సృజన/అది అంగట్లో దొరికేది కాదు/మనపై మనం చల్లుకునే కర్పూర సుగంధమూ కాదు/ అందుకే ఇపుడు మనిషి/చేయాల్సింది ఆనంద సృజన/ఏ క్షణం నుండి మన మనసు/ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో./ఆ క్షణం నుండి ఆనందం మొదలవుతుంది/అదే అసలు,సిసలు బ్రతుకు రహస్యం/అని అంటున్నారు.మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం. ఆనందం అనేది ప్రియమైన వారితో సమయం గడపడం లేదా ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనడం వంటి సానుకూల జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటుంది.ఆనందం అనేది శ్రేయస్సు మరియు మొత్తం జీవితం సంతృప్తికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.ఆనందం అనగా మనసుకు ఆనందంగా ఉండే స్థితి,అభిరుచి, సంతోషం అని అర్థాలు.పారమార్థికంగా ఎనిమిది ఆనందాలు ఉన్నాయి.బ్రహ్మానందం,విషయానందం, ఆత్మానందం,అద్వైతానందం,నిత్యానందం, యోగానందం,సహజానందం,పరమానందం ఉన్నాయి.ఆత్మలేని శరీరం కవితలో సడి లేని నడి రాత్రి/శిథిల కుటీరం/మదించిన మానవ మృగం/ అసహాయపు ఒంటరి అబలపై/పాశవిక పంజా/వద్దని వారించినా/ఆర్తిగా అర్థించినా/రాతి గుండెలో కనిపించని/ఆర్ద్రత/అక్రమ ఆక్రమణలతో/వలువలు తొలగిస్తూ/తనువును నలిపేస్తుంటే/ప్రతిఘటించ చేవలేక గట్టునపడిన/చేప పిల్లలా తల్లడిల్లిన/ హృదయ విదారకత/సుప్త చేతనలో/నగ్న శీలాన్ని పాశవికంగా/ హరిస్తుంటే/గుండె గొంతుకలో ప్రతిధ్వనించిన/దుఃఖరోదన/దైహికంగా, మానసికంగా/కుంగిపోయిన మౌనమై/సజల నేత్రాలతో విడిచిన దౌర్భాగ్యపు/నిట్టూర్పు ఆమె/ తనను తాను సాంత్వన పరచుకోవడం/ఎలాగో తెలీని అఘ్రాణిత పుష్పం/ఉనికి కోల్పోతున్న దీపశిఖ/జీవన నైరాశ్యంలో విసుగును,విరక్తిని/ నింపుకొని/మృత్యు స్పృహతో/ఆమె ఒక ఆత్మలేని శరీరం/అని అంటూ కవి వ్యక్తీకరించిన భావాలు స్త్రీల పట్ల సానుభూతిని తెలియజేస్తున్నాయి. సమాజంలో స్త్రీలపై దుర్మార్గుల అత్యాచారాలు, ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం జలదృశ్యం కవితలో కాళేశ్వరం జలదృశ్యం/అవుతున్నది ఆవిష్కృతం/అనవరతం జనపదాలు/జల సిరులతో మురిసిపోవగ/ తెలంగాణ వర ప్రదాయిని/ఎత్తిపోతల ప్రాజెక్టు/ కాళేశ్వరం శుభారంభం/అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట పొలాలకు నీళ్లు అందాయి అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.మిత్రుడు కవితలో నవ్వుతూ నవ్విస్తూ/ కాలాన్ని నడిపించే మిత్రుడు కనబడితే/ మహదానందంలో కాసింత సేపు/మనసంతా బాల్యంలోకి జారిపోతుంది/కలతలు కనుమరుగవుతాయి/దిగులు చీకట్లు కరిగి,పున్నమ రేయి/ఆదమరిచి నిదురించినంత హాయి/స్వార్థ మెరుగని స్నేహారామంలో/ఓ పువ్వునై పరిమళించినట్టు/మనసంతా పులకరింపులతో తేలిపోతుంది/మన ప్రతి అడుగులో/వెన్ను తట్టే వారుంటే/జీవితం ఒక పూల చెట్టు/సృష్టిలో స్నేహం కన్నా తీయనిదేమున్నది/ఆత్మీయుని కౌగిలి/ అనుబంధాల లోగిలి/అని అంటున్నారు.ఒక మంచి మిత్రుడు ఉంటే మనిషి జీవితం నందనవనం అవుతుంది అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.అగోచర శత్రువు కవితలో కరోనా సృష్టించిన విలయం/కళ్లారా చూచిన పిమ్మట/ నాకిప్పుడు పరదేశాలకు కాదు/మాతృ గర్భంలోకి పోవాలనిపిస్తోంది/కరోనా ఈ కాలానికి మార్గ నిర్దేశనం చేస్తూ/నా నేత్రాలను తెరిపించింది/నా అపరిశుద్ధ చేతులను,చేతలను/శానిటైజ్ చేసుకొమ్మని/ కనిపించని కరోనా నేర్పిన జాగరూకత/తల్లి ఒడిలో హాయిగా/ తలదాచుకున్నట్టున్న నా ఉనికి/నాకై నేను విధించుకున్న గృహనిర్బంధం/జైలు జీవితంలా ఉంది అని అంటున్నారు.కరోనా పెనుభూతాన్ని చూసిన కవి అగోచర శత్రువు పట్ల జాగరూకత ఉండాలని కవితలో వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి. మధుర భావన కవితలో నా చెలి లేని శీతల రాత్రి/
శయన మందిరమొక మంచు గుహ/నా పాన్పు కఠిన హిమ శకలము/నిద్దుర కన్నుల నిరీక్షించు/ఈ ఏకాంత చీకటి శిథిల రాత్రి/నన్నే జాలిగా వీక్షిస్తూ/కాలమై నా కనుల ముందు కరిగిపోతున్నది/ నాకు కావాల్సినదిప్పుడు/మధు కలశము కాదు/ ఇప్పుడొక/ఉష్ణ స్పర్శ నన్నాశ్రయించిన/ఎంత బాగుండును/నా చెలి నా చెంతనే వున్నంత/వెచ్చని మధుర భావన/నన్నలుముకున్నట్లు/ అంతర్నిహితమైన అలజడి/అని అంటున్నారు. కవితలోని భావాలు ఒక్కసారిగా మనిషి మనస్సు మధుర భావనలు తేలియాడుతున్నట్లుగా ఉంది. ప్రగతి పథంలో కవితలో స్మార్ట్ సిటీ ముసుగులో/ అందమంతా ఒళ్ళో దాచుకొని/నగరం అభివృద్ధి చెందుతూనే వుంది/కార్లల్లో బైకుల్లో/గజిబిజిగా, గందరగోళంగా/పరుగులు తీస్తూనే వుంది/రాచ పుండ్లలాంటి గుంతల రహదారులతో/కంపుగొట్టే కాలనీల హట్టవాహినీలతో/పరుల కష్టార్జితాన్ని/ జుర్రుకొని బతికే పరాన్న జీవులతో/అభివృద్ధి చెందుతూనే ఉంది/అని అంటున్నారు.రాజకీయ నాయకులు,అధికారులు,కాంట్రాక్టర్లు కుమ్ముక్కై స్మార్ట్ సిటీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.పేరుకే స్మార్ట్ సిటీ అని పేరు నిధులు మాయం అవుతున్నాయి.ఈ దుస్థితి మారాలని కవి ఆవేదన చెందుతున్నారు.భూమి పూజ కవితలో బాల రామునికి భవ్య మందిరమట/శ్రీరామ ధామానికి శ్రీకరమట/భక్తి పారవశ్యంలో భరత వర్షమట/రామ నామ స్మరణతో పంచభూతాలు/పరవశించే వేళ/పులకరించిపోతున్న అయోధ్యాపురి/అని అంటున్నారు.కవి అయోధ్యలో జరిగిన భూమి పూజకు స్పందిస్తూ రాసిన కవిత ఇది.రగిలే భావుటాలై కవితలో నేటి రాజకీయం వెర్రి తలలు వేస్తున్నది/నాయకుల గోముఖ వ్యాఘ్ర రూపాలు/బయటపడుతున్నాయి/ధరల ప్రవాహంలో/సామాన్యుని బతుకు/అగమ్య గోచరమౌతున్నది/ సంపన్నుల కొమ్ముకాస్తూ/ కష్టజీవులపై ఉక్కు పాదం మోపుతూ/ రాజకీయాలిప్పుడు భ్రష్టు పట్టి పోయాయి/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయాల్లో విలువలు నశించిపోయాయి అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు రగిలే నిప్పుల భావుటాలై పోరు బాటలో సాగాలి అని స్ఫూర్తిని కలగజేస్తున్నారు.ప్రజా పోరాట యోధుడు కవితలో ఆ పేరు వింటేనే నిజాం నవాబుకు సింహ స్వప్నం/రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి అని అంటున్నారు.గట్టెపెల్లి మురళి ప్రజా పోరాటయోధుడు,తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.అట్లాంటి ఆదర్శమూర్తి ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు.మహానీయుడు గట్టెపల్లి మురళిని స్మరించుకోవడమే మనం వారికి అందించే నివాళి.ఆపాత ఘుమ ఘుమలు కవితలో ఆపాత/ఘుమ ఘుమలు/ వంటింటి పరిమళాలు/అమ్మ పోపు పెడితే/వాడంతా కమ్మని వాసన/గుప్పుమనేది/అమ్మ ఏ కూర వండుతుందో వాసనబట్టి/ఇట్టే గుర్తించే వాళ్ళం/ చిటికెడు లవంగాల పొడి వేసి సాంబారు చేస్తే/ఆ ఘాటుకు జలదోషం తోకముడిచేది/వంటింటితో అనుబంధం/ఓ మధుర స్మృతి/అని అంటున్నారు. కవి అమ్మ చేసిన వంట ఘుమఘుమలను మరిచిపోకుండా గుర్తు చేసుకున్న అనుభూతి చక్కగా ఉంది.అమరుడు అలిశెట్టి కవితలో సాహితీ కొలనులో/ఎర్రెర్రని అక్షర కలువలు పూయించి/అలతి అలతి పదాలతో/అనంత భావాలను పలికించినవాడు/దోపిడీ సమాజంపై/ మెరుపుల వంటి పదజాలంతో/కవిత్వ శర పరంపరలు సంధించి/విప్లవ సాహితీ పతాకమెగరేసినవాడు/మరణం నా చివరి చరణం కాదంటూ/ ఆఖరి క్షణం వరకు తన రచనలతో/ సామాజిక రుగ్మతలపై/ అలుపెరుగక పోరాడిన అభ్యుదయ వాది/సంపాదన కోసం ఆరాటపడక/ పీడితుల పక్షాన/నా కలం కుంచె రెండు వుంటాయని/సగర్వంగా ప్రకటించుకున్న సాహసి/ కవితాకాశంలో/రవి అస్తమించని/అక్షర సామ్రాజ్యం/ అలిశెట్టిది అని అంటున్నారు.అలిశెట్టి స్మృతి కవిత బాగుంది.గెలుపు కవితలో ప్రయత్నంలో ఎన్ని అవమానాలు/ఎన్ని అవరోధాలు ఎదురైతే/విజయం అంత గొప్పగా మలచబడుతుంది/ ఓడిపోతున్నానని/తెలిసిన క్షణంలో కూడా/పోరాడే వాడే నిజమైన ధైర్యశాలి/తీరం చేరాలంటే/ఎన్ని అలల్ని ఎదురీదాలి/వెలుగును వీక్షించాలంటే/ఎన్ని చీకట్లలోకి తలవాల్చాలి/అడుగడుగునా అడ్డుగోడలు/కాంతిలో కూడా కనిపించని చీకటి నీడలు/వాటి లోపల మెత్తని మోసాలు/ వెంటాడుతూనే వుంటాయి/వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే/ప్రతి విజయం వెనక/లోకానికి తెలియని కష్టం వుంటుంది/జీవితాన్ని పోరాడకుండా/గెలిచినోడు వున్నాడా..?/అని ప్రశ్నిస్తున్నాడు గెలుపుకు కావలసిన స్ఫూర్తిని అందిస్తున్నాడు.అడవి కవితలో అమ్మలా అక్కున చేర్చుకుని/మన నుండి విషవాయువులను గ్రహించి/ప్రాణవాయువుని ప్రసాదించే/అడవి..జీవ వైవిధ్యం/సకల జీవులకు తోడు,నీడ/అవనికి సారం అందించే వర్ష ఋతువు/స్వచ్ఛమైన వాయువు, వానలు/మంచి జీవనమునిచ్చే అడవికి/హాని చేయకుండా/పర్యావరణాన్ని పరిరక్షిస్తూ/ప్రకృతిని ఆకుపచ్చగా ఉంచాలి/చెట్టు నుండి గుణాన్ని గ్రహిస్తూ/ఆకుల నుండి మార్పును గమనించాలి/ మానవ జీవితం అన్నిటికి ఆకర్షించబడే/ఒక అయస్కాంతం/దేనిని ఆకర్షించాలో వికర్షించాలో/ తెలుసుకోవడమే విచక్షణ/అడవిని రక్షించుకుంటూ/ మనుగడకు బాటలు వేసుకోవాలి/అలా కానినాడు./మనిషి ఒక్కడే తనకు తానే చివరకు/ అనంతానంత తిరస్కారంగా../మిగిలిపోతాడు/ అని అంటున్నారు.అడవి అంటే వృక్షాలు,మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారం తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం.అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం.అనేకమైన ఆహార పదార్థాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం.జల వనరులకు ఆలవాలం.భూమి ఉపరితలం మీద 9.4% అడవులు ఆక్రమించి ఉన్నాయి.అడవులు జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి.కలప గృహ నిర్మాణంలో,పరిశ్రమలలో ముడి పదార్థంగా వినియోగిస్తారు.మానవులు స్వార్థంతో అడవులు నరికి వేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయి.అడవులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.మనిషి – మానవత్వం కవితలో మన కోసం మనం జీవించడం గొప్ప కాదు/సాటివారి కోసం మన జీవితం/కొంత అంకితం చేయగలిగితే/అంతకు మించిన మానవత్వం/మరేముంటుంది?/ఒక మనిషి కన్నీరు తుడువ/రక్త బంధమో,స్నేహబంధమో/ఉండాల్సిన అవసరం లేదు/పిడికెడు గుండెలో/చిటికెడు మానవత్వముంటే చాలు/అంతులేని కోరికల దాహాన్ని అదుపు చేసి/పరులకు కడు మేలు కలిగేలా/తమ జీవనశైలిని రూపొందించుకొని/ మనిషికి.. మనిషి/మానసిక శాంతిని ఇవ్వగలిగాలి అని అంటున్నారు.మనిషి మానవత్వం అలవర్చుకోవాలి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నువ్వే నా లోకం కవితలో నీ ప్రేమలో తల మునుకలై/తనువంతా పులకించి,రేపవళ్లు/హాయిగా గడిచిపోవాలనిపిస్తుంది/నీ కళ్ళు ఒక్క క్షణమైనా,నా కలల నుంచి/ఎడబాయక ఉండిపోవాలనిపిస్తోంది/ నువ్వు నా దానవనే నమ్మకాన్నే/ఎదలో నింపుకొని/నీ జ్ఞాపకాలను ధ్యానిస్తున్న/నీ తలపై ఓ గడుసు పులకింత/ఒక్క గడియ నువ్వు నాకు ఎడమైతే/ యుగయుగాల ఏకాకి తనమేదో/ నాకు తెలియకుండానే నాలోకి/ఇంకిపోయినట్లుంటది/ నువ్వు లేక ఏకాంతముగా/నక్షత్రాలను వీక్షించలేను/ వెన్నెలను ఆస్వాదించ లేను/అని అంటున్నారు.కవి తనలో కలిగిన ప్రేమ భావనలను చక్కగా వ్యక్తీకరించారు.సంవేదన కవితలో మన ప్రేమ అమరం/అయినా!ఎందుకో నాకీ భయం/నా జీవన నేస్తమా!మదిలో ఏమిటీ కలవరం/పంచిన ఆనందానికి బదులుగా/మళ్లీ ఆ ఆనందం దొరుకదు.. ఎందుకని పంచిన నవ్వులకు మారుగా మళ్లీ ఆ నవ్వులు లభించవు ఎందుకనీ?/వ్యథను పెంచడమే గాని ఒక్క నిమిషం/శాంతి లభించదు ఎందుకనీ?/ నిరీక్షణల కెరటం మీద/ఎంతకాలమని తేలిపోను/ అని అంటున్నారు.వియోగం కవితలో ఏ నయనాలు నీ కోసం/నవయవ్వన సుందర స్వప్నాలు కన్నాయో/ఆ కళ్ళు..నిన్నెడబాసి దిగులుగా విలపిస్తున్నాయి/అని అంటున్నారు.ఆమె కొరకు తాను అనుభవించిన వేదనను వియోగం కవితలో చక్కగా వ్యక్తీకరించారు.
ఆశ నిండిన శ్వాస కవిత్వం
రచన : కసిరెడ్డి జలంధర్ రెడ్డి
ప్రచురణ : భవానీ సాహిత్య వేదిక,సీతారాంపూర్, కరీంనగర్ 505001.
పేజీలు : 78,
వెల:₹ 100/-
ప్రతులకు :
కసిరెడ్డి జలంధర్ రెడ్డి,
ఇంటి నెం. 8 – 3 – 159,
భగత్ నగర్,కరీంనగర్ – 505001.
స్టేట్ : తెలంగాణ,

You may also like

Leave a Comment