Home వ్యాసాలు కారా మాస్టారు

కారా మాస్టారు

by Vijaya Ranganatham

ఈ సారి మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలని వచ్చాను. అతను మరెవరో కాదు, కథ అంటే కారామాస్టారే అని పిలిపించుకున్న, కథాయజ్ఞాన్ని చేసిన గొప్ప రచయిత కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథలు గురించి ఏ మాత్రం పరిచయమున్నా, వీరి గురించి తెలియని వారుండరు.

కారా మాస్టారుగా పిలువబడే “కాళీపట్నం రామారావు” 1924నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో పేర్రాజు, భ్రమరాంబ లకు జన్మించారు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివారు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల వివిధ ఉద్యోగాలు చేసినా స్థిరంగా చేసింది మాత్రంఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగం చేసారు. అతను 1972లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసారు.

కాళీపట్నం రామారావుగారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు.

ఆయనఒక సందర్భంలో తన రచనా ప్రస్థానం గురించి చెబుతూ, 1935 నుండి పాఠకుడుగా బాల్యం,తరువాత 1940-1942 వరకు రాసేందుకు ప్రయత్నం, 1943 నుండి ఐదేళ్ళు చిన్నా,చితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలుచేసానని, 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగానని . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనం, ఆ తరువాత 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాసానని అన్నారు. ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము, అందుకవసరమైన ఇతర ప్రక్రియలతో సహా చదువుతో పాటు అభిప్రాయాలు పదిమంది తో పంచుకోవడమూ ఆగలేదని చెప్పారు.

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు.

ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయని,తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడని పలువురితో ఆయన అభినందనలు పొందారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు.

1964లో వెలువడిన ‘యజ్ఞం’ కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి.

కారా మాస్టారు, “యజ్ఞం” కథా రచయితగా సుప్రసిద్ధుడు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించాడు.

ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు.

అతని మొదటి కథ చిత్రగుప్త లో ప్రచురితమైన ‘ప్లాట్ఫామ్‘ అనే ఒక చిన్న కథ. అది పోస్ట్ కార్డువెనుక వ్రాయబడింది . 1963లో “తీర్పు” రాశాడు. తరువాత 1960ల చివరలో “యజ్ఞం”, “మహాదాశీర్వచనము”, “వీరుడు-మహావీరుడు”, “అదివారం”, “హింస”, “నో రూమ్”, “స్నేహం”, “ఆర్తి”, “భయం”, “శాంతి”, “చావు”, “జీవన ధార”, “కుట్ర”వంటి అనేక కథలు రాశారు.

“కుట్ర” వ్రాసిన తరువాత, అతను రాయడం మానేశాడు. తన తొలినాళ్లలో తాను చాలా రాసేవాడినని, తాను రాసిన దానితో సంతృప్తి చెందకపోవడంతో వాటిని ప్రచురణకు పంపలేదని చెప్పారు. తర్వాత రోజుల్లో ఏడాదికి ఒకటి రెండు కథలు రాసేవాడు. అతని కథలు రష్యన్ మరియు ఆంగ్లంతో సహా వివిధ విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి.

కాళీపట్నం విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు కూడా.

ఆయన దాదాపు 51 కథలకు పైగా రచించి, ఎన్నో ప్రశంసలను, పురస్కారాలను ముఖ్యంగా ఎంతమందో సాహిత్యాభిమానుల మనసుల్లో కారా మాస్టారుగా చిరస్థాయిగా నిలిచి పోయారు. కాలం కృరమైంది కదా మనమాస్టారుగారిని కూడా మనకు దూరం చేసింది.  ఆయన తన 96 ఏళ్ళ వయసులో వృద్దాప్య కారణంగా 2021 జూన్ 4వ తేదీన శ్రీకాకుళంలో కన్నుమూసారు.

పురస్కారాలు

యజ్ఞం కథ కు రెండవ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు,ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్), కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.అతను 1995లో “సెంట్రల్ కల్చరల్ అకాడమీ అవార్డు” గెలుచుకున్నారు.1993లో న్యూయార్క్‌లో జరిగిన 9వ తానా సదస్సు – ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా ఆయన USలో పాల్గొన్నారు.18 జనవరి 2008న లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం)వారిచే సత్కరింపబడ్డారు.

బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం -2015,

కథానిలయం

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలోకి తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.

అలా పుట్టింది 1997లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళంపట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు – గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా – ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను (దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపథ్యాన్నీ సమాజ నేపథ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్‍సైట్ ఏర్పడింది. వివిధ మార్గాల ద్వారా లభ్యమైన ఈ రచనలని లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.

విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్‍సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

ఇదీ కారా మాస్టారి గారి జీవన ప్రస్థానం.

You may also like

Leave a Comment