ఇటీవల కీర్తిశేషులైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ డా. బాలశ్రీనివాస మూర్తి ఒక మంచి పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, గొప్ప సాహితీ వేత్త గా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంకృషితో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి ఆచార్య స్థాయి వరకు ఎదిగిన ప్రతిభాశాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయం ఆయన సొంతం.
ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా చిరునవ్వుతో అన్నా అని సంభోదించే గొప్ప మనసు ఆయనది. కరీంనగర్ లో జరిగిన రెండు మూడు కార్యక్రమాలలో ఆయనను కలిసి ఆయన ప్రసంగం వినే అవకాశం కలిగింది. అలాగే నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సి. పార్థసారథి, ఐఏఎస్ వైస్ ఛాన్స్ లర్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఆయన మృదు స్వభావి సున్నిత మనస్కుడు. అన్నా,అక్క,తమ్మి అని ఆత్మీయ పిలుపులతో అందరినీ పలకరించేవాడు. ఏ విషయమైనా తనకు తోచినంత సహాయ సహకారాలు అందించేవాడు. ఎవరినైనా తొందరగా నమ్మే స్వభావం ఆయనది. కానీ ఎవరైనా నమ్మకద్రోహం చేశారనిపిస్తే మాత్రం అంతే కఠినంగా వ్యవహరించేవారు. సాహిత్యం అంటే విపరీతమైన ప్రేమ. ఏ పని చేసినా సాహిత్యాన్ని, సాహిత్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించేవారు. అంతేకాదు ఆయనను ఆహ్వానిస్తే సాహిత్య ప్రసంగాల కోసం ఎంత దూరమైనా, కష్టమైనా ఇష్టంగా వెళ్లేవారు. అతని ప్రసంగాలలో చక్కటి విశ్లేషణ ఉండేది. విషయ పరిజ్ఞానంతో పాటు శ్రోతలను తన వైపు తిప్పుకునే అద్భుత ధార ఉండేది. అనవసరమైన విమర్శకు దిగేవారు కాదు. తాను చేయాలనుకుంటే ఎంతటి కఠినమైన పని అయినా , కష్టమైన పనైనా ఓపికగా పూర్తి చేసేవారు. విమర్శ రంగంలో సాటిలేని మేటి సాహితీవేత్తగా పేరొందినారు. అనేక రచనలు, వ్యాసాలు ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించి చక్కటి సాహిత్యాన్ని అందించారాయన.
ప్రొఫెసర్ బాల శ్రీనివాసమూర్తి 1966 సెప్టెంబర్ 5న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లోని పోతిరెడ్డి పేట గ్రామం లో జన్మించారు. స్వగ్రామమైన పోతిరెడ్డి పేట, రామాయంపేట, చిన్నకోడూరు, సిద్దిపేట ప్రాంతాల్లో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ మరియు పీహెచ్డీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున జన్మించినటువంటి బాల శ్రీనివాసమూర్తి గురువుగా గొప్ప గౌరవాన్ని చూరగొన్నారు. శిష్యాదిచ్చేత్ పరాజయం అన్నట్టుగా శిష్యుడి ఉన్నతిని నిరంతరం కోరుకునే వారు.
తన తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని దివంగత లక్ష్మీనర్సింహశర్మ జీవిత విశేషాలపై ఇటీవల రచించిన ‘జీవన హిందోళం’ పుస్తకాన్ని డాక్టర్ నందిని సిధారెడ్డి పీఠిక తో ప్రచురించారు. ఆయన తండ్రి కూడా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ రచన పలువురు సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నది. ఇటీవలే ఈ పుస్తకానికి కరీంనగర్ సాహితీ గౌతమి వారు డాక్టర్ గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారాన్ని ప్రకటించారు. పురస్కారం అందుకోకుండానే ఆయన పరమపదించడం ఒక విషాదం. బాల శ్రీనివాసమూర్తి భార్య శైలజ. వీరి కుమార్తె హంసిక, కుమారుడు గౌతమ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఆయన రాసిన ‘తెలంగాణం-తెలుగు మాగాణం’, ‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’ పరిశోధనాత్మక గ్రంథాలు తెలంగాణ సాహిత్య చరిత్ర రచనల్లో మేటిగా నిలుస్తాయని విమర్శకుల ప్రశంసలు చూరగొన్నారు. ‘వానమామలై వరదాచార్య, విలక్షణ పి.వి జీవిత చరిత్రలు.. ‘తెలుగు వారి చరిత్ర మైలురాళ్ళు – మణిదీపాలు’, ‘65ఏళ్ళ నాటి అలంపురం సభలు’, ‘మా ప్రసిద్ధిపేట’ తదితర రచనలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన రచించిన విలక్షణ పి.వి పి.వి నరసింహారావు గారి బహుముఖీనమైన విలక్షణ విశేషాలను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని పి.వి. శత జయంతి సందర్భంగా మోనోగ్రాఫ్ గా రచించాడు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 23 2022 రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆయన సంపాదకత్వంలో ‘తెలంగాణ వైతాళికులు’ మూడు సంపుటాలు, ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ పేరుతో మరో మూడు సంపుటాలు వెలువడ్డాయి. జాగృతి వార పత్రిక లో మంచి కథలను సంకలనం చేశారు. తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అనే అంశంపై ఆయన రచించిన పరిశోధన గ్రంథం పండితుల మెప్పును పొందింది. తండ్రి గురించి తన బాల్యపు జ్ఞాపకాల గురించి “స్మృతి పదిలం” పేరుతో పుస్తకాన్ని రచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం అద్భుతమైన పుస్తకాన్ని అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ‘1920-56 మధ్యకాలంలో తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం-పత్రికల పాత్ర’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. ఆయన పరిశోధన కూడా సుమారు నాలుగు దశాబ్దాల తెలంగాణ సామాజిక చారిత్రక ఘట్టాల ను గొప్పగా ఆవిష్కరించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చలం రాసిన “సుధ” గీతాలపై ఎంఫిల్ చేశారు. వివిధ పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలను రాయడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించారు.
పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్టుగా నువ్వు నాకన్నా ఎదగాలి అని ఆకాంక్షించిన తండ్రి మాటను నిజం చేసి చూపించిన శిఖర సమానుడాయన. సాంప్రదాయ ఆధునిక విమర్శనా రీతులను అధ్యయనం చేసి ప్రామాణిక సాహితీ విమర్శకునిగా ఎదిగిన పరిశోధనా చక్రవర్తి ఆయన.
కరీంనగర్‌లో తెరవే మిత్రులు ‘తెలంగాణ రుబాయిలు’ పరిచయసభ పెట్టినప్పుడు ఎం.నారాయణ శర్మతోపాటు హైద్రాబాద్ నుండి బాలశ్రీనివాస మూర్తిని హాజరైన జ్ఞాపకం ఉంది. అలాగే కరీంనగర్ లో జరిగిన అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక వారి సభల్లో ఆయన హాజరై అద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు అల్లం రాజయ్య ఎంత గొప్ప వక్త అని ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ రూపొందించిన “బసవపురాణం పద ప్రయోగ సూచిక” పుస్తక ఆవిష్కరణకు డాక్టర్ బాల శ్రీనివాసమూర్తి మరియు ఆచార్య రవ్వా శ్రీహరి గారలు అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరై ఆ ఇద్దరి అద్భుత ప్రసంగాలు వినే అవకాశం నాకు దక్కింది. యాదృచ్ఛికంగా ఆ ఇద్దరు తక్కువ వ్యవధిలోనే అస్తమించడం సాహితీ ప్రపంచానికి తీరని లోటు.
విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రాక పూర్వం కొద్దికాలం సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో పనిచేశారు. ఆ సమయంలో విజేత ఇతర పోటీ పుస్తక ప్రచరణ సంస్థలకు రెఫరెన్స్ గ్రంథాల రచన ప్రారంభించారు. పత్రికల్లో క్రమం తప్పకుండా కాలం రాసేవారు. ఎడిటోరియల్ పేజీలో ప్రతిరోజు ఒక వ్యాసం సమకాలీన రాజకీయాలపై రాసేవారు. సద్గురు శివానందమూర్తి శిష్యునిగా ఆయన సూచన పై పుస్తకాలు రాశారు. తెలుగు సాహిత్య రంగంలో లబ్ద ప్రతిస్తులైన వారిపై 1000 పేజీలకు పైగా సమగ్ర గంధాన్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇటీవల ప్రచురించిన తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథానికి సంపాదకత్వం వహించి విశేష కృషి చేశారు.
సాటి లేని మేటి పరిశోధకునిగా, విశిష్టత కలిగిన విమర్శకునిగా, గురువుకు పర్యాయపదంగా నిలిచిన ఆచార్యునిగా, సుసంపన్నమైన సాహిత్యాన్ని వెలువరించిన సాహిత్య మూర్తిగా తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన బాల శ్రీనివాసమూర్తి ఏప్రిల్ 24 2023 రోజున హైదరాబాదులో సుచిత్రలోనీ తన స్వగృహం లో 57 వ ఏట అస్తమించడం సాహితీ రంగానికి తీరని లోటు. ఆయనకు ప్రగాఢ నివాళులు