Home వ్యాసాలు కృష్ణాన్వేషణయే అంతరంగ అన్వేషణ

కృష్ణాన్వేషణయే అంతరంగ అన్వేషణ

by Palakurti Rammurty

నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై
జల్లెడివాడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వురా
జిల్లెడిమోమువాడొకడు చెల్వుల మానధనంబుదెచ్చెనో
మల్లియలార మీపొదల మాటున లేఁడుగదమ్మ చెప్పరే!
(భాగవతం – పోతన గారు)
నల్లనివాడు:- కృష్ణుడు…. “కృష్” భూవాచకము… “ణ” కారము మోక్షానికి ప్రతీక. “భూ” శబ్దము ప్రయత్న శీలతకు ప్రతీక కాగా “ణ” కారము ఆ ప్రయత్నానికి వచ్చే ఫలితము. ప్రయత్నించిన వారికి లేదా దృఢమైన సంకల్పంతో సాధన చేసిన వారికి వారి సాధనకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు.. కృష్ణుడు అతడే భగవంతుడు. భగము అంటే…సమగ్రమైన కామము, విభూతి, యత్నము, మాహత్మ్యము, శ్రీ, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసును ఆకర్షించేవే లేదా ఆకర్షక కేంద్రాలే. ఇవన్నీ కలిగినా వీటికి అతీతంగా ఉండేవాడు భగవంతుడు. అందుకే గోపికలు కృష్ణుడివైపు ఆకర్షితులయ్యారు… వాటిని లేదా అవి కలిగిన వానిని సాధించాలని వెతుకుతున్నారు, గోపికలు. అవి ఎక్కడుంటాయి? నిజానికవి అంతటా ఉన్నాయి… కాని వారు గుర్తించడం లేదు.. ఎందుకు అంటే… గోపికలు రజస్ తమో గుణాల బంధనాలలో చిక్కినవారు. మనసులో ఏదో కావాలని ఉన్నది కాని స్పష్టత లేదు… ఆ స్పష్టతను సాధించే ప్రయత్నమే వారి వెతుకులాట. నిజానికది సత్వగుణ సాధనకే. ఇక ఎక్కడ వెతుకుతున్నారు. మల్లెల పొదల మాటున వెతుకుతున్నారు. మోక్ష సాధన కావాలి అనుకోవడం “కామమే”. నేను సాధించాలి అనుకోవడం సాత్వికాహంకారం. నిజానికి సాత్వికాహంకారం కూడా లక్ష్య సాధనలో ప్రతిబంధకమే.
వెతకాలి అంటే దేనిని వెతుకుతున్నామో దానికి ఒక రూపమో లక్షణమో ఉండాలి కదా… అందుకే ముందుగా నల్లగా ఉంటాడని చెపుతున్నారు. నలుపు పెంజీకటికి ప్రతీక. ఉన్నది పెను చీకటి మాత్రమే. వెలుగు అనేది సృష్టి. సృష్టించబడింది… నశిస్తుంది. శాశ్వతత్వాన్ని కలిగింది నలుపు మాత్రమే. వెలుగు సృష్టించబడింది అంటే… ఉన్న చీకటిలో వెలుగు కూడా ఉన్నట్లే కదా. కాబట్టి కృష్ణుని శాశ్వతత్త్వాన్ని పరిచయం చేయడానికి, అనంతత్త్వాన్ని చెప్పేందుకు, సర్వవ్యాపితత్త్వాన్ని చెప్పేందుకు నలుపును చెప్పారిక్కడ. నలుపును ఎలా తెలుసుకోవాలి? తెలిసిన వారో, చూసిన వారో ఎలా గుర్తిస్తారు? అంటే… ఆ పెంజీకటికి ఆవల ఉన్న వెలుగు వల్ల గుర్తించాలి. టార్ఛ్ లైట్ వేసినట్టుల. ఆ వెలుగే జ్ఞానం. ఈ జ్ఞానం రెండు రకాలు. జ్ఞానం పెరిగినా కొద్దీ “నాకు తెలుసు” అనే అహంకారం పెరుగుతుంది. ఇంకా కావాలనే “జిజ్ఞాస” పెరుగుంది. నేనే “అధికుడనని” నిరూపించుకోవాలనే ఆతృత పెరుగుతుంది. ఇవి పిల్లల మూర్ఖత్వం లాంటిది (Childishness). ఎదుటివారు గుర్తించక పోతే అసహనం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆచరణ లేని “తెలుసు”కోవడానికి ప్రేరణ నిస్తావి. ఇది మొదటి రకం. ఇక రెండవ రకం… సమత, క్షమత కలిగి విశాల భావనామయ జగత్తు అంతరంగంలో ఆవిష్కృతమౌతుంది. ఇది పసిపిల్లల మనస్తత్వం లాంటిది (Child likeness). మొదటి మానసిక స్థితి ఇతరములను గుర్తించేందుకు సహకరించదు. గోపికలు ఈ స్థితిలోనే ఉన్నారు… “ఆకాశశరీరంబ్రహ్మ సత్యాత్మప్రాణారామం మనఆనందం శాంతిసమృధ్ధ మమృతం ఇతిప్రాచీన యోగ్యోపాస్వ” అన్న తైత్తిరీయం ఆధారంగా ఆకాశమే శరీరముగా కలిగిన కృష్ణుడు సర్వాంతర్యామిగా గుర్తించలేమిని, కృష్ణుడిని తమవానిగా, అతనికొక పరిధిని సృష్టించి ఆ పరిధిలో ఆలోచిస్తూ… అపరిమితత్వాన్ని పరిమితత్తంలో వెతుకులాటను ఆరంభించారు, గోపికలు.

పద్మనయనంబులవాడు:- పద్మాలు లక్ష్మీదేవికి నివాస స్థానాలు. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యానికి ప్రతీక. ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది అంటే… దానిని భరించగలిగిన వారి వద్ద ఉంటుంది. సమగ్రత్వానికి చిరునామా కృష్ణుడే కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడే ఉంటుంది. ఐశ్వర్యం అంటే భౌతిక సంపద మాత్రమే కాదు కదా… అది జ్ఞాన సంపద కూడా. జ్ఞానాన్ని అనుగ్రహించ గలిగిన వాడు కృష్ణుడు. ఏది మన వద్ద ఉంటే అదే ఇవ్వగలము. అన్నీ ఉన్నవాడు అన్నీ ఇవ్వగలడు. అందువల్ల ముందుగా సకలైశ్వర్యాలకు ఆలవాలమైన లక్ష్మిని సాధించాడు. అర్హత ప్రాతిపదికగా ఇవ్వాలి కాబట్టి గోపికల అర్హతను పరీక్షించేందుకే వారికి కనిపించడం లేదు.

కృపారసంబు పైజల్లెడివాడు:- “కృప” అనేది మనసు పొందే ఒకానొక భావోద్వేగస్థితి. ఇతరుల కష్టసుఖాలకు స్పందించే మానసిక స్థితి. ఇది అదుపులో ఉంటే.. అర్హత ప్రాతిపదికగా ఇవ్వవచ్చు అది సదుపయోగమవుతుంది. లేకపోతే దురుపయోగమవుతుంది. జిజ్ఞాస నిర్మలమై అంతశ్ఛేతనలోని కోరిక లేదా సంకల్పం బలోపేతమై కార్యావిష్కరణకు దారితీయాలి అంటే… భగవంతుని “కృప” కావాలి… సాధకునిలో నిశ్చలమైన చింతన ఉండి సరైన మార్గంలో సాధన సాగుతూ ఉంటే ఆ సాధకులపై కృపారసాన్ని జల్లేవాడు, కృష్ణుడు.

మౌళిపరిసర్పిత పింఛమువాఁడు:- తలపై నెమలిపింఛము ధరించినవాడు. అంటే ఎవరితో కూడా ఏ దేహ సంబంధిత అనుభూతులు, అనుభవాలు లేనివాడు అని భావము. ఎందుకు అంటే… నిర్వికార, నిరాకార తత్త్వమే పరబ్రహ్మము. కృష్ణుని ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించాలి అంటే ఆ స్థితిని సాధకుడు పొందాలి. సాధకుని నుండి భగవంతుడేమి ఆశిస్తున్నాడో ఆ స్థాయిని భగవంతుడూ ప్రదర్శించాలి. ఇక్కడ చిన్న అవగాహన కావాలి. గోపికలు దేహధారులు. వారికి తెలిసిన, వారు చూస్తున్నకృష్ణుడూ దేహధారియే… దేహధారుల మధ్య ఉండే దర్శన సమగ్రతను సంతరించుకోదు. అయినా గుర్తించాలి అంటే.. ఒక గుర్తును చూపాలి కాబట్టి నెమలిపింఛాన్ని కలిగిన వాడని చెపుతున్నారు

నవ్వురాజిల్లెడిమోమువాడు:- దరహాసాస్యం ప్రసన్నతకు, ప్రశాంతతకు చిహ్నం. కృష్ణుని ముఖం ప్రక్షణమూ చిరునవ్వులతో వెలుగుతుంది. శరీరం ఒక షోరూం అనుకుంటే.. అందులో ఉండే షోకేస్ లాంటిది ముఖం. అది చక్కగా, పద్ధతి ప్రకారం, ఆకర్శణీయంగా ఉంటే వినియోగదారుడు ఆకర్షితు డౌతాడు. కృష్ణుని ముఖం కూడా దర్శించిన ప్రతి వానికి హాయిని గూర్చుతుంది, ఆనందాన్ని పంచుతుంది. సాధారణంగా నాలుగు స్థాయిలలో ఆనందాన్ని చెప్పడం జరుగుతుంది. మొదటిది సంతోషం, రెండవది ఆనందం, మూడవది తాదాత్మ్యత నాలుగవది తన్మయత. ఈ తన్మయ స్థితినే ఉపనిషత్తులు శాశ్వతమైన బ్రహ్మానందం స్థితిగా ప్రతిపాదించాయి.

ఒకడు:- ఒకడేమిటి? అంటే “ఏకమేవ అద్వితీయం బ్రహ్మ” నిజానికి ఉన్నది ఒక్కడే… అద్వైతమే… భగవంతుడు ఒక్కడే… దృష్టిభేదం చేత అనేకంగా కనిపిస్తున్నాడు. గోపికలు ఒక్కొక్కరు ఒక్కక్క రూపంలో అతనిని భావించారు. అతడు ఒక్కడే తాను చూచిన లేదా భావించిన కృష్ణుడు మాత్రమే అనే భావనలో ఉన్నారు. అందుకే వారు ఒక్కడే అని ప్రతిపాదిస్తూ.. ఒక్కడు అంటున్నారు. ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని చూడగానే దాని ఆకృతి పట్ల ఒక చిత్రం మన మనసులో ఆవిష్కృతమౌతుంది. ఆ చిత్రం ఎదుటి వారి మనసులో ఆవిష్కృతమైన చిత్రం వలనే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇది చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక చిత్రాన్ని ఊహించుకున్నా.. దాని ప్రసక్తి రాగానే తామూహించుకున్న చిత్రానికి అనుసంధానించుకుంటారు. కాబట్టి అనేకమయినా అది ఏకమే. ఆ ఏకాన్నే ఒక్కడు అంటున్నారు గోపికలు.

చెల్వలు… చెల్వలు అంటే స్త్రీలు. స్త్రీ లో “స” కార “ర” కార “త” కారాలు “ఈ” కారంతో బంధింపబడి ఉంటాయి. సత్వరజస్తమో గుణాలను ఒకటిగా బంధించి వేసే అహంకార మమకారాదులు ఈ కారంగా తీసుకుంటే… ఈ త్రిగుణాలకు బంధీ అయిన వారంతా స్త్రీలే. “ఈం” అమ్మవారి బీజం. అదే లక్ష్మీ అంశగా చెప్పుకోవచ్చు. ఆమె కృష్ణుణ్ణి పొందే ఉంది… ఆయన పరబ్రహ్మ కనుక సత్త్వోపలబ్ధితో గోపికలు ఆ స్థానానికి ఎదగడమే మోక్షం…

మానధనంబు తెచ్చె:- గోపికల మానధనాన్ని దోచాడట. అంటే వారి వద్ద మాన ధనం ఉంది. మానము అంటే… దేహాభిమానం కావచ్చు, అహంకార మమకారాదులు కావచ్చు. మేమే సాధకులమనే ఆధిక్యతాభావన కావచ్చు. కృష్ణ సాంగత్యాన్ని పూర్తిగా తామే అనుభవించాలనే “కామము” కావచ్చు. ఇలా అన్ని విధాలయిన మానాదులచే అతి భారమయింది వారి అంతరంగం. భారమయిన దానితో ప్రయాణించడం వారికి కష్టమౌతుంది. ఆ మానాన్ని దోచుకున్నాడు, కృష్ణుడు. దానితో భారహీనులయ్యారు, గోపికలు. భారహీనత సన్నద్ధతను సూచిస్తుంది. అన్నీ పోగొట్టుకున్న గోపికలు అన్ని అర్హతా పరీక్షలలో ఉత్తీర్ణులయినట్లు గానే భావించాలి. ఉద్యోగ పరీక్షలన్నింటిలో నెగ్గి నియామక పత్రానికై ఎదురుచూచే స్థితి వారిది. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి.

ఓ మల్లియలార:- స్వఛ్చత స్వఛ్చతను ఆకర్షిస్తుంది. మల్లెలు స్వఛ్ఛతకు గుర్తు. తాము స్వఛ్ఛతను సంతరించుకున్నారు. కాబట్టే గోపికలు స్వఛ్ఛమైన మల్లెలను ఆశ్రయించారు. దేనికి ఆ మల్లియలలో ఉన్న పరమాత్మను అన్వేషించేందుకు. ఇంకా అన్వేషణ వారికి బాహిరంగానే సాగుతుంది. బాహిరాన్వేషణలో పరమాత్మ లభ్యంకాడు…

మీపొదల మాటున:- “పొద” అంటే ఆవరణం. కొన్ని జన్మల నుండి పొందిన కర్మల ఫలితాలు ముద్రల రూపంలో మనసుపై ముద్రింపబడి ఆవరణాలుగా ఏర్పడ్డాయి. ఆ ఆవరణాలు మాయగా చెప్పబడుతూ అంతశ్చేతనలోని పరమాత్మ తత్త్వాన్ని చూడనీయకుండా, గ్రహించనీయకుండా అడ్డుకుంటున్నాయి. ఆ ఆవరణాలను ఎన్ని సాధనలో దాటగలిగినా ఇంకా ఎక్కడో ఏ మూలో ఒకటో రెండో మిగిలి అంతరంగాన్ని చూడడంలో స్పష్టతనీయడం లేదు. ఏది కనిపిస్తే అక్కడ వెదుకుతున్నారు. అంతటా ఉన్న పరమాత్మను ఎక్కడా చూడలేకపోవడంతో వారిలో చిన్న సందేహం పొడసూపింది. అందుకే… పొదలనే (మాయనే) అడుగుతున్నారు…. మీ పొదల మాటున…….

లేఁడుగదమ్మ చెప్పరే:- సాధారణంగా ఎవరిని గూర్చయినా అడగవలసి వచ్చినప్పుడు, “అతనున్నారా” అని అడుగుతాము. అది అతని ఉనికి పై స్పష్టత లేకపోవడం. కాని లేడు కదా అనడం… సంశయానికి నిదర్శనం. సంశయం ఉన్నదానిని కూడా గుర్తించనీయదు. “ఛిద్యతే హృదయగ్రంధి: భిద్యంతే సర్వ సంశయా:” అజ్ఞానం నశించి మాయావరణం తొలగిపోతే జ్ఞానోదయం ఐనట్లే. “కలడు కలండనెడి వాడు కలడో లేడో” అనే ఏనుగు సందేహం ఎలాంటిదో గోపికల సందేహమూ అలాంటిదే. పోతనగారికే ఎన్నో మార్లు భగవంతుని ఉనికిపై సందేహం కలగడం, ఆ సందేహ నివృత్తిని పొందడం భాగవతంలో ఎన్నో మార్లు కనిపిస్తుంది.

బహుశా.. ఇది పోతన గారికి కలిగిన సంశయం కాకపోవచ్చు. సాధకులకు కలిగే అవకాశం ఉన్న ప్రతి సన్నివేశాన్ని గుర్తించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వాడుకున్న సందర్భాలు కావచ్చు.
చివరగా ఒక సందేహం. కృష్ణుని జాడ చెప్పమని గోపికలు ఈ చెట్లు చేమల చుట్టూ తిరగటమేమిటి? పైగా వాటిని అడగటమేమిటి? అవి ఎలా చెపుతాయి? వాటికి మాట్లాడే శక్తి ఉన్నదా? అంటే ఉన్నది అనే చెప్పాలి. ” ఓషధయః సంవదన్తే” అనేది వేదము.
అంతేకాదు… సకల సృష్టీ భగవత్కల్పితమే కదా… అన్నింటిలో ఉండేది భగవంతుడే కదా… ఆయన అంశలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి చెట్లు చేమలలో కూడా భగవదంశను గుర్తించి దానితో గోపికలు ముచ్చటిస్తున్నారు. మరొక అంశం… మాట్లాడే భాష… మౌనం పలికించినన్ని భావాలను శబ్దాలు పలికించలేవు. భగవంతుని భాష మౌనమే… ఆమౌనంలోనే ఎన్నో ప్రశ్నలు ఎన్నో జవాబులు.

You may also like

Leave a Comment