సాయంత్రం కావొస్తుంది. గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వానా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు. ఆ వెలుగు పడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది.
అదే పాత రిజ్వానా అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది. కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు. ఆమె, ఆమెనే కాదసలు. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. నిత్యం ఆత్మవిశ్వాసం తొణకిసలాడే ఆమె కళ్ళల్లో ఇప్పుడు శూన్యం నిండుకుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటూ దిక్కు తోచడం లేదు. తననే నమ్ముకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి. అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడంలేదు. సరిగ్గా ఊపిరైనా పోసుకోని ఆ నలుసును తలచుకుంటే రిజ్వానాకు ఊపిరాడ్డం లేదు. తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది.
కానీ స్నేహితులు ‘రానివాడి రూపెందుకు? అబార్షన్ చేయించుకో’ అని సలహాలిస్తున్నారు. బంధువులైతే ‘నీచమైన పని చేసావ్’ అంటూ చీదరించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది. తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు. ఇది ఆడవాళ్ళ బలమో బలహీనతో ఇదమిత్థంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి.
“లేదు నా రియాజ్ నా కోసం కచ్చితంగా వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. తండ్రి కాబోతున్నాడని తెలిస్తే కచ్చితంగా వస్తాడు. మళ్లీ పాత రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు” అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వానా. అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది.
“రియాజ్ రాకపోతే… ఎప్పటికీ రాకపోతే. ఈ బిడ్డ పరిస్థితి ఏంటీ? తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా” భవిష్యత్తును తలచుకుంటే తల తిరిగిపోతుంది.
“ఏది నీ బడీ బేటీ… నీ ప్యారీ బిడ్డా. ఎటు పోయింది. వాడెవడితోనే ప్రేమా ప్రేమా అంటూ తిరిగింది. వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్ళి చేసుకుంది. చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు. ఊళ్ళో నా పరువు తీసింది” బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు.
అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది. తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు. ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది.
“పైసా సంపాదించవు. ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు. నీకెక్కడిదిరా పరువు. నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా” అని భర్తను నిలదీయాలని వుంది ఆమెకూ. కానీ ఆ పని చేయలేదు.
పెండ్లయిన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నో సార్లు చెప్పుకుంది. అతన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తాగుబోతోడు ఎవరి మాట వింటాడు. పైగా మూర్ఖుడు. అందుకే వాళ్ళూ చేతులు దులుపుకున్నారు.
“మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. మేమేం చేయగలం. నిన్ను కన్నాము గానీ నీ తలరాతను కనలేముగా. చావైనా బతుకైనా అతనితోనే” పుట్టింటికి వచ్చిన ప్రతిసారీ తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు.
ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి. దెబ్బలకు అలవాటు పడిన ఆమె శరీరం పుట్టింటి సంగతే మరచింది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లయింది. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. అబ్బాయిని కనలేదని హింసించేవాడు. అయితే పెద్ద కూతురు రిజ్వానా కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది. “అమ్మీ… అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి?” అడిగేది రిజ్వానా.
“చావైనా బతుకైనా మొగుడితోనే” అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది. అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో, కోప్పడాలో అర్థమయ్యేది కాదు.
తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది. ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తుంది. ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది. ఎవరి మాటనూ లెక్క చేయని తండ్రి ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు. కానీ ఆడపిల్ల గడపదాటి బయటకు వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైసా సంపాదించడు. పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు. కూతురు ఎదురైతే కొరకొరమని చూస్తాడు. ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు.
అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దీనంతటికీ కారణం రియాజ్. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వాన కలలో కూడా అనుకోలేదు. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు.
సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే రియాజ్ ను చూసింది. తొలి చూపులోనే బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది. అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. రియాజ్ కూడా అందంలో తక్కువేం కాదు. ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాని పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది.
మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు ఇల్లూ, చెల్లెలు, తల్లీ బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. ఇద్దరం పెండ్లి చేసుకుందామన్నాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు హాయిగా గడిపేశారు.
వీరి ప్రేమ గురించి చుట్టు పక్కల అందరికీ తెలిసిపోయింది. దాంతో రిజ్వానా పెండ్లి చేసుకుందామని తొందరపెట్టింది. రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. పైగా ఆ పెండ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు. భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
పోలీసులు రియాజ్ ను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు.
పెండ్లి తర్వాత రిజ్వానా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. అక్కడ తల్లి, చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. ‘నా సుఖం నేను చూసుకొని వచ్చేశాను. అమ్మా, చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో’ అని ఆవేదన చెందింది. వాళ్ళ కోసం రిజ్వానా మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్ కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రియాజ్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది. వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుక్కు లేనిపోనివి చెప్పారు.
‘ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్ళి చేస్తాం’ అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, పెండ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులు ఏం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు.
రియాజ్ వెళ్ళిన కొద్ది రోజులకే తను తల్లికాబోతుందని తెలిసింది. ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది.
కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ‘ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మావాడిని వదిలి వెళ్ళమనండీ’ పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాజ్ తండ్రి జవాబు ఇది.
‘నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను’ అంది. ఆమె కన్నీళ్ళకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్తమామల కాళ్ళు పట్టుకుంది. అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు. చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది.
‘మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా. అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే లెక్కచేసేది కాదు. ఇప్పుడేమయింది? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి’ అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పే వారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే.
“మీ అమ్మాయికి ఎంత ధైర్యం. కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ. ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు. నిజంగా నూ అదృష్ట వంతురాలివి” అని రిజ్వానా తల్లితో తెగ చెప్పే వారు. ఇప్పుడేమో ఇలా నోటి కొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.
ఇప్పుడు కూతురికి మూడో నెల. తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా ఢీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు. నలుగురూ అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓ సారి ఆ ప్రయత్నం కూడా చేసింది. తల్లి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడితే మనసు మార్చుకుంది. ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూరొచ్చి ఆలోచిస్తూనే ఉంటుంది.
“దీదీ… అబ్బా అమ్మీని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. నూ ఒకసారి బయటకు వచ్చి నాన్నను ఆపు” రిజ్వానా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమలాడింది. .
“ఇప్పుడు నాన్న నా మాట వింటాడా. నేను చేసిన తప్పు అలాంటిది. నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది.
ఓపికున్నంత సేపూ రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లో జీవం లేదు. ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేది. రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది. ఇంట్లో అందరి కన్నా పెద్ద పిల్ల అయినా చిన్న పిల్లలా సరదాగా ఉండేది.
“ఇక ఈ బతుకు బతకడం అనవసరమా? చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారం” అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా. మెల్లగా లేచి తన గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తల్లిని చివరి చూపు చూసుకుందామని వెదికింది. వంటగది బయట తలుపుకు ఆనుకుని నిద్రపోతుంది. భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాగే నిద్రపోతోంది. పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు. వాళ్ళను ఆ స్థితిలో చూసి రిజ్వానా దుఖం ఆగలేదు.
‘వీళ్ళను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?’ అని ఒక్క క్షణం ఆలోచించింది. మళ్ళీ వెళ్ళి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.
కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్య కిరణాల వేడిమి భరించలేక కండ్లు తెరిచింది. మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది.
“మామీ… మామీ… రిజ్వానా ఏదీ? ఎక్కడుంది..?” అంటూ కంగారుగా అడిగింది.
ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె “ఏమైంది మున్నీ.. ఎందుకంత కంగారుగా ఉన్నావు. అసలేం జరిగింది. నాకు చెప్పు” అంది.
“లేదు మామీ…. రిజ్వానాకే చెప్తా… గదిలోనే ఉందా…” అంటూ అటువైపుగా పరిగెత్తింది. లోపల నుండి మున్నీ మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకు వచ్చింది.
“ఏంటి మున్నీ… రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా. తను నిన్ను కలిశాడా. నా గురించి తనకు చెప్పావా. నా కోసం వస్తానన్నాడా..?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.
“రియాజ్ పై ఎంత ప్రేమ ఈమెకు. అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో? కానీ చెప్పకపోతే ఎలా… చెప్పాల్సిందే. లేకపోతే ఇలా భ్రమల్లోనే బతికేస్తుంది” అని ధైర్యం తెచ్చుకుంది.
“లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు. కానీ రియాజ్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మానాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్ళి చేసి సైలెంట్ గా ఇక్కడకు తీసుకొచ్చారు. పెళ్ళి జరిగి కూడా పది రోజులయ్యిందంట” అని చెప్పింది.
ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయట తల్లి తల్లడిల్లిపోయింది. దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. రిజ్వానా కుక్కిమంచంలో పడి ఏడుస్తూనే ఉంది. “ఏమీ చేసుకోనని నాకు మాట ఇవ్వు రిజ్వానా” అంటూ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను మళ్ళీ వస్తా” అని మున్నీ వెళ్ళిపోయింది.
రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది. ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు. రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి పది దాటింది. తల్లి ఎంత బతిమలాడినా మెతుకు ముట్టుకోలేదు.
“అమ్మీ… కొద్ది సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్, ఊరికూరికే తినమని విసిగించకు. నేనేమీ చేసుకోనులే, నువ్వెళ్ళి తినుపో” అంది చిరాగ్గా.
కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుటపడుతుందిలే అని తల్లి వచ్చేసింది. ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్ళు తాగి అలా నడుం వాల్చింది. బాగా అలసిపోయింది వుంది. అయినా నిద్ర పట్టడం లేదు. రాత్రి పన్నెండు అయ్యింది.
రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్టు వినిపించి అటువైపు వెళ్ళింది. ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యానుకు కడుతుంది రిజ్వానా. అది చూసి తల్లి గుండెలు బాదుకుంది.
“అంత పని చేయకే తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి” అంటూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుంది. ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
“అమ్మీ… అసలు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా వల్ల కావడం లేదు. అందర్నీ ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఎవరికీ సుఖం లేకుండా పోయింది. ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురు చూశా. ఇక
రాడని అర్థమయింది. ఇక నేనెందుకు బతకాలి. ఈ బిడ్డను ఎలా బతికించాలి. నన్ను చావనీ అమ్మీ” అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది.
“నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి. నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా? నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళు ఉన్నారు. మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి. చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చద్దాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ఏడుపు విని నిద్ర పోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి అర్థమై అమ్మనూ, అక్కనూ చుట్టుకొని వాళ్ళూ ఏడుపు మొదలుపెట్టారు.
అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, రిజ్వానా కండ్లు తెరిచే సరికి ఎదురుగా స్వాతి. “స్వాతీ నువ్వేనా… ఎప్పుడు వచ్చావు. నువ్విక
రావేమో అనుకున్నాను. కోపంతో నా మొఖమే చూడవనుకున్నాను” అంటూ తలదించుకుంది.
“ఏంటే నువ్వు చేసిన పని. ఇదేనా రిజ్వానా అంటే. నా స్నేహితురాలు ఎలా ఉండేది. ఏంటిది? పిరికి దానిలా చావాలనుకుంటావా?” అంటూ కోప్పడింది.
“అమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పినట్టుంది” అంది.
“అవును చెప్పింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నేను వున్నాననుకున్నావా లేదా? ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు” అంది మళ్ళీ కాస్త కోపంగా.
“ఎలా చెప్పమంటావే? అప్పుడు అంటే, నువ్వు ఎంత చెప్పారు. ఇంకా చదువుకో, ఇప్పుడే పెళ్ళి ఎందుకని. అంటీ అయితే మరీ మరీ బతిమలాడారు.
కానీ నేను మీ మాట వినలేదు. చివరకు అంకుల్ కూడా చెప్పారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది? అందుకే రాలేదు” సంజాయిషీగా చెబుతూ తలదించుకుంది.
“నీ మొహం. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా. అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది.
కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది. అమ్మ డిపార్ట్ మెంట్ హెడ్ కదా.. కంపల్సరీగా ఉ ండాలి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను నాతో మాటు మా ఇంటికి తీసుకురమ్మంది. నాన్న కూడా ఇదే చెప్పారు.” అంది. “అవునా… అంటీ నా గురించి అడిగారా? నిజమేనా..?” అంటూ అత్రంగా అడిగింది రిజ్వానా. “నేను నీకు అబద్దం చెప్తానా” “లేదు, నువ్వెప్పుడూ అబద్దం చెప్పవు. అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
“ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు? వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా? మేమంతా ఏంటి మరి?” కోప్పడింది స్వాతి.
“ఏడ్వక ఏం చేయమంటావే. తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఎలా పెంచాలి? తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా?”.
“ఎవర్నే ఎదుర్కోవలసింది. ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు. సూటి పోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు. అయినా మోసపోవడం కాదే తప్పు. మోసగించిన ఆ వెధవది. అటువంటి దరిద్రులదే తప్పంతా. ఇప్పుడు రోజులు మారిపోయాయే. ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి తల్లులు ఎందరో ధైర్యంగా, ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు. చివరకు పాస్పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళుతున్నారు. సర్టిఫికేట్లో తల్లి పేరు కోసం పోరాటం చేసి గెలిచిన
వారు ఎందరో ఉన్నారు. నీ బిడ్డకు తండ్రి లేడు. అయితే ఏం. తల్లి వుంది. తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది. అది నువ్వే. ధైర్యంగా ఉండు. మేమంతా నీ ప్రతి కష్టంలో ఉన్నామని మరిచిపోకు”.
విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది. అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు. తిరిగి ఇలా అడిగింది.
“నన్ను ఈ సమాజం బతకనిస్తుందా? అంతెందుకు మా నాన్నే నన్ను నీచంగా చూస్తున్నాడు”
“నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు. ప్రేమించడం తప్పెలా అవుతుందే. అవతలి వాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు
అంగీకరించు. మళ్లీ నువు కోరుకున్న రోజులు నీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం మొదలుపెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు”.
“నువ్వు చెప్పేది నిజమే కానీ..” అంటూ ఏదో అనబోయింది రిజ్వానా. “చూడవే.. అనవసరంగా ఏదేదో అలోచించి మైండ్ పాడుచేసుకోకు. ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. హాయిగా బతుకు” అంది స్వాతి.
“నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా, అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమే. నువ్విచ్చిన ధైర్యమే. ప్రేమ పిచ్చిలో పడి నిన్నూ, నా ధైర్యాన్ని ఇన్ని రోజులూ పోగొట్టుకున్నాను.
యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ, సమస్యలంటూ పోరాడుతున్నావు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు. నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఏం చేశాను? మీ మాటలు పట్టించుకోలేదు. నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్నే తలకిందులు చేసేసింది.” మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది.
“నీకెన్ని సార్లు చెప్పాలి. పాత విషయాలు గుర్తు చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ముందు ఆ ఏడుపు మానుకో. నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని. అంతేకాదు. లోపల రూపుదిద్దుకుంటున్న బిడ్డకు అస్సలు మంచిది కాదు” అంది స్వాతి.
“అవును. నీకు ఏడిస్తే నచ్చదు. ఇక ఏడ్వనులే. నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలుపెడతా. నువ్వు నా తోడుంటే చాలు. ఈ ప్రపంచాన్నైనా జయిస్తా. నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా. మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఉ ద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను. అమ్మను, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. అంతే కాదు నీలా, అంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా. నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా” గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వానా.
“అద్దీ లెక్క! స్వాతీ ఫ్రెండంటే ఆశామాషీగా ఉంటుందా ఏమి? నాకు తెలుసు. నువ్వు తలచుకుంటే సాధించగలవు. నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేనూ. అమ్మా సిద్ధంగా ఉన్నాము” అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది.
“అంటీ, దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళతాను. వాతావరణం కాస్త మారితే మనసు కాస్త కుదటపడుతుంది” “సరే స్వాతమ్మా… ఆ పని చెయ్యి. కొన్ని రోజులు నీతోనే ఉంచుకో” అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా
“అంతా ఓకేనే… మరి ఆ రియాజ్ ను అలా వదిలేయాల్సిందేనా” అంది రిజ్వానా. “అలా ఎలా వదిలేస్తాం. వాడి సంగతి నాన్న చూసుకుంటారు”.
“అవును స్వాతి. నిజమే… అంకుల్ లాయర్ కదా, ఆ సంగతే మర్చిపోయా. ఇలాంటి వాళ్ళకు కచ్చితంగా శిక్ష పడాలి. ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు. మళ్ళీ పెండ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు. చట్టాలంటే అసలు భయం లేకుండా పోయింది. ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ళ ధీమా. వీడికి అంకులే సరైన మందు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే. నువ్వొచ్చి నాకు కొత్త ఊపిరి పోశావు” అంటూ నవ్వుతూ స్వాతి మెడచుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వానా.