కథలు
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ద్వీతీయ బహుమతి పొందిన కథ (రూ.5,000)
‘‘ఏంటి చిన్నీ! అన్నం తినిపిస్తుంటే తినడానికి కూడా నీకు బద్దకంగా ఉందా? అక్కడ అమెరికాలో మీ అమ్మ ఎంతో కష్టపడి చదువుకుంటున్నది. ఇక్కడ నువ్విలా సరిగ్గా తినకుండా చిక్కిపోతే రేపొద్దున నన్ను అనరా.. నువ్వెంత అల్లరిచేసినా, బడికి వెళ్ళకపోయినా సహిస్తాను. కానీ అన్నం తినకపోతే మాత్రం ఊరుకోను’’ చిన్ని రెండు చెంపలపై అటొక దెబ్బ ఇటొక దెబ్బా విసురుగా వేసింది స్వప్న.
నోట్లో ముద్దతో, ఏడుపుతో పొలమారిన చిన్ని… చెంపలు రుద్దుకుంటూ ఏడవసాగింది. కోడలిని, చిన్నీని బిత్తరపోయి చూడసాగింది దాక్షాయణి.
‘‘తింటావా తినవా? నీకసలు భయంలేకుండా పోతున్నది. ‘‘ అన్నం ప్లేట్ ముందు పెట్టి చిన్ని చెంపల మీద వాయిస్తోంది స్వప్న. ఇక ఆగలేక ఒక్క ఉదుటున వెళ్ళి
‘‘అదేంటమ్మా స్వప్నా.. అట్లా కొడుతున్నావు పసిపిల్ల బెదిరిపోతున్నది’’
‘‘అత్తయ్యా! మీరు అడ్డు రావద్దని చెప్పానా! నేనేమన్నా అల్లరి చేస్తే కొడుతున్నానా, బడికెళ్ళకపోతే కొడుతున్నానా.. దేనికైనా ఊరుకుంటాను కానీ, అన్నం తినకపోతే మాత్రం ఊరుకోను. దామిని ఒదిన చిన్ని బాధ్యత మనకప్పగించి వెళ్ళింది. తనను చూసుకునే బాధ్యత మీకే కాదు నాకు ఉంది. చిన్నీ తింటావా.. తినవా..?’’ ఆమె స్వరంలో తీవ్రత హెచ్చింది. చిన్ని వెక్కిళ్లు పడుతూ ఏడుస్తూ ముద్ద మింగలేకపోతున్నది.
‘‘తిను, ముందు తిను’’ చిన్ని చెంపల మీద మరోసారి వాయించింది. చాలా తెలివిగా నిర్భీతిగా కోడలు స్వప్న తన దాష్టికాన్ని ప్రదర్శిస్తుంటే దాక్షాయిని విస్తుపోతున్నది.
పిల్లలను ఇట్లా కూడా కొడతారా? ఇంటికి పెద్దయిన తన కళ్ళముందరే పసిపిల్లను పట్టుకుని అన్నం తినడం లేదని తిరుగులేని వంకతో.. ఎంత నిర్భయంగా.. ఎంతో తెగింపుతో కొడుతూ ఇంత బాగా సమర్థించుకుంటున్న కోడలిని ఎలా అడ్డుకోవాలి? దాక్షాయిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎనిమిదేళ్ళ, సత్యా, పదేళ్ళ సాగర్ దూరంగా నిల్చుని ఒకసారి తల్లికేసి.. మరోసారి గదిలోని చిన్నికేసి భయంభయంగా చూస్తున్నారు.
ఇక ఆగలేక ‘‘సరేలేమ్మా. కాసేపయ్యాక తింటుందేమో’’ మనవరాలిని దగ్గరికి తీసుకున్నది.
‘‘అదే మీతో వచ్చిన చిక్కు. వదినకేమో పెళ్లయి ఏడేళ్ళ కూతురున్నా ఇంకా చదువుకోవాలని ఆశ. పాపను ఎంతో నమ్మకంతో మనకప్పగించినప్పుడు మనం సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? రేపొద్దున ఈ పిల్ల చిక్కిపోతే ‘ఏంటి వదినా.. నిన్ను నమ్మి మీకు చిన్ని బాధ్యత అప్పచెప్పాను. నా పిల్లని ఇలానేనా పెంచేది అంటే నేనేమని చెప్పాలి?’ అంటూ గట్టిగా వదురుతున్నది స్వప్న. తలవంచుకొని చిన్ని చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లింది దాక్షాయని. చిన్ని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నది. తనకు తెలియకుండానే దాక్షాయిని కూడా ఏడవసాగింది. స్వప్న బిరబిర గదిలోకి వచ్చి..
‘‘ఏంటత్తయ్య గారు! నేనేదో చేయారాని ఘోరం చేసినట్టు అట్లా బాధపడుతున్నారు. నా కూతురునైతే తినకపోతే ఊరుకుంటానా? నాకు సత్యా, సాగర్ ఎంతో చిన్నీ కూడా అంతే. వాళ్ళు సరిగ్గా తినకపోతే ఎట్లా ఒక దెబ్బవేస్తానో చిన్నిని కూడా అలాగే దెబ్బ వేసాను. ఏం అట్లా ఓ దెబ్బ వేసే హక్కు కూడా నాకు లేదా చెప్పండి?’’ ఎగిసిపడుతూ అడుగుతున్నది స్వప్న. ఏమి సమాధానం ఇవ్వగలదామె?
ఇంతలో కొడుకు హరీష్ వచ్చాడు.. వస్తూనే ‘‘చిన్ని ఏది?’’ అడిగాడు. ‘‘ఇప్పుడే పడుకుందిరా’’ కంగారును దాచుకుంటూ చెప్పింది.
అప్పుడే దామిని వీడియో కాల్ చేసింది. తండ్రికీ దామినికీ ఏమీ చెప్పొద్దని నానమ్మ చేసిన సైగను అర్థం చేసుకున్న పిల్లలిద్దరు. ‘‘చిన్ని ఇప్పుడే పడుకుంది’’ అని చెప్పారు.
కాస్సేపు అన్నతో సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది దామిని. తేలికగా ఊపిరి పీల్చుకున్నది దాక్షాయణి. ఈ మధ్య ఇలాగే తరుచూ దేనికో దానికి స్వప్న చిన్నిని ఓ దెబ్బ వేయడం అదే సమయానికి దామిని వీడియో కాల్ చేయడం.. చిన్ని బయట ఆడుకుంటున్నదనో, పడుకున్నదనో, స్నానం చేస్తున్నదనో తాను అబద్దాలు చెప్పడం కొడుకు పిల్లలిద్దరూ గమనిస్తూనే ఉన్నారు. స్వప్న ఇంకా ఏమి దాడిచేస్తుందో అని పిల్లలూ, దాక్షాయణి అయిష్టంగానే అన్నం తిన్నామనిపించారు.
ఏడ్చిఏడ్చి చిన్ని గదిలో అలసిపోయి పడుకుంది. మధ్యమధ్య నిద్రలోనే బెక్కుతున్నది. చిన్ని నుదుటి మీద పడిన జుత్తును సవరిస్తూ.. ఎంత అమాయకపు అందం. అందమైన గులాబీల గుచ్చం ఏదో పక్క మీద పెట్టినట్టుగా నవకంపు పసిసొగసు అనుకున్నది. అవును చిన్ని అందం, అమాయకపు మోము, తెలివర్ణం.. బహుశా ఇవి కూడా స్వప్నలోని అక్కస్సుకు కారణమేమో. ఆ పసి బుగ్గలపై స్వప్న అరచేతి గుర్తులు ఎర్రగా కమిలి కనిపిస్తున్నాయి.
చిన్నపిల్లలను అంతా నిర్ధాక్షిణ్యంగా కొట్టడం ఒకరకంగా మానసికమైన జబ్బేమో, కారణాలేమయినా కానీ, దాన్ని చూస్తూ భరించటం మాత్రం పెద్ద నరకం. అభం శుభం తెలియని పిల్లలు తమనెందుకు హింసిస్తున్నారో అర్థంకాని ఈ భయం, ఈ ఉలికిపాటు జీవితాంతం వారిని వెంటాడుతాయేమో. నిద్రలో చిన్ని ఉలికులికిపడుతూనే ఉన్నది. ఇంకా వెక్కిళ్లు పడుతూనే ఉన్నది. కందిపోయిన చిన్ని చెంపలు చూస్తుంటే దాక్షాయినికి దుఃఖం ముంచుకొస్తున్నది
ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని స్వప్నని గట్టిగా నిలదీయలేదు. నిలదీస్తే బ్రతకగలదా? ఏమీ అనకముందే రాద్ధాంతం చేయగల సమర్థురాలు ఆమె. ఇక ఏమన్నా అంటే ఆగుతుందా? నిద్రపోవడానికి ప్రయత్నించిందామె.
* * *
తను చిన్నిని కొట్టగానే పెద్దగొడవ చేసి తనను ఘోరంగా నిలదీస్తుందేమో, కొడుకుకో, దామినికో చెప్పేస్తుందేమో ఆ వంకన ఒక పెద్ద గొడవ పెట్టుకుందామని ఎదురుచూస్తున్న స్వప్నకు దాక్షాయిని ఏమి మాట్లాడకుండా గదిలోకి వెళ్లి పాపని నిద్రపుచ్చడం చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇలా ఆశ్చర్యపోవడం స్వప్నకి కొత్త కాదు. తన పెళ్లికి ముందు దాక్షాయిని కుటుంబంతో అనుబంధం ఏర్పడిన దగ్గర్నుంచి ఎన్నో విషయాలకు ఆశ్చర్యపోతూనే వుంది. ఆ కుటుంబంలో వాళ్ళ అనుబంధాలకి, వాళ్ళ మాట తీరుకి, మరీ ముఖ్యంగా వాళ్ళ ఖర్చుల ధోరణికి, వారి అప్యాయతలకి, అప్పుడూ ఇప్పుడూ కూడా ఆశ్చర్యపోతూనే ఉంటుంది. వీళ్ళు తిండి తిని బ్రతుకుతారా లేక ఈ మాటలు ఈ బంధాలతోనే బ్రతుకుతారా అని ఆశ్చర్యపోతూనే ఉంటుంది.
దిగువ మధ్యతరగతిస్థాయి ఇంట్లోనుంచి వచ్చిన అమ్మాయి స్వప్న. ఒక కంప్యూటర్ కోర్సేదో నేర్చుకుంటున్నప్పుడు జీవితంలో ఇంకా స్థిరపడని హరీష్ తో ప్రేమలో పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఒంటరి తల్లి దాక్షాయణి, ఒక చిన్న ప్రైవేటు ఉద్యోస్తుని కూతురైన స్వప్నని కోడలిగా అంగీకరిస్తుందని అనుకోలేదు. అంగీకరించకపోతే వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకునయినా సరే హరీష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నది.
కాని చిత్రంగా తన కుటుంబ విషయాలు, తనని చూసి మనసులో ఏమనుకున్నా కొడుకు కోరిక తీర్చడమే తన ధర్మం అనుకొని పెళ్లికి ఒప్పుకున్నట్టున్నది. తాము పెళ్ళి చాలా నిరాడంబరంగా మాత్రమే చేసినా.. ఒక్క చిన్న విమర్శ కూడా చేయకుండా తాము చేసిన లోటుపాట్లను సంయమనంతో భరించి తనని ఇంటి కోడలుగా ఆహ్వానించింది. ఎందుకో ఆ మంచితనాన్ని భరించలేకపోయింది స్వప్న.
‘అమ్మా అన్నం పెట్టవే, నా బ్యాగ్ ఎక్కడ పెట్టావే? ఇలా తన తల్లిని పిలవడం అలవాటైనా స్వప్నకీ, వాళ్ళ అన్నయ్యకీ… దామిని, హరీష్ ఇద్దరూ… అమ్మా మీరిలా కూర్చోండి, అమ్మా బయటకు వెళ్తున్నాను మీకేమైనా తేవాలా?’ అని పరాయి వారితో మాట్లాడినట్టు మాట్లాడే మన్నింపు మాటలు విని ఆశ్చర్యపోయింది. దాక్షాయిని వంట చేస్తుంటే హరీష్ అమ్మకు అన్ని పనుల్లో సాయం చేయడం చూసి ఆశ్చర్యపోయింది. పరీక్షలు ముగించుకొని ఎలాగో కాసేపట్లో ఇంటికి వచ్చే దామిని కోసం ఇంటిల్లిపాది రైల్వే స్టేషన్ కి వెళ్ళటమే పెద్ద ఆశ్చర్యం అనుకుంటే.. తన ఇంటికి తను వస్తూ తల్లికి, అన్నకూ పూలగుత్తులు, బోలెడన్ని పుస్తకాలు తేవడం చూసి అవి కూటికొచ్చేనా, గుడ్డకొచ్చేనా అని ఆశ్చర్యపోయింది. అదేదో అపురూప సంపద తీసుకొచ్చినట్టు ఆ పూలను టేబుల్ మీద వాజ్ లో పెట్టి ఓ ఇరవైరోజులపాటు దాక్షాయణి, హరీష్ మురిసిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఉదయానే లేవగానే గుడ్ మార్నింగ్ లు, పడుకునేటప్పుడు గుడ్ నైట్ లూ చెప్పుకోవడం, లేచిన దగ్గరనుండీ కన్నమ్మలూ, బంగారు తల్లీ అంటూ, అత్తా, భర్తా దామినిని గారాబం చేస్తుంటే, తన ఇంట తనకు అందని ప్రేమ ఇక్కడ దామినికి దక్కడం భరించలేకపోయేది.
‘అమ్మా నువ్వు చదువుకోమ్మా నేను చేస్తాను కదా!’ అంటూ దామిని తల్లి చేతిలో పని అందుకోవడం, ‘అన్నయ్యా ముందు నువ్వు తిను, అమ్మా ఇదిగో నీకు ఇష్టం కదా’ లాంటి మాటలు వింటుంటే వెంటనే తన ఇల్లు గుర్తుకొచ్చేది. పనులు చేయలేదంటూ ఈసడించుకొని తిట్టే తల్లి, పనులు తప్పించుకోవాలని చూస్తూ తల్లి మీద చెల్లెలి మీద తాను గట్టిగా విసుక్కోవడం, అన్నిటికీ పోటీపడి అన్నతో కొట్లాడడం, తన ఇల్లంతా అరుపులతో, కేకలతో విసుగులతో ఎట్లా ఉండేదో గుర్తుకొచ్చి.. వీళ్ళ ప్రేమలు, మాటలు చాలా నాటకీయంగా అనిపించేవి. దామిని విద్యలో సాధించిన ప్రగతికి అబ్బురపడడం, ఆమె పొందిన చిన్న ఉద్యోగానికే పొంగిపోవడం, దామిని గర్భవతయినప్పుడు ఆమెనో రాజకుమారిలా అపురూపంగా చూసుకుంటూ మురిసిపోవడం… ఇవ్వన్నీ స్వప్నకి ఎప్పుడూ కంటగింపుగానే ఉండేది.
ఒకళ్ళకోసం ఒకరు ఎదురుచూడటం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, ఒకరికొకరు చిన్నచిన్న బహుమతులు ఇచ్చుకోవడం, దానికి ఎంతో మురిసిపోవడం, గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం.. ఈ అమితమైన ప్రేమలు, బాధ్యతలు ఇదంతా ఆనందాన్ని కలగజేసే బదులు స్వప్నలో అక్కసు బయలుదేరింది. స్వప్నతోనూ అంతే ప్రేమగా వున్నా పైకి నవ్వేది కానీ, లోపల వారిపట్ల ఏదో అపనమ్మకం, అశాంతీ ఆమెను వెంటాడేవి. తన ఇంట్లో తను ఎప్పుడు అలాంటి సున్నితమైన ప్రేమలను ఆమె పొందలేదన్న విషయం మనసుకు ముల్లులా గుచ్చుకుంటుండేది. పోనీలే వీళ్ళయినా అలా ప్రేమను పంచుకుంటున్నారు, పంచుతున్నారని అని మురిసిపోవటం,తాను వాళ్ళతో కలిసిపోవడం ఆమెకు ఒంటబట్టలేదు.
ఇక వాళ్ళ పూలగుత్తుల పిచ్చి చూస్తే వొళ్ళు మండిపోతుంటుంది స్వప్నకి. ఈ సంబంధం కుదిరాక తనను చూడాడానికి దామిని, వాళ్ళాయినా వచ్చారు.. వస్తూవస్తూ ఎంతో అందమైన పూలబొకే తేవడంతో.. ఎంతో ఆశ్చర్యపోయింది. ‘ఆ అయిదొందలు పెట్టి మరికొన్ని స్వీట్లో, పళ్ళో తెస్తే బాగుండేది కదా!’ అనుకున్నది.
ఇంటికి ఎప్పుడు పూలగుత్తులు తెచ్చినా ఆ ఖరీదులో నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకోవచ్చనో, వ•డు డజన్ల గుడ్లు వచ్చేవి కదా.. అనో అన్పించేది. పైకి మాత్రం వెర్రినవ్వు నవ్వేది.
హరీష్ ది, దామిని వాళ్ళాయనవి అంతంత మాత్రపు చిన్న ఉద్యోగాలు. ఈ పస్థితుల్లో తానేదో సంపాదించేస్తాను, రెండు కుటుంబాలను నిలబెట్టేస్తాను అంటూ దామిని… చిన్నిని తమ మీద వదిలి అలా విదేశాలకు వెళ్ళడం స్వప్న ఇంకా జీర్ణించుకోలేని వాస్తవం. ఆ కోపమంతా చిన్ని మీదకు మళ్ళడం ఎంత విచక్షణా రహితమో అన్న ఆలోచన కూడా ఆమెకు కలగడంలేదు.్య్య్య
నిద్దట్లో ఉన్న చిన్నిని దగ్గరికి తీసుకుంది దాక్షాయణి ‘‘చిన్నితల్లీ! నిన్నెలా కాపాడుకోవాలి? అసలు మీ అమ్మకి ఎందుకంత ధైర్యం? నిన్నొదిలి ఎలా వెళ్ళగలిగింది? ఎలా ఏంటి.. నేనున్నానని కదా ధైర్యం! తన అన్నా వదినలే దగ్గరే కదా వదిలింది. ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని మేము నిలబెట్టుకోగలుగుతున్నామా? ఇది ఎంత అన్యాయం? ఒక ఆడపిల్ల పెళ్లి తర్వాత తన చదువు కొనసాగించుకోవాలనుకోవటం నేరమా? నేరమా అంటే నేరం కాదు. కానీ స్వప్నకు ఇది అదనపు ఆర్థికంగా కాకున్నా పనిభారమే. నిజానికి ఏ బాధ్యత అయినా ఇష్టంగా స్వీకరిస్తే అది భారం కాదు.
స్వప్న మీద కోపంగా వున్నా చెప్పలేని జాలి కూడా ఉన్నది దాక్షాయణికి.. ఒక మధ్యతరగతి అమ్మాయి, జీవితంలోని ప్రతీదీ డబ్బుతోనే కొలుచుకుంటుంది. తీసుకున్న సౌకర్యవంతమైన ఇంటి ఈఎమ్ఐ కట్టాలి, పిల్లలను మంచి స్కూల్ లో చేర్చారు. బోలెడు ఫీజులు చెల్లించాలి. నెలంతా రకరకాల ఖర్చులుంటాయి. తన పెన్షన్ వాళ్ళకు కాస్త ఆసరా. లేకపోతే ఇంకా ఇబ్బందిపడేవారు. ఈ పరిస్థితిలో దామిని ఇంత ఖర్చుపెట్టుకుని విదేశాలకు వెళ్తే అది తన కుటుంబానికేం లాభం అన్న ఆలోచన స్వప్నది. పుస్తకాలు జీవితాన్ని ఎంత సేదతీరుస్తాయో, పూవులు మన రోజును ఎంత ఆహ్లాదపరుస్తాయో స్వప్నకు అర్థంకాదని మొదట్లోనే గ్రహించింది దాక్షాయణి.
ఈమధ్య తరుచూ చిన్నచిన్న కారణాలకే చిన్నిని ఒక దెబ్బ వేస్తూనే వున్నది. అదే సమయానికి దామిని వీడియో కాల్ చేస్తుంటే.. తాను ఏడుస్తున్న చిన్నీకి సైగ చేసి పక్కగదికి పంపి.. హరీష్ తో బయటకు వెళ్ళిందనో పడుకున్నదనో.. బయట ఎక్కడో ఆడుకుంటున్నదనో అబద్దాలు చెప్పవలసి వస్తున్నది. ్య్య్య
ఆ రోజు సాయంత్రం దాక్షాయణి గుడికి వెళ్ళింది. స్వప్న టైలర్ దగ్గరకు వెళ్ళింది. దామిని ఫోన్ వీడియో కాల్ చేయగానే పిల్లలు సత్యా, సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇన్నాళ్ళూ వాళ్ళ మనసులో ఏముందో ‘‘అత్తా! చిన్ని అన్నం తినడం లేదని మొన్న అమ్మ బాగా కొట్టింది, చిన్నీ, నానమ్మ బాగా ఏడ్చారు’’ అని చెప్పేశారు.. విస్తుపోయింది దామిని.
‘‘ఇకనుంచీ సరిగ్గా తింటానమ్మా. అత్తకు కోపం తెప్పించనమ్మా..’’ అమాయకంగా చెప్పింది చిన్ని. చిన్నిదగ్గరకు పరుగెత్తుకెళ్లాలనిపించి, దామిని కళ్ళు నీటితో నిండిపోయాయి. కొన్ని అపోహలు పొరలు పొరలుగా తొలిగిపోయాయి.
* * *
రెండు రోజులుగా నలతగా ఉంటున్న స్వప్నకు సాయంత్రం నుంచి జ్వరం మరీ ఎక్కువైపోయింది. కంగారుపడ్డ దాక్షాయణి తడిబట్ట పెట్టి ముఖమంత తుడిచి, వేడివేడి కాఫీ ఇచ్చి టాబ్లెట్లు వేసింది. అంతలోనే దాక్షాయిని అన్న దామోదర్ రావు చనిపోయారని ఫోన్ వచ్చింది. నిజానికి ఇంటిల్లిపాదీ బయలుదేరి అప్పటికప్పుడు వెళ్లాలి. కానీ స్వప్న ప్రయాణం చేసే స్థితిలో లేదు. ఆమెని అలా ఎలా వదిలి వెళ్లాలో అర్థంకాలేదు వాళ్ళకు. కానీ స్వప్న ‘‘మరేం కంగారు పడకండత్తయ్యా, నేను ఎలాగోలాగా మ్యానేజ్ చేసుకుంటాను. మీరు వెళ్ళిరండి’’ అని అత్తగారిని, భర్తని పంపించింది.
వాళ్ళైతే వెళ్లారు కానీ, తెల్లారికే స్వప్నకి జ్వరం ఎక్కువైపోయింది. పిల్లలు స్నానాలు చేసి •••నిఫామ్స్ వేసేసుకున్నారు. వాచ్మెన్ తో బయటినుంచి టిఫిన్లు తెప్పించి పెట్టింది. బాక్సులలో బ్రెడ్ పెట్టుకుని వెళ్ళమ్మని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంది స్వప్న. పిల్లలు ముగ్గురు బడికి వెళ్లిపోయారనే అనుకుంది. కాసేపటికి గుమ్మం దగ్గర ఏదో అలకిడైనట్టనిపిస్తే అటువైపు చూసింది. తనవైపే చూస్తున్న రెండుకళ్ళు కనిపించాయి.
‘‘చిన్నీ! నువ్వు బడికి వెళ్ళలేదా ఆశ్చర్యపోతూ లేవబోయింది. అంతలోనే జ్వరభారం తోటి, నిద్రమత్తులో కళ్ళు మూసుకుపోయాయి. ఓ గంట తర్వాత కళ్ళుతెరిచి చూస్తే.. చిన్ని, తడి రుమాలతో తన నుదుటి మీద అద్దుతున్నది. ‘‘అత్తా! మరీ నేను బడికెళ్ళలేదు. కోపం తెచ్చుకోకు. ఇంట్లో అమ్మమ్మ లేదు కదా! అందుకే ఉండిపోయాను’’ అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. టోస్టర్ ఆన్ చేసి బ్రెడ్ వేడి చేసి ప్లేట్లో పెట్టి తెచ్చింది. పాలు కాచి కాఫీ కలుపుకొచ్చింది. స్వప్న జ్వరం మరిచిపోయి విప్పారిన కళ్ళతో చిన్నీని చూస్తూ కాఫీ తాగసాగింది.
‘ఈ పిల్లకి నేనంటే కోపం లేదా? తనను తిట్టానే, కొట్టానే.. అయినా విసుక్కోకుండా నాకోసం బడికి వెళ్ళకుండా ఎలా ఆగిపోయింది? చిన్ని మోములో దామిని కనిపించింది. ఒకసారెప్పుడో కావాలని దామినితో పెద్ద గొడవ పెట్టుకుంది. మరుసటి రోజు నుంచి ఆమె తనతో మాట్లాడదని, పెద్ద రాద్ధాంతం చేస్తుంది అనుకుంది. కానీ, మర్నాడు బయటనుంచి వస్తూ తనకెంతో ఇష్టమైన సీతాఫలాలతో పాటు అందమైన పూలగుత్తి తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ‘వదినా ఎందుకో, అలా జరిగిపోయింది. నీకెందుకో నా మీద కోపం వచ్చింది. అన్నీ మర్చిపో మావ•లుగా ఉందాం’ అని చెప్పేసి ఒక నవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఈ చిన్నిలో కూడా తనకి ఆనాటి దామిని ముఖమే కనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా బ్రెడ్ తిని కాఫీ తాగింది. దాక్షాయణీ అంతే. తాను బాగా కోపంగా ఉన్నరోజున ఒక్క మాటకూడా తిరిగి అనదు. పైగా ఆ రోజు ఓపిక చేసుకుని ఇంటెడు పనిచేస్తుంది. పెరట్లోని పువ్వులు కోసి మాలకట్టి ఇస్తుంది. ఇక తాను ఏమనగలదు?
హరీష్ అంతే. తన కోపం తగ్గిపోయే సమాయాన్ని ఇస్తాడు. ‘ఈ కోపాలన్నీ ఇష్యూ బేస్డ్, దీని ప్రభావాన్ని తరువాతి రోజుకు పులమొద్దు’ అంటాడు. ‘ఆ పువ్వులు, నవ్వులూ, పుస్తకాలు వీళ్ళకి ఇన్ని నేర్పాయా? మరి చిన్నికెవరు నేర్పారు.. తానెందుకు నేర్చుకోలేకపోతున్నది?’ అనుకున్నది.
చిన్నీ కాఫీగ్లాసు, ప్లేటు తీసుకెళ్లి లోపల పెట్టింది. మళ్ళీ తలుపు సగం తెరిచి తొంగిచూస్తూ కనిపించింది. స్వప్న మనసు అదోలా అయిపోయింది. ‘‘చిన్ని ఇలారా’’ అని పిలిచింది. తన స్వరం తనకే కొత్తగా అనిపించింది.
చిన్నపిల్ల అని కూడా చూడకుండా అనవసరంగా ఎన్నిదెబ్బలు కొట్టాను తనను? ఎందుకిలా దిగజారిపోయి ప్రవర్తించాను? అని ఆమె మనసుపడే మథనాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియలేదు. ‘‘నామీద నీకు కోపం లేదా చిన్నీ? అని అడగాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కళ్ళెత్తి చూస్తే తలుపు దగ్గరే నిలబడి, తనవంకే చూస్తున్న చిన్ని కనబడింది.
’’ఇటు రా చిన్నీ!’’ అని పిలిచింది. తన గొంతు తనకే కొంగా వింతగా వినపడింది. చిన్ని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నిలుచుని ఉంది.
‘‘అత్తా నేనంటే కోపం పోయిందా? ఇక నుంచీ నిన్ను విసగించకుండా అన్నం తినేస్తాను’’ అన్నది.
స్వప్న తల ఒరిగిపోయింది. ‘ఆ పసిదాని మీద కోపానికి, తన ఆర్థిక పరిస్థితులకి, ఎక్కడో ఏదో లంకె ఉందేమో, తాను చదువుకోలేని చదువులు దామిని చదువుకుంటున్నదన్న అసూయా కూడా ఉన్నదేమో.. కానీ, దాన్ని నేనెందుకు అధిగమించలేకపోయాను’ ఆమె మనసు ముడుచుకుపోయింది. చిన్నివంక చూసింది. చేతులు చాచిన చిన్ని చేతిలో పెరట్లో పూసిన రెండు గులాబీల జంట. గులాబీలు అందుకుంటూ చిన్నిని కూడా దగ్గరకు తీసుకుంది. వీళ్ళందరికీ పూలు పంచడమే కాదు. ప్రేమలు పంచడం తెలుసు. తన అక్కస్సులో తానా విషయాన్ని గుర్తించలేకపోయింది. సజల నేత్రాలతో చిన్ని నుదుటిపై ముద్దుపెట్టింది. చిన్ని నమ్మలేనంత సంబరపడిపోయింది. ఇంతలో పిల్లలు చదివే స్కూల్ క్లార్క్.. శైలజ నుంచి మెసేజ్ వచ్చింది. దామినికి, శైలజ మంచి స్నేహితురాలు.
‘‘స్వప్నగారూ! దామిని అక్కడ టెన్నిస్ కోచ్ గా చేరిందట. ముగ్గురు పిల్లల ఫీజులు కట్టేసేయమని నాకు డబ్బులు పంపించింది’’ అని ఉంది. పెనుభారమేదో తొలగిపోయినట్టయ్యింది స్వప్నకు.
‘దామినికి పువ్వులు పంచడమే కాదు, బాధ్యతలు పంచుకోవడవం తెలుసు. తాను తెలుసుకోవాల్సినవే ఎన్నో ఉన్నాయి..’ అనుకుంటూ చిన్ని చేయి పట్టుకుని పెరటిలోని పూలచెట్ల మధ్య నడిచింది. ఆ పసిదాని కర స్పర్శతో జీవన సౌరభమేదో ఆమెను చుట్టుముట్టింది..
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ద్వీతీయ బహుమతి పొందిన కథ (రూ.5,000)
కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో అదో వాడ. పేరు మంకమ్మతోట. ఆ వాడలో రాజభవనం లాంటి పెద్ద బంగ్లా. ఆ బంగ్లాముందు విశాలమైన ఖాళీస్థలం. ఆ ఖాళీ స్థలంలో వందల మంది వచ్చినా సరిపోయేంత స్థలంలో టెంట్లు. ఆ టెంటు నీడలో నాలుగైదు వందల కుర్చీలు. అటు ప్రక్కన భోజనాలు చేయడానికి టేబుళ్లు.. వాటిపై మటన్, చికెన్, ఫిష్,గుడ్ల కూరలున్న పాత్రలు అందులోంచి వస్తున్న మసాలా ఘాటు ఘుమఘుమలు.
కుర్చీలకెదురుగా ఓ మూలకు టేబుల్‌పై లక్ష్మారెడ్డి నిలువెత్తు ఫోటో. ఆ ఫోటోకు వేయబడున్న పెద్ద పూలమాల. టేబుల్‌పై ఓ పాత్రలలో పువ్వులు, పసుపు కలిపిన బియ్యం, కుంకుమ ఉన్నాయి. ఆరోజు లక్ష్మారెడ్డి గారి పెద్దకర్మ దినం. శ్మశానానికి వెళ్ళి కర్మ కార్యక్రమాదులన్నీ ముగించుకొని తిరిగి వచ్చారు ఇద్దరు కొడుకులు, వారి కుటుంబ సభ్యులు, అపరాహ్నవేళ దాటింది. జనం వస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫోటోపై పూలు, అక్షింతలు చల్లి నుదుటిపై బొట్టుపెట్టి వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. లక్ష్మారెడ్డి కొడుకులను కలుసుకొని మాట్లాడుతున్నారు.
‘‘రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి ఒక్కపొద్దు విడిచిండ్రు కదా! ఇక భోజనాలకు లేవండి’’ అన్నాడో పెద్దమనిషి.
జనమంతా టేబుళ్ళ దిక్కు కదులుతున్నారు. చావు విందు మొదలయ్యింది. నాన్‌వెజ్ కూరల ఘుమఘుమలు ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. వడ్డించేవాళ్లు వడ్డిస్తున్నారు. తినేవాళ్ళు తింటున్నారు. లోపలి గదుల్లో కూచొని కొందరు మద్యపానం సేవిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా విదేశీమద్యం సీసాలు తెస్తున్నారు. వాళ్ళతో కలిసి మద్యం సేవిస్తున్నారు. గత పదిరోజులుగా ఆ ఇంట్లో మద్యం ఏరులై పారుతుంది. ఆచారం, సాంప్రదాయం పేరుమీద మద్యపానం ఇంటి ఓనర్లతో కలిసి తాగడం జరుగుతూనే ఉంది. కర్మరోజు వందల సంఖ్యలో మంది రావడం వల్ల మద్యసేవనం, మాంసం విందుతో ఇంటి గాల్లో కూడా ఆ వాసనే వీస్తుంది.
మాంసాహార టేబుళ్ళ ముందే తండోపతండాలుగా జనాలు. వెజిటేరియన్ దిక్కుపోయేవాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టేంతమంది కూడా లేరు. చావు విందు బహు పసందుగా సాగుతుంది. విందుకొచ్చిన జనాల్లో కార్పొరేటర్లు. మాజీ ఎమ్మెల్యేలు, గ్రామాలనుంచి వచ్చిన చుట్టాలు, బంధువులు అనేకులున్నారు. బగారన్నం, మాంసం, చికెన్లతో సుష్టుగా భోంచేస్తూ తండ్రికి ఘనంగా కర్మ చేస్తున్న కొడుకుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు జనం.
‘‘పదకొండు రోజుల్నుంచి వచ్చే జనం పోయే జనం. మందలించుటానికి వచ్చి తాగడం. ఇంటి నిండా జనమే…’’ బొక్కలోని పూలుగు పీలుస్తూ అన్నాడు వెంకటయ్య.
‘‘బహుగ బతికిండు లక్ష్మారెడ్డి. పెద్దపల్లి జిల్లాలున్న ఊళ్ళె మస్తు భూములుండె. అన్నల లొల్లికి కరీంనగర్‌కు వచ్చిండు. భూములమ్ముకోని ఇక్కడ ఇండ్లు గట్టుకున్నడు. కిరాయలతోనే బతికేంత ఆదాయం.’’
‘‘కొడుకుల సదివిచ్చిండు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కోడండ్లు గూడ ఇంజనీర్లే. వాళ్ళు హైదరాబాద్‌ల విల్లాలల్ల ఉంటున్నరు…’’
‘‘కొడుకులు కర్మ మాత్రం బ్రహ్మాండంగ చేస్తున్నారు….’’
‘‘పదిగొర్లు తెగినయనుకుంట…’’
‘‘అగో.. గా అండలు చూస్తె అర్థమైతలేదా?’’
‘‘పది రోజుల్నుంచి ఇంట్ల మందు విందులు మస్తు నడుస్తున్నయి…’’
‘‘వంటలు బాగున్నయి. ఎవ్వలకిచ్చిండో?’’
‘‘క్యాటరింగ్ వాళ్ళను పిలిచి సామాన్లు కొనిచ్చి వండినందుకు ఇంత ఇవ్వడమని కాంట్రాక్టు మాట్లాడుకున్నడట….’’
‘‘క్యాటరింగ్ వాళ్ళయితెనే బాగ వండుతరు…’’
మాంసాహార భోజనం పసందుగా తింటూ మాట్లాడకుంటున్నారు వాళ్ళు.
‘‘హోటల్వాళ్ళకు ప్లేట్‌కు ఇంతని ఇస్తే ఐపోయేది కద!’’
‘‘వాళ్ళు ప్లేట్‌కు ఏడెనిమిదివందలు తీసుకుంటరు. బిర్యానీల వేసేది ఒక్క ముక్క. ఇప్పుడు జూడు చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, మటన్, చికెన్, ఫిష్ కర్రీలు, బగారన్నం, తెల్లన్నం. అదే ఖర్చుతోని రెండు మూడింతలు తినచ్చు’’ బిర్యానీ ముక్క కొరుకుతూ అన్నాడొకాయన.
‘‘ఎంతయినా చావు కూడ పెండ్లంత ఖర్చుతో కూడుకున్నదవుతుంది ఇవన్ని చూస్తుంటే’’
‘‘లక్ష్మారెడ్డి బాగానే సంపాయించిండు. కొడుకులు లక్షలల్ల సంపాయిస్తున్నరు. ఖర్చుపెడితె ఏం బోతంది?’’
‘‘కాదోయ్ నర్సిరెడ్డీ! నాకు అర్థం కాని దొక్కటుంది’’
‘‘నర్సింలూ! జగమెరిగిన బ్రాహ్మణసోంటని నువ్వు నీ కర్థం కాని దేముంటదో చెప్పు! గదేందో చెప్పలేవు’’ అన్నాడు నర్సిరెడ్డి.
‘‘నాతోనే చెప్పియ్యాన్నని కని నీకు తెలవదా నర్సిరెడ్డీ! ఓ దిక్కు ఇంట్ల మనిషి చనిపోయిన దుఃఖముంటది. మరో దిక్కు చనిపోయిన్నాటి నుంచి మాట్లాడించుటానికని వచ్చినోల్లు కల్లో, బ్రాందో తెచ్చి చనిపోయినోల్ల కొడుకులతో కలిసి తాగుడు. మనిషి చచ్చిపోయిండని ఏడ్సుడా? మందలిచ్చి వత్తామన్న పేరుమీద తాగుడా? గీ పనయితె నాకు మంచిగని పియ్యది. పది పన్నెండు రోజులు చనిపోయినింట్ల మద్యం. ఇప్పుడయితె బ్రాంది, విస్కీలు, బీర్లు, వరదలై పారుతయి? గిదేం సంస్కృతి?’’ అన్నాడు నర్సింలు.
ఆ మాటలతో తినడమాపారా నలుగురైదుగురు. నర్సింలు మాటల్లోని నగ్నసత్యాల గురించాలోచిస్తున్నరు. ఇది ఈ రోజు కాదు. తరతరాలుగా నడుస్తున్నదని వాళ్ళందరికీ తెలుసు. ఎంత సంపన్న కుటుంబమైతే అంతెక్కువగా ఆ ఇంట్లో మద్యం వరదలై పారుతుంటుంది.
‘‘నర్సింలూ! నాగ్గూడ గిది ఆచారమో, మరేందో కాని మంచిగనిపియ్యది. కాని ఓ దిక్కు ఆడోల్ల ఏడ్పులు, మనిషి పోయాడన్న బాధ మరో దిక్కు చూడటానికి వచ్చిన అతిథులతో కలిసి తాగుడు. నా కయితె ఇగో దినాల రోజు మాంసం ముక్కలు నోట్లె పెట్టుకోవన్నంటెనే మంచిగనిపించదు. ఒక్కొక్కడు ఎలా తింటున్నాడో సూడు. లోపల కూసుండి ఎట్ల తాగుతున్నరో సూడు?’’ అన్నాడు శంకర్రావు.
‘‘అనుకుంటనుకుంటనే అరకిల మాంసం తిన్నవు కదనోయ్ శంకర్రావు… ఇది మనకు ఆచారంగ వస్తుంది. ఇంట్లో ఆత్మీయులు పోయి దుఃఖంలో ఉన్న మనిషిని ఆ దుఃఖంను మరిచిపోయేట్టు చేయడానికి ఆతనితో కూసుండి తాగడం మామలే. మాట్లాడుకుంటూ తాగడం వల్ల ఆ సమస్యనుండి వ్యక్తి దృష్టి మరలుతుంది. ఇది వట్టిగ పెట్టిన ఆచారమేం కాదు. కాకపోతే రోజు రోజుకు ఇది మరింత పెరుగుతుంది.డబ్బు, ఉద్యోగాలు, చదువులు పెరిగిం తర్వాత ఇది మరీ ఎక్కువయింది. ఎంత బాగ తాగుతె, తాగిస్తె, ఎంత ఖర్చెక్కువ పెట్టి మాంసాహారం పెడితె అంత గొప్పన్నట్టు తయారైంది’’ అన్నాడు వీరారెడ్డి.
‘‘అగొజూడు ఎట్ల తింటున్నరో? చావుకొచ్చిన వాళ్ళు జోకులేసుకుంట పెళ్ళి విందు కంటెక్కువ చావు విందును ఎంజాయ్ చేస్తున్నారు. ఇపుడు చాలా పెళ్ళిళ్ళలో వెజటేరియన్ భోజనమే ఉంటే చాలా చావుల్లో మాత్రం మటన్, చికెన్, తాగుల్లు తప్పడం లేదు. అంటె పెళ్ళి కంటె చావే ఖర్చుతోని కూడుకున్నదయింది…’’
గుంపులుగా కూర్చొని, నిల్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ చావు విందును పసందుగా ఆరగిస్తున్నారు జనం. లక్ష్మారెడ్డికి కూతుర్లు లేనందువల్ల ఆడవాళ్ళ ఏడ్పులూ వినబడటం లేదు. పల్లెటూళ్ళలోలా గొంతెత్తి వల్లించుకుంటూ ఏడ్చే సాంప్రదాయం క్రమక్రమంగా దూరమవుతుంది. పల్లెల్లోనూ ఇందువరకటిలా భోరుమని తల, కడుపుపై కొట్టుకుంటూ ఏడ్వడం జరుగడం లేదు. పట్టణాల్లో, సంపన్న కుటుంబాల్లో నయితే చావు విందంటే ఓ విలాసవంతంగా తాగితినే పార్టీగా మారిపోయింది.
‘‘రాంరెడ్డి, ప్రకాశరెడ్డి తండ్రి కర్మను మస్తు చేస్తున్నరు….’’
‘‘వాళ్ళకేంది? ఇద్దరు షాఫ్ట్వేర్ ఇంజనీర్లు. తండ్రి సంపాయించి ఇచ్చింది గూడ మంచిగనే ఉంది. చచ్చిపోయినంక పార్టీ అయినా మంచిగ చెయ్యకుంటేం జేత్తున్నరు…?’’
‘‘తెలంగాణల గీ పార్టీలల్ల మందు, మాంసం విందులు అతి మామలే. ఎవ్వల శక్తి కొద్ది వాళ్ళు మందు తాగిస్తరు. తాగుతరు. విదేశీ మందు బాటిల్ల పెట్టెలు, మిలట్రీ కాంటీన్ల పెట్టెలు మస్తు తెప్పిచ్చిండ్రు రాంరెడ్డి, ప్రకాశరెడ్డి. హైదరాబాద్‌ల ఉంటున్నరు గద! అక్కడన్ని దొరికె..?’’
‘‘మరి గక్కడుండెటోల్లు గీ కరీంనగర్ల ఎందుకు కర్మ జేత్తన్నడు?’’
‘‘ఎందుకంటె కరీంనగర్ జిల్లాలనే ఆల్ల బంధువులందరున్నరు. ఇగొ గీపెద్ద ఇల్లున్నది. ఆస్తులున్నయి. లక్ష్మారెడ్డి స్నేహితులున్నరు. వీళ్ళందర్ని హైదరాబాద్ కచ్చి తాగితిని పొమ్మంటె పోతరా? ఏదో కొద్దిమంది గక్కడికి పోతరు గావచ్చు…’’
‘‘ఇద్దరు కొడుకులు కోట్ల విలువలు చేసే విల్లాలల్ల ఉంటున్నరు. నెలకు లక్షల్లో సంపాయిస్తున్నరు. తండ్రి కోసం గీ మాత్రం చేయడం పెద్దగొప్పేం కాదు…’’
చాలా సేపట్నుంచి వాళ్ళ మాటలు వింటున్నాడు కొంరయ్య ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. లక్ష్మారెడ్డికి ప్రాణస్నేహితుడు. మిత్రుడి గురించిన ప్రతి విషయమ కొంరయ్యకు తెలుసు. ఊళ్ళో ఉన్నప్పట్నుంచే బాల్య స్నేహితుడైన కొంరయ్య ప్రస్తుతం కరీంనగర్‌లోనే ఉంటున్నాడు. తన స్నేహితుడి పెద్దకర్మ కార్యక్రమానికి రావాల్సి రావడం కొంరయ్యకు బాధాకరంగానే ఉంది. రుచికరమైన ఆ మాంసాహార భోజనం, బిర్యానీ ఎంత ప్రయత్నించినా నోట్లోకి పోవడం లేదు. వందలాది జనం అదో పెండ్లి విందు అన్నట్టుగా మాట్లాడుకుంటూ , జోకులేసుకుంటూ విందుభోజనం చేస్తున్నా కొంరయ్యకది నచ్చడం లేదు. గరం మసాలా దట్టించిన ఆ మాంసం ముక్కలు, చికెన్ ముక్కలు రుచించడం లేదు. మొదటిసారి కంచంలో వేసుకున్న అన్నాన్నే వేళ్ళతో గెలుకుతున్నాడు. ఆ అన్నమే కాదు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, ఆహూతులు మాట్లాడుతున్న మాటలూ ఆయనకు నచ్చడం లేదు. అందుక్కారణం లక్ష్మారెడ్డి తనకు ప్రాణస్నేహితుడు కావడం మాత్రమే కాదు. ఆతని జీవితాన్ని దగ్గరగా చూడడం. చావుబువ్వను సుష్టుగా భోంచేస్తూ జనం అనుకుంటున్న మాటలను భరించలేకపోతున్నాడు కొంరయ్య. ఇక మౌనంగా ఉంటూ ఆ మాటలను వినదలుచుకోలేదు.
‘‘అవును లక్ష్మారెడ్డి కొడుకులు తండ్రి కర్మను ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే మీరంతా వారం పదిరోజుల్నుండి మందు మాంసం విందులతో ఎంజాయ్ చేస్తున్నారు కదా! చచ్చినాక కర్మ ఎంత ఘనంగా చేసినా ఒరిగేదేంటి? చచ్చిన వ్యక్తేమైన చూస్తాడా? వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురిచేసి చచ్చినాక లక్షలు, కోట్లు ఖర్చు చేసినా ఒరిగేదేంటి? నాకయితే ఈ కర్మలు, చావుతంతు బాగా తినడానికి తాగడానికే ననిపిస్తుంది. దయచేసి మీరు ఎన్నడూ మటన్ మొకం చూడనట్టు తినడం, కృతజ్ఞత కోసమన్నట్టు పొగడ్తలాపండి’’ మిత్రుడు జ్ఞాపకం వచ్చి కన్నీరు కారుస్తూ అన్నాడు కొంరయ్య.
ఆ మాటలతో కొంరయ్య చుట్టు ప్రక్కలున్న జనం మాటలాపారు. నోట్లో పెట్టుకోబోయిన మాంసపు ముక్కలనూ అలాగే చేతిలో పట్టుకొనున్నారు లక్ష్మారెడ్డికి సన్నిహిత మిత్రుడైన కొంరయ్య కళ్ళవెంట నీళ్ళు కారుతుండటం చూసి చలించిపోయారు. కొద్దిసేపక్కడ మౌనమే రాజ్యమేలింది.
‘‘ఏంటి కొంరయ్యా నువ్వనేది? లక్ష్మారెడ్డికి ఆయన కొడుకులు ఏం తక్కువ చేసారు? వృద్ధాప్యంలో తమతోనే ఉంచుకున్నారు కదా! హైదరాబాద్‌లో రాజభవనాల్లాంటి విల్లాలు కొన్నారు. నీ మాటలు వింటుంటే కొడుకులు తండ్రిని కడుపు మాడ్చారన్నట్లర్థమవుతుందరికీ. నీకు ఇలాంటి తద్దినఖర్చులు ఇష్టం లేనంతమాత్రాన రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిలను బదునాం చేయడం బాగా లేదు. నాకు తెలిసి వాళ్ళు తండ్రిని బాగానే చూసుకున్నారు…’’ అన్నాడు మల్లారెడ్డి.
‘‘మల్లారెడ్డీ! నీకు పైపై విషయాలు మాత్రమే తెలుసు. లక్ష్మారెడ్డి నాకు చాలా దగ్గరి మిత్రుడు కాబట్టి ఆయన అంతరంగం తెలుసు. వృద్ధాప్యంలో ఆయన అనుభవించిన వేదన తెలుసు. బతికున్నప్పుడు తల్లిదండ్రుల కడుపులు మాడ్చి చచ్చింతర్వాత జనం చూసేట్టు కర్మ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసే మధ్యతరగతి ప్రబుద్ధులూ ఉన్నారు. లక్ష్మారెడ్డికి అలా జరిగిందని నేననడం లేదు. కాని ముసలివయస్సులో వాళ్ళకు కావాల్సింది కడుపునిండా తిండిమాత్రమే కాదు రెడ్డీ! ఒకింత ప్రేమ. ఆప్యాయత, తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో గడుపాలన్న కోర్కె. ఇవేవీ లక్ష్మారెడ్డికి లభించలేదు. ముసలితనాన్ని ఖరీదైన వృద్ధాశ్రమంలో ఒంటరిగా గడిపాడు. బిక్కు బిక్కుమంటూ గడిపాడు. తన మనుమలు, మనుమరాడ్రంతోని పిల్లల్లో పిల్లవాడై బతకలేకపోతున్నాని అంగలారుస్తూ బతికాడు’’ కళ్ళనీళ్ళు తీసుకుంటూ అన్నాడు కొంరయ్య.
కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడు. అప్పటికే సుష్టుగానే భోంచేసారు కొంరయ్య చుట్టున్న వాళ్ళంతా. కొంరయ్య మాటలు విన్న తర్వాత, కన్నీరు చూసిం తర్వాత మరింత తినాలనున్నా తినడానికి మనసొప్పలేదు. ప్లేట్లలో మిగిలిన అన్నంలో పెరుగు వేయించుకున్నారు.
‘‘కొంరయ్యా! లక్ష్మారెడ్డిని హైదరాబాద్‌లో ఖరీదైన వృద్ధాశ్రమంలోనే లక్షల డొనేషన్ కట్టి నెలకు వేలల్లో ఖర్చు పెడుతూ ఉంచారు కదా! ఇంకేం చెయ్యమంటావు వాళ్ళను? ఇక్కడ ఒంటరిగా ఉండలేడని తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్ళారు. లక్ష్మారెడ్డి కొడుకులు, కోడండ్లు ఉద్యోగులే కాబట్టి వృద్ధాశ్రమంలో ఉంచడంలో తప్పేముంది? ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తూ తండ్రినెలా చూసుకోగలరు? నిజానికి ఈ కాలంలో వృద్ధాశ్రమంలోనే ఇంట్లో కంటె ముసలివాళ్ళను బాగా చూసుకుంటున్నారు. కోట్లున్న వాళ్ళు కూడా పట్టణాల్లో తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు. అదేదో నేరమైనట్లు మాట్లాడవడ్తివి నువ్వు’’ అన్నాడు ఆనందరావు.
ఆ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు కొంరయ్యకు. ‘‘మనం పెండ్లికొచ్చినట్లు చావు తిండి బాగానే తిన్నాం. కొంరయ్య మాటలు విన్న తర్వాత మనకు మరో ముక్క నోట్లెకు పోవడం కష్టమే. కొంరయ్యకు తెలిసినంతగా లక్ష్మారెడ్డి కుటుంబం గురించి వాళ్ళ చుట్టాలకు కూడా తెలియదు. పెరుగుతో కూడా తినడమయి పోయింది. మనమిప్పుడు చేతులు కడుక్కొని చివర్లో ఉన్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుందాం.’’
రాజేశం మాటలందరికీ నచ్చాయి.
షామియానా చివర్లో ఉన్న ఖాళీ కుర్చీల్లో కూచొని మాటల్లో పడ్డారు పదిమంది మిత్రులు. చావువిందు పార్టీ నడుస్తూనే ఉంది.
‘‘ఆనందరావుగారూ! మీకు వృద్ధాశ్రమాలు కొడుకులతో ఉండటం కంటె మేలైనవిగానే కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఏ సెంటిమెంట్లూ, విలువలూ లేవనను కాని డబ్బు ముందు అవన్నీ హాస్యాస్పద మాటలుగానే కనబడుతాయి. కాని లక్ష్మారెడ్డికి అలా కాదు. తనకు. యాభై ఏండ్లు దాటేవరకూ అంటే తన తల్లిదండ్రులు చనిపోయేవరకు ఇంటిపెద్ద కొడుకుగా తన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగానే ఉంచాడు. తల్లిదండ్రులను అన్నదమ్ములు ముగ్గురూ తమ కొడుకుల్లా చూసుకున్నారు. తన పిల్లలకు ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని చవిచూపాడు కాని తన దగ్గరికొచ్చేసరికి అంతా తారుమారైంది’’ అన్నాడు కొంరయ్య.
కొంరయ్య మాటలకు ఆనందరావు బాధపడినా కొంరయ్య ఇంకా ఇరవయ శతాబ్దిలోనే ఉన్నట్టు భావించాడు. తగిన సమాధానం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.
‘‘కొంరయ్యా! నువ్వింకా నీ బాల్యం, యవ్వనం నాటి కాలంలోనే ఉన్నావు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించడం లేదు. మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారడాన్నీ గుర్తించడం లేదు. మనమిపుడు ప్రపంచీకరణాన్ని దాటి ఎలక్ట్రానిక్ యుగంలో బతుకుతున్నాం. ముఖ్యంగా ఈనాటి యువతరాన్ని నీలాగే బతుకమని శాసించడం సరైందేమో ఆలోచించు’’ అన్నాడు.
ఆ మాటలకు చిన్నగా, నవ్వాడు కొంరయ్య.
‘‘మీ ప్రపంచీకరణం, ఎలక్ట్రానిక్ యుగం ముసలివాళ్లను ఇంట్లోంచి తరిమెయ్యమని చెప్పిందా? వృద్ధాశ్రమాలకు అంకితం చేయమని చెప్పిందా? పిల్లలకు ముసలివాసన రాకుండా చేయమని చెప్పిందా? పసివాళ్ళను అమ్మమ్మలు, నాన్నమ్మలు తాతయ్యలకు దూరంగా ఉండాలని చెప్పిందా? చెప్పుండ్రి ఆనందరావుగారూ! లక్ష్మారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలోఎంత ఏకాంతత అనుభవించాడో, తన వాళ్ళ కోసం ఎంత తపించాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారీ నా మిత్రుడు లక్ష్మారెడ్డి దగ్గరికి వెళ్ళి కొద్దిగంటలు గడిపివచ్చేవాన్ని’’ అన్నాడు కొంరయ్య.
ఆ మాటలు అక్కడున్న చాలామందికి గాయాలుగా బాధించినా కొద్దిమంది మాత్రం లక్ష్మారెడ్డి అంత వేదన ననుభవించాడా అని అనుకోకుండా ఉండలేకపోయారు.
‘‘అయితే కొంరయ్యా! లక్ష్మారెడ్డికి వృద్ధాశ్రమానికి పోవడం ఇష్టం లేదా? ఆ విషయం తెలిసినవాడివి నువొక్కడివే… చెప్పగలవా? అసలేం జరిగింది?’’ అన్నాడు మల్లారెడ్డి .
తనకు తెలిసిన విషయాన్ని ఈ సమయంలోనైనా చెప్పకుండా దాచుకోవడం సరైంది కాదనిపించింది కొంరయ్యకు. ఈ విషయం చెప్పడం వల్ల రాంరెడ్డి ప్రకాశ్‌రెడ్డికి జరిగేనష్టమేం లేదు. కాని కొందరైనా ఆ వయసువారు తల్లిదండ్రుల విషయంలో మారే అవకాశముందని భావించి చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.
* * *
లక్ష్మారెడ్డి కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. లక్ష్మారెడ్డి భార్యతో కలిసి కరీంనగర్ ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చనిపోయిం తర్వాత లక్ష్మారెడ్డి ఎక్కడుండాలన్న చర్చ వచ్చింది. కరీంనగర్ ఇంట్లో ఒంటరిగా ఉండటం లక్ష్మారెడ్డికి ఇష్టం లేదు. మనుమలు, మనుమరాల్లు, కొడుకులు, కోడళ్ళతో సమూహంలో ఉండటమే అతనికిష్టం. అదే మాట కొడుకులతో అన్నాడు. కొడుకులకూ తండ్రిని తమతోనే ఉంచుకోవాలనుంది.
‘‘రాంరెడ్డీ! ప్రకాశ్! మీనాన్న మా కాలపు మనిషి, సమూహంలో జీవించడం ఆతనికిష్టం. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల మధ్య జీవించడానికి ఇష్టపడతాడు. అమ్మ ఉన్నంతవరకు మీ నాన్న కోర్కె నెరవేరింది. ఇప్పుడు ఒంటరి అయ్యాడు. మీతో ఉంచుకుంటేనే మంచిది. ఇక్కడ ఎంత మంది స్నేహితులున్నా తన వాళ్ళతో ఉండడం మీ నాన్న కిష్టం’’అన్నాడు కొంరయ్య.
‘‘అలాగే చేస్తాం అంకుల్. నాన్నను మాతో హైదరాబాద్ తీసుకెల్తాం. మా ఇద్దరి విల్లాలు ఒకే దగ్గర. తన ఇష్టమున్నచోట ఇష్టమున్నన్ని రోజులుంటాడు’’ అన్నాడు రాంరెడ్డి.
‘‘అవును ఈ వయసులో మానాన్న మాతో ఉండటమే సరైంది. ఇక్కడ ఒంటరిగాఎలా ఉంటాడు?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి.
ఆ మాటలు లక్ష్మారెడ్డి కోడళ్ళకు నచ్చలేదు. వ్యవసాయం చేస్తూ పల్లెటూళ్ళో బతికిన తనమామ కరీంనగర్లో ఉండడమే ఎక్కువంటే హైదరాబాద్ కొచ్చి తమతో ఉండాలనటం అసలే నచ్చలేదు.
‘‘అంకుల్. మగవాళ్ళకేం తెలుసు మా ఇబ్బందులు. మేమ ఆఫీసుకెళ్ళాలి. అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. మేమందరం ఆఫీసుకెళితే మామగారు ఇంట్లో ఒక్కరెలా ఉంటారు? అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా తక్కువే. ఇక్కడయితే మామగారి స్నేహితులు, చుట్టాలెంతో మందున్నారు. లేదా ఊళ్ళోని పాత ఇల్లును బాగు చేసుకొని అక్కడున్నా మంచిగా టైమ్‌పాస్ అవుతుంది’’ తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది పెద్దకోడలు రజని.
‘‘అంకుల్! అక్క చెప్పింది నిజం. మీరు మామగారికి దగ్గరి స్నేహితులు. ఆయన స్వభావం మీకు తెలుసు. హైదరాబాద్‌లో ఆయన ఉండలేరు. ఊళ్ళో, కరీంనగర్లో అలవాటయిన మామగారు మాతో ఉండలేరు. పోతే నున్నని పాలరాతితో చేసిన గచ్చునుంచి జారిపడినా అదో పెద్ద ప్రమాదం’’ అంది చిన్న కోడలు శ్రీలక్ష్మి.
‘‘నిజమే అంకుల్! మేమివన్నీ ఆలోచించలేదు. విల్లాల్లో ఉంటున్నామన్నట్టే కాని అవి ఈ ఇల్లంత కూడా ఉండవు. ఎవరి రూంలు వారికే. నాన్నకు ప్రత్యేకగది కేటాయించలేం..’’
‘‘అందరం బిజీ కదా అంకుల్. రోజుకు రానుపోనులతో కలిపి పదకొండు గంటలు డ్యూటీకే. కార్లలోనే వచ్చి పోవడమైనా ప్రయాణాలతోనే అలసిపోతాం. నాన్నను ఇక్కడే ఉంచి కేర్‌టేకర్‌గా ఓ మనిషిని పెడుదాం…’’
కొడుకులు, కోడళ్ళ మాటలు విన్న తర్వాత కొంరయ్యకు ఇలాంటి కొడుకుల కోసమా తాను రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బు సంపాదించింది. కొడుకులను విదేశాలకు పంపి ఎం.ఎస్. చేయించింది? అని అనుకోకుండా ఉండలేక పోతున్నాడు. వాళ్ళపై అసహ్యం వేస్తుంది.
‘‘హైదరాబాద్‌లో లంకంత కొంపలున్న మీకు మీనాన్నకో గది కేటాయించే వసతి కూడా లేదంటున్నారు. మీ నాన్న కూడా మీలాగే అనుకొనుంటే మీరు బురదలో జంబు కొడుతూ ఉండేవారు. మీ పిల్లల విషయంలో కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? మీ పిల్లలు కూడా మీలాగే ఆలోచిస్తే వృద్ధాప్యంలో మీ గతేంటి? మీ చదువు, ఉద్యోగం, బతుకు మీ నాన్న పెట్టిన భిక్షేనని మరిచిపోకుండ్రి. తాము కరిగిపోతూ మిమ్ములనీ స్థితికి తెచ్చారు.
ఇప్పుడు మీకు వాళ్ళు కాని వారయ్యారు. మీ ఇంట్లో ఉండటానికి అర్హతలేని వారయ్యారు? పదిమందిలో పంచాయితీ పెట్టించి మీ ఇజ్జత్ తీయాల్సింది. కాని నన్నొక్కన్నే రమ్మన్నారు.’’ అసహ్యంతో ముఖం చిట్లించాడు కొంరయ్య.
వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి.
‘‘అంకుల్! మీరు మమ్మల్ని కాలమాన పరిస్థితులను చూడకుండా దోషులను చేస్తున్నారు. వేగవంతమైన ఈ కాలంలో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ తల్లిదండ్రులను తమతో ఉంచుకుంటున్నారు? బిజీ షెడ్యూల్లో అదెలా సాధ్యమవుతుంది? ఎంత ఖర్చయినా సరే మేం నాన్నను హైదరాబాద్‌లోని విలువైన వృద్ధాశ్రమంలో ఉంచుతాం. మేమ హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఫోన్ వస్తే చాలు వెంటనే చూసి రావచ్చు. ఈ కాలంలో ఇంట్లో కంటె అక్కడే వృద్ధులకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది…’’
‘‘పైసలతో అన్నీ కొనొచ్చు అనే భ్రమల్లో ఉన్నారు మీరు. మీ నాన్నకు కుటుంబంతో ఉన్న పేగుబంధాన్ని ఎన్ని లక్షలిచ్చి కొంటారు? తన కొడుకుతో, మనుమలు మనుమరాల్లతో కలిసి భోంచేయాలనుంటుంది మీనాన్నకు. మనుమలు, మనుమరాల్లతో పిల్లల్లో పిల్లవాడై ఎగరాలనుంటుంది. చేతగాకున్నా భుజాలపై ఎత్తుకొని తిప్పాలనుంటుంది. ముద్దుముద్దుగా కథలు చెప్పాలనుంటుంది. మీ నాన్నతరం, మాతరం తాతలు, తండ్రులు చెప్పే నోటికథలు వింటూ పెరిగాం. ఇవన్నీ వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడైనా దొరుకుతాయా? ఒక్క ఇంట్లో తప్ప చెప్పురాం రెడ్డీ! ప్రకాశ్!’’ అన్నాడు కన్నీళ్ళు తీసుకుంటూ కొంరయ్య.
ఆ మాటలకు రాంరెడ్డి ప్రకాశ్ హృదయాలు చలించిన మాట నిజమే. కాని తాము చేస్తున్నది తప్పని వాళ్ళ కర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల్లో చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు.
‘‘అంకుల్! మీరన్న ఈ మాటలు మీ స్వంత కవిత్వమా? మానాన్న మాటలా?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి కొంరయ్యను చూస్తూ.
ఆ మాటలకు ప్రకాశ్‌పై విపరీతమైన ఆగ్రహమొచ్చినా తనను తాను నిగ్రహించుకున్నాడు కొంరయ్య.
‘‘ప్రకాశ్! నేను కవినయ్యుంటే మీ ప్రవర్తనపై నేనో కవిత రాసి దాన్ని చదివిన వాళ్ళు మెచ్చుకుంటుంటే విని ఉప్పొంగిపోయి గొప్పపని చేసానని చేతులు దులుపుకొనుండేవాడిని. కాని నేను కవిని కాదు. మామూలు ప్రాక్టికల్ మనిషిని. మీ నాన్న హృదయాన్నెరిగిన బాల్య స్నేహితున్ని. మీ నాన్న ఎన్నోసార్లు నాతో ఆ మాటలన్నాడు. కాని మీకు ఆ సెంటిమెంట్లేమీ లేవు కదా! మీ పిల్లలను ఎత్తుకొని ముద్దాడితే ముసలివాసనొస్తుందంటారు. దగ్గర పడుకోబెట్టుకుంటే ముసలివాళ్ళ రోగాలు తగులుతాయంటారు. పాతిక ముప్పయేండ్లు సాది పెంచి పెద్ద చేసి, ఉన్న ఆస్తినిచ్చి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను చివరిదశలో నాలుగైదేండ్లు దగ్గరుంచుకొని మీ పిల్లల్లో పిల్లల్లా చూసుకోవడం చేతగాని మీ బతుకులేం బతుకుల్రా… ఛీ’’ అన్నాడు కొంరయ్య కోపంగా.
ఆ మాటలతో నలుగురి ముఖాలూ నల్లబడ్డాయి.
‘‘కొరయ్య తాతా! మాకు మా తాతంటే ఇష్టం. తాత మాతోని ఉండుడంటే ఇష్టం. తాత చెప్పే పల్లెటూరి కథలంటే ఇష్టం. మేం తాతతోని మంచిగ ఆడుకుంటం. మాకు పెద్ద పెద్ద ఇండ్లున్నయి. తాతను మా ఇంట్లనే ఉంచుకుంటం. మమ్మీ! డాడీ ప్లీజ్ తాతను హైదరాబాద్‌ల మనింట్ల ఉండనీయిండ్రి’’ అన్నాడు రాంరెడ్డి కొడుకు పన్నెండేళ్ళ అనిల్‌కుమార్ రెడ్డి.
‘‘మాకూ తాతంటే ఇష్టమే’’ అన్నారు మిగతా ముగ్గురు పిల్లలు. ఆ నలుగురిప్పుడు సందిగ్ధంలో పడ్డారు.
రజని త్వరలోనే ఈ లోకంలో కొచ్చింది.
‘‘నేం చెప్పలేదా? ఈ ముసలాయన ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారు. ఇంగ్లీషు మీడియం చదివే పిల్లలకు కథలు! కాకరకాయలని చెప్పి చదువును నాశినం చేస్తడు. తీవ్ర కాంపిటీషనున్న ఈ కాలంలో గా తెలుగు కథలు, కాకమ్మ కబుర్లు ఎవ్వలకు కావాలె. ఈనె తన రోగాలను కూడా పిల్లలకు అంటబెడుతడు. వృద్ధాశ్రమంలో వేయడమే మంచిది. మా ఇంట్లో ఉంచుకోవడాని కొప్పుకోం…’’ అంది. శ్రీలక్ష్మి యారాలును సమర్ధించింది.
అక్కడ వాతావరణం మరింత గంభీరమైంది.
కుర్చీలో కూర్చొనున్న లక్ష్మారెడ్డి లేచి నిల్చున్నాడు. ఆతని కళ్ళవెంట పటపటా నీళ్ళుకారుతున్నాయి. ‘‘రాంరెడ్డీ, ప్రకాశ్ పోస్టాఫీసులో నా పేరుమీద ఐదులక్షల డిపాజిట్లున్నాయి. అవి తీసి డొనేషన్‌గా సి.ఆర్. ఫౌండేషన్ హైద్రాబాద్ వృద్ధాశ్రమంలో కట్టుండ్రి. ఈ ఇంటిపై వచ్చే కిరాయలను నా నెలభత్యం, ఇతర ఖర్చులకు వాడుకుంటాను. మీరు నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. రేపే మనం హైదరాబాద్ పోదాం..’’ అని కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకెళ్ళాడు.
‘‘ప్రకాశ్, రాంరెడ్డీ! మీ నాన్నను దూరం చేసుకుంటూ మీరు కోల్పోతున్న విలువ వెలకట్టలేనిది. మీనాన్న చెప్పినట్టు చేయిండ్రి’’ అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు కొంరయ్య.
లి లి లి లి
ఇదీ నాలుగేండ్ల కింద జరిగిన లక్ష్మారెడ్డి వృద్ధాశ్రమ కథ అని చెప్పడం ముగించాడు కొంరయ్య. దూరదూరంగా తిరుగుతూ కొంరయ్యవాళ్ళ మాటలు విన్న ప్రకాశ్‌రెడ్డి, రాంరెడ్డి వెక్కెక్కి పడి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికొచ్చారు. దుఃఖభారం దిగేవరకూ ఏడ్చారు.
‘‘కొంరయ్య బాపూ! మాలాంటి పుత్రరత్నాలు ఏ తల్లిదండ్రులకూ పుట్టకూడదు. మా కళ్ళకున్న. ‘రూపాయి’ మాయ పొరలు తొలగిపోయాయి. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే కాని మా నాన్న ఉన్న వృద్ద్ధాశ్రమానికి నేను మాతమ్ముడు చెరో పాతికలక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఇది మా పాపానికి ప్రక్షాళన కాదు. మమ్మల్నెవరూ క్షమించాల్సిన అవసరం లేదు. మా కథను నేటితరం గుణపాఠంగా తీసుకుంటే చాలు….’’ అన్నాడు రాంరెడ్డి. ప్రకాశ్‌రెడ్డి కళ్ళవెంటా పటపటా నీళ్ళు కారుతున్నాయి. కొంరయ్య చెప్పిన యదార్థగాథ విన్న అక్కడున్నవాళ్ళకు ఆ చావుతిండి రుచించడం లేదు.
డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రథమబహుమతి పొందిన కథ (రూ.10,000)
ఆ ఇంట్లో ప్రతి ఉదయం అందరితోపాటు కొన్ని అలవాట్లు కూడా మేల్కొంటాయి. రమణారావు లేవగానే తలుపు తీయడు. కిటికీ తెర జరిపి బయటి మామిడి చెట్టును చూస్తాడు. అక్కడే తులసి మొక్కకు పూజ చేస్తున్న భార్య శారదను చూస్తాడు. చీకటిని పూర్తిగా వదిలిపెట్టని, వెలుగును ఇంకా పొదివిపట్టని వాతావరణాన్ని చూస్తాడు.
కిటికీలోంచే శారదతో – ‘‘అనుభవించడం ముఖ్యమా అర్దం చేసుకోవడం ముఖ్యమా’’ అన్నాడు ఆ రోజు.
‘‘అసందర్బంగా మాట్లాడడంలో బహుశా మీకెవరూ పోటీ రారేమో’’ అంది శారద సమాధానంగా.
‘‘నీ ఎటకారాలు సరే గానీ …చెప్పు ‘‘ అన్నాడు రమణారావు మళ్లీ.
‘‘అనుభూతికి పేరెందుకు ‘‘ అనుకుంటూ వంటగది వైపు వెళ్లింది శారద.
రమణారావు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.
* * *
వంటగదిలోంచి గాలితో కలిసిన వేడిపాల వాసన ఇంటినిండా పరుచుకుంది. కాఫీ డికాక్షన్ మెల్లగా ఉడుకుతోంది. తులసి కోట దగ్గర పూజ చేసొచ్చిన శారద, డైనింగ్ టేబుల్ వైపు చూసి నవ్వుకుంది. రమణారావు అప్పటికే అయిదు కప్పులు వరసగా పెట్టాడు. ఇంట్లో వాళ్లు నలుగురే. అయిదవ కప్పు మాత్రం ప్రతిరోజూ తప్పదు.
‘‘ ఆ అలవాటు పోదా?’’ అంది శారద.
‘‘ఏ అలవాటు?’’
‘‘అయిదో కప్పు.’’
రమణారావు కప్పుల వరుస సరిచేస్తూ – ‘‘ఇంట్లో ఒక కప్పు ఖాళీగా ఉండాలి.’’
‘‘ఎందుకు?’’
‘‘ఎవరో రావచ్చు.’’
‘‘మన పిల్లలిద్దరూ పెద్దవాళ్లు. ఎవరూ ఇలా చెప్పకుండా రారు.’’
‘‘పిల్లల కోసం కాదు.’’ అతను నవ్వి – ‘‘ఇంటి కోసం.’’ అన్నాడు. శారద చేతిలో ఉన్న చెంచాతో అతని భుజం మీద మెల్లగా కొట్టింది నవ్వుతూ. ఆ నవ్వు కొత్తది కాదు. ముప్పై ఏళ్లుగా అదే నవ్వు. ఆమె నాలుగు కప్పుల్లో కాఫీ పోసింది. ఐదవ కప్పు ఖాళీ.
* * *
రమణారావు పేపర్ విప్పాడు. కానీ చదవడం లేదు. ఇంట్లోంచి వచ్చే శబ్దాలను వింటున్నాడు. మెట్ల మీద కొడుకు అనిరుధ్ అడుగుల చప్పుడు. వంటగదిలో గిన్నెల చప్పుడు. బాత్రూమ్ తలుపువ•సిన శబ్దం. ఓ వ•లనుంచి వినిపించే బీప్ బీప్ శబ్దం. ఇవి వినిపించని రోజు ఇల్లు అస్వస్థతకు గురైనట్టుగా అనిపించేది.
కోడలు మీరా టిఫిన్ డబ్బాలు సర్దుతూ – ‘‘మామయ్య గారూ… ఈ ఆదివారం ఒక రెసిడెన్షియల్ కాప్స్యూల్ చూడడానికి వెళ్దామనుకుంటున్నాం.’’ అంది.
రమణారావు ఎందుకు అన్నట్టుగా చూశాడు.
‘‘ఈ ఇల్లు చాలా పెద్దది. పాతది కూడా. చాలా ఖర్చవుతోంది.’’
రమణారావు నెమ్మదిగా లేచి వరండాలోకి వెళ్లి గోడ మీద చేతిని ఆనించి మీరాను అడిగాడు – ‘‘ఒక ఇంటి వయసు ఎంత?.’’
ఆమె నవ్వుతూ అడిగింది ‘‘మనుషుల్లా ఇళ్లకూ వయసు ఉంటుందా?’’
‘‘ఉంటుంది కదా .’’
‘‘ఎంత?’’
‘‘అందులో నవ్వులు వినిపించినన్ని సంవత్సరాలంత.’’
ఆమె మౌనంగా ఉండిపోయింది. మామగారు ఇలా మాట్లాడడం అందరికీ అలవాటే. అతను గోడ మీద ఒక పెన్సిల్ గీత చూపించాడు.
‘‘దీన్ని చూశావా?. అనిరుధ్ మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన ఏడాది.’’ ‘‘ మరో గీత చూపిస్తూ ‘‘ఇది నందిని పదో తరగతి పాసైన రోజు.’’ – ‘‘ఇది…’’ అతను కాసేపు ఆగాడు. – ‘‘.నీ పెళ్లి తర్వాత మొదటిసారి ఈ ఇంట్లో దీపావళి జరుపుకున్న సంవత్సరం.’’
‘‘అనిరుధ్… ఈ గోడను చూడు. ఏం కనిపిస్తోంది?’’ అక్కడే ఉన్న అనిరుధ్ ను అడిగాడు రమణారావు.
‘‘రంగు వెలిసిపోయింది, కొన్ని గీతలు కనిపిస్తున్నాయి.’’
‘‘నాకు మాత్రం మీ బాల్యం కనిపిస్తోంది. ఒక్కో గీత ఒక్కో సందర్బం, ఇది నువ్వు సైకిల్ తొక్కి పడిపోయిన రోజు, ఇది నందిని మొదటిసారి ఉద్యోగానికి వెళ్లిన ఉదయం , ‘‘ ఇది.’’ అతని గొంతు కాస్త బరువెక్కింది. ‘‘…అమ్మ మొదటిసారి ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన రోజు.’’….ఎవరూ మాట్లాడలేదు.
‘‘ఇవన్నీ మీకు ఎలా గుర్తున్నాయి?’’
‘‘నాకు కాదు. ఈ గోడలకు గుర్తున్నాయి’’ అన్నాడు రమణారావు.
‘‘గోడలు మైసీలియంతో తయారవుతాయి. కానీ ఇంటిని మాత్రం సందర్బాలతో అల్లుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నంతకాలం ఇల్లొక గడియారం. వాళ్లు వెళ్లిపోయాక గడియారం ఉంటుంది. సమయం ఉండదు.’’ మళ్లీ అన్నాడు రమణారావు.
‘‘ఇంకా బతికే ఉన్నాం. అప్పుడే మన గురించి గతకాలంలో మాట్లాడుతున్నారేంటి మామయ్యా?’’
‘‘వయసొచ్చాక ప్రతి మనిషీ తనను తాను గతంలోనే చూసుకుంటాడమ్మా.
* * *
మధ్యాహ్నానికి కూతురు నందిని వచ్చింది. గుమ్మంలోకి అడుగుపెడుతూ ‘‘అమ్మా!’’ అని పిలిచింది.
వంటగదిలోనుంచి శారద చేతులు కొంగుకు తుడుచుకుంటూ వస్తూనే ‘‘తిన్నావా?’’ అని అడిగింది.
‘‘లోపలికి రాగానే అదే ప్రశ్న.’’
‘‘అది అమ్మల రాజ్యాంగం.’’
నందిని నవ్వి ఆమెను కౌగిలించుకుంది. అల్లుడు విక్రమ్ వెనకే వచ్చాడు. రమణా రావు లేచి అతనితో చేయి కలిపాడు.
* * *
కొద్ది సేపటి తరవాత డైనింగ్ టేబుల్ మీద నందిని ‘‘నాన్నా…నీకు ఈ ఇంట్లో ఏది ఎక్కువ ఇష్టం?’’ అని అడిగింది.
ఈ ప్రశ్న దేనికి ఉపోద్ఘాతమో రమణారావుకు తెలుసు. రమణారావు సమాధానం చెప్పలేదు. చెట్టు వైపు చూశాడు. ఊయల వైపు చూశాడు. తలుపు గడియ వైపు చూశాడు.
చివరకు.. ‘‘ఎదురు చూడటం.’’ అన్నాడు.
‘‘ఎదురు చూడడం అంటే ?’’
‘‘ఎవరైనా వచ్చే వరకు మనలో ఉండే ఖాళీ. ఏ ఇంట్లోనైనా ప్రతి వస్తువు ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంది తలుపు? ఎవరైనా తట్టాలని. కుర్చీ? ఎవరైనా కూర్చోవాలనీ డైనింగ్ టేబుల్? అందరూ ఒకేసారి భోజనం చేయాలనీ.’’
‘‘మరి… అయిదవ కప్పు?’’ అంది నందిని చిలిపిగా.
‘‘ అదే కదా ఎదురు చూపు ‘‘ అన్నాడు రమణా రావు చిరునవ్వుతో.
‘‘మంచి కుటుంబాల్లో దేనికీ కొరత ఉండదు…మౌనం కూడా మాటలు నేర్చుకుంటుంది.’’ అన్నాడు రమణా రావు.
వరండాలో గాలి పల్చగా వీచింది. డైనింగ్ టేబుల్ మీద అయిదవ కప్పు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అది ఖాళీగా ఉందని ఇంట్లో ఎవరూ ఆశ్చర్యపడలేదు. అది కూడా ఈ ఇంటి అలవాట్లలో ఒకటైపోయింది.
* * *
మధ్యాహ్నం భోజనం ముగిసాక ఏ మధ్యతరగతి ఇంట్లో అయినా సహజంగా అలుముకునే సోమరితనం అక్కడా పరుచుకుంది. అందరూ ఒక్క దగ్గర చేరారు. నందిని హాల్లో కిటికీలు తెరవడంతో బయట నుంచి గాలి తోసుకొచ్చింది. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ కొద్దిగా కదిలింది. దాన్నే చూస్తూ రమణా రావు అన్నాడు-
‘‘ఈ ఇంట్లో గాలి కూడా దారి తప్పదు..ముప్పై ఏళ్లుగా ఇదే కిటికీ..ఇదే దారి. అలవాటైపోయింది.’’
విక్రమ్ నవ్వాడు – ‘‘ గాలికి కూడా అలవాట్లు ఉంటాయా?’’
‘‘మనకున్నవన్నీ ప్రకృతి దగ్గర నుంచే వచ్చాయి బాబూ.’’.
ఇదే అవకాశం అని విక్రమ్ మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘మామయ్య గారూ …ఈ ఇల్లు అమ్మేద్దాం.’’
శారద చేతి కదలిక ఒక్క క్షణం ఆగింది. మీరా తలదించుకుంది. నందిని ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణ ఎప్పుడో ఒకరోజు తప్పదని అందరికీ తెలుసు.
‘‘ఎందుకు?’’ రమణారావు ప్రశాంతంగా అడిగాడు.
‘‘ఈ ఇంటికి. రిపేర్లు, టాక్సేషన్ అన్నీ పెరుగుతున్నాయి. కొత్త కవ్యనిటీ స్పేస్ లో లిఫ్ట్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ రోడ్లున్నాయి. వర్చువల్ షాపింగ్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ మెడికల్ •••నిట్ చూపుడువేలుకు అందుబాటులో ఉంటుంది.’’
రమణారావు కొద్దిసేపు మౌనం తర్వాత అడిగాడు. ‘‘అక్కడ లేనిది ఈ ఇంట్లో ఏమీ లేదంటావా ?’’
విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు . ‘‘ అక్కడంతా సౌకర్యం.’’ మీరా మెల్లగా గొణిగినట్టు అంది.
‘‘సౌకర్యం…’’ రమణా రావు ఆ పదాన్ని నెమ్మదిగా మళ్లీ పలికాడు. ‘‘మనుషులు సౌకర్యం కోసం ఇళ్లు మారతారు. కానీ… ఇళ్లు మాత్రం మనుషుల కోసం ఎప్పుడూ మారవు. గోడలు వాన నుంచి కాపాడతాయి. కప్పు ఎండ నుంచి కాపాడుతుంది. కానీ… ఇల్లు ఇంకో పని కూడా చేస్తుంది. ‘‘ అని ఒక నిముషం ఆగాడు. ‘‘మనం ఒక కుటుంబమని ప్రతిక్షణం గుర్తు చేస్తుంది.’’
‘‘ పెళ్లయిన కొత్తలో అసలు మాట్లాడక పోయేవారు, ఇదిగో ఇప్పుడేమో ఇలా మాట్లాడతారు, ఈయనను ఎవరైనా బ్రెయిన్ హ్యాకర్స్‌కు రహస్యంగా అప్పగించాలి ‘‘ అంది శారద వాతావరణాన్ని తేలికచేయాలని.
అయినా రమణారావు వదిలిపెట్ట లేదు. బ్రెయిన్ హ్యాకర్స్కా, హార్ట్ హ్యాకర్స్కా ‘‘ అన్నాడు నవుతూ.
అందరూ హాల్ లోంచి వెళ్లిపోయాక ‘‘అనిరుధ్.. సెంట్రల్ సిస్టమ్ బాటరీ రీ చార్జ్ చెయ్’’ అన్నాడు రమణారావు మెల్లిగా.
* * *
ఆ రాత్రి రమణారావు ఒక్కడే హాల్లోకి వచ్చాడు. టేబుల్ మీద ఇంకా అయిదవ కప్పు అలాగే ఉంది. అది చేతిలోకి తీసుకున్నాడు.
పక్కనే పాత ఫోటో ఆల్బమ్ ఉంది. ఆల్బమ్ తెరిచి ఓ ఖాళీ పేజీ దగ్గర ఆగిపోయాడు.
‘‘నువ్వెవరు?’’ గుసగుసగా అడిగాడు. సమాధానం రాలేదు. బయట గాలి వీచింది. ఒక ఎండిన మామిడి ఆకు కిటికీలోంచి లోపలికి వచ్చి ఆల్బమ్ మీద పడింది. రమణారావు ఆ ఆకును తీసి ఆల్బమ్‌లో ఆ ఖాళీ పేజీ మధ్య పెట్టాడు.
‘‘ఫోటో లేకపోతే గుర్తుగా ఇది ఉండనీ.’’ అని ఆల్బమ్ వంపేశాడు.
ఆ ఆకుకు తెలియదు. ఆ రాత్రి నుంచి తను ఒక కుటుంబం దాచుకున్న చివరి జ్ఞాపకంగా మారబోతోందని.
ఆ గది వ•లన ఉన్న ఎర్ర దీపం బ్లింక్ అవడం గమనించిన రమణారావు అక్కడికి వెళ్లి ఓ స్విచ్ ఆన్ చేసాడు. ఎరుపు కాస్తా ఆకుపచ్చగా మారింది.
* * *
మరుసటి రోజు ఉదయం అందరూ బ్రేక్‌ఫాస్ట్ కు కూర్చున్నారు. రమణారావు బీరువాలోంచి కవర్ బయటకు తీసాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. లోపల ఒక కాగితం. అందులో ఒకే ఒక వాక్యం. మెమరీ స్థిరత్వం : 18%.
శారదకేం అర్థం కాలేదు. ‘‘ఇదేంటి?’’ అడిగింది.
రమణారావు చాలాసేపు మౌనం తరవాత ‘‘నా తాజా డిజిటల్ చార్ట్ ‘‘ అన్నాడు
తర్వాత ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ ‘‘నిన్న రాత్రి నేను అడిగిన ప్రశ్న గుర్తుందా?’’ అన్నాడు.
‘‘ఏది?’’
‘‘ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే?’’ అని. ‘‘ అది సరదాగా అడగలేదు.’’…..గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది….’’నా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి.’’
శారద నవ్వడానికి ప్రయత్నించింది.
‘‘వయసు పెరిగితే అంతే…’’
‘‘వయసు వల్ల కాదు. కాలం వల్ల.’’
‘‘కాలం అంటే వయసే కదా .’’
రమణారావు సమాధానం చెప్పకుండా కిటికీ బయటి శూన్యంలోకి చూసాడు. ‘‘యాభై ఏళ్ల క్రితం…’’ అతను ఆగాడు. ‘‘కాదు… ముప్పై ఏళ్ల క్రితం అనాలి. మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు.’’
‘‘ఏమిటది?’’
‘‘మనం అందరం ఒకే సంవత్సరంలోనే పుట్టాం.’’
‘‘అదెలా సాధ్యం మామయ్యగారూ.’’ మీరా నవ్వింది.
‘‘లేదు. మీకు తెలియదు, మీకు తెలియనిది చెబుతున్నాను.’’
అతని గొంతు మారింది. అది ఒక వృద్ధుడి గొంతులా లేదు. ఏదో యంత్రం తనలోని పాత రికార్డును ప్లే చేస్తున్న గరగర శబ్దం ఉంది.
‘‘సిస్టమ్ లాగ్… ఫ్యామిలీ •••నిట్ 327… ఇన్ స్టలేషన్ డేట్…17 ఆగస్టు 2026…రిబూటింగ్ డేట్ 16 ఆగస్టు 2056’’
గదిలో గాలి కూడా కదల్లేదు. శారద కళ్లు పెద్దవయ్యాయి. ఆమె చేతిలోంచి గ్లాసు జారిపోయింది. ఇంటి గోడలు నెమ్మదిగా మారడం మొదలైంది. తెల్లని సున్నం వెనక్కి జారిపోయింది. దాని కింద మెరిసే లోహపు పొరలు కనిపించాయి. గోడ గడియారం స్థానంలో పారదర్శక డేటా వలయం వెలిగింది. కిటికీ బయట చెట్లు లేవు. వాటి స్థానంలో ఆకాశాన్ని తాకే పవర్ పోల్స్. పాత వీధి లేదు. నిశ్శబ్దంగా కదులుతున్న ఆటోమేటెడ్ వాహనాలు. ఆకాశంలో డ్రోన్లు.
శారద తన చేతులను చూసుకుంది. చర్మం కింద క్షణకాలం వెండి తీగలు మెరిపించాయి. మళ్లీ చర్మమే కనిపించింది.
‘‘మనం మనుషులం కాదు.’’ అన్నాడు రమణారావు.
‘‘నాకు… తెలుసు.’’ అనిరుధ్ గద్గదంగా.
శారద ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. ‘‘ఏం తెలుసు?’’
‘‘నాకు… ఐదేళ్ల క్రితమే నాన్న చెప్పారు.’’
‘‘ఏమిటది నాకెందుకు చెప్పలేదు?’’
‘‘నీ ఎమోషనల్ మ్యాట్రిక్స్ దెబ్బతింటుందని నీకు చెప్పలేదు, మనం వ•డో తరం కుటుంబ హ్యూమనాయిడ్లము.’’
రమణారావు చెప్పడం కొనసాగించాడు. ‘‘2026లో ఒక ప్రయోగం చేశారు. యంత్రాలు విశ్లేషించడం నే్చ•కున్నాయి , ఆలోచించడం నేర్చుకున్నాయి. స్రుజననూ నేర్చుకున్నాయి. కానీ…’’ అతను శారద వైపు చూశాడు. ‘‘ కోల్పోవడం అనే బాధ మాత్రం
నేర్చుకోలేకపోయాయి.’’ గదిలో ఎవరికీ మాట పెగలడం లేదు.
‘‘ఆ యంత్రాల మెమరీలు బ్యాకప్ అవుతాయి. యాక్ససరీస్ మారతాయి. సర్క్యూట్లు మారతాయి. అయితే ఒక మాన్యుఫాక్చర్ ఎర్రర్ వచ్చింది. ప్రేమను నిల్వ చేయగలిగారు కానీ ప్రేమ కోసం ఎదురుచూడడాన్ని మాత్రం నిర్మించలేకపోయారు. ఆ లోటు పూడ్చడానికి వాళ్లు పాత మానవ కుటుంబాల లక్షల గంటల సంభాషణలను యంత్రాలకు ఫీడ్ చేసారు. తండ్రి ఎలా మౌనంగా బాధపడతాడో, తల్లి ఎలా అందరినీ ఒకే టేబుల్ దగ్గరికి పిలుస్తుందో, కొడుకు ఎలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తాడో, కూతురు ఎలా రెండు ఇళ్ల మధ్య చీలిపోతుందో, అల్లుడు ఎలా పరాయి ఇంటిని తనదిగా చేసుకుంటాడో అన్నీ నేర్పించారు. కానీ ప్రయోగం చివర్లో ఒక విచిత్రం జరిగింది. ఒక హ్యూమనాయిడ్ తన భాగస్వామి ఆఫ్‌లైన్ అయిన తర్వాత కూడా ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతూనే ఉంది. సిస్టమ్ దాన్ని లోపంగా నమోదు చేసింది. పరిశోధకులు మాత్రం దానికి మరో పేరు పెట్టారు.’’
కొంచెం ఆగి మళ్లీ అన్నాడు… ‘‘కుటుంబం.’’
‘‘ రక్తం లేకుండా బంధాలు ఏర్పడొచ్చు. డేటా లేకుండా జ్ఞాపకాలు నిలవవచ్చు. కానీ ఎవరూ వినకపోయినా ప్రతిరోజూ ఒకరితో ఒకరు మాట్లాడాలనిపించే స్థితి.. అది మనిషి కనిపెట్టిన గొప్ప సాంకేతికత కంటే ఎక్కువ. మనిషి వదిలి వెళ్లిన గొప్ప వారసత్వం. అప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని కుటుంబాలను నిర్మించారు. భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. రక్తసంబంధాలు కాదు. అనుభవ సంబంధాలు. రోజూ కలిసి జీవిస్తే ప్రేమ పుడుతుందా లేదా అని తెలుసుకోవడం ఆ ప్రయోగం లక్ష్యం, అందులో భాగమే మనం.’’
‘‘అయితే మన జ్ఞాపకాలు?’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద.
‘‘ప్రతి పదేళ్లకోసారి అప్డేట్. మెమరీ ఫుల్ అయి కొత్త అనుభవాలకు స్పేస్ కల్పించడానికి కొన్ని చెరిపేస్తారు. కొన్ని ఉంచుతారు.’’
‘‘పాతవి అలానే ఉంటాయా.’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద.
‘‘దాదాపుగా ‘‘
‘‘దాదాపుగా అంటే….. ప్రేమ , దాదాపు ప్రేమ ఒకటేనా’’
‘‘ఏమో’’
‘‘మన పెళ్లి? మన గొడవలు? మన పిల్లలు?’’
‘‘అన్నీ…జరిగాయి , కానీ…ప్రతిసారి కొత్తగా.’’ రమణారావు ఆమె మాట పూర్తిచేశాడు.
ఆమె ఏడవడం మొదలుపెట్టింది.
‘‘ ఇక్కడ ఏదీ మనది కాదు, మనం ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు, ఎవరైనా అథాటున రావచ్చు..అందుకే అయిదో కప్పు ‘‘
అన్నాడు రమణారావు.
‘‘నాన్నా..సెంట్రల్ సిస్టమ్ నుంచి మెసేజ్.’’
రమణారావు టేబుల్ మీద ఉన్న చిన్న పరికరాన్ని తీసుకుని చదివాడు.
‘‘ యూనిట్–327 ….మెమరీ డిగ్రడేషన్ పూర్తయే దశలో ఉంది. ఫ్యామిలీ •••నిట్ రీసెట్‌కు అనుమతి ఇవ్వండి.’’
శారద భయంగా చూసింది.’’రీసెట్ అంటే?’’
‘‘మనం ఒకరినొకరు గుర్తుపట్టం.’’
‘‘మళ్లీ మొదటి రోజు నుంచి.’’ శారద ఆందోళనగా రమణారావు చేయి పట్టుకుని ‘‘అంగీకరించొద్దు.’’ అంది.
‘‘జ్ఞాపకాలు పోతే…’’ అడిగింది శారద.
‘‘నువ్వు నువ్వుగా ఉండవు.’’ అనిరుధ్ సమాధానం.
రమణారావు చాలాసేపు ఆ సందేశాన్ని చూస్తూ చివరకు తన చూపుడువేలి కొసను ‘DENY•’ మీద ఉంచాడు.
అనిరుధ్ ఆశ్చర్యపోయాడు. ‘‘నాన్నా! అలా చేస్తే నీ మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఇంకొన్ని గంటల్లో నువ్వు డెడ్ •••నిట్ అవుతావు.’’
‘‘తెలుసు.’’ రమణారావు శారద వైపు తిరిగాడు. ‘‘ఈసారి నేను ఆమెను మర్చిపోవాలనుకోవడం లేదు. మరణమైనా పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం డియాక్టివేట్ చేయొద్దనుకుంటున్నాను.’’
బయట వర్షం మొదలైంది. నిజమైన వర్షం కాదు. నగర వాతావరణ వ్యవస్థ సృష్టించిన క్లవుడ్ డిస్ట్రిబ్యూషన్. కానీ కిటికీ అద్దంపై జారుతున్న ప్రతి చుక్క నిజంగానే కనిపించింది. శారద అతని భుజంపై తల ఆనించింది.
‘‘రామూ…..ఈ క్షణంలో నీకు నా మీద ఉన్నది… ప్రేమా, పోగ్రామా?’’
రమణారావు వెంటనే సమాధానం చెప్పలేదు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అంది.’’అది పోగ్రామ్ అయితే…ప్రపంచంలోని ప్రేమంతా ఒక పోగ్రామే.’’
‘‘కాదు, ప్రేమ అనేది ఎవరో మనలో రాసిన పోగ్రామ్ కాదు. మనమే ఒకరి కోసం ఒకరం మళ్లీ మళ్లీ రాసుకునే పోగ్రామ్.’’ అన్నాడు రమణారావు.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. సెంట్రల్ సర్వర్ నుంచి చివరి హెచ్చరిక ఫ్లాష్ అయింది.
RESET PENDING… అని.
కొన్ని క్షణాలు… ఆ తర్వాత అది మారిపోయింది.
TIMED OUT , REQUEST REJECTED. ….FAMILY UNIT–327. LEARNING CONTINUES.
ఆ రాత్రి ఒక యంత్ర కుటుంబం మరణాన్ని ఎంచుకుంది.
ఎందుకంటే, జ్ఞాపకాలు చెరిగిపోయి నిలిచే యాంత్రిక ప్రేమ కంటే, జ్ఞాపకాలతో ముగిసిపోయే ప్రేమే వారికి మానవీయంగా అనిపించింది.
‘‘నొప్పి లేకపోతే ప్రేమకు ఉనికి ఏముంటుంది.
* * *
ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దం. భర్త, భార్య ఎదురెదురుగా కూర్చున్నారు.
‘‘పిల్లలు మళ్లీ ఎప్పుడు వస్తారో…’’ అంది ఆమె.
‘‘ఇక రారేమో.’’ అన్నాడతను. ఆమె అతని చేతిని భయంగా, ఆప్యాయంగా పట్టుకుంది. అతను కూడా అలాగే పట్టుకున్నాడు. కొంతసేపటికి ఆమె తల అతని భుజంపై వాలింది. ఇంటి పెరట్లో మిగిలిన ఒక చిన్న చెట్టు నుంచి కొన్ని ఆకులు రాలుతూనే ఉన్నాయి.
ఒక్కో ఆకు నేలను తాకినప్పుడల్లా ఒక జ్ఞాపకం నిశ్శబ్దంగా మెరిసింది.
మొదటి నవ్వు. మొదటి గొడవ. మొదటి క్షమాపణ. మొదటి పండుగ. ఆ చెట్టు కింద గడిచిన జీవితమంతా.
* * *
ఆ రాత్రి ఆ ఇంటిని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన ఇ – డిమాలిషన్ టీం ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటోంది.
‘‘ఫ్యామిలీ •••నిట్ వీ-2056. •••నిట్ స్పందించడం లేదు. మెమరీ ట్రీ సామర్థ్యం నిండిపోయింది. కొత్త కోర్కు ట్రాన్స్ఫర్ చేయాలా?’’
పెద్ద ఇంజనీర్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత ‘‘వద్దు.’’ అన్నాడు.
‘‘ఎందుకు సర్?’’
‘‘ప్రేమను కాపీ పేస్ట్ చేయగలమని అనుకున్నాం. జ్ఞాపకాలను బ్యాకప్ చేయగలమని నిరూపించాం. కుటుంబాన్ని కూడా తయారు చేశామని గర్వపడ్డాం. కానీ… ఒకరిని కోల్పోయాక కూడా వారి పక్కనే కూర్చొని వారితోనే ఉండిపోవాలనే ఈ విచిత్రమైన అలవాటును…మనం పోగ్రామ్ చేయలేకపోయాం. కానీ ఆ క్షణంలో మనిషిగా ఉన్నది వారి శరీరం కాదు. వాళ్లు ఒకరినొకరు విడిచిపోలేకపోవడమే. ఆ ఇద్దరి ఛాతీల్లో హృదయాలులేవు. నరాలులేవు. నెత్తురే లేదు. వీళ్లు ముప్పయి ఏళ్లుగా ఒకే కుటుంబంలా జీవించిన హ్యూమనాయిడ్ దంపతులు. అదొక హ్యూమనాయిడ్ కుటుంబం. ఇటువంటి కుటుంబాలు కొన్ని ల••లున్నాయి. వాళ్లు ఇ – గైనా పిగ్ లనే విషయం వాళ్లలో చాలా మందికి తెలియదు.’’
‘‘ ఈ ప్రయోగం ఏ ఫలితాన్నిఆశిస్తోంది.’’
‘‘ కుటుంబం అనే అంతుపట్టని విషయాన్ని పోగ్రామింగ్ కోడ్ గా రాయడం . ‘‘
‘‘ అంటే ‘‘
‘‘ కుటుంబం అనే భావనను హ్యూమనాయిడ్లకు నేర్పడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే అందుకోసం ప్రయోగంగా రూపొందించిన హ్యూమనాయిడ్ కుటుంబాలు కుటుంబం అనే భావనను అర్దం చేసుకోవడానికి బదులు అనుభవించడం మొదలు పెట్టాయి. ఏ అంశాన్నయినా డీకోడ్ చేసి పోగ్రామ్ గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని అర్దం చేసుకోవాలి. ఈ హ్యూమనాయిడ్ కుటుంబాల రిపోర్ట్ లు కుటుంబం అంటే అనుభవమే అని చెపుతున్నాయి తప్ప డీకోడింగ్ పాటర్న్ చెప్పడం లేదు. కుటుంబం అనగా ఫలానా అని అర్దం చెప్పే నిఘంటువులూ లేవు పోగ్రాం చేయడానికి లాగరిథవ్స లేవు. అనగనగా అని చెప్పుకోవడంలోనే తెలియని, అర్దంకాని వివరణ ఉంది. అందుకే అ అనుభవాన్ని ఆస్వాదించడానికే కొన్ని వందల హ్యూమనాయిడ్ కుటుంబాలు ఇలా మరణాన్ని కూడా ఎంచుకుంటున్నాయి. అదే ప్రాజెక్టుకు పెద్ద తలనొప్పి. ‘‘
‘‘ ఇన్ని ప్రయోగాలు, ఇన్ని హ్యూమనాయిడ్ కుటుంబాలు, అయినా ముప్పయి ఏళ్లుగా కుటుంబాన్ని డీకోడ్ చే••లేకపోయారా .’’
‘‘అవును. ఇంకా ఎంతకాలమో ఏమో.’’
‘‘ కుటుంబం డీకోడ్ అయి, పోగ్రామ్‌గా కన్వర్ట్ అయితే ఏం జరుగుతుంది? ‘‘
‘‘ బంధాలు డాటా టైప్స్ అవుతాయి. పిల్లల పెంపకం ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కుటుంబం అనేది జీవన కావ్యంలా కాక ఆపరేటింగ్ సిస్టమ్ గా మారుతుంది. ఖచ్చితత్వం పెరిగి అసంపూర్ణతలోని అందాన్ని కోల్పోతాం.’’
కాలింగ్ బెల్ మోగడంతో ఈ సమయంలో ఎవరా! అనుకుంటూ తలుపు తెరిచిన నాకు ఎదురుగా కనిపించింది అరవింద.
తనను ఇంట్లోకి ఆహ్వానించి, డైనింగ్ టేబుల్ పై ఉన్న ఆపిల్ జ్యూస్ గ్లాసులోకి ఒంపి అందించాను. నెమ్మదిగా ఆస్వాదిస్తూ అది, టేబుల్ పై ఉన్న కూరగాయలను ఫ్రిజ్‌లో సర్దుతూ నేను ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ….
అరవింద, నేను చిన్ననాటి స్నేహితులం. రెండు కుటుంబాల నడుమ బంధుత్వం కూడా ఉన్నప్పటికీ, బంధం కంటే స్నేహమే మా మధ్య ఎక్కువగా గుబాళించేది. ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరాలు మాత్రమే వేరుగానీ ఆత్మ ఒక్కటే.
డ్రాయింగ్ రూమ్ లో ఓ వారగా వేసి ఉన్న టేబుల్ పై ఒక చీర, రంగులు కనిపించడంతో సరాసరి అక్కడికే వెళ్లి, కుంచెను చేతిలోకి తీసుకుంది.
చీరలపై అందమైన పెయింటింగ్స్ వేయడంలో అది సిద్ధహస్తురాలు. రంగులను కలపడంలో కూడా చాలా నైపుణ్యం ఉంది. రంగులను కలిపేసి చకచకా పెయింటింగ్ చేయడం మొదలెట్టింది. చూస్తూ ఉండగానే చీర అంచులపై లతలు, పువ్వులు పరిచేసింది.
ప్రకృతిలోని అందాన్నంతా చీరపై మెరిపించినా, ఎందుకో మనసు మాత్రం అంత ప్రశాంతంగా ఉన్నట్టు నాకనిపించలేదు.
అదే విషయం కనుక్కుందామని”ఏమైంది అదోలా ఉన్నావు? సమస్య ఇంట్లోనా, ఒంట్లోనా?” అంటూ మెల్లగా మాటల్లోకి దింపాను. ముక్తసరిగా సమాధానాలిస్తూ వెళ్ళిందేతప్ప, అసలు విషయానికి రాలేదు.
రెట్టించి అడిగేసరికి ” ఏమీలేదే! ఎప్పటినుండో నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ వీలు కావడం లేదు” అంది.
అంచుల్లో వేసిన రంగులు కాకుండా వేరే రంగులు కొంగుపై వేస్తూ. చీరపై రంగులు మారుతున్నట్టే దాని మొహంలో కూడా రంగులు మారడాన్ని గమనించాను.
మెల్లిగా చెప్పడం మొదలెట్టింది”మా అత్తవారింటి వైపు బంధువుల పెళ్లికి వెళ్లాను. పరిచయస్తు లందరినీ పలకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను” అంటూ ఆగిపోయింది. దేనికోసమో తీవ్రంగా బాధపడుతున్నట్టు అర్థమైనా మధ్యలో ఆపడం ఎందుకని మౌనంగా వింటూ ఉన్నాను.
కాస్త తమాయించుకుని మళ్లీ విషయంలోకి వచ్చింది. “చాలాకాలం తరువాత బంధువులు,మిత్రులు పెద్ద సంఖ్యలో ఎదురుపడటంతో పలుకరింపులు, క్షేమమాచారాలతో కళ్యాణమంటపం చాలా సందడిగా ఉంది”. కుంచెనూ, రంగులను పక్కనపెట్టి, చీర పైని పెయింటింగును మొదలంటా సరిచూస్తూ ఉంది. పెయింటింగ్ విషయంలో మనసు సమాధాన పడినట్టుందేమో! సంభాషణకు కొనసాగింపుగా “అందరినీ పలుకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి స్వచ్ఛంగా నవ్వుతూ పలుకరించబోయాడు. అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి. కానీ పలుకరించాలన్న అతని ప్రయత్నాన్ని నేను గ్రహించలేకపోయాను” అన్నది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కాస్త తేరుకుని, “గుంపులో ఉన్నప్పుడు పరధ్యాసగా ఉంటే, ఇటువంటి పరిస్థితులే ఎదురౌతాయి, కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది” అన్నాను.
ఔనన్నట్టుగా తలూపి మళ్లీ తనే చెప్పడం మొదలెట్టింది. “అందరి వద్ద సెలవు తీసుకొని ఇంటికి చేరాను. నాలుగు రోజులు గడిచాక గానీ నా బుర్రలో లైట్ వెలుగలేదు. నావల్ల జరిగిన పొరపాటు ఎంత పెద్దదో అప్పుడు తెలిసింది. అప్పటి నుండి ఈ క్షణం వరకూ మనశ్శాంతి లేకుండా గడుపుతున్నానంటూ బాధపడింది.
” ఫోన్లో మాట్లాడి సవరించుకొని ఉంటే బాగుండేదేమో” అన్నాను.
” బంధుత్వం ఉన్నప్పటికీ, ఒకటి రెండుసార్లు చూడటమే తప్ప, అంతగా పరిచయంలేని వ్యక్తికి పరిస్థితిని వివరించడం ఎలా సాధ్యం?” అన్నది.
” ఇంట్లో ఎవరికైనా చెప్పావా? ” అడిగాను.
ఇంట్లో చెప్పడం, ” ఇలా అయితే మానవ సంబంధాలన్నీ దెబ్బ తినడం ఖాయం అంటూ తల వాచే ట్లుగా చివాట్లు తినడం అన్నీ అయిపోయాయ”ని చెప్పింది.
ఇక్కడ అరవింద గురించి చెప్పాల్సిన విషయం కొంత ఉంది. అది చాలా తెలివైన విద్యార్థిని, తిరుగులేని విజేత. పరిస్థితులు ఏవైతేనేం శిఖరాగ్రానికి చేరుకోవాలనే తన కల ఆఖరి మెట్టు వద్ద ఆగిపోయింది. గుండెలో గూడు కట్టుకుని ఉన్న ఆ వేదనకు, ఆవేదనకు పర్యవసానమే ఈ ప్రవర్తన అన్న విషయం తెలిసిన వ్యక్తిని నేను తప్ప బహుశా ఇంకెవరూ ఉండరేమో!
సాయంత్రం కాగానే అరవిందను వాళ్ళింట్లో దింపి, ఇంటికి వచ్చి సోఫాలో చేరగిలబడ్డాను. తను పడుతున్న బాధ తెలిశాక నా ఆలోచనలు పాతికేళ్ల వెనక్కి వెళ్ళాయి.
********
అక్కలందరికీ పెళ్ళిళ్ళై అత్తవారిళ్లకు వెళ్లడంతో ఇంట్లో అమ్మ,నాన్న, నేను ముగ్గురమే మిగిలాం. శరన్నవరాత్రులు సమీపిస్తుండడంతో పూజా ద్రవ్యాల కోసం నాన్నతో కలిసి ఇంటి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాను.
అవసరమైన సరుకులు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉన్న క్రమంలో అనుకోకుండా నాన్నా , నేనూ చెరో పక్కకు వెళ్లడం జరిగింది.
సుగంధ ద్రవ్యాలను సరి చూసుకుంటూ అప్రయత్నంగా తలెత్తిన నాకు, చాట నిండా ధాన్యంతో, దాదాపు ఐదు పదుల వయసులోని ఒక స్త్రీ నిలబడి ఉండటం కనిపించింది.
ఆమెను పోల్చుకోవడానికి అంతగా సమయం పట్టని నేను నవ్వుతూ”ఆంటీ బావున్నారా?” అంటూ పలుకరించాను. దానికామె నుండి ఏ విధమైన సమాధానం రాలేదు. ఎందుకో అర్థం కాకపోయినా మరుసటి క్షణంలోనే “అంటీ మీరు నన్ను గుర్తుపట్టడం లేనట్టుంది?” అంటూ తిరిగి ప్రశ్నించాను.
అయినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు. పుట్టి పెరిగిందంతా అక్కడే కావడం వల్ల పరిచయాలు కూడా ఎక్కువగానే ఉండేవి. నేను ప్రశ్నించడం, ఆమె సమాధాన మివ్వకపోవడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందరూ అలా మా ఇద్దర్ని మార్చి,మార్చి చూస్తూ ఉండడంతో కాస్త అసహనానికి లోనవడమే గాకుండా, ఒకింత అవమానం జరిగినట్లుగా కూడా భావించాను.
ఇంతలో నాన్న అక్కడికి రావడం, ఆమెను చూడగానే ” ఏమ్మా బావున్నావా తల్లీ! మీవారు, పిల్లలు అంతా క్షేమమేనా?” అని అడగడంతో, నాన్న వయసుకే గౌరవం ఇచ్చిందో లేక ఆ పలకరింపులోని ఆప్యాయతకే కట్టుబడిందో తెలియదుగానీ, ఇక తప్పదన్నట్టుగా ” అందరం బావున్నాం అన్నయ్యా” అంటూ అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా గబగబా లోపలికి వెళ్ళిపోయింది.
దేవీ నవరాత్రులు రెండు, మూడు రోజుల్లోకి వచ్చేస్తుండడంతో, పనులన్నీ చకచకా చేసుకుంటూనే ఉన్నానుగానీ, మనసు అవమాన భారంతో బరువెక్కుతూ ఉండేది.
ఆమెపై ఏ విధమైన కోపం లేకపోయినా, ఆవేశం రాకపోయినా, ఏదో బాధ మాత్రం మనసును తొలుస్తూ ఉండేది. పలుకరించకపోయి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉండేదాన్ని.
పిల్లల మనసును అంచనా వేయగలిగే శక్తి ఈ ప్రపంచంలో బహుశా ఒక్క కన్నతల్లికి మాత్రమే ఇచ్చాడనుకుంటా ఆ సృష్టికర్త. అన్యమనస్కంగా ఉండటానికి కారణమేమిటని ప్రశ్నించిన అమ్మకు “మొన్న నాన్నతో వెళ్ళినప్పుడు షాపులో శశికళ ఆంటీ కనిపించారమ్మా!” అంటూ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పేశాను.
దానికి సమాధానంగా అమ్మ “అయ్యో! నీ మనసు అంతగా బాధపడిందా తల్లీ, అందులో ఆమె తప్పేమీ లేదు. అసలు విషయం తెలిస్తే నువ్వింతగా బాధపడే దానివి కాదు” అంటూ ఆమె గురించిన కథ చెప్పడం మొదలు పెట్టింది.
“ఆమె అత్యంత సంపన్నుల ఇంటి కూతురు. తండ్రి గొప్ప రాజకీయవేత్త.చుట్టూ ఇరవై ఊళ్ళ వరకు మంచి పలుకుబడి ఉండేది” అని చెబుతూ ఉండగానే “ఐతే ఏంటమ్మా? దానికి ఈ విషయానికి ఏమిటి సంబంధం? అంటూ మధ్యలో కలగజేసుకుని ప్రశ్నించాను. పసుపుపచ్చ చేమంతులను మాల అల్లుతూ..
” నన్ను పూర్తిగా చెప్పనివ్వు. మధ్యలో ఆపితే విషయం ఎలా తెలుస్తుంది నీకు? అంటూ మళ్ళీ మొదలెట్టింది. “ఆమె చాలా అందంగా ఉండడమే కాకుండా చదువులో, పని పాటల్లో కూడా చురుకుగా ఉండేది. మంచి కుటుంబాల నుండి ఆమెను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామని తండ్రికి ప్రతిపాదనలు అందుతూ ఉండేవి “.
” ఆమె దేనికీ అభ్యంతరం చెప్పకపోయినా, తండ్రి మాత్రం రాజీ పడేవాడు కాదు. చాలా సమయం తీసుకుని, ఏరికోరి చివరికి చాలా మంచి ఇంటికి ఆమెను కోడలిగా పంపించాడు”.
“ఏంటమ్మా ఇంత పెద్ద కథ చెబుతున్నావు? మూడు ముక్కల్లో చెప్తే సరిపోతుంది కదా” అన్నాను. అసలే మనసు బరువెక్కి ఉన్న నాకు అంత పెద్ద కథ వినడం చాలా అసహనంగా అనిపించింది.
అమ్మ నవ్వుతూ “మూడు ముక్కల్లో చెబితే అది జీవితమెలా ఔతుంది? కాస్త ఓపికగా విను” అంది.
“ఆమె చాలా అణకువతో మెలిగి అందరికీ ప్రేమను పంచి, వారి నుండి కూడా తిరిగి పొందగలిగింది. భర్త కూడా చాలా సామ్యుడు, తెలివైనవాడే కానీ వ్యసనాలకు బానిసవడమే ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది”
“ఈలోపు నలుగురు ఆడపిల్లలకు తల్లి కావడం, అతని వ్యసనాలకు ఆస్తి హారతి
కర్పూరమవడం మాత్రమే గాకుండా, కాలేయం పూర్తిగా దెబ్బతిని మంచాన పడ్డాడు. ఇల్లు గడవడం కోసం షాపులో సరకులు శుభ్రపరచడాన్ని ఆదాయ మార్గంగా మలుచుకోవలసి వచ్చింది”
నాకు విషయం కొద్దికొద్దిగా అర్థమవడం మొదలైంది. అమ్మ మళ్లీ చెప్పడం మొదలెట్టింది.”నీ పలుకరింపుకు సమాధానం ఇవ్వకపోవడానికి అదే కారణం” అంది. ఈసారి తెల్ల మొహం వేయడం నా వంతయింది.
“అదేంటమ్మా! దానికీ దీనికీ ఏమిటి సంబంధం?” అన్నాను.
” సంబంధం ఎందుకు లేదు? పూలమ్మిన చోటే కట్టెల మ్మాల్సిన పరిస్థితి వస్తే, ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు”.
” నువ్వు ఒక్కదానివే కనిపించి ఉంటే, ఆమె నీతో తప్పకుండా మాట్లాడేది. పక్కన మీ నాన్న ఉండేసరికి ఆమె గుండె కలుక్కుమంది” అన్నది.
” నాన్నేం చేశారమ్మా, అంత ఆప్యాయంగా పలకరించారు కదా” అన్నాను పూలదండను
కృష్ణుడి మెడలో వేస్తూ…
నిజమే ” మీ నాన్న ప్రేమగానే పలుకరించారు, కానీ అతనొక ఉన్నతోద్యోగి కావడం వల్ల, అతనికి ఆ స్థితిలో ఎదురు పడటం ఆమె వల్లకాలేదు”.
“ఎవరి జీవితం వారిదే కదమ్మా, ఆంటీ కెదురైనవి కఠినమైన పరిస్థితులే కావచ్చు, కానీ అంత న్యూనత పడాల్సిన అవసరం ఏముంది?” అన్నాను.
“పుట్టిందీ,మెట్టిందీ రాచ కుటుంబాలే ఐనప్పటికీ సీతమ్మ, ద్రౌపది అడవులు పట్టుకుని వెళ్లలేదా?”, “వాళ్లకే తప్పనప్పుడు మామూలు మనుషులం మనదే ముందమ్మా!” అన్నాను ఎదురుగా ఉన్న గీతోపదేశం వాల్‌పోస్టర్‌ని చూస్తూ.
“వాళ్లు అవతార పురుషులు, అయోనిజలు. వాళ్లకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే ధైర్యం, స్థైర్యం ఉంటాయి, మనం మామూలు మనుషులం. మనకంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది?” అంది. అమ్మ విశ్లేషించే తీరుకు ఒకింత ఆశ్చర్యపోయాను.
********
రెండు నెలల తర్వాత అరవింద తో కలిసి మహాలక్ష్మి ఆలయానికి వెళ్లాను. ఇద్దరం మాట్లాడుకుంటూ ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే, దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న ఒక స్త్రీ కనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ”ఏమ్మా! బాగున్నావా? ఈ అమ్మాయి నీ స్నేహితురాలా? ఇద్దరూ కలిసి వచ్చినట్టున్నారు?”అంటూ కలివిడిగా మాట్లాడటం
మొదలెట్టింది. పరికించి చూస్తే తను శశికళ ఆంటీ. “బాగున్నానాంటీ, దర్శనం అయిపోయినట్టుంది” అంటూ నేను కూడా ఆప్యాయంగానే బదులిచ్చాను.
తలారా స్నానం చేసి, నూలు చీర కట్టుకొని ఉంది. మెడలో పసుపు తాడు, నల్లపూసలు తప్ప మరే ఆభరణాలూ లేవు. నుదుట రూపాయి కాసంత కుంకుమబొట్టు, తలలో పువ్వులు, పసుపు రాసిన పాదాలతో గుళ్లోకి వెళ్ళకముందే అమ్మవారు దర్శనమిచ్చిందా అన్నంత అందంగా ఉంది.
“సరేమ్మా, తొందరగా వెళ్ళండి. కాసేపయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది” అంటూ పురమాయించింది.
“మంచిదాంటీ, ఒకసారి మా ఇంటికి రండి”అన్నాను. పక్కనే తోపుడు బండిపై ఉన్న కొబ్బరికాయ, అరటి పండ్లు కొంటూ….
” తప్పకుండా వస్తానమ్మా, ఈ శ్రావణమాసం పూజల హడావిడి ఉంటుంది కదా, అది అయిపోగానే వస్తాను. నాకూ ఎప్పటినుండో అమ్మను కలవాలనే ఉంది. అడిగానని చెప్పమ్మా” అంటూ వెళ్ళింది.
” మీ నాన్న పక్కన లేకుండా ఉండి ఉంటే, ఆమె నీతో తప్పనిసరిగా మాట్లాడి ఉండేది” అన్న అమ్మ మాటలు గుర్తొచ్చాయి.
” బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు” దూరంగా ఎక్కడినుండో గాల్లో తేలివస్తూ పాట చెవులను సోకింది. నిజమే, ఆరోజు ఆంటీ ప్రవర్తన కైనా, ఈరోజు అరవింద ప్రవర్తనకైనా కారణం ఒకటే. ఒకరిది ఆకాశం నుండి అధః పాతాళానికి జారిపడిన అనుభవమైతే, మరొకరిది ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అందలానికి చేరువలో చతి కిలబడ్డ అనుభవం. ఆరోజు బాధపడింది నేనైతే, ఈరోజు అరవింద వాళ్ల బంధువు.
శశికళ ఆంటీ పరిస్థితిని అమ్మ నాకు వివరించి నట్టుగానే,
అరవింద మానసిక స్థితిని మరెవరైనా అతనికి తెలియజేస్తే బాగుండేది. అనవసరంగా ఒకరి మనసు గాయపరచాననే అపరాధ భావన తొలగిపోయి దాని మనసు తేలికయ్యేది.
” The greatest sin is to think yourself as weak “
వివేకానందుల వారి సూక్తి గుండెల నిండా ఊపిరి నింపుతూ, వెయ్యేనుగుల బలాన్ని అందిస్తున్న భావన కలిగింది. ‘మైత్రీదినోత్సవ’ కానుకగా ఈ పుస్తకాన్ని రేపు అరవిందకు అందజేయాలనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను.
ఇద్దరు స్నేహితులు కలిసి హార్సిలీ హాల్స్ కు విహారయాత్రకు బయలుదేరారు. మధ్యమధ్యలో బంధువులను కలవడం, అతిధి మర్యాదలు పొందడం వారిచ్చిన కట్నకానుకలు తీసుకుని ఆనందంతో సంబరంగా ప్రయాణమంతా సాగింది. తిరుగు ప్రయాణంలో చాలా దూరం డ్రైవింగ్ చేసిన తర్వాత అలసట ఇద్దరిని చుట్టేసింది. ఒక పెద్ద చెట్టు నీడలో వాహనం ఆపి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దయానంద్ కారు దిగి వెన్నునొప్పి తగ్గాలని, యోగి లాగా ఆసనం వేస్తూ చేతులు చాచి, వంగి నిలబడ్డాడు. అదే సమయంలో అతని స్నేహితుడు దేహబాధలు తీర్చుకోవడాని పక్కకు వెళ్ళాడు. కొంతసేపటికి వచ్చి “ఒరేయ్ బాబా… లేవరా… ఆలస్యం అవుతుంది బయలుదేరుదాం!” అని కేక పెట్టాడు.
ఆ మాటలే అతని పాలిట అపశకునమయ్యాయి.
అంతలో అక్కడే పొలాల్లో పనిచేసే కొందరు కూలీలు ఆ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి ఉన్న దయానంద్ కు నమస్కరించారు. అకస్మాత్తుగా వారు తనకు దండాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు. ఇంతలో దయానంద్ నోరు తెరచేసేలోపే, ఇంకొకడు గభాలున తనదగ్గరున్న మూడు అంగుళాల పొడగున్న చిన్న త్రిశూలాన్ని మౌనానంద బాబాకీ జై!బాబాకీ! జై! అంటూ అతని నాలుక మీద గుచ్చేశాడు.
ఒక్క క్షణం! దయానంద్ కు ఏమీ అర్థంకాలేదు! నాలుక నొప్పి! నోరు తెరిచి మాట్లాడుదామంటే అడ్డంగా త్రిశూలం. అప్పటికప్పుడు మూతి వాచిపోయి ముఖం గుర్తుపట్టరాకుండా అయ్యాడు. నొప్పి… కంట్లో నీరు… మాట రాని స్థితి. చేతులతో సైగలు చేస్తూ విలవిలలాడుతున్నాడు. లేవనివ్వకుండా అరడజను చేతులు అతని కాళ్ళను గట్టిగా పట్టుకున్నాయి…. వదలండీ! వదలండనీ అరవలేక సైగలు చేస్తున్నాడు.
వెంట వచ్చిన స్నేహితుడిని ఈ గుంపు వెనక్కి నెట్టేసింది. ఆ గోలలో అతను అరచి చెప్తున్నాడు అతను బాబాకాదు! ఏమీ కాదు! వదలండీ! నా స్నేహితుడని ఎంత అరుస్తున్నా వారు వినిపించుకోలేదు. అక్కడున్నవారు *ఇదో కొత్త నాటకం రేపు బాబాకు వచ్చే డబ్బులు , కానుకలు కాజేద్దామనీ వీడి కుట్ర… వీడిని లాగి అవతల పారేయండని స్నేహితుడిని ఒక్క తోపుతోసారు. అతను చేసేది ఏమీ లేక దగ్గరున్న పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పట్టణానికి బయలుదేరాడు.
అంతలోనే ఆ గుంపులోంచి ఓ గొంతు లేచింది.
“సైగల బాబాకు జై! సైగల బాబాకు జై!”అని ఆ ప్రాంతమంతా జయజయ ధ్వానాలతో మారుమోగింది. దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు దయానంద్. చెట్టు కింద రాళ్లు పేర్చి గద్దెలా తయారుచేసి, దయానంద్‌ను దానిమీద కూర్చోబెట్టారు. “చూశారా! ఇంత నొప్పిలోనూ ఎవరికో భవిష్యత్తు చెప్పాలనుకునే మహాత్ముడు!” అని పొగడ్తలు మొదలయ్యాయి.
ఆ మగతలో కూడా దయానంద్ కు కోపం తారాస్థాయికి చేరుకుంది. నా భవిష్యత్తే నాకు తెలియడం లేదు … “నేను ఇంకొంకడికి చెప్పడమేమిటి? నా బొంద, నేను చెట్టు కింద ఆసనాలు వేయడమే నేరమా? ఎవరైనా ఈ త్రిశూలం తీస్తే బాగుండును”… అని అనుకుంటున్నాడు. కానీ మోటుగా లాగితే మరింత ప్రమాదమని, సెప్టిక్ అయితే ఏమవుతుందో అన్న భయంతో మాట్లాడలేక మౌనంగా ఉన్నందుకే అతనికి కొత్త పేరు పెట్టేశారు—మౌనానంద స్వామి అని.
ఇంతలో స్నేహితుడు ఎక్కడ? అని కళ్లతో వెతికాడు. అక్కడ కనబడలేదు. ఒంటరితనమూ, నాలుక నొప్పీ, తలంతా నొప్పి కలిసి అతన్ని నలిపేస్తున్నాయి. ఏమీ చెప్పలేని మౌనం చూసి, “లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్న మహానుభావుడు” అని జనాలు మరింత నమ్మేశారు. భజనలు మొదలయ్యాయి.
ఒక ముసలమ్మకు ఒక ఆలోచన వచ్చింది. చుట్టు పక్కల తిరిగి రుద్రాక్ష కాయలు ఏరుకుని వచ్చి దండ గుచ్చి బాబా మెడలో వేసింది. ఆ దండ వల్ల అతనికి ఒకటే దురద పుట్టింది! అతని చేతులు గట్టిగా పట్టుకోవడం వల్ల దురదోపశమనం చేసూకోలేకపోతున్నాడు.
మళ్లీ—జయజయ ధ్వానాలు. మౌనానంద స్వామీకి జై అంటూ….
కోపం… బాధ… అసహనం… దయానంద్
గుడ్లురిమాడు. వదలండి అనే అతని సైగలు అర్ధంకానీ ఆ మూఢులు అది కలి ప్రభావమనీ విపరీత పనుల మీద బాబాకు కోపం వచ్చిందని మొదట గుసగుసలాడిన జనం ఇక పైకే అనడం మొదలు పెట్టారు.
ఆఁ….. బాబాకు కోపం వచ్చిందంటే రాదా? ఆ ఫలానా పిల్ల తను ప్రేమించిన వాడికోసం భర్తను గొడ్డలి పెట్టి నరికి- ఇంటి దగ్గరే ప్రేమికుడి సాయంతో గోతిలో పాతిపెట్టి , పైన నున్నగా ఎవరికీ తెలియకుండా ఉండాలని సిమెంటు గచ్చు చేసిందట! మరి అంతటి అన్యాయాలను బాబా చూసి తట్టుకుంటాడా ? వస్తది! కోపం రావడం సహజమే అంటున్నారు.
బాబాకు కోపం ఎక్కువ అవుతుందేమోనని, పక్కనే పారుతున్న వాగులోంచి నీళ్లు తెచ్చి కుమ్మరించింది ఒక భక్తురాలు. చల్లటి గాలి, చల్లని నీళ్లు… వణుకు పెరిగింది. నోట్లో త్రిశూలం బాధ మరింత పెరిగింది. చూస్తుండగానే జనం బాగానే పెరిగారు. బాబా ఆగ్రహం తగ్గాలని దండకాలు, శ్లోకాలు, కరావలంబ స్తోత్రాలు అసలు ఒక్కటేమిట? నోటికొచ్చిన పద్యాలు చదవడం మొదలుపెట్టారు. రణగొణ ధ్వనితో దయానంద్ చెవులు దిబ్బడ పడ్డాయి.. ఎవరో కుంకుమ తీసి నుదుట పెద్ద బొట్టు పెట్టారు.
నిమిషాల్లోనే దయానంద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. లోలోపల నిజంగానే కోపం వస్తున్నది దయానంద్ కు…అరే! చెప్పింది వినిపించుకోరు! చెప్పనివ్వరు! తన ముఖంలోని కోపాన్ని చూసి పైనుండి ఈ లాంటి వ్యాఖ్యానాలు.. ఏం చేయాలో పాలు పోవడంలేదు!
ఫోన్లు మొదలయ్యాయి—“ఇక్కడ చెట్టు కింద మహిమగల బాబా వెలిశాడు!” అని ఎవరికో చెబుతున్నారు.
నమ్మకాలెక్కువున్న ఓ ఆచారమ్మ భక్తిప్రదర్శనలో ప్రథమశ్రేణిలో ఉండే ఆ మహా తల్లి పులిహోర, పానకాలతో అక్కడికి వచ్చింది.
ఆ గుంపులో ఉన్న వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ చక్కటి అవకాశం ఎందుకు వదులుకోవాలి? నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు! అని—తన వెంట బస్తా కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, కర్పూరం తెచ్చి… చెట్టుకింద పెట్టాడు. మొదట ఒక కొబ్బరికాయ, ఊదుబత్తీలు, కర్పూరం తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళి పూజ చేసాడు అంతే… అక్కడ ఉన్నవారికి ఉత్సాహం ఉరకలెత్తింది… కొబ్బరికాయలు తీసుకోవడం, కొట్టడం…. తీసుకోవడం, కొట్టడం….
తానేం తక్కువ తిన్నానా అని మరొక వ్యాపారి దేవుళ్ల ఫోటో ఫ్రేములు, నల్ల-ఎర్ర దారాలు, తాయెత్తులు, టార్పాలిన్ షీట్… పట్టుకుని అక్కడికి వచ్చాడు.
ఇంకొకడు టీ డబ్బా పట్టుకొని వచ్చాడు. వాడి సంచార చాయకొట్టుతోపాటు, వాడి బావమరిది ఏకంగా మరమరాలు, ప్రసాదాల డబ్బా పట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ బూరలు, బొమ్మలవాడు ఇలా ఎవరి బంధువులకు వారు చెప్పుకుని క్షణాలలో దుకాణాలు వెలిసాయి. కాసేపట్లోనే అక్కడ చిన్న జాతర వాతావరణం ఏర్పడింది.
భజనలతో గొంతులు ఎండిపోయినవాళ్లకు చాయ్ అమృతమైంది. కానీ మౌనానంద స్వామికి నోట మంచినీళ్ల చుక్క కూడా లేదు.
ఇంతలో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడు, ఆయనతో పాటు చిన్న- చిన్న నాయకులు… అందరూ అక్కడికి వచ్చారు. అక్కడే బాబాకు గుడి కట్టించమని భక్తులు అడగారు… ఆ నాయకుడు వాగ్దానాలు చేయడాలు జరుగుతున్నవి… ఇదంతా చూస్తున్న స్నేహితుడికి ఏమీ అర్థంకావడంలేదు. తన స్నేహితుడు దయానంద్ ఏడి? అని చుట్టుపక్కల వెతుకుతున్నాడు.
బాధతో కళ్ళు తెరిచిన దయానంద్‌కు స్నేహితుడు కనిపించడు. కోపం నషాళానికి అంటుకుంది. కానీ సైగ చేస్తే— చుట్టూ ఉన్నవారు “దేవుడు పూనాడు!” అంటున్నారు. “ఏంకావాలి సామీ?” అని అడుగుతుండగానే ఒక మహిళ పూనకం వచ్చి ఊగింది— హుహుహు….“అరిష్టం! గొర్రెలు, మేకలు నైవేద్యం!” పెట్టాలి! హుహుహు…. అని పూనకంతో ఊగింది…
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతలో కోళ్ళు, మేకలు అక్కడికి తెచ్చారు… వాటిని బలివ్వడం మొదలుపెట్టారు.
ప్రజల మూర్ఖత్వం.. మూఢభక్తిని చూసి దయానంద్‌కు ఇదేం మూఢ భక్తి అని విరక్తి కలిగింది. ఇంతలో ఏదో చెప్పాలని దయానంద్ చేయి పైకి ఎత్తుతున్నాడు.
చూడండి “బాబా ఆశీర్వదిస్తున్నాడు!” అంటూ గుంపుగా వచ్చి మౌనానందస్వామికి జై, మౌనానందస్వామికి జై అని అరుస్తూ చుట్టిమూగారు… తలో మాటా…దండాలు మొక్కులు…గడబిడగా మారింది
…అక్కడ బాబా ఆశీర్వాదం కోసం తొక్కిసలాట మొదలైంది…
ఎవరి కోసం కాలం ఆగదు. స్నేహితుడు దగ్గరలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్ళాడు కదా! కానీ ఎన్నికల హడావుడి, గొడవలు, బందోబస్తు కారణంగా ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోలేదు. దాంతో తాను ఏమీ చేయలేనని కనీసం డాక్టర్ ను తీసుకొని వెళ్ళి స్నేహితుని నాలుక మీద ఉన్న త్రిశులాన్ని పీకివేయాలనుకున్నాడు. అక్కడ డాక్టర్ అందుబాటులో లేదు.
తానే దయానంద్‌ను తీసుకెళ్లాలని అక్కడికి వస్తే అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతోంది.
ఇంతకీ ఏది దయానంద్ అని వెదుకుతున్నారు. “బాబా ఎవరు?” అని అడుగుతూ జనసంద్రములోకి తోసుకుంటూ వెళ్లాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి తన స్నేహితుడిని గుర్తు పట్టలేకపోయాడు. ఆకలి, దప్పి, నొప్పితో బాబా కళ్ళు మూసుకున్నాడు. భక్తులు హారతులు, కొబ్బరికాయలు, భజనలు… యువకవులు పాటలు రాసి పాడి, వీడియోలు తీశారు. స్వరకర్తలు పాటలు యూట్యూబ్ లో అప్పుడే అప్లోడ్ చేస్తున్నారు.
ఆ తొక్కిసలాటను ఎలాగైనా ఆపాలని రాజకీయ నాయకుడు తన పలుకుబడితో పోలీసులను అక్కడికి రప్పించాడు. ఇదే అదను అని దయానంద్ స్నేహితుడు ఆ పోలీస్ అధికారితో జరిగిందంతా చెప్పాడు. ఆ పోలీసు అధికారి అంతా విని అయ్యో! ఇంత అన్యాయం జరిగిందా? అని అతను బాబాకాదనీ, ప్రజల మూఢనమ్మకానికి బలైన ఒక అమాయకుడనీ చెప్పి, కొందరు యువకుల సాయంతో ఆ గుంపును అదపులోకి తెస్తూ… వెనుక నుండి పోలీసులు దయానందన్ ను పక్క ఊరిలో ఉన్న ఆసుపత్రికి తరలించారు!.
నాలుగునెలల పసిగుడ్డు మృదులకు స్థన్యం ఇస్తోందన్నమాటే కానీ యశోద కళ్ళుమాత్రం ఏదో వెతుకుతున్నాయి. స్థన్యం నోటినుంచి జారిపోవటంతో ఏడుపులంకించింది చిన్నారిమృదుల. మరల స్థన్యంఅందించిన యశోద, నోటిలో స్థన్యంతో నిద్రలోకిజారుకున్న మృదులని పదిలంగా ఉయ్యాలలోపడుకోబెట్టి దోమతెరవేసింది. తలుపుచేరవేసి నెమ్మదిగా గదిబయటకు వచ్చింది.
యశోద ఇల్లంతా కలయతిరిగింది. “కన్నా! కన్నా!” అని పిలుస్తూ.
అలికిడిలేదు. ‘పిచ్చి తండ్రి ఎక్కడున్నాడో!’ అనుకుంటూ చుట్టూచూసింది యశోద.
కుర్చీకి డైనింగ్ టేబుల్ కి మధ్య బాసపీట వేసుకొని కూర్చుని ఉన్నాడు రెండేళ్లకృష్ణ. ఏడ్చిఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. నల్లటి గిరజాలజుట్టు కళ్ళల్లో పడుతోంది. పచ్చటి బుగ్గలు బాగాఏడ్చిన గుర్తుగా గులాబీరంగులో ఎర్రబడ్డాయి. బుగ్గలమీద నీటిచారికలు, తడిసిన జుబ్బా చాలాసేపు ఏడ్చిన ఆనవాళ్ళని మిగిల్చింది.
“కన్నా! ఇక్కడ ఇరుక్కుపోయావా? రాలేక ఏడ్చావా? పిచ్చితండ్రి. అంటూ కుర్చీజరిపి చేతులు చాచింది.” యశోద.
గబగబా దేకుతూవచ్చి రెండుకాళ్లు చుట్టుకున్నాడు కృష్ణ. ‘అమ్మ! అమ్మ!’ అంటూ టేబుల్ చూపించాడు.
“ఆ మూల ఎందుకు దూరావు తండ్రి?” అంటూ
ముద్దుల వర్షం కురిపించింది యశోద.
చాపవేసి రబ్బర్ షీట్ పరిచి కృష్ణని పడుకోబెట్టింది.
చేతికి ఒక యాపిల్ ముక్క ఇచ్చి నిక్కర్ తీసేసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ‘కాడ్‌లివర్’ ఆయిల్ చేతిలోకి తీసుకుని పీలగాఉన్న కృష్ణకాళ్ళకి మర్దనచేస్తూ, ‘ ఏ జన్మలో నేనుచేసుకున్న పాపమో లేక పసివాడిప్రారబ్దకర్మమో మూడునెలల వరకు బొద్దుగా చలాకీగా ఉన్న
పిల్లవాడి శరీరంపెరిగింది. కానీ కాళ్లుపీలగా అలాగే ఉన్నాయి.’ అనుకుంది యశోద.
ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు చక్రపాణి, యశోదలు. ఏమి ప్రాబ్లంలేదని, ఆయిల్ మసాజ్ చేసి ఎండలో పడుకోపెట్టమని కాళ్లు చిన్నగా ఊపుతూ
వయసుకితగ్గ ఎక్సర్సైజెస్ చెప్పి చేయించమన్నారు. మొదట్లో ఎనిమిదోనెలవరకు వెల్లకిలాపడుకొని పిచ్చుకలనిచూస్తూ కేరింతలు కొట్టేవాడు. బోర్లపడటం
ప్రాకటం లాంటివి చేయలేకపోవడంతో డాక్టరు సపోర్ట్ ఇచ్చి డైరెక్ట్ గా కూర్చోబెట్టమంటే నెమ్మదిగా ప్రయత్నించింది యశోద. మొత్తానికి నెమ్మదిగా కూర్చోగలిగాడు. కానీ పాకడానికి ప్రయత్నం చేయలేదు. ఏదైనా వస్తువునిచూపెడితే ముందుకి వెనక్కి ఊగేవాడు అందుకోవటానికి. కానీ ముందుకు జరిగేవాడు కాదు. మసాజ్ ప్రభావంతో కూర్చునే కాళ్లుజాచి మడచి టపటపా
కొట్టుకోవడం, ఆ ప్రయత్నంలో కొంచంగా ముందుకు
జరగడంతో నెమ్మదిగా రెండు చేతులు ముందుకు ఆనించి కాలు జాపి ముందుకు శరీరాన్ని ఈడ్చి మళ్ళీ రెండోకాలు మడిచి ఎలా అయితేనే దేకడం మొదలు
పెట్టాడు. అలా దేక్కుంటూ దేనిక్రిందోదూరి అక్కడి
నుంచి రాలేని స్థితితో ఏడవటం పరిపాటి అయింది.
యశోద వద్దనుకున్నా అనుకోకుండా మృదుల
కడుపున పడటంతో శ్రమ ఎక్కువైంది.
తల్లివారిస్తున్నా యశోద పురిటినొప్పులవరకు కృష్ణ కాళ్ళకి మసాజ్ చేయటం ఎండలో పడుకోబెట్టడం మాత్రం క్రమంతప్పకుండా చేస్తూవచ్చింది.
★★★
ఏణ్ణార్ధం మృదుల రబ్బరు బొమ్మలా బుడిబుడి నడకలతో ఇల్లంతా పరిగెడుతూ ఉంటే, ఒకచోట బాసిపీట వేసుకుని సంతోషంగా చప్పట్లు కొట్టేవాడు కృష్ణ.
మృదులని చూసి కృష్ణ ఆసక్తితో నుంచోటానికి ప్రయత్నించసాగాడు. కండరాల, నరాల బలానికి ఇచ్చిన మందులవల్ల అయితేనేమి చిన్నగా పట్టుకుని నుంచోవటం మొదలుపెట్టాడు. ఆసరాతోనడవడం మొదలుపెట్టిన కృష్ణనిచూసి తల్లిమనస్సు ఉప్పొంగిపోయింది. ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకుంది.
భగవంతుడు కృష్ణకి అఖండమైన తెలివితేటలు ఇచ్చాడు. ఏకసంథాగ్రహి.ఐదవయేట స్కూల్ కి
పంపారు కృష్ణని.
★★★
చక్రపాణి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ కావడంతో
ఎక్కువగా చాలాచిన్నటౌన్ లలో గ్రామాలలో తరచూ బదిలీలతో పిల్లలచదువులకి ఇబ్బంది ఏర్పడేది. కొన్ని సందర్భాలలో భార్యాపిల్లలని ఒకఊర్లో అట్టేపెట్టి తనుమాత్రం వెళ్లివస్తూ ఉండేవాడు ఆ విధంగా కృష్ణకి
తండ్రికంటే తల్లిదగ్గర చేరిక ఎక్కువ. చిన్నప్పటి
అనారోగ్యం దృష్ట్యా యశోద కృష్ణని పల్లెత్తుమాట అనేదికాదు. ఆ అవకాశం కూడా ఇచ్చేవాడుకాదు కృష్ణ. అంతటి పల్లెటూర్లలో చదివిన కృష్ణ టెన్త్ క్లాసు స్టేట్
ఫస్ట్ వచ్చాడు.
అసలు సమస్య అప్పుడు మొదలైంది కృష్ణని మేనమామ ఇంట్లో హైదరాబాదులో పెట్టి ఇంటర్ చదివించాలని నిర్ణయించాడు చక్రపాణి.
“నేను అమ్మనివదిలి ఉండను.” అన్నాడు కృష్ణ. తల్లిని బ్రతిమిలాడాడు.
“కన్నా! ఈఊర్లో ఉన్న చిన్నకాలేజీల్లో చదవితే
భవిష్యత్తు ఉండదు. మావయ్య దగ్గరి ఉండి చదువుకో. మృదులది ఇంకా స్కూలుచదువు పర్వాలేదు. అంటూ నచ్చచెప్పింది.
ఎప్పుడూ లేనిది మృదులమీద చూచాయగా ఈర్ష
పొడచూపింది కృష్ణలో. దానికి తగ్గట్టు చక్రపాణి కృష్ణకి నచ్చచెప్పినా మొండిపట్టుదల పట్టడంతో కొంత
కఠినంగామాట్లాడటం, తల్లి తండ్రికిమద్దతు పలకటంతో తల్లిమీదకూడా అలక వచ్చింది. తప్పనిసరిగా
వెక్కివెక్కి ఏడుస్తూ హైదరాబాదు మేనమామ ఇంటికి బయలుదేరాడు కృష్ణ.
★★★
కృష్ణ లేని ఇల్లు నెలవంక లేని నింగి అయింది. మాటకి ముందు వెనక ‘అమ్మ అమ్మ’ అంటూ వెంటపడే కృష్ణని తలుచుకుని కుమిలింది యశోద.
“యశోదా! మనం కృష్ణ భవిష్యత్తు రీత్యా పంపాము. అయినా ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్నయ్య ఇంటికే
కదా! నాకు మాత్రం ఇష్టమా? ఇంకొక రెండేళ్లు నేను ఈ రూరల్ బ్రాంచ్ లో పనిచేయక తప్పదు. తర్వాత రిక్వెస్ట్ పెట్టుకొని సిటీకి ట్రాన్స్ఫర్ అయితే కృష్ణని మనదగ్గరే ఉంచుకుందాం. సరేనా!” అన్నాడు చక్రపాణి.
“అవునమ్మా! అన్నయ్య లేకపోతే నాకు తోచటం లేదు. నాన్న అన్నట్లు కొద్దిరోజులు ఓర్చుకుందాం.” అంటూ ఆరిందాల తల్లిని ఓదార్చింది మృదుల.
★★★
కాలచక్రానికి ఎవరి సుఖదుఃఖాలతోనూ సంబంధం
లేదు. దానిత్రోవన అది తిరుగుతూ ఉంటుంది. సెలవులకు కృష్ణరాక ఒక కొడుకుగాకాక బంధువుగా మారిపోయింది. తండ్రితో ముభావంగా తల్లితో రాను రాను ముక్తసరిగా ఉండటం మొదలుపెట్టాడు.
‘కన్నా!’ అని యశోద పిలవంగానే కోపంతో కళ్ళల్లో కి గుచ్చిగుచ్చి చూసేవాడు. యశోద హృదయం తల్లడిల్లేది. మృదులతో గిల్లికజ్జాలు అసలే లేవు.
“ఏమండీ! కన్నా ప్రవర్తన నాకు చాలాభయంగా
ఉంది.” అంది యశోద.
“కొంచెంమార్పు ఉంది.అయినా బాధపడాల్సిన అవసరంలేదు. పదిహేనేళ్ళ వయసులో ఇటువంటి మార్పుసహజం. టీనేజ్ ప్రాబ్లం. నెమ్మదిగా మన నిర్ణయం వాడి బంగారు భవిష్యత్తుకని అర్థమవుతే అన్ని సర్దుకుంటాయి.” అని సర్దిచెప్పాడు చక్రపాణి.
చెప్పడంఅయితే చెప్పాడుకానీ చక్రపాణికి కృష్ణ లోని స్తబ్దత తుఫాను ముందు ప్రశాంతతలా గోచరించ
సాగింది.
బావమరిదికి ఫోన్ చేసి కృష్ణ ప్రవర్తనను గురించి ప్రస్తావించాడు చక్రపాణి.
“ఏంలేదు బావా! ఎకడమికల్లీ వాడు ఎక్సెల్. ఇక మూడ్స్ అంటావా ఆ వయసులో సహజమే కదా!
నువ్వు నేను ఆ వయసు దాటి వచ్చాం కదా!
ఇకపోతే వాడికి చెల్లాయి మీద బెంగ ఎక్కువ. ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. ‘ఏరా!’ అంటే ‘ఏం లేదు మామయ్య’ అంటాడు. వీలైనప్పుడు వాడికి నేను
విడమర్చి చెప్తున్నా వాడిక్కడ ఉండాల్సిన దానికి
కారణం. పృథ్వి కూడా చదువు రీత్యా బయట ఉన్నాడని.ఆ నిమిషం కాంప్రమైజ్ అయినట్లే అవుతాడు. మళ్ళీ వాడి మూడ్ లోకి వెళ్తాడు.” అన్నాడు చక్రపాణి బావమరిది వంశీమోహన్.
★★★
కనులుమూసి తెరిచేలోపల రెండేళ్లు ఇట్టేగడిచాయి.
చక్రపాణికి మేనేజర్ గా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది.
కృష్ణ స్టేట్ ఫస్ట్ లో ఇంటర్ పాస్ అయ్యాడు. ఢిల్లీ ఐ.ఐ.టీలో క్వాంటం టెక్నాలజీ అండ్ కాంపిటేషనల్ ఇంజనీరింగ్ బీటెక్ లో సీట్ వచ్చింది.
మృదుల టెన్త్ హైయెస్ట్ పర్సెంటేజ్ తో పాస్ అయింది. శ్రీ విశ్వా ఐ.ఐ.టి అండ్ మెడికల్ అకాడమీలో ఇంటర్లో చేరింది.
ఢిల్లీ వెళ్లేముందు వచ్చి ఒక రెండునెలలు తల్లితండ్రి
దగ్గర ఉన్నాడు కృష్ణ.ఈ రెండునెలల్లో సాధ్యమైనంత ఎక్కువ సమయం కృష్ణ తో గడపటానికి
ప్రయత్నించారు చక్రపాణి, యశోద, మృదుల.
చక్రపాణి ఎల్.టి.సి మీద నార్త్ ఇండియా టూర్ కి కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు.
★★★
సిమ్లా హోటల్లో దిగంగానే పదమూడేళ్ళ రుద్ర వీరి సామాను రూముకి తీసుకెళ్లాడు.
కృష్ణకి వాడిని చూడంగానే ఆశ్చర్యమనిపించింది.
పాలు గారే మేనిఛాయ, నీలి కళ్ళు, కోటేరు ముక్కు,
చెరగనిచిరునవ్వు. ‘ఇంత చిన్న వయసులో ఇంతింత బరువులు ఎలా మోస్తున్నాడా!’ అని.
“రుద్రా! ఆప్ పఢాయి కర్ రహే?” అని అడిగాడు కృష్ణ.
“హాఁ సాబ్! ఆఠవీ క్లాస్ మే హూఁ!”
“ఆప్ కే పేరెంట్స్!”అంటూ అర్ధోక్తిగా ఆగాడు కృష్ణ.
“గాఁవ్ మే హై! ఉధర్ ఖేతీబాడీ దేఖ్ రహే హై. మై ఇధర్ హోటేల్ మె కామ్ కరతే పఢాయి కర్ రహా హూఁ!” అన్నాడు రుద్ర.
కృష్ణ మనసులో ఎక్కడో అలజడి రేగింది.
మూడు రోజులు సిమ్లా అక్కడి మనుషులను, వారి
జీవనశైలిని గమనించాడు.
అక్కడనుంచి డెహ్రాడూన్ వెళ్లారు. చక్రపాణి క్లాస్మేట్
రవిశర్మ ఇంట్లో దిగారు. రవిశర్మ ఓ.ఎన్.జి.సి లో సైంటిస్ట్. అక్కడ ఉండి చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకున్నారు.
కృష్ణ , మృదులకి అక్కడి వాతావరణం, ఎఫ్.ఆర్.ఐ ముందు వాస్ట్ లాన్స్ ఎంతో నచ్చాయి. మార్నింగ్ వాక్ కి వెళ్ళన వారికి ఇండియన్ ఆర్మీ మార్చ్ పాస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చింది.వారందరూ కుటుంబాలకు దూరంగా దేశరక్షణకై జీవితాలని అంకితంచేస్తున్నారని కృష్ణకి
వారిమీద గౌరవం కలిగింది.
మాటల్లో చక్రపాణి, “ఏరా! రవీ! నీ పిల్లలు కనపడటం లేదు.” అని అడిగాడు.
“పెద్దవాడు ఐ.ఎం.ఏ లో ఉన్నాడు. చిన్నవాడు డూన్ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడు. వెకేషన్ కి వస్తారు.
ఇల్లంతా సందడే. పిల్లలు పైకి రావాలంటే వాళ్ళని
ఇలా దూరంగాపంపి చదివించాల్సివస్తోంది. మన
రోజుల్లో కాంపిటీషన్ వేరు.ఇప్పటి కాంపిటీషన్ వేరు. మా ఆవిడ అన్నంముందు కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకోని రోజులేదు. చదువు పేరుతో ఇప్పుడు, తర్వాత ఉద్యోగాల పేరుతో, ఆ తరుత పెళ్లిపేరుతో దూరమవుతారు అని బాధపడుతుంది.” అన్నాడు రవిశర్మ.
“అంతే కదండీ!” అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో అందరికీ కాఫీలు అందించింది అనురాధ.
“కృష్ణా! నువ్వు మీఅమ్మ అదృష్టవంతులు.
పదిహేనేళ్ళు అమ్మదగ్గర ఉన్నావు. మాపిల్లలు
ఐదారేళ్ల అప్పటినుంచి బోర్డింగ్ స్కూల్.” అంది అనురాధ
“ఇదిగో ఇద్దరూ రేపు వస్తారు వెకేషన్ కి సుడిగాలుల్లా. మీరేచూస్తారుగా. వాళ్లువచ్చాక ఔటింగ్ ప్లాన్ చేద్దాం.” అన్నాడు రవిశర్మ
★★★
రవిశర్మ చెప్పినట్లుగానే రాకేష్ రోషన్లు చిచ్చర పిడుగులు.
రాకేష్ కి పంతొమ్మిది ఏళ్లు, రోహన్ పధ్నాలుగేళ్ళ వాడు.
‘అంకుల్! ఆంటీ!’అంటూ చక్రపాణిని, యశోదని,
‘హాయ్ కృష్ణ!’, ‘ప్యారీ బహన్’ అంటూ మృదులని ఆప్యాయంగా పలకరించారు వస్తూనే.
వారి స్కూల్లో, కాలేజీలో జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెబుతూ కొంతమందిని ఇమిటేట్ చేసి కడుపుబ్బ నవ్విస్తూ ఇల్లంతా చైతన్యంతో, పాజిటివ్ ఎనర్జీతో నింపారు.
మగపిల్లలైనా తల్లికి వంటింట్లో సహాయం చేయటం, లంచ్ కి డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయటం చూసిన
కృష్ణ తనను తాను విశ్లేషించుకున్నాడు.
‘ సెలవలకి వచ్చినప్పుడు తను ఎంతో కోపంతో,
విసుగు చికాకుతో, చెల్లెల్ని పలకరించేవాడు కాదు.
తనను దూరంపెట్టి అదిమాత్రం అమ్మానాన్నలతో హ్యాపీగా ఉందన్న భావనతో, తనకిష్టం లేకపోయినా తనని దూరంగా మామయ్యఇంటికి పంపారన్న కోపంతో
సెలవులకు వచ్చినప్పుడు తండ్రితో ముక్తసరిగా,
తనకు ప్రాణానికి ప్రాణమైన తల్లితో అరాకురా మాట్లాడేవాడు. మరి వీళ్ళిద్దరూ ఏకంగా హాస్టల్లోఉంటూ ఇంటికిరాంగానే వాళ్ళ అమ్మానాన్న పెన్నిధి అయినట్లు ప్రతినిమిషం అపురూపమైనట్లు ప్రవర్తిస్తున్నారు.’ అనుకున్నాడు కృష్ణ.
అందరూ కలిసి డెహ్రాడూలోని కింప్టీఫాల్స్, భట్టా
ఫాల్స్, ఝరీపాన్ని ఫాల్స్ కి వెళ్లారు.
నెక్స్ట్ డే రిటర్న్ బయలుదేరు దామనుకున్నాడు చక్రపాణి.
“అంకుల్! రేపు మేముముగ్గురం ముస్సోరి ట్రెక్కింగ్ కి వెళ్తాము. విత్ యువర్ కైండ్ పర్మిషన్.” అని అడిగాడు రోహన్ చక్రపాణిని.
” నేను వస్తాను.” అంది మృదుల.
“నో ప్రాబ్లం” అన్నారు రోహన్,రోహిత్.
“నో! బిటియా నా దగ్గర ఉంటుంది.వుయ్ హావ్ సమ్ అదర్ ప్లాన్.” అంది అనురాధ.
“అన్నయ్యగారు! మృదుల ఉంటే ఇంటికి లక్ష్మీకళ
వచ్చింది రంగురంగుల బట్టలతో.ఈ వెధవలు నలుపు నీలం జీన్స్ ప్యాంట్లు చూసి చూసి విరక్తి పుట్టింది.”
అంది అనురాధ.
వెంటనే రోహన్ అనూరాధని కావలించుకుని, “మామ్! నీకు ఇష్టమైన డ్రెస్సెస్,ఫ్రాక్స్ అన్నీ కొను. ఇంటికి వచ్చినప్పుడు నేను వేసుకుంటా.అంతేకానీ మా ప్యాంట్స్ గురించి మమ్మల్ని దూరం చేయకు. అంటూ తల్లి దుపట్టాని పమిటలాగా వేసుకున్నాడు.”
“ఛీ! డర్టీ ఫెలో!” అంటూ దుపట్టా లాక్కుంది అనురాధ.
అందరూ కడుపు చెక్కలయ్యేట్లు నవ్వారు. అందరూ సంతోషంగాఉన్నా యశోదలో ఏదో ఆందోళన, భయం కనిపెట్టాడు చక్రపాణి.
ఒంటరిగా ఉన్నప్పుడు “యశోదా! ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు?” అనిఅడిగాడు చక్రపాణి.
“మీరు కృష్ణని ట్రెక్కింగ్ కి వెళ్లటానికి ఒప్పుకున్నారు. వాడి కాళ్లు బలహీనమైనవి కదా! బిడ్డ ఇలా తన
కాళ్ళ మీద నడవగలడని నేను ఎన్నడూ అనుకోలేదు.భగవంతుని దయవల్ల వాడికి కాళ్లు వచ్చాయి తెలివితేటలు కూడా ఆ భగవంతుడి దయ. ట్రెక్కింగ్ చేస్తూ హఠాత్తుగా వాడి కాళ్లు చచ్చు పడతాయేమో అని
భయంగా ఉందండి. రెండేళ్లుగా మనతో వాడు సరిగ్గా లేడు ఇప్పుడు కాదంటే మళ్ళీ నామీద కోపం పెంచుకుంటాడని భయంగా ఉంది.” అంది దిగులుగా
యశోద.
“పిచ్చిదానా! అది ఒక పీడకల. ఇప్పుడు వాడు పదిహేడేళ్ళవాడు. ఒంటరిగా హాస్టల్లో ఉండి ఢిల్లీలో చదువుకోవాలి. పిల్లలు ఢక్కామొక్కీలు తింటేనే జీవితంలో రాణించగల ధైర్యం వస్తుంది. రాకేష్, రోహన్ లని చూడు. ఎంత డేరింగ్ గా ఉన్నారో. తమని చిన్నప్పుడే హాస్టల్లో వేశారన్న అభియోగంలేదు. వీడువాళ్లతో తిరగటంతో కొంత ఎక్స్పోజర్ వస్తుందన్ననమ్మకంతో
రిటర్న్ టిక్కెట్టు పోస్ట్ పోన్ చేశా. లీవ్ ఎక్స్టెండ్ చేశా. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు.” అంటూ ఊరడించాడు చక్రపాణి.
★★★
ట్రెక్కింగ్ కి బయలుదేరిన ముగ్గురు ఎప్పటికప్పుడు
ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టుగా ఒప్పుకున్నారు.
“ఆంటీ! మేము పెద్దహిల్స్ ట్రెక్కింగ్ కి వెళ్ళటంలేదు. అక్కడ కొంచెం ల్యాండ్ స్లైడింగ్ ఇష్యూస్ ఉన్నాయి.
మేము సరదాగా వెళ్తున్నాం. భద్రాజ్ చాలా ఫ్రెండ్లీ.
ఎక్కువగా రాక్స్ ఉంటాయి మీ సింహాచలం లాంటిది.”అంటూ యశోదకి రాకేష్ ధైర్యంచెప్పాడు.
కృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాకేష్ రోహన్లతో కృష్ణకి చాలా ఎక్స్పోజర్ వస్తోందనిపించింది చక్రపాణికి .
పిల్లలు ముగ్గురు ముస్సోరీ కి వెళ్ళంగానే ఇల్లంతా బోసిపోయింది.
జర్నీలో కృష్ణ రాకేష్ ని “అన్నా! మీకు మీ అమ్మానాన్న హాస్టల్ లో చిన్నప్పటినుంచి ఉంచారని బాధగాను కోపంగాను లేదా !” అని అడిగాడు
“బాధ ఉంటుంది కృష్ణ. కంటికి రెప్పలా చూసుకునే
అమ్మానాన్నకి దూరంగా ఉండాలంటే. కానీ మనం
సొసైటీలో ఒకస్థానం సంపాదించాలంటే కొన్ని సుఖాలని వదులుకోవాలని నాన్నఅంటారు. అప్పుడే
కదా మనం పెద్దవాళ్ళమై మనపేరెంట్స్ ని హ్యాపీగా ఉంచగలం. అయితే నువ్వన్న కోపం మాకు
అర్థంకాలేదు. వారేమీమనని పనిష్ చేయలేదుకదా! మనకి వారిమీద కోపం రావడానికి. వాళ్లకి దూరంగాఉండి మనమెంత బాధపడతామో! మనం దూరంగాఉంటే వాళ్లు అంతేబాధపడతారు. మేము వెకేషన్ కి రాంగానే అమ్మానాన్నలు సంతోషం వారి ప్రేమ చూస్తే మేము ఇన్నిరోజులు వారినివదిలి ఉన్నామన్న సంగతిమర్చిపోతాం. సరే! నీకు ఈఅనుమానం
ఎందుకొచ్చింది కృష్ణ?” అన్నాడు రాకేష్.
“ఏమీలేదు ఊరికే ” అని తప్పించుకున్నాడు కృష్ణ.
★★★
“మనం ఇవాళ ‘తాప్ కేశ్వర్ మహాదేవ్’ గుడికి వెళ్దాం చాలాపురాతన స్వయంభుశివలింగం గుహలో
ఉంటుంది. గుహపైకప్పునుంచి నీరు శివలింగంమీద
పడుతూఉంటుంది.” అని రవిశర్మ అందర్నీ గుడికి
బయలుదేర తీశాడు.
పచ్చని ప్రకృతి మధ్య గుహలో ఆ శివలింగాన్ని
చూసిన యశోద భక్తి భావంతో కైమోడ్చ్చింది. ఆ
భగవంతుని లీలలు అమోఘం. ఈ గుహలో వెలిసినది ఎలా తెలిసిందో అంది యశోద అనురాధతో.
“ఈ గుడికి మహాభారతానికి అవినావసంబంధం ఉంది. ఇది గురువు ద్రోణాచార్యులవారు ధ్యానంచేసిన
గుహ. అశ్వద్ధామతల్లికి పాలులేక శివునివేడుకోగా
సాక్షాత్ శివుడే అశ్వద్ధామకి పాలిచ్చాడని ప్రతీతి.”
అంటూ స్థలపురాణాన్ని వివరించాడు రవిశర్మ .
ఆనందంగా ఇంటిముఖం పట్టారుఅందరూ.
పరధ్యానంగా దిగులుగా ఉన్నతల్లిని గమనించింది మృదుల.
“అమ్మా! అన్నయ్యల గురించి దిగులుపడకమ్మా. రేపు సాయంత్రానికి వచ్చేస్తారుగా.” అంటూ తల్లి వీపునిమిరింది మృదుల.
ఆరాత్రి యశోద కన్నుమూయలేదు. తెల్లవారింది.
యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగింది. అందరూ కబుర్లలో పడ్డారు.
మృదులను చూసి, “తల్లీ! నిన్ను చూస్తుంటే!” అంటూ అనూరాధ ఏదో చెప్పబోతుంటే —
“అనూ! ఇవాళ మెనూ ఏమిటి?” అని మాట
తప్పించాడు రవిశర్మ.
“ఏమి చేయమంటారు?” అందిఅనూరాధ.
“జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇవాళ యశోద వండుతుంది.ఏమంటావ్ యశోద?” అన్నాడు చక్రపాణి
“సంతోషంగా” అంది.యశోద
★★★
హఠాత్తుగా రవిశర్మ వంటింట్లోకివచ్చి, “అనూ! నేను
చక్రపాణి ముస్సోరివెళ్తున్నాం. న్యూస్ లో ల్యాండ్ స్లైడింగ్ అయిందనివచ్చింది. ప్రాణనష్టం ఏమీలేదు. కానీ పిల్లల్ని కారులోతీసుకువస్తా .ఇన్నోవా తీసుకెళ్తున్నా!” అంటూ ఆఘమేఘాల మీద చక్రపాణి రవిశర్మ
వెళ్లారు..
వాళ్లటు వెళ్ళంగానే కుప్పలా కూలిపోయింది యశోద అచేతనంగా. వెంటనే మృదుల,అనురాధ యశోదని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళారు.
“ఏమీ పరవాలేదు. బీపీ డౌన్ అయింది అబ్జర్వేషన్ లో ఉంచాలి అడ్మిట్ చేయండి.” అన్నాడు డాక్టరు.
మూసినకన్ను తెరవకపడుకున్న తల్లినిచూస్తే మృదులకి భయంవేసింది.
“ఆంటీ! అమ్మకి ఏమికాదుకదా! అన్నలకి
ఏమీకాదుకదా!” అంటూ దిగులుగా అడిగింది.
“మృదులా!ఎవ్వరికి ఏమీకాదమ్మా! అందరూ క్షేమంగాఉంటారు. పద క్యాంటీన్లోఏదైనా తిందువుగాని అంటూ
అనురాధ మృదులని క్యాంటీన్ కి తీసుకెళ్లి లంచ్ తినిపించింది.
★★★
ముస్సోరి చేరిన చక్రపాణి రవిశర్మలకి మేజర్ ల్యాండ్ స్లైడింగ్ అవ్వటంతోను, వీరు ముగ్గురు సోలోట్రెక్కింగ్ కి వెళ్లడంతో రవిశర్మ మిలటరీ వారికి ఇన్ఫామ్ చేసి
ఎంక్వయిరీచేశాడు. ప్రాణనష్టంలేదని కాకపోతే చాలామందికి దెబ్బలుతగిలాయని మెడికల్ క్యాంపులో ఉన్నారని తెలుసుకొని మెడికల్ క్యాంపుకివెళ్లారు.
రాకేష్, రోహన్, కృష్ణలకి మైనర్ ఇంజ్యురీస్, కృష్ణకి మైనర్ ఫ్రాక్చర్ తో సేఫ్ గా ఉన్నారు.
తండ్రిని చూసి రాకేష్ రోహన్‌లు, “నో వర్రీస్ డాడ్! వుయ్ ఆర్ ఫైన్. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.” అంటూ తండ్రికి ధైర్యం చెప్పారు.
“నాన్నా!” అంటూ తండ్రిని హత్తుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు కృష్ణ.
ఆ ఏడుపులో భయం బాధ నొప్పి కాదు అంతకు
మించిన భావన తండ్రిగా చక్రపాణి అర్థం
చేసుకున్నాడు. కట్లుకట్టి ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు
డాక్టర్లు.
రిటర్న్ డెహ్రాడున్ వస్తుంటే చక్రపాణికి యశోదపరిస్థితి వివరించాడు రవిశర్మ. ఆందోళన చెందవలసినది
లేదని తెలిపాడు.
కృష్ణమనసులో తల్లిరూపం మెదిలింది. గతరెండేళ్లుగా తల్లిని మనసులో దూషించాడు.మానసికంగా హింసించాడు.
‘భుజాన మృదులనువేసుకుని వడిలోతనని
పడుకోపెట్టుకున్న తల్లిరూపం పదేపదే గుర్తుకు
రాసాగింది. ఇక్కడ తనుఆక్సిడెంట్ కి గురవడం
అక్కడ తల్లి. పడిపోవటం. ఆమెకి తనంటే ఎంత
ప్రేమ.’ తలచుకుని అప్రయత్నంగా కంటిలోకన్నీరు
ధారగా కారింది.
సాయంత్రానికి డెహ్రాడూన్ చేరారు.
తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని కృష్ణమనస్సు
తల్లడిల్లింది. ముస్సోరి బయలుదేరేముందు తల్లి
తండ్రితో మాట్లాడింది విన్నాడు.
‘తల్లిది సిక్స్త్ సెన్స్ అనుకోవాలా? లేదా అమితమైన ప్రేమ అనుకోవాలా? నిజమే తనకాళ్ల స్ట్రెంగ్త్ తనకంటే అమ్మకే తెలుసు. ట్రెక్కింగ్ లో కొంత దూరం ఎక్కంగానే చచ్చుదనం అనిపించింది. వెంటనే వెనక్కు
మరలటంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తనని చూసి రాకేష్ రోహన్‌లు వెనకకు మళ్లారు.
చిన్నఊర్లో ఇంటర్మీడియట్ చదివిఉంటే ఏ కోచింగ్ లేకుండా తను ఐ.ఐ.టీలో సీటు సంపాదించగలిగేవాడా? రెండేళ్లు అమ్మని ఎంత అసహ్యంగా చూసాడు. అమ్మ కన్నా! అంటే కళ్ళల్లో కళ్ళుపెట్టి కోపంగాచూశాడే కానీ, అమ్మా! అని పిలవలేదు. ఇవాల్టిరోజున తనకుఏమైందో అన్నఆలోచనకే ఆమెగుండె ఆగిపోయేంత పరిస్థితి తెచ్చుకుంది. టెన్త్ వరకూ రోజుకాళ్ళకి నూనెమర్దన
చేసి డ్రాయర్ తో ఎండలో నుంచో పెడితే అమ్మని విసుక్కునేవాడిని. కాళ్లులేని నన్ను నాకాళ్ళమీద నేను నిలబడటానికి అమ్మచేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు.’ కళ్ళవెంబడి కన్నీటిధారతో స్వగతంగా అనుకున్నాడు కృష్ణ.
మరుసటి రోజు యశోదని డిశ్చార్జ్ చేశారు.
ఇంటికి వస్తూనే, “కన్నా! ఎలా ఉన్నావురా!” అంటూ
పదిహేడేళ్ళ కృష్ణని పసివాడిని అక్కునచేర్చుకొనినట్ల అక్కున చేర్చుకొని మొహమంతా ముద్దులతో
ముంచెత్తింది యశోద.
‘అమ్మా నన్ను క్షమించు’ అంటూ అస్పష్టంగా
గొణిగాడు కృష్ణతల్లిని పెనవేసుకుని.
రాకేష్రో,హన్లు అనురాధ రవిశర్మలకి ఆ తల్లి కొడుకుల ప్రేమ అపురూపంగా అనిపించింది.
హమ్మయ్య అనిఊపిరి పీల్చుకున్నాడు చక్రపాణి.
★★★
సాయంత్రం అందరూసరదాగా ఆల్బమ్ చూస్తున్నారు. అందులోరోహన్ ని ముద్దుపెట్టుకుంటూ రోహన్ పోలికలోఉన్న అమ్మాయినిచూసి. “ఎవరీ అమ్మాయి?”
అని అడిగిందిమృదుల.
“మా చెల్లెలు” అన్నాడు రాకేష్.
“మా అమ్మాయి రోహిణి. రోహన్ రోహిణిలు కవలలు. రోహిణికి హార్ట్ ప్రోబ్లెమ్. మీ ఆంటీ ఎంతో సేవచేసింది కూతుర్ని బ్రతికించుకోవాలని. కానీ భగవంతుడు
నిర్దయుడు. మృదులా! నిన్ను చూడగానే ఆంటీకి కన్నకూతురు గుర్తుకువచ్చింది. నీలో రోహిణిని చూసుకొని ఈ వారంరోజులు ఆనందించింది.” అన్నాడు రవిశర్మ.
కూతురు జ్ఞాపకాలతో రవిశర్మ గొంతుక గద్గద మైంది. రవిశర్మని, అనురాధని, చక్రపాణి,యశోదలు అనునయించారు.
పొగిలిపొగిలి ఏడుస్తున్న రోహన్ చేతిలోచేయివేసి ఆప్యాయంగా దగ్గరకుతీసుకుంది మృదుల.
★★★
మూడు రోజులు ఉందామని వచ్చి వారం రోజులు
మీతో ఎన్నో అనుభవాలను పంచుకున్నాంరా రవి.
ట్రిప్పు ఎప్పటికీ మరిచిపోలేని ఆత్మీయతని పంచింది. మా కృష్ణలో పరివర్తన తెచ్చింది. అంటూ వీడ్కోలు
తీసుకున్నాడు చక్రపాణి.
సమాప్తం
“అమ్మా నిధీ,ఒక్కసారిచిరాకుపడకుండానా మాటవిను. మాతృత్వం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం, దానిని అలా జారవిడవకు. ఈరోజు ఎందరోస్త్రీలు మాతృత్వం కోసంలక్షలుఖర్చు చేసినా ప్రయోజనంఉండటంలేదు. నీమంచికోరిచెపుతున్నా,ఇంకా ఆలస్యంచేస్తేపిల్లలుపుట్టడంకష్టంఅవుతుంది” అంటున్నతల్లిమాటలుకు శ్రీనిధి”అమ్మా, నావద్ద పిల్లల ప్రస్తావన ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాటిమాటికి ఆ విషయం గురించి నువ్వు వర్ణించినానా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు” అంటూ తల్లి ఏమి అంటుందో కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది.
శ్రీనిధితల్లితండ్రులకు ఒక్కగానొక్కకూతురు అవడంతో చాలా గారాభంగా పెరిగింది. తండ్రిది చిన్న గుమస్తా ఉద్యోగం అయినా శక్తికి మించి మంచి కాలేజిలో ఇంజనీరింగ్ చదివించి, మాస్టర్ చెయ్యడానికి అమెరికా కూడా పంపించారు.శ్రీనిధి ఇండియాతిరిగివచ్చిమంచిఉద్యోగంసంపాదించుకుని, తనతోపాటుపనిచేస్తున్న శ్రీకర్ అనే అబ్బాయినిపెళ్లిచేసుకుంటానంటేఒప్పుకునిచాలాఘనంగాపెళ్ళిచేశారు. శ్రీనిధికి పెళ్లియ్యి ఎనిమిది ఏళ్లు అయినా పిల్లలు లేరు.అయ్యో!మళ్లీ మీరు వారికి ఏదో లోపం వల్ల పిల్లలు కలగలేదు అనుకోకండి. వీరు పెళ్లియిన రోజే ఈ కాలం యువతఅనుసరిస్తున్న డింక్ ‘డబల్ ఇనకమ్ నో కిడ్స్’జీవనశైలిని పాటీస్తూ పిల్లలను కనద్దు అనినిశ్చయించుకున్నారు.తల్లిదండ్రులకు కూడా అదే చెప్పి, వారు ఏమి అనే లోపే, పిల్లలు వల్ల ఎన్నో సమస్యలు ఎదురుకొవాలని, పిల్లలు వారి స్వేచ్ఛకు, సరదాలకూఅడ్డని, భాద్యతలు పెరిగితే ఉద్యోగంలోకూడారానించలేరని చెప్పి ఎప్పుడు పిల్లల ప్రస్తావన ఎత్తదని కఛితంగా చెప్పేసారు.
మొదట్లోశ్రీనిధి తల్లి కొన్నాళ్ళకి వారే నిర్ణయం మార్చుకుంటారు అనుకుంది, కానీ ఇన్నాళ్లకు కూడా వారి నిర్ణయం మారకపోవడంతో ఆమె తల్లి మనసు తట్టుకోలేక శ్రీనిధితో తరుచుగా ఈ విషయం ఎత్తితే చాలు ఆమె కోపంగా ఫోన్ పెట్టేసేది, ఇవాళ కూడా అదే జరిగింది.
శ్రీనిధి రెండు రోజులు సెలవు తీసుకుని తల్లిదండ్రులను చూసి వద్దాం అనుకుంది. ఆనాడే ప్రయాణం, కానీ పొద్దున్న తల్లితో జరిగిన గొడవతో ఆమె టికెట్ కాన్సెల్ చేసుకుని, ప్రయాణం మానుకుందాం అనుకుంది. కానీ వెంటనే ఆమెకు కష్టపడి పెంచిన తండ్రి ముఖం గుర్తొచ్చి, బాగ్ లో రెండు బట్టలు వేసుకుని స్టేషన్ కి బయలుదేరింది.
ఆప్పటికే స్టేషన్ చేరడానికి ఆలస్యం అవడంతో ట్రైన్ ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉంది. ట్రైన్ ఎక్కి బెర్త్ క్రింద బ్యాగ్ పెట్టుకుని కిటికీకి తల ఆనించి కళ్లు మూసుకుంది శ్రీనిధి. ఆలోచనలో ఉన్న ఆమెకు చంటిపాప ఏడుపు వినిపించింది. ఆమె దృష్టి ఎదురుగా ఉన్న బెర్త్ వైపు మరలింది. సుమారు తన వయసు ఉన్న ఒక ఆమె చిన్న పాపను అడిస్తూకనపడింది, ఆమె పక్కనే నడివయసు సుమారు యాభై ఏళ్లు ఉంటాయి, బహుశా యువతి తల్లి అవచ్చు అనుకుంది శ్రీనిధి.ఆ యువతి ఓ వైపు ఆఫీస్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కు సమాధానమిస్తూ మరోవైపు పసిపాపను చూసుకుంటోంది. పక్కనే ఉన్న తల్లి పాపను ఇమ్మన్నా వారించి “అమ్మా, రేపటినుండి నేను ఆఫీస్‌కు వెళ్తేచిన్నిని నువ్వే చూసుకోవాలిగా.దానితో ఉన్నపుడు అయినా నేనుదానిని చూసుకుంటానమ్మా”,అన్న ఆమె మాటకి శ్రీనిధి ఆయువతిని పరిశీలనగా చూసింది. ఆమె వేసుకున్న బట్టలు, పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అన్నీ అతి సాధారణంగా ఉన్నాయి, కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయంశ్రీనిధిని ఆకట్టుకున్నాయి.
ఆమెతో ఎలాగైనా పరిచయం చేసుకోవాలన్న కోరికతో శ్రీనిధి మోహమాటంగానే వారితో మాట కలిపి తనను పరిచయం చేసుకుని వారి ఎక్కడివరకు వేళ్లుతున్నరని అడగడం తో ఆ పెద్ద ఆమె “అమ్మా, నా పేరు వసుంధర, ఇమే నా కూతురు ధరణి, ఇది నా మానవరాలు చిన్ని. మేము ఆనకాపళ్లీ వేళ్లుతున్నం” అనడం తో శ్రీనిధి “ ఆవునా, మా విశాఖపటనం కి దగ్గరే. అనకాపల్లి లో మా పెద్ద మావయ్య కొన్నాళ్ళు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేసెవారు. చిన్నప్పుడు రెండు ముడు సార్లు వేసవి సెలవులో అమ్మ తో పాటు అక్కడికి వెళ్ళాను. మావయ్య మా అందరిని నూకాంబికఅమ్మవారి గుడి కి, బొజ్జన్నకొండ, లింగాలకొండ లో బౌద్ధ మూలానికి చెందిన రాతి గుహలను చూపించడానికి కుడా తీసకేళ్ళెవాడు. అమ్మ అక్కడ బేల్లం బాగుంటుందని రెండు-ముడు కేజీలు కొని తెచ్చేది. మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు అక్కడ?” అని అడిగింది శ్రీనిధి. దానికి వసుంధర గారు “ధరణి కి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పోస్టీంగ అయి ముడు ఏళ్లు అయిది. నేను ఆమెకు సహయంగా మధ్య మధ్య లో వచ్చి పోతుంటాను. పాప పుట్టేకాఆరు నెలలు మెటర్నిటీ లీవ్ లో ఉంది. రేపటినుండి తిరిగి జాయిన్ ఆవుతుంది ” అంటూ గర్వంగా చెప్పడంతోధరణి వేపు ఆసక్తిగా చూస్తున్న శ్రీనిధితో వసుంధర గారు“అది నా కూతురు అని గొప్ప చెపుకొవడం కాదు కానీ ధరణి ఆ జిల్లాని, అక్కడ ఉన్న ప్రజలను చాలా సమర్థవంతంగా చూసుకుంటుంది. అందుకె ఆమెకు ఈ మధ్యేరాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డుతో సత్కరించింది”అంటున్న తల్లి మాటలకి ధరణి సిగ్గుపడుతూ “ఆదేమి లేదండీ నాఉద్యోగ ధర్మం సాయశక్తులా నిర్వర్తిస్తాను అంతే” అంది నిరాడంబరంగా.
అంత నిగర్వంగా ఉన్న ధరణి ని చూసి ‘అందుకేమన పెద్దలు నిండుకుండ తొణకదు అంటారు’అనుకుంది శ్రీనిధి.అంతదగ్గర నుండి ఎప్పుడూ ఒక కలెక్టర్ ని చూడని శ్రీనిధికి ఆమె గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో “ధరణి గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడగనా?” అండంతో ధరణి అంగికారంగా తలఉపింది. “నఇన్ టు ఫైవ్జాబ్ చేస్తున్న నాకే ఇల్లు ఆఫీసు రెండు చూసుకోవడం చాలా కష్టంగావుంది,అలాంటిది మీరు ఇంత చిన్న వయసులో రాత్రి పగలు ఆనక ఒక జిల్లాకలెక్టర్ గా, గృహిణిగా, తల్లిగాఇన్ని బాధ్యతలు ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు. పాప పుట్టేముందు మీకు ఆమెను సరిగా పెంచగలనా లేదా అన్న సందేహం రాలేదా?” అంది శ్రీనిధి కుతూహలంగా.
దానికి ధరణి నవ్వి, “శ్రీనిధి గారు, నాకు పెళ్లికి ముందు అలాగే పాప పుట్టేముందు కూడా యిన్ని బాధ్యతలుసవ్యయం గా చెయ్యగలనా అన్న భయం మనసులో ఉండేది కానీ ఏ కొత్త బాధ్యత అయినా, పని అయినా చేయడానికి ముందు భయం ఉండడం సహజమే కదా. నన్ను అర్థం చేసుకుని నాకు తోడు నీడగా ఉండే భార్త ,ఆన్ని విధాలగా సాయపడే కుటుంబం తోడు ఉంటే ఇక బెంగ ఎందుకు అని ముందడుగు వేసాను. నాకు సాయంగా ఇప్పుడు అమ్మ వస్తే, మరి కొన్నేళ్లకి అత్తయ్య వచ్చి నాకు సాయంగా ఉంటారు. నాకు ఎప్పుడు “అమ్మా” అన్న పిలుపు వినాలన్న కోరిక ఉండేది. చిన్ని నా జీవితం లోకి రావడం తో నా కోరిక నేరవేరింది. నేను బాధ్యతలకు భయపడి, స్వేచ్ఛ కోల్పోతానని అనుకుంటే ఈ అమ్మాతం లో ఉన్న తియ్యదన్నాని కొలిపోయివుండేదానిని. ఇప్పుడు చిన్నేనా లోకం, దాని పనులన్నీ నేనే స్వయంగా చేసి మాతృత్వంలో ఉన్న మధురానుభూతిని ఆస్వాదిస్తున్నాను. అన్నట్టు శ్రీనిధిగారు, మిమ్మలని నా మాటలతో విసగిస్తున్నానా?”అనడంతో శ్రీనిధి, “లేదండి, మీరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది” అంటూ మనసులో ‘అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే చెపతువుంటుంది కాని నేనే ఆమె మాటను పట్టించుకోలేదు’ అనుకుంది బాధగా.
తెల్లవారుతూనే వారి స్టేషన్ రావడంతో ధరణి, వసుంధర పాపను ఎత్తుకుని శ్రీనిధికి బై చెప్పి భోగీదిగగానే చాలామంది ధరణిని పూలగుత్తులతో, దండలతో స్వాగతించారు. అది చూసిన శ్రీనిధి మనసులో, సమాజంలో ఇంకా చాలామంది స్త్రీలు ధరణిలాగేనే ఎదగాలని కోరుకుంది. ట్రైన్ వేగం అందుకుంది, శ్రీనిధి మనసూ కూడా ధరణి అన్న మాటకి ఆమె ఇన్నాళ్ళుగా చేస్తున్న తప్పు తెలుసుకుని పాశ్చతాపంతో కుమిలిపోయింది. ఇన్నాళ్లు మాతృత్వానికి దూరంగా ఉండి ఎంత విలువైన అనుభూతిని కోల్పోయిందో అర్థమై, అది ఆస్వాదించాలన్న కోరిక బలపడింది.
ఈ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. శ్రీనిధి ఇల్లు బంధుమిత్రులతో సందడిగా ఉంది. శ్రీకర్,శ్రీనిధి చంటి పాపనుఒడిలోపెట్టుకుని బారసాల పీటలపై కూర్చున్నారు. పురోహితుడు పూజ చేయించి, పాప పేరు బియ్యంలో రాయమనడంతో శ్రీనిధి శ్రీకర్ చెవిలో పాప పేరు చెప్పిది. ఆయన పసుపుకొమ్ముతో బియ్యంపై ‘ధరణి’ అని రాశాడు. పాప పేరును చూసిన శ్రీనిధి సంతోషంతో“నా చిట్టితల్లి,ధరణి”అంటూ ముద్దు పెట్టుకుని మురిసిపోయింది.
శ్రీనిధికి ధరణి అన్నది ఒక పేరు మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పిన పేరు. ఒడిలో ఉన్న పాపను చూస్తున్న ఆమెకు ట్రైన్ లో కలిసిన కలెక్టర్ ధరణి లాగె ఆమె పాపకికుడా అంత గొప్ప వ్యక్తిత్వం కలగాలని దేముడిని కోరుకుంది.
***
ఎండలు మొదలయ్యాక ఆ ఊరిలో మధ్యాహ్నాలు మరీ నిశ్శబ్దంగా మారిపోతాయి. చెరువు కట్ట మీదున్న రావిచెట్టు కూడా ఆ వేళ గాలి కోసం ఎదురు చూస్తున్నట్టు కదలకుండా నిలబడిపోతుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని మాత్రం ప్రతి రోజు ఒకే శబ్దం చీల్చేది.
“పోస్టుమాస్టారూ… మా రవికి ఏమైనా ఉత్తరం వచ్చిందా?” గ్రామ పోస్టాఫీసు గుమ్మం దగ్గర నిలబడి అడిగేది సుబ్బమ్మ.
పోస్టుమాస్టర్ చిరునవ్వుతో తల ఊపేవాడు.
“ఈరోజూ లేదు అక్కా.”
“సరే బాబూ…”
అని చెప్పి వెనక్కి తిరిగేది. అడుగులు మాత్రం భారంగా ఉండేవి.
ఆమె వయసు అరవై దాటింది. తలలో సగం జుట్టు వెండిరంగు పట్టేసింది. చీర మాసిపోయినా పరిశుభ్రంగా ఉంటుంది. నుదుటి కుంకుమ చిన్నదే కానీ, ఆత్మగౌరవం మాత్రం పెద్దది.
సుబ్బమ్మకు ఒకడే కొడుకు.. రవి. భర్త రామయ్య చనిపోయినప్పుడు రవికి ఆరేళ్లు. అప్పటి నుంచి ఆమే తల్లీ, తండ్రీ. ఒక ఎకరం పొలం. రెండు మేకలు. ఐదు కోళ్లు. అంతే ఆస్తి. కానీ ఒక కల మాత్రం చాలా పెద్దది.
“నా కొడుకు నాకన్నా మంచి జీవితం బతకాలే.” అనుకుని ఆ కల కోసం ఆమె చేసిన త్యాగాలకు లెక్కలేదు.
రవి చిన్నప్పుడు స్కూలుకు వెళ్లనని మొండికేసిన రోజులు గుర్తొచ్చాయి.
“అమ్మా… మాస్టారు కొడతాడు.” అని ఏడుస్తుంటే, సుబ్బమ్మ అతన్ని ఒడిలోకి తీసుకుని.. “ముందు నువ్వు నా కొంగులో దాక్కో బాబు. భయం తగ్గాక స్కూలుకు వెళ్దాం.” అనేది. వాడికి నిజంగానే భయం తగ్గిపోయేది. రవి ఏడ్చిన కన్నీళ్లు మొదట తుడిచింది ఆమె చేతి కాదు…ఆమె చీరకొంగే. ఆ కొంగులోనే అతని మొదటి బొమ్మ ఉండేది. ఆ కొంగులోనే పాఠశాల ఫీజు కోసం దాచిన ఐదు రూపాయల నోటు ఉండేది. ఆ కొంగులోనే మధ్యాహ్నం తినడానికి.. మామిడికాయ పచ్చడి రాసిన జొన్నరొట్టె ఉండేది. రవి పెద్దవాడయ్యే వరకు…ఆ చీరకొంగు అతనికి ఒక చిన్న ప్రపంచం. పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చాడు రవి. ఊరంతా వచ్చి అభినందించింది.
“సుబ్బమ్మా… నీ కష్టం ఫలించింది.” అన్నారు.
సుబ్బమ్మ మాత్రం నవ్వి…” ఇప్పుడే మొదలే అయ్యింది.” అంది.
ఇంటర్, డిగ్రీ, ఆ తర్వాత పోటీ పరీక్షలు చదవడానికి డబ్బు సరిపోలేదు. ఒక రోజు రాత్రి…ఇంట్లో దీపం వెలుతురులో రవి పుస్తకం చదువుతున్నాడు. సుబ్బమ్మ, పెట్టెలో భద్రంగా ఉన్న బంగారు తాళిబొట్టును తీసి చూసింది. రామయ్య బ్రతికున్న రోజుల్లో పెట్టిన ఒక్కటే బంగారం. మరుసటి రోజు దాన్ని అమ్మేసింది. రవి ఆ విషయం తెలుసుకున్నాడు.
“అమ్మా… ఇది ఎందుకు చేశావు?”
“బంగారం మెడలో ఉంటే ఆభరణం. పిల్లాడి చదువుకు ఉపయోగపడితే భవిష్యత్తు.” ఆ మాట విని రవి మాట్లాడలేకపోయాడు. ఆ రాత్రి తల్లి నిద్రపోయాక ఆమె కాళ్ల దగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. కాలం గడిచింది. రవికి నగరంలో ఉద్యోగం వచ్చింది. ఊరంతా సంబరపడింది. బస్సెక్కే రోజు…సుబ్బమ్మ కొత్త చొక్కా తీసి ఇచ్చింది.
“ఇది ఎప్పుడు కొన్నావమ్మా?”
“నువ్వు అడిగితే కొనలేను. అడగకుండా కొంటేనే తల్లి సంతోషం.”
బస్సు హారన్ కొట్టింది. రవి ఎక్కబోతుండగా… సుబ్బమ్మ తన చీరకొంగులో ముడివేసిన చిన్న పొట్లం అతని చేతిలో పెట్టింది.
“ఇది ఏమిటమ్మా?”
“బస్సు వెళ్లాక తెరిచి చూడు.”
బస్సు ఊరిని దాటాక తెరిచి చూశాడు. రెండు వందల రూపాయలు… ఒక చిన్న కాగితం. దానిపై వంకర వంకర అక్షరాల్లో ఇలా ఉంది.. “ఆకలేస్తే తిను. బాధేస్తే ఇంటికి రా. కానీ ఎవరి ముందు తల వంచకు. – అమ్మ.” ఆ కాగితం మీద రెండు నీటి చుక్కలు పడ్డాయి. అవి రవి కన్నీళ్లా…లేదా సుబ్బమ్మ కళ్లనుంచి పడినవో…అతనికి అర్థం కాలేదు. నగరం రవిని ఆప్యాయంగా ఆహ్వానించలేదు. పరుగెత్తించింది. ఉదయం తొమ్మిదింటికి ఆఫీసు. రాత్రి తొమ్మిదింటికి గది. నెలాఖరుకు జీతం. ఆ జీతం వచ్చేలోపే ఈఎంఐలు, అద్దె, ఖర్చులు. మొదట్లో ప్రతి రాత్రి తల్లికి ఫోన్ చేసేవాడు.
“తిన్నావా అమ్మా?”
“ఈరోజు పొలానికి వెళ్లావా?”
“మందులు వేసుకున్నావా?” సుబ్బమ్మ మాత్రం ప్రతిసారీ ఒకటే అడిగేది.
“నువ్వు క్షేమంగా ఉన్నావా నాన్నా?” అని.
కొడుకు గురించి తెలుసుకోవడమే ఆమెకు చాలు. తన గురించి చెప్పేది కాదు. ఒక రోజు కంపెనీలో రవికి ప్రమోషన్ వచ్చింది. కొత్త బాధ్యతలు. కొత్త స్నేహాలు. కొత్త జీవితం.
ఆ జీవితం నెమ్మదిగా అతనిలోని పల్లెను చెరిపేస్తోంది. ఆఫీసులో అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారు. గ్రామం గురించి చెప్పడానికి కూడా అతనికి సంకోచం కలిగేది. ఒకసారి సహోద్యోగి అడిగాడు.
“నీ అమ్మ ఏం చేస్తుంది?”
ఒక్క క్షణం రవి తడబడిపోయాడు.
“ఫార్మర్…” అన్నాడు.
‘కూలి పని చేస్తుంది’ అని చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. ఆ రోజు మొదటిసారి…తల్లి కష్టాన్ని అతడు తన మాటల్లో దాచేశాడు. సుబ్బమ్మకు ఇవేవీ తెలియవు. ప్రతి శుక్రవారం ఆమె ఒక ఉత్తరం రాసేది. అక్షరాలు అందంగా ఉండేటివి కావు, కానీ ప్రేమ మాత్రం ప్రతి పంక్తిలో ఉండేది.
“నాన్నా… ఈ ఏడాది మామిడి చెట్టు బాగా కాసింది.”
“నీ చిన్నప్పటి స్నేహితుడు శేఖర్‌కి పెళ్లయింది.”
“నీకు ఇష్టమైన జాజిపూలు మళ్లీ పూశాయి.”
ఆ ఉత్తరాల చివర ఎప్పుడూ ఒకే వాక్యం ఉండేది.
“సమయం దొరికితే ఒక్కసారి రా. చూడాలని ఉంది.” రవి వాటిని చదివేవాడు. జవాబు మాత్రం రాసేవాడు కాదు.
“ఈ వీకెండ్ వెళ్లొస్తాను …” అనుకుంటూ వాయిదా వేస్తుండేవాడు. మూడేళ్లు గడిచాయి. ఒక రోజు ఊర్లో పాత ఇంటి గోడ కూలిపోయింది. వాన రాత్రి. సుబ్బమ్మ బయట అరుగు మీద కూర్చుని తెల్లవార్చింది. పక్కింటి వెంకటమ్మ అంది.
“నీ కొడుక్కి ఫోన్ చేయి.”
“ఇప్పుడు చెబితే రాత్రంతా కంగారు పడతాడు.”
“అయితే రేపు చెప్పు.”
సుబ్బమ్మ నవ్వింది.
“రేపు చెప్పినా… వాడు వచ్చి గోడ కట్టలేడు. నేనే కట్టించుకుంటాను.” అది గర్వం కాదు. కొడుక్కి భారంగా మారకూడదనే తల్లి మనసు. ఆదివారం. రవి ఊరికి ఫోన్ చేశాడు.
“అమ్మా… ఎలా ఉన్నావు?”
“బాగున్నాను.”
“ఇంట్లో అంతా బాగానే ఉందా?”
“అంతా బాగానే ఉందిరా.” గోడ కూలిన విషయం చెప్పలేదు. మరుసటి రోజు పొరుగువాడు ఫోన్ చేసి చెప్పాడు.
“రా రవి… మీ ఇంటి గోడ పడిపోయింది.” రవికి ఒక్కసారిగా గుండె దడదడలాడింది.
“అమ్మ ఎందుకు చెప్పలేదు?”
“నువ్వు బాధపడతావని.”
ఆ మాట విన్న తర్వాత చాలా సేపు ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మొదటిసారి ఒక నిజం అర్థమైంది. తల్లులు అబద్ధాలు చెబుతారు… కానీ ఆ అబద్ధాలన్నీ పిల్లల ప్రశాంతత కోసమే. దీపావళి వచ్చింది. ఆఫీసులో అందరూ తమ తమ ఊర్లకు బయలుదేరారు. రవి కూడా టికెట్ బుక్ చేశాడు. అప్పుడే మేనేజర్ పిలిచాడు.
“ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. ఎవరో ఒకరు ఉండాలి.”
పదోన్నతి కళ్లముందు కనిపించింది. అతను టికెట్ రద్దు చేసుకున్నాడు. సుబ్బమ్మకు ఫోన్ చేశాడు.
“అమ్మా… ఈసారి రాలేను.”
అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత మామూలుగానే…
“పర్లేదు నాన్నా. పని ముందు.” అంది. ఫోన్ పెట్టేసిన తర్వాత… ఆమె గుమ్మం దగ్గర వేసిన రంగవల్లిని చాలాసేపు చూస్తూ కూర్చుంది. ఈసారి ఆ రంగవల్లిని చూసి మెచ్చుకునే కొడుకు రాడు. అతనికి ఇష్టమైన అరిసెలు అలాగే మిగిలిపోతాయి. ఆ రాత్రి ఆమె తినలేదు. అయినా మరుసటి రోజు ఫోన్లో మాత్రం…
“నిన్న బాగా తిన్నాను.” అని నవ్వింది.
నెల రోజుల తర్వాత…ఒక సాయంత్రం రవికి అనుకోకుండా గ్రామం నుంచి ఫోన్ వచ్చింది.
“బాబూ… వెంటనే బయలుదేరు.”
“ఏమైంది?”
“నీ అమ్మకు ఏమీ కాలేదు… కానీ ఒకసారి వచ్చేయ్.” ఆ మాటలో దాగిన వణుకు రవిని భయపెట్టింది. రాత్రి బస్సు ఎక్కాడు. ప్రయాణమంతా చిన్నప్పటి జ్ఞాపకాలే. జ్వరం వచ్చినప్పుడు తల్లి తన చీరకొంగుతో చెమట తుడిచిన రాత్రి… పాఠశాలకు వెళ్లేటప్పుడు అతని టిఫిన్ అదే కొంగులో కట్టి ఇచ్చిన ఉదయం… వర్షంలో తడవకుండా తన కొంగు కప్పి ఇంటికి తీసుకొచ్చిన సాయంత్రం…అతనికి ఒక్కసారిగా అనిపించింది… తాను నగరానికి వచ్చాక… అమ్మను కాదు… ఆ కొంగునే వదిలేసి వచ్చేశానని.
బస్సు గ్రామంలోకి చేరుకుంది. ఇంటి ముందు అసాధారణ నిశ్శబ్దం. గుమ్మం దగ్గర చాలా చెప్పులు. రవికి గుండె ఒక్కసారిగా బరువైంది… అతను వణుకుతున్న చేత్తో తలుపు నెట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మసక వెలుతురులో ఇంటి మధ్యన సుబ్బమ్మ మంచం మీద కూర్చొని ఉంది. చుట్టూ ఊరివాళ్లు. రవిని చూడగానే అందరూ కాస్త పక్కకు జరిగారు.
“రా నాన్నా…” అంది సుబ్బమ్మ.
ఆ స్వరం వినగానే రవి గుండెల్లో పేరుకుపోయిన భయం కరిగిపోయింది. ఒక్క అడుగులో ఆమె దగ్గరకు చేరుకున్నాడు.
“అమ్మా… ఏమైంది? అందరూ ఎందుకు వచ్చారు?”
సుబ్బమ్మ నవ్వింది.
“నాకేం కాలేదు రా. కొంచెం ఛాతిలో నొప్పి వచ్చింది. డాక్టర్ చూసి మందులు ఇచ్చాడు. కానీ…” ఆమె మాట మధ్యలో ఆగిపోయింది. పక్కనే ఉన్న గ్రామ వైద్యుడు నెమ్మదిగా అన్నాడు.
“రవిబాబూ… భయపడాల్సిందేమీ లేదు. కానీ అక్కకి విశ్రాంతి చాలా అవసరం. ఇక పొలం పనులు చేయకూడదు.” రవి తల వంచుకున్నాడు. ఆ గదిలోని ప్రతి వస్తువూ అతన్ని ప్రశ్నిస్తున్నట్టనిపించింది. మూలలో విరిగిన కుర్చీ. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్. మంచం పక్కన మందుల సీసాలు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మారిపోయింది ఒక్క తానే.
మరుసటి రోజు రవికి ఆ ఇంట్లో ఇనుప పెట్టె కనిపించింది. దానికి తాళం లేదు. తెరిచి చూశాడు. అందులో తన చిన్నప్పటి ప్రపంచం నిద్రపోతోంది. మొదటి తరగతి పలక. అరముక్క పెన్సిల్. జిల్లా ఫస్ట్ వచ్చినప్పుటి సర్టిఫికేట్. చిరిగిపోయిన నీలం రంగు స్కూలు బ్యాగ్. వాటి కింద పాత బట్టలో చుట్టిన ఒక మూట. విప్పి చూడగానే ఆశ్చర్యపోయాడు. తాను నగరం నుంచి పంపిన ప్రతి మనీ ఆర్డర్ రసీదు. తాను చిన్నప్పుడు గీసిన వంకర వంకర బొమ్మ. అన్నింటికన్నా కింద… చాలా జాగ్రత్తగా మడతపెట్టిన ఒక పాత చీర. అది సుబ్బమ్మ ఏళ్ల తరబడి కట్టుకున్న చీర. దాని కొంగు దగ్గర చిన్న చిన్న కుట్టుముక్కలు. పలుచోట్ల పసుపు మరకలు. ఒక మూలలో పాలు ఒలికిన తెల్లని మచ్చ. రవికి ఒక్కసారిగా చిన్ననాటి దృశ్యాలు కళ్లముందు కదిలాయి. ఆ కొంగుతోనే అమ్మ తనకు ఉయ్యాల కట్టింది. అదే కొంగుతో ఎండలో తల కప్పింది. జ్వరంలో చెమట తుడిచింది. పాఠశాలకు వెళ్తూ టిఫిన్ కట్టింది. ఆ చీర కేవలం బట్ట కాదు. తన బాల్యం మొత్తం. అప్పుడే వెనుక నుంచి సుబ్బమ్మ స్వరం వినిపించింది.
“ఏం చూస్తున్నావు నాన్నా?”
రవి చీరను చేతిలో పట్టుకుని తిరిగాడు.
“ఇంకా దీనిని ఎందుకు దాచుకున్నావమ్మా?”
సుబ్బమ్మ నెమ్మదిగా నవ్వింది.
“దాన్ని పారేయాలని ఎన్నిసార్లో అనుకున్నాను.”
“మరి?”
“కొంగు చేతిలో పడగానే నీ చిన్నప్పటి వాసన వచ్చేది. పారేయలేకపోయాను.”
ఆ మాట విన్న రవి కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తల్లి అతని దగ్గరకు వచ్చి… అతని తలను మెల్లగా తన చీరకొంగుతో తుడిచింది.
“ఏడవకు.” అంది.
“అమ్మా… నేను చాలా దూరమైపోయాను కదా?”
సుబ్బమ్మ అతని జుట్టు నిమురుతూ మృదువుగా అంది.
“దూరమయ్యేది మనిషి కాదు రా… మనసు. మనసు తిరిగి వస్తే…దూరం అనే మాట ఉండదు.”
ఆ మాట విన్న రవికి… మొదటిసారి తనకు నిజమైన ఇల్లు దొరికినట్టు అనిపించింది. ఆ రోజు సాయంత్రం…ఇంటి ముందు ఉన్న అరుగు మీద తల్లితో కలిసి కూర్చున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు పొలాల మీద బంగారు వెలుతురు చల్లుతున్నాడు. పక్కింటి పిల్లలు దుమ్ములో ఆడుకుంటూ నవ్వుతున్నారు. ఆ నవ్వుల్లో తన చిన్ననాటి అడుగుల శబ్దం వినిపించినట్టనిపించింది.
“అమ్మా…” అని మెల్లగా పిలిచాడు.
“ఏంట్రా నాన్నా?”
“నేను మళ్లీ నగరానికి వెళ్లాలి.”
సుబ్బమ్మ నవ్వింది.
“వెళ్లాలి. ఉద్యోగం ఉంది కదా.”
రవి కొద్దిసేపు మౌనంగా ఆమెను చూస్తూ… ” అమ్మా.. ఉద్యోగానికి నేను రాజీనామా చేద్దామనుకుంటున్నాను.” చెప్పాడు.
ఆ మాట విన్న సుబ్బమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
“పిచ్చి మాటలు మాట్లాడకు రా! అంత కష్టపడి సంపాదించిన ఉద్యోగం.”
రవి తల ఊపాడు.
“ఆ ఉద్యోగంతో నేను చాలా సంపాదించాను అమ్మా… కానీ… నిన్ను కోల్పోయాను”
అతని గొంతు వణికింది.
“డబ్బు మళ్లీ సంపాదించగలను. కానీ…నీతో గడపాల్సిన ఈ రోజులు మళ్లీ రావు.”
సుబ్బమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నేను నీకు భారమవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు నాన్నా.”
రవి వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు.
“నువ్వు భారం కాదు అమ్మా… నేను మోసుకున్న అతిపెద్ద అదృష్టం.”
వారం రోజుల తర్వాత.. రవి నగరానికి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు.
“ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుకుంటున్నావు?”
రవి చిరునవ్వుతో ఒక్క మాటే చెప్పాడు.
“నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తికి… ఇప్పుడు నా సమయం కావాలి.”
ఆరు నెలలు గడిచాయి. పాత ఇంటిని కూల్చకుండా మరమ్మతులు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా చిన్న తోట పెంచాడు. సుబ్బమ్మ ఇక పొలం పనికి వెళ్లడం మానేసింది. అధిక స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆ ఊరివాళ్ళని చూసి రవి మనసు చలించింది. తక్కువ ఫీజులతో తన తల్లి పేరు మీద ఒక స్కూలు కట్టించాడు. ఒక రోజు ఊరివాళ్లంతా ఆ బడి దగ్గరికి చేరుకున్నారు. కొత్తగా నిర్మించిన భవనం ముందు రంగురంగుల తోరణాలు కట్టారు. రవి, సుబ్బమ్మ ఇద్దరూ కలిసి రిబ్బన్ కత్తిరించారు. ఆనందంగా పిల్లలు స్కూలు వెళ్ళడం మొదలు పెట్టారు. ఆ దృశ్యం చూసి సుబ్బమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.
“ఇంత పెద్ద పని ఎందుకు చేశావు నాన్నా?” అని అడిగింది.
రవి ఆమె వైపు చూసి నవ్వాడు.
“నువ్వు నాకు చదువు ఇచ్చావు అమ్మా. నేను ఈ ఊరి పిల్లలకు అవకాశం ఇస్తున్నాను. ఇది నీ ఋణంలో ఒక చిన్న వడ్డీ మాత్రమే.”
ఆ రాత్రి… ఇంట్లోని హాల్లో గోడపై ఒక అందమైన చెక్క ఫ్రేమ్ వేలాడుతోంది. అందులో…
సుబ్బమ్మ పాత చీరలోని ఆ కొంగు. దాని పక్కనే చిన్న అక్షరాల్లో ఒక వాక్యం. “ఈ కొంగు…నా కన్నీళ్లు తుడిచింది. నా ఆకలి దాచింది. నా భయాన్ని కప్పింది. నా భవిష్యత్తును మోసింది. ప్రపంచంలో ఏ జెండాకైనా గౌరవం ఉంటుంది… కానీ నాకు మాత్రం… ఈ చీరకొంగే నా జీవితంలో ఎగిరిన మొదటి జెండా. ఒక తల్లి తన చీరకొంగులో దాచింది డబ్బు కాదు… ఒక తరం భవిష్యత్తు. ఆ మాటలు చదివిన సుబ్బమ్మ… మెల్లగా రవి తలపై చేయి వేసింది. చిన్నప్పుడు చేసినట్టే… తన చీరకొంగుతో అతని నుదుటి చెమట తుడిచింది. రవి కళ్లను మూసుకున్నాడు. ఎందుకంటే… ఎంత పెద్దవాడైనా…తల్లి చీరకొంగు తాకితే… ప్రతి కొడుకూ మళ్లీ చిన్నవాడే కదా!
రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు. “సెండ్.” రజని బొటనవేలు స్క్రీన్‌ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం
తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని ఆ అమ్మాయి నమ్మకం.
“నేను ఇంకేం చేయలేను. రేపు నన్ను బలవంతంగా నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నారు. ఇవాళ రాత్రి పన్నెండున్నరకు పాత రైల్వే స్టేషన్‌కి
రా. వెళ్లిపోదాం.”
స్క్రీన్ మీద చిన్న గుండ్రటి చుక్క తిరుగుతోంది.
Sending…
ఆమె పెదవుల మీద చిన్న నవ్వయితే ఉంది కానీ మనసులో ఆందోళన. భయం.
“నెట్ స్లోగా ఉన్నట్టుంది.” అనుకుంటూ ఫోన్ గుండెలకు హత్తుకుంది.
అదే సమయం. మరో చోట మరో ఇంట్లో… సిద్ధార్థ్ చివరిసారి తన అప్లికేషన్‌ను చదువుకున్నాడు. ఏడు సంవత్సరాల నిరుద్యోగం.
నాలుగు పోటీ పరీక్షలు. ఐదారు ఇంటర్వ్యూలు. ఈసారి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం. చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు
ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
“Submit.”
స్క్రీన్ మీద Uploading documents అని గిరగిరా తిరుగుతుంటే అతడు కుర్చీలో వెనక్కి వాలిపోయి “హమ్మయ్య” అనుకున్నాడు.
వంద కిలోమీటర్ల దూరంలో రైతు రామయ్య మూడోసారి పంట బీమా క్లెయిమ్ చేస్తున్నాడు. లోపల ఆశ. ఆకాంక్ష.
” ఇప్పుడు అప్లోడ్ అవుతోంది బాబాయ్. ఈసారి డబ్బులు తప్పకుండా వస్తాయి.” గ్రామ సచివాలయం ఆపరేటర్ అన్నాడు.
రామయ్య నవ్వాడు.
“ఈసారి రాకపోతే అప్పు ఇచ్చినోడే నా పొలం లాగేసుకుంటాడు.”
నగరంలోని ఓ చిన్న ఆసుపత్రి. ఒక గర్భిణికి రక్తపోటు ప్రమాద స్దాయిలో ఉంది. డాక్టర్ అత్యవసరంగా మెడికల్ రికార్డులు స్పెషాలిటీ హాస్పిటల్‌కి పంపించాడు.
“వెంటనే బెడ్ అలాట్ చేయండి.”
ఫైల్ అప్లోడ్ అవుతోంది.
ఇంకెక్కడో… ఒక యువతి. పదకొండేళ్ల వైవాహిక హింస తర్వాత. మొట్టమొదటిసారి ధైర్యం చేసింది. ప్రభుత్వ మహిళా రక్షణ పోర్టల్‌లో కంప్లైంట్ రాసింది. చివర్లో చాలా సేపు చూసింది.
తర్వాత “Submit.”
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఆమె ఒక నిముషం విరామం తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందనిఆమె విశ్వాసం.
కళ్లలో నీళ్లు. “ఇక నేను ఒంటరిదాన్ని కాదు ” అనుకుంది రెండరింగ్ అనే అక్షరాలను చూస్తూ.
విదేశీ యూనివర్సిటీ స్కాలర్షిప్ గడువుకు చివరి రోజు. ఒక పేద విద్యార్థి తన జీవితాన్నంతా ఒక PDF ఫైల్‌గా అప్లోడ్ చేస్తున్నాడు.
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
విద్యార్ది కళ్లలో నెరవేరుతున్న కల ఆనవాళ్లు ఇటునుంచి అటు కదులుతున్న బాణం గుర్తులోమెరుస్తున్నాయి.
— ….. …….
జీవితం జరిగిన సంఘటనల చరిత్ర మాత్రమే కాదు. జరగకుండా పోయిన అవకాశాల సమాధి కూడా.
మనం బతికిన జీవితానికే జ్ఞాపకాలు ఉంటాయనుకుంటాం. జరగకుండా పోయిన జీవన శకలాలకూ జ్ఞాపకాలుంటాయి.
అయితే అవి గుర్తుంటాయి కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
రాత్రి పన్నెండున్నర. పాత రైల్వే స్టేషన్. రజని గంటసేపు ఎదురు చూసింది. గడియారం వైపు గేటు వైపు ఎడతెరపి లేకుండా చూస్తూనే ఉంది. ఒకటిన్నరైంది. అతను రాలేదు. రెండైంది. అతను రాలేదు.
చివరికి “భయపడ్డాడు ” అని గొణుక్కుని విషాదంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.
“పెళ్లి ఫోటోలన్నింటిలో రజని నవ్వుతోంది. కానీ పాత రైల్వే స్టేషన్ దగ్గర అర్థరాత్రి నిలబడ్డ అమ్మాయి ఛాయలు మాత్రం ఏ ఫోటోలోనూ లేవు.”
సిద్ధార్థ్ ప్రతిరోజూ వెబ్సైట్ చూస్తున్నాడు. “Application not found ” అంటోందది.
“నేనే ఏదో తప్పు చేశానేమో ” అనిపించిందతనికి . కళ్ల నిండా నిరాశ. తప్పదు మరి. ఇంకో సంవత్సరం అదే యుద్దానికి కొత్తగా సిద్ధమయ్యాడు.
రామయ్య… ప్రతి సోమవారం బ్యాంకుకి వెళ్తూనే ఉన్నాడు. “ఇంకా పడలేదు ” అనేదే శాశ్వత సమాధానం.
చివరకు పొలం అమ్మేశాడు. అప్పిచ్చినవాడు లాక్కున్నాక అమ్మక తప్పని పరిస్తితి.
ఆ మహిళ…
“మీ కంప్లైంట్ మా దగ్గరకు రాలేదు ” అనే సమాధానం వినీ వినీ విసుగేసి మళ్లీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
హింసకు అలవాటు పడడాన్ని అలవాటు చేసుకుంది. దుఖ్కంలో హాయిని వెతుక్కునే కళ నేర్చుకుంది.
ఆ విద్యార్థికి డెడ్‌లైన్ దాటిపోయిందని మెయిల్ వచ్చింది.
మరో సంవత్సరం వేచి చూడాల్సిందే, తప్పదు.
ఆ ఆసుపత్రి బెడ్ ఖాళీగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆ రికార్డులు అక్కడికి చేరలేదు.
కాలచక్రాన్ని కొంచెం వెనక్కి తిప్పితే..
నగర శివార్లలో మిల మిలా మెరుస్తున్న వెలుగులలో అతి పెద్ద భవనం. వేలాది కంప్యూటర్లు. ఎయిర్ కండిషనర్లు. నీలి లైట్లు. అక్కడే
అందరి కలలు ఒక్కచోటికి పోగవుతున్నాయి.
ఒక సెక్యూరిటీ గార్డు టీ తాగుతున్నాడు. “ర్యాక్-17 హీట్ ఎక్కువగా ఉంది.” ఒక టెక్నీషియన్ అన్నాడు.
” కొద్దిసేపట్లో వెళ్లి చూస్తా ” అననైతే అన్నాడు కానీ అతను వెళ్లలేదు.
రాత్రి 10:41. మొదట చిన్న పొగ. తర్వాత చిన్న మంట. ఒక వైర్. ఒక స్పార్క్. ఒక అలారం. ప్రమాద హెచ్చరిక ఒక నిమిషంలో.
మరో ర్యాక్. ఇంకో ర్యాక్. సర్వర్లు. స్టోరేజ్. బ్యాకప్. పొగతో నిండిపోయాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ అయింది.
కొంత డేటా బతికిందేమో తెలియదు. కొంత డేటా శాశ్వతంగా మాయమయింది. ఏవి పోయాయో ఏవి ఉన్నాయో అప్పుడు ఎవరికీ
తెలియదు.
ఆ అగ్నిప్రమాదం గురించి పేపర్లో ఒక్క చిన్న వార్త వచ్చింది.
“ప్రైవేట్ డేటా సెంటర్లో మంటలు. సేవలకు స్వల్ప అంతరాయం.”
అంతే. ఆ వార్త చదివిన వాళ్లలో చాలా మంది తమ జీవితంలోని ఆ ఒక్క రోజు కూడా అదే మంటల్లో కాలిపోయిందని తెలుసుకోలేదు.
తెలిసే అవకాశం లేదు.
…….
మరుసటి రోజు డాటా సెంటర్ లో కాలిపోయిన ర్యాక్‌లను క్రేన్‌తో బయటకు తీస్తున్నారు. గాలిలో ఇంకా కాలిన ప్లాస్టిక్ వాసనే ఉంది.
ఒక ఇంజనీర్ కాలిపోయిన హార్డ్‌డిస్క్‌ను చేతిలో అటూ ఇటూ తిప్పి చూస్తూ అన్నాడు.
“వింతగా ఉంది కదా…” పక్కనున్న మరో ఇంజనీర్ తలెత్తి చూశాడు.
“ఏమిటి?”
“ఇది మనకు ఒక హార్డ్‌డిస్క్ మాత్రమే.” కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.
“కానీ ఎవరికో ఇది ఇంటి నుంచి పారిపోవాలని పంపిన చివరి మెసేజ్ అయుండొచ్చు.”
“అది ఎవరికో ఉద్యోగ దరఖాస్తు అయుండొచ్చు.” ఇంకో కాలిపోయిన సర్వర్ వైపు చూపించాడు.
మరో ర్యాక్. “అది రైతు బీమా క్లెయిమ్ అయుండొచ్చు.”
“లేదా…” అని రెండో ఇంజనీర్ మెల్లగా అన్నాడు.
“…ఆసుపత్రికి చేరాల్సిన ఒక మెడికల్ ఫైల్.”
ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డారు. బూడిదలో బూట్ల చప్పుళ్లు వినిపించాయి. కొద్దిసేపటి తర్వాత ఇంజనీర్ నవ్వాడు.
“మనం సర్వర్లు కాలిపోయాయని రిపోర్ట్ రాస్తాం.”
రెండో ఇంజనీర్ తల అడ్డంగా ఊపాడు. “లేదు.”
“మరి?”
“ఇది అగ్నిప్రమాదం కాదు.”
“మరి?”
“ఆశల దహనం.” ఇంజనీర్ ఏమీ మాట్లాడలేదు. కాలిపోయిన కేబుల్‌ను కాలితో పక్కకు జరిపాడు.
“చిన్నప్పుడు మా ఊర్లో పోస్ట్‌బాక్స్‌కి ఎవరో నిప్పు పెట్టారు. అప్పుడూ ఎన్ని ఆశలు కాలిపోయాయో ఎవరికీ తెలియదు.”
అతడు బూడిదను చేతిలోకి తీసుకున్నాడు. ” అప్పుడు మనుషులు ఆశలను కవర్లలో పెట్టి పంపేవాళ్లు “
చేతిలో బూడిదను నెమ్మదిగా జార్చాడు.
“ఇప్పుడు ఫైళ్లలో పెట్టి క్లౌడ్‌లో పెడుతున్నారు.” కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
“ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా …గమ్యానికి చేరని సందేశాలు మాత్రం చావడం లేదు.”
రెండో ఇంజనీర్ చిరునవ్వు నవ్వాడు.
“సందేశాలు మారాయి. మధ్యవర్తులు మారారు. సర్వర్లు మారాయి. కానీ… ఇద్దరూ బూడిదను చూస్తూ ఒకేసారి అన్నారు.
“ఎదురుచూపు మాత్రం మారలేదు.”
మళ్లీ నిశ్శబ్దం. కొద్దిసేపటికి మొదటి ఇంజనీర్ అడిగాడు.
“ఈ బూడిదలో ఎంత డేటా ఉండి ఉంటుంది?” రెండో ఇంజనీర్ తల ఊపాడు.
“డేటా కాదు. జరగకుండా అదృశ్యమైన అనుభవాలు.”
“అర్థం కాలేదు.”
“కొన్ని ప్రేమలు కలవలేదు. కొన్ని ఉద్యోగాలు రాలేదు. కొన్ని ఫిర్యాదులు వినిపించలేదు. కొన్ని అప్పులు తీరలేదు. కొన్ని ప్రాణాలు
ఆసుపత్రికి చేరలేదు. అవి విడివిడిగా జరిగిన దురదృష్టాల్లా కనిపిస్తాయి. కానీ…” అతడు బూడిద కుప్పలోంచి కనపడుతున్న ఒక
నల్లటి చిప్‌ను తీసి పట్టుకున్నాడు.
“బహుశా… అవన్నీ ఒకే రాత్రి ఇక్కడే చనిపోయాయి.”
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. బయట చెత్త ట్రక్కు హారన్ వినిపించింది. కార్మికులు కాలిపోయిన ర్యాక్‌లను ట్రక్కులోకి
విసురుతున్నారు.
ఇంజనీర్ ట్రక్కు వైపు చూస్తూ మెల్లగా అన్నాడు “వాళ్లు పారేస్తోంది ఇనుమునే అనుకుంటున్నారు, కానీ కాదు, అది జీవించలేకపోయిన
జీవితాల చరిత్ర.”
ఒక ఇంజనీర్ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత బూడిదనే చూస్తూ మెల్లగా అన్నాడు.
“మనం బతికిన జీవితానికి రికార్డులు ఉంటాయి. మరి బతకలేకపోయిన జీవితాలకు?”
రెండోవాడు ఆకాశం వైపు చూశాడు. “వాటిని క్లౌడ్ కూడా నిల్వచేయదు.”
…….. ……… ……….
కొన్ని నెలల తర్వాత…
ఆ కాలిపోయిన సర్వర్ల బూడిద కలిపిన మట్టిలో కొన్ని మొక్కలు మొలిచాయి. వాటి వేర్లలో ఏముందో ఎవరికీ తెలియదు.
బహుశా…ఒక ప్రేమలేఖ. ఒక ఉద్యోగం. ఒక రైతు పొలం. ఒక పుట్టని శిశువు. ఒక స్త్రీ ధైర్యం. ఒక విద్యార్థి కల.
అందరూ వాటిని సాధారఃణ చెట్లనే అనుకున్నారు. కానీ ప్రతి వసంతంలో అవి పచ్చగా మారినప్పుడల్లా,
గమ్యాన్ని చేరలేకపోయిన సందేశాలన్నీ ఇంకా పూర్తిగా చనిపోలేదని ప్రకృతి ఒక్కసారైనా గుర్తు చేసేది.
రైటర్స్ నోట్
……………
ఈ కథ చదవగానే సాంకేతికంగా ఇలా జరగదు అనిపించడం ఖాయం. కానీ ఈ కథ ఆలోచన రావడానికి కారణం అవునా ఇలా కూడా జరుగుతుందా అనిపించిన ఈ సంఘటనే . ఇది ఎక్కడో చదివినపుడు ఈ వస్తువు మెరిసింది. ఇదిగో ఇది చదివితే ఈ కథ ఎలా
సాధ్యమో అర్దమవుతుంది.
The OVHcloud data center fire in Strasbourg, France, March 2021. One of Europe’s biggest
cloud providers had an entire building (SBG2) burn
down. Companies and individuals
who hosted email servers there without offsite backups permanently lost mail — including
messages that had arrived but hadn’t been read yet, and messages in transit that were
queued on those servers. Some small businesses lost years of correspondence overnight.
That’s a documented, verifiable event.
How the “in transit” loss works technically: when a mail can’t be delivered instantly, it sits
in a queue on an intermediate server, retrying for typically 24–72 hours. If that server is
destroyed (fire, flood, disk failure) while the mail is queued, the message is simply gone —
and the “delivery failed” notice that should go back to the sender is also generated by that
same dead server, so no notification ever arrives. Both ends stay silent.
మార్చి 2021లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన OVHcloud డేటా సెంటర్ అగ్నిప్రమాదం. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ.
యూరప్‌లోని అతిపెద్ద క్లౌడ్ సేవల సంస్థల్లో ఒకటైన OVHcloudకు చెందిన SBG2 అనే మొత్తం డేటా సెంటర్ భవనం పూర్తిగా
దగ్ధమైంది.
ఆ డేటా సెంటర్లోనే తమ ఈ-మెయిల్ సర్వర్లను హోస్ట్ చేసుకుని, వాటికి వేరే ప్రాంతంలో (offsite) బ్యాకప్‌లు ఏర్పాటు చేయని
సంస్థలు, వ్యక్తులు తమ ఈ-మెయిళ్లను శాశ్వతంగా కోల్పోయారు. అందులో ఇప్పటికే సర్వర్‌కు చేరుకున్నప్పటికీ ఇంకా చదవని
మెయిళ్లు కూడా ఉన్నాయి. అలాగే, గమ్యస్థానానికి చేరే ప్రయత్నంలో ఆ సర్వర్ల క్యూలో (queue) వేచి ఉన్న “ప్రయాణంలో ఉన్న”
(in transit) ఈ-మెయిళ్లు కూడా పూర్తిగా అదృశ్యమయ్యాయి. కొన్ని చిన్న వ్యాపార సంస్థలు ఏళ్ల తరబడి సాగిన తమ వ్యాపార
ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ ఒక్క రాత్రిలోనే కోల్పోయాయి. ఇది నమోదైన, ధ్రువీకరించదగిన వాస్తవ సంఘటన.
“In Transit” లో ఉన్న ఈ-మెయిల్ ఎలా శాశ్వతంగా పోతుంది?
సాంకేతిక వివరణ
