Home ఇంద్రధనుస్సు “కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల” భావాత్మకమైన పాట

“కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల” భావాత్మకమైన పాట

by Vishvaika

రాజమౌళి గారు దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇందులో తారక్,రామ్ చరణ్ లు హీరోలుగా చేసారు. కథాకమామీషు పక్కనపెడితే ఈ మధ్య ముందుగా వచ్చే పాటలతోనే సినిమాలు సగం హిట్ కొట్టేస్తున్నాయి. ఒక్క పాట ఆ సినిమా పరిధిని ఎక్కడికో తీసుకెళ్ళి పోతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను అందించారు మన యం.యం.కీరవాణి గారు. అంతకంటే అద్భుతమైన పద సంపదను సమకూర్చారు మన పాటల రచయితలు. ప్రస్తుతం మనం ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని ఒక చక్కని పాట గురించి మాట్లాడుకుందాం. మూవీ లో మొదటిగా వచ్చే పాట “కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల” పాట. దీనిని సుద్దాల అశోక్ తేజ గారు రాసారు. అసలు సినిమా మొదలయ్యేది ఈ పాట తోనే. గోండు జాతికి చెందిన ఒక చిన్నారి బ్రిటిష్ రాణి చేతికి మెహందీ పెడుతూ ఈ పాట పాడుతుంటుంది. కొండ కోనల్లో తిరిగే చిన్నారులు హాయిగా ఆడుకుంటూ పాడుకునే ఆహ్లాదకరమైన గాలి పాటలా ఉంటుంది ఈ పాట. పసితనపు ఛాయలు వీడని ఒక చిన్నారి, అమ్మే తన లోకంగా ఆ కొండ ప్రాంతపు ప్రకృతిలో తనతో పాటు స్వేచ్ఛగా తిరిగే జంతు జాలాలనే సహవాసాలుగా భావించి తన పాటలో వాటిని జత కడుతుంది. తాను ఉంటున్న చిన్ని ప్రపంచంలో తాను పొందుతున్న ఆనందానుభూతులు తనతో ఎప్పటికీ అలానే ఉండాలని, ఉంటాయని భావిస్తూ పాట పాడుతుంటుంది. ఈ పాటకు కీరవాణిగారు అందించిన బాణీలు ఎంతో మధురంగా మనసును తాదాత్మ్యం చెందిస్తుంటాయి. చిన్నారుల గురించి పాట రాయడం వేరు. కానీ చిన్నారులు పాడే పాట రాయాలి అంటే వారి వయస్సు లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిందే. గీత రచయిత అశోక్ తేజ గారు ఇలా మనకు ఒక మంచి పాటను అందించటానికి ఆ వయసుకు వెళ్ళి ఆపాప ఆలోచనా దృక్పథాన్ని మన ముందుంచారు.
ఇంతకీ ఈ పాట పాడింది ఎవరో తెలుసా? ‘ప్రకృతి’ అనే మరో చిన్నారి. కీరవాణి అద్భుతమైన బాణీలకు, అశోక్ తేజగారి అందమైన పదసంపద తోడయ్యి, ‘ప్రకృతి’ గళం లోని మాధుర్యం సినిమాలో నటించిన చిన్నారి చక్కని నట ప్రదర్శన వెరసి ఒక అందమైన పాట మనముందు ఆవిష్కృతమయ్యింది.

You may also like

Leave a Comment