Home ఇంట‌ర్వ్యూలు గతం లేకపోతే వర్తమానం లేదు

గతం లేకపోతే వర్తమానం లేదు

by Aruna Dhulipala

నమస్కారం సార్

విజ్ఞానఖని అయిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీ విషయాలను మా మయూఖ పాఠకులకు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది మొదటగా….

జ:-  అందరికీ నమస్కారం. నాపేరు ముదిగొండ శివప్రసాద్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మయూఖ నిర్వాహకులకు, పాఠకులకు నా హృదయపూర్వక శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇవాళ ధూళిపాళ అరుణమ్మ ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను 1940 డిసెంబర్ 23 న జన్మించాను. ఒంగోలు ముఖ్యపట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం మా ఊరు. మా ఇంటిపేరు ముదిగొండ, మా తాతగారి ఊరు కొంపల్లి. చారిత్రకంగా పరిశీలించినట్లయితే క్రీ.శ. 1323 సెప్టెంబర్ తర్వాత కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. అప్పుడు ముదిగొండ వారు, కొంపల్లి వారు, ములుగు వారు వీళ్లంతా వలస వెళ్లారు. సాగరాంధ్రలో ముఖ్యంగా కృష్ణానది, గోదావరి నదీ తీరాల్లో సెటిలయ్యారు. 1940లో రజాకార్ల ఉద్యమం తర్వాత మళ్ళీ వలస వెళ్లారు. ఈ వలసలకు పెద్ద చరిత్రే ఉంది. మా అమ్మ రాజేశ్వరమ్మ, నాన్నగారు మల్లికార్జునరావు గారు. ఆరోజుల్లో ఆయన పెద్ద వక్త. ఆయన వరంగల్ లో టీచరుగా పనిచేసేవారు. ఆయన సుప్రసిద్ధ రచయిత, సనాతన ధర్మప్రచారకుడుగా ఉండేవాడు. ఇది 1930 నాటి మాట. చివుకు అప్పయ్యగారి సంపాదకత్వంలో ‘దివ్యవాణి’ అనే పత్రిక వస్తుండేది. దానికి మా నాన్నగారు పర్మినెంట్ రైటర్ గా ఉన్నాడు. నా బాల్యంలో మా ఇంట్లో ఎటుచూసినా పుస్తకాలే ఉండేవి. మా నాన్నగారు ఒక చిన్న పత్రికకు ఎడిటర్ గా కూడా ఉన్నాడు. అయితే ఆయన అకాల మరణంతో మా కుటుంబమంతా చెల్లాచెదరై పోయింది. ఆ తర్వాత స్వయంకృషితో చదువుకున్నాను. 1955 వరకు నా బాల్యంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయాలేవీ లేవు. కానీ మా నాన్నగారి ప్రభావం మాత్రం నామీద ఉంది.

జ:-   నేను బాల్యంలోనే ఎంతోమంది సుప్రసిద్ధ రచయితలను చూశాను. కొంతమంది నాకు టీచర్లుగా ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రిగారు నాకు చాలా సన్నిహితులు. అట్లాగే వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు, తల్లావజ్ఝల శివశంకరస్వామి వారి కొడుకు, శ్రీరామ భుజంగ వెంకటశర్మగారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, గంటి జోగిసోమయాజి గారు, ఎస్వీ జోగారావు గారు ఇలాంటి వారు టీచర్లుగా ఉండడం వల్ల నామీద వారి ప్రభావం చాలానే ఉంది. దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి వద్ద రెండేళ్లు వ్యాకరణం నేర్చుకున్నాను.

జ:-  నేను రచనా వ్యాసంగంలో ప్రవేశించిన దశలోనే బందరులో ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణాపత్రిక వస్తుండేది. ఆ కాలంలో చాలా ప్రసిద్ధి ఉన్నటువంటి పత్రిక. ఆయన తదనంతరం కాటూరి వెంకటేశ్వర రావుగారు, కమలాకర వెంకటరావు గారు కొంతకాలం నడిపినట్టున్నారు. తర్వాత దానికి భౌతిక శరీరం మాత్రం పోయి కీర్తి శరీరం మాత్రం మిగిలింది. ఆ దశలో సుబ్రహ్మణ్య శర్మగారు ఆ పేపర్ ను కొని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇక్కడ నేను సంపాదకవర్గంలో చేరాను. అప్పుడే నాకు జర్నలిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పత్రిక నాకు, నేను ఆ పత్రికకు ఎంతో ఉపయోగపడ్డాం. ఆ పత్రికలో నేను రాసిన వ్యాసాలు సంచలనాత్మకంగా ఉండేవి. కృష్ణాపత్రిక అంటే ముదిగొండ శివప్రసాద్ అన్నంత ముద్రపడింది. సాహిత్యపరంగా అది నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రముఖుల రచనలను అందులో వేశాము. నా నవలలు కూడా రెండు మూడు కృష్ణా పత్రికలో అచ్చయినాయి. ఆ రోజుల్లో సమకాలీన పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జాగృతి ఇప్పటికీ వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు 77 ఏళ్ల చరిత్ర కలిగి ఇప్పటికీ బ్రతికున్న ఏకైక పత్రిక, అవిచ్ఛిన్నంగా వస్తున్న పత్రిక జాగృతి వారపత్రిక. మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

జ:-   నేను కృష్ణాపత్రిక సంపాదకవర్గంలో ఉన్నప్పుడు దివాకర్ల వేంకటావధాని గారు “బాబూ! నువ్వెంత గొప్ప రచయిత అయినా జీవితంలో నీకొక స్థిరత్వం కావాలంటే నువ్వు అధ్యాపక వృత్తిలో ఉండడం మంచిది. పైగా నీలో బోధన కళ ఎక్కువగా ఉంది. అందువల్ల నీవు టీచరుగానే అభివృద్ధిలోకి రావాల”ని చెప్పారు. మొదట1959లో హైదరాబాద్ లో టీచరుగా జాయినయ్యాను. తర్వాత భద్రుక కాలేజీలో లెక్చరర్ గా చేరాను. ఆ తర్వాత బొగ్గులకుంట ఓరియెంటల్ కాలేజీలో పనిచేశాను. తర్వాత కొన్ని ప్రయివేటు కాలేజీలలో చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీలో సెలక్షన్ వచ్చింది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా లెక్చరర్ గా, రీడర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశాను. ఉద్యోగ జీవితంలో job satisfaction అంటారే అది పూర్తిగా నాకు కలిగింది. నా దగ్గర 30 మంది ఎంఫిల్, పిహెచ్ డి డిగ్రీలు తీసుకున్నారు. ఉస్మానియా, కాకతీయ, నాగార్జున, గుల్బర్గా, చెన్నై, ఆంధ్ర ఇట్లా వివిధ విశ్వవిద్యాలయాల్లో నా సాహిత్యం మీద పదిమంది పి హెచ్ డి లు చేశారు. నాకు దివాకర్ల వేంకటావధాని గారు చాలా సన్నిహితులైనారు. ఆయనను ఒక వ్యక్తిగా కాక ఒక సంస్థగా చెప్పుకోవాలి. నా జీవితంలో నేను చూసిన మహాపురుషుల్లో ఆయన అగ్రగణ్యులు. అదే విధంగా బిరుదురాజు రామరాజు గారు, ఇరివెంటి కృష్ణమూర్తి గార్ల ప్రేమకు పాత్రుడనయ్యాను. అట్లాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆనాటి రచయితలు గుంటూరు శేషేంద్రశర్మ గారు, బాపురెడ్డి గారు, డా. సి. నారాయణ రెడ్డి గారు, బోయి భీమన్న గారు, పోతుకూరి సాంబశివరావు గారు, దాశరథి కృష్ణమాచార్యులు గారు, దాశరథి రంగాచార్యులు గారు అదేవిధంగా వరంగల్ లో ఉన్నటువంటి రచయితలు కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, మాదిరాజు రంగారావు గారు, వె. నర్సింహారెడ్డి గారు యూనివర్సిటీ లో పనిచేసినప్పుడు వీళ్ళలో కొంతమంది నాకు కొలీగ్స్ కూడా. పేర్వారం జగన్నాథం గారు, హరి శివకుమార్ గారు, అనుముల కృష్ణమూర్తి గారు వరంగల్ లో సోమేశ్వరశర్మ గారు అని ప్రసిద్ధ రచయిత ఉండేవారు. వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

జ:-  నాకు 1970లో నాకు డాక్టరేట్ వచ్చింది. నా పిహెచ్ డి టాపిక్ “ఆధునికాంధ్ర కవిత్వంపై ఉద్యమాల ప్రభావం”. డా.సి.నారాయణరెడ్డి గారు నాకు గైడు. వంద సంవత్సరాలుగా రాజకీయ, సాంఘిక, సాహిత్య ఉద్యమాలన్నీ వచ్చినప్పుడు దాని ప్రభావం వల్ల సాహిత్యం ఎట్లా మారుతూ వచ్చిందో పరిశోధించి రాశాను. అందులోని ఒక్కొక్క అధ్యాయం మీద ఒక్కొక్కరు పి హెచ్ డి చేశారు. ఆ కాపీలన్నీ అయిపోయాయి. మార్కెట్లో దొరకడం లేదు. రీ ప్రింట్ చేయాలి. అట్లాగే న్యూఢిల్లీ వారు సీనియర్ ఫెలోషిప్ పేరుతో స్కాలర్ షిప్ ఇస్తారు. దానికోసం రాసిందే “కాకతీయ కళాదర్శనం”. అందులో ఆనాటి కాకతీయుల రాజకీయ, సాహిత్య, సామాజిక, కళారంగాల వైభవాన్ని విశ్లేషిస్తూ ఒక ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. ఒకరకంగా అది Post doctoral Research అని చెప్పవచ్చు. It’s only for scholars. అది సిద్ధాంత గ్రంథం కాబట్టి పరిశోధించి రాశాను. కథలు, నవలలు చదివినట్టు వీటిని అందరూ చదవరు. చదివే పాఠకులు కొద్దిమందే ఉంటారు. కాకపోతే ప్రామాణికంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ గా ఉన్నవాళ్లే చదువుతారు.

జ:-    సాహిత్యం వైపు దృష్టి సారించినప్పుడు నాకు ప్రధాన గురువులు ముగ్గురు. ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండవవారు అడవి బాపిరాజు గారు, నోరి నరసింహ శాస్త్రిగారు మూడవవారు. ఈ ముగ్గురిలో కొన్ని విశిష్ట వ్యక్తిత్వాలున్నాయి. విశ్వనాథ వారి రచనలో ఔద్ధత్యం ఎక్కువగా ఉంటుంది. అడవి బాపిరాజు గారు సహజంగా చిత్రకారుడు. ఆయన అక్షరాలతోనే ఎక్కువ బొమ్మలు గీస్తారు. అందువల్ల లాలిత్యం ఎక్కువ. నరసింహ శాస్త్రి గారు చారిత్రక ప్రమాణాల కోసం ఎక్కువగా కృషి చేస్తారు. ఈ మూడు గుణాలను నేను వారి నుండి అధ్యయనం చేశాను. మొదటగా నేను సాంఘిక నవలలను రాశాను. ఒకదాన్ని ఆంధ్రప్రభకు ఇచ్చాను. వాళ్ళు నాది వేసుకోమన్నారు. ఎందుకని అడిగాను? “యద్ధనపూడి సులోచనా రాణిలాగా రాస్తే వేస్తాము. మా పాఠకులకు మీవంటి రచనలు చదివే ఓపిక లేదు. దానివల్ల మా సర్క్యులేషన్పె రగదు” అన్నారు. దాన్నొక ఛాలెంజ్ గా తీసుకున్నాను. నిజానికి చారిత్రక రచనల వల్ల సమాజానికి ఎంతో ఉపయోగం ఉంది. అందుకే శాతవాహనుల నుండి మొదలుపెట్టాను. శాతవాహనుల గురించి 6 నవలలు రాశాను. ఒక్కొక్క పీరియడ్ ను తీసుకున్నాను. వసంత గౌతమి, ఆచార్య నాగార్జున, శ్రీలేఖ, శ్రావణి ఇట్లా రాశాను. శ్రీలేఖ అయితే 36 నెలలు ‘విజయ’ అనే మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. ‘మాలిక్ కాఫర్’ ఆంధ్రభూమి వీక్లీలో వచ్చింది. వేయిస్తంభాల గుడి మీద ‘ఆవాహన’ నవల రాశాను. పాఠకులకు బాగా నచ్చిన నవలల్లో ఇది ముఖ్యమైంది. ఇప్పటికి కూడా ఎక్కడికైనా వెళ్తే అదిగో వేయిస్తంభాల గుడి! అంటారు (నవ్వుతూ). సమ్మక్క సారక్కల గురించి రాశాను. కాకతీయుల మీద మరో రెండు నవలలు రాశాను. ‘తంజావూరు విజయం’ పేరుతో రఘునాథ నాయకుని గురించి రాశాను. అది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టడంతో 3 లక్షల కాపీలు అచ్చువేశారు.  అన్నమాచార్య ట్రస్ట్ వారు ‘శాండిల్య’ అనే పేరుతో ఒక సంస్థ పెట్టారు. వాళ్ళు అన్నమయ్య జీవితం మీద ఒక నవల రాసి ఇవ్వమంటే ‘శ్రీపదార్చన’ పేరుతో రాశాను. దాన్ని లక్ష కాపీలు వేశారు. ఇవన్నీ ఏ విధంగా చూసినా తెలుగు సాహిత్యంలో గొప్ప రికార్డు సృష్టించగలిగాను. దానికి స్వయంకృషితో పాటు ఈశ్వరానుగ్రహం కూడా ఉంది. ఇప్పటికి నేను 152 పుస్తకాలు రాశాను.

జ:-    నేను చారిత్రక నవలలతో పాటు సాంఘిక నవలలు కూడా ఎన్నో రాశాను. ‘వంశధార’ అని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నవల రాశాను. ఇది రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ పుస్తకానికి కొనసాగింపుగా ఉంటుంది. మా ఇద్దరికీ ఎంతో సాన్నిహిత్యం ఉండేది. మా ఊళ్ళో వాళ్ళ ఇల్లు తూర్పు బజారున ఉంటే మాది పడమట బజారున ఉండేది. అంత చిన్న కుగ్రామం నుండి ఆయన, నేను, మరికొంతమంది ప్రముఖ రచయితలు రావడం విశేషం. ఇంకో అంశం ఏమిటంటే నేను కృష్ణాపత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాకు గొప్ప Contributor. ఆయన అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయనకు మా నాన్న వయసు ఉండేది. నన్ను శివుడూ! అని సంబోధించేవారు. “శివుడూ! నా నవల కొంచెం మీరు సీరియల్ గా వేస్తే నాకు కొంతలాభం ఉంటుంది”  అన్నారు. నేను ‘పాకుడురాళ్లు’ నవలను సీరియలైజ్ చేశాను. ఆ నవలకే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఏడాదిన్నర పాటు పత్రికలో వరుసగా వేశాను. వారానికి ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళం (ఇది 1960 నాటి మాట). ఒక్కో నెలలో 5 వారాలు వచ్చేవి. ఆయనకు  మొత్తం 30 రూపాయలు ఇస్తే పరమానంద భరితులయ్యేవారు. అప్పట్లో అది పెద్దమొత్తమనే చెప్పొచ్చు. విశ్వనాథ వారి ఆరునదులు, బాణావతి, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు, దమయంతి స్వయంవరం ఇవన్నీ నేను సంపాదకవర్గంలో ఉన్నప్పుడే వేశాను. విశ్వనాథ వారి ఒక్కో నవలకు రెండువేల రూపాయలు ఇచ్చాము.

జ:-    గ్లోబలైజేషన్, పారిశ్రామికీకరణ, అధిక జనాభా, గ్రామీణ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం లాంటి వాటివల్ల భారతీయ కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నది. దీని గురించి, భారతీయ వ్యవస్థపై దాడులను గురించి ప్రభాతగీతంలో చెప్పాను. 1916 నుండి 2016 వరకు గల వందేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రగా దీన్ని చెప్పొచ్చు. ఇక ప్రతిభ నవల ఒక కళాకారిణి జీవితం గురించి చెప్పినది. సమాజంలో కళను నమ్ముకొని బ్రతికేవారి వాస్తవ జీవితాన్ని వివరించాను. కేవలం కళ కోసం జీవితం అంకితం చేసిన వారికి వృత్తి, వ్యక్తిగత జీవితం ఒక్కటే ఉంటాయి. 1983 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన మరోనవల ‘అమృతసరోవరం’. అది అనేకమంది పాఠకులను ఆకర్షించింది.

జ:-    అది సెటైరికల్ గా రాసినది. వెయ్యేళ్ళ క్రితం నాటి నన్నయ్య మళ్లీ రాజమండ్రిలో పుడితే వర్తమాన భాషా సాహిత్య సాంస్కృతిక పరిస్థితులకు ఎట్లా స్పందిస్తాడని ఊహించి రాసింది. ఇందులో దివి నుండి భువికి దిగి వచ్చిన నన్నయ్య, సూత్రధారుడైన నాంచారయ్య ఈ రెండు ప్రధాన పాత్రలుగా ఈ నవల రాశాను.

జ:-    నేను చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా పెరిగాను. అందువల్ల హిందూత్వ ఇన్ ఫ్లూయెన్స్ నా మీద బలంగా ఉంది. అయితే కరోనా కాలంలో బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతంలో క్రిస్టియానిటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఉదాహరణకు 1947 ప్రాంతంలో కోనసీమ వేదాలకు పుట్టినిల్లు. అక్కడ 0.5% క్రిస్టియానిటీ ఉండేది. 2020 నాటికి అది 22 శాతానికి పెరిగింది. గ్రామాలకు గ్రామాలను కన్వర్షన్ చేయించారు. అప్పుడు నేను బైబిల్ తెప్పించాను. అందులో అసలు ఉన్నదేంటి? అని ఒక పాస్టర్ అధ్యయనం చేసినట్లు చేశాను. అంతా చదివి ఇందులో ఏమీ లేదని, ఇదంతా అబద్ధమని, అసలు క్రీస్తు లేడని నిరూపించాను. దాన్ని ప్రూవ్ చేసిన పరంపరలో 8 పుస్తకాలు రాశాను. వాటినే క్రైస్తవాష్టకం అంటారు. ఈ కల్పన బాగుంది, దొంగలున్నారు జాగ్రత్త, సత్యమేవజయతే పార్ట్ 1, పార్ట్ 2, ఏసు చారిత్రక పురుషుడా?, బైబిల్ డీ కోడ్, గంగ నుండి గంగ వరకు ఇట్లాంటివి. అవి ఎంత సంచలనం సృష్టించాయంటే హిందువుల కన్నా వాటిని క్రైస్తవులే ఎక్కువగా చదివారు. ఈ విధంగా నేను చేసిన ప్రయత్నాలు ఎంతో సక్సెస్ ని సాధించాయి. యూట్యూబ్ లో కూడా వీటికి సంబంధించి, హిందూ ధర్మాన్ని గురించి నావి ఎన్నో వీడియోలు ఉన్నాయి.

ముదిగొండ శివప్రసాద్ గారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

జ:-   నేను వేదాలలో మొదటిదైన ఋగ్వేదం మీద బాగా పరిశోధన చేశాను. ఋగ్వేదం కోడ్ లాంగ్వేజ్ లో ఉంటుందమ్మా! మనకు అర్థం కాకపోవడానికి అదొక కారణం. వేద పండితులు మంత్రాలను చదువుతారు కానీ వాటికి అర్థాలను చెప్పరు. చాలామందికి తెలియదు కూడా. దాన్ని డీకోడ్ చేయడం అంత సులభం కాదు. ‘విద్యారణ్యం’ అని విద్యారణ్య స్వామి రాసిన పుస్తకం ఒకటుంది. దాన్ని బేస్ గా చేసుకొని చెప్తారు. ఎంతోమంది డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు చేయకపోలేదు. అట్లా ప్రయత్నాలు చేసిన వారిలో ఒకరు అరవిందఘోష్. 1916లో ‘ఆర్య’ అని ఆయన మాసపత్రిక ఒకటుండేది. దాంట్లో ఆయన ఈ మంత్రాలను డీకోడ్ చేసి సీరియలైజ్ చేశారు. అది ‘మిస్టిక్ ఫైర్’ అనే పుస్తకంగా వచ్చింది. నేను ‘ఋగ్వేదభాష్యం’ అనే పుస్తకం రాశాను. అది ఎక్కువ పాపులర్ కాలేదు. అందులో ఋగ్వేదంలో ఉన్న మంత్రాలకు అర్థం చెప్పడానికి ప్రయత్నించాను. ఇది వేదానికి సంబంధించి నేను చేసిన కృషిలో ఒక భాగం.

జ:-   నేను ఋగ్వేదంలో ఉన్న జ్యోతిష్యం గురించి చెప్పాను. ఋగ్వేదంలో చాలా రహస్యాలున్నాయి. అందులో ఉదాహరణకు… “చత్వారి శృంగా త్రయో అస్య పద ద్వే శీర్షే సప్త హస్తసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహో దేవో మర్త్యామ్ ఆ వివేశ” దీనికి వ్యాకరణ శాస్త్రపరంగా అందరూ అర్థం చెప్పుకుంటూ వచ్చారు. నాకిందులో గాయత్రీ మంత్ర రహస్యం స్ఫురించింది. ఇట్లాంటి రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఇంకా పబ్లిష్ చేయలేదు. నాకు స్ఫురించినవి సరియైనవో కావో నిర్ధారించడానికి పండితులకు చూపించాలి. వాళ్ళచేత కూడా ఆమోదముద్ర వేయించుకోవాలి.

జ:-     మీరు అన్నది వాస్తవమే. కొన్ని వేలసంఖ్యలో వ్యాసాలు రాశాను. అవన్నీ ఎక్కడికో పోకుండా ఇప్పటికి 25 వాల్యూమ్స్ వేశాను. ఇంకా పబ్లికేషన్ కు పది వాల్యూమ్స్ కు సరిపడా వ్యాసాలున్నాయి. వేయాలని తపన ఉంది. కానీ ఈరోజుల్లో పుస్తకం వేయడం వ్యయప్రయాసలతో కూడినది. పోనీ వేయకుండా ఉంటే ఎవరు పట్టించుకుంటారు? చేసిన కృషి వ్యర్థమవుతుంది కదా! ఒక పుస్తకం వేస్తే కనీసం 100 సంవత్సరాలు నిలిచివుంటుంది. ఇట్లా సాహిత్య, కళా రంగంలో నేను చేసిన కృషికి పూర్తి సంతృప్తి పొందాను. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాను. వాళ్లందరికీ మయూఖ పత్రిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. వయోధర్మాన్ని బట్టి కొంత చూపు తగ్గింది. అయినా రాయడం ఒక్కరోజు కూడా ఆపడం లేదు.

జ:-     ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులు చదవడం తగ్గిపోయింది. ఆనాటి పద్యాలు, కనీసం ప్రాచీన కవుల పేర్లు కూడా తెలియడం లేదని, ఆ దశలో సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు కనీసం ఒక రెండుగంటల్లో ప్రాథమిక పరిచయం వాళ్లకు కలుగజేస్తే బాగుంటుందన్న ఆలోచన దివాకర్ల వేంకటావధాని గారికి వచ్చింది. దాంతో ఆయన ‘భువనవిజయం’ రూపకల్పన చేశారు. అల్లసాని పెద్దనగా దివాకర్ల వారు, మహామంత్రి తిమ్మరుసుగా నేను వేసేవాణ్ణి. ఆనాటి సుప్రసిద్ధులు ఆయా కవుల పాత్రలను పోషించేవారు. ఇది ఎంతో జనరంజకంగా ఉండడంతో ఒక్క కాశ్మీర్ తప్ప ఆంధ్రదేశమంతటా ప్రదర్శనలిచ్చాం. దివాకర్ల వారి తదనంతరం నేను ఒక టీం ను ఏర్పాటుచేసి అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ ఇట్లా చాలా దేశాలకు వెళ్ళాం. పదకొండు వందల సార్లు నేనే భువనవిజయం వేశాను. ఏ రకంగా చూసినా ఇది పెద్ద రికార్డు. ఒకప్పుడు శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి ఇలాంటి పౌరాణిక, చారిత్రక నాటకాలు వేల సార్లు ప్రదర్శించబడేవి. కానీ ఒక సాహిత్య రూపకం 11, 12 వందల సార్లు ప్రదర్శించబడడం గొప్ప విషయం. ఇందులో దాశరథి కృష్ణమాచార్యులు గారు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి సుప్రసిద్ధులు వేసేవారు. ఒక దశలో పివి. నరసింహారావు గారు శ్రీకృష్ణ దేవరాయల పాత్ర వేశారు. ఆ ప్రదర్శనలో నేను లేను. 1950-55 మధ్యకాలంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, జమ్మలమడుగు మాధవశర్మ గారు వీరు గుంటూరులో ‘భువనవిజయం’ వేశారట. నేను విన్నానే గానీ చూడలేదు. ఇట్లా భువనవిజయం చరిత్ర సృష్టించింది. మా టీంలో ముదిగొండ వీరభద్రమూర్తి గారు, ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు, తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు ఇట్లాంటి మహానుభావులు ఉండేవాళ్ళు. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ గారి చేత శ్రీకృష్ణదేవరాయలు వేయించాము. జి.వి.సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణుడుగా వేసేవారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పట్టణాల్లోనూ చరిత్ర సృష్టించాము. దీనివల్ల సంతృప్తితో పాటు గొప్ప సేవ చేశామన్న ఆనందం లభించింది.

జ:-    ఆనాటి ప్రముఖులందరితో నాకు సాన్నిహిత్యం లభించడం నేను అదృష్టంగా భావిస్తాను. మొదటినుండీ హిందూధర్మం మీద అత్యంత గౌరవం ఉన్న నాకు దివాకర్ల వారు “తెలుగు భాష – దాని యొక్క గొప్పతనం, భారతీయ సంస్కృతి దాని వైశిష్ట్యం ఈ రెండూ లేకుండా నీ ఉపన్యాసాలు ఉండొద్దని, ఈ రెండింటి చుట్టూనే అన్ని విషయాలు ఉన్నాయ”ని  చెప్పిన విషయం ఎప్పుడూ మరువలేదు. ఇప్పటికీ ఆ సూచనను అనుసరించి నడుస్తున్నాను. దేశ విదేశాలన్నీ తిరిగి నేను దాదాపు 25 వేల ఉపన్యాసాలు ఇచ్చాను. హిందూ ధర్మ ప్రచారం కోసం షార్జా, సింగపూర్, జర్మనీ, బ్రిటన్ లోని స్కాట్లాండ్, ఐర్లాండ్ మొదలగు దేశాలు పర్యటించి వారికి అనుగుణంగా ఇంగ్లీషులో తెలుగులో ఉపన్యాసాలిచ్చాను. అయితే ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిన విషయం మీకు చెప్పాలి. మాంచెస్టర్ చిన్న ఊరు. అన్నీ బట్టల మిల్లులే. బ్రిటిష్ కాలం నుండి ఇండియాకు వచ్చేవి. ఇప్పటికీ గ్లాస్కో, మాంచెస్టర్ అనే బట్టలన్నీ అక్కడివే. మనదేశం నుండి చాలామంది అక్కడ స్థిరపడ్డారు. అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినపుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి “నమస్కారం సార్ ! మీ హీరోయిన్ ను పిలవమంటారా”? అంది. నాకర్థం కాలేదు. ఒక అమ్మాయిని పిలిచి తన కూతురని, ఆ అమ్మాయి పేరు శ్రీలేఖ అని చెప్పింది. ఆవిడది గుడివాడ. భర్త ఇక్కడ పనిచేస్తున్నాడు. డెలివరీకి గుడివాడ వచ్చినప్పుడు నా ‘శ్రీలేఖ’ నవల చదివి అమ్మాయి పుడితే శ్రీలేఖ అని, అబ్బాయి పుడితే ఆ నవల కథానాయకుడు విజయదత్తు అని పెట్టుకోవాలనుకున్నదట. ఎక్కడి గుడివాడ? ఎక్కడి మాంచెస్టర్? ఒక రచయితకు అంతకన్నా గర్వకారణం ఏముంటుంది? అట్లాగే నేను ‘శ్రావణి’ అనే ఒక నవల రాశాను. అది ఆంధ్రభూమి పత్రికలో ధారావాహికగా వచ్చింది. అందులో కథ ఒక డైమండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ లో కొన్ని జ్యువెలరీ షాపుల వాళ్ళు పాతపేరు కొట్టేసి శ్రావణి జ్యువెలర్స్ అని పెట్టుకున్నారు. నేను అందులో శనిదోష నివారణ కోసం కొన్ని శనేశ్వరునికి సంబంధించిన మంత్రాలు పెట్టాను. ఆ డైమండ్ ఇంద్రనీలమణికి చెందినది. దాన్ని SAPPHIRE అంటారు. ఆ పత్రిక వాళ్ళు “శ్రావణి సీరియల్ వస్తున్నది. ఈ సంచికను ఒక్కసారి చేత్తో తాకండి. మీకు అన్ని అదృష్టాలు కలిసివస్తాయి” అని ప్రచారం చేశారు. దాంతో “ఆ సంచికను తాకితే సాయంత్రం వరకు అదృష్టం కలిసి వచ్చిందని ఉత్తరాలు రాసిన వాళ్ళూ ఉన్నారు (నవ్వుతూ). ఇట్లాంటివి నాకు ఎంతో సంతోషాన్ని అనుభూతిని మిగిల్చాయి.

జ:    నా రచనా వ్యాసంగంలో నాదైన శైలిలోఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. ఐడియలాజికల్ గా హిందూ ధర్మ సిద్ధాంతాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పోరాటం సాగిస్తూనే వచ్చాను. దిగంబర కవులతోను, మార్క్సిస్టు కవులతోను సాహిత్య యుద్ధాలు జరిగాయి. ఇవన్నీ సిద్ధాంతపరంగా తప్పితే వ్యక్తిగతంగా కావు. ఇందులో సహకరించిన వాళ్ళు, విభేదించిన వాళ్ళూ ఉన్నారు. అయినా రచనా వ్యాసంగంలో నాకు చాలా సంతృప్తి ఉంది. నాకు కుర్తాళం పీఠాధిపతి వారు కనకాభిషేకం చేశారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు సువర్ణ గండ పెండేరం తొడిగారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వర్ణ కంకణం తొడిగారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఎన్టీరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ‘శ్రీపదార్చన’ రచనకు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ది బెస్ట్ నావెల్’ అవార్డు తీసుకున్నాను. రాజశేఖర్ రెడ్డిగారు, చెన్నారెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, జలగం వెంగళరావుగారు ఇట్లా అనేక దాదాపు తెలుగు ముఖ్యమంత్రులందరి చేత వివిధ సందర్భాలలో అవార్డులు అందుకున్నాను. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేయడం గొప్పగా భావిస్తాను. నా దగ్గర చదువుకున్న చాలామంది ఉన్నతదశలో ఉన్నారు. వెలుదండ నిత్యానందరావు, సూర్యా ధనుంజయ్ వీళ్ళు వైస్ ఛాన్స్ లర్స్ అయ్యారు. అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ఉన్నవారు, విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారూ ఉన్నారు. కడియం శ్రీహరి ఒకసారి కలిసినప్పుడు నా స్టూడెంట్ అని చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఇవన్నీ నాకు గౌరవాలే.   సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతాను. నేను ఈ మధ్య పురస్కారాల గురించి ఒక ఆర్టికల్ రాశాను. ఢిల్లీకి వెళ్లి పురస్కారాలు కొంటున్నారమ్మా! దీని ద్వారా ఆ వ్యక్తులు ప్రతిపాదిస్తున్నటువంటి, వ్యక్తీకరిస్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దానికి పురస్కారం లభించడం ద్వారా దానికి మాన్యత కలిగించినట్టవుతున్నది. నేను వీరసావర్కర్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, స్వామి రామనంద తీర్థ వీళ్లకు భారతరత్న ఎందుకు రాలేదని అడిగాను. పివి నరసింహారావు గారికి కూడా చాలాకాలం తర్వాత వచ్చింది. కొంతమంది సాహిత్య అకాడెమీని కొన్నారమ్మా! మీ  మయూఖ పత్రిక ద్వారా ఈ విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎంత కాలం దుర్మార్గాన్ని సహిస్తాం? సాహిత్యాన్ని గొప్పగా సృష్టించినవారికి ఇవ్వండి. మీ పత్రిక ద్వారా ఓపెన్ గా చెబుతున్నా. అందరికీ తెలియజేయండి. వీరసావర్కర్ కు, సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న వచ్చేవరకు మేము ఆందోళన చేస్తూనే ఉంటాం. భారతచరిత్రలో ఈ ఇద్దరి పేర్ల తర్వాతనే మూడవపేరు చెప్పండి ఒప్పుకుంటాం. What are the priorities? Why you have neglected Subhash chandra bose and Swathantra Veera savarkar?  ఇవ్వాల్సిన సరియైన వారికి ఇవ్వండని అంటున్నాం. నిరంతర సాహితీ కృషి చేసిన వాళ్ళని వదిలిపెట్టి డబ్బుకు పురస్కారాలు ఇవ్వడం ఏమిటి?

జ:-    గతం కాదోయి నాస్తి, అది అనుభవాల ఆస్తి. గతం లేకపోతే వర్తమానం లేదు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదు. అందువల్ల చారిత్రక నవలలు సమకాలీన వ్యవస్థపై తప్పనిసరిగా ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటివారికి ఆనాటి చరిత్ర గానీ, కనీసం ఆ పేర్లు గానీ తెలియవు. నేను ఇటీవల ముసునూరి నాయకుల మీద ‘అమృతోదయం’ వారి చరిత్రను ప్రామాణికంగా రాశాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది కదా! కాకతీయుల రాజ్యం ప్రతాపరుద్రుని అనంతరం పతనమయిన తర్వాత ముసులూరి నాయకులు వచ్చారు. దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు ముస్లింల నుండి మన ఆంధ్ర రాజ్యాన్ని కాపాడారు. ఆ చరిత్ర అంతా రాశాను. ఇలాంటివి తెలుసుకుంటేనే కదా మన అస్తిత్వం తెలిసేది. ఆ పరంపరను విస్మరించి నేనేదో స్వయంభూగా వచ్చానని అనుకుంటే ఎట్లా?  ఆనాటి చరిత్ర నుండి నేర్చుకున్న పాఠాలే మనకు దారి చూపుతాయి. అది మరువరాదు.

జ:-    సమాజంలో పరిణామం సహజం. ఇది నిర్ద్వంద్వంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికపరంగా పరిణామం జరుగుతూనే ఉంటుంది. అలాగని ప్రతీదాన్ని అనుసరిస్తూ పోవడం కాదు. మన కర్తవ్యాన్ని పరిస్థితులకనుగుణంగా మనం నిర్వర్తించాలి. భారతంలో ఒక పద్యం ఉంది. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా వెళ్ళినప్పుడు కౌరవసభలో…
“సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత
బొంకుచే బారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారక మయ్యు సత్య శుభ దాయకమయ్యును దైవముండెడున్” అని చెప్తాడు.
అంటే తప్పు చేసినవాడు చేసినప్పటికీ దాన్ని చూస్తూ విజ్ఞులు తప్పు అని చెప్పకపోవడం తప్పు. We are intellectuals, is it not our basic duty to preserve, protect and propagate? సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. నాకెందుకన్న అలసత్వం పెరిగిపోయింది. ఒక గమ్మత్తు చెబుతాను. ఎవడో అంటాడు “వీరశివాజి పక్కింట్లో పుట్టాలి, పప్పన్నం తినాలి మా ఇంట్లో చిన్నారి” ( నవ్వుతూ) అంటే శివాజీ మనింట్లో పుట్టక్కరలేదా? అంటే ఎవడో వస్తాడు. ఏదో చేస్తాడు. నాకు సంబంధం లేదు. ఇది పోవాలి. ఒకప్పుడు సమాజానికి ‘ధర్మం’ కేంద్రబిందువుగా ఉండేది. ఇప్పుడు ‘అర్థం’ కేంద్రబిందువయింది. జీవితానికి సుఖమనేది శరీరధర్మం. శాంతి మనోధర్మం. కానీ ఇప్పుడు శరీరం సుఖంగా లేదు మనసు శాంతిగా లేదు. దీనికి సమాజంలో బాధ్యత గల ఆర్ష ధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేయాలి. ప్రతీ వ్యక్తికీ ఒక విద్యుక్త ధర్మం ఉంది. అది నిర్వర్తించకపోతే అధర్మం చేస్తున్నట్లు. అది చూస్తున్న మనం తప్పు చేస్తున్నాం. అందువల్ల మన వయసుతో నిమిత్తం లేకుండా మనం నిరంతరంగా, చిరంతనంగా, సనాతనంగా, పురాతనంగా, దివ్యంగా, భవ్యంగా సమాజాన్ని జాగృతం చేస్తూనే ఉండాలి. ఇది అందరి కర్తవ్యం.

ధన్యవాదాలు సార్🙏🏼 మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించి మీ జీవిత విశేషాలను తెలియజేసినందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.

You may also like

Leave a Comment