Home ఇంట‌ర్వ్యూలు చక్కటి భాషను ఉపయోగించండి- సృజన సమాజానుకూలంగా చేయండి – డా. సంగనభట్ల నర్సయ్య

చక్కటి భాషను ఉపయోగించండి- సృజన సమాజానుకూలంగా చేయండి – డా. సంగనభట్ల నర్సయ్య

by Aruna Dhulipala

సాహిత్యము, సంగీతము, ఆధ్యాత్మికము, పరిశోధన, కళారంగాల్లో కృషి చేస్తూ తెలుగు భారతికి విశేష సేవలందిస్తున్న డా. సంగనభట్ల నర్సయ్యగారి జీవిత ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
 
నమస్కారం సార్..

1ప్ర :- మీ జననం, పుట్టిన ప్రాంతం వివరాలు చెప్పండి.
జ:-     నమస్కారం అమ్మా! మయూఖ పత్రికకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకోవడం చాలా విశేషమని అనుకుంటున్నాను. పైగా అది అంతర్జాల పత్రిక. పాఠకుల సంఖ్య కూడా ఎక్కువే. మీరు అడిగిన విధంగా నా జీవిత విశేషాలను చెబుతాను. నేను 1954 జూలై 23వ తేదీన పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గ్రామంలో పుట్టాను. మా అమ్మ నర్సుబాయమ్మ. మా నాన్న సంగనభట్ల వెంకన్న. ఆయనను వ్యవసాయ విజ్ఞాన నిపుణుడు అని చెప్పుకోవచ్చు. మా గ్రామానికి ఒరుసుకొని గోదావరీ నది పారుతూ ఉంటుంది. మనకు అలంకార శాస్త్రంలో “గంగాయామ్ ఘోషః” అనే మాట ఒకటి ఉంది. శబ్ద శక్తులు అభిద, వ్యంజన, లక్షణ అని మూడురకాలు. అందులో లక్షణ శక్తికి ఉదాహరణగా ఈ మాట ఉంటుంది. నేను పనిచేసిన కళాశాల ప్రహరీగోడ అవతలి వైపు దూకితే గోదావరిలో పడేంత దగ్గరగా ఉంటుంది. మావూరు తీర్థ క్షేత్రం. రెండు అర్హతలు ఒక్కచోట ఉండడం అరుదు. అది ఒక విశేషమైతే రెండవది మా ఊరు 3 వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. మన ఉభయరాష్ట్రాల్లో ఇంత ప్రాచీనమైన గ్రామాన్ని చూడము. దానికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయి. దానిమీద “ధర్మపురి క్షేత్ర చరిత్ర” పుస్తకాన్ని నేను రాశాను.
 
2 ప్ర :-  మీ విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని తెలపండి.
జ :-      మేము అగ్రహారీకులం కావడం వలన వంశాచారాన్ని అనుసరించి బాల్యంలోనే ఉపనయనం జరిగి సంస్కృతాధ్యయనం, వేదాధ్యయనం చేశాను. మా కుటుంబంలో నేను పెద్దవాడిని. 1969 లో నా హెచ్.ఎస్.సి పూర్తయింది. అది తెలంగాణ వేర్పాటు ఉద్యమ దశ. మేమంతా ఉద్యమవీరులం. ఒక పదిరోజులు జైలులో కూడా ఉన్నాను. అంతకు ముందు 4, 5 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో పెట్టిన “శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల” (సాయం కళాశాల)
లో ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరాను. డిప్ ఓ ఎల్, బి ఓ ఎల్, ఎమ్ ఓ ఎల్ చేశాను. తర్వాత ఎమ్ ఎ. పి హెచ్ డి. అన్నీ మావూళ్ళోనే. నేను తర్కం, వ్యాకరణం, సంస్కృత కావ్యాలు, ఛందశ్శాస్త్రం సాంప్రదాయకంగా సంస్కృతం బేస్ డ్ గా చదివాను. తర్కశాస్త్రం, కావ్యాలు కొన్నింటిని కొరిడె రామారావు గారి దగ్గర, కాశీవజ్ఝల మృత్యుంజయ శర్మగారి దగ్గర సిద్ధాంత కౌముది, గుండి రఘురామ శాస్త్రిగారి దగ్గర రఘువంశం చదువుకున్నాను. వాళ్లంతా స్థానిక పండితులే కాక రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. హిందీ శ్యామ్ సుందర్ గారి వద్ద చదువుకున్నాను. ఒక విశేషం ఏమిటంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన 60 సంవత్సరాల వరకు మా ఊరు నుండి నేను బయటకు రాలేదు.
          చదివిన కాలేజీలోనే లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేశాను. చదువుతున్నప్పుడే ఒక ఎయిడెడ్ పోస్టులో, పగలు నడిచే సంస్కృత పాఠశాలలో టీచరుగా పనిచేశాను. సుమారు 40 సంవత్సరాలు నా సర్వీసు. ఓరియెంటల్ కళాశాలలో 8 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్ గా చేశాను. నేను ప్రిన్సిపాల్ గా పనిచేసిన కాలం ఒక రికార్డు. 28 సంవత్సరాలకే ప్రిన్సిపాల్ గా చేరి, 58 సంవత్సరాలు వచ్చేవరకు 30 సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా అది కూడా ఒకే కాలేజీలో చేయడం విశేషం. అభివృద్ధిలో కానీ, విస్తరణలో కానీ నేను దానికి ఉద్యోగిగా కాక తల్లికి చేసినట్టు సేవలందించాను.
 
3 ప్ర :-మీ కుటుంబ నేపథ్యాన్ని వివరించండి.
జ :-      మా ఇంటి పేరు సంగనభట్ల. సంగనభట్టు అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబం కాబట్టి ఆ పేరు వచ్చింది. 8 వందల సంవత్సరాల క్రితం కన్నడ బ్రాహ్మణుడు సంగనభట్టు మా ఊరికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. అప్పటికే పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలం ముగుస్తున్న దశ. అతని వంశీకులుగానే మేము తామరతంపరగా పెరిగాము. దాదాపు 500 బ్రాహ్మణ కుటుంబాలున్న ధర్మపురిలో 150 వరకు సంగనభట్ల వంశీయులవే ఉంటాయి. మరొక విశేషం ఏంటంటే ఇన్ని కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబం కూడా ఊరు వదిలి మరోచోటికి వలస వెళ్ళింది లేదు. దానివల్ల ఉభయ రాష్ట్రాలలో మా ఇంటిపేరు గలవాళ్ళం మేము తప్ప ఎవరూ లేరు. కొన్ని ఇతర కుటుంబాల వలె మాది గ్రామ నామంతో కాక వ్యక్తి విశిష్ట నామంగా ఏర్పడింది. మా తండ్రులు, తాతలు అంతా ఆ ఊరివాళ్లే.
       మా పెదనాన్నగారు రామకృష్ణ  ఘనపాఠి గోదావరి జిల్లాల్లో వేదసభలు నిర్వహించి ‘జగజ్జేయుడు’ అనిపించుకున్నాడు. తెలంగాణ నుండి 80 సంవత్సరాల క్రితం అక్కడి ప్రాంతాలన్నీ తిరిగి ‘విజయుడు’ అని పట్టా పుచ్చుకునేవరకు కదిలేవాడు కాదు. ఆయన చరిత్ర పుట్టపర్తిలో వేద కాలేజీ ప్రిన్సిపాల్ నాకు చెప్పాడు. మా పెద నాన్నగారితో ఈయనా తిరిగేవాడట. ఇక మాతామహుల వైపు మా తాతగారు హరికథలు చెప్పేవాడు. సంగీత విద్వాంసుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఒక్క రామదాసు కథను 400 హరికథలు చెప్పాడు. ఆ రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ గ్రామం తిరిగాడు. ఆ కథలో లీనమై కథ చెబుతూ ఏడుస్తుంటే, ప్రేక్షకులు కూడా ఏడ్చేవారట. అంత ప్రసిద్ధి ఆయన కథనం. మా మేనమామ చాచం కిష్టయ్యగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా సంగీతం పాడేది. త్యాగరాయ కృతులతో నాకు జోల పాటలు పాడేది. ఆమె విదుషి కూడా. పురాణ, ఇతిహాస కథలు చెప్పేది. ఆమె బాల్యంలో చదువుకోకపోయినా నాతో పాటు అక్షరాలు దిద్ది చదువుకున్నది. వేదం చదువుకున్నప్పటికీ జాగీర్దార్లం కావడం వలన పౌరోహిత్యం చేసేవాళ్ళం కాదు. మా మేనమామ కుటుంబం మాత్రం మా ఊళ్ళోనే పౌరోహిత్యంతో పాటు, ఆయుర్వేద వైద్యం కూడా చేసేవాళ్ళు.
         
4 ప్ర :-దేశి ఛందస్సు మీద పిహెచ్ డి చేయాలనే మీ కోరికకు కారణం ఏమిటి?
జ:-       ఓరియెంటల్ కాలేజీ కావడం వల్ల మాకు ఛందో వ్యాకరణాలు గురువులు చెప్పేవారు. మేము కూడా విశేష అధ్యయనం చేయడం జరిగింది. గ్రామీణ వాతావరణం కనుక పాటలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. వచనం కంటే భిన్నంగా పాటలెందుకు ఆకర్షిస్తాయి? అనే ఒక ఊహలో నుంచి పరిశోధన చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ కాలంలో ‘భారతి’ వంటి ప్రసిద్ధ పత్రికలు ఉండేవి. అప్పకవి తెలుగులో గొప్ప ఛాందసికుడు. ఆయన చెప్పిన కందభేదాలు అసమంజసమంటూ ఆ పత్రికకు ఒక వ్యాసం రాశాను. అది పెద్ద సంచలనం ఆ రోజుల్లో. బిరుదు రామరాజు గారు ఆ వ్యాసం చూసి “ఛందస్సులో మీరు పరిశోధన చేస్తే బాగుంటుంది”. అని అప్లికేషన్ పంపించారు. ఛందస్సులో పరిశోధన చేయడానికి అది ఒక కారణం. నేను అధ్యయనం చేస్తున్నప్పుడు  ‘అప్పకవీయము’ ను క్షుణ్ణంగా చదివాను. ఆయన 40 దాకా యతిభేదాలు చెప్పారు. ఇవన్నీ అవసరం లేదనేది నా భావన. ఇది రెండవ కారణం. పి హెచ్ డి సీటు ఇవ్వడానికి సినారె గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. చాలాసేపు ఛందస్సు మీద ఆయన ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. చివరకు ఆయన ” నేనొక వేళ సీటు ఇవ్వకపోతే మీరేం చేస్తారు?” అని అన్నారు. ” సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పరిశోధన కొనసాగిస్తూనే ఉంటాను” అన్నాను. ‘బాగా చెప్పావు’ అన్నారు నవ్వుతూ. 26వ యేట సీటు పొంది 32వ ఏట పూర్తిచేశాను. పి హెచ్ డి పట్టా రావడానికి ఆలస్యమైంది.
 
5 ప్ర :- ఆ జాప్యానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ:-        ముఖ్యంగా రెండు కారణాలు. లెక్చరర్ గా ఉన్నప్పుడు పి హెచ్ డి రిజిస్టర్ చేస్తే, ప్రిన్సిపాల్ అయ్యాక బాధ్యతలు పెరిగి ఆలస్యమవడం ఒక కారణం. రెండవది…నేను తీసుకున్న అంశం “తెలుగులో దేశి ఛందస్సు – ప్రారంభ వికాస దశలు”. దేశి ఛందస్సులన్నీ గేయ మూలాలు అనే ప్రతిపాదనతో పాటు ఏ గేయం నుండి ఏ ఛందస్సు పుట్టింది? గణవ్యవస్థ ఏమిటి? వీటన్నిటి మీద పరిశోధన చేశాను. చివరి క్షణాల్లో నాకు వచ్చిన మరొక ఆలోచన ఏమిటంటే తెలుగు భాష అభివృద్ధిలోకి రావడానికి పూర్వం మన తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన భాష ప్రాకృతం. మరి ప్రాకృత భాషా ప్రభావం ఈ ఛందస్సుల మీద ఉండకూడదా? జనాల్లోనూ, సాహిత్యంలోనూ, పాటల్లోనూ ప్రాకృత భాష ఉంది. అది లేకుండా నేను చేసిన పరిశోధన అసంపూర్ణమవుతుందని భావించి ప్రాకృత ఛందస్సులు చదివాను. సీస పద్యంలో పద్యం మీద పద్యం ఉండడం మన ఛందస్సులో లేదు. అది ప్రాకృత భాషకు చెందిన ఛందస్సుగా గుర్తించాను. అట్లాగే కందం ఆర్యా ఛందస్సు మనది కాదు. అది పది రకాలుగా ఉంటుంది. దాంట్లో ‘గాహా’ అనేది ఒక ఛందస్సు. ప్రాకృతంలో ప్రసిద్ధి. హాలుడు రాసిన ‘గాథా సప్తశతి’ లో గాథ అంటే ప్రాకృతంలో ‘గాహా’. అది ఒక ఛందస్సు పేరు. మనమనుకునే కథ అనే అర్థం కాదు. ఏడు వందల కథలు కావు. ఏడువందల శ్లోకాలు.
ప్రాకృతంలో ఉన్న వీటన్నిటినీ పరిశీలించి సమగ్రంగా రాయడం వల్ల ఆలస్యమైంది.
    4, 5 ఏళ్ళలో పి హెచ్ డి పుస్తకం రావడం విశేషమైతే అచ్చు వేసిన తక్షణం బాగా ప్రాచుర్యం పొంది వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్య గ్రంథంగా
తీసుకోవడం, రెండుసార్లు అచ్చు కావడం మరీ విశేషం. ఈ విషయంలో సినారె గారు ఎంతో ప్రశంసించారు. పాటిబండ మాధవశర్మ గారి తర్వాత 25 ఏళ్లకు ఉస్మానియాలో దీనిపైన పరిశోధన చేసిన వ్యక్తిని నేనే. మాధవశర్మ గారు కేవలం మహాభారతంలో ఛందస్సు ఉపయోగించడం ద్వారా రసావిష్కరణ ఎలా జరిగిందో చూపించారు. కానీ నేను మొత్తం శాస్త్రం మీదనే పరిశోధన చేశాను. 1300 సంవత్సరాలలో ఛందస్సు పుట్టుక, పరిణామం, వికాసం వీటన్నిటి మీద పరిశోధన చేశాను. ఇలా నా అభిరుచి తప్ప మరొకటి కాదు. ఆరు పాదాల జానపద గేయం సీస పద్యంగా మారిందని, సీస పద్యానికి ఆరు పాదాలేనని చెబుతూ నేను ఒక పరిశోధన వ్యాసం రాశాను. అది చూసిన చేకూరి రామారావు గారు “ఈ ఒక్క దానికే మరొక పి హెచ్ డి ఇవ్వొచ్చు” అన్నారు. అలా నా ఇష్ట పూర్వకంగా సమగ్ర పరిశోధన చేశాను.
 

సంగనభట్ల నర్సయ్యగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

6 ప్ర :- సంస్కృత ఛందస్సుల నుండి మన తెలుగులోకి మారిన విధానాన్ని తెలపండి.
జ :-      సంస్కృత ఛందస్సులన్నీ మనవి కావు. అవి మార్గి. గణ వ్యవస్థ, త్య్రక్షర గణాలు, ఉత్పలాది పద్యాలు, షడ్వింశతి ఛందాలు మొత్తం సంస్కృతం నుండి వచ్చినవే. అక్కడినుండి మన తెలుగులోకి తెచ్చుకున్నాం. ఛందస్సు రెండు రకాలు. ఒకరకంగా చెప్పాలంటే గంగా యమునలు. గంగానది దేశి ఛందస్సు అనుకుంటే యమున మార్గి. బయట నుండి వచ్చిందని అర్థం. త్య్రక్షర గణ ఛందస్సులన్నీ సంస్కృతం. అయితే వాటిని మనం సొంతం చేసుకునేటప్పుడు యతి, ప్రాసలను జోడించాము. అవి సంస్కృతంలో ఉండవు. సంస్కృతంలో ప్రాస అంటే అనుప్రాసాలంకారంలో ఉంటుంది. యతి కూడా మనలాగా ఉండదు. కేవలం విశ్రాంతి. అసలు యతి అనేది మన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలతో తయారైంది. పాదం ఒకచోట ఆపాలంటే, ఉచ్ఛ్వాస ద్వారా గాలి లోపలికి పీలుస్తాం. అక్కడ శబ్దం పుట్టదు. నిశ్శ్వాసలో ధ్వనులు పుడతాయి. మన ఊపిరి ఎంతవరకు ఆపగలుగుతామో అంతవరకు ఉచ్చరించ గలుగుతాము. తరువాత ఉచ్ఛ్వాస ద్వారా గాలి పీలుస్తాం. అక్కడే మధ్యలో యతి ఉంటుంది. అందుకే సంస్కృతంలో పాదాన్ని ఆపడమంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలే ప్రధానం. అందుకే అక్కడే యతి పాటించడం జరుగుతుంది. “యతిర్విచ్ఛేద సంజ్ఞితా” అని శాస్త్రం. అంటే పదం ముగిసి తరువాతి అక్షరం దగ్గర యతి విచ్ఛేదం అవుతుంది. మనకు తెలుగులో అట్లా కాదు. విచ్ఛేదం కాకున్నా సంఖ్యా నియమానుసారం యతి పాటిస్తాం. దీన్ని ‘సదృశాక్షర యతి’ అంటారు. ఇలాంటి మార్పులతో సంస్కృతం నుండి ఛందస్సు తెలుగులోకి వచ్చింది.

 7 ప్ర :- గోదావరీ తీర వాసులు కావడం వల్ల బాల్యం నుండీ పుష్కర స్నానంలో పునీతులు అయ్యారు..అలాగే మీ  “పుష్కర విశిష్టత” గ్రంథానికి మీకు కలిగిన ఆసక్తి కారణమా? లేక ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా?
జ :-     ఆధ్యాత్మిక రంగం నా పరిధిని విస్తృతం చేసింది. నేను సుమారు పది పన్నెండు అంశాల మీద గ్రంథాలు రాశాను. పరిశోధన చేశాను. ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుట్టడం వలన గోదావరీ నదీ తీరం కాబట్టి పుష్కరాలు నాలో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా గోదావరి నది పుష్కరాలు మిగతా నదుల కంటే విశేషం. ఎందుకంటే గోదావరి నదికి మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు ఉంటాయి. గురువు సింహరాశిలో ప్రవేశించగానే ఆది పుష్కరాలు వస్తాయి. గురువు కన్యా రాశిలో ప్రవేశించే 12 రోజుల ముందు అంత్య పుష్కరాలు వస్తాయి. ప్రాచీన గ్రామాలన్నీ, రాజధాని నగరాలన్నీ నదీ తీరంలోనే వెలిశాయి. ఎందుకంటే నది లేకుండా మానవ జీవనం లేదు. నది ఒడ్డున ఉండే జీవితం గొప్పది. నేను 30 సంవత్సరాలు ఏ ఒక్కరోజు తప్పకుండా నదిలో స్నానం చేశాను. నదిలో ఈత కారణంగా వ్యాయామం అవుతుంది. అందులో ధర్మపురికి చాలా విశిష్టత ఉంది. నేను ఈ విషయాల్లో రాసిన రచనల ద్వారా ప్రసిద్ధుడనైన తరువాత చాలా పత్రికల వాళ్ళు నన్ను గోదావరి పుష్కరాల పైన వ్యాసాలు రాయమని అడిగి రాయించుకున్నారు. పుష్కరాల తర్వాత వాటిని వదిలివేయకుండా ఆ వ్యాసాలన్నీ సంకలనంగా వేయాలని నాకనిపించింది. అందులో ఈ వ్యాసాలతో పాటు కొంత ఆధ్యాత్మికత జోడించి, నదిలో స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాలను చెప్పాలో వాటిని కూడా జత చేయడం వల్ల ఒక కరదీపికగా ఉంటుందని అలా ఈ పుస్తకం వేసి అందరికీ పంచిపెట్టాను. ఆ విధంగా ఆ నదీమతల్లి ఋణం తీర్చుకున్నాను. గోదావరికి గంగ అనే పేరు శాసనాల్లోనే ఉంది. కుందమాంబ ఆదిలాబాద్ జిల్లాలో వేయించిన శాసనంలో ఏ భూమినైతే బ్రాహ్మణుడికి దానం చేసిందో, దాని సరిహద్దులు చెబుతూ దక్షిణం వైపు గంగ ఉన్నదని చెప్పడం జరిగింది. అంటే గోదావరి గంగ పేరుతో ప్రసిద్ధం అని అర్థం. మా ఊరికి అటు వైపు కాశి పేట, కాశి అనే ఊర్లున్నాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలంగాణలో దక్కను పీఠభూమి మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు నదీ తీరాల్లోనే ఉన్నారు. అందువల్లనే మాలాంటి ఊళ్ళు మూడు వేల సంవత్సరాల కిందటినుండే ఉన్నవని చరిత్ర చెబుతుంది. మిగతావి అవసరార్థం ఏర్పడినవి. తరువాతి కాలంలో పుష్కరాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కానీ మాకు ఆ తేడా లేదు. నీటిలో ఉండే చేపపిల్ల, నేను సమానమే రోజూ జలక్రీడలే (నవ్వుతూ). నది వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మెత్తటి ప్రాంతాల్లో ఉండే మట్టిని పైకి లేపుతుంది. అక్కడ జలాశయాలు ఏర్పడతాయి. అవి మాకు క్రీడా కేంద్రాలుగా ఉండేవి. అంత అనుబంధం గోదావరితో. అందుకే ఆ చరిత్రను రాశాను.
 
8 ప్ర :- రంగస్థలంపై మీ ప్రదర్శనలకు తొలి సోపానం ఏది? వాటి మీద మీ అభిరుచికి కారణం ఏమిటి? మీ నట ప్రస్థానం గురించి చెప్పండి.

        ప్రధానంగా నేను హైస్కూలులో విద్యనభ్యసిస్తున్నప్పుడు విద్యార్థిగా నాటకం వేశాను. ప్రైమరీ, హైస్కూల్ దశలో నాటకం వేసే దిశగా ప్రేరేపిస్తే
 ఎంతస్థాయికి ఎదిగినా ఆ వ్యక్తి నాటకం వేస్తాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాటకాలు వేశాడు. నేను హిందీ
నాటకాలతో మొదలుపెట్టాను. ‘సోనే కీ వర్షా’ అని , రామ్ కుమార్ వర్మ రాసిన నాటకంలో దశరథుని తండ్రి అజమహారాజు పాత్ర వేశాను. 11 వ తరగతిలో ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏక పాత్రాభినయం చేశాను. మా బంధువర్గంలో చాలామంది నాటకాలు వేయడం, మా పూర్వీకులు వేస్తున్నవి చూడడం, శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఉండడం, మంచి గాత్రం ఉండడం ఇవన్నీ నాటకాలు నా జీవితంలో భాగం కావడానికి కారణాలు. పౌరాణిక పద్య నాటకాలు కూడా వేశాము. నేను నలభై రాగాల్లో పద్యాలు పాడగలను. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత పద్యాలు పాడడం చూసి ‘SICA’ ( South Indian Cultural Association ) సంస్థ వాళ్ళు పోతన భాగవతం మీద ఉపన్యసించమని అడిగారు. ఎలాగంటే కనీసం 30 పద్యాలు పాడాలి. 20 రాగాల్లో పాడాలి. ప్రతీ పద్యం ముందు రాగం పేరు చెప్పాలని కోరారు. అంటే సాహిత్య ప్రసంగాన్ని హార్మోనియం జతగా చేశాను. హిమాయత్ నగర్ బాలాజీ భవన్ లో ఇది జరిగింది. మా ఊళ్ళో”ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి” అనే పేరుతో నాటక సంస్థ థియేటర్లు లేని కాలంలో పెద్ద థియేటర్ లో నడుపబడేది. దాదాపు వేయి మంది ప్రేక్షకులు కూర్చుండే విధంగా సినిమా టాకీసు వలె నడిచేది. అటువంటి దానిలో నేను భాగస్వామిని అయ్యాను. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, గయుడు, భీముడు, వీరభద్రుడు మొదలైన అనేక పాత్రల్లో దాదాపు 50 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంకా వేస్తూనే ఉన్నాను. సాహిత్య రూపకాల్లో శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నందితిమ్మన మొదలగు పాత్రలు వేయడం జరిగింది.
 
9 ప్ర :-  నాటకరంగానికి మీరు అందించిన సేవలు ఎటువంటివి?
జ :-   మా ఊళ్ళో నాటకాలు చూసే వాళ్ళ సంఖ్య అధికం. బ్రహ్మోత్సవాల్లో నాటకం వేయడం ఒక నియమం. “శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి” లో 88 సంవత్సరాలుగా నాటకాల ప్రదర్శన జరుగుతున్నది. నేను మూడవతరం వాడిని. నా ముందు రెండు తరాల వాళ్ళు బొంబాయి నుండి వస్తువులు తెచ్చుకునే వాళ్ళు. ఎవరి మేకప్ వాళ్లే వేసుకునేవారు. నేను కూడా చాలా కాలం అదే చేశాను. తర్వాత కాలంలో బయటి ప్రాంతాలకు వెళ్లి పోటీల్లో పాల్గొనడం, తెలుగు విశ్వవిద్యాలయ పోటీలకు, నంది పోటీలకు వెళ్లడం ప్రారంభించాము. నేను అతి బాల్యం నుండే నాటకాలు వేస్తూ వివిధ పాత్రలు ధరించాను. సాంఘికాలు, చారిత్రకాలు, పౌరాణికాలు ఇలా మూడు రకాల నాటకాలు వేశాను. వీర కాపయ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు వంటి నాటకాలు ప్రదర్శించేవాళ్ళం. సమయాన్ని వృధా చేసుకుంటూ, వైవిధ్యం లేకున్నా, పద్యాన్ని జిలేబీ చుట్టలాగా చుడుతూ గంట నాటకాన్ని మూడు గంటలు చేయడం వంటి వాటికి నేను వ్యతిరేకిని. నా దృష్టిలో ప్రధానమైనది పద్యం, పద్యంలోని భావం. మంచి గొంతు లేకపోయినా, రాగం తెలియకపోయినా దాన్ని తగ్గించి భావానుగుణంగా పద్యం పాడితే చాలు. లేకుంటే నాటకం రక్తి కట్టదు. రసావిష్కరణ జరుగదు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుండి రాగ ప్రధానంగా వుండే నాటకాలు నాకు నచ్చేవి కావు. అదృష్టవశాత్తూ అప్పుడే సినిమాల్లో ఘంటసాల ప్రవేశం కావడం, సంక్షిప్తంగా పద్యాలు చదవడం చూసి ఆ పద్ధతిలో పద్యాలు చదవడం ప్రారంభించాము. ఆ కాలంలో నాటకం ఒక గొప్ప వార్తా మాధ్యమంగా పనిచేసేది. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు పదిరోజులు జరిగేవి. ” శ్రీ లక్ష్మీనరసింహ నాట్య మండలి” తరఫున 2017 లో 80 ఏళ్ల నాటకోత్సవాలను రెండురోజులు జరిపించాను. మొదటి రోజు వేరే అతనిని అధ్యక్షునిగా చేసి మూడు గంటలు ‘వీరపాండ్య కట్ట బ్రహ్మన’ నాటకం వేశాను. రెండవరోజు నా అధ్యక్షతన ‘పాండవోద్యోగ విజయం’ నాటకం వేయించాను. వృద్ధ కళాకారులను సన్మానించాము. రమణాచారి లాంటి పెద్దలను పిలిచాము. ప్రభుత్వం తరఫున లక్షా డెబ్భై వేల నగదు వచ్చింది. 80 ఏళ్ల నాటకరంగ చరిత్ర అంతా రాసి, ఫొటోలతో సహా అచ్చు వేయించాను.
         నేను ఒక ప్రయోక్తగా, ఒక దర్శకుడిగా ప్రధాన పాత్రలో ఉంటూనే చిన్న పాత్రల వాళ్ళను తయారుచేసి, నాలుగు తరాల నుండి సేవ చేస్తున్నాను. నేను చారిత్రకుణ్ణి, సాహితీవేత్తను కూడా అవడం వలన తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న గెజిట్ లో తెలంగాణ నాటకరంగాన్ని గురించి రాయమంటే 50 పేజీలు రాసి ఇచ్చాను. ప్రభుత్వం మారడం వల్ల అది మరుగున పడింది. బళ్ళారి రాఘవ కన్నడంలో సుప్రసిద్ధ రంగస్థల నటుడు. అక్కడ ఆయన ఆడిటోరియం కట్టారు. తెలంగాణ నుండి బళ్ళారి రాఘవ స్వాగతోపన్యాసానికి నన్ను పిలిచారు. ఇది అరుదైన విషయం. విజయనగరంలో అయిదు నాటకాల మీద
నాటకోపన్యాసాలు చేశాను. ప్రయోగ నాటకాలకు పరీక్షకుడిగా, విశ్వ విద్యాలయాల్లో జడ్జిగా వెళ్ళాను. ఈ మధ్య పౌరాణిక నాటకాలకు మిర్యాలగూడలో పోటీలు పెడితే జడ్జిగా అయిదు రోజులున్నాను. తెలంగాణలో నాటక రంగం మీద ‘ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో నేను ఒక మెంబరుగా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నాటకాలకు ‘నంది’ అవార్డులు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో నాటక రంగంలో ‘సింహ’ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించాము. శాస్త్రీయ సంగీతం నేర్చుకొనడం వల్ల పద్యాలకు నేనే వివిధ రకాల ట్యూన్ లు కట్టి పాడతాను. శాస్త్రీయ సంగీతంలో కచేరీలు చేశాను కానీ ఎక్కువ దృష్టి దానిపై పెట్టలేదు. సంగీతమైనా, నాట్యమైనా కేవలం ప్రదర్శన కోసం అభ్యాసం చేయలేము. అరగంట ప్రదర్శనకైనా రోజులు రోజులు చేయాలి. జీవితాన్ని మొత్తం దానికి కైంకర్యం చేయాలి. అందుకని పూర్తిగా నాటకాలకే నా జీవితాన్ని  వెచ్చించాను. 55 సంవత్సరాల నాటకరంగ అనుభవం నాది. ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నాను.
 

సంగనభట్ల నర్సయ్యగారి రచనలు

10 ప్ర :-  మన ప్రాంతంలో నాటకరంగానికి ఉన్న ప్రాధాన్యత ఎటువంటిది? తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం సాధ్యమవుతుందంటారా?
జ :-       నాటకం అనగానే గుంటూరు, విజయవాడ, తెనాలి, తణుకు, రాజమండ్రి ప్రాంతాలే అని ప్రజల్లో నిలిచిపోయింది. తెలంగాణాలో నాటకాలు లేవని ఒక అపప్రథ ఉంది. ఒక వాస్తవం కూడా ఉంది. ఎందుకు మనదగ్గర నాటకాలు వేయలేదని చెప్పాలంటే క్రీ.శ. 1475 కాలంలో రాచకొండ ప్రభువులు అంతమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన 1948 వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం వివిధ రాజవంశాలకు చెందిన ముస్లింలే పరిపాలించారు. ఇస్లామిక్ కల్చర్ లో నాటకాలు ఆడడం, స్త్రీలు బాహాటంగా రావడం నిషేధం. తెలుగు భాషకు ఆదరణ లేకపోవడం ఇటువంటి కారణాల వల్ల వెనుకబడిన మాట వాస్తవం కానీ లేవని కాదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పల్లెటూళ్ళో నాటకాలు ఆడేవారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ‘యక్షగానం’ ప్రసిద్ధి. అది తప్ప వేరే నాటకాలు లేవు. నాటకంలో యక్షగానంలో వచనం కాకుండా గేయరూపం ఉంటుంది. కందుకూరి రుద్రకవి ‘సుగ్రీవ విజయం’ నుండి తెలంగాణలో యక్షగానాలు ప్రసిద్ధి. మా ఊళ్ళో శేషప్ప కవి ‘ధర్మపురి రామాయణం’ అనే యక్షగానం రాశాడు. అది మూడు రోజులు రాత్రి పూట తెల్లవార్లు నడిచేది. ఆయన మనుమడు ‘కృష్ణ శతక’ కర్త నరసింహ కవి ‘మైరావణ చరిత్ర’ అనే యక్షగానం రాశాడు.
        తెలంగాణాలో పౌర్ణమి నాడు నాటకాలు ఆడతారని కొత్త సిద్ధాంతాన్ని నేను ప్రవేశపెట్టాను. నాటకానికి ముందు నటులందరూ బయటకు వచ్చి చంద్రుడికి పూజలు చేసి, నైవేద్యం పెడతారు. మరొకటి రాత్రిపూట కాబట్టి పురుగు పుట్రా ఉన్నా పున్నమి వెన్నెలలో ఆ ఇబ్బంది ఉండదు. ఇంగ్లీషు వాళ్ళ కారణంగా ఇంగ్లీషు నాటకాలు చూసినవారు హైదరాబాద్ లో సెటిల్ అయిన కారణంగా నిజాం అనుమతితో కొన్ని ప్రాంతాల్లో నాటకాలు ఆడేవారు. అవి పౌరాణికాలు కాబట్టి ప్రభుత్వ అభ్యంతరం ఉండేది కాదు. ప్రస్తుతం నాటకరంగం క్షీణదశలోనే ఉంది. మొదట నాటకం ప్రసిద్ధంగా ఉండేది. దాన్ని పాడు చేసింది సినిమా. సినిమాను పాడు చేసింది టి వి. టీవీని పాడు చేసింది సెల్ ఫోన్. ఎంత అద్భుత నాటక ప్రదర్శన జరిగినా, ప్రముఖులతో వేయించినా బహుశా ఒక్కసారి చూడడానికి వస్తారేమో! మా కాలంలో పాఠశాలల్లో హెడ్మాస్టర్లు ప్రోత్సహించేవారు. నేను మా కళాశాలలో ప్రతీ సంవత్సరం నాటకాలు వేయించాను. ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల స్థాయిలో విద్యార్థులతో నాటకాలు వేయిస్తే నాటకం బతుకుతుంది. పూర్వ వైభవం వస్తుందని మాత్రం నేను ఆశపడడం లేదు.

11 ప్ర :- ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా సాహిత్య రూపకంగా “ప్రతాప రుద్ర విజయాన్ని” ఎన్నుకోవడానికి కారణం ఏదైనా ఉందా?
జ :- ఉంది. చాలా చక్కటి ప్రశ్న ఇది. తెలంగాణ ఏర్పడిన తరువాత మనం సంస్కృతీరంగాన, సాహిత్య రంగాన చాలా అణచి వేయబడ్డామన్న భావన మన తెలంగాణ వాళ్లకు ఉండింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇది కూడా ఒక బలమైన కారణం. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఒక సాహిత్య రూపకం ఏదైనా వేస్తే బాగుండునని ప్రభుత్వానికి  ఆలోచన వచ్చింది. అకాడెమీ నిర్వాహకులు సిధారెడ్డి గారు, అలాగే రమణాచారి గారు నన్ను పిలిచి అడిగారు. భువనవిజయం అనేక సార్లు ప్రదర్శించి ఉండడం, శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ చక్రవర్తి కాకపోవడం వల్ల అది కాకుండా తెలంగాణ చక్రవర్తుల మీద ఏదైనా నాటకాన్ని ప్రదర్శిస్తే సముచితంగా ఉంటుందన్నారు. సమయం కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. నేను బాగా ఆలోచించి కాకతీయులు, పద్మనాయకరాజులు ఇద్దరూ తెలంగాణ ప్రాంతాన్ని పాలించినప్పటికీ నేను ప్రతాపరుద్రుని సాహిత్యసభను తీసుకోవాలనుకున్నాను. చరిత్ర, నాటకం, సాహిత్యం
 తెలిసినవాడిని కావడం వల్ల ప్రతాపరుద్రుడు, ఆయన కొలువులో ఉన్న సాహితీమూర్తుల గురించి నాటకం రాశాను. ఆ వివరాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నాకు తెలుసు. ఆయన కొలువులో 300 మంది కవులు ఉండేవారు. ఆయన కొలువులోనే శ్రీనాథుని తాతగారు గౌరవ సత్కారాలు పొందాడు. ఈ విషయాన్ని భీమఖండంలో శ్రీనాథుడే స్వయంగా చెప్పాడు. అలాగే మల్లినాథ సూరి తాతగారు మల్లినాథుడు అక్కడ అవధానం చేసి స్వర్ణాభిషేకం పొందాడు. “శతావధాని మల్లినాథుడు వీరభద్రుని చేత సన్మానం చేయించుకున్నాడ”న్న శ్లోకం కూడా వుంది. ఆయన అవధాని కాబట్టి నేను నాటకంలో అవధాన ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాను. దీన్నిబట్టి కాకతీయుల కాలం నాటికే అవధాన ప్రక్రియ ఉందని తెలుస్తుంది. ప్రతాపరుద్రుని ఆస్థానంలోని మల్లినాథుడు, విద్యానాథుడు మొదలైన కవి పండితుల పాత్రలను వేశాము. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగకవి లాగా హాస్య పాత్రకు ‘పేరిశాస్త్రి’ అనే పాత్ర ప్రవేశపెట్టి అతడు రాజుకు సహాధ్యాయి అయినట్టు కొంత స్వేచ్ఛా హాస్యం ఉండేటట్లు 40 పుటల నాటకం తయారు చేశాను. వాళ్ళ ప్రసిద్ధ పద్యాలను ఆ పాత్రలతో పలికించాను. ఉదాహరణకు విద్యానాథుని పాత్ర అయితే ఆయన ‘ప్రతాపరుద్రీయం’ నుండి శ్లోకాలు తీసుకొని ఆ పాత్ర చేత పలికించాను. కొన్ని పద్యాలను నేను రాశాను. అలాగ ఒక పద్య, చారిత్రక, సాహిత్య రూపకాన్ని వారం రోజుల్లో తయారుచేశాను. మిగిలిన వారం రోజుల్లో నాకు బాగా తెలిసిన, సాధ్యపడుతుందన్న వాళ్ళతో రిహార్సల్ చేయించాను. అలా ప్రపంచ మహాసభల్లో ‘ప్రతాపరుద్ర విజయం’ దిగ్విజయంగా వేశాము. ప్రతాపరుద్రుని కొలువులో ఇంత గొప్ప సాహితీ వేత్తలున్నారా? అని అందరూ ఆశ్చర్యపోయారు.
 
12 ప్ర :-  “సర్వజ్ఞ సింగభూపాలీయము” నాటక నేపథ్యం ఏమిటి?
జ :-     మనకు కాకతీయ రాజ్యం 1323లో పతనమై, తురుష్కాక్రాంతం అయింది. ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు కారణంగా మళ్లీ స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మొదట ఓరుగల్లు తరువాత మిగతా రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రతాపరుద్రుని కొలువులోని సైన్యాధిపతులు చేసుకున్న రాజ్య నిర్మాణాల్లో రాచకొండ ఒకటి. అది శత్రు దుర్భేద్యమైనది. ఆ ప్రభువులు సాహిత్యంలో గానీ, పరాక్రమంలో గానీ, ఆధ్యాత్మికతలో గానీ,
ప్రజానురంజకంగా పాలించడంలో గానీ కాకతీయుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ రాజవంశంలో ముగ్గురు సింగభూపాలురు ఉన్నారు. మొదటి సింగ భూపాలుడు యుద్ధాల్లో ప్రసిద్ధుడు. ఆయనే రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీనాథుడు దర్శించుకున్న రాజు రెండవ సింగ భూపాలుడు. ఈయన మనుమడు మూడవ సింగభూపాలుడు పోతనను ఆదరించినవాడు. పోతనకు శ్రీనాథునికి మధ్య తాత మనుమలకున్నంత ఎడం ఉంటుంది. దీన్ని నేను చరిత్ర నిర్మాణంలో ఐనవోలు శాసనంలో నిరూపించాను. ఈ సింగభూపాలుడు కూడా ప్రతాపరుద్రుడు, కృష్ణదేవరాయల వలె కవులను ఆదరించినవాడు. సంస్కృతంలో గొప్ప పండితుడు. ‘రత్న పాంచాలిక’ అనే నాటకం రాశాడు. నేను దానిని తెలుగులోకి అనువాదం చేశాను. ఆయన ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రాశాడు.   శార్ఙ్గదేవుని సంగీత రత్నాకరానికి వ్యాఖ్యానం కూడా రాశాడు. సంగీతం బాగా తెలిసినవాడు. వ్యాఖ్యాత మల్లినాథసూరి, గౌరన లాంటి వాళ్లంతా ఆయన కొలువును సందర్శించారు. విశ్వేశ్వరుడు ‘చమత్కార చంద్రిక’ అనే అలంకార శాస్త్ర గ్రంథం రాసి సింగభూపాలునికి (రెండవ)అంకితం ఇచ్చాడు.
       నాకొక ఆలోచన వచ్చింది. ప్రతాపరుద్రుని మీద రాసినట్టు శ్రీనాథుడు, పోతన, గౌరన, విశ్వేశ్వరుడు ఇత్యాదులందరినీ తీసుకొని సింగభూపాలుని ప్రధానంగా చేసి రూపకం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి అలాగే సాహిత్యరూప కం రాయడం జరిగింది. తెలుగునాట భోగినీ దండకం పోతన రాశాడా? అని సందేహించే స్థితి ఉండింది. నేను పోతన భోగినీ దండకానికి ప్రతిపదార్థ వ్యాఖ్యానం రాశాను. కాబట్టి పోతన యవ్వనంలో ఉండగా సింగభూపాలుని కొలువులో ఉండేవాడని భావించి పోతన, సింగన, భోగిని వీళ్ళందరిని కలిపి నాటకం రాస్తే బాగుంటుంది కదా! అని దీనికి పక్కనే మరో అయిదు అంకాల నాటకం రాశాను. సాహిత్య రూపకానికి దీన్ని జోడించి మొత్తం ఆరు అంకాలతో ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ రాశాను. ఇది, ‘ప్రతాపరుద్ర విజయం’ రెండూ కలిపి అచ్చువేశాను. ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ ప్రదర్శనకు నోచుకోలేదు.
సంస్కృతంలో ఒక ప్రథ ఉంది. “నాటకాంతం హి సాహిత్యం” అంటే నాటకం రాసినప్పుడే సాహిత్యానికి పరిణతి వచ్చినట్లు లెక్క. ఒక పరిణత కవి, ఒక సాహితీ వేత్త, ఒక పండితుడు తానెన్ని రచనలు చేసినా నాటకం రాయాలి. కానీ నాటకం రాయడం ‘కత్తి మీద సాము’. దీంట్లో రచయిత ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలుండదు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, కథ అంతా సంభాషణ రూపంలోనే నడవాలి. నాకు కూడా నాటకాలు రాయాలనే ఉబలాటం కలిగింది. అందుకే రెండు నాటకాలు రాశాను.
 
13 ప్ర :-  ‘ధర్మపురి’ క్షేత్ర చరిత్రను రాశారు కదా! దాని గురించిన విశేషాలు కొన్ని మా పాఠకుల కోసం చెప్పండి.
జ :-     నేను మౌలికంగా సాహిత్యవేత్తను. చరిత్ర నా అభిరుచి మాత్రమే. దానికి కారణం మా ఊరు ధర్మపురి ఒక గొప్ప విద్యా సాంస్కృతిక కేంద్రం. అంతులేని చరిత్ర కలిగినది. అది చెప్పాలంటే ఆధారాలు కావాలి. మా ఊళ్ళో దాదాపు 15 ప్రధాన దేవాలయాలు, 20 వరకు చిన్న ఆలయాలుంటాయి. అదొక దేవాలయాల నగరం. అంతకంటే పెద్దది మనకు చారిత్రకాధారమైన అనేక శాసనాలు ఉండడం. పశ్చిమ చాళుక్యుల నుండి బృహదాలయాలు నిర్మించబడ్డాయి. తరువాతి కాలంలో నరసింహ స్వామి దేవాలయాన్ని తురుష్కులు ధ్వంసం చేసి మసీదు కట్టుకున్నారు. సాహిత్యాధారాలు, శాసనాధారాలు, కావ్యస్థ ఆధారాలు, పండితులు ఆ నోటా ఈనోటా చెబుతున్న పారంపరిక కథనాలే కాక నేను పుట్టిన తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉండడం మూలంగా ఊరు చరిత్రను పరిశీలించడం మొదలుపెట్టాను. 37 శాసనాలు దొరికిన ఊరు. వీటితో నేను ‘ధర్మపురి చరిత్ర’ రాశాను. ఒక పక్క సాహిత్య నేపథ్యం, మరోపక్క గ్రామం అభివృద్ధి కావడానికి నదీపరంగా ఉన్న అవకాశాలేమిటి? ఇన్ని ఆలయాలు ఉండడానికి కారణం ఏమిటి? వీటిని ఎవరు కట్టించారు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని 300 పేజీల చరిత్ర రాశాను. చేకూరి రామారావు గారు “నీవు రాస్తున్నది చరిత్రనా? క్షేత్ర మాహాత్మ్యమా?” అని అడిగారు. చరిత్ర అని చెప్పాను. వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక సంస్కృత మహాకవి 3 వేల శ్లోకాలతో పరమాద్భుతంగా, పురాణ పద్ధతిలో క్షేత్ర మాహాత్మ్యాన్ని రాశాడు. నేను రాసేదేముంది? అందుకే చరిత్ర రాశాను. కొంతమందికి ఉండే సందేహాలకు కూడా నేను ఇందులో ఆధారాలు చూపించాను. ధర్మపురిలో ‘ధర్మ’ అనే పదం బౌద్ధ ధర్మం నుండి వచ్చింది. 2600 సంవత్సరాల క్రితం బుద్ధుని కాలంలో ఆయన దగ్గర శిష్యరికం చేసినవాళ్ళు, బౌద్ధమతం స్వీకరించిన వాళ్ళు మా ఊరికి చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లు. పాయసి, కప్పడు, బావరి వీళ్లంతా పాళీ, ప్రాకృత భాషలు ఉన్న కాలంలో బౌద్ధ వాఙ్మయములో ఉన్నవాళ్లు ఇక్కడ నివసించారు కాబట్టి బౌద్ధం బాగా ప్రచలితమైంది. పక్కనే బుద్ధాజిపల్లి అనే గ్రామం, మావూళ్ళో బుదాం మసీదు అని ఉన్నాయి. 
         వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధర్మపురి చరిత్ర రాశాను. ఆ కాలంలో స్త్రీలు కూడా దానధర్మాలు చేయడం విశేషం. సామాన్య వ్యక్తులు చేసిన దానం నుండి రాజుల వరకు చేసిన దానాల శాసనాలు లభించాయి. మొదట 12 శాసనాలు దొరికితే నేను మరో 25 శాసనాలను వెలికితీశాను. అట్లా 37 శాసనాలు అయినాయి. విజయ నగర సామ్రాజ్య నిర్మాణ కారకుడు విద్యారణ్యస్వామి, చరిగొండ ధర్మన్న,  శేషప్ప కవి  వంటి వారు ఈ గ్రామానికి చెందినవాళ్ళు. హరిహర బుక్కరాయలు మా ఊరి పక్కన ‘మంగళ’ అనే గ్రామానికి చెందినవారు. ధర్మపురికి చెందిన పురాణం నరసింహభట్టు సదాశివరాయల చేత పల్లకీ మోయించుకున్నాడు. అల్లసాని తర్వాత ఆయనదే ఆ ఘనత. అప్పటినుండి ఆయన చతుర్వేదుల నరసింహభట్టు అయినాడు. మరో విశేషం వేములవాడ అరికేసరి చక్రవర్తి పంప మహాకవికి ధారాదత్తం చేసిన అగ్రహారం ఇదే ధర్మపురి. జినవల్లభుని కురిక్యాల శాసనంలో ఈ విషయ ప్రస్తావన ఉంది.
         ఇట్లా తవ్వినకొద్దీ అంతులేని చరిత్ర దొరికింది. అందుకే మొదటి ముద్రణలో రాసిన చరిత్రను రెండవ ముద్రణలో సంస్కరణ చేస్తూ భాషను కూడా చేర్చాను. మొత్తం ఇప్పటికి ఆ పుస్తకం 5 ముద్రణలు పొందడం గొప్ప విషయం. ఈ పుస్తకాన్ని చూసిన ఎండోమెంట్ కమిషనర్ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు మహదానంద పడిపోయి వంద పుస్తకాలు కొని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపి మీరందరూ ఈ విధంగా దేవాలయాల చరిత్ర రాయాలని సర్క్యులర్ వేశారు. అంత పాపులర్ అయింది.

14 ప్ర :-  అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన మీరు వెలువరించిన రచనలేవి?


 15 ప్ర :-  చరిగొండ ధర్మన్న చిత్ర భారతాన్ని వెలికి తీసుకురావడానికి ప్రేరణ ఎవరు? దానిలోని విశేషాలను చెప్పండి.
జ :-      నేను ఛందశ్శాస్త్రంలో పరిశోధన చేస్తున్న సమయంలో తంజావూరు, మద్రాసు, తిరుపతి, విశాఖపట్నం, పూణె మొదలైన ప్రాంతాల లైబ్రరీలకు తిరిగాను. చెన్నైకి వెళ్ళినపుడు రావూరి దొరస్వామి శర్మ అని ఒక పెద్దాయన ఉండేవారు. నేను ఆయన దగ్గరకు వెళ్తుండేవాడిని. ఆయన నాకు ఆరుద్రను పరిచయం చేయించాడు. నేను చేస్తున్న పరిశోధనను చూసి అరుద్రకు నామీద అభిమానం ఏర్పడింది. ఒకరోజు మాటల్లో ఆయన “మీవూరి వాడే ఒకరు చిత్రభారతం పేరుతో రాశాడు చూశావా”? అని అడిగాడు. నాకు తెలియదన్నాను. విచిత్రం ఏమిటంటే కందుకూరి వీరేశలింగం పంతులు ఎనభై, తొంభై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని అచ్చువేశాడు. దాని గురించి వేట మొదలుపెట్టాను. ‘చిత్రభారతం’ దొరికాక చదివితే చిత్రంగా చరిగొండ ధర్మన్న అని మా ఊరివాడు రాసిందే అది. ఆయన ధర్మపురి వాడే అని చెప్పడానికి అందులో ఎన్నో ఆధారాలున్నాయి. ఆయన పోతనకు సమకాలికుడని, స్థలం ధర్మపురి అని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. పరిశోధన చేసి ఏడాదిన్నరలోపు పూర్తి చేసి దానిపై ప్రసంగాలు చేసి, తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు అడిగితే ఈ పుస్తకాన్ని పరిష్కరించి ఇవ్వగా వాళ్ళు అచ్చు వేశారు. చరిగొండ మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం. అక్కడినుండి ఇక్కడకు వలస వచ్చాడు ఆయన. వలస వచ్చిన వాళ్ళందరికీ వారి గ్రామాల పేర్లున్నట్టే ఆయనకు చరిగొండ ఇంటిపేరు అయింది.
          ఇంకో విశేషం ఏంటంటే ఈ పుస్తకాన్ని అంకితం పుచ్చుకున్న ఎనుముల పెదనామాత్యుడు కూడా ధర్మపురి వాడే. ఇద్దరూ బాల్య స్నేహితులు. 
పెదనామాత్యుడు తన కళ్ళముందు నరసింహస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి హింసాకాండను సృష్టించడం చూసి “ఈ దేవాలయాన్ని పాడు చేసిన వాడిని చంపి తీరుతాన”ని ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణుడై నప్పటికీ యుద్ధవిద్యలు నేర్చి సైన్యాధిపతియై ఆ శపథాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ విషయం చిత్రభారతంలో ఉంది. పెదనామాత్యుడు తదనంతరం ఓరుగల్లు షితాబ్ ఖాన్ రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. అప్పుడే ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నాడు. ఆ విధంగా ప్రాచీనసాహిత్యం పట్ల అభిమానం, దానికి ఆరుద్ర వంటి వారు ప్రేరణ కావడంతో ఈ పుస్తకాన్ని పరిష్కరించాను. దీన్ని నేను  ఒక ప్రాచీన మహా కావ్యాన్ని తెలంగాణ సరస్వతి మెడలో వేసిన పూలమాలగా భావిస్తాను. చరిగొండ ధర్మన్న ప్రబంధ కవులకంటే ముందు కాలం వాడు. ప్రబంధాలు ఎట్లా ఉండాలి? అనడానికి చిత్రభారతం ఒక మోడల్ గా ఉంటుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, కృష్ణదేవరాయలు ఎన్నో పద్యాలను దీని నుండి తీసుకొని రాసుకున్నారు. నందితిమ్మన ‘పారిజాతాపహరణం’ లో సత్యభామ కథను రాయడానికి ముందే ధర్మన్న రాశాడు. తెలంగాణ మొత్తానికి మనకు తెలిసినంతవరకు , రికార్డులో ఉన్నంతవరకు మొదటి శతావధాని ధర్మన్న. అత్యంత మనోహరమైన కవిత్వం ఆయనది. దానికి ఎవరితోనూ పోలిక లేదు. మనుచరిత్ర, పారిజాతాపహరణం కలిపిన దానికంటే చిత్రభారతం పెద్దది.1300 పై చిలుకు పద్యాలు రాశాడు. అంత గొప్పకవి చరిత్ర రాయడం వల్ల ఒక సాహితీ వేత్తగా నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. ఆయన రచనలోని గొప్ప పద్యాలను తీసుకొని అవధాన ప్రక్రియలాగా ప్రశ్న అడుగుతుంటే చెప్పినట్లు ఆ పద్యాలను వివరిస్తూ పుస్తకం రాయాలని ఉంది.
 
16 ప్ర :-  మీ కోరిక నెరవేరాలని ఆశిస్తాం. అయితే ‘తెలుగులో చాటు కవిత్వం’ రాశారు కదా! అటువంటి ఆశు కవిత్వం ఇప్పటికీ ఆదరణ ఉందంటారా?
జ :-      ‘తెలుగులో చాటు కవిత్వం’ నా బాల్య రచన. అప్పుడెప్పుడో దేవులపల్లి రామానుజరావు గారు సాహిత్య అకాడెమీ పక్షాన ఇచ్చిన ప్రకటన మేరకు రాశాను. తర్వాత దాన్ని మళ్లీ సవరించుకొని అచ్చు వేశాను. మాకు హెడ్మాస్టర్ గా పని చేసిన వ్యక్తి వేమూరి లక్ష్మీ నరహరి శర్మ. ఆయన ఆ పుస్తకాన్ని చూసి “ఇంత మంచి పుస్తకాన్ని ఇన్నిరోజులు ఎందుకు దాచి పెట్టావ” ని అడిగారు. మనకు వేటూరి ప్రభాకరశాస్త్రి ‘చాటుపద్య మణిమంజరి’, దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘చాటు పద్య రత్నాకరం’ పేరుతో చాటువులు సేకరించారు. శ్రీరంగాచార్య వంటివాళ్ళు కూడా చాటువులను సేకరించి మనకందించారు. చాటువులన్నీ కూడా ఆనాటి చరిత్రను, ఆ మహాకవుల జీవిత చరిత్రలను, వాళ్ళ పాండిత్య ప్రతిభలను చెప్తాయి. ఇవి నిజానికి పుస్తకాలలోని పద్యాలు కావు. జీవితంలో ఎప్పుడో జరిగిన సంఘటన ఆధారంగా రాసినవి. చాటుపద్యం వెనుక చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది.
వేములవాడ భీమకవి సుప్రసిద్ధ కవి అయినా ఆయన రాసిన 30 చాటు పద్యాల ద్వారా ఆయనను అంచనా కడుతున్నాం. అంతేకానీ ఆయన కావ్యాలేవీ లేవు. అట్లా మనకు వెయ్యేళ్ళ సాహిత్యం ఉంది. విశేషంగా కృష్ణ దేవరాయల అష్టదిగ్గజాల్లో సభాసంబంధమైన చర్చలు అన్నీ చాటురూపంలో ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయాలి. వీటి వెనుక చమత్కారం ఉంటుంది. అనేకులకు ఈ పద్యాలు కంఠస్థంగా ఉంటాయి. కావ్యస్థం కాని ఈ చాటు పద్యం నిలుస్తుందా అంటే నిలుస్తుంది. మిగతావి నిలువవు.
 
17 ప్ర :- మీకు లభించిన అనేక పురస్కారాల్లో అమితంగా మిమ్మల్ని ఆనందింప చేసింది ఏది?
జ :- సహజంగా సాహితీవేత్తలకు పురస్కారాలు వస్తూనే  ఉంటాయి. నా స్వభావానికవి రుచించేవి కావు. పురస్కారాల కోసం పైరవీలు నడుస్తున్న రోజులు. ఏ వ్యక్తి పేరుమీద ఇస్తున్నారో, ఏ సంస్థ పేరు మీద ఇస్తున్నారో దానిమీద ఏ కృషి చేయనివాళ్లకు ఇస్తున్నారు. ఒకసారి నాకు గుంటూరు శేషేంద్రశర్మ గారి పురస్కారం ఇస్తామన్నప్పుడు ఆయన గురించి ఏమీ చేయకుండా తీసుకోనన్నాను. “ఆయన మీద ఒక రెండు గంటలు ప్రసంగం చేస్తాను తరువాత ఇవ్వండి” అని ఆ తర్వాతే తీసుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్ అవార్డు ఇచ్చింది. దానికి ఒక చమత్కార విషయం ఉన్నది. గణపతిదేవ చక్రవర్తి పాలనా కాలంలో కరీంనగర్ జిల్లాలో చామనపల్లి అనే ఊళ్ళో గణపతి దేవుడు నిర్మించిన చెరువులకు సంబంధించిన కాలువల్లో ఒక కాలువ వీళ్ళ ఊరు వచ్చేవరకు, నీళ్లు ఆగిపోతున్నాయి. పైన గండి పెడుతున్నారు. బ్రాహ్మణులంతా కలిసి గణపతిదేవుని దృష్టికి తీసుకువచ్చారు. చక్రవర్తి దాని నిజానిజాలు తెలుసుకునే విధంగా ‘మాచిరాజు’ అనే పరిశీలక అధికారిని పంపించాడు. ఆయన దాదాపు పది గ్రామాల నుండి కులానికి ఇద్దరు చొప్పున వ్యక్తులను తీసుకొని కాలువ పక్కనే కూర్చుండి అది నిజమేనని నిర్ధారిస్తాడు. అంతేకాదు చక్రవర్తి పక్షాన “ఇలాంటి అన్యాయాలు ఇకముందు జరుగకూడద”ని రాగి రేకులపై సంస్కృతంలో శాసనం వేయించాడు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నేను  సంస్కృత శాసనాలు పరిశీలిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్య పోయాను. శాసనాలకు ఉండవలసిన లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. అంతేకాదు శాసనం మొత్తం సంస్కృతంలో ఉంటే కాలువ హద్దులు ప్రజలకు అర్థమయ్యేవిధంగా తెలుగులో ఉన్నాయి. దీన్నొక పెద్ద వ్యాసంగా రాసి, గణపతి దేవ చక్రవర్తి నాటి కాలంలో జల వనరులకు సంబంధించి ఏమేం కార్యక్రమాలు చేశారో చెప్తూ దాంట్లో చిట్టచివరగా “కాకతీయులు ఒక చెరువు తవ్విస్తే ఆ చెరువులోని చిట్ట చివరి నీటిబొట్టు కూడా చివరి పొలానికి అందేటట్లు చర్యలు తీసుకున్నారు”. అనే పేరాతో ముగించాను. ఆనాటి తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు అది చూసి మెచ్చుకొని “ఈయనకు ఫ్రీలాన్స్ జర్నలిస్టులకిచ్చే అవార్డు ఇవ్వమన్నార”ట. అట్లా మిషన్ కాకతీయ అవార్డు వచ్చింది. అది నాకు ఎంతో ఇష్టమైనది. ఈ వ్యాసం ‘తెలంగాణ’ మాస పత్రికలో వచ్చింది. అందులో నేను సీరియల్ గా కోటిలింగాల, కొండాపూర్, ధూళికట్ట, కొలనుపాక మొదలైన నగరాలను గురించి వాటి చరిత్రను ‘తెలంగాణ ప్రాచీన నగరాలు’ అనే పేరుతో రాశాను. ఛందశ్శాస్త్రంలో కృషి చేసినందుకు తెలుగు విశ్వవిద్యాలయం అబ్బూరి రామకృష్ణారావు మెమోరియల్ ‘ధర్మనిధి’ అవార్డు ఇచ్చింది. ‘గ్రామీణ కళాజ్యోతి’ పేరుతో నాటకారంగంలో పురస్కారం, శాసనాలలో కృషి చేసినందుకు బి.ఎన్ శాస్త్రి పురస్కారం ఇట్లా గ్రంథాలకు వచ్చినవి, శాస్త్రాల్లో కృషి చేసినవి ఎన్నో ఉన్నాయి.

 18 ప్ర :-  ఇటీవలే బాలవ్యాకరణ రీతిలో తెలంగాణ వ్యాకరణం రాశారు. దాని గురించి చెప్పండి.
జ :-       నేను బాల్యంలో ఓరియంటల్ కాలేజీ విద్యార్థిని కావడం వలన గురువుల నుండి వ్యాకరణం నేర్చుకున్నాను. అంతకు ముందే సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాడిని. అందువలన ఆ శాస్త్రంలో పట్టు సాధించాను. పాఠాలు చెప్పడం, బాల ప్రౌఢ వ్యాకరణాల విశేషాలు తెలిసివుండడం మూలంగా ఒక భాషాప్రియుడిగా వ్యాకరణ రచన చేశాను. ఏ భాష మనకు ఉపయోగంలో  ఉన్నదో ఆ భాష లక్షణాలను, మిగతా ప్రాంత భాషలతో భిన్నత్వాన్ని, మాండలికాల భిన్నత్వాన్ని పరిశీలించే ఒక పద్ధతి ముందు నుండే ఉన్నది. మా ఊళ్ళో ఉన్నప్పుడే నాకు ఆంధ్ర వ్యాకరణ విశారద అని పేరు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు, ఉస్మానియా, కాకతీయ, అంబేద్కర్, కర్ణాటక హంపి విశ్వ విద్యాలయాలు అడిగితే పాఠాలు రాసిచ్చాను. రామోజీ ఫిల్మ్ సిటీలో డిక్షనరీ ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తెలుగుకు సంక్షిప్త వ్యాకరణం తయారు చేస్తే నిఘంటువులో అనుబంధంగా వేస్తామన్నారు. మధ్యలో కరోనా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లీష్ – తెలుగు, తెలుగు – తెలుగు, తెలుగు – ఇంగ్లీష్ ఇలా మూడు డిక్షనరీలు తయారు చేయాలనుకున్నాం. అది రామోజీరావు గారి కల. ఇంగ్లీష్ – తెలుగు ఒక్కటే తయారైంది. నేను కన్సల్టెంట్ గా రోజూ వెళ్లి పదాలు తయారుచేసి అర్థాలు రాసేవాడిని. ఆ ప్రాజెక్టులో భాగంగా పిల్లలకు డిక్షనరీతో పాటు వ్యాకరణం రాయడం జరిగింది. దీనిని తెలంగాణ విశ్వ విద్యాలయం ముద్రించింది. తెలంగాణ ఏర్పడడానికి ముందు భాషా ప్రాతిపదికన కూడా మన దగ్గర ఉన్న వైలక్షణ్యాన్ని కవులు, పండితులు చెబుతూ వచ్చారు. మనది మాండలిక భాష అయితే అయి ఉండవచ్చు కానీ మిగతా మాండలికాల కంటే విలక్షణమైనది. కాబట్టి దీన్ని ఇతరులకు పరిచయం చేయాలంటే అందరిలో నేను ఒకణ్ణి కాకుండా ఒక వ్యాకరణ శాస్త్రమే రాయాలనిపించింది. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయిక వ్యాకరణం ఎట్లా ఉండాలో అట్లానే తయారు చేయాలనుకున్నా. చిన్నయసూరి సూత్ర పద్ధతిలో తెలంగాణ పదాలను సాహిత్యంలోనూ, యావజ్జన వ్యవహారంలో ఉన్నవి తీసుకొని సంక్షిప్తత, విశ్వజనీనతలు ఉండేలాగా మూడువందల సూత్రాలతో ఈ వ్యాకరణాన్ని తయారుచేశాను. అది డిటిపి అవుతోంది. త్వరలో దాన్ని వెలుగులోకి తీసుకువస్తాను. కొంత ఆలస్యమైనా ప్రామాణికమైన తెలంగాణ భాష అందరికీ పరిచయం కావడం కోసం చేస్తున్న బృహత్ ప్రయత్నం.
 
19 ప్ర :-  ఒక శాసన పరిశోధకులుగా మీరు వెలికి తీసిన శాసనాలు ఏవి?
జ :-     చరిత్రకు సంబంధించిన ఆకరాలు అనేక రకాలుగా మనకు దొరుకుతాయి. అన్నింటిలోకి శ్రేష్ఠమైనది శాసనం. ఎందుకంటే ఒక వస్తువు దొరికితే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది.  సాహిత్యంలో దొరికిన వాటిలో కొన్ని అభూత కల్పనలు ఉండొచ్చు. పురాణాల్లో విశేషాలున్నప్పటికీ కొన్ని నమ్మలేనివి ఉంటాయి. పురా వస్తువులు దొరికితే వాటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కష్టం. శాసనాలు అయితే ఆనాటి చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఇంకో విశేషం లిపి కూడా ఆరోజుల్లో ఎట్లా ఉండేదో తెలుస్తుంది. నేనొక చరిత్ర పరిశోధకుడిగా, చరిత్ర పాఠకుడిగా, చరిత్ర రచయితగా ఏదైనా తవ్వకాల్లో బంగారు నాణాల బిందె దొరికిన దానికంటే ఒక శాసనం దొరికితే ఎక్కువ సంతోషిస్తాను (నవ్వుతూ). మా ఊళ్ళో అంతకుముందున్న 12 శాసనాలే కాక ఇంకా 25 వెలికితీసి మొత్తం 37 శాసనాలను వాటి అర్థాలతో సహా పుస్తకంలో రాశాను. ‘కోటిలింగాల’లో బుద్ధుని బోధనలను వివరిస్తూ రెండు వేల సంవత్సరాల కిందటి శాసనాలు పెద్ద పెద్ద బండరాళ్ల పైన ఉన్నాయి. నా ఊహ ఏంటంటే ఆ కాలంలో పెద్ద బౌద్ధ స్తూపం ఉండి ఉంటుంది. ప్రదక్షిణం చేస్తూ  వాటిని చదువుకునే విధంగా చెక్కి ఉంటారనిపించింది. తెలంగాణలో బౌద్ధం మీద ఒక వ్యాసం రాశాను. దానికి ఈ శాసనాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గోనబుద్ధారెడ్డి గురించి దొరికిన మూడే మూడు శాసనాల ఆధారంగా మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన జీవితాన్ని గురించి రాశాడు. తర్వాత నాకు ఇంకా పదకొండు శాసనాలు దొరికాయి. అందులో ఒక్కటి గోన బుద్ధారెడ్డి వాళ్ళ నాన్న గోన గన్నారెడ్డిది. అదొక్కటి విడిచిపెట్టి మిగతా వాటి ఆధారంగా సోమశేఖర శర్మ అంతకుముందు రాసిన బుద్ధారెడ్డి వంశవృక్షాన్ని సరి చేశాను. అట్లాగే రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు శ్రీనాథుడు వచ్చాడని, ఆయన మనుమడు మూడవ సింగభూపాలుని కొలువులో పోతన ఉన్నాడని, అందువల్ల శ్రీనాథ పోతనలకు చాలా ఎడం ఉందని నిర్ధారించి, ఐనవోలు శాసనంతో కొత్త ఆవిష్కరణ చేశాను.
        గోన గన్నారెడ్డి తమ్ముడు విఠల రెడ్డి. విఠల రెడ్డి కొడుకు బుద్ధారెడ్డి. తమ్ముని కొడుకును పెంచుకున్నాడు. ఈ కారణంగా శాసనాల్లో బుద్ధారెడ్డి తండ్రి గన్నారెడ్డి అని, పుస్తకంలో విఠల నాథుడని పేర్కొంటారు. ఇదే విధంగా ఒక శాసనంలో గణపతి దేవ చక్రవర్తి పెదనాన్న పేరు రుద్రుడు. తండ్రి మహదేవుడు. ఇక్కడ కూడా పెదనాన్న పెంచుకోవడం వల్ల ఒకచోట తండ్రి రుద్రుడంటే మరోచోట మహదేవుడు అన్నట్టు ఉంటుంది. దీని ఆధారంగా 7, 8 వందల సంవత్సరాల క్రితమే తమ్ముని కొడుకును పెంచుకోవడమనే సంప్రదాయాన్ని వెలికితీసి, నిర్ధారించడం జరిగింది. అయితే ఇవి చూడడానికి చిన్నవిగానే అనిపించినా లోతుల్లో పరిశోధన చేయవలసి వస్తుంది. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కరోనా కాలంలో హంపి విజయనగర రాజుల మీద ఉపన్యాసాలు చెప్పుమని అడిగారు. నేను 18 వారాలు రోజుకు రెండు గంటల చొప్పున ఉపన్యసించాను. ఆ సమయంలో విజయనగర కాలం నాటి శాసనాలను కూడా పరిశీలించాను. నందితిమ్మనకు ముక్కుతిమ్మన పేరు ఉందని శాసనాల ద్వారా నిరూపించాను.
 
20 ప్ర :-  మీరు చేసిన అనువాద రచనల గురించి చెప్పండి.
జ :-      అనువాదరంగం ఎలాంటిదంటే మూల గ్రంథానికి మాత్రమే ప్రసిద్ధి ఉంటుంది. ఎంత గొప్పగా లక్ష్య గ్రంథంగా అనువదించినా అనువాదకునికి పేరు రాదు. ఇంగ్లీషులో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల పుస్తకాన్ని అనువదించుమని కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు అడిగారు. అనువాదం చేశాక చూసుకుంటే ఇది తెలుగు భాషేనా? అనిపించింది. మూల గ్రంథం పక్కకు పెట్టి నా శైలిలో తిరిగి రాశాను. ఆముక్తమాల్యదలోని పద్యాల సౌందర్యం ఇంగ్లీషు భాషలో ఎట్లా వస్తుంది? అందుకే అందులో లేకపోయినా కృష్ణదేవరాయల కవితా సౌందర్యం తెలిసిన వాడిగా మూలంలో లేకున్నా ‘ఆముక్త’ పద్యాలను ఇందులో రాశాను. మూల గ్రంథంలో లేకుండా ఒక్క వాక్యం ఎక్కువ రాయకూడదని సాహిత్య అకాడెమీ నియమం. కానీ దీనికి వాళ్ళు అనుమతిచ్చారు. అందువల్ల మంచి పుస్తకం వచ్చింది. హిందీ నుండి కూడా కొన్ని అనువాదాలు చేశాను. తెలుగు సాహిత్యం కంటే ముందు హిందీ, ఉర్దూ సాహిత్యాలు చదువుకున్నాను. ఏడవ తరగతిలో చదువుకుంటున్నప్పుడు డాటర్స్ మర్డరర్ అనే డిటెక్టివ్ నవల రాశాను. ఎనిమిదవ తరగతి నుండే హిందీ సాహిత్యం, దానితో పాటే ఉర్దూ సాహిత్యం చదివాను. పదవతరగతిలో ఉన్నప్పుడే హిందీ పాఠశాలలో ఏదో కారణంగా హిందీ ఉపాధ్యాయుడు వెళ్లిపోవడంతో పాఠాలు కూడా చెప్పాను. పండిట్ జాకీర్ హుస్సేన్ రాసిన ‘అబ్బూఖాన్ కీ బక్రీ’ కథను తెలుగులోకి అనువదించాను. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆ కథ చాలా పాపులర్ అయింది. సర్వజ్ఞ సింగభూపాలుని “రత్నపాంచాలిక” సంస్కృత నాటకాన్ని కూడా తెలుగులో అనువాదం చేశాను. సంస్కృతంలో ఉన్న శాసనాలను, సంస్కృత కవితలను కూడా అనువాదం చేశాను. ఒకసారి బహుభాషా సమ్మేళనంలో సంస్కృత భాషలోని కవితలను తెలుగులోకి అనువదించి చదివాను. అనువాదం కూడా లక్ష్యభాషలో మాత్రమే చేశాను.
 
21 ప్ర :-  సంగీతం, సాహిత్యం, నాటకం, పరిశోధన పెనవేసుకున్న మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఆధ్యాత్మిక రంగంలోనూ చేసిన కృషి ఏమిటి?
జ :-     నేను పవిత్ర తీర్థక్షేత్రంలో పుట్టడం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, చిన్నప్పటినుండీ వేదాధ్యయనం, సాంప్రదాయ కుటుంబ నేపథ్యం కారణంగా బాల్యం నుండే భక్తి ఎక్కువ. ధర్మపురిలో అనేక వైదిక సాంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. బతుకమ్మ కూడా అక్కడిదే. సత్యవతి అంటారామెను. ఆమె పేరు మీద ఒక దేవాలయం ఉంది. నేను సామాన్యుల నుండి శిష్టుల పండుగల వరకు అధ్యయనం చేసి వాటి విశేషాలను తెలుపుతూ వ్యాసాలు రాశాను. మన హిందూధర్మానికి రామాయణం, భారతం, భాగవతం మూడూ ప్రధానమైన గ్రంథాలని తెలిసిందే. వాటి మీద నేను అనేక
ఉపన్యాసాలు ఇచ్చాను. సంస్కృత భాగవత సప్తాహాలు చేశాను. దూరదర్శన్ వివిధ ఛానళ్లలో ప్రసంగించాను. తిరుమల, తిరుచానూరు, యాదగిరిగుట్ట మొదలగు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చేశాను. ‘జయ జయ శంకర’ అనే ఛానల్ వాళ్ళు అడిగితే సంస్కృత నరసింహ పురాణం 60 ఎపిసోళ్లు చెప్పాను. అందులో 30 ప్రవచనాలు యూట్యూబ్ లో ఉన్నాయి. వివిధ పవిత్ర పండుగ రోజుల్లో దేవాలయాల వారు అడిగినప్పుడు పురాణాల్లో ఉన్నదానికి ఒక నవ్యత్వాన్ని జోడించి, ఆధునిక కాలానికి తగినట్లుగా వ్యాఖ్యానాలు చెప్పేవాడిని. ఆధ్యాత్మిక రంగంలో పుస్తకాలు రాసిన దానికంటే ఉపన్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ‘సనాతన ధర్మం’ అనే పేరుతో పుస్తకం రాశాను. అది అచ్చు కాలేదు. వ్యాసుని ‘నరసింహ పురాణం’ మూలం అర్థం రాసి అచ్చు వేయాలనే ఆలోచన ఉంది. ఆధ్యాత్మిక రంగంలో అనేక పుస్తకాలు వెలువడుతుండడంతో మనం చెప్పేదేముంది? అనే నిర్లిప్తత వల్ల రచనా వ్యాసంగం పెట్టుకోకుండా ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాను.

22 ప్ర:-  నేటి సాహిత్యరంగంపై మీ అభిప్రాయం ఏమిటి?
రచనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటి రచయితలకు మీ అనుభవపూర్వక సూచనలు ఇవ్వండి.
జ :-    సాహిత్య సృష్టి జరుగుతోంది. కానీ నాణ్యత లేదు. తెలుగు భాషను ప్రాథమిక దశ నుండి చదువుకున్న వాళ్లే సాహిత్య సృష్టి చేయగలరు. పరభాషా ప్రభావం వల్ల ఇంతకంటే అద్భుతంగా తెలుగు సాహిత్యం వికసిస్తుందని ఆశపడే పరిస్థితి లేదు. ఇంగ్లీషు భాషా ప్రభావం విస్తారమై మన మాటల్లో కూడా అనేక ఆంగ్ల భాషా పదాలు చొరబడి ఇది తెలుగేనా? అనే పరిస్థితిలో ఉన్నాం. అటువంటి భాష సాహిత్యానికి, కవిత్వానికి పనికొచ్చేది కాదు. కొన్ని అనివార్యమైన పదాలు వాడడం వేరు. వ్యవహారంలో మాట్లాడినట్లు రాతల్లో రాయలేము కదా! కాబట్టి భాషను శుద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. తాము రాసిన దానిని భాష తెలిసినవారికి చూపించి వాటిని సరిదిద్దుకోవాలి. ఇది సరియైనదా, కాదా అని తనకు తాను చెప్పుకోగలిగేలా ఉండాలి. శ్రేష్ఠమైన సాహిత్యం రావాలి. దానికి పూర్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ” అనభ్యాసే విషం విద్యా” అని హితోపదేశంలో ఒక శ్లోకంలో ఉన్నది. దానికి సంస్కృతంలో పేరడీగా ‘అనధ్యయనే విషయం మిథ్య’ అన్నాను నేను. పూర్వకాలపు సాహిత్యకారుల సాహిత్యం అధ్యయనం చేయకుండా, పరిశీలించకుండా, అనుశీలించకుండా, అనుభవరాహిత్యంగా సాహిత్య సృష్టి చేయాలనుకుంటే అది వికారంగా తయారవుతుంది. అందువల్ల భావితరాన్ని నేను కోరేదేమిటంటే బాగా చదవండి. చక్కటి భాషను ఉపయోగించండి. సృజన సమాజానుకూలంగా చేయండి. ఏ ప్రక్రియలోనైనా నాణ్యత అవసరం. ఇది నా సలహా మాత్రమే.
 
        ధన్యవాదాలు సార్, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎంతో ఓరిమితో మీ జీవిత విశేషాలను తెలిపినం

You may also like

Leave a Comment