తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా అంకురించిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో వేనరెడ్డిగా సుప్రసిద్ధులయిన డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి ఒకరు. ప్రగతివాద కవి మార్క్సిస్టు కానక్కరలేదని, అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు, ఉత్తమ కవిత్వానికి ప్రేరణ అని నమ్మిన కవులు చేతనావర్తన కవులు. “గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి” అన్న వేనరెడ్డి “సవిత “అను ఈ సంపుటి మొదట 1973లో సాందీపని ప్రచురణల ఆధ్వర్యంలో ముద్రించబడింది. తొలిముద్రణలో “శత సహస్ర ముఖాల సరస కవి” అనే పేరుతో దాశరధి కృష్ణమాచార్యులు ముందుమాట వ్రాశారు. “పరిశీలన” అనే పేరుతో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు వ్యాసం అందించారు. ఇప్పుడు మళ్లీ “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థ రజతోత్సవాల ప్రచురణలో భాగంగా వేన రెడ్డి గారి “సవిత” వచన కవితా సంపుటి 2023లో ఐదవ ముద్రణకు నోచుకుంది . అదృష్టం కొద్దీ 2023 ఆగస్టు 13న ప్రఖ్యాత పద్య కవి శ్రీ గిరిజా మనోహర్ బాబు గారి ద్వారా కరీంనగర్లో నేను అందుకుంటిని. అందినదే తడవుగా ఆద్యంతం కవితా పఠనం పూర్తి చేసి నాలుగు మాటలు చెప్పాలని ఈ సమీక్షకు పూనుకున్నాను. 34 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ చేతనావర్తన కవి కాలం పై చెరగని ముద్రని తన రచనలతో వేశాడు. అందుకే వేనరెడ్డి మరణం తట్టుకోలేక తన బాధను “కరిగే వెన్న ముద్ద” పేరుతో కాళోజి రాసిన కవిత సందర్భోచితం.
“తాపసియై కైతగమారిన రసికుడు/
దారిని తీర్చుచు నడిచిన పథికుడు/
వ్యక్తిత్వం కోల్పోని సాంఘికుడు /
ఆయాసము పడనట్టు సాధకుడు/”
అని వేన రెడ్డి వ్యక్తిత్వాన్ని నా గొడవలో చిత్రించారు.
సవిత అంటే సూర్యుడు. సూర్యుడు వెలుగుకి, వేడికి, విజ్ఞానానికి సంకేతం. వేనరెడ్డి కవిత్వంలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటారు 5 వ ముద్రణలో ముందు మాటనందించిన ప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్. వేన రెడ్డి గారిపై తిలక్,శ్రీ శ్రీల ప్రభావం ఉన్నట్లు కొన్ని కవితల ద్వారా మనకు అర్థమవుతుంది. సంపుటిలో 26 కవితలతో పాటు, వేనరెడ్డి తన డైరీలో రాసుకున్న 54 భావ కవితలను ‘రస రేఖలు’గా ఈ సంపుటిలో అందించారు.
తొలి కవిత “జన్మాష్టమి”లో కవి అనన్య భక్తిని ప్రకటిస్తూనే సమకాలీన సామాజిక పరిస్థితులను విన్నవించుకుంటాడు.
“గోమాయుల రాజ్యంలో/
గోవులు జీవించలేవు/
మాకు వెన్నలేదు/
మాకు వెన్నెల లేదు”అంటూ “ఈ తమస్సు చీల్చబడుతుంది” కవితలో
పచ్చని ఎర్రని కామెర్లవాడు/
ప్రజా హృదయమెరుగనివాడు/ప్రజాస్వామ్యానికి తగడు/ఇంటినేదిద్దుకోలేనివాడు/
ఇంటర్నేషనలిస్టు కాలేడు/ అంటూ జాతీయ భావాన్ని తీసిపారేసే వామపక్షులపై విరుచుకుపడ్డాడు. ఈ కవితలోని ఒక్కో పదం, ఒక్కో పాదం ఓ ‘బలమైన ప్రకటన’కి చిరునామా. “యుద్ధం పూర్తి కాలేదు”అంటూ తల్లి నుదుటి కాశ్మీర కుంకుమ నిండుగాఉండాలి /
హుందాగా అందంగా వెలగాలి/
అని కాశ్మీర సంరక్షణ సందేశం ఆనాడే కవి అందించాడు. ‘చీకటి ఆవులించింది’, ‘సూర్యుని విడిపించాలి’ కవితల్లో కవి సామాన్యుని జీవిత సంఘర్షణలను భావాత్మకంగా చెప్పుకొచ్చారు. ఈ కవితలలో అక్షర సంపద జలపాతంలా ప్రవహించినది అని చెప్పవచ్చు రాత్రి, ధాత్రి, తెట్టే, గుట్ట, భీకరమై, కాకరమై, దూకి, ప్రాకి, త్యాగి, జోగి, మకలు, మెలికలు, ఆకలి కేకలు, కామం,క్షేమం …మొదలగు అనేక పదాలతో చిక్కటి, చక్కటి సాంద్ర కవిత్వాన్ని ఒలికించారు.
ఆధునిక కవితా ప్రస్థానంలో వినూత్నప్రయోగాల్ని అందించిన విశేష కవి వేన రెడ్డి. “రఫ్ స్కెచ్” అన్న కవితలో
‘పెద్దలు, గద్దలు తినేసినాక/
తోలూడదీసి వేలాడిన గోమాతల ఉంది దేశం/ఇది నా దేశం రఫ్ స్కెచ్/
అంటూ భారతీయ సామాజిక వ్యవస్థని కళ్ళ ముందు నిలిపాడు కవి.
దేహంలో జీవం లేదు/
జాతి రక్తంలో శక్తి లేదు/
చేతల్లో చైతన్యం లేదు/అంటూనే
వారి నుదుట ఎప్పుడు కాషాయారుణ/
ఉషస్సు ఉదయిస్తుందోనని/ కవి ఆశావాద దృక్పథాన్ని వెలిబుచ్చాడు.
” కాలాన్ని కత్తిరించి చూడకు” శీర్షికనే ఆలోచనాత్మకం. ఇందులో ‘దేశాన్ని విభజించి భజించరాదు/ అది అఖండ స్వరూపం/’అనడం వెనుక కవి జాతీయ సమగ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం నీది ఈ బ్రతుకు నీది/
నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాల/
నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి/ అంటాడు కవి. “ఆకలి ఒక్కటే సత్యం” కవితలో
‘ఆకలి అంతర్జాతీయమైంది/విశ్వజనీనమైంది’ అనడంలో కవి మానవతా స్థాయిని గుర్తించవచ్చు. ‘పిచ్చి గుండె’లో ధైర్యం నింపుతూ “పిరికిగా చావకు”అంటూ సకల మానవాళికి హితబోధ చేస్తాడు కవి.
నీ చావు నీ బ్రతుకు నీ ఒక్కడి సొత్తు కాదు/ సంఘపరం/ అంటాడు వేనరెడ్డి. “?-!” శీర్షికతో ఉన్న కవిత పాఠకుడికి వాస్తవంగా ఓ ప్రశ్నార్థకమే?ఓ ఆశ్చర్యార్థకమే! ఓ జీవిత సందేశమే.
“కవిత్వం నా ఊపిరి”లో కవి వేనరెడ్డి కవిత్వ లక్ష్యాన్ని సూటిగా తెలియచెప్పారు. మనిషి కోసం/ దేశం కోసం/చిందిన రక్త చందనం కవిత/ అంటాడు. సంచలనం కవిత/సమాజ సంఘటనంకవిత అంటాడు కవి.అవును కదా!! వివిధ వాదాలతో సమాజాన్ని విడదీసే కవిత్వం గుట్టలు గుట్టలుగా వస్తున్న నేటి కాలానికి అనువర్తింపదగినది ఈ కవిత పాదం. సమాజ సంఘటనము కవిత కానీ సమాజాన్ని ముక్కలు చేయడం కాదు. “నీ కాళ్ళ మీద నువ్వు” అనే కవితలో దేశ విచ్చిన్నకర శక్తుల మనస్తత్వాన్ని అక్షర అక్షరాన తెలుపుకొచ్చాడు కవి.
కులం పేర, మతం పేర/
భాష పేర, ప్రాంతము పేర/
నిన్ను విభజించి,చించి/
నీ కళ్ళల్లో దుమ్ము చల్లి/
నీ గాయం మీద కారం చల్లి/
లేపుతారు ప్రే/
రేపుతారు నీలో పశువుని/….
ఎంతటి గాడమైన ప్రకటికరణ. ఇంకా ఈ సంపుటిలోని ఒక్కో కవిత ఓ అధ్యాయమే అవుతుంది. ” జాగృతి”, “సంధుక్షణము”, “ప్రాప్యవరాన్నిబోధత” మొదలగునవి ప్రచండ జాతీయతా భావాలని వికసింపజేసే కవితలే. ఇంతటి భావ కిరణాల “సవిత” తాకిడి మీ హృదయాలని తాకాలంటే మీరు ఈ కవితా సంపుటి పఠనంలో మునగాలి. దీనిని మరోసారి ముద్రించి సాహితీ లోకానికి అందించిన సహృదయ వారు సదా అభినందనీయులు.
ప్రతులకు:
సహృదయ
హనుమకొండ
9949013448
జాతీయ భావ కిరణాల సంపుటి”సవిత”
previous post