Home సంపాదకీయం చైతన్య దీప్తులు

చైతన్య దీప్తులు

by Kondapally Neeharini

మయూఖ సంపాదకీయం, జనవరి నెల 2024 -డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు

కాలం తనతో పాటు మంచి చెడులను తీసుకువస్తూ ఉంటుంది. అంది పుచ్చుకున్న వాళ్లకు అందినంత. రోజులు గడుస్తూ నే ఉంటాయి. క్యాలెండర్ల పేపర్లు తిప్పేస్తూ ఉంటాము. నిత్య జీవన సమరంలో కొన్ని సంతోషాలు కొన్ని దుఃఖాలు భ్రమణం చేస్తూనే ఉంటాయి. 2023

ఇటువంటివే కొన్ని సంఘటనలను మనసు లోతుల్లో పడవేసిపోయింది. సామాజిక అసమానతల ఉద్వేగాలను రగిల్చి పోయింది. కొన్ని అద్భుత ఆవిష్కరణల సందర్భాలను ఇచ్చి పోయింది. మరికొన్ని ఆలోచనాత్మకమైన ధోరణలను అందించిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది, 2024 లో అడుగు పెట్టాము.

విద్య,వైద్యం ఏ పౌరుడికైనా ఎంతో ముఖ్యమైనవి అనే జ్ఞానం ఎప్పుడో మూల మూలన పాకిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లల్ని చదివిస్తున్నారు అట్టడుగు శ్రామిక వర్గాలు కూడా ఈ నిజాన్ని గ్రహించాయి. వీళ్ళలో కొందరు ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది చదవలేక, పరీక్షలు రాయలేక కొందరు వెను తిరుగుతున్నారు. కొందరు రాసి ఉత్తీర్ణత సాధించలేక వెను తిరుగుతున్నారు. అయినా కానీ వీళ్ళేమి ధైర్యాన్ని కోల్పోవడం లేదు. పనిచేసుకొని బ్రతకాలి అని ఒక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు.దీనికి కారణం వాళ్ళ ముందు తరం వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తాతలు, నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చిన స్ఫూర్తి. రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి ఆలోచించడానికి మెదడుంది ఇంత గొప్ప ప్రపంచాన్ని చూస్తున్నాము, చెడ్డ పనులు చేయకుండా కష్టం చేసుకుని పని చేసుకుని బ్రతికితే తప్పేం లేదు అనే తెలివిడి కి వచ్చి బ్రతుకుతూనే ఉన్నారు.

అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు ఎవరినీ ఎవరు అవమానపరచడం ఎవరు సహించరు అనే విషయాన్ని గ్రహించారు కాబట్టి గౌరవాన్ని కోరుకుంటున్నారు. గతంలో ఉన్నట్టు తమకంటే తక్కువ ఉన్న వాళ్ళను అవమాన పరిచడం ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు ఈ అలవాట్లను మానుకుంటున్నారు. అందరినీ సమాన దృష్టితో చూడడం అనే భావాలు ఈ కొత్త తరంలో కనిపిస్తున్నాయి .ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు తాము తమ జీవన విధానాన్ని అనుసరించి ఉన్నట్టే ఉంటున్నారు. బుద్ధి జ్ఞానంలో మేము కాస్త ఎక్కువ అనుకుంటున్న వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ జీవన విధానం తో ఉంటున్నారు, కానీ ఎదుటివాళ్ళను కించపరిచి మాట్లాడమనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ మార్పుకు కారణాలేంటి అని ఒకసారి తరిచి చూస్తే ఈ ఉన్నత భావాలు ఇలాగే కొనసాగుతాయి.

సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ

సింహవలోకనం చేయవలసిన అవసరం ఉంది. కుల మతాలకు అతీతంగా కులమత భేదాలను ఖండిస్తూ సమాజాన్ని సమానత్వంతో చూడాలని చెప్పిన మహా మనిషి. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన ఇక్కడ కూడా ఒక అగ్నిని రగిలించినటువంటి స్త్రీ మూర్తి. నిమ్న జాతులకు అభ్యున్నతికి కృషి చేస్తూ భర్త జ్యోతిరావు పూలే ఆదర్శాన్ని తలకెత్తుకున్నటువంటి మహిళ. కుల వ్యవస్థకు శూద్రుల అసమానతలకు కారణాలను వెతికి సామాజిక బాధ్యతగా పోరాటం చేసినటువంటి విధుషి. పితృస్వామ్య పరిపాలన లో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గళమెత్తిన ఉద్యమకారిణి. ఎప్పుడో 1848లోనే బాలికల కోసం మరీ ముఖ్యంగా తక్కువ కులాల బాలికల కోసం,స్త్రీల కోసం పాఠశాలలను ప్రారంభించిన ధైర్యశాలి. ఆ రోజుల్లో ఉన్న సామాజిక కట్టుబాట్లను ఆధిపత్య ధోరణలను ధిక్కరించి ఉపాధ్యాయురాలిగా తనను తాను నిరూపించుకున్నటువంటి సావిత్రిబాయి పూలే ఈ ఆధునిక భారత దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని కీర్తినందుకున్నారు. మొదటి బడిని స్థాపించిన కొన్ని ఏళ్లలోనే దాదాపు 20 బడులను ప్రారంభించి ఉచితంగా విద్యను అందించే ఉద్యమానికి ఆద్యులయ్యారు. ఆ రోజుల్లో ఒక 18 ఏళ్ల యువతి ఇంతటి సాహసానికి పూనుకోవడం అనేది ఎంతో గొప్ప మాట.

సామాజిక సమస్యలను గురించి, మానవ హక్కులను గురించి స్త్రీలకు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యపరచడంలో భాగంగా మహిళా సేవ మండల్ అనే ఒక సంఘాన్ని కూడా స్థాపించింది సావిత్రి బాయి. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు” అని చెప్పిన మాటలను వినడమే కానీ ఆచరణ శూన్యము అని గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని శూన్యము గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని నినదించిన సావిత్రిబాయి పూలే పితృస్వామ్య వ్యవస్థను ఖండించి, బాల్య వివహాలను చేయకూడదని, వితంతువులకు పునర్వివాహాలు చేయవచ్చునని, మూఢనమ్మకాలకు వదలాలని, సతీసహగమనాన్ని వ్యతిరేకించాలని పెద్ద పోరాటాలనే చేశారు. ఎన్ని వేధింపులు ఎదురైనా భయపడలేదు, ఎదురీదారు. వితంతువులకు శిరోముండనం అంటే, తలవెంట్రుకలు తీసి, గుండు చేయడం అనే దుశ్చర్యను ఖండించి క్షురకులకు చెప్పి “వితంతువులకు శిరోముండనం చేయుము” అని వాళ్లచేత చెప్పించి, సమ్మె కూడా చేయించారు. ఇది పద్దెనిమిది వందల అరవైలలోని మాట! జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన సత్యశోధక్ మండలి ద్వారా మహిళా విభాగం నిర్వహించిన సావిత్రి బాయి ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. తన భర్త ఫూలే మరణించిన తర్వాత ఆయన చితికి సావిత్రి బాయి నిప్పు పెట్టి కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చిన సంస్కర్త. భర్త సంఘ సంస్కరణలను తన భుజాలపై వేసుకున్న ధీశాలి. 1897లో పూణే నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. జోలె పట్టుకొని విరాళాలు సేకరించి, ఆ వచ్చిన మొత్తంతో వైద్యశిబిరాలను నిర్వహించి, సేవా కార్యక్రమాలను చేసిన సావిత్రి బాయి పూలే చివరకు ఆ ప్లేగు వ్యాధివలననే మరణించారు. ఆమె మరణించిన 100 ఏళ్లకు అంటే 1997లో భారత ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ‘సావిత్రి బాయి పూలే’ Savitri bai phule’ పేరుతో 200 రూపాయల విలువ చేసే తపాలా బిళ్లను 1998లో విడుదల చేసి గౌరవించింది. అంతేకాదు పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రి బాయి విశ్వవిద్యాలయం అని పేరును పెట్టడం కూడా ఒక గొప్ప నిర్ణయం.

ఇంతటితో అయిపోయిందా? సావిత్రిబాయి పూలే ఆదర్శాలు నిజంగా ఆచరింపబడుతున్నాయా?  ఆచరింపబడితే ఎంతవరకు,  ఎలా? అనేది ప్రతి ఒక్కళ్లు వాళ్ల మనసుల్లో ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఒక ‘విజన్’ ఏర్పడుతుంది.

శతాబ్దం గడిచిపోయిన స్త్రీల జీవితాలలో రావాల్సిన అంత మార్పులు రాలేదనేది సత్యదూరం కాదు. ఇంకా ఇంకా అణచివేత అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో పురుషాధిక్య ప్రపంచంలో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గొంతెత్తుతున్న స్వరాలకు సావిత్రిబాయి పూలే పేరు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏం కారణం ఇంకా ఈ 2024లో అడుగుపెట్టినా కూడా మార్పులు ఏవీ రాకుండా సమాజం చెలరేగుతూ ఉంటే అర్థం ఏముంది? ఒకవైపు  బడుగు బలహీనవర్గాల వారిని అవమానపరచడమైతే ఏంటి? అదే బడుగు బలహీనవర్గాల కుటుంబాలలో స్త్రీలు ఇంకా పురుషాధిక్యంలో మగ్గి పోవడమైతేనేమి ఎలా చూడాలి అర్థం కాని స్థితి. ఉన్నత వర్గాలనుకునే వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లు అని చెప్పబడే వాళ్లు, ధనవంతులు, గొప్ప కులం అనుకునేవాళ్లు అంటూ ఎన్ని రకాల పేర్లు ఉన్న వాళ్ల ఇళ్లల్లోనూ ఆడవాళ్లని అదిమిపెట్టి చులకనగా చూడడం అనేది తగ్గు ముఖం పట్టని ఘోరం. ఇది ఏ దారులను ఏర్పరుస్తుంది?

“కెరత్ నహీ, రోజ్ గార్ చాహియే”. దానమిచ్చే సొమ్ము వద్దు ఉపాధి ఇవ్వండి” అని గొంతెత్తి అరవాల్సిన అవసరం స్త్రీలకు ఇంకా ఎందుకు ఉంది? ఆడవాళ్లకే కాదు అణగారిన వర్గాల మగవాళ్లకి ఈ కష్టం ఏమొచ్చింది, ఎందుకు వచ్చంది? సమాజంలోని ఒడిదొడుకులను ప్రశ్నించిన సావిత్రిబాయి పూలే 1854లోనే ‘కావ్యఫూలే’ అనే పుస్తకాన్ని ప్రకటించిన కవయిత్రి. ప్రకృతి పరంగానైనా, భగవంతుని సృష్టిపరంగా నైనా మనుషులంతా సమానమే. మగ జాతి విభేదాలు శారీరక నిర్మాణంలోనే గాని మానసిక భావనలో తేడాలు ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న వేధించిన కవయిత్రిగా తమ కలాన్ని ఎత్తారు. మనుషుల మధ్య అసమానతలను ఖండించారు. పావన కాశీ శుభోదయం అనే పుస్తకము, గొప్ప వక్త అయిన సావిత్రి బాయి ఫూలే ఉపన్యాసాలు వ్యాసాలుగా ప్రచురించిన పుస్తకము వెలువడించారు.  ఆ ఆధిపత్య రోజులలో కుల వ్యవస్థను ఖండించి, శూద్రులకు సమానత్వాన్ని ఇవ్వాలని ఎలుగెత్తిన విప్లవ వనిత! వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, సమాజోద్ధరణకు నడుం బిగించిన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి ఫూలెకు నివాళులర్పిస్తూ, ఆమె ఆశయాలను పాటించే దిశలో అడుగులు వేద్దాం. కష్టపడి పనిచేసే వాళ్లకు చేయూతనిద్దాం, విద్యా విజ్ఞానాలు అందిపుచ్చుకునే ఆసరాలవుదాం. ఎవరి ఆత్మ అభిమానాన్ని కించపరచకుండా సమానత్వాన్ని చాటుదాం. కాలం తిప్పే ప్రతి పుటలో మన కోసం కొన్ని అక్షరాలను రాసుకుందాం.

You may also like

Leave a Comment