Home ధారావాహిక నవల జీవన మాధుర్యం

జీవన మాధుర్యం

by Laxmi Madan


మొదటి భాగం

బస్సులో కూర్చున్న అపర్ణ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.. ఎన్నేళ్ల కోరిక నెరవేరబోతుంది. తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్లాలని ఎప్పటినుండో మనసు లాగుతుంది కానీ !పరిస్థితులు అనుకూలించలేదు.
దాదాపు ముప్పయి ఏళ్ల తర్వాత తను పుట్టి పెరిగిన ఊరిలో కాళ్లు మోపబోతుంది ..ఆ ఆనందం అపర్ణను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన ఊరికి వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే ఆధారం. ఆ బస్సులైనా ఊర్లో వరకు వెళ్ళవు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగుతాయి అక్కడి నుండి రిక్షాలో వెళ్లాల్సి వస్తుంది. మరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు….
అపర్ణ ఉండేది చెన్నైలో… పెళ్లయ్యాక భర్తతోపాటు వెళ్లి అక్కడే ఉద్యోగం చూసుకొని స్థిరపడింది. పిల్లలు కూడా అక్కడే చదువుకొని విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి…భర్త తాను మాత్రమే ఉండటం వల్ల ఈ మధ్యకాలం ఊరి జ్ఞాపకాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. అపర్ణ తల్లితండ్రులు కూడా అక్కడ ఉండకపోవడం వల్ల సొంత ఊరికి వెళ్లడం తనకి కుదరలేదు.
కొద్దిరోజుల క్రితమే ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ తన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం వల్ల ఆమె తన చిన్ననాటి స్నేహితురాలని తెలిసింది.. ఆమె అదే ఊర్లో ఉంటుందట. ఊరి విశేషాలు అన్నీ చెప్పింది… ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు .. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవాళ్లు వసంత తల్లిదండ్రులు కూడా అపర్ణను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. వసంత కూడా అపర్ణ ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా ఉండేది.. ఇద్దరు కలిసి ఎన్నో చోట్లకు తిరిగేవాళ్లు ఏది కావాలన్నా ఇద్దరు వెళ్లాల్సిందే ..అలా వసంత గుర్తొస్తూనే ఉంది…అప్పటినుండి ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్లాలని అపర్ణకు అనిపిస్తుంది ..కానీ తగిన సమయం రావాలి కదా…
ఆసమయం రానే వచ్చింది. అపర్ణ స్నేహితురాలు వసంత తన చిన్న కూతురు పెళ్లి ఉందని ఆహ్వానించింది.. తప్పకుండా రావాలని పదేపదే చెప్పింది. ఈ విషయం భర్తకి చెప్తే ఆయనకు ఆఫీసులో ముఖ్యమైన పని ఉండడం వల్ల రావడం కుదరదని వీలైతే నువ్వే వెళ్ళు అని చెప్పారు.
అంతే ఇక చెంగున దూకి బట్టలు సర్దుకుంది ఇంకా మూడు రోజులు ఉంది ప్రయాణానికి.. ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఆరాట పడుతుంది…
“ఏమండీ పెళ్ళికి ఈ చీరకట్టు కోనా! నేను సర్దుకున్న చీరలన్నీ బాగున్నాయా ఒకసారి చూసి చెప్పండి నాకు ఏమీ తోచడం లేదు” అన్నది అపర్ణ.
” అసలు నీ సంతోషం చూస్తుంటే అక్కడ నుండి మళ్ళీ వస్తావా అనిపిస్తుంది ఏంటా హడావిడి!” అన్నాడు భర్త.
” అదేం కాదు గాని ముందు ఈ విషయం చెప్పండి కాస్త సర్దుకోవడంలో సహాయం చేయండి? ” అని అడిగింది అపర్ణ.
ఆమె సంతోషాన్ని చూసి ముచ్చట పడ్డ అపర్ణ భర్త సాగర్ సూట్ కేస్ దగ్గర కూర్చొని ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలి ఏ నగలు ఎప్పుడు పెట్టుకోవాలి అని అన్ని సెలెక్ట్ చేసి సర్ది ఇచ్చారు అలాగే వేసుకోవాల్సిన మందులు కూడా అందులో పెట్టారు.
” థాంక్యూ” అన్నది అపర్ణ.
” నీ స్నేహితురాలు పెళ్లికి పిలిచినప్పటి నుండి అసలు నన్ను పట్టించుకుంటున్నావా షాపింగ్ అని అదనీ ఇదనీ నన్ను రోజు తిప్పుతూనే ఉన్నావు” అన్నాడు సాగర్.
” సారీ సాగర్” చాలా రోజులకు వెళుతున్నానని ఆనందం నన్ను నిలవనీయడం లేదు” అన్నది అపర్ణ.
” ఊరికే అన్నానులే వెళ్లిరా! నాకు వీలైతే ఏదో ఒక రోజు నేను వస్తాను దిగులు పడకు” అని అపర్ణ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు సాగర్.
ఆ మూడవ రోజు రానే వచ్చింది… సాగర్ స్టేషన్ వరకు వచ్చి రైలెక్కించి వెళ్ళాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.. ఒక్కదాన్ని పంపించడం అతనికి కూడా ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి..
“అప్పూ! జాగ్రత్త! చేరగానే నాకు ఫోన్ చెయ్యి ఫోన్ దగ్గరే ఉంచుకో.. నేను నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను సరేనా” అని చెప్పాడు.
” అలాగే సాగర్ నువ్వు కూడా వేళకి భోజనం చేయి.. పచ్చళ్ళు అన్నీ చేసి ఫ్రిజ్లో పెట్టాను, కొన్ని కూరలు కూడా చేసి పెట్టాను ,అవి వేసుకొని తిను అన్నం మాత్రం వేడిగా వండుకొని తిను భోజనం విషయంలో అశ్రద్ధ చేయకు ,పని ధ్యాసలో సమయాన్ని మర్చిపోకు మొక్కలకు నీళ్లు పొయ్యి… రాత్రి ఎక్కువసేపు టీవీ చూడకు విశ్రాంతి తీసుకో ఆరోగ్యం జాగ్రత్త” అని చెప్పింది.
సాయంత్రం 6 గంటలకు రైలు బయలుదేరింది.. హైదరాబాదు చేరేవరకు తెల్లవారి ఆరు గంటలు అవుతుంది….
ఒంటరిగా ప్రయోగించడం కొంచెం ఇబ్బందిగానే ఉంది.. కానీ సొంత ఊరికి వెళుతున్నాననే ఆనందం మిగతావి ఏవి కనిపించ కుండా చేసింది.
ఎదురు సీట్లో తన వయసు వాళ్లే ఇద్దరు కూర్చొని ఉన్నారు… మెల్లగా వాళ్లతో మాటలు కలిపింది.
అపర్ణ ఎక్కువ కలివిడిగా ఉండే మనిషి కాబట్టి అందరితో తొందరగా కలిసిపోతుంది ..ఒకసారి స్నేహం చేసిన వాళ్లు మళ్లీ వదిలిపెట్టరు ,అలాంటి మనస్తత్వం ., అవతలివారికి ఎలా నచ్చుతుందో అలా మాట్లాడగలుగుతుంది, అదీకాక ఎవరిని నొప్పించని మనస్తత్వం అందుకని అపర్ణ స్నేహం కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. అలా ఎదురు సీట్లో ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్లది తన పక్కగా ఊరే అని వాళ్లు కూడా చెన్నైలో స్థిరపడ్డారని తెలిసింది. అదృష్టవశాత్తు వాళ్లు వెళ్ళేది కూడా అపర్ణ వెళ్లే పెళ్లికే….
వాళ్ల సంభాషణ ఈ విధంగా జరిగింది..
ముందుగా అపర్ణ వాళ్ళను మాట్లాడించింది.
“హలో !మీరు హైదరాబాద్ వరకేనా ఇంకా ఎక్కడికైనా వెళ్లాలా?” అని అడిగింది అపర్ణ.
” హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో మా ఊరు మేము అక్కడ దగ్గరే ఉన్న రామాపురంలో పెళ్లికి వెళ్తున్నాము” అనీ చెప్పారు.
“ఓ.. నేను కూడా అదే ఊర్లో పెళ్లికి వెళ్తున్నాను నాఫ్రెండ్ వసంత కూతురు పెళ్లి కోసం వెళ్తున్నాను నా పేరు అపర్ణ మీపేర్లు? అనీ అడిగింది.
వాళ్లు ” మేము కూడా వసంత వాళ్ళ అమ్మాయి పెళ్లికే వెళ్తున్నాము మాకు దూరపు బంధువులు వాళ్లు.. నా పేరు స్వప్న దీని పేరు సంధ్య మేమిద్దరం కజిన్స్ అవుతాము” అని చెప్పారు.
“మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మనం పెళ్లిలో కలవచ్చు సరే !ఎనిమిది కావస్తుంది డిన్నర్ చేద్దామా” అన్నది అపర్ణ.
“మాటల్లో పడి సమయమే చూసుకోలేదు” అనుకున్నారు ముగ్గురు.
వారి వారి బాక్సులను తెరిచి పేపర్ ప్లేట్స్ దగ్గర పెట్టుకున్నారు.. అపర్ణ పులిహోర తెచ్చింది.. స్వప్న చపాతి ఆలూ కూర తీసుకొచ్చింది, ఇంకా సంధ్యనేమో దద్దోజనం తీసుకొచ్చింది… ముగ్గురు అన్నిటినీ కలిపి కడుపునిండా తిన్నారు ఒకరి వంటకాలు ఒకరు మెచ్చుకున్నారు కూడా.
ఇక పడుకుందామని ఎవరు బెర్త్ లోకి వాళ్లు వెళ్లిపోయారు. అపర్ణకు మాత్రం నిద్ర పట్టడం లేదు. అలా కిటికీలో నుండి చూస్తూ కూర్చుంది. అసలు ఇన్నేళ్లు ఊరికి వెళ్లకుండా ఎలా ఉండగలిగింది.. మరీ సమయం లేదు అని చెప్పుకునే మాట అబద్ధం. తనకు తానే మనసులో బాధపడి ఇప్పటికైనా సమయం వచ్చింది నా చిన్నప్పటి బాల్యాన్ని కళ్ళారా చూసుకోవడానికి అది అనుకొని కళ్ళు మూసుకుంది.
హైదరాబాద్ చేరుకునే వరకు ఏడు గంటలు అయింది అనుకున్న దానికన్నా ఒక గంట ఆలస్యంగా రైలు చేరుకున్నది. దిగిన తర్వాత స్వప్న మరియు సంధ్య వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్లి పోయారు. అపర్ణ మాత్రం బస్టాండ్ కి ఆటో లో వెళ్ళింది.
బస్టాండ్ చేరుకోగానే తన ఊరికి వెళ్లే బస్సు కనబడింది వెంటనే ఎక్కింది. ముందు సీట్లో కిటికీ పక్కన కూర్చుంది.. అంతే! ఇలా ఆలోచన లోకి వెళ్ళిపోయింది. బస్సు కండక్టర్ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
“ఎక్కడికి వెళ్లాలి మేడం అప్పటినుండి పిలుస్తున్న మీరు వినడం లేదు” అన్నాడు కండక్టర్.
“సారీ సార్ వినిపించలేదు” అని చెప్పి రామాపురం కి ఒక టికెట్ ఇవ్వండి” అని అడిగింది. టికెట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని మళ్ళీ కిటికీలో నుండి బయటకు చూడసాగింది.
బస్సులో నుండి చూస్తే చెట్లని వెనక్కి వెళుతున్నట్టు అనిపిస్తే చిన్నప్పుడు అనుకునేది చెట్లని అలా పరుగులు తీస్తాయి అని ..అది గుర్తొచ్చి పెదవుల పైన నవ్వు విరబూసింది. ఊరికి వెళ్లే బస్సు ఎక్కగానే బాల్యపు పచ్చివాసనలు దరిచేరుతున్నాయి అనిపించింది. ఒకప్పుడు ఉన్న చిన్న రోడ్డు ఇప్పుడు డబల్ రోడ్డుగా మారిపోయింది.. గుర్తుపట్టలేనంతగా మారిపోయినట్లు అనిపించింది. కిటికీలో నుండి ఒక్కొక్క ఊరు చూస్తూ కూర్చుంది. ఒక విషయం ఏంటంటే అప్పట్లో రామాపురంకి బస్సు లేదు మెయిన్ రోడ్డు మీద దిగి రిక్షాలో వెళ్లాల్సి వచ్చేది. ఊర్లోకి బస్సు కూడా అయింది ‘ఇంకా ఊరు ఎంత మారిపోయిందో “చూడాలి అనుకున్నది అపర్ణ. పచ్చని పొలాల మధ్య నుండి బస్సు వెళుతుంటే ఆహ్లాదకరంగా అనిపించింది అనిపించింది. ఊరికి వెళుతున్నట్లు హైదరాబాదులో ఉన్న అమ్మా నాన్నకి తమ్ముడు అక్కకి చెప్పనేలేదు చెప్తే ముందు అక్కడికి రమ్మంటారు అందుకని నేరుగా పెళ్లికి వెళ్లి ఊరంతా తిరిగి తర్వాత హైదరాబాద్ చేరుకోవాలని అనుకుంది. తన దిగాల్సిన స్టేజ్ వచ్చింది తన బ్యాగు సూట్ కేసు తీసుకుని క్రిందికి దిగింది అపర్ణ..
ఎదురుగా కనపడ్డ మనిషిని చూసి ఆశ్చర్య పోయింది

You may also like

Leave a Comment