Home ధారావాహిక నవల జీవన మాధుర్యం

జీవన మాధుర్యం

by Laxmi Madan


4వ భాగం

దూరంగా ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు.

అపర్ణ ఆ వ్యక్తిని చూసి ఒక్కసారి కలవరపడింది. అతనేనా? కాదా? అని ఆలోచనలో కూడా పడింది.

అతను కూడా అపర్ణని కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఇంతలో భూమవ్వ అతన్ని చూసి,

“సారు! బాగున్నారా” అని అడిగింది.

“బాగున్న ” అని అతను అపర్ణ వైపు చూస్తున్నాడు.

ఇంతలో భూమవ్వ “అపర్ణమ్మ ఈయన భూపాల్ రెడ్డిసారు కొడుకు శ్యామ్ రెడ్డి సార్” అని చెప్పింది.

ఆశ్చర్యం నుండి తే రుకున్న అపర్ణ , అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. అతను కూడా అపర్ణ వైపు చూసి నవ్వి..

” అపర్ణ బాగున్నావా”? అడిగాడు.

” నేను బాగున్నాను శ్యామ్” అన్నాది.

భూమవ్వ అప్పుతో “అమ్మ నేను లోపలికి పోతా! వసంతమ్మా నాకోసం చూస్తుంది” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

శ్యామ్ అప్పటిలాగే ఉన్నాడు. అతని అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ వయసులో కూడా మొహంలో మంచి తేజస్సు కనబడుతుంది. అలాగే అతని డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంది. బ్లూ జీన్స్ పైన వైట్ షర్ట్ వేసుకున్నాడు. వత్తయిన జుట్టు కొంచెం పల్చబడింది. కానీ వన్నె ఏమాత్రం తగ్గలేదు. అలాగే అతన్ని చూస్తున్న అపర్ణ,

” లోపలికి వెళ్దామా శాం” అని అడిగింది.

” లోపలికి వెళ్తే నీతో మాట్లాడటం కుదరదు. కాసేపు నాకోసం ఇక్కడే కూర్చుంటావా?” అని అడిగాడు.

” అలాగే” అని అపర్ణ అక్కడే వాకిట్లో ఉన్న కుర్చీలో కూర్చుంది.

అపర్ణ లాగే శ్యామ్ కూడా అపర్ణ గురించి ఆలోచిస్తున్నాడు.
“ఎంత అందంగా ఉంది. అపర్ణను స్కూల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే వయసుతో వచ్చిన అందం ఇంకా రెట్టింపు అయ్యింది. ఆమె కట్టుకున్న చీర ఆమె తయారైన విధానం చాలా సింపుల్ గా ఉంది.
మొదటినుండి సింపుల్ గా ఉండడమే తనకు అలవాటు. అదే ఆమెకు పెట్టని ఆభరణం అయింది.

” ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? మాట్లాడుకుందాం అన్నారు?” అని అడిగింది.

” అదేం లేదు అపర్ణ! నాకు నిన్ను చూస్తే కొంచెం గిల్టీ అనిపిస్తుంది.నిన్ను స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఏడిపించాను. కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని నేను అనుకోలేదు. అప్పట్లో నాకు తెలియదు కూడా. కానీ నువ్వంటే చాలా ఇష్టం అది వ్యక్తపరిచే విధానం తెలియక నిన్ను పరి పరి విధాలుగా ఇబ్బంది పెట్టాను.నన్ను క్షమిస్తావా? కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇన్నేళ్లలో నువ్వు నన్ను ఒక్కసారైనా గుర్తు చేసుకున్నావో? లేదో? తెలియదు. కానీ ప్రతి క్షణం నేను నిన్ను గుర్తు పెట్టుకున్నాను. నీతో ఆ విధంగా కాకుండా వేరే విధంగా ప్రొసీడ్ అయినట్లయితే నువ్వు నాకు దూరం అయ్యే దానికి కాదేమో! నీ మనసులో నా పట్ల కోపం నిండేలా నేనే ప్రవర్తించాను. అయినా ఆ వయసులో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది” అని చెప్పాడు శ్యామ్.

” నేనెప్పుడో మర్చిపోయాను శ్యామ్. మన వయసెంతని? నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలను నేను తేలికగ తీసుకోవాల్సింది. అనవసరంగా నేను సార్ కి కంప్లైంట్ చేశాను .అందరిలో సార్ నిన్ను తిట్టారు. నేనే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇవన్నీ ఆ వయసులో సాధారణమే. మనమిద్దరం ఎప్పుడు స్నేహితులమే !అవన్నీ మర్చిపో” అంటూ నవ్వింది అపర్ణ.

శ్యామ్ కూడా నవ్వుతూ…

” హమ్మయ్య మనసు కుదుట పడింది. నీకు ఇంకా నాపై కోపం ఉందేమో అని భయపడ్డాను. నువ్వు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటున్నావు? ఉంటే ఒకసారి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని కలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏమంటావ్?” అన్నాడు శ్యామ్.

” సమయాన్ని బట్టి చూస్తాను శ్యామ్ .నాకు కూడా రావాలనే ఉంది. లోపలికి వెళ్దామా ఇలా బయటే కూర్చుంటే బాగుండదు” అని ఇద్దరు లోపలికి వెళ్లి కూర్చున్నారు.

లోపలికి వెళ్లేసరికి అంకురార్పణ స్టార్ట్ అయింది.ముగ్గురు స్నానాలు చేసి పట్టు వస్త్రములు ధరించి పీటల మీద కూర్చున్నారు. నవధాన్యాలు మట్టి కంచుళ్ళలో వేయించి నీరు పోయించి పూజా విధానం అంతా చేయించారు. ఇదంతా ఒకపక్క చూస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది అపర్ణ.

అప్పుడు తను పదవ తరగతిలో ఉంది. ఎప్పటిలాగే ఆరోజు కూడా స్కూలుకు బయలుదేరింది. కొంచెం వర్షం కూడా మొదలయ్యింది. ఎప్పుడూ తనను వెంబడించే శ్యామ్ కనబడలేదు. గత రెండు నెలలుగా వెనకాల రావడము, ఒక విధంగా నవ్వడం ఏదో రకంగా టీజ్ చేయడం కావాలని తన పేరు పిలవడం ఇలా చేస్తున్నాడు. తను ఏ సమాధానం చెప్పినా దానికి కౌంటర్ వేస్తున్నాడు. ఆ కళ్ళల్లో పొగరు పెదవుల పైన నిర్లక్ష్యమైన నవ్వు చూసి చాలా కోపం వచ్చేది అపర్ణకి.

” హమ్మయ్య ఈరోజు నన్ను వెంబడించడం లేదు వీడు” అని మనసులో అనుకొని సందు చీరల్లో తనతో కలిసే స్నేహితురాలుని చేరుకుని గబగబా నడవ సాగింది. వాన చినుకులు ఎక్కువ కాసాగాయి.ఇంకా పుస్తకాలు తడుస్తాయేమోనని స్కూలుకు కొంచెం దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాప్ లో వెళ్లి నిలబడ్డారు అపర్ణ , స్నేహితురాలు సువర్ణ.

“ఎలాగే వర్షం తగ్గేలాగా లేదు. స్కూల్లో ఈరోజు యూనిట్ టెస్ట్ కూడా ఉంది. ఎలా వెళ్దాము? “అని అపర్ణ అన్నది.

” నువ్వు మరీ చెప్తావు అప్పు! మన సారైనా వర్షంలో తడుస్తూ వెళ్లాల్సిందే కదా! అతను ఇంకా వెళ్ళలేదు. ఎవరూ రాకుండా యూనిట్ టెస్ట్ ఎలా తీసుకుంటారు? నీకు అన్నిటికీ భయమేలే. వర్షం కారణంగా రేపు పెట్టవచ్చు. లేదా మరొక రోజు అంతే గాని ఊరికే టెన్షన్ పడకు” అన్నది సువర్ణ.

చదువు అంటే ఎంతో ఇష్టం. ఈ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటుంది .ఆటలు ఎన్ని ఆడినా అల్లరి ఎంత చేసినా, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయదు. అందుకే ఎగ్జామ్ మిస్ అవుతానే మోనని భయపడింది.

ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న చిన్న టాకీస్ లో చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ, వెనక్కి తిరిగి చూసింది అపర్ణ.

తనకు కొంచెం దగ్గరలోనే నిలబడి ఉన్నాడు శ్యామ్. ఒక్కసారి ఉలిక్కి పడింది.తను పిరికిదేమి కాదు. కానీ ఈ విషయం తనకి అర్థం కావడం లేదు. చాలా కొత్త కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలా దీన్ని పరిష్కరించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటే అర్థం చేసుకుంటారో? లేదో? తెలియదు. మళ్లీ ఈ భయంతో చదువు ఆపేస్తారేమోనని మరో భయం. ఇలా ఆలోచిస్తూ నిలబడ్డ అపర్ణకి, అతని ఏదో కామెంట్ చేయడం వెకిలినవ్వు నవ్వడం చూస్తే చిరాకు అనిపించింది.

” పదవే సువర్ణ! స్కూలుకు వెళ్ళిపోదాం “అని వర్షం లోనే బయలుదేరింది .

” ఏ ఆగు ఇంత వర్షంలో ఎలా వెళ్తాం? కాసేపు ఇక్కడే నిలబడదాం” అని అరిచింది సువర్ణ.

” నీ ఇష్టం నువ్వు వస్తే రా లేకుంటే నేను వెళ్ళిపోతున్నాను” అని నడవ సాగింది అపర్ణ. ఇంకా తప్పదని సువర్ణ అపర్ణని అనుసరించి వెళ్లిపోయింది. అలా తడుస్తూనే స్కూలుకు వెళ్లిపోయారు.

స్కూలుకు వెళ్లిన అపర్ణ తన బ్యాగు తెరిచి అందులో ఉన్న వస్తువుని చూసి భయపడిపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే, అలాగే చూస్తూ కూర్చుంది.

తన స్కూల్ బ్యాగ్ తెరిచి చూసిన అపర్ణ కు ఒక ఎర్ర గులాబీ కనిపించింది .దానిని మెల్లగా తీసింది. గులాబీ చాలా అందంగా ఉంది. దాని తొడిమెకి తెల్ల పేపర్ చుట్టి ఉంది. తనతో వచ్చిన తన స్నేహితురాలు సువర్ణ అలాగే కళ్ళు తెరిచి చూస్తుంది” ఏంటే ఇది?లెటర్ లాగా ఉంది.అమ్మో! ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా” అని భయపడుతూ గట్టిగా మాట్లాడసాగింది.

” సువర్ణా! ఆగు . కొంచెం నీ గొంతు స్థాయి తగ్గిస్తావా? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. కాస్త నన్ను ఇది ఏంటో చూడనీ.నన్ను కంగారు పెట్టకు” అని అన్నది.

అప్పటికే సువర్ణ గొంతు విన్న కొంతమంది మగ పిల్లలు ఇటువైపు చూడడం మొదలుపెట్టారు.

అదేమీ పట్టించుకోకుండా అపర్ణ తను కూర్చునే బెంచ్ లో కూర్చుని మెల్లగా కాగితం విప్పింది. ఊహించిందే అంతకన్నా ఏముంటుంది కనుక. “ఐ లవ్ యు”❤️ అని చక్కని అక్షరాలతో రాసి ఉంది .కాస్త కళాపోషణ ఉందేమో! దానిని కొంచెం కళాత్మకంగా రాసి, పువ్వులు తీగలు పెట్టి ఇచ్చాడు.

ఆ ఉత్తరం చదివిన అపర్ణ లోపల కొంచెం ఆందోళన పడ్డా కూడా, మీదికి ఏమీ పట్టనట్లు మొహం పెట్టుకొని ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసి వచ్చింది .అలాగే పువ్వుని కూడా బయటకు విసిరేసింది. ఇంతలో క్లాస్ టీచర్ వచ్చారు మొదటి పీరియడ్ ఇంగ్లీష్ . ఆరోజు సార్ గ్రామర్ చెప్తున్నారు. అన్యమనస్కంగా ఉంది.కానీ అది ఏమీ లేనట్టుగా గ్రామర్ వినసాగింది . మనసు అక్కడ లేనేలేదు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. “ఇలాంటివి ఇంట్లో తెలిస్తే తన పరిస్థితి ఏంటి? తన చదువు ముందుకు సాగుతుందా!” ఇలా ఆలోచిస్తున్న అపర్ణకి సారు అపర్ణని ఒక క్వశ్చన్ అడిగాడు.

“అపర్ణా! వచ్చి ఆక్టివేస్ లో రాసిన సెంటెన్స్ ని పాసి వైస్లో రాసి చూపించు” అని అడిగాడు.

అపర్ణకి ఆమాట వినిపించలేదు. అలాగే కూర్చుని ఉంది.

“ఏంటమ్మా క్లాసులో నిద్రపోతున్నావా? ఎప్పుడూ చురుగ్గా ఉండే దానివి ఏమైంది ఈవేళ నీకు ?అసలు క్లాస్ వింటున్నావా లేదా?” అని అన్నారు సార్.

ఒక్కసారి ఈలోకంలో వచ్చిన అపర్ణకి, సార్ అడిగేది అర్థం కాక లేచి నిలబడి “సారీ సార్” అన్నది.

సరే ఇప్పటికైనా వచ్చి బోర్డు మీద ఇది చేయి” అన్నారు.

వెంటనే చాక్ పీస్ తీసుకొని వెళ్లి అపర్ణ దానిని మార్చి వచ్చింది. సార్ తో పాటు క్లాసులో అందరూ చప్పట్లు కొట్టారు. మనసు మళ్ళీ చురుగ్గా అయిపోయింది. “ఇలాంటి పిచ్చి రాతలతో మనసు నేనెందుకు పాడు చేసుకోవాలి? నేను చదువుకోవాలి అనుకున్నాను. చదువుకుంటాను. ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను బెదిరిపోను”అని దృఢనిశ్చయంతో వచ్చి తన సీట్ లో కూర్చుంది.

ఆ నోటా ఈనోటా తెలిసిన తన తరగతి అమ్మాయిలు విచిత్రంగా చూడ సాగారు “లవ్ లెటర్ వస్తే కూడా ఇంత ధైర్యంగా ఉంటారా” అని గుసగుసలాడుకోసాగారు.

ఇదేమి పట్టకుండా అపర్ణ ఎప్పటిలాగానే స్కూల్ అయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్ళింది. ఇంట్లో మాత్రం ఈవిషయం ఏమి చెప్పలేదు. కాసేపు హోం వర్క్ చేసుకొని ఇంటి పక్కన ఉన్న వేరే స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. ఆ విషయం దాదాపు మర్చిపోయింది కూడా.

తెల్లవారి మళ్లీ స్కూల్ కి వచ్చింది? వస్తూనే బుక్స్ డెస్క్ లో పెట్టడానికి చేయి పెట్టింది. మళ్లీ చేయికి మెత్తగా తగిలింది చూస్తే ముందు రోజు లాగానే గులాబీ పువ్వు ఉత్తరం ఈసారి చదవకుండానే చింపి పడేసింది అపర్ణ. ఇలా వరుసగా మూడు నాలుగు రోజులు జరిగాక, ఆ ఉత్తరం తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ కు వెళ్లి క్లాస్ టీచర్ కి ఇచ్చింది.

సార్ ఇది రాసింది మన స్కూల్ వాళ్లేనా? లేక ఇంకెవరైనా? మీరు హ్యాండ్ రైటింగ్ చూసి కనుక్కోండి. ఈ విషయం ఏమాత్రం మా ఇంట్లో తెలియకూడదు. తెలిస్తే నాచదువుకు ఆటంకం జరుగుతుంది .అమ్మ వాళ్లు బాధపడతారు. నేను బయటకు వస్తే భయపడతారు. అందుకని రహస్యంగా ఇది చేసి పెట్టండి సార్” అని చెప్పింది.

ఆమె ధైర్యానికి ముచ్చట పడ్డ మాస్టారు,
” అలాగే తల్లీ! నీకు చదువు పట్ల ఉన్న శ్రద్ధకు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇలా జరిగితే వేరే ఆడపిల్లలు భయపడి పోయి రాద్ధాంతం చేసి ఇంట్లో చెప్పి స్కూల్ మానేసేవాళ్ళు. కానీ ఇలాంటివి పట్టించుకోకుండా నువ్వు ధైర్యంగా ఉన్నావు చూడు, ఇది నాకు చాలా నచ్చింది. నేను తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేసి కనుక్కుంటానుమ్మ! అయినా నువ్వేం భయపడకు ?చక్కగా చదువుకో ఏఅవసరం వచ్చినా నేనున్నాను” అని చెప్పారు.

సంతోషంతో తల ఊపిన అపర్ణ క్లాస్ కి వెళ్ళిపోయింది.
వయసుకు మించిన పరిణితి కలిగిన ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోయారు మాస్టారు.

ఆ మరుసటి రోజు తరగతికి వచ్చిన అపర్ణ కు ఒక ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది.

ఎప్పటిలాగే తరగతికి చేరుకున్న అపర్ణకి ఆశ్చర్యకరమైన వార్త ఎదురైంది. తనకు ఇన్ని రోజులుగా ఉత్తరాలు రాస్తూ భయపెట్టింది శ్యామ్ అని తెలిసింది. తన క్లాస్ కి వెళ్లేసరికి నిలబెట్టి సార్ గట్టిగా తిడుతున్నారు.

అపర్ణ చూసిన సార్…

“రామ్మ అపర్ణ! ఇన్ని రోజులుగా నిన్ను ఇబ్బందులకు గురిచేసింది వీడే. వీడ్ని ఏం చేయమంటావ్” అని అన్నాడు.

ఏమి తోచనీ అపర్ణ ” మీ ఇష్టం సార్” అని తలవంచుకొని తన స్థానంలో వెళ్లి కూర్చుంది.

సార్ శ్యామ్ ను బెదిరించాడు

” ఇది మొదటి తప్పుగా నేను ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే టీసి ఇచ్చి పంపించేస్తాను. ఇప్పుడు నిన్ను వేరే సెక్షన్ మారుస్తున్నాను. వేరే సెక్షన్ లో వెళ్లి కూర్చో. ఇంకొకసారి ఏ పిల్లనైనా ఏడిపించావో ఊరుకోను” అనగానే అవమాన భారంతో మొహం కందిపోయింది శ్యాంకు.

తరగతి మారిన తర్వాత తనను మళ్ళీ ఎప్పుడు ఏర్పించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్ళకే అతన్ని చూసింది.

ఒక్కసారి భాజాలు చప్పుడుకు ఈ లోకంలో వచ్చిన అపర్ణకి వసంత పిలుస్తూ కనిపించింది.

“ఇక్కడ అంకురార్పణము మిగతా కార్యక్రమాలు అన్ని అయిపోయాయి కదా !అందరూ భోజనాలకు వెళ్ళండి. ఆడవాళ్లు మాత్రం ఉండి, అమ్మాయిని పెళ్లికూతురుని చేసి, గాజులు వేసుకోవాలి. అందరం పందిట్లోకి వెళదాము ” అని చెప్పింది. చాలామంది ఇంటి వెనక పందిట్లో ఏర్పాటు చేసిన భోజన శాలకు వెళ్లారు. పందిట్లో పచ్చ ముగ్గుతో విస్తాళ్ళ ముందట తీగలాగా ముగ్గులు వేశారు. కూర్చోడానికి చాపలు పచ్చటి విస్తర్లు పరిచారు. కూర్చో లేని వారికి టేబుల్స్ వేసి వడ్డిస్తున్నారు.

సాంప్రదాయకమైన వంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి..

ఏ శుభం జరిగిన ముందుగా విస్తట్లో కుడివైపు పంచదార, ఎడమవైపు ఉప్పు వడ్డిస్తారు. తర్వాత టమాటా పప్పు, కూరల్లో మహారాణి అయిన వంకాయ సోగి,బెండకాయ శాకము. బీరకాయ పచ్చడి, ముక్కలు వేసినా చారు, పెళ్లికూతురుని చేసే రోజు కాబట్టి భక్షాలు తప్పకుండా ఉండాల్సిన బూందీ లడ్డు, మిర్చి బజ్జి, అప్పడాలు వడియాలు ఇవన్నీటి వాసనలు ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అనిపించేలా ఉంది. అంతా వడ్డన జరిగాక చక్కగా దైవ ప్రార్థనతో భోజనం చేయడం ప్రారంభమైంది.

బాబాయ్ కొంచెం పప్పు వేసుకో!

తాత ఇంకో లడ్డు తిను.

ఇదిగో ఈ మిర్చి బజ్జి తిన్నారంటే ఆహా! అంటారు తినండి.

పెద్దనాన్న!సాంబార్ లో ముక్కలను తప్పకుండా తినండి. అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్నారు. ఆనాటి పెళ్లిని తలపిస్తుంది ఈనాటి పెళ్లి .ఒకసారి పందిరంతా కలియతిరిగిన అపర్ణ లోపలికి వెళ్ళింది.

“అపర్ణ! పెళ్లికూతురుని చేస్తారు కదా! మేనమామ తెచ్చిన చీర కట్టించు.కాస్త సంగతి చూడు” అన్నది వసంత.

“సరే “అని లోపలికి వెళ్ళింది అపర్ణ. అప్పటికే అక్కడ పెళ్లికూతురు కట్టుకోవలసిన చీర వేసుకోవాల్సి నగలు ఉంచింది వసంత.

ఎర్రని పట్టుచీర.. బంగారు రంగు జరితో మెరిసిపోతుంది… దానికి మ్యాచింగ్ ఎర్ర రాళ్ల నెక్లెస్ గాజులు జుంకీలు ఉన్నాయి. చీర కట్టడంలో సహాయం చేసిన అపర్ణ ,వసంత కూతురితో మాటలు కలిపింది.

“నేను తెలుసా నీకు”? అని అడిగింది.

“అదేంటి అత్త అలా అంటారు ?అమ్మా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేస్తుంది .అందుకని మీరు నాకు కొత్తగా అనిపించడం లేదు” అని చిరునవ్వు నవ్వింది. ఆ మాటలు ఎంతో సంతోషాలు ఇచ్చాయి అపర్ణకు. అమ్మాయిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుని.

” చాలా అందంగా ఉన్నావు. సాయంత్రం దిష్టి తీస్తాను” అని చెప్పి

“పద పందిట్లోకి వెళ్దాము” అని ఇద్దరు కలిసి పందిట్లోకి వచ్చారు.

పచ్చని ఆకులు పరిచిన పందిరి కావడం వల్ల చాలా చల్లగా, ఒక విధమైన పరిమళం వస్తూ ఉంది. వాకిలంతా చాపలు పరిచి ఉంచారు. బుట్టలో ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు అందంగా పేర్చి ఉంచారు .ఒక్కొక్కరి చేతుల సైజును బట్టి ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు కూర్చోవడానికి ఒక పీఠం వేసి ఉంచారు. ఒక ఐదు మంది ముత్తైదు వులకు పెళ్ళికూతురుతో గాజులు ఇప్పించి, మిగతావి అందరినీ వేసుకోమని చెప్పారు. పెళ్లికూతురుకి ముందుగా కళ్యాణ తిలకం తీర్చిదిద్ది, కాళ్లకు పసుపు పారాణి రాసి కూర్చోబెట్టారు. ముందుగా చేతుల నిండా పెళ్లి కూతురికి ఆకుపచ్చని గాజులను వేశారు.

తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్లకు నచ్చిన రంగును వేసుకొని ముచ్చటగా చూసుకుంటున్నారు.

ఓ వదిన ఏంటి శోకా? కొన్ని గాజులే వేసుకుంటున్నావు. లేక మా అన్నయ్యతో ఉన్నప్పుడు చప్పుడు బయటకు వనిపిస్తుందని వేసుకోవడం లేదా”? అని ఒక వదిన వరుస ఉన్న ఆవిడను పరాచకం ఆడుతుంది మరో మహిళ.

” పోమ్మా! ఇంత వయసు వచ్చినా నీకు చిలిపి మాటలు పోలేదు” అని సిగ్గు పడింది మొహం అంతా ఎర్రగా కందిపోయింది.

“అయ్యో నేను ఏమన్నా వదినా? అందరికీ ఉన్నదే అన్నాను .కానీ కొత్తది ఏమైనా అన్నానా” అని ఈ మరదలు అన్నది.

” ఊరుకొండమ్మ.. పెళ్ళికాని పిల్లలు ఉన్నారు. వింటే ఎలా ఉంటుంది “అని ఒక పెద్ద ఆవిడ కోపం నటిస్తూ అన్నది. కానీ మనసులో ఆ సంభాషణ కొనసాగాలని ఉన్నది తనకి కూడా..

ఇలా రకరకాల కబుర్లతో ఆ కార్యక్రమం సంతోషంగా జరిగిపోయింది.

పెళ్లికూతురుతో పాటు అందరూ భోజనాలకు వెళ్లారు. పెళ్లికూతురుకు పీట వేసి ముగ్గు వేసి పచ్చని విస్తరి పరిచి రెండు దీపాలను అటు ఇటు పెట్టి, కూర్చోబెట్టారు. ఇంతలో పెళ్లికూతురు ఫోన్ మోగింది. లోపల నుండి ఆ అమ్మాయి స్నేహితురాలు ఫోన్ పట్టుకొని వచ్చి,

“మీ ఆయన ఫోన్ నేను మాట్లాడనా! పర్వాలేదులే నేను మాట్లాడతాను. భోజనం చేస్తుందని చెప్తాను” అని ఉడికించ సాగింది.

“ఏయ్ సాధన” ఫోన్ ఇలా ఇవ్వు అంటూ పరిగెత్తింది అలేఖ్య. అందరూ నవ్వుకున్నారు.

అలా ఫోన్ కోసం బయటకు పరిగెత్తిన అలేఖ్య ఎదురుగా కనబడిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయింది. ఒక బుట్ట నిండా ఎర్రని గులాబీ పూలు, మరొక ఐదు బుట్టలలో రంగురంగుల గాజులు, ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అందులో అలేఖ్య పెళ్లి కొడుకు మనోహర్ మొదటిసారి కలిసినప్పుడు తీసుకున్న ఫోటో. ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోని నిలువెత్తు చిత్రంగా మలచబడింది. ఆ చిత్రం ఎంతో సజీవంగా ఉంది. అవన్నీ చూసి ఆశ్చర్యము ఆనందము రెండూ కలగలిసి ఏమీ మాట్లాడలేక నిలబడిపోయింది. అలేఖ్య.మొహం లో కొంచెం సిగ్గు కనబడుతుండగా ,తన స్నేహితురాలు సాధనను చూసి

” ఫోన్ ఇవ్వవే ఒకసారి” అని అడిగింది.

ఇంకా ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేని సాధన ఫోన్ అలేఖ్య కి ఇచ్చింది. అలేఖ్య తన గదిలోకి వెళ్లి మనోహర్ తో ఒక పది నిమిషాలు మాట్లాడి ,మళ్లీ భోజనం చేయడానికి పందిట్లో కి వెళ్ళింది. అప్పటికే అందరూ పెళ్లికూతురు కోసం ఎదురు చూస్తున్నారు.

“ఏమే మనవరాలా! ఓ రెండు రోజులు ఆగు. మీ ఆయన కొంగుముడి వేసుకుందువుగాని! అప్పుడే ఒకరినీ ఒకరు వదలలేకపోతున్నారా?” అని అమ్మమ్మ వరస ఒక ఆవిడ పరాచకం ఆడింది.

” ఇంతకు ఏమన్నాడే మా కొడుకు” అన్నది వరుస ఆవిడ.
ఇలా అందరూ పరాచకాలాడుతూ నవ్వుకుంటున్నారు. అలేఖ్య ముఖం ఎర్రని గులాబీలా మారింది. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ వచ్చి తనకోసం వేసిన పీటపై కూర్చుంది. పెళ్లి కూతురికి వెండి కంచం అరిటాకు పెట్టి వడ్డన మొదలుపెట్టారు.

అక్కడే ఉన్న అలేఖ్య నాయనమ్మ.
.”ముందుగా తీపి పదార్థం నోట్లో పెట్టుకోమ్మా! ఈరోజు పెళ్లికూతురుని చేస్తున్నారు కదా” అని చెప్పింది.

” సరే నాయనమ్మ” అని లడ్డును కొంచెం తుంపి నోట్లో పెట్టుకుంది.అందరూ భోజనాలు మొదలుపెట్టారు.

భోజనాలు చేసి అందరూ తాంబూలం సేవించి హాల్లో పరిచిన చాపల మీద నడుం వాల్చారు.ఇంతలో అలేఖ్య అమ్మమ్మ వచ్చి, ఇలా అందరూ పడుకుంటే ఎలా? అందరూ గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా పెళ్ళికూతురుకు పెట్టి, అందరూ పెట్టుకోండి. మళ్లీ రాత్రి అయితే అందరూ అలసిపోతారు. ఇప్పుడే పెట్టుకోండి” అని చెప్పింది.
వసంత వాళ్ళ తోట నుండి తెప్పించిన గోరింటాకు అని చక్కగా ఇంటి వెనక రోట్లో రుబ్బి పట్టుకొచ్చింది భూమవ్వ.

పెళ్లికూతురుకి వేళ్ళకొనలకి, కాళ్ళకి నూరిన ఆకులు పెట్టి అరచేతిలో అంతా మెహేంది కోన్ తో డిజైన్లు వేశారు. ఇక మిగతా అందరూ పాత పద్ధతిలో ముద్దలుగా, చుక్కలు చుక్కలుగా పెట్టుకున్నారు. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం 5 అయ్యింది.

ఇంతలో అందరికీ ఛాయా కాఫీ మరియు బిస్కెట్లు వచ్చాయి. ఇదంతా అయ్యాక అపర్ణకి ఊళ్లోకి వెళ్లి వాళ్ళ ఇల్లు చూడాలి అనిపించింది.

వసంత దగ్గరికి వెళ్లి,

” వసంతా! నేను ఒకసారి మా ఇంటి వైపు వెళ్లి వస్తానే. నాకు ఎప్పుడెప్పుడు వెళ్లి మా ఇల్లు చూద్దామా అనిపిస్తుంది” అని అన్నది.

” ఇప్పుడు వెళతావా! చీకటి పడుతుంది కదా! సరే నీ ఇష్టం వెళ్ళిరా నేను ఎన్నోసార్లు ఆ వైపు వెళ్లాను కాని నాకు ఇంట్లోకి వెళ్లాలనిపించలేదు” అని అన్నది.

“ఇన్నేళ్లుగా నేనే వెళ్లలేదు. అమ్మానాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తారంట తమ్ముడు అక్క కూడా వచ్చి చూశారట నేను మాత్రమే రాలేకపోయాను. ఏమో అలా జరిగిపోయింది. మా మేనత్త వాళ్లే ఆ ఇంట్లో ఉంటుంది. నీకు తెలుసు కదా సుధత్త. కాబట్టి నాకు కూడా సంకొచం ఏమీ ఉండదు ” అని చెప్పింది అపర్ణ.

“అయితే డ్రైవర్ ను పంపిస్తాను” అన్నది.

” వద్దే! అలా నడుచుకుంటూ చిన్నప్పుడు తిరిగిన రోడ్డంతా చూసుకుంటూ వెళ్తాను. ఇక్కడి నుంచి దగ్గరే కదా” అన్నది అపర్ణ.

“సరే తొందరగా వచ్చేయాలి మరి” అన్నది వసంత.
” అలాగే తొందరగా వచ్చేస్తాను” అని చెప్పి లోపలికి వెళ్లి మామూలు చీర కట్టుకొని హ్యాండ్ బాగ్ తీసుకొని బయలుదేరింది.

సందులో నుండి మెయిన్ రోడ్ కి చేరుకుంది అపర్ణ.. ఆ రోడ్డు అంతా చూసేసరికి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనసులో మెదిలాయి. చేతిలో పుస్తకాలు పట్టుకొని స్కూలుకు వెళ్ళేది ఈ రోడ్ మీదనే. ఏది కొనుక్కోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. రోజుకు ఎన్నిసార్లు తిరిగే వాళ్ళని. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. పెద్ద పెద్ద షాప్స్ వెలిసాయి. పాతకాలం దుకాణాలన్నీ కూల్చివేశారు. గుర్తుపట్టలేనంత మారిపోయింది. మెయిన్ రోడ్డు మీద ఉన్న స్కూలు కూడా లేదు. వర్షాలకు కూలిపోతే వేరే చోట కట్టించారట. స్కూలు లేకపోవడం చూసి మనసు కలుక్కుమంది అపర్ణకు. గుడి, బడి ఒక్కటని తలచిన ఆ రోజులు, అల్లరి చేసిన రోజులు ,ఆడుకున్న రోజులు, చదువుకున్న రోజులు ,అన్ని అక్కడే అలా నీళ్లు నిండిన కళ్ళతో స్కూల్ వైపు చూసింది. మసకగా ఎన్నో జ్ఞాపకాలు. మెల్లిగా అలా నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది. అపర్ణ వాళ్లు ఉన్న వీధిలోకి చేరుగానే, వారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇళ్లన్నీ మేడలైపోయాయి. వీళ్ళ ఇల్లు మాత్రమే పెంకుటిల్లు గా ఉంది. ఇల్లు కొంచెం పాతబడిపోయినా కూడా ఏమాత్రం కళ తగ్గలేదు. రాజసంగా నిలబడినట్లు ఉంది ఆ ఇల్లు,ఎత్తైన ఇంటిముందు అరుగులు మాత్రం నేలలోకి కూరుకు పోయినట్లు అయ్యాయి. రోడ్లు వేయగా, వేయగా అరుగులు చిన్నవి అయిపోయాయి. అవి అరుగులు కావు. జ్ఞాపకాల సొరుగులు. ఆరుగుల మీద కూర్చున్న కొంతమంది లేచి నిలబడి
“నువ్వు నువ్వు అపర్ణమ్మ కదా” అని అడిగారు.

” అవును నేను అపర్ణ నే.నువ్వు రాజవ్వవు కదా!” అన్నది.

” నా తల్లి, నా తల్లి! నన్ను ఇంకా మర్చిపోలేదా ?యీడి నుంచి పోయినప్పుడు చిన్నపిల్లవు. అయినా యాది పెట్టుకున్నవ్” అని దగ్గరకు తీసుకుంది రాజవ్వ.

అక్కడే ఉన్న అందరూ కుశల ప్రశ్నలు వేశారు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడింది అపర్ణ. అందరూ ఎంతో ఆత్మీయులుగా అనిపించారు. నిజంగా చిన్నప్పటి పరిచయాలు బంధాలు ఎంత గొప్పవి కదా? అనిపించింది.ఇన్ని రోజులు తను ఏం కోల్పోయిందో అర్థమైంది. అందరితో మాట్లాడటం అయిన తర్వాత మెల్లిగా పెద్ద దర్వాజా నుండి వాకిట్లోకి అడుగు పెట్టింది. ఇల్లంతా అప్పటి లాగే ఉంది. వాకిట్లో మూలకు పెద్ద రాధా మాధవ చెట్టు. పూలు విరగబూసి ఉన్నాయి. మరో మూలన సన్నజాజి, చుట్టూతా బంతి చామంతి, సత్యనారాయణ మొక్కలు ఉన్నాయి. చిన్నప్పుడు తాను ఆ మొక్కల చుట్టూతా సిమెంట్ గట్టు కట్టుకున్నది గుర్తుంది. తను ఎంతో శ్రమపడి మొక్కలకు అలా గట్టు కడుతుంటే చూసి వాళ్ళ నాన్న మేస్త్రిని పిలిపించి,

“నా కూతురుకు ఎలా
కావాలో అలా ఆ మొక్కల చుట్టూ గట్లు కట్టండి” అని చెప్పారు అది కళ్ళముందు కనబడింది అపర్ణకి. అలా ఆజ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వాకిట్లో ఉన్న వరండా మెట్లు ఎక్కింది. అప్పటిలాగే వరండాలో ఒక ఆరం కుర్చి వేసి ఉంది. మెల్లిగా భవంతిలోకి కాళ్లు పెట్టింది. ఒక్కసారి మనసంతా పులకించిపోయింది. కళ్ళ ముందు తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కదలాడ సాగాయి. ఇంతలో లోపలి నుండి

“ఎవరు”? అంటూ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడను అలాగే చూస్తూ ఉండి పోయింది అపర్ణ..

లోపలి నుండి నవ్వుతూ వస్తున్న మేనత్తను చూసి అలాగే నిలబడిపోయింది.

దాదాపు మేనత్త చూసి ఐదేళ్లు దాటిందేమో! తనకన్నా ఒక ఏడేళ్ళు పెద్దది.తనని చిన్నప్పుడు ఎంతో ఆడించేది. ఎక్కడికెళ్ళినా తనతో పాటుగా తీసుకుని వెళ్ళేది.పచ్చని పసుపు రంగుతో, వంకీల జుట్టుతో ఎంతో అందంగా ఉండేది మేనత్త సుధ. ఇన్నేళ్లు లండన్ లో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా.కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పోవడం వల్ల (అంటే అపర్ణ మామ) అక్కడ ఉండాలనిపించక భారతదేశానికి తిరిగి వచ్చింది. పిల్లలు ఎంత బ్రతిమిలాడినా కూడా ఉండలేదట. నేను నా పుట్టిన ఊరు వెళ్ళిపోతాను అక్కడ అన్నయ్య ,వదిన ఉన్నారు అని అంటే వాళ్ళు అక్కడ ఉండటం లేదు కదా! ఎందుకు నువ్వు అక్కడ ఒంటరిగా ఉండడం అని చెప్పినా కూడా నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంట్లో ఉంటాను. నాశేష జీవితం తృప్తిగా అక్కడే గడుపుకుంటాను” అని చెప్పి ఇండియాకు వచ్చి అపర్ణ తండ్రి తో మాట్లాడి తను పుట్టి పెరిగిన ఇంట్లో ఉంటుంది.

” అప్పు ఎలా ఉన్నావే! ” అంటూ దగ్గరికి వచ్చింది మేనత్త సుధ. అప్పటి కళాకాంతులే లేవు అసలు .తన అత్తనేనా అనిపించింది అపర్ణకి.

“అత్తా! నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఇలా అయ్యావు? అసలు ఎలా ఉండే దానివి ఎలా అయ్యావు” అని అత్తయ్యను కౌగిలించుకొని ఏడ్చేసింది అపర్ణ.

” బాగానే ఉన్నానే. మీ మామయ్య పోయిన బాధలో ఒక సంవత్సరం పాటు తీరని దుఃఖం అనుభవించాను. మెల్లమెల్లగా నన్ను నేను ఊరడుంచుకుని అన్నయ్యను అదే మీ నాన్నను అడిగి ఇక్కడ మన ఇంట్లో ఉంటున్నాను” అని చెప్పి,

” నిలబెట్టే మాట్లాడుతున్నాను. ఇలా రా చిన్నప్పుడు మనిద్దరమూ పడమటింటి గదిలో కూర్చొని ఆడుకునే వాళ్లం కదా! అక్కడికి వెళ్లి కూర్చుందాం రా” అని లోపలికి తీసుకెళ్ళింది సుధ. ఒక్కసారిగా పాత అనుభూతులన్నీ కళ్ళల్లో మెదిలాయి.

ఆ గదిలో మట్టితో చేసిన గోళాలు ఉండేవి. అందులో బియ్యం పప్పులు అన్ని నిలువ చేసేవాళ్ళు. విశాలమైన గది కావడం వల్ల మిగతా గదంతా పడుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి వాడుకునే వాళ్ళు. ఎప్పుడు ఇంటి నిండా వచ్చి పోయే జనం. పెద్దవాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నా కూడా, పిల్లల పైన కూడా ప్రభావం పడేది. సుధ అయితే ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది అమ్మకు, నాయనమ్మకు. అందరికీ సుధ అంటే ఇష్టమే. పిల్లలందరినీ స్కూలుకు తయారు చేయడం వారికి తినడానికి ఏదో పెట్టడం, అన్నీ తానే చేసేది.ఇంట్లో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించేది.

” సుధా! సుధా! ఆ గిన్నె కనిపించడం లేదు ఎక్కడుంది? ” అని వదిన.

” సుధా! సుధా! నా పంచ కనపడటం లేదమ్మా ఎక్కడుంది? ” అని అన్నయ్య.

“సుధత్త! నా నోటుబుక్కు కనబడటం లేదు”

” సుధత్త !నా పెన్సిల్ కనపడటం లేదు”

” సుధత్త నాకు ఈ లెక్క రావడం లేదు” ఇలా అందరి పనులు సుధనే చేసేది క్షణంలో కళ్ళముందు ప్రత్యక్షమయ్యేది. చక్కని లంగా వోని, బారుగా ఉన్న జడ, ఎంతో అందంగా ఉండేది.

” అపర్ణ! ఏంటే ఆలోచిస్తున్నావు మనిషివి యి క్కడున్నావు కానీ నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అసలు నిన్ను ఇక్కడ చూస్తాను అనుకోలేదు. అసలు ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు .అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చావా! అందుకే నిన్ను చూడగానే అలాగే ఆశ్చర్యపోయాను!”
అని అన్నది సుధ.

“ఫ్రెండ్ కూతురు పెళ్లికి వచ్చాను అత్త. నేను నా పెళ్లయిన తర్వాత ఇక్కడికి రానేలేదు. అమ్మా,నాన్న హైదరాబాద్లో ఉండటం వల్ల ఎప్పుడో ఒకసారి అక్కడికి వచ్చి వెళ్లడమే జరుగుతుంది. అందుకే నా ఫ్రెండ్ వసంత పెళ్లికి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను .అందులో నా బాధ్యతలు కూడా తీరాయి కదా! ఊరంతా చూడాలని ఆశగా అనిపించింది. నీ విషయం కూడా తెలిసింది .అందుకే నీకు చెప్పకుండా నిన్ను కలిసి వెళ్లాలని అనుకున్నాను” అని అన్నది అపర్ణ.

” అవునా చాలా సంతోషమే. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవే !పెళ్లి ఎల్లుండి కదా రేపు పొద్దున వెళుదువు గాని, మనం మాట్లాడుకుందాము. ఎన్ని రోజులు అయిందో చూసి, కడుపులో నుండి ఏదో బాధ తన్నుకొచ్చేస్తుంది. నీతో గడిపితే నాకు ఊరటగా ఉంటుంది. ఎన్నోసార్లు మనం ఫోన్లో మాట్లాడుకున్నాము. కానీ ఇలా కలుసుకోవడం ఇప్పుడే జరిగింది. ఉంటావా ప్లీజ్ “అని అడిగింది సుధ.

” వసంత ఏమంటుందో? అత్త ఒకసారి ఫోన్ చేసి చెప్పి చూస్తాను” అని వసంత కు ఫోన్ చేసింది.

” వసంత ఏమీ అనుకోకు. అత్త ఉండమని బలవంతం చేస్తుంది. బాధపడుతుంది కూడా, ఈ పూట ఇక్కడే ఉండి రేపు పొద్దున వచ్చేస్తాను” అని చెప్పింది.

” సరేలేవే ఆమె కూడా బాధలో ఉంది. నీ ఓదార్పు కూడా అవసరం. కానీ పొద్దున్నే వచ్చేయాలి” అని చెప్పింది వసంత.

” అలాగే వచ్చేస్తానే” అని చెప్పింది అపర్ణ..

వంటింటి లోకి వెళ్ళిన అపర్ణకి వంటింట్లో ఏదో అలికిడి వినిపించి ఆ వైపు చూసింది.. ఒక్కసారి భయంతో బిగుసుకుని పోయింది అపర్ణ.

సశేషం

You may also like

Leave a Comment