Home ధారావాహిక నవల జీవన మాధుర్యం

జీవన మాధుర్యం

by Laxmi Madan

5 వ భాగం

అపర్ణ తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనవుతుంది.కానీ మళ్ళీ చదువు పట్ల ధ్యాస పెంచుకుని పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకుంటుంది.

పదవ తరగతిలో సైన్స్ సారు చెప్పేది ఎప్పుడు గుర్తొచ్చేది అపర్ణకు.

” కష్టపడి చదవండి. కాలేజీ మెట్లను ఎక్కే అదృష్టం ఇందులో ఎంత మందికి ఉందో” అని ఎప్పుడూ అంటుండేవారు. కాలేజీకి వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. జీవితంలో చదువు అనేది ప్రాముఖ్యమైన విషయం దానికోసం విద్యార్థి దశలోనే కష్టపడాలి.

“నిజంగా కాలేజీ మెట్లు ఎక్కడం ఒక కలనే” అని అనుకునేది అపర్ణ.

స్కూల్లో ఫేర్వెల్ పార్టీ పెట్టారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. కానీ “ఇలా ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు” అనేది ఊహకందని విషయం. ఇన్ని రోజులు కలిసి ఉన్న అందరూ విడిపోతారని అంతగా తెలియని వయసు. ఆటపాటలతో గడిచిన బాల్యం. అందులో స్కూల్ జీవితం అద్భుతం. అంత మధురమైన జీవితం మళ్ళీ ఎవరికీ దొరకదు.

ఆ సంవత్సరం పదవ తరగతి వాళ్ళు స్కూల్ నుండి వెళ్లిపోతారని, అందరికీ ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చారు స్కూల్ టీచర్స్.

ఆ తర్వాత ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో ఎవరికి తెలియలేదు.

“కాలేజీకి వెళ్తున్నాను “అంటే ఎందుకో భయంగా అనిపించింది. ఎందుకంటే ఉన్న ఊరును వదిలి వేరే ఊరిలో చదువుకోవాలి. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి వెళ్లాలంటే బాధగా అనిపించింది .కానీ తండ్రికి పిల్లలను చదివించాలని చాలా ఇష్టం. అందులో అపర్ణకి కూడా చదువుకోవాలని ఎంతో ఇష్టం. కాబట్టి అన్నీ భరించుకొని వెళ్లాల్సిందేనని అనుకుంది.

కాలేజీకి వెళ్లి చదువుకోవడానికి అప్పట్లో ఇంతగా వసతి గృహాలు లేవు. తండ్రి దక్షిణామూర్తి గారు చెప్పారు ..

“కొన్ని రోజులు మన బంధువుల ఇంట్లో ఉండమని”

అసలే మొహమాటస్తురాలైన అపర్ణకి, బంధువుల ఇంట్లో ఉండడం అసలే ఇష్టం లేదు.ఇంట్లో నాయనమ్మ, అమ్మ గారాబం, తండ్రి ఆత్మీయత, సోదరుల అనుబంధం ఇవన్నీ వదిలి ఉండడానికి మనసొప్పలేదు.

కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు.

అన్నతో పాటు బయలుదేరింది అపర్ణ. తన సర్దుకోవాల్సిన బట్టలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుంది.అన్నతో పాటుగా బస్సులో కూర్చున్నది. కళ్ళ వెంబడి ధారపాతంగా నీళ్లు కారిపోతున్నాయి.

బంధువుల ఇంట్లో వదిలిపెట్టి అన్నయ్య వెళ్ళిపోయాడు. అతనికి కూడా కాలేజీ ఉంది!

మాటిమాటికి ఏడుపు వస్తూనే ఉంది. చాటుగా వెళ్లి కళ్ళు తుడుచుకుంటూ, మళ్ళీ లోపలికి వస్తుంది.ఆ బంధువులతో అంత చనువు కూడా లేదు అపర్ణకు.

తెల్లవారి పక్కనే ఉండే ఒక అమ్మాయి తో కాలేజీకి బయలుదేరింది.

స్కూల్లో అయితే ఎంతో సంతోషంగా ఉండేది. ఉన్న ఊరు, అందులో చాలా ఏళ్లు చదువుకోవడం వల్ల అందరూ పరిచయమే. కానీ కాలేజీలో అందరూ కొత్త .ఒక్కరైనా తెలిసిన వాళ్ళు కనిపించలేదు.

వెళ్లి మెల్లగా లేడీస్ రూమ్ లో కూర్చుంది. వేరే ఆడపిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఎవరి గ్రూపులు వాళ్లకు ఉన్నాయి. అపర్ణను ఎవరూ పలకరించలేరు.

మెల్లిగా తన క్లాస్ రూమ్ నెంబర్ తెలుసుకొని వెళ్లి కూర్చుంది. మొదటి పీరియడు తెలుగు .

భయంగా కూర్చున్న అపర్ణను చూసి తెలుగు మాస్టారు గమనించాడు. అందులో ఆడపిల్లలు ఎవరూ రాలేదు.

సార్ అన్నాడు..

” కాలేజీకి విద్యార్థి పిల్లిలా వస్తాడు. తర్వాత పులిలా మారిపోతాడు” అని అన్నాడు తెలుగు మాస్టారు.

“అది తన గురించే నేమో” అనుకుంది అపర్ణ.

ఇంతలో ఒక అమ్మాయి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమాత్రం భయం లేకుండా ఉంది.

వచ్చి తన పక్కనే కూర్చుంది.

యక్ష ప్రశ్నలు వేసింది ఆ అమ్మాయి.

” ఏ ఊరు నుండి వచ్చావు”

” నీ పేరేంటి” ఇలా అడుగుతూనే ఉంది. కాకపోతే ఆమె రావడం వల్ల అపర్ణకి కొంచెం ధైర్యంగా అనిపించింది.

సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇద్దరమ్మాయిలే ఉన్నారు. తర్వాత పీరియడ్లో మరో 6 మంది ఆడపిల్లలు వచ్చారు.

వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడారు.కానీ స్నేహం చేయాలి అనే భావన ఎవరికి ఉన్నట్టు లేదు. కాలేజీకి వచ్చామా! క్లాసులు విన్నామా! వెళ్ళిపోయామా! ఇలాగే ఉండేవాళ్ళు.

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు.

కాలేజీ వాతావరణం ఇప్పుడు కొంచెం కొంచెంగా నచ్చుతుంది అపర్ణకి. కానీ అబ్బాయిల కామెంట్స్ వింటే మాత్రం చిరాకు వేసేది. తన ఊర్లో చెప్పినట్లు జవాబు చెప్పడానికి కొంచెం జంకుతు ఉండేది.

పదవ తరగతి వరకు బొద్దుగా ఉండే అపర్ణ, సన్నబడి అందంగా కనిపించ సాగింది. లంగా వోణీల్లో చక్కగా ఒదిగిపోయింది.

బంధువులతో కూడా చనువుగా మెలగసాగింది. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయింది.

ఇంట్లో లాగా అందరితో దబాయింపుగా మాట్లాడటం మానేసి, చక్కగా పలకరించడం నేర్చుకుంది. ఇంట్లో వాళ్లకు చిన్న చిన్న పనులు సహాయం చేసేది.

వాళ్లు కూడా అపర్ణను బాగా మెచ్చుకునే వాళ్ళు”చక్కగా అర్థం చేసుకుంటావు నువ్వు అందరినీ “అని అనేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో ఆటలాడుకుంటూ, వాళ్ళకు అవసరమైనవి చూస్తూ, కొత్త పరిచయాలను పెంచుకుంటూ, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకున్నది అపర్ణ

జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వెళుతుంటేనే మనకంటూ ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే, సమస్యలను ఎదుర్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రమ పడాలి.

ఇంటర్ అయిపోతుంది కాలేజీకి దగ్గరలో అపర్ణ తండ్రి ఒక ఇల్లు తీసుకున్నాడు. మూడు గదుల ఇల్లు మాత్రమే.

అనుకోకుండా ఊరికి వచ్చిన అపర్ణకి ,తండ్రి సర్ప్రైజ్ గా ఈ విషయం చెప్పాడు. తనకి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, అందుకే ఒక ఇల్లు తీసుకున్నానని, అక్కడే ఉండొచ్చని చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు.

“మరి అమ్మ వస్తుందా!” అని అడిగింది.

” అమ్మ వస్తే ఇక్కడ ఇల్లు వ్యవసాయం పనులు, నాయనమ్మను ఎవరు చూసుకుంటారు! అందుకనే అప్పుడప్పుడు అమ్మ వచ్చి వెళ్తుంది. నీకెందుకు భయం. నేను వంట చేసి పెడతాను. నువ్వు కాలేజీకి వెళ్లి చదువుకో” అని చెప్పాడు తండ్రి.

సంతోషంగా మళ్ళీ కాలేజీ కి వెళ్ళింది అపర్ణ.

తనకున్న సామాను తీసుకొని రిక్షాలో కొత్త ఇంటికి వచ్చేసింది.

ఆ ఇల్లు కాలేజీకి చాలా దగ్గర. స్నేహితుల ఇండ్లు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి.

ఉదయం తండ్రి వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్లిపోయేవారు. అపర్ణ కాలేజ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఉండేది. షిఫ్ట్ సిస్టం ఉండేది ఆ కాలేజీలో. ఇంటర్ వాళ్లు ఉదయం సెషన్లో, డిగ్రీ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ లో కాలేజీకి వెళ్లేవాళ్లు..

అపర్ణ ఇంట్లోనే భోజనం చేసి, కాలేజీకి వెళ్ళేది. కొత్త ఇంటి చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ ఎంతో పరిచయమయ్యారు. అపర్ణను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఈ జీవితం బాగా నచ్చింది.

చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ “అక్క అక్క” అంటూ ఇంటికి వచ్చేవాళ్ళు.

అపర్ణ తండ్రి దక్షిణామూర్తికి వారానికి రెండు రోజుల సెలవు ఉండేది. శని ఆదివారం అపర్ణ తండ్రి ఊరికి వెళ్ళిపోయేవాడు. ఇంటి నిర్వహణ చాలా కష్టం కదా!

పక్కన ఇంట్లో ఒక బామ్మ, తాతయ్య ఉండేవాళ్లు. అపర్ణ నాన్నగారు లేని సమయంలో వాళ్ళింట్లో పడుకునేది.కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అదే లైన్ లో ఒక స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయి జూనియర్ అయినా కూడా ఎంతో సన్నిహితంగా ఉండేది. ఆ అమ్మాయి చదువుకోవడానికి అపర్ణ దగ్గరికి వచ్చి అక్కడే పడుకునేది తోడుగా.ఇంకా ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు చదువుకుంటూ ఉండేవాళ్లు.

ఇక అప్పుడు మొదలైంది మరో సమస్య.

కాలేజీకి వెళ్లే అబ్బాయిల ఇళ్లన్నీ ఇంచుమించు ఆ వరుసలోనే ఉండేవి. వీలైనంతవరకు బయటకు రాకుండా లోపలే ఉండేది అపర్ణ.

ఏదో ఒక రకంగా వాళ్లతో ఇబ్బందులు పడుతూనే ఉంది.

ఒకరోజు అపర్ణ అపర్ణ, స్నేహితురాలు వందన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చదువుకుంటూ కూర్చున్నారు. ముందటి గదికి కిటికీ రోడ్డు వైపు ఉండేది. ఆ కిటికీ తీసుకుంటే చక్కని గాలి వెలుతురు వచ్చేది.

అలా వీళ్ళిద్దరూ చదువుకుంటూ కూర్చున్నారు. ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి. అతను కూడా అపర్ణ చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. కావాలని ఇంటి ముందు నుండి నాలుగు ఐదు సార్లు వెళ్లేవాడు. ఎన్నోసార్లు గమనించిన అపర్ణకు ఏమని వార్నింగ్ ఇవ్వాలో అర్థం కాలేదు.

ఎక్కువగా తండ్రి లేని శని,ఆదివారంలో ఇలాంటి ఇబ్బంది జరిగేది.

ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే వందన వెళ్లిపోయిన తర్వాత కాలేజీకి రెడీ కావడానికి తలుపులు మూసి, బయట గది కిటికీలు మూయడానికి ముందు రూమ్ లోకి వచ్చింది అపర్ణ.

కిటికీలో మడతలు పెట్టిన తెల్ల పేపర్ కనిపించింది.

ఆ పేపర్ ఏంటా అని తెరిచి చూసింది.

ముత్యాల లాంటి అక్షరాలతో ప్రేమను కురిపిస్తూ రాసిన లేఖ.

కాసేపు కంగారుగా అనిపించినా, తనను తాను స్థిమితం చేసుకుని, కాలేజీకి వెళ్ళిపోయింది.

రాత్రికి ఇంటికి వచ్చిన వందనకి ఆ ఉత్తరం చూపించింది.

” అయ్యో ఎవరు రాశారు అక్కా! నాకు భయమేస్తుంది” అని అన్నది వందన.

” నాకు లేని భయం నీకెందుకు! ఇలాంటి వాటికి భయపడితే మనం బ్రతకలేము. అంతగా ఆలోచించకు” అని చెప్పి చదువుకోవడానికి పుస్తకం తెరిచింది.

వందన కూడా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా అపర్ణ అంటే చాలా ఇష్టం. వందన వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ చేసి పంపించేది.

ఇలా వరుసగా రోజు ఒక తెల్ల కాగితం మడతపెట్టి కిటికీలో కనిపించేది.

పేరు రాసే ధైర్యం ఉండదు కాబట్టి పేరు ఉండేది కాదు.
కానీ కొంతవరకు ఊహించగలిగింది అపర్ణ.

ఒకరోజు రాత్రి చదువుకుంటూ కూర్చున్నారు అపర్ణ , వందన.

ఆ సమయంలో తెరిచి ఉన్న కిటికీలో నుండి నాలుగు చాక్లెట్లు ఎవరో విసిరినట్లుగా పడ్డాయి.

చాక్లెట్లను తీసుకొని చూసిన అపర్ణకి ,ఇది ఎవరో కావాలని విసిరారు అని అర్థం అయింది. చాలా కోపం వచ్చేసింది. ఆ చాక్లెట్స్ పట్టుకొని టక్కున లేచి నిలబడింది. వందన వెంటనే అపర్ణ చేయి పట్టుకొని “వద్దక్క, ఆ అబ్బాయి వాళ్లే వేసి ఉంటారు. మళ్ళీ గొడవవుతుంది. ఊరుకో” అని చెప్పింది.

” ఏంటి ఇలా కిటికీలో నుండి చాక్లెట్స్ పడితే ఊరుకోవాలా? అలా ఊరుకుంటే వాళ్లకి మనం అలుసైపోతాము. రోజు ఇదే పని చేస్తారు. అది మనకు అవసరమా” అని చెప్పి తలుపుతీసింది.

అనుకుంటున్నట్లుగానే ఈమె వెంటపడే అబ్బాయి రూమ్ లో ఉండే మరొక జూనియర్ పిల్లవాడు, పరిగెత్తుతూ కనిపించాడు.

పరిగెత్తి ఆ అబ్బాయి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అందులో అందరూ అబ్బాయిలే ఉంటారని ఆమెకు తెలుసు. అది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయిలు. అపర్ణకు భయం వేయలేదు. వెళ్లి ఆవేశంగా తలుపు కొట్టింది. ఊహించని ఆ అబ్బాయిలు తలుపు తెరిచారు. ఒక్కసారిగా అపర్ణను చూసి భయపడిపోయారు.

“ఏంటి! ఏమైందండీ ఇలా వచ్చారు?” అని అడిగాడు అందరికన్నా పెద్దగా ఉన్న అబ్బాయి. నిజానికి ఆ అబ్బాయి పని ఇది.

” ఈ చాక్లెట్స్ కిటికీలో నుండి మా ఇంట్లోకి ఎవరు విసిరారు”? అని చాలా కూల్ గా అడిగింది అపర్ణ.

” ఆ అది వీడు వద్దని చెప్పినా కూడా మీకు ఇస్తానని కిటికీలోనుంచి వేశాడు” అని చెప్పాడు ఆ పెద్దగా ఉన్న అబ్బాయి.

నిజానికి ఆ ఇంటర్ చదివే అబ్బాయికి అంత సీన్ లేదు. వేయించింది ఈ అబ్బాయి అనే విషయం అర్థం అయిపోతూనే ఉంది.

” అమ్మాయిల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? ఇంత రాత్రి సమయంలో మేము చదువుకుంటున్నాము. మీరు ఇలా చాక్లెట్లు లోపలికి విసిరితే ఏమని అర్థం చేసుకోవాలి? కనీస సంస్కారం లేకుండా ఇలా చేస్తారా” అని గట్టిగా అరిచింది.

ఆ అబ్బాయిలంతా భయపడుతూ నిల్చున్నారు. ఎప్పుడైనా అమ్మాయి స్ట్రాంగ్ గా ఎదుర్కొంటే అబ్బాయిలు పదిమంది ఉన్నా సరే భయపడి పోతారు. పిరికితనంగా ఉంటేనే ఇంకా వెనకాల పడి వేధిస్తారు.

ఇంతలో ఆ ఇంటి ఓనర్స్ బయటకు వచ్చారు.

అపర్ణ అంటే ఆ ఇంటి ఓనర్స్ కి కూడా చాలా ఇష్టం.” చూడటానికి చక్కగా ఉంటుంది. అందరితో పలకరిస్తూ మాట్లాడుతుంది. చక్కగా చదువుకుంటుంది” అని ఎంతో ఇష్టపడతారు. ఆ స్ట్రీట్ లో చిన్న పిల్లలకు ఏమైనా తెలియని ఉంటే కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఇలా అన్నీ మంచి లక్షణాలు ఉన్న అపర్ణను ఎవరు మాత్రం ఇష్టపడరు.

“ఏం జరిగింది అపర్ణ” అని అడిగింది ఇంటి ఓనర్.

జరిగినది అంతా చెప్పింది అపర్ణ.

వెంటనే ఆ ఓనర్ అబ్బాయిలను చాలా తిట్టేసింది. మీరు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే, నేను ఇల్లు ఖాళీ చేయించేస్తాను. అమ్మాయిలను ఏడిపించడం మంచి పని అనుకుంటున్నారా? ఇందుకేనా మీరు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నది? ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను” అని గట్టిగా బెదిరించింది.

ఆ తర్వాత అపర్ణ ఇంటికి వచ్చేసింది. వందన అయితే భయపడిపోతూనే ఉంది. ఇంటికి వచ్చిన అపర్ణను చూసి “అక్క ఏమైంది!” అని అడిగింది.

జరిగిన విషయం అంతా చెప్పింది అపర్ణ. వందన ఎంతో సంతోష పడిపోయింది.
” అక్క నీకు చాలా ధైర్యం. నేను కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. భయపడి పోతే నిజంగానే భయపెడతారు” అని అపర్ణ చేయి పట్టుకొని అన్నది వందన.

అలా ఆ వీధిలో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ అపర్ణను అభినందించారు. జరిగిన వెంటనే వెళ్లి అడగడం మంచి పని అయింది. లేకపోతే మేము చేయలేదని వాళ్ళు బుకాయించేవాళ్లు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ జోలికి ఇంకా రారు అని అన్నారు.

అపర్ణ చాలా ధైర్యంగా ఉండటం నేర్చుకుంది. ఎవరైనా ఒక కామెంట్ చేయాలంటే కూడా ఆలోచించేవాళ్ళు.

అపర్ణ చదువు పూర్తి చేసుకుని వచ్చింది. తరువాత ఇంట్లో సంబంధాలు చూడటం, అపర్ణని వాళ్లు నచ్చడం, ఆమె కూడా ఆ అబ్బాయిని నచ్చడం జరిగిపోయింది. దక్షిణామూర్తి గారి ఆనందానికి అవధులు లేవు.

కానీ అపర్ణకు పీజీ చేయాలనే కోరిక మనసులో చాలా ఉంది. దానికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అపర్ణ ఎంతైనా చదువుకోవచ్చు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనే హామీ ఇచ్చారు. అందువల్ల అపర్ణ సంతోషంగా ఒప్పుకుంది.

అపర్ణ పెళ్లి నచ్చిన వరుడితో జరిగిపోయింది.

ఆలోచనల నుండి తేరుకున్న అపర్ణకి, సుధ లేచి కూర్చోవడం చూసింది.

” ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావ్”? అని అడిగింది సుధ.

” ఏం లేదత్తా! నీ పెళ్లి జ్ఞాపకాలు, నీ పెళ్లి అయిన తర్వాత నా చదువు తర్వాత నా పెళ్లి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను” అని చెప్పింది అపర్ణ నవ్వుతూ.

ప్రొద్దున్నే లేపు .వసంత వాళ్ళ ఇంటికి పోవాలి. పోనీ నువ్వు కూడా వస్తావా నాకు తోడుగా?” అని అడిగింది అపర్ణ.

“సరే వస్తాలే! ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం” అన్నది సుధ

సంతోషంతో సుధ మీద చేయి వేసి పడుకుంది అపర్ణ

సశేషం

You may also like

32 comments

Bennett423 July 31, 2025 - 4:37 pm Reply
Corey3661 July 31, 2025 - 5:12 pm Reply
Felicity37 July 31, 2025 - 5:39 pm Reply
Sara4299 July 31, 2025 - 7:20 pm Reply
Tori2776 July 31, 2025 - 10:43 pm Reply
Carey4493 August 1, 2025 - 6:07 am Reply
Genesis1175 August 1, 2025 - 7:10 am Reply
Alec481 August 1, 2025 - 10:13 am Reply
Marion2544 August 1, 2025 - 1:08 pm Reply
Sharon1099 August 1, 2025 - 2:47 pm Reply
Mila4364 August 1, 2025 - 11:58 pm Reply
Lucy1625 August 2, 2025 - 1:34 pm Reply
Debbie905 August 3, 2025 - 6:08 am Reply
Priscilla4866 August 3, 2025 - 9:53 am Reply
Lincoln468 August 3, 2025 - 1:21 pm Reply
Brian1304 August 4, 2025 - 3:29 am Reply
Mary3750 August 4, 2025 - 7:56 am Reply
Esperanza3921 August 4, 2025 - 8:02 am Reply
Jeremiah1990 August 4, 2025 - 11:06 pm Reply
Connie299 August 5, 2025 - 1:52 am Reply
Landon1767 August 7, 2025 - 8:32 am Reply
Khloe3528 August 7, 2025 - 4:41 pm Reply
Bridget243 August 10, 2025 - 3:37 pm Reply
Kristina3316 August 12, 2025 - 12:32 am Reply
Ruth3158 August 12, 2025 - 6:20 am Reply
Lori543 August 12, 2025 - 6:28 am Reply
Joshua4304 August 12, 2025 - 8:23 am Reply
Kendall4091 August 19, 2025 - 12:38 am Reply
Brielle168 August 28, 2025 - 9:04 am Reply
Jay4535 September 1, 2025 - 5:44 am Reply
Camila1663 September 4, 2025 - 7:11 pm Reply
Greta189 September 5, 2025 - 5:51 am Reply

Leave a Reply to Joshua4304 Cancel Reply