మాస రచనల పోటీకి
తేదీ:24/12/2021
పేరు:చంద్రకళ. దీకొండ
ఊరు : మల్కాజిగిరి
చరవాణి : 938131384
అంశము : పుస్తక సమీక్ష
రచన సంఖ్య : 11
పుస్తకం పేరు : గెలుపు పిలుపు
రచయిత : శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్. గారు
పేద కుటుంబంలో పుట్టి,స్వయంశక్తితో ఎదిగి
పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, బలహీన వర్గాల సంక్షేమ కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖలలో పాతిక సంవత్సరములు వృత్తి నిర్వహణ గావించి,రెండువేల మంది మానసిక వికలాంగుల పునరావాసానికై కృషి చేసి జాతీయ,
అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు అందుకున్న,
స్వయంగా గెలుపు శిఖరాగ్రం చేరుకుని,గెలుపు సంతకం చేసిన శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్.గారి రచన…ఎంతో ప్రజాదరణ పొందిన సెల్ఫీ విత్ సక్సెస్ పుస్తకం గెలుపు పిలుపు గా తెలుగు భాషలో… బెంగాలీ,స్పానిష్ మరియు పోర్చుగీస్ భాషలలోనికి అనువదించబడినది.
మనం సాధించే ప్రతి విజయం ఆనందాన్ని ఇచ్చినప్పుడే అది నిజమైన సక్సెస్ పని చేయడం ఆపితే అదే ఫెయిల్యూర్
గెలుపును పలువురికి పంచినప్పుడే దానికి సార్థకత వంటి సూక్తులు…
ఏకలవ్యుడు,రెండు కప్పలు,నక్క-నాగలోకం వంటి కథలతో ఆసక్తిని రేకెత్తిస్తూ… గెలుపు దశలను, కోణాలను, గెలుపు శిఖరాగ్రం చేరుకొనుటకు కావలసిన ఓర్పు,జిగి, పట్టుదల అనే ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను సులభశైలిలో పిల్లలు,యువత, పెద్దలు అవగాహన చేసుకునేలా రచించబడినది.
ఇందులో “కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”కోట (గెలుపు దుకాణం)
బాపూజీ,టాటా వంటి గెలుపు శ్రేణులు
ఎన్నోసార్లు విఫలమై గ్రాంఫోన్, విద్యుద్దీపంతో పాటు మరెన్నో వస్తువులు కనిపెట్టి 1093 పేటెంట్లు పొందిన ఎడిసన్,ఐజాక్ న్యూటన్ వంటి శాస్తవేత్తలు…
హేళనకు గురై పట్టుబట్టి సంస్కృతం నేర్చుకున్న తిల్ శాస్త్రి …
గెలుపును పదిమందికీ పంచిన
ప్రేమ్ జీ, వారెన్ బఫెట్ వంటి వ్యాపార దిగ్గజాలు, వితరణశీలురు…
గురు స్థానాన్నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ రాధాకృష్ణన్ వంటి వారు…
రామోజీరావు,
ఐ. ఐ. టి.రామయ్య వంటి కృషీవలురు…
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదాహరణంగా నిలిచి మనకెన్నో గెలుపు పాఠాలు చెపుతారు.
ఈర్ష్య, కోపం,ప్రతీకారం,పగ, అహంకారం వంటి గెలుపు లోపాలతో పతనమైన హిట్లర్ వంటి చరిత్రకారులు…విధ్వంసాలు,
విద్వేషాలతో పతనమైన
మాదకద్రవ్యాల మాఫియా చక్రవర్తి “పాబ్లో ఎస్కోలర్” గెలుపులో పాపాలను వివరిస్తారు.
కష్టపడి నిచ్చెనలెక్కి పెద్దపాము నోట్లోకి జారిన పావుల్లా దుర్వ్యసనాలకు లోనైన మైఖేల్ జాక్సన్ ; అతిగా అందరినీ నమ్మి మోసపోయిన మహానటి సావిత్రి వంటి వారు గెలుపు లోపాలను మనకు తెలియబరుస్తారు.
గెలుపును సమన్వయంతో ఎలా సాధించవచ్చో బాపు-రమణలు చెపుతారు.
కలిసికట్టుగా సమస్యలను పారద్రోలిన డిస్నీ&పిక్సార్
గెలుపు పథానికి దారి చూపిస్తారు.
పన్నెండు మంది పబ్లిషర్ల వద్దకు తిరిగి ఓటమినే ఇంధనంగా తీసుకున్న ప్రఖ్యాత రచయిత్రి జె.కె.రోలింగ్ పరిచయం ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది.
బాధనే పెట్టుబడిగా పెట్టి రాప్ సంగీత రారాజుగా ఎదిగిన ఎమినమ్ వృత్తాంతం మనలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.
అంతేకాదు…ఫార్స్ వర్త్ ప్రతిభను వాడుకుని అరువు గెలుపు అందుకున్న డేవిడ్ పార్నాఫ్ గురించీ,దాని పర్యవసానాల గురించీ మనం తెలుసుకోవచ్చు.
నిరుపేద కుటుంబంలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ జీవన కథనమూ ఇందులో ఉంది.
తనకే తెలియని ప్రతిభ దాగున్న సైలెంట్ పాప బియాన్,
బాల్యంలో అత్యాచారానికి గురై, ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా పేరు పొందిన నల్లజాతిరత్నం ఓప్రా విన్ ప్రే,
బంగారు పతకాన్ని అందుకున్న బాక్సింగ్ ఛాంపియన్,ఇద్దరు బిడ్డల తల్లి మేరికొం మహిళలలో స్ఫూర్తిని రగిలిస్తారు.
ఇంకా ఎందరో విభిన్న రంగాలలో దీక్షతో గెలుపు సాధించిన వారి గెలుపు చిత్రాల ను మన కళ్ళ ముందు నిలిపి
స్ఫూర్తిని,ఉత్తేజాన్ని రగిలించే
పుస్తకమిది.
ఓటమితో క్రుంగినప్పుడు,
అవకాశాలు అందక నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ పుస్తకం ఒక్కసారి తిరగేస్తే చాలు…మనలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగి,చైతన్యం పెల్లుబికి,అంతర్మథనమే మన ప్రగతికి సోపానమౌతుంది
పుస్తక ప్రదర్శనశాలకు వెళితే…
తప్పక ఈ పుస్తకంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ మీ వెంట తెచ్చుకుంటారు కదూ…?!