ప్రపంచంలోని బాధలలో కన్నీళ్ళను చూసి కవిగా కాళోజీ హృదయం స్రవించి ఆ హృదయ ప్రకంపనలకు అక్షర రూపం కలిస్తూ నూతన పోకడలతో కవిత రూపంలో …
“అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు…?
పరుల కష్టము చూసి కరిగిపోను గుండెను
మాయ మోసం చూసి మండి పోను ఒళ్ళు
పతిత మానవుని జూసి చితికి పోవు మనస్సు
ఎందుకో ఇన్ని ఆవేశం నా హృదిని ఇన్ని ఆవేదనలు?….” అంటూ
ఆత్మశ్రయ ధోరణితో వ్యక్తపరిచాడు .
“ఉత్తమాటలు కట్టిపెట్టి
పెత్తనాలకు దేవులాడక
చిత్తశుద్ధిగా చేయబూనిన
చేతలెల్ల ఘటించినట్లె “
అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ , ఐక్యతను కోరుకుంటూ కాళోజీ కవితలు రాయటం జరిగింది.
వరంగల్ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నేలపై ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, సామాన్య వ్యక్తికి కూడా ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కవి కాళోజీ నారాయణ గారు.
ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను ఆయన వేసుకోలేదు. కానీ,ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో , ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించి 2002 నవంబర్ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం
తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవిత్వం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ను
పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.
అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలైన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే….
కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి.
నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.
అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.
చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు. పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.
పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.
గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.
“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో ఆక్షేపిoచారు.
నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రజల హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు మన కాళోజీ!