వ్యాసం ఉద్దేశ్యం:
సాహిత్య చరిత్రలో ప్రాంతీయ చరిత్ర మిళితమై ఉండాలి. అప్పుడే సామాజిక కోణం కూడా కొంత అవగాహనకు వస్తుంది. కానీ సాధారణంగా అలా జరగదు. జిల్లాల, ప్రాంతాల చరిత్ర ఎక్కడా కూడా సమగ్రంగా ఉండదు. సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని సమగ్ర వివరాలు ఈ వ్యాసం అందిస్తుంది.
తెలంగాణ సాహిత్యములో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చారిత్రక అంశాల మీద పరిశోధన జరిగింది. అయితే, తెలంగాణ చారిత్రక వీర గాథలు, సామాజిక సాంస్కృతిక సాహిత్యం గురించి విశ్లేషణ చేసేటపుడు స్థానిక భౌగోళిక , పాలనా వ్యవస్థ చరిత్ర కూడా కొంత దోహద పడుతుంది. ఉదాహరణకు, తెలంగాణ జానపద సాహిత్యంలో ప్రముఖంగా ప్రస్తావించబడే మావురాల ఎల్లమ్మ కథలో మావూరు అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు దగ్గరిలోని మహారాష్ట్రలోని శక్తి పీఠం అయిన మాహూరు. తెలంగాణ చరిత్రకు మాహూరు ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉంది అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. పైగా నేటి అదిలాబాద్ జిల్లాలోని కొంత భాగం మాహూరు జిల్లాలోనే ఉండేది. మరాఠీ ప్రజలతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల తెలుగు వారు సైతం మాహూరులో రేణుకా , ఏకవీరిక ఆలయాలను సందర్శిస్తుంటారు. స్థానిక స్థల పురాణం ప్రకారం మాహూరు లో రేణుకా దేవి శరీర భాగాలు మూడు చోట్ల పడ్తాయి. ఒకటి మాహూరు కాగా మిగతా రెండు తెలంగాణలో ఉన్నవి. అందులో ఒకటి నిర్మల్ జిల్లాలోని దిలావార్పుర్, మరోది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ తాలూకాలోని కుదావందపూర్ గ్రామం. ఈ విధంగా కూడా మాహూరుకు తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. కొందరు చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము మాహూరులోని ఏకవీరికా దేవి, రేణుకా ఎల్లమ్మ ఓరుగల్లులోని ఏకవీరికా దేవికి సంబంధం ఉంది. కాకతీయులు మాహూరు నుంచి వచ్చి ఉండవచ్చు అని, మాహూరే తొలినాటి కాకతీయ శాసనాల్లో పేర్కొన్న కాకతీపురమని ప్రముఖ చరిత్రకారులు పీవి పరబ్రహ్మ శాస్త్రి గారి సిద్ధాంతం. మాహూరు జిల్లాలో ఆదిలాబాదులోని కొన్ని భాగాలు ఉండేవి అన్న జిల్లా పాలనా వ్యవస్థీకరణ చరిత్ర ద్వారా మాహూరుకు తెలంగాణకు ఉన్న సంబంధం గురించి మరింత సమాచారం లభ్యమవుతున్నది.
తెలంగాణాలో ప్రముఖమయిన బతుకమ్మ పాటల్లో ఒకటయిన రామ రామ ఉయ్యాలో, రామన్ శ్రీరామ ఉయ్యాలో అనే పాటలో 20 వ శతాబ్ధాపు తెలంగాణ జిల్లాల ప్రస్తావన ఉండడం గమనించవచ్చు. తెలంగాణ సంస్థానాలలో వనపర్తి, గద్వాల, ఆత్మకూరు సంస్థానాలు కొంత ప్రతిపత్తిని కలిగి తెలుగు సాహితీ పోషణ చాలా బాగా చేసారు. పానగల్లు కోటలో రెండోవ నిజామ్ కొన్ని ఏండ్లు ఆ జిల్లా కోటలో నివసించినాడు అని పానుగల్లు కోట చరిత్ర గురించి ప్రస్తావించినపుడు సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పారు. అయితే, మరాఠా రాజులతో యుద్ధంలో, మరాఠా సేనల ఒత్తిడి నుంచి ఈ సంస్థానాలు రెండవ నిజాం రాజును రక్షించినట్టు ఒక లోకోక్తి ప్రబలంగా ఉంది అని కూడా సురవరం గారు చెప్పారు. బహుశా అందుకే కావొచ్చు తరువాతి కాలంలో కూడా ఈ సంస్థానాలకు మంచి ఆదరణ తరువాతి తరం నైజాం రాజులనుంచి లభిస్తూ ఉండేది. పాలనా అంశాలు సాహిత్య సామాజిక చరిత్రలకు ముఖ్యం కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి గారు 20వ శతాబ్దంలో నిజాం రాజ్య పరిపాలన వ్యవస్థ , యంత్రాంగం మీద “నిజాం రాష్ట్రపరిపాలనము” అనే ఒక చిన్న గ్రంథం కూడా రాసి నాటి నిజాం ప్రభుత్వ వ్యవస్థ గురించి తరువాతి తరాలకు కొంత అవగాహన కల్పించే గొప్ప పని చేసారు. మరో ఉదాహరణ చూస్తే, స్థానిక వీరుల విజయగాథలు చూసినపుడు ఆ వీరుల గాథల్లో ఆయా ప్రాంతాల, కోటల ప్రాముఖ్యతను నాటి జిల్లాల పాలనా చరిత్ర కొంత సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు సర్దార్ పాపన్న చరిత్ర లో భువనగిరి, వరంగల్లు కోటల నాటి పాలనా వ్యవస్థ కీలకం. నాడు ఓరుగల్లు కోట లో హనుమకొండలో లాగానే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. భువనగిరి జిల్లా కేంద్రము, ముఖ్య పట్టణాలలో ఒకటి.
తెలంగాణలో జిల్లాలకు ఉండే పర్షియన్/ ఉర్దూ పేర్ల వెనుక దాగి ఉన్న సామాజిక రాజకీయ అంశాలు కూడా స్పష్టంగా జిల్లాల చరిత్ర వల్ల తెలుస్తాయి. మచ్చుకు, నిజాం రాజుల పాలనలో ఉన్న భూస్వామ్య విధానం, దాని ప్రభావం పైన ఎంతో తెలుగు సాహిత్యం వచ్చింది. అయితే, నిజాముల పైన వచ్చిన విమర్శలలోనూ అందుకు భిన్నంగా ఆరవ నిజాం మహబూబ్ ఆలీఖాన్ గురించి ప్రశంసలే మన తెలంగాణ సాహిత్యం లో కనబడతాయి. ఉదాహరణకు జగిత్యాలలో ప్రముఖ కవి అయిన జైశెట్టి రాజయ్య గారు ఆరవ నిజాం రాజు మూసీ వరదల సమయంలో చూపిన ఔదార్యాన్ని గుర్తిస్తూ అతడిని మనసున్న మహారాజు అని కీర్తించారు. ఆరవ నిజాం రాజు హైదరాబాదు పురాని హవేలీ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడ బిడ్డలను గౌరవించినట్టు కూడా కథనం ఒకటి ప్రచారంలో ఉంది. అయితే తెలంగాణలోని మూడు జిల్లాలకు (మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్) మంచి మనసున్న ఆరవ నిజాం రాజు పేరు మీదనే జిల్లా పేర్లు పెట్టారు. ఇటువంటి చారిత్రక విషయాలు ఆరవ నైజాం రాజుకు తెలంగాణ కవి ఇచ్చిన మనసున్న మహారాజు అనే ప్రశంసను కొంత బలపరుస్తాయి. పైగా ఆరవ నైజాం ఎన్నో పరిపాలనా సంస్కరణలు చేపట్టి ఆధునిక హైదరాబాదు సర్వతో ముఖాభివృద్ధికి పునాదులు వేసారు. ఇట్లా జిల్లాల చరిత్ర , పేర్లు మొదలయిన చారిత్రక అంశాల సమాచారం వల్ల సాహిత్యంలో ఉన్న అంశాలను మరింత లోతుగా పరిశీలించే విధంగా అదనపు సమాచారాన్ని అందిస్తాయి.
ఈ విధంగా తెలుగు సాహిత్యంలో చారిత్రక సాంస్కృతిక అంశాలు అర్థం జేసుకోవడనికి జిల్లాల పాలనా వ్యవస్థ చరిత్ర దోహద పడుతుంది. అయితే, ఆధునిక చారిత్రక కాలంలో తెలంగాణలోని జిల్లాల గురించి, వాటి పేర్ల గురించి, ముఖ్య పట్టణాలు గురించి , భౌగోళిక హద్దులు వగైరా అంశాల గురించి మనకు తెలుగులో సమాచారం తక్కువ. తెలంగాణ ప్రాంతాన జిల్లాలు ఏ పేర్లతో ఉండేవో ఒకసారి చూద్దాం. అసలు పాత తెలంగాణ జిల్లాల తెలుగు పేర్లు ఏమిటి అన్న విషయం కూడా తెలుస్తుంది.
తెలంగాణలో ఉర్దూ పేర్లు పెట్టక మునుపు పాత జిల్లాల పేర్లు ఏమిటి అన్న ప్రశ్న వచ్చినపుడు ఒక సమగ్రమైన వ్యాసం మనకు లభ్యం కాదు. ఆ విషయం అర్థం చేసుకోవటానికి కుతుబ్షాహీల నాటి కాలం నుండి మనకు లభ్యమవుతున్న చారిత్రక గ్రంధాల సమాచారం బట్టి పరిశీలించవచ్చు. ఇక అంతకు ముందు రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ , రాచకొండ రాజులు, బహమనీ సుల్తానులు, మొదలగు రాజ్యాలు అన్ని కుతుబ్షాహీల పూర్వపు కాలానికి చెందినవి. ఆయా రాజ్యాల్లో జిల్లాలు, విషయాల పై ఉన్న సమాచారం కొంత తక్కువే. పైగా కుతుబ్షాహీల కాలం నాటి పర్షియన్ రికార్డుల ద్వారా మనకు జిల్లాల గురించి విస్తృతమయిన సమాచారం ఉంది. కాబట్టి, మొదలు కుతుబ్షాహీల కాలంలో ఆనాటి రాజ్యంలో ఉన్న జిల్లాలను చూద్దాము. 16వ శతాబ్దంలో సుల్తాన్ కులీ కుతుబ్షా గోల్కొండ సుబాకి బహమానీల ప్రతినిధిగా వచ్చినపుడు, తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నాక తాను తెలింగాణా ప్రాంతంలో గెలిచిన కోటల వివరాలు మధ్య యుగ చరిత్రకారుడు ఫరిష్టా రచనల ఆధారంగా ఈ విధంగా ఉన్నాయి – రాచకొండ , దేవరకొండ, భువనగిరి, ఘనపురం, కోయిలకొండ, మెదక్, ఎలగందుల, కమ్మముమెట్టు , ఓరుగల్లు, రామగిరి , కౌలాస్, పానగల్లు, మొదలయినవి. ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిపి సుమారు 66 కోటలు గెలిచాడు. అందులో సింహభాగం నేటి తెలంగాణలోనివే.
కుతుబ్షాహిల కాలం నుండి సామాన్య శకం (సా.శ.) 1800 వరకు ఉన్న తెలంగాణ జిల్లాలు:
కుతుబ్ షాహీల కాలంలోని విశేషాలు ప్రస్తుతం లభ్యమవుతున్న ఆధారలనుబట్టి అప్పటి రాజ్యాన్ని తరఫ్ లు లేదా సుబాలు, సర్కార్లు లేదా జిల్లాలుగా విభజించినారు అని ప్రముఖ చరిత్రకారులు బీ ఎన్ శాస్త్రి గారు పరిశోధించి రచించిన “ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి” మూడవ భాగంలో గమనించవచ్చు. సా.శ. 1670 నాటికి 21 జిల్లాలుగా సుబాలు , అందులోని జిల్లాలు ఈ విధంగా ఉన్నవి
తెలంగాణలో :
మెదక్ (మెతుకు దుర్గము/ మెతుకు సీమ), మొహమ్మద్ నగర్ (గోల్కొండ), కౌలాస్ , మొలంగూర్ , ఎల్గందల , వరంగల్, ఖమ్మంమెట్టు , దేవరకొండ , పానగల్లు, భోన్గిర్ (భువనగిరి) , ఆకర్ కర (నల్లగొండ) , కోయల్ కొండ , ఘన్ పూర్,
ఆంధ్ర లోముస్తఫానగర్ ( కొండపల్లి), ముర్తాజానగర్ (కొండవీడు), మచిలీపట్నం , నిజాం పట్నం, ఏలూరు , రాజమండ్రి, సికాకోల్ ,
వీటిని సుబాల వారీగా ఇట్లా పరిగణించారు:
సూబ 1 : మెదక్ (మెతుకు దుర్గము/ మెతుకు సీమ), మొహమ్మద్ నగర్ (గోల్కొండ), కౌలాస్ , మొలంగూర్
సూబ 2 : ఎల్గందల , వరంగల్, ఖమ్మంమెట్టు , దేవరకొండ
సూబ 3 :పానగల్లు, ముస్తఫానగర్ ( కొండపల్లి), భోన్గిర్ (భువనగిరి) , ఆకర్ కర (నల్లగొండ)
సూబ 4 : కోయల్ కొండ , ఘన్ పూర్, ముర్తాజానగర్ (కొండవీడు), మచిలీపట్నం
సూబ 5 : నిజాం పట్నం, ఏలూరు , రాజమండ్రి, సికాకోల్ , వజ్రపు గనులు
సూబ 6 : కర్ణాటక్ (ఇది ఎన్నో జిల్లాలు కల పెద్ద ప్రాంతం అయితే ),
ఇందులో వజ్రపు గనులను కూడా ఒక జిల్లా లెక్క వాళ్ళు పరిగణిచడమూ గమనార్హమయిన విషయం.
1656 లో రామగిరి సర్కారును( జిల్లాను ) ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు కొడుకుకు కుతుబ్ షాహీ యువరాణిని ఇచ్చి పెండ్లి చేసిన సందర్భంగా కట్నంగా రాసి ఇచ్చినారు, కాబట్టి 1655 లో గోల్కొండ రాయాజ్యంలో ఉన్న జిల్లాల్లో పైన చూపిన వాటితో పాటు రామగిరి జిల్లా కూడా ఉండింది అని స్పష్టము. ఈ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి, మంచిర్యాల, జిల్లాలలు & గడ్చిరోలి లోని సిరివంచ (సిరొంచ) తాలూకా కలిపారు. తత్ఫలితంగా కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాలకు నాగపూర్ తోని సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే, ప్రాచీన కాలంలో కూడా గోదావరికి పరిసర ప్రాంతాలు విదర్భ రాజ్యంలో ఉండేవి అని సంగనభట్ల నరసయ్య గారి ధర్మపురి క్షేత్ర చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. ఇక 1656లో ముఘల్ సామ్రాజ్యధినేత కొడుకుకు కట్నం లాగ విదర్భ(బేరార్) రాజ్యంలో కలిసిన పిదప తెలంగాణలోని గోదావరి పరిసర ప్రాంతాలకు , విదర్భకు ఉన్న ప్రాచీన సంబంధాలు మళ్ళీ ధృడపడ్డాయి. ఈ చరిత్ర మనకు విదర్భ ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు కొంత చారిత్రిక కోణాన్ని కూడా తెలుపుతాయి. ఈ విషయాల ద్వారా విదర్భ ప్రాంతానికి తెలంగాణాకు ఉన్న సాంస్కృతిక బంధం అర్థం చేసుకోవడానికి పాలనా చరిత్ర సాయపడుతుంది. విదర్భ తెలంగాణ బంధానికి ఇంకో మచ్చుతునక భాష- విదర్భ ప్రాంతంలో, అసిఫాబాదు, మంచిర్యాల ప్రాంతాలలో మరాఠీ భాష పైన విపరీతమయిన తెలుగు ప్రభావం ఉంది అని స్థానిక మరాఠీలు చెప్పుకుంటారు. ఆ తెలుగు ప్రభావం ఉన్న మరాఠీ భాషను “మాలె భాష/ మాలె మరాఠీ” అనే పేరుతో విదర్భలో, అసిఫాబాదు , మంచిర్యాలలో మరాఠీలు పిలుచుకుంటారు అట. ఈ విషయాలు భాష శాస్త్ర, చారిత్రక, సామాజిక కోణాల్లో తెలుగు భాషా పండితులు, చరిత్రకారులు మరింత పరిశోధన చేయాలి.
మరొక సాంస్కృతిక సంబంధం చూస్తే – నేటి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని చాలా భాగాలు నాటి రామగిరి జిల్లాలో ఉండేవి, అదంగంగా సిరొంచా, చెర్ల తాలూకాలు ఉండేవి. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలోని ఆలయాన్ని నాగపూర్ రాజులూ నిర్మించారని చెప్తారు. ఈ జిల్లాకు బేరార్లోని నాగపూర్ కు ప్రాచీన కాలం నుంచి ఉన్న సంబంధాలతో పాటు 1656నుంచి బేరార్ లో భాగంగా ఏర్పడిన పాలనా సంబంధం కూడా ఇందుకు కారణం కావచ్చు. మంథని పండితులు విదర్భ నాగపూర్ రాజా సభలలో ఉండే వారని ప్రతీతి. మైకా గనుల వ్యాపారంలో మేటిగా నిల్చి, నాగపూర్లో గొప్ప పారిశ్రామికవేత్త, దానగుణం సంపన్నుడు అయినా దహగం లక్ష్మీ నారాయణ గారి కుటుంబం కూడా మంథని నుండి నాగపూర్ కు 19వ శతాబ్దంలో వలస వెళ్ళిన తెలుగు కుటుంబమే. అందుకే, తెలుగు అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తన గ్రంథాలయములోని ఉన్న వేలకొలది పుస్తకాలను దానం చేసిన దానశీలి దాహాగం లక్ష్మీ నారాయణ గారు.
ఆసక్తికరమయిన విషయం ఒకటి గమనిస్తే గోల్కొండ రాజ్యంలోని తెలంగాణ జిల్లాలను “ఇంటీరియర్” జిల్లాలుగా , తీరాంధ్ర జిల్లాలను “కోస్తా” జిల్లాలుగా ప్రత్యేకంగా ఆర్థిక లెక్కలు కట్టేవారు. ఇందుకు కొంత చారిత్రక నేపథ్యం ఉంది. సా .శ. 1517 నాటి తిరుమల ఆలయంలో శ్రీ కృష్ణ దేవరాయల శాసనంలో కూడా నల్లగొండ ఖమ్మం జిల్లాల కోటలను గెలిచినప్పుడు వాటిని “తెలుంగాణ్యపు దుర్గాలు” అనే శాసనంలో చెప్పినారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చారిత్రిక నామమయిన “కళింగ” తోనే ఆ శాసనంలో కూడా సంబోధించారు. మిగితా తీరాంధ్ర కోటలను మాత్రం అట్లా ఒక ప్రాంతం లో భాగంగా చెప్పలేదు. ఇక సాహిత్య ఆధారాలు చుస్తే 15వ శతాబ్ధంలో (సా . శ 1470-1480) తెలుగులో వెన్నెలకంటి సూరన కవి రచించిన విష్ణుపురాణంలో ప్రస్తుత తెలంగాణ ప్రాంతానికి “తెలుఁగాణ” సంబోధన ఉన్నది. సా.శ. 1417 నాటి తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే మాట గమనించవచ్చు. పైగా సా.శ 1510 నాటి ఓడ్ర గజపతుల వెలిచెర్ల (నెల్లూరు జిల్లా) సంస్కృత శాసనంలో కూడా ప్రస్తుత తెలంగాణాలోని దుర్గాలను “త్యెలంగాణ దుర్గాత్” అని ప్రస్తావిస్తారు. 12 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాన్ని ఏకం చేసి ఏలిన తొలి స్వతంత్ర కాకతీయ ప్రభువు రుద్రా దేవుడిని కూడా తెలుంగరాయ అని యాదవ రాజులు సంబోధించే వాఋ అని నాటి శాసనాలు, సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అంటే ప్రస్తుత తెలంగాణా ప్రాంతం చాలా శతాబ్దాల నుంచే చారిత్రకంగా, పాలనా పరంగా తన ప్రత్యేక ఉనికి కలిగి ఉంది అనేది సుస్పష్టం. ఈ పద్ధతినే తరువాతి తరం రాజ్యాలు కూడా కోసాగించాయి. అందుకే నాటి పర్షియన్ రికార్డులను అధ్యయనం చేసిన అబ్దుల్ మజీద్ సిదిఖ్ఖి, రిచర్డ్స్ , నయీమ్ మొదలయిన చరిత్రకారుల ప్రకారం ఇంటీరియర్ (తెలంగాణా), కోస్తా ( తీరాంధ్ర ) ప్రాంతాలు ఆనాటి నుంచే ఆర్థిక, పాలానా అంశాల్లో కొంత విభిన్నంగా చూడబడేవి అనేది అవగతమవుతుంది. అయితే, కుతుబ్షాహీ రాజ్యం సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతము గోల్కొండలో భాగంగా ఉండేది కాదు, ఇంకా నిజామాబాదు జిల్లాలోని ఉత్తర సగభాగం కూడా గోల్కొండ రాజ్యంలో భాగం కాకుండా ఉండింది (ఇందూరు పట్టణంతో సహా ), ఇక పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు రామగిరి సర్కారు కింద ఉన్నాయి, రామగిరి జిల్లాను 1656లో మొఘలులకు ఇచ్చినారు (కౌలాస్ జిల్లా మనకు తెలిసిన నిజామాబాదు జిల్లాలోని కౌలాస్ కోట మరియు దక్షిణ భాగం ఇంకా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతాలు ఉంటూ ఉండేవి). ఇందూరు (నిజామాబాదు) జిల్లాలోని ఉత్తర భాగంతో పాటు నిర్మల్ జిల్లా ప్రాంతాలు బీదర్ సుల్తానుల రాజ్యంలోని నాందేడ్ జిల్లాలో భాగంగా ఉంటూ ఉండేవి. ఇందూరు , నిర్మల్ ఆనాడు ఇనుము, ఉక్కు పరిశ్రమకు ఎంతో ప్రఖ్యాతి చెందినవి. అక్కడ తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాలు. నిర్మల్ జిల్లాలోని కోన సముద్రం, ఇందూరులోని ఇందల్వాయి , ఇందూరు ఇనుము ఉత్పత్తికి ప్రసిద్ధి . ఇనుము ఉక్కు పరిశ్రమ వలన, సముద్ర /నది ద్వారా జరిగే వ్యాపార సంబంధాల వలన ఈ ప్రాంతం గోలకొండ రాజ్యంతోనే చాలా సన్నిహితంగా ఉండేది. విచిత్రంగా గోలకొండ రాజ్య సమయాన గోలకొండను కాక బీదరు సుల్తాను రాజ్యాన్ని “తెలెంగాణ” అని సంబోధిస్తూ ఉండేవారు ఆనాటి కాలాన వివిధ యాత్రికుల రచనల్లో తెలియ వస్తున్నది (బహుశా ఈ రెండు ప్రముఖ తెలుగు వ్యాపార కేంద్రాలు ఉండటం వలన కావొచ్చునేమో అని ఈ రచయిత ఆలోచన).
ఇంకా ఆసక్తికర విషయం ఒకటి మనకు చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ గారి ముఘల్ సామ్రాజ్య రచనల్లో తెలియ వస్తున్నది – అది ఏమిటి అంటే, ఎలగందుల సర్కారుకు సంబంధించిన మరొక చిన్న ఎంక్లేవ్ (చుట్టుపక్కల వారి నుండి భిన్నంగా ఉండే స్థలం లేదా సమూహం లేదా సరిహద్దు భూభాగం) కౌలాస్ జిల్లాలో భాగమయి ఆ జిల్లా పశ్చిమ సరిహద్దులో ఉండేది. ఈ ఎంక్లేవ్కు ఎలగందుల జిల్లాకు మధ్య కౌలాస్ జిల్లా భూభాగం ఉండేది. ఈ ఎంక్లేవ్ బీదర్ సుల్తాను రాజ్యంలోని నాందేడ్ జిల్లాలోని కోటగిరికి, గోల్కొండ రాజ్యంలోని కౌలాస్ సర్కారుకి మధ్య ఉండింది. ఈ కోటగిరి ప్రాంతం ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలోనిది. అక్కడ కాకతి రుద్రమదేవికి సంబంధించి ముఖ్య తామ్ర పత్రాలు వెలుగు చూసినవి. కాకతీయ చరిత్రలో రుద్రమ దేవికి గణపతి దేవ చక్రవర్తి తండ్రి అన్న విషయం రూఢీ చేసిన ముఖ్య ఆధారాలు. అయితే బీదరులో ఉన్న ఇందూరు జిల్లాలోని ప్రాంతాల పైన బీదర్ మరియు గోల్కొండ రాజ్యాల మధ్య తరచూ అధికార మార్పిడి జరుగుతూ ఉండేది, అవి ఒక బఫర్ ప్రాంతం లాగా ఉంటూ ఉండేది.
ఇక పేర్ల పరంగా ఆసక్తికర చరిత్ర తెలిపేది మెతుకుదుర్గం లేదా మెతుకుసీమ జిల్లా. పర్ష్యన రెక్నాఆర్డుదుల ఆధారంగా మెతుకు జిల్లా తెలుగు నాట అత్యధిక వ్యవసాయ అభివృద్ధి కలిగిన జిల్లాగా, తద్వారా కుతుబ్ షాహీలనాటికి అధిక భూ, వ్యవసాయ ఆదాయం కల జిల్లాగా పేరు పొందింది. మెతుకుసీమ ఒకప్పటి తెలుగు వారి కొనాసీమ అని చెప్పవచ్చు. రిచర్డ్స్ గారు చేసిన పరిశోధన వలన ముఘల్ పాలనా సమయంలో లో కూడా మెతుకు సీమ జిల్లా ఆదాయం , మహమ్మద్ నగర్ లేదా గోల్కొండ జిల్లా ఆదాయం తరువాత రెండో స్థానం అని తెలియ వస్తున్నది. ఆదాయం ఎక్కువగా ఉన్న కౌలాసు, మెతుకు సీమ, పానుగల్లు, గోల్కొండ, రాయచూరు, నల్లగొండ జిల్లాలలో అక్కడి సంస్థానాధీశుల ద్వారా అంతే ఘనంగా తెలుగు సాహిత్య పోషణ జరిగింది.
ఈ విధంగా నాటి ఆర్థిక సామాజిక స్థితులు కూడా జిల్లా చరిత్రల వల్ల తెలుసుకోవచ్చు.
గోలకొండ కంటే ముందు దక్కన్ ప్రాంతంలోని బీజాపుర్, అహ్మద్నగర్, బీదర్ రాజ్యాలు మొఘలుల హస్తగతం అయ్యాయి. బీదరులోని నాందేడ్ జిల్లా ప్రాంతం (రెండు ముఖ్య తెలుగు వ్యాపార కేంద్రాలు ఉన్న ప్రాంతం) ముఘల్ రాజ్యంలో కలిసినపుడు ఒక నాందేడ్ జిల్లాను “తెలింగానా సుబా” అంటూ ఉండేవారు ! గోలకొండ రాజ్యం సా. శ. 1687లో మొఘలుల హస్తగతం అయింది. అపుడు వారు కొంత మేరకు కుతుబ్షాహీల జిల్లాలను, పన్ను విధానాలను కొనసాగించారు. అపుడు దక్కన్ ప్రాంతాన్ని పలు సుబాలుగా విభజించారు : ఖండేష్ , అహ్మద్నగర్ , బీజాపూర్, బీదర్, హైదరాబాద్, బేరార్ . హైదరాబాద్ ( గోలకొండ) సుబా కింద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తో పాటు, తమిళ నాడు కూడా ఉండది. అపుడు దక్కన్ సుబాకి రాజధానిగా ఔరంగాబాదును ఎంపిక చేసి, ప్రతి సుబా యందు , పూర్వ రాజధానులను , ఆ సుబా ముఖ్య పట్టణాలుగా చేసారు. ముఘల్ పాలనా కాలంలో కూడా తెలంగాణలోని జిల్లాలుగా నాటి గోలకొండ జిల్లాలే కొనసాగింది. కాకపోతే సా. శ. 1687 నుంచి ఆకర్ కర అని ఉన్న జిల్లా పేరును నల్లగొండ అని వాడడం మొదలయింది. ఇక ఆధునిక యుగంలో ముఖ్యంగా నిజాం స్వతంత్రం ప్రకటించుకున్న సా. శ.1724 తరువాత కూడా ఇంచుమించు ఇవే జిల్లాలు కొనసాగినాయి. అట్లా బహమనీ కుతుబ్షాహీల కాలంలో జిల్లాలను సర్కారులు అని పిలిచేవారు. ఈ వాడకం నాడు తెలంగాణలో తో పాటు కోస్తాలో కూడా ఉండింది.
సా. శ. 1752 లో ఉత్తర కోస్తా జిల్లాలను (సర్కార్లను) ఫ్రెంచికి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. తర్వాత సా. శ. 1766 లో బ్రిటిష్ కి నిజాం రాజుకి జరిగిన ఒప్పందంలో భాగంగా ముఘల్ చక్రవర్తి బాహుదార్ షాహ్ ధారాదత్తం చేసారు (సా. శ. 1788 లో గుంటూరు ఇచ్చినారు) . అవి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం అయ్యాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉత్తరంగా ఉన్న సర్కార్ల కాబట్టి వాటికి ఉత్తర సర్కార్లు అనే పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో టిప్పు సుల్తాన్ విజృంభించి రాయలసీమ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆంగ్లో మైసూర్ యుద్ధాల తరువాత మరల సీమ జిల్లాలు నిజాం రాజ్యంలో కలిసాయి. ఆ తరువాత రాయలసీమలోని మూడు జిల్లాలను 1800 నిజామ్ రాజుకు బ్రిటిష్ తో జరిగిన ఒప్పందంలో భాగంగా అవి బ్రిటిష్ వారి మద్రాస్ ప్రెసిడినేసీలో దత్త మదనాళాలుగా కలిసినాయి. ఇక మిగిలింది ఇప్పటి తెలంగాణా జిల్లాలు, అవి ఆనాటి గోలకొండ సమయపు పేర్లతోనే సా.శ. 1865 వరకు కొనసాగాయి.
సా. శ. 1800 నుంచి 1865 వరకు ఉన్న తెలంగాణ జిల్లాలు:
సా.శ. 1800 తర్వాత నిజామ్ వారి హయంలోని జిల్లాల గురించి మనకు లిఖిత ఆధారాలు సా.శ. 1816 నుంచి స్పష్టంగా లభ్యమవుతున్నాయి. 19వ శతాబ్దపు బ్రిటీషు వారి సర్వే రికార్డుల వల్ల మనకు నిజాం రాజ్యంలో 40 సర్కార్లు (జిల్లాలు) ఉండేవి అని తెలుస్తున్నది. నిజాం రాజ్యంలో తెలుగు, మరాఠీ & కన్నడ ప్రాంతాలు ఉన్నప్పటికీ, భాషా సంధి ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన జిల్లాలు అప్పుడు ఉండేవి కావు. భాషా ప్రాతిపదికన జిల్లాలు & విభాగాలు సా.శ. 1865లో ఏర్పడ్డాయి.
1816 నాటికి సర్కార్లు అయిదు సుబాలుగా (divisions) ఏర్పాటు జేయబడ్డాయి . నాటి సుబాలు – హైదరాబాద్ , బీదర్, నాందేడ్ , ఔరంగాబాద్, బేరార్ . ప్రతి సుబా లో ఉన్న జిల్లాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
హైదరాబాద్ సుబా/ప్రావిన్స్ కింద ఉండిన సర్కార్లు (జిల్లాలు) – పానగల్లు, యాదగిరి (ప్రస్తుత కర్ణాటకలోనిది), గణపురం (ఖిల్లా ఘనపురం), గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, అమరాబాదు, షాబాదు, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, గోదావరి, కౌలాస్, మలఖేడ్. గమనార్హమయిన విషయం – తెలుగు నాట తొలి గోదావరి పేరు గల జిల్లా తెలంగాణలో ఉండది (సా. శ. 1816 నాటికి మధ్య కోస్తాలో రాజముండ్రి , మచిలీపట్టణం, ఏలూరు, కొండపల్లి జిల్లాలు ఉండేవి) .
బీదరు సుబా/ప్రావిన్స్ కింద ఉండిన తెలుగు సర్కార్లు (జిల్లాలు) – రాయచూరు లోని అలంపురం, గద్వాల ప్రాంతాలు, గుల్బర్గా లోని తాండూరు ప్రాంతం & బీదరు పట్టణములో కూడా తెలుగు ప్రజలు ఉండేవారు.
నాందేడ్ సుబాలో: నాందేడ్ సర్కా రు (జిల్లా)లో దాదాపు సగం తెలుగు ప్రాంతము. నాడు ఎంతో ముఖ్యమయిన తెలుగు వాణిజ్య ప్రాంతాలు ఇందూరు, నిర్మల్ ప్రాంతాలు నాందేడ్ జిల్లాలో ఉండేవి (ఇంచుమించు నేటి కొత్త నిజామాబాద్ & నిర్మల్ జిల్లాలు) .
బేరార్ సుబాలో: చందా జిల్లాలో కూడా తెలుగు ప్రాంతాలు ఉండేవి.
ఇందులో హైదరాబాద్ సుబాలోని మాల్ఖేడ్ & యాదగిరి జిల్లాల్లో కన్నడ మరియు తెలుగు వారి జనాభా ఉండేది (ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని చాలా భాగం మలఖేడ్ జిల్లాలో ఉండేది). ఇక రామగిరి జిల్లా ముఖ్య పట్టణం మాత్రం చెన్నూరు ఉండేది. మిగితా జిల్లాల ముఖ్య పట్టణాలు ఆ జిల్లా పేరుగల పట్టణాలే !
బేరారు సుబాలో ముఖ్యంగా నేటి కొత్త ఆదిలాబాద్ ప్రాంతం మాహూరు జిల్లాలో భాగంగా ఉండేది. ముందుగా చెప్పినట్టు మాహూరులోని శక్తి పీఠం మరాఠీవారితో పాటు తెలంగాణలోని తెలుగువారికి కూడా ముఖ్యమయిన ప్రాంతం. తెలంగాణలో మావురాల ఎల్లమ్మ కథలో మావూరు అంటే మాహూరు పట్టణమే అని ప్రసిద్ధ పరిశోధకులు బిరుదురాజు గారు చెప్పారు.
1820 దశకంలో అమరాబాదు, షాబాదు జిల్లాలు రద్దు జేయబడ్డయి. అవి ఇదివరకు కూడా పూర్తి స్థాయి జిల్లాలుగా ఉండకపోవడమే కారణం. అమరాబాదు జిల్లాను గణపురం జిల్లాలో కలిపారు. షాబాదు జిలాలను దేవరకొండ జిల్లాలో కలిపారు. ఇక అపుడు 1820 దశకంలో తెలంగాణలో ఉన్న జిల్లాలు , హైదరాబాద్ సుబా/ప్రావిన్స్ కింద ఉండిన జిల్లాలు – పానగల్లు, యాదగిరి , గణపురం, గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, గోదావరి, కౌలాస్, మలఖేడ్. అపుడు ఏ జిల్లాకు కూడా పర్షియన్ పేరు లేదు. ఇక బీదరు, నాందేడు, బేరార్ సుబాలలోని తెలుగు ప్రాంతాలలో పెద్ద మార్పు ఏమి రాలేదు.
కొన్ని ఆసక్తికర విషయములు:- చాలా వరకు నాడు కోస్తా , సీమ జిల్లాలతో పోలిస్తే, తెలంగాణ జిల్లాలు విస్తీర్ణం తక్కువ ( జిల్లాలు ఎక్కువ ఉన్నవి కాబట్టి). నాటి జిల్లాలు గోదావరి నదికి ఇరువైపులా పరుచుకుని ఉండేవి ఇంకో ఆసక్తి కరమయిన విషయమేమిటి అంటే ఈ జిల్లాల ముఖ్య పట్టణాలలో కొన్ని కాకతీయుల నాటి, రేచెర్ల పద్మనాయకుల నాటి కోటలే. మచ్చుకు – గణపురం (ఖిల్లా ఘనపురం), గోల్కొండ , కోయిలకొండ , దేవరకొండ, భువనగిరి, నల్లగొండ, ఎలగందుల , మెతుకు (మెదక్), రామగిరి, మొలంగూరు, వరంగల్లు, ఖమ్మంమెట్టు, కౌలాస్ , మాహూర్ , రాయచూరు , బీదరు. ఇవన్నీ నాటి కాకతీయుల నుంచి ముఖ్య కోటలే. ఆ కోటలలోనే నాటి సర్కార్ల (జిల్లాల) పాలన కేంద్రాలు ఉంటూ ఉండేవి.
1853-1860 మధ్య స్వల్పకాలం పాటు రాయచూరు జిల్లా బ్రిటీషు వారి పాలనలో ఉండేది, ఆ తర్వాత, నైజాం రాజు బ్రిటీషు వారికి యుద్ధాల్లో సాయం చేసినందుకు, తిరిగి సారవంతమైన రాయచూరు జిల్లా(సర్కారు) నిజాము రాజ్యములో కలిపివేయబడింది.
సా. శ. 1860 సంవత్సరంలో రామగిరి జిల్లా రద్దు జేయబడ్డాయి. రామగిరి జిల్లాలోని గోదావరి, ప్రాణహిత నదుల కుడిగట్టుకున్న ప్రాంతాలను నిజాము రాజ్యములో ఉంచి, ఎడమ గట్టుకు ఉన్న ప్రాంతాలను బ్రిటీషు వారికి అప్పగించబడ్డాయి. ఇదే సమయంలో నిజాం రాజ్యంలోని గోదావరి సర్కారులో ఒక భద్రాచలం ఆలయం తప్ప మిగితా ప్రాంతాన్ని బ్రిటీషు ప్రభుత్వానికి ఇవ్వబడింది. బ్రిటిషు వారు రామగిరి జిల్లాలోని ఎడమగట్టు ప్రాంతాన్ని గోదావరి జిల్లాలలోని ప్రాంతాన్ని కలిపి “ఎగువ గోదావరి జిల్లా” (upper godavari district ) అని పేరుతో మధ్య రాష్ట్రం, సెంట్రల్ ప్రావిన్సెస్ లో కలిపారు. అయితే, గోదావరి జిల్లాలోని ప్రాంతాన్ని బ్రిటీషు ప్రభుత్వానికి పాక్షికంగా ఇవ్వబడింది, ఎందుకనగా, ఈ ప్రాంతములో బ్రిటిషు ప్రభుత్వ హయాములో కూడా కొంత భాగం, ముఖ్యంగా భద్రాచలం & చుట్టుపక్కల గ్రామాలలో పన్ను వసూలు చేసే హక్కు పాల్వంచ సంస్ధనిదీశులకే ఇవ్వబడింది. అవి పాల్వంచ సంస్థానంలో భాగంగానే పరిగణించే వారు.
సా. శ. 1860లో మొదలు పెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు అదే దశకంలో ఆపివేయడం జరిగింది. సా. శ. 1874 లో అప్పర్ గోదావరి జిల్లాలోని దక్షిణ భాగాన్ని మద్రాస్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో కలిపారు. అట్లా 1874లో భద్రాచలం మద్రాసు రాష్ట్రంలో భౌగోళికంగా చేరింది. అయినప్పటికీ గుడి పాలన నైజాం ప్రభుత్వ పరిధిలోనే ఉండేది.
సా. శ. 1865 నుంచి 1905 మధ్య తెలంగాణ జిల్లాలు:
సా. శ. 1865 ప్రాంతంలో ప్రధానమంత్రి సాలార్జంగ్ గారి పాలనలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పెద్ద స్థాయిలో జరిగింది. 1865 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి నాటి బ్రిటీషు, నిజాము రాష్ట్ర అధికారుల రచనల ద్వారా తెలియ వస్తున్నది. ఇది వరకు చెప్పుకున్నట్టు 1865లో పూర్తిగా కాకపోయినా చాలా వరకు భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ జరపబడింది. అపుడు నిజామ్ రాజ్యములో నాలుగు పరిపాలనా విభాగాలు (divisions) ఏర్పాటు జేయబడ్డాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ , పశ్చిమ విభాగాలు, ఇవికాక రాజధాని ప్రాంతం అయిన అత్రాఫ్ బాల్దా . ఉత్తర, తూర్పు విభాగాలు తెలుగు వారివి కాగా, పశ్చిమ విభాగం మరాఠాలది. దక్షిణ విభాగం కన్నడిగులది. తెలుగు వారు, ఉత్తర, తూర్పు విభాగాల్లో కాకుండా తర్వాత దక్షిణ విభాగంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే వారు. సా.శ. 1865 నాటికి తెలంగాణ జిల్లాల విస్తీర్ణం అమాంతం పెరిగింది.
ఆయా విభాగాల్లో ఉండే జిల్లాలు, విభాగాల యొక్క ముఖ్య కేంద్రముల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఉత్తర విభాగం (Northern division) – ముఖ్య కేంద్రము : బీదర్ జిల్లాలు : బీదర్, మెదక్, ఎలగందుల , ఇందూరు
తూర్పు విభాగం (Eastern division) – ముఖ్య కేంద్రము : భువనగిరి జిల్లాలు : నాగర్ కర్నూల్, నల్లగొండ, ఖమ్మం మెట్టు.
దక్షిణ విభాగం (Southern division) – ముఖ్య కేంద్రము : గుల్బర్గా జిల్లాలు : నల్దుర్గ్ , గుల్బర్గా , రాయచూరు , లింగ్సుగూర్ .
పశ్చిమ విభాగం (Western division) – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్ జిల్లాలు : ఔరంగాబాద్ , బీడ్ , పర్భనీ , నాందేడ్ , సిర్పూర్ తాండూర్.
అత్రాఫ్ బాల్దా – పాత గోల్కొండ జిల్లా తో పాటు కొన్ని చుట్టూ పక్కల ప్రాంతాలు. ముఖ్య కేంద్రము : హైదరాబాదు
అయితే కొన్ని సంవత్సరాలకే సా.శ. 1870 జిల్లాలు , విభాగాలు మరలా మారినాయి. ఉత్తర, దక్షిణ, పశ్చిమ విభాగాలలో కొంత మార్పుతో ఇంకో వాయువ్య విభాగం కూడా ఏర్పాటు చేయబడింది. అపుడు తెలుగు జిల్లా అయిన సిర్పూర్ తాండూర్ తెలుగు జిల్లాలు ఉన్న ఉత్తర విభాగంలో కలపబడింది. సా. శ.1875 లో ఆయా విభాగాల్లో ఉండేటి జిల్లాలు, విభాగం యొక్క ముఖ్య కేంద్రం గురించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఉత్తర విభాగం division – ముఖ్య కేంద్రము : పఠాన్ చెరువుజిల్లాలు : మెదక్, ఎలగందుల , ఇందూరు, సిర్పూర్ తాండూర్
తూర్పు విభాగం division – ముఖ్య కేంద్రము : భువనగిరిజిల్లాలు : నాగర్ కర్నూల్, నల్లగొండ, ఖమ్మంమెట్టు
పశ్చిమ విభాగం division – ముఖ్య కేంద్రము : బీదర్జిల్లాలు : బీదర్, నల్దుర్గ్ , నాందేడ్
దక్షిణ విభాగం division – ముఖ్య కేంద్రము : గుల్బర్గా జిల్లాలు : గుల్బర్గా , రాయచూరు , లింగ్సుగూర్
వాయువ్య విభాగం : విభాగం division – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్జిల్లాలు: ఔరంగాబాద్ , బీడ్ , పర్భనీ
అత్రాఫ్ బాల్దా – పాత గోల్కొండ జిల్లా తో పాటు కొన్ని చుట్టూ పక్కల ప్రాంతాలు. ముఖ్య కేంద్రము : హైదరాబాదు
సా. శ. 1865 నుంచి ఉన్న ఖమ్మం జిల్లా అనేది ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్లు జిల్లాలు కలిపి ఉన్న పెద్ద జిల్లా, ఆ పెద్ద ఖమ్మం జిల్లా ముఖ్య పట్టణం హనుమకొండ -వరంగల్ పట్టణమే. పేరు మాత్రం ఖమ్మం. అయితే, 1883 నుంచి కొన్ని పేర్ల మార్పులు జరిగినవి అని 1890, 1908 సంవత్సరాల్లోని హైదరాబాదు రాష్ట్ర గేజిటర్ల ద్వారా, జనాభా గణన రికార్డుల ద్వారా తెలియ వస్తున్నది. వాటి వివరాలు ఇట్లా ఉన్నాయి – సా. శ. 1883లో ఖమ్మం జిల్లా పేరు కూడా వరంగల్ అని మార్చడం జరిగింది, ఆ జిల్లా ముఖ్యపట్టణం పేరుకు అనుగుణంగా . అదే 1883లో నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లా ముఖ్య పట్టణం నాగర్కర్నూల్ నుంచి పాలమూరుకి మార్చబడింది. అపుడు 1883 లోనే పాలమూరు పట్టణముతో పాటు జిల్లా పేరును మహబూబ్ నగర్ అని పెట్టడం జరిగింది (ఆరవ నిజాము మహబూబ్ ఆలీ ఖాన్ పేరు మీద, ఆయన పాలమూరు జిల్లా సందర్శనను పురస్కరించుకొని ఈ పేరు పెట్టారు )! ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇందూరు జిల్లాలో ప్రస్తుత నిజామాబాదు, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు ఉండవి. ఎలగందుల జిల్లాలో ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నేటి మంచిర్యాల జిల్లా కలిసి ఉండేవి. అంటే గోదావరి గంగమ్మకు ఇరువైపులా ఒకటే జిల్లాగా ఉండేది అప్పట్లో ! ఇంకో ముఖ్య విషయం తెలుగు జిల్లాలు ఉండే విభాగాలు పెద్దవి అయినా కూడా, ఆయా విభాగాల ముఖ్య కేంద్రాలు (పఠాన్ చెరువు, భువనగిరి) హైదరాబాదు నగరానికి దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని బట్టి ఆ సమయంలో హైదారాబాద్ కేంద్రంగానే పూర్తి పాలన సాగుతూ ఉండేది అని చెప్పవచ్చు.
ఈ పరిపాలనా విభాగాలతో పాటు భాషాపరమయిన 3 విభాగాలు కూడా సా. శ. 1865 లో ఏర్పాటు చేసారు. అవి – తెలింగాణ , మరాట్వాడ , కర్నాటిక్. అయితే కర్నాటిక్ జిల్లాల్లో తెలుగు ప్రధానంగా మాట్లాడేటి అలంపురం, గద్వాల రాయచూరులో ఉండేవి , తాండూరు గుల్బర్గా జిల్లాలో ఉండేది. కన్నడ ప్రధానమయిన బీదర్ జిల్లా కొన్ని సార్లు తెలుగు జిల్లాల విభాగంలో ఉండేది.
సా. శ. 1905 నుంచి 2014 వరకు తెలంగాణ జిల్లాలు:
ఇక సా. శ. 1905-1913 మధ్య కాలంలో మరలా పరిపాలనా విభాగాలు మరియు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అపుడే మనకు బాగా తెలిసిన జిల్లాలు ఏర్పడినాయి. ఈ కాలంలోనే చాలా జిల్లాల కు పర్షియన్ పేర్లు పెట్టబడ్డాయి. ఈ 20వ శతాబ్ది తొలి భాగంలో ఉన్న జిల్లాలు , సుబాలు పరిపాలన గురించి సురవరం గారి “నిజాం రాష్ట్ర పరిపాలనము” అనే గ్రంథంలో ఉన్న వివరాలను బట్టి ఆ సమయంలో కూడా నాలుగు విభాగాలుగా నిజాం రాజ్య పాలన ఉండేది అని తెలుస్తున్నది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి-
మెదక్ గుల్షానాబాద్ డివిజన్ – ముఖ్య కేంద్రము: పఠాన్ చెరువుజిల్లాలు : మెదక్, అత్రాఫ్ బాల్దా(హైదరాబాదు) , నల్లగొండ, మహబూబ్నగర్ , నిజామాబాద్.
వరంగల్ డివిజన్ – ముఖ్య కేంద్రము : హన్మకొండ (వరంగల్)జిల్లాలు : వరంగల్లు , కరీంనగర్ , ఆసిఫాబాద్ (గమనిక : ఖమ్మం జిల్లా వరంగల్లు లోనే ఉండెను).
గుల్బర్గా డివిజన్ – ముఖ్య కేంద్రము : గుల్బర్గాజిల్లాలు : ఉస్మానాబాదు, బీదరు , గుల్బర్గా, రాయచూరు
ఔరంగాబాదు డివిజన్ – ముఖ్య కేంద్రము : ఔరంగాబాద్జిల్లాలు : ఔరంగాబాదు, బీడ్, నాందేడ్ , పర్భనీ
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే అదిలాబాదు కు ఆ పేరు అదిల్ షా అనే సుల్తాను పేరు మీద పెట్టారు. అదే వాడుతూ రావడం జరిగింది. ఇందూరు పట్టణానికి జిల్లాకు 1905-1911 మధ్య సిర్నాపల్లి దొరసాని పేరు మార్చారు అని స్థానికంగా చెప్పుకుంటారు. నాటి ఆరవ నిజాం రాజును తన పట్టుదలతో సిర్నాపల్లి దొరసాని శీలం జానకీబాయి గారు ఒప్పించి ఇందూరు కు రైల్వే సదుపాయం కల్పించారు. అందుకు కృతజ్ఞతగా ఇందూరు పేరును నిజామాబాద్ అని ఆరవ నిజాము రాజును గుర్తు చేస్తూ పెట్టారు.
ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే, 1905 తరువాత ఎలగందుల జిల్లా కేంద్రాన్ని ఎలగందుల కోట నుండి 12 కీ. మీ దూరం లో ఉన్న అప్పటికే ఉన్న కరీంనగర్ పట్టణానికి మార్చి, జిల్లా పేరు కూడా కరీంనగర్ అని పెట్టారు. అయితే, కరీంనగర్ అని పేరు కల పట్టణం 19వ శతాబ్దంలోనే మానెరు నది ఒడ్డున ఏర్పాటు అయింది, కరీముద్దీన్ పేరిట . 19వ శతాబ్దంలోనే ఎలగందుల ముఖ్య పట్టణంగా కొనసాగుతున్న సమయంలోనే కరీంనగర్ పట్టణం ధాన్యాల వ్యాపార కేంద్రంగా ఉండేది. హైదరాబాద్ నగరం కు కావాల్సిన ప్రత్యేక బియ్యం ఇక్కడ పండించే వారు. అయితే, చారిత్రకంగా ఈ కరీంనగర్ పట్టణం అరిపిరాల లేదా అర్పనపల్లియ అనే పేరుతో ఉండేది అని, అది కరీంనగర్ పట్టణంలోని పాత బజారులో ఉన్న కాకతీయుల కాలపు శివాలయం పక్క వీధి అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ గారి “మ్రోయు తుమ్మెద” నవల కరీంనగర్ పట్టణంలో ఉండే గొప్ప హిందుస్థానీ సంగీత కళాకారుడు అయిన పొరండ్ల నారాయణ రావు గారి జీవితం ఆధారంగా రాయబడింది. అందులో హిందుస్థానీ సంగీత విషయాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాచీన చరిత్ర సాంస్కృతిక అంశాలు స్పృశించారు. అందులో కరీంనగర్ పట్టణాన్ని విశ్వనాథ గారు అరిపిరాల అనే సంబోధిస్తారు.
వీటిలో రాయచూరు జిల్లాలో ఉన్న ఆలంపురం, గద్వాల ప్రాంతాలు తెలుగు వారివి. గుల్బర్గా జిల్లాలో ఉన్న కొడంగల్, తాండూరు తెలుగు ప్రాంతాలు. నాటి నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు నిజామాబాదు , కరీంనగర్ జిల్లాలకు మధ్య గోదావరి నది సరిహద్దుగా మారడం జరిగింది ! మెదక్ సుబా పేరు మొదట గుల్షానాబాద్ అని ఉంటూ ఉండేది. 1905 సమయంలో మెదక్ జిల్లా ముఖ్య పట్టణముగా సంగారెడ్డిపేటని జేయడం జరిగింది.
సా. శ.1913 నుంచి 1941 వరకు ఆసిఫాబాదు ముఖ్య పట్టణముగా నేటి ఆదిలాబాద్ ఆసిఫాబాద్, చెన్నూరు , నిర్మల్, కిన్వట్ తాలూకాలతో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు జరిగింది. 1941లో ఈ జిల్లా ముఖ్య కేంద్రాన్ని ఆదిలాబాదుకు మార్చడం జరిగింది. స్వాతంత్య్రం తరువాత 1953లో వరంగల్ జిల్లా పెద్దగా ఉండడం వలన, వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం ముఖ్య పట్టణంగా ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసారు. ఖమ్మంమెట్టు పట్టణం, ఖమ్మంమెట్టు జిల్లాను కాస్తా ఖమ్మం అని రాయడం మొదలయింది.
1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు జరిగినపుడు, తెలుగు వారుండే ఆలంపురము , గద్వాల & కొడంగల్ ప్రాంతాలు మహబూబ్నగర్లో కలిపారు. తాండూరు ప్రాంతము రంగారెడ్డిలో కలిపారు. ఆదిలాబాదులోని కిన్వట్ను నాందేడ్లో విలీనం చేసారు! 1959లో 1860 నాటి తెలంగాణలోని గోదావరి జిల్లా ప్రాంతాలు మరల ఖమ్మంలో విలీనం చేసారు. అయితే, సిరోంచా తాలూకాను మాత్రం మధ్య ప్రదేశ్, తరువాత మహారాష్ట్రలోనే కొనసాగించారు. 1978లో మొత్తం హైదరాబాద్ రూరల్ తాలూకాను , కొంత హైదరాబాద్ అర్బన్ ప్రాంతాన్ని కలిపి రంగా రెడ్డి జిల్లా చేయడం జరిగింది.
నవ్య తెలంగాణ రాష్ట్రంలో 2014 తరువాత జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ:
తెలంగాణ రాష్ట్రం అవతరించినాక 2014లో భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. భద్రాచలం ఆలయం ఎప్పటిలాగే తెలంగాణ లోనే కొనసాగుతూ వస్తున్నది. చిన్న జిల్లాల వలన చేకూరే పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, 2016లో మళ్ళీ చాలా పెద్ద స్థాయిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. 2016లో తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఉండే విధంగా ఏర్పాటయ్యాయి. ఆ జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి –
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కొత్త జిల్లాలు : ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల.
ఉమ్మడి మెదక్ నుండి కొత్త జిల్లాలు : మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి.
ఉమ్మడి పాలమూరు నుంచి: జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్.
ఉమ్మడి రంగారెడ్డి నుంచి : వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.
హైదరాబాదు జిల్లాలో ఏ మార్పు లేకుండా పాత హైదరాబాదు జిల్లానే కొనసాగించారు.
ఉమ్మడి నల్లగొండ నుంచి :
యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట.
ఉమ్మడి ఖమ్మం నుంచి : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.
ఉమ్మడి కరీంనగర్ నుంచి : రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి: నిజామాబాద్, కామారెడ్డి.
ఉమ్మడి వరంగల్ నుంచి:
వరంగల్ పట్టణ (అర్బన్), వరంగల్ గ్రామీణ (రూరల్) , జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ (మానుకోట).
ఈ పునర్వ్యవస్థకరణ వల్ల మళ్ళీ సా. శ. 1865 సంవత్సరానికి ముందు ఉన్నట్టు తెలంగాణ విస్తీర్ణంలో చిన్నవయిన జిల్లాలు ఏర్పాటు అయినాయి. 2019లో కొత్తగా జయశంకర్ జిల్లా నుంచి ములుగు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేట జిల్లాలు ఏర్పాటు జేయడం జరిగింది. 2021లో ఉన్న వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లాల హద్దులు మార్చి హనుమకొండ, వరంగల్ జిల్లాలు అని వరుసగా నామకరణం చేసారు !
ముగింపు:
ఈ విధంగా కుతుబ్షాహీల నాటి జిల్లాలు కొన్ని మార్పులతో 19వ శతాబ్దపు మధ్యకాలం వరకు కొనసాగాయి. 1816 నుంచి గ్రంథస్థమయిన ఆధారాలు చూసినపుడు 1816 నుంచి మొదలు పెడితే 1820 వ దశకం, 1860, 1865, 1874, 1883, 1901, 1905-1913, 1941, 1953, 1956, 1959, 1978, 2014, 2016, 2019, 2021 సంవత్సరాల్లో తెలంగాణలో జిల్లాలలో మార్పులు, పునర్వ్యవస్థీకరణలు జరిగినాయి.
ఇట్లా తెలంగాణ జిల్లాల ప్రయాణం కుతుబ్షాహీ కాలం నుండి నేటి వరకు ఎన్నో మార్పులతో , ఎంతో ఆసక్తికర చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఇముడ్చుకుని నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో , వారి ఆశయాలను నెరవేర్చే విధంగా పాలన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాల ఏర్పాటు జరిగింది. ఈ జిల్లాల పాలన వ్యవస్థ చరిత్ర కూడా సామాజిక , రాజకీయ , సాంస్కృతిక చరిత్ర, సాహిత్యాన్ని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి దోహద పడుతుంది.**
రచన, పరిశోధన, సేకరణ – ప్రశాంతం