Home వ్యాసాలు తెలుగు సాహిత్యం`వడ్డేపల్లి ప్రస్థానం

తెలుగు సాహిత్యం`వడ్డేపల్లి ప్రస్థానం

by Bhoomagalla Lavanya

సమాజం గాయపడినప్పుడల్లా కవిత్వాన్ని ఔషధంగా ప్రయోగించి, సామాజిక చైతన్యాన్ని కాంక్షించి సాధించిన మహాకవులు, మేధావులు ఎందరెందరో ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నేలపై ఎంతోమంది మహాకవులు, చైతన్యవంతులు పుట్టి తమ సృజనాత్మకతాశక్తితో సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేశారు. మహాకవులైన దాశరథి, సి. నారాయణరెడ్డి లాంటి వారి ప్రభావంతో యువకవులు కూడా కలంపట్టి జన్మతః వారిని అనుసరిస్తూ, వారి మార్గదర్శనంతో సాహిత్యరంగంలో కొత్త ఒరవడిని దిద్దిన కవులు ఉన్నారు. వారిలో వడ్డేపల్లి కృష్ణ ఒకరు. తెలంగాణ సాహితీరంగంలో నూతన శకాన్ని స్థాపించిన వారిగా ఆయన మనకు కనిపిస్తాడు.
1994లో పిహెచ్‌.డిలో చేరి ఆచార్య ఎస్వీ. రామారావు పర్యవేక్షణలో ‘తెలుగులో లలితగీతాలు’ అనే అంశం మీద పరిశోధన చేసి 1998లో డాక్టరేట్‌ పట్టా పొందారు. అది 2000 సం॥లో ‘‘తెలుగులో లలితగీతాలు’’ పుస్తకంగా వెలువడి, ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.
వడ్డేపల్లి కృష్ణ లలితగీతాల మహాకవిగా, పరిశోధకుడిగా తెలుగునేలపైన ప్రసిద్ధులు. తన సాహిత్యకృషితో రాశిలో, వాసిలో తనకుతానై విస్తరించి, విశ్వవ్యాప్తమై ఎదిగారు. మాట వరుసకు మాత్రమే లలితగీతాల మహాకవి కానీ ఇవేగాక గేయనాటికలు, నాటకాలు, సినిమా పాటలు, నృత్యరూపకాలు, కథలు, భక్తిగీతాలు, లలితగీతాలు వంటి అనేక ప్రక్రియల్లో కృషిచేసిన రచయిత. సినిమాదర్శకులు కూడా. వడ్డేపల్లి కృష్ణ నాలుగు తరాల వారధి. మహాకవి సినారె సాహిత్య వారసత్వ సంపదలో పెన్నిధి, పుట్టిపెరిగిన ప్రాంతమే కాదు, ప్రక్రియల్లోను అడుగుజాడ సినారెది.
                   ‘‘మానేరు నీరు మహిమో
                   మాతల్లి పాల మహిమో’’ అంటూ వివిధ సందర్భాల్లో సాహిత్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే వడ్డేపల్లి తన సాహితీ ప్రవేశం చిన్నతనంలోనే చేశాడు. విద్యార్థి దశలోనే అనగా 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే శ్రీ కనపర్తి లక్ష్మీనరసయ్యగారు సినారెగారి ఏకైక నాటిక ‘‘సినీకవి’’లో (కథకుడు) తారాపతి పాత్రధారణ చేయించాడు. ఆ పాత్ర పోషణలో చిన్ననాటనే అప్పటి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో (1960) పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఆనాటి నుండి అనేక రంగస్థల నాటకాలలోనేగాక దూరదర్శన్లో ‘స్త్రీ’, ‘మిస్టర్‌’ (సీరియల్స్‌) మరియు ‘మంచు తెరలు’, ‘వెన్నెలకాపురం’ మొదలైన నాటికల్లో నటించాడు.
 గేయమనేది మాత్రాఛందోవిశేషం. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యసంస్కారమంతా అతని గేయరచనలోనే కనబడుతుంది. అంతేకాదు ఆయన రచనల్లో అధిక భాగం గేయాలే. గురువులైన కనపర్తి లక్ష్మీనరసయ్య, నందగిరి అనంత రాజశర్మగార్ల ప్రోత్సాహంతో గేయఛందస్సును ఆకళింపు చేసుకొని కవితారచనను మొదలుపెట్టారు. నిరంతర సాధనతో, అధ్యయనంతో నిగ్గుతేలిన వీరి ప్రథమకవిత ‘‘ఎవడెరుగును?’’ అనే గేయం ‘స్రవంతి’ మాసపత్రికలో 1968 జూన్లో ప్రచురితమైంది.
             ‘‘అతని మనస్సునందలి
               ఆంతర్యమ్మెవడెరుగును?
                   వీడిన ప్రేమికులలోని
                   బడబాగ్ని నెవడెరుగును?’’
సామాజిక స్పృహతో వడ్డేపల్లి రాసిన గేయమిది. ఇది తొలి గేయమైనా ఎంతో పరిణతి చెందినవారు రాసినట్లుగా ఉంది. ఇందులోని అభివ్యక్తి, పదప్రయోగవైచిత్రి, పైపైకి కనిపించే అందాల గురించి కాక లోలోపల ఉన్న వెతలను గురించి, కథలను గురించి ఈ గేయములో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ‘‘చితికిన బ్రతుకులలోపలి వెతల గూర్చి ఎవడెరుగును?’ అన్న వాక్యం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. గుండెల్ని ద్రవింపజేస్తుంది. 1969లో వీరి ప్రథమ ప్రబోధ గేయాలు ‘‘కనరా నీదేశం వినరా సందేశం’’, ‘‘వర్షించవేమేఘమా!’’ మొదలైన గేయాలు ఆకాశవాణిలో ప్రసారితమయ్యాయి.
1976లో ‘వెలుగొచ్చింది’ అనే నాటికను తెలంగాణ మాండలికంలో రచించి, దర్శకత్వం వహించి, కరీంనగర్‌ జిల్లాలో పలుమార్లు ప్రదర్శించి జిల్లా స్థాయి నాటిక పోటీలలో కూడా బహుమతులు అందుకున్నాడు. ఆయన వెలుగుమేడ (1976), గాంధీ గణాధిపత్యం (బాలల గేయనాటికలు-2015), రంగ తరంగాలు (రంగస్థల నాటికలు 2018) మొదలైన గేయనాటికలు రచించాడు. ఆయన ఆయా సందర్భాల్లో రచించిన గేయనాటికలెన్నో ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాల్లో ప్రసారితమయ్యాయి. భక్తకవి పోతన, భాగ్యనగరం, వెలుగువెన్నెల మొదలైన నాటకాలు అముద్రితంగా ఉన్నాయి.
వడ్డేపల్లి కృష్ణ అనేక సంగీత నృత్యరూపకాల్ని రచించాడు. మొదటగా ‘వడ్డేపల్లి రూపకాలు’ అనే పేరుతో అనేక సంగీత నృత్యరూపకాలను సంపుటిగా వెలువరించాడు. ఇందులో స్వదేశీయం’, ‘విశ్వకళ్యాణం’, ‘వివానంది విజయం’, ‘ఆమ్రపాలి’, ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘మహిళాభ్యుదయం’, ‘శ్రీకృష్ణదేవరాయలు’, ‘స్వర్ణభారతి’, ‘నృత్యభారతి’, ‘సంక్రాంతి లక్ష్మీ’, ‘ఉగాది వేళ-వసంతహేల’, ‘తెలుగు తేజ’, ‘అభినయం’, ‘చండాలిక’, ‘మానవత్వం’ వంటి రూపకాలు చేర్చాడు. ఎయిడ్స్‌ మీద కూడా ‘వెన్నెల వెలవెల’ అనే పేరుతో రూపకాలు రూపొందించాడు.
అలాగే వడ్డేపల్లి కృష్ణ మరొక సంగీతనృత్యరూపక సంపుటి అయిన ‘తెలంగాణ రూపకములు-త్రివిక్రములు’లో ఎక్కువగా తెలంగాణ నేపథ్యానికి సంబంధించినవే కావడం విశేషం. ఇందులోని తెలంగాణ వైభవం, తెలంగాణ పుణ్యక్షేత్రాలు, తెలంగాణ తేజోమూర్తులు, గోలకొండ, రామప్ప, కాకతీయ వైభవం, తరతరాల తెలంగాణ, యాదాద్రి వైభవం మొదలైనవన్నీ తెలంగాణ వేదికవే. అందుకే ఈ సంపుటికి ‘ తెలంగాణరూపకములు’ అనే పేరును స్థిరపరిచాడు. ఇదే సంపుటిలో సమాజంలోని అక్రమాల్ని, సమస్యల్ని ఖండిస్తూ విక్రమంగా సంస్కరించి మహానీయులుగా నిలిచిన ముగ్గురు త్రిమూర్తులు అయిన మహాత్మాజ్యోతి బాపులే, భారతరత్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌, భాగ్యరెడ్డివర్మ అని సంస్కర్తల జీవితచరిత్రలని సంగీత నృత్య రూపకాలుగా మలిచి ‘త్రివిక్రములు’ పేరుతో ఈ సంపుటిలో చేర్చడమైనది. మరొక సంగీత నృత్య రూపకమైన ‘బతుకమ్మ-జయజయహే తెలంగాణ’ సంపుటిని కూడా వడ్డేపల్లి కృష్ణ తెలంగాణ నేపథ్యంలోనే నడిపించాడు. ఈ విధంగా సమకాలీన సమాజంలో గతచరిత్రను, సంస్కృతిని, మానవీయ సంబంధాలను ఉదాత్రీకరిస్తూ రూపొందించిన ఈ రూపకాల్ని వేదిక మీద నృత్య, గాన, సంగీత సమ్మేళనంతో చూస్తే, అవి కొన్ని వందలరెట్లు ప్రభావితం చేస్తాయి అలరిస్తాయి. చైతన్యపరుస్తాయి. కావ్యానందం కలిగిస్తాయి. ఇంత వస్తువైవిధ్య పూరితంగా రాయడం వడ్డేపల్లి కృష్ణకే చెల్లింది.
 వడ్డేపల్లి కృష్ణ చేసిన సాహిత్యసేవకు గాను ఎంతోమంది, ఎన్నో సంస్థలు ఆయనను బిరుదులతో గౌరవించారు. 1995లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారు ‘‘గౌతమీ కిరీటి’’ అనే బిరుదుతో సత్కరించారు. 1997లో కళాంజలి ఆర్ట్స్‌ వారు ‘‘బాలసాహిత్య రత్న’’ అనే బిరుదుతో, 2004లో అమెరికా ఆటా సంస్థవారు ‘లలితశ్రీ’ అనే బిరుదుతో, 2012లో తెలంగాణ భాషా పరిరక్షణ సమితి వారు ‘‘లలితగీత ప్రపూర్ణ’’ బిరుదు. 2014లో గ్రేటర్కన్యాస్‌ సిటీ తెలుగు అసోసియేషన్‌ వారు ‘కవనప్రజ్ఞ’ అనే బిరుదు. 2015లో భారత్‌ కల్చరల్‌ అకాడమీ వారు ‘కవి శిరోమణి’ అనే బిరుదుతో, 2016లో హ్యూస్టన్‌ తెలుగు అసోసియేషన్‌ వారు ూఱఙఱఅస్త్ర ూవస్త్రవఅస శీట ూఱస్త్రష్ట్ర్‌ ూశీఅస్త్రం అనే బిరుదులతో, 2018లో వంశీ ఆర్ట్స్‌ థియేటర్స్‌ వారు ‘కళారత్న’ అనే బిరుదులతో గౌరవంగా సత్కరించారు.

You may also like

Leave a Comment