Home వ్యాసాలు తెలుగు సాహిత్య మార్తాండుడు సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్య మార్తాండుడు సి.పి.బ్రౌన్

by Cheedella Seetha Lakshmi

కొడిగట్టి మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్య జ్యోతిని శ్రమ అనే చమురుపోసి వెలిగించి కాంతులు వెదజల్లిన తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొర.

బ్రౌన్ దొరగా ప్రాచుర్యం పొందిన ఆయన పూర్తిపేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నవంబర్ 10 వ తేదీ 1798 సంవత్సరంలో భారతదేశం

కలకత్తాలో ఆల్దీన్ డేవిడ్ బ్రౌన్,కౌలే దంపతులకు జన్మించాడు.
తండ్రి క్రైస్తవ విద్వాంసుడు.తండ్రి స్ఫూర్తి వల్లనే బ్రౌన్ చిన్నప్పుడే గ్రీక్,లాటిన్,పారసీ,
సంస్కృత భాషల్లో పట్టు సాధించాడు. తండ్రి పోయాక వీరి కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది.
ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగ నిమిత్తం 1817 సంవత్సరంలో తిరిగి మదరాసు వచ్చి ఉద్యోగంలో చేరి తన బాధ్యతలో భాగంగా తెలుగు భాష మాట్లాడడం తప్పనిసరి అయి కోదండరామ పంతులు అను పండితుడి దగ్గర తెలుగు భాషను నేర్చుకున్నాడు బ్రౌన్.

తర్వాత 1820 సంవత్సరంలో కడపలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే తెలుగు భాష,సాహిత్యం కొరకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు బ్రౌన్. ఒక బంగళాను ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల కోసం కొన్న భాషాభిమాని. తెలుగు గ్రంథాల సేకరణ,పరిష్కరణ చేయుటకై పండితులకు,పామరులకు వసతి నేర్పాటు చేసి అయోధ్యారెడ్డి అను అతని పర్యవేక్షణలో కొనసాగించాడు.

తెలుగుసాహిత్యంలో సీ.పీ.బ్రౌన్ చేసిన కృషి అనితరసాధ్యమైనది.
ఎన్నో కావ్యాలను సేకరించి,పరిష్కరించి ముద్రించాడు.

ఆ కాలంలో తన స్వంత డబ్బును ఖర్చుపెట్టి తెలుగువారు కూడా చేయలేనంత కృషిని తెలుగు సాహిత్యం కోసం చేసి తనదైన ఒక ప్రత్యేక స్థానం ఆక్రమించాడు.
ఈనాటికీ ప్రామాణికమైన నిఘంటువులను, వ్యాకరణాన్ని వ్రాసి ముద్రించడమే కాక వేమన పద్యాలను ఇంగ్లీష్ లో అనువాదం చేసి తెలుగుభాషకు ఖండ
ఖండాన్తరాలలో కీర్తిని తెచ్చిపెట్టిన ఘనుడు.

తెలుగు సాహిత్యంలో బ్రౌన్ చేసిన కృషి ఎలా ఉందో,ఎంత కష్టపడ్డాడో తెలుసుకోడానికి ఆయన పండితులకు రాసిన లేఖలు,పండితులు బ్రౌన్ కు రాసిన లేఖలు ఎంతో దోహదం చేస్తాయి. బ్రౌన్ లేఖలను పరిశీలించినట్లయితే వివిధ అంశాలను బట్టి బ్రౌన్ వ్యక్తిత్వం తెలుసుకొనవచ్చును. బ్రౌన్ ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ లాంటి వాడు అనడానికి ఆ లేఖలే ప్రత్యక్ష సాక్ష్యం.

బేతంపూడి సుందరరాయుడు,రావిపాటి గురుమూర్తి శాస్త్రి,పాటూరి రామస్వామి శాస్త్రులు అను పండితులు బ్రౌన్ దొరకు ఉత్తరాలు రాశారు.ఈ లేఖల వల్ల ఆనాటి సామాజికస్థితి
బ్రిటిష్ దొరల పాలనలో తెలుగువారి దీనస్థితి కన్నులకు కట్టినట్లు తెలుపబడింది. కుటుంబ భారాన్ని మోయడానికి విద్య ఉన్నపటికీ ఉద్యోగం కోసం దొరలను ప్రాధేయపడడం,
వారి కొలువునాశ్రయించడం మొదలగు విషయాలతో పాటు బ్రౌన్ దొర వ్యక్తిత్వం ద్యోతకమవుతుంది.

కంపెనీ ఉద్యోగుల్లో పాశ్చాత్యులకు తెలుగు నేర్పే గురువులు మన తెలుగువారు కావడం తెలుగు నేర్చుకున్నాక
వారిని పరీక్షించే పరీక్షాధికారి బ్రౌన్ అని పండితులు రాసిన ఈ కింది లేఖాంశం వల్ల తెలుస్తోంది. “మార్చి నెలలో తమ సముఖములోనికి వచ్చి పరీక్ష ఇవ్వవలెనని ఉన్నారు.”

పండితులు ఉద్యోగాలిప్పించామని బ్రౌన్ కు లేఖలు రాశారు. బేతంపూడి సుందరరాయుడు బ్రౌనుకు రాసిన లేఖలో “కాలేజీ తెలుగు మునిషీలలో విశ్వంభర శాస్త్రులు రాజీనామా ఇచ్చినట్లు నాకు తెలిసినది. అక్కడ తిరిగి ఒకటి ఖాళీ అయితే నాకు ఇత్తురనే
అభిప్రాయంతో జీవనానికి గడియక నానా శ్రమ పడుతూ ఉన్నానని అంటూనే

“విశ్వరంభర శాస్త్రుల సర్టిఫికెట్ నాకు దయచేసి నన్ను పరీక్ష చేయవలెనని తమ అభిప్రాయం ఉంటే అది అయ్యేవరకు ఆ పని వకరకిన్ని ఇవ్వక నిలిపి పెట్టవలెనన్ని,నేను వచ్చిన మీదట నన్ను తమరు పరీక్ష చేసి తరువతనైనా నాకు ఆ పని ఖాయంగా చేసి ఇవ్వవలెనని ప్రార్థిస్తున్నాను.” అనడం వలన తెలుగు చదువుకున్న పండితుల పాండిత్యాన్ని తూచి విలువ కట్టే అధికారి ఆ కాలంలో బ్రౌనే అని తెలుస్తుంది.

పండితులు ఉద్యోగం ఇప్పించమని అర్థించడమే కాక కలెక్టర్ దొరగారితో…సిఫారసు చేసి కలెక్టర్ కచేరీలోనైనా తాలూకా కచ్చేరీలలో నైనా ఒక పని ఇచ్చేట్లు దయ చేయించవలెనని కూడా వ్రాయడం వలన
బ్రౌన్ కు ఉన్న అధికార హోదాను,పలుకుబడిని,అంచనా వేయవచ్చు. పై అధికారి సిఫారసు లేకుండా ఉద్యోగం లభ్యం కావడమనేది ఇప్పటి కాలపరిస్థితుల వలె ఆ కాలంలో కూడా
సులభం కాని విషయం అని తెలుస్తుంది.

బ్రౌన్ పండితులను ఆదరించేవాడు. పరోపకారి,ఎన్నో కుటుంబాలకు సహాయం చేసిన ఉదారస్వభావి అనడానికి పండితులు
బ్రౌన్ కు రాసిన లేఖలే నిదర్శనం.బ్రౌన్ ఉన్నత వ్యక్తిత్వం లేఖల్లో తేటతెల్లం అవుతుంది.
వారి వ్రాతలనే పరిశీలించినట్లయితే బ్రౌను సహృదయతను
గమనించవచ్చు.

రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి లేఖలో తన బంధువు గురించి “బందరు లో ఏమైనా ఒక పని కావలెనని ఆపేక్షించి సముఖమునకు వచ్చినాడు.తమ కోర్ట్ లో లాయర్ పని ఇప్పించితే తమ అనుగ్రహానికి పాత్రుడై కనిపెట్టుకుని ఉంటాడు.” అని రాశాడు.

పాటూరి రామస్వామి శాస్త్రుల లేఖలో తను చాలా కష్టంలో ఉన్నానని,నన్ను రక్షించే ప్రభువులెవరూ
ఇక్కడ లేనందున అన్న వస్త్రాలకు కూడా లేక పిల్లలతో చాలా శ్రమ పడుతూ ఏమీ తోచక
అనేక కుటుంబ సంరక్షకులయిన తమ దర్శనం చేసుకుని తమ సముఖములో నా విద్యమానము యావత్తు
శృతపరచుకొన్నట్టు అయితే తమరు నా గొప్పకుటుంబముతో కూడా నన్ను సంరక్షణ చేతురని యెంచి సముఖమునకు యీ మనవి వ్రాసుకొన్నాను” అని రాయడం బట్టి బ్రౌన్ దాన నిరతి,
పలు కుటుంబాలను రక్షించిన ధర్మప్రభువు అని తెలుస్తుంది. ఈ రకంగా సంఘంలో పండితుల యెదలో
బ్రౌన్ కు గొప్ప స్థానముందని గమనించవచ్చు.

ఇలా లేఖల ద్వారా ఆనాటి సామాజిక పరిస్థితి తెలుస్తుంది. దొరల ఏలుబడి కావడం వలన దొరలనాశ్రయిస్తే కానీ బ్రతకలేని దుర్భర పరిస్థితి ఆనాడు ఉండేది.

బ్రౌన్ కాలంలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని ఉద్యోగాలు కూడా తీసి వేయించారనే విషయం కూడా లేఖల ద్వారా విదితమౌతుంది.
పోట్లాటలు, అసూయలు ఒకరు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు. గిట్టనివారు లోలోపల
కుట్ర చేసి ఉద్యోగం నుండి ఊడబీకించే ప్రయత్నాలు చేయడం మొదలైన విషయాలు పాటూరి రామస్వామి శాస్త్రులు రాసిన లేఖ ద్వారా. ద్యోతకమవుతాయి.
ఉద్యోగంలో చిక్కులు ఆనాటి సమాజ వాతావరణం ఈ లేఖలో కళ్ళకు కట్టినట్లు తెలుపబడింది.
గవర్నమెంట్ ఆర్డర్ చొప్పున కాలేజీ బోర్డు వారు పనులను నిలిపివేయగా అన్న వస్త్రానికి లేక
కష్టపడుతున్న సమయంలో మారీస్ దొరగారు అడిషనల్ మునిషీ ఉద్యోగం ఇచ్చి
కథలను ఏర్పరచి వ్రాసే విధంగా ఏర్పాటు చేయగా ఉద్యోగనిర్వహణలో నిమగ్నమై ఉన్న సమయంలో గిట్టనివారు కక్ష కట్టి ” నా మీద లోలోపల తంటలు చేసి నన్ను ఆ పనిలోంచి తీసి వేయించారు” అని తన కథను ఈ లేఖలో పాటూరి దీనంగా వివరించాడు. దొరవారు నిజం తెలుసుకుని మళ్ళీ ఉద్యోగం ఇవ్వగా రౌలాన్స్ దొర మీకు ఇంగ్లీష్ రానందున అడిషనల్ మునిషీ పని అయినా ఇవ్వడానికి లేదని చెప్పడం వలన
ఆ కాలంలో కంపెనీ ఉద్యోగులకు ఇంగ్లీష్ భాష ఆవశ్యకత తెలుస్తుంది.

బ్రౌన్ తెలుగు కావ్యాలను అచ్చు వేయాలన్న ఆసక్తి కలవాడు.తెలుగు సాహిత్య అభివృద్ధిని కాంక్షించేవాడు.
హయగ్రీవశాస్త్రి గారి లేఖలో
“అచ్చు వేసే విషయమును గురించి తమరు సర్వసాధారణముగా
సహాయము చేయవలెనని తలంపులు గల ప్రభువులయినందు వల్లన్ను, ఆంధ్రభాష యందు గల పుస్తకములు శుస్టుగా
దిద్దివేయించవలెననే కోరిక గలవారైనందున
నున్ను, నా విషయముగా అచ్చునకు కావాల్సిన
పుస్తకములనిచ్చి సహాయము చేస్తామని
లోగడనొక తూరి జాబు వ్రాసి పంపించి యుండడము నున్ను,”
అని వ్రాయడం వలన
తెలుగు కావ్యముద్రణ పట్ల బ్రౌన్ కు గల శ్రద్ధ, ముద్రాపకులను ప్రోత్సహించి కావ్య ముద్రణాభివృద్ధిని
ఆశించడం బట్టి బ్రౌన్ కు తెలుగు సాహిత్యం పట్ల గల అనురాగం వ్యక్తమౌతుంది.

బ్రౌన్ వ్యాఖ్యాన సహిత వసుచరిత్ర కావ్యాన్ని ముద్రిస్తున్న సమయంలో మధ్యన అంతరాయం కలిగినట్లయితే డబ్బు ఖర్చు అవుతుందనే బాధను వ్యక్తం చేయక మధ్యలో ఆగిందనే ఆవేదన చెందేవాడు.”ఇంటికి గోడలు కట్టిన తర్వాత పైకప్పు మాత్రం ఖాళీ వుంచి ఆ కొంచం కుదిరించకుండా యిల్లు యావత్తు పాడు చెయ్యడం” లాంటిదని చెప్తూ ఒకరు మొదలుపెట్టిన పనిని వారే ముగించితే బాగుంటుందంటాడు.” పరులు యిందులో ప్రవేశించి కడకు సాగించిన పక్షమందు దీని యొక్క ఫలమేమి పెట్టుబడి రూకలు యేమి” అని చెప్పి పని పూర్తి చేస్తే దివ్యఫలము,శాశ్వత ఫలము కలదని చెప్పాడు.అచ్చు విషయంలో బ్రౌన్ కు గల శ్రద్దకు నిదర్శనం.ఏదైనా సగం చేసిన పనిలో తృప్తి వుండదు.చేసే పని పూర్తిగా చేస్తే తృప్తి వుంటుందనే మనస్తత్వం కలిగిన వాడు.

వేమన పద్యాలంటే బ్రౌన్ కు చాలా ఇష్టం.పండితులచేత పరిష్కరించి టీకా వ్రాయించేవాడు.
పండితులకు స్వయముగా లేఖలు వ్రాసి సలహాలు ఇచ్చేవాడు.
“కష్టమైన పద్యాలు వస్తే వాటి అర్థం మీరు తలుచుకున్న వెంటనే వక టీకా తగిలించవలసినది మంచి గుణము గల పద్యములు వచ్చేటప్పుడు వాటికి ఏమీ దుఃఖపడే దానికి అవసరం ఉండదు” అని వ్రాసి చేసే పని సవ్యంగా నిర్దోషంగా చేయాలంటాడు.

వేమన పద్యాలలాగానే తెలుగులో “సర్వ గ్రంథములకు మహా సులభమైన వక వ్యాఖ్య
అల్లించేటందుకు బుద్ధి ఉన్నది” “మార్గ దేశీ భేదం లేదు” గ్రామ్యోక్త గ్రంథం అయినా సరే అనడం వల్ల బ్రౌన్ ఆశయసిద్ధి వ్యక్తమౌతుంది. తెలుగు కావ్యాలు సామాన్య ప్రజలకు
అర్థం కావడానికి అందుబాటులో ఉండటానికి వ్యాఖ్యానాలు రాయించాడు.

కావ్యాలకు వ్యాఖ్యలు రాయించడానికి బ్రౌన్ చూపిన చాకచక్యం,మెళకువలు పైడిపాటి వెంకట నర్సయ్యకు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. పెద్ద పెద్ద కావ్యాలకు టీకా రాయించేటప్పుడు పండితులకు తగిన సూచనలు ఇచ్చేవాడు. “శబ్దమునకు శబ్దము యంత మాత్రము అల్లించకుండా తేలే తాత్పర్యం
బోధ చేస్తే చాలుతుంది” అని రాయడం వలన ప్రతిపదార్థం అవసరం లేదని కావ్యంలో ఏవో కఠిన శబ్ధాలకు మాత్రం అర్ధం చెప్పి తాత్పర్యాన్ని బోధిస్తే సరిపోతుందని సలహా చెప్పేవాడు. కవిత్వ విషయాలను లోతుగా కావ్య పరిశీలన చేసి విమర్శించి విశదం చేయడం తనకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పాడు. అట్లా అని ఏదో కావ్యాన్ని దాటి వేసే ప్రయత్నం కూడా లేదు.

పండితులు రోజుకెంత పని చేసేదో లేఖల ద్వారా తెలిపేవారు.

తెలుగు గ్రంథాల సేకరణ కొరకు బ్రౌన్ పడ్డ శ్రమ బ్రౌన్ స్వయముగా రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. ధర్మవరం సుబ్బన్నకు రాసిన లేఖలో గ్రంథసేకరణలో బ్రౌన్ కనబరిచిన తాపత్రయం వ్యక్తమౌతుంది. ఎవరైనా గ్రంథాలను జాగ్రత్త చేసి ఇస్తే ఊరికే తీసుకోకుండా విరాళంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు.డబ్బుకోసం వెనుకా ముందు చూసేవాడు కాదు.తనకు కావలసిన గ్రంథాలు దొరికితే చాలు అనే తాపత్రయం కలవాడు. ఏ ప్రదేశాల్లో
కావ్యాలు దొరుకుతాయో తెలుసుకుని తెప్పించుకునే ఏర్పాటు చేసుకునే వాడు.పల్నాటి వీరచరిత్ర కావ్యాన్ని తెప్పించుకోడానికి కన్నడభాష కనుక కన్నడవాండ్ల వద్ద విచారించవలసినదని రాశాడు.
ఏయే ప్రాంతాల్లో దొరుకుతాయో వాకబు చేసేవాడు.గౌరన ‘నవనాథ చరిత్ర’ కావ్యం చేబ్రోలు శంభుదేవర గారి మతంలో వున్నదని తెలిసి గుండవరపు కృష్ణయ్య గారికి ఉత్తరం వ్రాసి తెప్పించుకునే పద్ధతి చూస్తే ఆశ్ఛర్యమేస్తుంది. కావ్య సేకరణలో బ్రౌన్ కనబర్చిన చాతుర్యం శ్రద్ధకు ఈ లేఖ ప్రత్యక్ష సాక్ష్యం.కావ్యం యొక్క మాతృక పంపించమని అడుగుతూ మాతృక పంపించే ధైర్యం లేకుంటే ‘కరదాకాగితా’ ల మీద వ్రాసి కాపీని పంపించమని అడిగాడు.తన దగ్గర ఒక ప్రతి వున్నా కానీ సంతృప్తి పడక చేబ్రోలులో వేరే ప్రతి వుందని తెలిసి అక్కడనుండి తెప్పించుకోవడానికి సిద్ధపడ్డాడు.
“ఒక వేళ మాతృక పంపించినట్లయితే నెల రోజుల లోపల పత్రిక వ్రాయించి తిరిగి నిరాయాసంగా మీ దగ్గరకు చేరేటట్టు” చేస్తానని వాగ్దానం చేసాడు. శైవ గ్రంథం కాబట్టి ఆరాధ్యుల దగ్గరుండొచ్చని ‘నవనాథ చరిత్ర’ అనే పేరు తెలియకుండా ‘సారంగధర చరిత్ర’ అని భ్రమపడే అవకాశమున్నదని కాబట్టి కవి పేరు సరిగా చూసి గ్రంథాన్ని పంపించాల్సిందని వ్రాశాడు.దీన్నిబట్టి చూస్తే బ్రౌన్ చూపే మెళకువ,జాగ్రత్తలు తెలియడమే కాకుండా పరిష్కరణ కోసం కావ్యం పనికి వస్తుందనే దూరాలోచన కలిగినవాడని తెలుస్తుంది.

‘పల్నాటి వీరచరిత్ర’ గ్రంథాన్ని తెప్పించుకోవడానికి ఐదు రూపాయలకు గాను యాభై రూపాయలు ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడి డబ్బును లక్ష్యపెట్టక,
కావ్య సేకరణే పరమోద్దేశ్యంగా కలిగిన నిరంతర సాహిత్యపిపాసి బ్రౌన్ అని చెప్పవచ్చును.

ఇదే సందర్భంలో పెదగంజాం అప్పయ్యకు ముక్కుసూటిగా సమాధానం వ్రాసి ఆయన తలంచుకునే పద్ధతిలో నిర్మొహమాటంగా,నిర్భయంగా బదులిచ్చాడు ఎక్కడైనా ఉద్యోగమిప్పించమని అప్పయ్య అడిగినందుకు అప్పయ్యకు బ్రౌన్ వ్రాసిన జాబులో “మేము ఆడిగినకొద్దీ గ్రంథము నిమిత్తము మీకు యిది అది చేయవలెనని కలెక్టర్ సాహెబ్ పేరట జాబులు వ్రాయవలెనని మనవి చేసుకోవడము పెద్ద మనిషి నడక్కాదు” అని మందలింపు ధోరణిలో ఘాటుగానే వ్రాసి ‘పల్నాటివీర చరిత్ర’ గ్రంథం పంపిస్తే యాభై రూపాయలిస్తామని,
లేకుంటే వేరేవిధంగా గ్రంథం రాబట్టే మార్గం ఆలోచిస్తామని ముక్కుసూటిగా చెప్పడం వలన బ్రౌన్ ది లంచానికి మంచం వేసే స్వభావం కాదని,ఎదుటివానికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వ్యక్తిత్వం కలవాడని తెలుస్తుంది.

ఈ విధంగా ఎందరెందరికో యెన్నెన్ని రకాలుగానో జాబులు వ్రాసి,ఆశలు చూపి,స్వంత డబ్బు ఖర్చు పెట్టి కావ్య ప్రతులు సేకరించి,శుద్ధ ప్రతులను తయారుచేసి,వ్యాఖ్యానాలు వ్రాయించి ముద్రించడంలో బ్రౌన్ ఎదుర్కొన్న కష్ట నిష్టూరాలు, నిరంతర కావ్యపరిశోధనకు “బ్రౌన్ లేఖలు” ఎంతో దోహదం చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

బ్రౌన్ నిఘంటువు తయారు చేసేప్పుడు అనుమానం వస్తే పండితులకు ఉత్తరాలు వ్రాసి సందేహ నివృత్తి చేసుకునేవాడు.ఒక పదానికి అర్థ నిర్ణయం చేసేటప్పుడు “మేటికోఱు” మొదలగు వానికి పండితుల సలహాలు స్వీకరించేవాడు.
తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి గారు,అద్వైత బ్రహ్మ శాస్త్రులు గారు వ్రాసిన లేఖలే దీనికి సాక్ష్యం.

కృష్ణారెడ్డి బ్రౌన్ కు వ్రాసిన లేఖ వలన కాలేజీ బోర్డు వారి గ్రంథాలయానికి కావ్యాలను ఇప్పించే యేర్పాటు చేశాడని తెలుస్తుంది. కృష్ణారెడ్డి బ్రౌన్ దొర మాటను గౌరవించేవాడు.”యే ప్రకారం శలవు అయితే ఆ ప్రకారం శిరసావహించి నడుచుకుంటూ వుంటాను” అని వ్రాయడం కృష్ణారెడ్డికి బ్రౌన్ పట్ల వుండే గౌరవభావం సూచిస్తుంది. గ్రంథాలయానికి యే ప్రాంతం నుండైనా పుస్తకాలు చేర్చే బాధ్యతను కృష్ణారెడ్డికి అప్పగించ ఆ పనిని సమగ్రంగా నిర్వహించిన విశ్వాస పాత్రుడు. బ్రౌన్ వ్యక్తిత్వం సంఘంలో బ్రౌన్ కు గల ఉన్నత స్థానం,పండితులకు బ్రౌన్ ఇచ్చిన విలువ,
పండితులకు బ్రౌన్ పట్ల వుండే ఆదరభావం,కావ్య సేకరణ,ముద్రణలో బ్రౌన్ పడ్డ పాట్లు,శ్రద్ధ అనేక విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.

ఆనాడు తెలుగు భాషను,సాహిత్యాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొని అహర్నిశలు కృషి చేసి ధనాన్ని వెచ్చించి జీవితాన్ని అంకితం చేసిన పాశ్చాత్యుడు బ్రౌన్. తెలుగు వాడు కాకపోయినా తెలుగు భాషను నేర్చుకొని రక్షిస్తే ఈనాడు ఆంగ్ల మోజులో పడి తెలుగు భాష ఔన్నత్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్భం జరుగుతోంది. దిగజారుతున్న నేటి స్థితిని చూస్తే బాధ,ఆగ్రహం కలుగుతుంది.
అసలు బ్రౌన్ అనేవాడు లేకుంటే తెలుగు సాహిత్యం లేదనడంలో అతిశయోక్తి లేదు. ముద్రణా సౌకర్యం లేని ఆ రోజుల్లోనే అసూర్యం పశ్యగా వున్న తెలుగు కావ్యాలను సేకరించి పరిష్కరించి వ్రాతప్రతులను తయారు చేయించడం,ప్రచురణ చేయడం ఖర్చులన్నింటినీ ఒంటి చేత్తో భరించడం మామూలు విషయం కాదు. ముద్రణా యంత్రాంగం విస్తరించినాక తెలుగు సాహిత్య ప్రభ వెలిగింది. మార్గదర్శకుడు మాత్రం బ్రౌన్ దొర అని మనం గర్వంగా చెప్పుకునే తెలుగు భాషాభిమాని,తెలుగు వాళ్ళు మరిచిపోలేని మహనీయుడు,నిత్య స్మరణీయుడు బ్రౌన్ దొర ఇంగ్లాండ్ వెళ్లిన తరువాత కూడా లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా నియమింపబడ్డాక కూడా తెలుగు భాష కొరకే తన జీవితాన్ని ధారపోసిన బ్రౌన్ మహనీయుడు 1884 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన తనువు చాలించినప్పటికీ మన తెలుగు వారి మదిలో నిత్యం వెలిగే కాంతి పుంజం.
ఇలా తన జీతం,జీవితాన్ని తెలుగు భాష సాహిత్యం పునరుద్ధరణ కోసం ధారబోసిన త్యాగధనుడు,
ఆజన్మబ్రహ్మచారి,
కారణజన్ముడు,ప్రాతఃస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్.

You may also like

1 comment

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ August 28, 2021 - 4:43 am

ఈ వ్యాసం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం

Reply

Leave a Comment