సినిమా దృశ్య శ్రవ్య ప్రధానమైన వినోదకళ. అలనాటి నాటకానికి సాంకేతిక పొడగింపే సినిమా. తెలుగు సినిమా వెండి తెరపై వెలుగులు చిందడానికి
తెలుగు నాటకాలు మౌలికంగా ప్రధాన భూమిక పోషించాయి. కారణం తెలుగు తొలి టాకి యుగం మొదలు నేటివరకు జన బాహుళ్యంలో ఉన్న నాటకాల
నే తెరకు ఎక్కించారు కాబట్టి,సినిమాకు మూలంగా నిలిచిన నాటక చరిత్రను విహంగవీక్షణంగా స్ప్రశించడం సబబు. రంగస్థలంపై సజీవంగా నటించేది నాటకంలో. కథానుగుణంగా నటీనటులతో నటింపజేసి, సెల్యు లాయిడ్ గా మలచి వెండితెరపైన ప్రదర్శించేది సినిమా.అందుకే దీనిని కదిలేబొమ్మల రూపకం అని, “చలన చిత్రం”( బొమ్మలు చలిస్తాయి కాబట్టి ) అంటారు.
వాస్తవానికి విశ్వ సాహిత్యంలోనే నాటకానికి ఒక విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో “కావ్యేషు నాటకం రమ్యం… నాటకాంతం హి సాహిత్యమ్” అంటూ నాటక ప్రాముఖ్యతను చాటిచెప్పబడింది.*1 క్రీస్తుశకం నాటికే మనదేశంలో దృశ్యకావ్య ప్రక్రియ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దీన్ని శాస్త్రీయంగా సూత్రీకరించిన వాడు ‘భరతుడు’.
. తెలుగు సాహిత్య ప్రక్రియ ప్రారంభమైన కాలం నుంచి క్రీస్తుశకం 1860 వరకు మొదటి కాలం. ఈ కాలంలో వీధి నాటకాలను ఎక్కువ సంఖ్యలో ప్రదర్శించేవారు. ఆ తరువాతి కాలాన్ని ముఖ్యంగా క్రీస్తుశకం 1860 నుండి 1960 వరకు, ఈ వంద సంవత్సరాల కాలం తెలుగు నాటక రచనకు ప్రత్యేక కాలంగా పెద్దలు పేర్కొన్నారు.
ఆధునిక కాలంలో శ్రీయుతులు కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు మరియు పరవస్తు రంగాచార్యుల గార్లను తొలి నాటక కర్తలుగా పేర్కొంటారు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి నాటకం ‘మంజరీమధుకరీయం’. ఈ నాటకాన్ని 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించారు. ఈ నాటకం ముద్రణ మాత్రం 1903లో జరిగింది. 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ‘నరకాసుర విజయం’ నాటకాన్ని తెలుగులో రచించారు. అదే సంవత్సరం పరవస్తు రంగాచార్యులు గారు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని తెలుగులో రచించారు. మూల నాటకంలోని ప్రాకృత భాషల స్థానంలో తెలుగును ప్రవేశపెట్టిన ఘనత ఈ ఆచార్యుల వారిదే
ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభదశలో ప్రథములు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. 1880లోనే వీరి రచనలు ‘బ్రాహ్మ వివాహము’, ‘చమత్కార రత్నావళి’ దిగ్విజయంగా ప్రదర్శించబడినవి. తెలుగులో మొదటి సాంఘిక నాటకం ‘నందక రాజ్యం’. 1880లో వావిలాల వాసుదేవశాస్త్రి దీనిని రచించారు. 1883లో వడ్డాది సుబ్బారాయుడు రచించిన ‘వేనీ సంహారం’ సుప్రసిద్ధమైన తెలుగు నాటకంగా నిలిచింది. నాదెళ్ళ పురుషోత్తమకవి గారు 1884- 86 ప్రాంతంలో 32 నాటకాలను రచించి పాత్రోచితమైన సంభాషణలతో నాటకాలను రక్తికట్టించారు. ఉత్తమ శ్రేణికి చెందిన నటులైన ధర్మవరం కృష్ణమాచార్యులు 1887లో ‘చిత్రనళీయం’ 1989లో ‘విషాద సారంగధరము’ మొదలైన 25 స్వతంత్ర తెలుగు నాటకాలను రచించారు. ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితులైన వీరు తెలుగులో విషాద నాటకాలు రచించిన ప్రథములు. నాటకములలో పాటలను ప్రవేశపెట్టిన ఘనత వీరిదే. లక్షకుపైగా ప్రతులు అమ్ముడుపోయిన ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని 1889లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించారు.
. సరిగ్గా ఇదేసమయంలో మనదేశంలో సినిమా అడుగిడింది.1886లో లుమీర్ సోదరు లు భారత దేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో “భక్త పుండరీక”, 1911లో “రాజదర్బార్” అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.
తెలుగు నాటక చరిత్రలో విశిష్టమైన సంవత్సరం 1897. ఈ ఏడాదిలోనే వేదం వెంకటరాయ శాస్త్రి గారు ‘ప్రతాపరుద్రీయం’ నాటకాన్ని, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రచించి తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు.
1901- 1920 కాలంలో విశిష్టమైన చారిత్రాత్మక నాటకరచన కొనసాగింది. కోలాచలం శ్రీనివాసరావు 1907లో ‘రామరాజు చరిత్ర’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1909లో ‘బొబ్బిలియుద్ధం’, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ మొదలైన నాటకాలను రచించారు. ఈ కాలంలోనే సోమరాజు రచించిన ‘రంగూన్ రౌడీ’ నాటకం అధిక సంఖ్యలో ప్రదర్శనలు అందుకున్న నాటకం. 1911లో తిరుపతి వేంకటకవులు రచించిన ‘పాండవోద్యోగ విజయములు’, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ‘సత్యహరిశ్చంద్రీయము’ నాటకాలు ఇప్పటికీ ఘనమైన స్థితిలో కొనసాగుతున్న అద్భుత నాటక రాజములు. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో సంఘసంస్కరణ నాటక రచనలలో పేరుగాంచిన వారు కాళ్ళకూరి నారాయణరావు. వీరు 1921లో చింతామణి, 1926లో వరవిక్రయం నాటకాలను రచించారు. ఇలా మరెందరో నాటక రచయిత లు ఉన్నారు . కొన్ని వెలుగు లో కి రావు కొన్ని ప్రసిద్ధి చెందవు. అయితే తెలంగాణ నుండి కూడా చాలా మంది రచయితలు ఆకాలం లోనే అనేక ప్రక్రియలను చేపట్టారు. వారిలో ‘ఒద్దిరాజు సోదరులు‘ అని కీర్తి గాంచిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు సాహిత్యం లో ని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసారు . 1912 లోనే ” మోహినీ విలాసం” నాటకాన్ని రచించారని వారిపై 2017 లో వచ్చిన పరిశోధన గ్రంథం చదివితే తెలిసింది. 1918 లో సోదరులు రచించి, ముద్రించిన ” రుద్రమదేవి నవల పీఠిక లో ఈ నాటక ప్రస్తావన ఉన్నదని కూడా తెలిసింది. ఈ విషయం ” ఒద్దిరాజు సోదరురుల జీవితం సాహిత్యం అనే” పరిశోధన గ్రంథం లో ఉన్నది . ఇప్పుడు ఈ నాటకం లభించడం లేదు . 1920 లో ఈ సోదరులు రచించిన ” భక్తిసార చరితము” అనే నాటకం ఆనాడు ముద్రించారు మళ్లీ కొత్త గా ముద్రణ కూడా అయ్యింది.‘ తెనుగు‘ పత్రికా వ్యవస్థాపకులూ , సాహితీ వేత్తలు ఒద్దిరాజు సోదరుల పై 2017 న వెలువడిన డా॥ కొండపల్లి నీహారిణి గారి పరిశోధన గ్రంథం ద్వారా తెలియవస్తున్నది.
బహుశః “మోహినీ విలాసం ” నాటకం అనంతర కాలంలో తెలుగులో వెలువడిన” )మోహినీ భస్మాసుర” ( 1966) సినిమాకు మూలం గా భావించాల్సి వస్తుంది. అంతేకాదు 1918 లో ఈ సోదరులు రచించి న ‘ రుద్రమ దేవి‘ నవల పీఠిక లోఈ నాటకం ప్రస్తావింపబడటం గమనించదగ్గ అంశం.
జాతీయ ఉద్యమం ప్రస్థానంలో పాట, నవల, కథ వంటి ప్రక్రియలతో పాటు నాటకం పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా నిలిచి పోయింది. స్వాతంత్ర్య ఉద్యమం వైపు చైతన్య దిశగా కదిలించిన తెలుగ నాటకాలు కోకొల్లలుగా వచ్చాయి. పౌరాణిక నాటక ఇతివృత్తాలతో పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి ‘సంపూర్ణ మహాభారతం’ ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నాటకాలను, ధర్మవరం కృష్ణమాచార్యులు ‘స్వయంవరం’ నాటకాన్ని, మొక్కపాటి వెంకటరత్నం ‘ద్రౌపది మాన సంరక్షణ’ నాటకాన్ని, వేదాంత కవి ‘యుద్ధభూమి’ నాటకాన్ని, కాళ్ళకూరి నారాయణరావు ‘పద్మవ్యూహం’ ఊటుకూరు సత్యనారాయణ ‘భానుమతి’ ధర్మవరం కృష్ణమాచార్యులు ‘ప్రమీలార్జునీయం’ పట్టాభి సీతారామయ్య ‘మాతృ దాస్య విమోచనం’ మొదలైన నాటకాలను రచించారు.
1900లో కోలాచలం శ్రీనివాసరావు ‘సుల్తాన్”, 1921లో కొప్పరపు సుబ్బారావు ‘రోషనార,’ 1932లో ముత్తరాజు సుబ్బారావు ‘చంద్రగుప్త’, 1928లో ప్రభులింగాచారి ‘పల్నాటి వీరచరిత్రము’, 1926లో ఉన్నవ లక్ష్మీనారా యణ ‘నాయకురాలు’,నాటకానికి అంత శక్తి ఉంది.
1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. 1921 నుండి తొలి టాకీ వరకు (1932) విడుదైలన మూకీలు ,ఆనాటి రంగస్థల నాటకాల ముందు నిలువలేకపోయాయి.
టాకీ యుగం ప్రారంభమయ్యాక నాటకప్రభ సన్నగిల్లింది.
ప్రేక్షకులు కొత్తదనాన్ని వేలంవెర్రిగా స్వాగతించారు
1932 లో హెచ్ ఎం రెడ్డిగారు తెలుగునాట ప్రసిద్ధి చెందిన సురభి నాటక కంపెనీ అధినేత సురభి కమలాభాయి బృందాన్ని, రంగస్థల నటుడు మునిపల్లి సుబ్బయ్యని బొంబాయి తీసుకువెళ్లి, తెలుగు తమిళ భాషలలో ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని1932లో తనదర్శ కత్వం లో రూపొందించారు. ఆ తరువాత తెలుగులో తీసిన సినిమాలు అధికశాతంనాటకాలనే మూలంగా చేసుకొని తీశారు.భక్తప్రహ్లాద, పాదుకా పట్టాభిషేకం,చింతామణి, సత్యహరిశ్చంద్ర, వరవిక్రయం ,లవ కుశ సారంగ ధర, శకుంతల,కన్యా శుల్కం ..మొదలైనవి తెలుగునాట విజయభేరిని మ్రోగించిన నాటకాలు.
ఈవిధంగా తెలుగులో తొలినాళ్ళలో నిర్మితమైన సినిమాలకు నాటకాలే మూలద్రవ్యాలను అందించాయి.
*
1 comment
చాలాబాగుంది సమాచారం స్పష్టంగా నిండుగా వుంది