యుద్ధం ఎంత భయాంకరమో,ప్రత్యక్షంగా చూసినవారి మనఃస్థితి ఎలా ఉంటుందో,దాని వలన జనజీవనం ఎంత అతలాకుతలమౌతుందో…
ప్రభావవంతంగా తన కవితలో పొందుపరిచారు మహాకవి!
యుద్ధంలో అసువులు బాసినవారు,అయినవారిని పోగొట్టుకున్నవాళ్ళు,
కాళ్ళుచేతులు కోల్పోయి జీవచ్ఛవాలైన వాళ్ళు,క్షతగాత్రులు,చివరి క్షణం వరకూ శత్రువుతో పోరాడిన వీరసైనికులు…దయనీయమైన యుద్ధానంతర దృశ్యాలను దృశ్యమానం చేసారు తన కవితలో.
ఆ దృశ్యాలే అర్జునుణ్ణి యుద్ధరంగం నుండి పారిపోయేలా చేసినవి!
ఆ దృశ్యాలే అశోకుడిని శోకతప్తుడిగా మార్చి,తథాగతుని బాటను పట్టించినవి!
ధాత్రీ జనని గుండె మీద యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు అంటూ యుద్ధజ్వాలలకు ప్రతీకగా మండే కొరకంచులను ఎత్తుగడగా వాడారు. ఆ కొరకంచుల ఎర్రని రవ్వలు గాలికి ఎగిరి దూరంగా పడుతాయి.అంటే యుద్ధం ఒకచోట ప్రారంభమైనా, దాని ప్రభావం ప్రక్కదేశాల మీద,ప్రపంచమంతటా దాని ప్రభావముంటుందని ఈ పంక్తుల్లో తెలిపారు.
కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
అనే పంక్తుల్లో యుద్ధం కొరకు కోట్లాది సైనికులు పడే బాధలను,కష్టాలను, స్వసుఖాన్ని విడచి,శత్రువుల చేతికి చిక్కితే చిత్రహింసల పాలై,చివరి క్షణం వరకూ పోరాడుతూ ప్రజలకై చేసే ప్రాణత్యాగాలను గుర్తించమంటున్నారు.కనీసం కన్నీరు కార్చమంటున్నారు.
దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకున్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు అనే పంక్తులలో యుద్ధానికి ఎక్కువగా బలయ్యేది సామాన్య ప్రజానీకం అనే విషయాన్ని తెలుపుతూ…
ఆహారం,నీరు దొరకక తల్లడిల్లే పరిస్థితులను వర్ణిస్తూ పోల్చిన నోరులేని కడుపు అనే ప్రతీక పేదవాని కోపం పెదవికి చేటు సామెతను గుర్తుకు తెస్తుంది.ఒకవేళ తెరుచుకున్న నాలుక మాట్లాడినా…బూడిదలో వ్రాసుకున్న మాటలు అంటే ఎదురుతిరిగిన సామాన్యుడికి చావే గతి అనే సత్యాన్ని చాటిచెప్పారు.
కాలం విరిగిన బండిచక్రం అనే ప్రతీకలో యుద్ధం ఆరంభం అయ్యాక అంతమెప్పుడో తెలియని అనిశ్చితిని వివరించారు.
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
అనే పంక్తులలో …ఎదురుగా వేలకొలది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా, మనసున్న మానవుడు తెల్లబోయి చూడడం తప్ప,
ఏమీ చేయలేని దీనస్థితిని,
నిస్సహాయ పరిస్థితిని వెల్లడించారు.
ముగింపు పంక్తుల్లో…
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకముందే
అనే పంక్తిలో కవులు తమ భావావేశాన్ని ప్రకటించకముందే
(ప్రజాచైతన్యంలో వారి పాత్రను తెలుపుతూ)
అణచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
అనే పంక్తిలో ప్రజలలో అసంతృప్తి విప్లవంగా ఎగసిపడకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
అంటూ ప్రభుత్వాల కర్తవ్యాన్ని, యుద్ధవిరమణ ప్రతిపాదనను తెచ్చి, సంధి కుదిర్చి,యుద్ధ చీకటి తెరలను చీల్చాలంటూ సూచించారు.
యాభై ఏళ్ళ క్రితం జూన్ 8 వ తేదీన వియత్నాం గ్రామంలో జరిగిన యుద్ధబీభత్సాన్ని నిక్ ఉడ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది.ఆ ఛాయాచిత్రంలో సైనికులు,ఓ వృద్ధురాలు,
తొమ్మిదేళ్ల బాలిక,బాలుడు బాంబు దాడిలో గాయపడి ఒంటిపై స్పృహ లేకుండా పరిగెడుతుంటారు.ఆ బాలిక మంటలకు తల్లడిల్లిపోతూ దాహం తీర్చమని కోరుతుంది. ఆ బాలికతో పాటు ఇంకొందరిని
కూడా అంబులెన్స్ లో తరలిస్తాడు నిక్ ఉడ్.
ఇటువంటి మానవతా దృష్టి
ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది…?!
సందేహించాల్సిన విషయమే.
యుద్ధం కన్నా శాంతి,
విద్వేషాల కన్నా,మానవత్వమే
హితమని సందేశమిస్తూ,
పిలుపు అనే శీర్షిక సార్థకమయ్యేలా ప్రభావవంతమైన మేలుకొలుపు కవితను అందించిన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి
వందనములు🙏🙏🙏🙏
( కవితాలయం సాహితీ సామాజిక సేవా సంస్ధ వారు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి(250 రూపాయలు నగదు బహుమతి) పొందిన నా సమీక్ష!