‘ధన్య’కవీంద్రుడు దాశరథి
తెలంగాణ ప్రజావళికి ప్రాతఃస్మరణీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తక్కువ శీర్షికలతో తన కవిత్వంలో ఎంతటి కవిత్వ సాంద్రతను దట్టించినాడో కవితావిశారదులంతా గమనించినవారే ! “జయపత్రముల”వంటి ప్రశంసావాక్యములందించినవారే!!
సార్థకమైన బిరుదులను ప్రదానం చేసినవారే !!!
మహాకావ్య స్థాయి అభివ్యక్తీకరణ శిల్పరచనను ప్రకటించే కవులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు.ఎదుగుతారు.జాతికీర్తిని నిలబెడతారు.సమకాలీన దుష్టతనూ ౼ దౌర్జన్యాన్నీ చీల్చిచెండాడుతారు. తమ కనుల ముందే తమ ప్రధాన శుభసంకల్పం ఫలిస్తే ఆకాశమెత్తు తన జాతి ప్రగతి ఎదగాలని పొంగిపోతారు. *_మహాకవి దాశరథి ప్రధాన శుభసంకల్పం : నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణ విముక్తం కావటమే_* అన్న సత్యశివసుందర’సూక్తిని ఎవరూ ఏవిధంగానూ ఆక్షేపించలేరు. తదనంతర పరిణామాలు తనదృష్టి కోణంలోనికి అందనంత ప్రతారణనూ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అందరిలాగే గమనించలేని సజ్జనకవి దాశరథి. *కాలం తనకు కావలసినంత’కాలం తన మనుషులను తానే ఎన్నుకుంటుంది( _రాశే_ )* అనే వాక్యం సమర్థనీయం అనుకుంటే కాలం తెలంగాణ విముక్తి కోసం కవి’దాశరథిని కూడా తానే ఎన్నుకుంది అంటాను నేను. సమకాలీన ప్రముఖులు దాశరథిని _యుగకవి_ అని కీర్తించటం ఇందువల్లనే ! ఆత్మవిశ్వాసం ఆత్మబలం లేకుండా ఆత్మగౌరవం అనే మాట వ్యర్థం. దాశరథి తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రజారథి.సారథి.ప్రతినిధి. కవితావాక్య”శర”ధి.తన కనులముందే తన మనోరథం ఈడేరి ఆనందించిన కవిని తదనంతర కాలంలో పట్టించుకోవలసినంతగా పట్టించుకోకున్నా ఆత్మగౌరవంతో
*అరుగుచున్నాడు. దాశరథి అమరపురికి* … అన్నట్లు జీవితాన్ని తృప్తిగా _బాగానే బతికాను_ అన్నట్లుగా నిష్క్రమించిన *మహాపురుషుడు దాశరథి* . నిలువెల్లా స్పందించి
*నా తెలంగాణ కోటిరత్నాల వీణ* అనే నినాద’నిక్వాణస్వరాన్ని నిరంతర ప్రేరక విజయశంఖం గా విడిచి వెళ్లిన మహాదార్శనికుడు.
ఇటీవలి కాలఃలో సొంత’ఊపిరిని గెలుచుకొని మరింతగా పెంచుకుని సువర్ణప్రగతి(బంగారు తెలంగాణ) పథంలో పురోగమిస్తూన్న
ఆధునిక తెలంగాణకు *నా తెలంగాణ కోటి రత్నాలవీణ* నిజమైన జీవనోజ్జీవన శంఖధ్వానం.
మహాకవి దాశరథి జయంతి 22,జులై సందర్భంగా ఆ మహాకవికి ఇది నా అక్షరనీరాజనం.
Poets are the unacknowledged legislators of the world ౼ P.B.Shelly
౼ గురిజాల రామశేషయ్య
‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’
ఆధునిక తెలంగాణ సుస్పష్టమైన హద్దులతో ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి. తెలుగు భాష ప్రాచీన హోదాను పొందిన భారతీయ భాషలలో ఒకటి. మాధుర్యమునకు పేరు పొందిన భాషలలో తెలుగు మొదటిది. సాహిత్యపరంగా తెలుగు పద్యం విశిష్టమైన భావ వాహిక. మందార మకరంద మాధుర్యమునకు పోతన భాగవత తెలుగు పద్యం దృష్టాంత సాక్ష్యం. అటువంటి పోతనను ఉద్దేశించి “ఎందుకాతడుగ పుట్టకైతిని హరీ!” అని తన “భూమిక’’ కావ్యంలో పలువరించి ‘కల’వరించి ఆ కల ‘వరించి’ తన కవన గళ సహపది కాగా మాన్యుడైన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘సినారె’ సంక్షిప్త నామంతో సుప్రసిద్ధుడైనాడు.
‘సినారె’ అగణ్యమాన్యతామకుటాలు రెండు. ఒకటి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార స్వీకృతి, రెండు, ‘రాజ్యసభ’ సభ్యత్వం.
పల్లె నుండి ఢిల్లీవరకు ఎదిగిన తెలంగాణ కవులలో ఒకరు ‘సినారె’. మూడుతరాల యువకవులను ప్రభావితం చేసిన మహాకవి తాతయ్య ‘సినారె’. ఎందరికో శబ్దభిక్ష పెట్టిన ధన్యుడు. ఎందరికో ‘లయ’ను పరిచయం చేసిన సం‘గీత’జ్ఞుడు. ఖండాంతరాలలోని తెలుగు డెందాలను తన పలుకుబడితో పులకరింపజేసిన సుమధుర కవి ‘సినారె’.
విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, ఉపకులపతిగా రాణించిన ‘సినారె’ నిజంగా కవి కులపతి. కవి కవిత్వం వరకే పరిమితుడుకాడని నిరూపించిన అధికార భాషా సంఘాధ్యక్షుడు. నిత్య శోభిత సాహిత్య సభాధ్యక్షుడు, ముఖ్యాతిథి. తిథిరీత్యా నిత్యకవన రచనా పిపాసి. కవితాభ్యాసి. కవితా ‘కళాప్రపూర్ణుడు’. కవి పద్మ భూషణుడ. రణం మరణంపైనే అని సగర్వంగా ప్రకటన చేసిన కవి యశస్వి ‘సినారె’.
తన పేర తెలంగాణ రాజధానిలో సారస్వత నిలయం ఏర్పడే అంతగా ఘనత పొందిన మాన్య కవీంద్రుడు ‘సినారె’.
మధ్య తరగతి మందహాసాన్ని తన పరిధిలో వివేచించి ఉన్నతి గతి మీది చిరకాంక్షతో ‘విశ్వంభర’ మానవుని వరకు తరగెత్తిన కావ్య సమీక్షణం ‘సినారె’ స్వీయ నిర్ణయ కావ్యకళా పథం కావ్యకళా.
అందుకే ఒక సందర్భంలో : గర్జించే గళం నాది! నిర్జించే కలం నాది! స్వీయానుభవగర్వ దీప్తిని అక్షరీకరించినాడు.
ప్రతిష్ఠాత్మక కవితా పీఠాధిష్ఠుడైన తాను ‘పీఠిక’ రచనలతో యువ కవుల నుండి మహాకవుల వరకు అందరిలోని ప్రతిభా వ్యుత్పన్నతలను కల కలిచే తన పద సంపుటితో సప్రమానంగా అభినందించినాడు.
తెలుగు సాహిత్యంలో పద్యం గద్యం ద్విపద కీర్తన వచనం గేయం వచన కవిత మినీ కవిత ఇలా ఇలా అలల్లాంటి ఎన్నెన్నో ప్ర్రకియలు తలలెత్తి కవుల తలపైన కీర్తికిరీటాలను సుస్థిరం చేసినాయి. ఈ క్రమంలో 20వ శతాబ్ధం 30వ దశకంలో 29 జులై 1931 రోజున ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ)నాడు జన్మించిన ‘సినారె’ మాత్రాచ్ఛందస్సుల్లో గేయ కావ్యాలను రచించి ఒడుపుగా పద్య గంధిలతను – సమాసకల్పనల పొందికతో అక్షర రమ్యంగా సముచిత రీతిలో ఔచిత్య భాసురంగా గంగాతరంగచారిమతో భారత స్వాతంత్ర్యానంతర కవిస్వాతంత్ర్యానుకూల గేయం దేశచ్ఛందస్సులలోనికి తెలుగు పలుకు ఒరవడికి మడులు తీర్చి కవిత్వపు పంటను పండించే చొరవను పాదు కొల్పినారు. ఇది ‘సినారె’ పైకి చెప్పకుండా అఖిలాంధ్ర సాహిత్య చరిత్రకు చేసిన మేలు. దీనివల్ల అంటే మాత్రాచ్ఛందో కావ్యాలవల్ల పద్య పఠన శక్తి ఒనగూడి ప్రాచీన కావ్యధోరణుల సమవగాహన శక్తిని పొందటానికి అప్పటి యువతరానికి సాధ్యమైంది. అంతేకాక గహనమైన కావ్యశిల్ప సంప్రదాయములను యథాశక్తి గ్రహించి తమ రచనలలో పాటించగలిగే నేర్పు ఇంతో అంతో ఒనగూడింది. ముఖ్యంగా భాషా పరంగా నిర్దుష్ట భాష పట్ల ఆసక్తి పెరిగింది. అంతేనా! ‘సినారె’ రుచి చూపించిన అంత్యప్రాస, అంతఃప్రాస (సినారె మాటే ఇది), అనుప్రాస, యమకాది అలంకారాలను గమనించి ఆనందించటంలోనూ; తమ రచనలలో ప్రయోగించి మెప్పుపొందటంలోనూ కవులను మార్గదర్శనం చేసినట్లయింది. జనరంజకమైన సినీ గీతాలలోనూ ఈ సాంప్రదాయిక సాహిత్యరీతి విధానాలను చవి చూపించినాడు. కలవరించి – కల- వరించి సభంగ శ్లేషాత్మక యమకం. “శివరంజని” సినిమాలోని పాటలో “నా దానివి – నా –దానివి” ఇలాంటిదే! పాలవెలుగై –మణదీ “పాల” వెలుగై ఇలాంటివెన్నెన్నో! తనకంటె ముందు తరంలోని పెద్దల సరసన ఇటు శిష్ట సాహిత్యంలోనూ అటు సినీ సాహిత్యంలోనూ నెగిలిన ప్రతిభాశాలి ‘సినారె’. ఇక తన తర్వాతి తరం చేత అభిమానింపబడిన, సన్మానింపబడిన పెద్ద “సినారె”. తరం మారుతున్నది….. స్వరం మారుతున్నదని గమనించిన దార్శనికుడు. “సరిలేరు. నీకెవ్వరు” అని జేజేలు పొందిన అదృష్టవంతుడు. ఇంతగా సినీ సాహిత్యపరంగా చెప్పటమెందుకంటే “సినారె” కీర్తి కిరీటంలో ఒకటి ఆచార్య పదవి – దాని ఉన్నత ఉప కులపతి పదవి ఒక తురాయి. శిష్ట సాహిత్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కృతి మరో కలికితురాయి. సినీగీతావళి కీర్తి కలిమితురాయి. శ్రోతలకేమో సరళీ స్వరాల పంట. ఒక వ్యక్తి కవిగా ఇంత ఉన్నత స్థాయి కీర్తి స్థితులను అందుకోవటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి సంయమన శీలంతో – మరెంతటి కళాసేవా “శ్రమ” కర్తృత్వంతో ఇంకెంతటి ఉల్లాస భరిత స్వరచాలన హృదయంతో ఉజ్జీవిస్తూ రోజు రోజూ కాలాన్ని కర్పూరంగా మండించుకోవాలో కదా! అప్పుడే కదా ఇంతటి మాన్యచరితకు దీప్తి!
ప్రభుత్వ కళాసాహిత్య సేవా సలహాదారుగా పనిచేసిన “సినారె” ఎన్నో ప్రసిద్ధ కళాసాహిత్య సేవా సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినాడు. తెలంగాణ సారస్వత పరిషత్తును చెదరకుండా నిలిపిన వ్యవహారజ్ఞుడు.
సమష్టిపై ‘సినారె’ ఆధునికతలో అడుగులు వేసిన ధీశాలి. ప్రాచీన వైభవ సంస్కృతిని (Heritage) ఆధునిక స్పృహతో సమీక్షించిన సామాజిక కళామేధావి.
“సురభిళ శబ్దమ్మొక్కటి
తరగెత్తిన చాలు – నా
గుండె సందులందు కోట్లి
నందనాలు గుబాళించు”
అని తన శబ్ద ప్రీతిని అభివ్యక్తీకరించుకున్న ‘సినారె’ అస్మదాదులకు “శబ్ద గురువు”.
“అంత కడివెడు పాలపై – ఒ
క్కింత మీగడ పేరినట్లుగ మనకు
మిగులును గతము లోపలి మంచి
అదిమె సంప్రదాయము”
అని సంప్రదాయములోని మంచిని ఆధునికతలోని ప్రయోగ ప్రయోజన శీలతను మేళవించుకని ‘ఒళ్ళంతా లయ’గా అడుగులు వేసి – “చూపంతా ప్రగతిశీలత” నుడుగులు పలికి తెలుగుజాతికి మాన్యకవీంద్రునిగా ఆదర్శనీయుడై తరించిన స్వరధుని “సినారె”! మానవీయ విశ్వంభరుడు “సినారె”.
శ్రీ గురుభ్యోనమః
– గురజాల రామశేషయ్య