ఇలా అడుక్కు తిని బతకడానికి
సిగ్గుగా లేదూ?
నేనెందుకు సిగ్గు పడాలి తండ్రీ?
నన్ను అడుక్కు తినేలా చేసిన
ఈ దేశం సిగ్గు పడాలి!
బాగానే ఉన్నావుగా,
ఏదన్నా పని చేసుకు బతకరాదూ?
నా కష్టాన్ని దోచుకొని
నా నెత్తురు తాగుతున్న
ఈ వ్యవస్థను నువ్వు
బాగుచేస్తానంటే…
అలాగే సామీ,
పని చేసుకునే బతుకుతాను
ఏం, పిడికిలి బిగించి తిరగబడొచ్చుగా?
సర్కారోడు నన్ను సెల్లోకి తోసి
కుళ్ళబొడవకుండా
నువ్వు కాపాడతానంటే బాబయ్యా!
తప్పకుండా తిరగబడతాను
సమస్య అందరిదీ కదా,
నువ్వొక్కడివే యెందుకు,
అందరూ కలిసి సంఘటితంగా తిరగబడొచ్చుగా?
అయ్యో , యిది కూడా తెలీదా నాయినా!?
మేం కప్పలం ,
ఎటు పడితే అటు
ఎలా పడితే అలా గెంతుతాం!
మమ్మల్ని కలపాలని చూట్టం
కంఠశోష , వృధా ప్రయాస!
ఆ సంగతి ఆ యేలినోళ్ళకి కూడా తెలుసు
అందుకే ఐదేళ్ళకొక సారి
మాకింత ముష్టెయ్యడమే కాక,
ఏడాదికి పదేసి వేలు
మా ఖాతాలో ఏసేస్తారు.
అలా నోరెల్లబెట్టి సూస్తావేటి సారూ!?
ఒక ఐదో పదో ముష్టెయ్యు!