Home ధారావాహిక నవల జీవన మాధర్యం

జీవన మాధర్యం

by Laxmi Madan

వసంత శ్రీనివాస రావు తో మాట్లాడిన అపర్ణ టిఫిన్ చేయడానికి పెళ్లి పందిట్లోకి వెళుతుంది. పందిట్లోకి వెళ్లిన అపర్ణకి అక్కడి ఫలహారాలను చూస్తే నోరుఊరిపోతోంది.పందిట్లో ఒకపక్కగా చిన్న చిన్న తాటి చాపలు పరిచి, అరటి ఆకులలో ఉపహారం వడ్డిస్తున్నారు. కింద కూర్చొని తినలేని వాళ్లకు టేబుల్స్ పై వడ్డిస్తున్నారు.

చట్నీ పొడితో కలిపిన అటుకుల చుడువా,అందులో వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలు ,పుట్నాలు, కరివేపాకు అన్ని చక్కగా కనిపిస్తున్నాయి .చట్నీ పొడి వాసన కమ్మగా ముక్కుపుటాలకు తగిలింది. తర్వాత విస్తట్లో కొంచెం ఉప్మా తర్వాత కరియలు ,చక్కిలాలు తేనెతెరలు, బూందీలడ్డు ఇవన్నీ వడ్డించారు. ఎక్కడ పెళ్లికి వెళ్లినా ఇడ్లీ ,వడ, దోస లేదా ఉత్తర భారతం నుండి దిగుమతి చేసుకున్న గప్ చుప్ లు, కచోరీలు ఇలాంటి చాట్ ఐటమ్సే కనబడుతున్నాయి. అందుకు భిన్నంగా ఇక్కడ వడ్డించిన పదార్థాలను చూస్తే అపర్ణకు నోరూరిపోయింది. వెళ్లి కింద పరిచిన చాపలో కూర్చుంది. వంట వాళ్ళు, వడ్డించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా వారి దగ్గర బంధువుల అమ్మాయిలు కొంతమంది ప్రేమగా వడ్డనలు చేస్తున్నారు.

లంగా వోణి వేసుకున్న ఒక అమ్మాయి దగ్గరగా వచ్చి “అత్తా! మీకు ఇంకేం కావాలి? ఏంకావాలన్నా నన్ను అడగండి. నేను ఇక్కడే ఉంటాను”‘ అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఈ రోజుల్లో ఆంటీ ,అంకుల్ అని పిలిచే కల్చరే ఉంది కదా !ఇలా’ అత్తా’ అని పిలిచేసరికి ఎంతో ఆనందం అనిపించింది అపర్ణకి. ఆ అమ్మాయిని పరిశీలనగా చూసింది అపర్ణ. చక్కగా జడ కుచ్చులు వేసుకున్న బారు జడ ,మల్లెలు కనకాంబరాలు కలిపి పెట్టుకుని, చెంప స్వరాలను పెట్టుకుంది. ఎర్ర పట్టు లంగాకి ఆకుపచ్చ ఓణీ వేసుకుంది. ఎంతో కళగా ఉన్న ముఖం, అతి తక్కువ మేకప్ వేసుకొని ఎంతో అందంగా కనబడింది.

అపర్ణ నవ్వుతూ ఆ అమ్మాయిని చూసి”అలాగే మొహమాట పడకుండా అడుగుతాను. నీ పేరేంటమ్మా? ఏం చదువుతున్నావ్”? అని అడిగింది.

” నాపేరు మధురిమ అత్తా! నేను మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. వసంత గారి మేనకోడల్ని. మీరు అత్త ఫ్రెండ్ కదా, అందుకే నేను మిమ్మల్ని కూడా అత్తా అని పిలిచాను” అని నవ్వుతూ చెప్పింది.

అపర్ణకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ
కాలం అమ్మాయిలా, ఎంత నిదానంగా ఉంది! మళ్లీ మెడిసిన్ చదువుతుంది. అయినా కూడా ఎంత అణుకువ! ఇలా పనులు చేయాలనే మనస్తత్వం ఉండడం ఎంత మందికి సాధ్యం? ” ఇలా ఆలోచిస్తూ ఒక్కొక్క పదార్థం రుచిని చూస్తుంది.”ఎన్నాళ్ల తర్వాతనో ఇలాంటివి తింటున్నాను. ఇంత అద్భుతమైన వంటకాల రుచిని, ఇలాంటి పెళ్లిని, భర్త పిల్లలు కూడా చూస్తే బాగుండు” అని అనుకుంది. అపర్ణ కూడా తన కూతురు పెళ్లి సంప్రదాయ పద్ధతిలోనే చేసింది. కాకపోతే ఇలా పల్లెటూరులో కాదు. కాబట్టి ఇంత పద్ధతిగా జరగలేదు.

పలహారం చేశాక వాళ్ళు ఇచ్చిన వేడి కాఫీ తాగేసి, పందిరంతా కలయ తిరిగింది.అక్కడ ఉన్న గాడి పోయ్యిలని చూసి, ఆశ్చర్య పోయింది. ఏ కాలం పద్ధతి!అందరూ గ్యాస్ స్టవ్ లను వాడుతున్నారు.ఇంకా ఇక్కడ గాడి పోయే వాడే విధానం చూస్తే సాంప్రదాయానికి ఎంత విలువ ఇచ్చారో అర్థమైంది. పెద్దగా తవ్విన పొయ్యిల చుట్టూ, పచ్చ పిండితో తీర్చిన ముగ్గులు.(పచ్చ పిండి అంటే పసుపు విసిరిన తర్వాత బియ్యాన్ని విసిరుతారు. అప్పుడు వచ్చే పిండిని పందిట్లో ముగ్గు కోసం వాడుతారు.) ఆ పొయ్యిల మీద పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించింది. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకుని చేసే ముందు రోజు, గాడి పొయ్యి తవ్విస్తారు.తర్వాత ఆ ప్రాంతమంతా పేడ నీళ్లు చానిపి( కళ్ళాపి) చల్లించి, చక్కగా పచ్చ పిండితో ముగ్గులు వేస్తారు. పెళ్లికూతురు లేదా పెళ్ళికొడుకుని చేసే రోజు, వారు స్నానం చేసిన తర్వాత, పొయ్యి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, అగ్నిహోత్రుని ప్రార్థించి ,అంతా శుభం జరగాలని కోరుతూ, వండిన వంటకాలను అందరూ సంతృప్తిగా తినాలని, విన్నవించుకుని, ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది కలగకూడదని నమస్కరించేసుకొని, అగ్నిని వెలిగిస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చింది అపర్ణ.

పాతకాలం చతుశ్శాల భవంతి. కొంచెం మార్పులు చేర్పులతో అందంగా చేశారు. ఇల్లంతా బంతిపూల తోరణాలతో అందంగా కనబడుతుంది. ఒక మండువాలో పెళ్లికూతురు కూర్చోవడానికి అలంకరణ చేసి ఉంచారు. అక్కడే అంకురార్పణ కొట్నం జరిగేది.

అదంతా పరిశీలిస్తూ, అక్కడే పరిచిన జంపు కానాలో కూర్చుంది అపర్ణ. ఇంతలో ఆ పక్క సందులో ఏదో కలకలం వినిపించి ఒక్కసారిగా భయంతో అటుగా చూసింది.

ఒక్కసారిగా అందరి దృష్టి వాకిట్లోకి వెళ్ళింది. కుతూహలంతో అందరూ అటువైపే చూసారు. ఊళ్లో పనిచేసుకునే చాకలి, మంగలి, మస్కూరోళ్ళు “శుభకార్యం పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలి.” అని గొడవ చేస్తున్నారు.

“ఇంటి ముందర పచ్చటి పందిరి ఏసింరు.ఎంకటి నుంచి అన్ని పనులు మీ ఇంట్లో మేమే చేస్తున్నాం. గిప్పుడు ఆ మిషన్లు వచ్చినయని మమ్ములను పనిచేయనిస్తలేరు. కటింగులు మాతో చేపించుకుంటలేరు .గాడ అద్దాల షాపులలో చేపించుకుంటున్నారు. ఇగ మస్కూర్ వాళ్లతో పనే పడతలేదు. జెర్రమా మొకాలు చూసి పైసలు ఇయ్యిర్రి” అని గట్టి గట్టిగా అరుస్తున్నారు.

అప్పుడే శ్రీనివాసరావు బయటకు వెళ్లి “మీకు డబ్బులు ఇవ్వకుండానే శుభ కార్యాలు జరిపిస్తామా! ఇంత మంచి శుభకార్యం జరుగుతుంది. గొడవెందుకు చేస్తారు. ‘మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి’ అంటే ఇస్తాను కదా! మంచిగా భోజనాలు చేసి, మల్ల రేపు పెండ్లికిగూడ వచ్చి ,అదో ఏదో అరుసుకొని మంచిగా సంతోషంగా పైసలు తీసుకొని పోండి. అంతేగాని ఇట్లా అల్లరి చేయొద్దు” అని అన్నాడు.

వెంటనే వాళ్లంతా సంతోషంగా…

” అయ్యా నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతావని మేము అనుకోలేదు. ఇంక పక్క సందులో వెంకట్రావు ఇంట్లో పెళ్లి అయితే ,ఒక్క పైస ఇయ్య లేదు గందుకే గిట్లడిగినం .తప్పు పట్టుకోకుండి.మేము వచ్చి అన్ని పనులు చేస్తాం” అని సంతోషంగా పందిట్లోకి వెళ్లిపోయారు.

ఇదంతా చూస్తున్న అపర్ణ అనుకుంది “ఊళ్ళల్లో ఇలాంటి ఆచారాలు ఇంకా ఉన్నాయా?” అని. “అయినా మన మాట మంచిదైతే అన్నీ మంచిగానే ఉంటాయి. ఎందుకంటే శ్రీనివాస్ మాట్లాడిన తీరుతో వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు. అందుకే సంతోషంగా వాళ్లు పని కూడా సహాయం చేస్తానని చెప్పారు” అని అనుకుంది.

కొట్నం దగ్గర పంతులుగారు ఏమున్నాయో! ఏం అవసరమో! చూసుకుంటున్నారు.

” వసంతా! ఇక్కడ తమలపాకులు ,వక్కలు రాలేదమ్మా! ఇసుర్రాయి, రోకండ్లు ,కుందెన సున్నం జాజుతో పూదించారా? ఐదు సేర్ల బియ్యం తలంబ్రాల కోసం కావాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి .ఎండు కొబ్బరి కుడుకలు, పూలు, రెండు పంచ పాత్రలు ఉద్ధరణలు అన్ని సిద్ధం చేసి పెట్టండి? తొందరగా కానీ ముహూర్తానికి లేట్ అవుతుంది” అని పురమాయిస్తున్నాడు.

అతన్ని చూసి ” ఎక్కడో చూసినట్లు ఉంది ఈయనని, ఎవరై ఉంటారు?” అని అనుకున్నది అపర్ణ.

వెంటనే గుర్తొచ్చింది అతను తనతోనే చదువుకున్న శంకర శర్మ అని.

“శంకర్ గారు! బాగున్నారా? ఎన్ని రోజులకు మిమ్మల్ని చూశాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అపర్ణ.

అతను అపర్ణని తేరిపారా చూసాడు.

” అమ్మా! నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎక్కడైనా పెళ్లిలో చూసి ఉంటానా! మీరే చెప్పండి తల్లి! ” అన్నాడు.

గట్టిగా నవ్వేసింది అపర్ణ.

” ఎక్కడైనా పెళ్లిలో చూసారా? అయ్యో నేను మీతో చదువుకున్న అపర్ణని. మీరు, నేను, వసంత అందరము ఒకటే క్లాసులో ఉన్నాము” అని అన్నది.

వెంటనే శంకర్ శర్మ కూడా నవ్వేసి..

” అపర్ణ గారా! గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు మీ మొహం చూస్తే గుర్తొచ్చింది .బాగా చదువుకునే వారు. అప్పుడు అల్లరి కూడా ఎక్కువే చేసేవారు. నాకు అంతా గుర్తొచ్చింది. మీరు వసంత గారు, మరొక అమ్మాయి మీతో ఉండేది. పేరు గుర్తు రావడం లేదు” అన్నాడు శంకర శర్మ.

“ఆహా! అన్ని గుర్తున్నాయి మీకు. అయినా ఈ గారు అని పిలవడం ఏంటి? మనమంతా ఒకటే తరగతి కదా! చక్కగా పేరుతో పిలవండి” అన్నది అపర్ణ.

ఇంతలో వసంత బయటకు వచ్చింది. వీళ్ళిద్దరినీ చూసి ” పరిచయాలు పూర్తయ్యాయా ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారా! నేనే వచ్చి చెబుదాము అనుకున్న.మీరే మాట్లాడుతూ కనిపించారు” అన్నది.

“అవునే, ముందుగా నేనే గుర్తుపట్టాను .ఇంకా మన ఫ్రెండ్స్ ఎంతమంది నీకు తెలుసు వాళ్ళ అడ్రస్ అందరివి ఉన్నాయా? ఒకసారి అందరం కలుసుకుందాం” అన్నది అపర్ణ.

“తెలుసుకోవడం ఎంతసేపు లేవే! పెళ్లయ్యాక వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముహూర్తం టైం అవుతుంది” అని చెప్పి కొట్నంకు అవసరం ఉన్న సామాన్లన్నీ తెప్పించి పెట్టింది.

కొట్నం మంటే ఒక మంచి రోజు పెళ్ళికొడుకుని లేదా పెళ్ళికూతురు చేసేముందు, అన్నిటికీ శుభ సూచకమైన పసుపుతో మొదలుపెడతారు. అదే రోజు అంకురార్పణ కూడా చేస్తారు.

ముందుగా పెళ్లికూతురు లేదా పెళ్ళికొడుకు వారి తల్లిదండ్రులు స్నానం చేసి కొత్త వస్త్రములు కట్టుకొని పీటల మీద కూర్చున్నప్పుడు, పురోహితుడు వారి చేతికి కంకణాలు కట్టించి, వారితో గౌరీ పూజ, గణపతి పూజ చేయించి తర్వాత ముత్తైదువలందరినీ పిలిపించి, రోకళ్ళతో పసుపు కొమ్ములను దంచమంటారు .అలా అందరూ పసుపు దంచుతూ పాటలు పాడుతారు. తర్వాత ఆ దంచిన పసుపును మళ్లీ విసుర్రాయిలో వేసి, విసురుతారు. తర్వాత తీసి తలంబ్రాల బియ్యం లో కలుపుతారు కలుపుతారు.

“పెళ్లికూతురుని తీసుకురండి “అన్న పురోహితుని మాటతో వసంత కూతురిని ముత్తైదువలు బయటకు తీసుకొని వచ్చారు.

అపర్ణ పెళ్లికూతురుని అలా అపురూపంగా చూస్తూనే ఉంది.

వసంత కూతురు శ్రీవల్లి చెప్పలేనంత అందంగా ఉంది. అందులో సాంప్రదాయమైన దుస్తులు ధరించడం వల్ల, అందం ఇంకా రెట్టింపు అయ్యింది. చిలకపచ్చ రంగు పట్టు చీరకు, ఎర్రని అంచు ఉన్న పట్టు చీర ధరించింది. వెంట్రుకలు చాలా బాగా ఉన్నందువల్ల చక్కని వాలు జడ వేసుకుంది. చిన్న కనకాంబరం దండం మాత్రం పెట్టుకుంది. చెవులకు జుంకాలు, చేతినిండా వేసుకున్న గాజులు, నడుముకు చిన్న వడ్డాణం, తిలకంతో పెట్టుకున్న ఎర్రబొట్టు చక్కగా మెరుస్తుంది. కాళ్లకు పెట్టుకున్న వెండి పట్టా గొలుసులు ఘల్లు ఘల్లు మంటుంటే, చిరునవ్వుతో నడుస్తూ బయటకు వచ్చింది.

అపర్ణకి ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంతో నచ్చేసింది. తన వంక చూసిన శ్రీవల్లిని చిరునవ్వుతో పలకరించింది అపర్ణ.

” నమస్తే అత్త” అని రెండు చేతులు జోడించింది.

” ఈ రోజుల్లో ఇంత సంస్కారంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారా? చక్కగా ఉంది అమ్మాయి. వసంత పెంపకం మంచిదే” అనుకుంది అపర్ణ.

అప్పటికే పీటల మీద ఆసీనులైన శ్రీనివాసరావు, వసంతల మధ్యలో వేసిన చౌకీపీట మీద వెళ్లి కూర్చుంది శ్రీవల్లి. శంకర్ శర్మ పూజ ఆరంభించారు. ముందుగా గౌరీ పూజ, గణపతి పూజ చేయించి, పసుపు దంచే కార్యక్రమం చేశారు.

ఒక్కొక్కరుగా ముత్తైదులు అందరూ వచ్చి, పసుపు దంచి, విసురాయిలో వేసి విసిరి, తర్వాత కుందనలో వేసి దంచి ,అందులోనే తలంబ్రాల బియ్యం పోశారు .అందరూ కలిసి పాటలు పాడుతూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు.

తర్వాత ఇంటి ఆడపడుచులు వచ్చి, రోకలితో పసుపు తీసుకొని, పెళ్లికూతురు భుజాల మీద, తల మీద తర్వాత పెళ్లికూతురు తల్లిదండ్రుల తలమీద, భుజాల మీద వేశారు. తర్వాత తలకు నూనెతో అద్ది, హారతి ఇచ్చి మంగళ స్నానాలకు వెళ్లి రమ్మని చెప్పాడు శంకరశర్మ.

వారి స్నానాలు చేసి వచ్చే లోపల ,అంకురార్పణకి మట్టి కంచుళ్ళలో ఇసుకను నింపి ,వాటి చుట్టూ దారంతో ఒక పద్ధతి ప్రకారం చుట్టేసి, నవధాన్యాలను సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నాడు శంకరశర్మ.

వచ్చే బంధువులు వస్తూనే ఉన్నారు. పలహారాలు ముగించుకొని వచ్చి, భవంతిలో కూర్చుని జరిగే తంతును చూస్తున్నారు. చాలా రోజులకు కలుసుకున్న బంధువులందరూ ఎన్నో కష్టసుఖాలు పంచుకుంటూ, సంతోషంగా ఉన్నారు .చిన్న పిల్లలు ఆటలాడుకుంటున్నారు. యుక్త వయసులో ఉన్న పిల్లలు, వారి కాలేజీ ముచ్చట్లు ,కాలేజీలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ,వారు ఎవరెవరితో స్నేహం చేశారు. ఆ సంఘటనలు చెప్పుకొని నవ్వుకుంటున్నారు.

మొత్తం మీద పెళ్లి ఇల్లు హడావుడిగా, సందడిగా నిండుగా కళకళలాడుతూ ఉంది. ఇంటి ముందు వేసిన పందిరిలో ఐదు రకాల ఆకులు తప్పకుండా ఉండాలి. మామిడి, జువ్వి, మేడి, రావి, కానుగ. ఆ చెట్ల చిగుళ్ళు మళ్లీ పూజలో కూడా అవసరం పడతాయి .వాటిని ‘పంచ పల్లవాలు’ అంటారు. శుద్ధి కొరకు గంగాజలం, ఆవు పంచకం, గోమయం ,గోక్షీరం ఇవన్నీ ఉపయోగిస్తారు. ఎంత సాంకేతిక నైపుణ్యం వచ్చినప్పటికీ, ఈపద్ధతులు చాలా మంచివని నిరూపణ జరిగింది. గోవు పవిత్రతకే కాదు, పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే గోమాతని పూజించాలి.

వారు స్నానాలు చేసి, రావడానికి కొంచెం వెసులుబాటు ఉండటం వల్ల, బయటకు వచ్చింది అపర్ణ. ఇంటి ముందు వాకిట్లో వేసిన కుర్చీలో కూర్చుంది అపర్ణ. ఇంతలో డెబ్బై ఐదు ఏళ్లు ఉంటాయేమో !ఒక ఆడ మనిషి వస్తూ కనిపించింది. కొంచెం వయసు ఎక్కువగా ఉండటం తప్ప, మనిషి చాలా చక్కగా ఉంది. మెల్లగా లోపలికి నడుచుకుంటూ వస్తుంది. ఆమె చేతిలో అరిటాకుల కట్ట ఉంది. అది పట్టుకుని మెల్లగా వస్తుంది. ఆమెను గుర్తుపట్టిన అపర్ణ ఒక్కసారి ఆనందంతో” బూమవ్వా! ” అని పిలిచింది.

ఇటువైపు చూసిన భూమవ్వకి, అపర్ణ కల్పించింది. కానీ గుర్తుపట్టలేకపోయింది.

” అమ్మ ఎవరో యాదికొస్తలేదు! ” అన్నది.

” నేను అపర్ణను” అని నేను ఫలానా వారి అమ్మాయిని. నువ్వు చిన్నప్పుడు నన్ను ఎత్తుకునే దానివి. మా ఇంట్లోనే ఎక్కువగా ఉండే దానివి” అని గుర్తు చేసింది.

” నువ్వా ! అప్పు తల్లి! ఎన్నేండ్లయింది?.గప్పుడు పెండ్లిల జుషిన.బాగున్నవా!.పిల్లలు ఎంత మంది?” అని దగ్గర కూర్చొని ప్రశ్నల వర్షం కురిపించింది.

ఎదురుగా కనబడిన మనుషులు చూసి ఆశ్చర్యపడింది. అతను ఎవరో కాదు రామాలయంలో పూజ చేసే పూజారి. వయసు పైబడి నడవలేక నడుస్తూ బసు కోసం అనుకుంటా ముందుకు వస్తున్నాడు.

అపర్ణ వెళ్లి పలకరించింది.

పెద్దనాన్న బాగున్నారా”అన్నది అపర్ణ.

ఎవరు తల్లి, నాకు చూపు అనడం లేదు గుర్తుపట్టలేకపోతున్నాను” అన్నాడు వణుకుతున్న శరీరంతో.

నేను దక్షిణామూర్తి గారి అమ్మాయిని. నా పేరు అపర్ణ .చిన్నప్పుడు మీ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్లే వాళ్ళం గుర్తొచ్చిందా? పెదనాన్న”అని చెప్పింది అపర్ణ.

గుర్తుపట్టినట్లు తలాడించాడు పూజారి గారు. బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టి

ఇది ఉంచండి” అన్నది అపర్ణ.

ఎందుకు బిడ్డ, నాకు డబ్బులు అవసరం ఉన్నవని నీకు అర్థం అయ్యిందా”అన్నాడు నవ్వుతూ.

బస్సు వచ్చింది నేను వెళ్తాను బిడ్డ. వెళ్లే లోపల మా ఇంటికి రా?”అని చెప్పి కర్ర సహాయంతో ముందుకు వెళ్లిపోయారు పూజారి గారు.

ఒక్క నిట్టూర్పు వదిలింది అపర్ణ .”రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అర్థం కావడం లేదు. పూజారి పెద్దనాన్న గుడిలో అలంకరించిన తీరు చూస్తే ఎంతో బాగుండేది. ఏంటో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు” అని బాధపడింది.

 తన స్నేహితురాలు వసంతకు ఫోన్ చేసింది..

వసంతా! నేను మన ఊర్లో బస్సు దిగాను. మీ ఇల్లు ఎటువైపు ?చెబితే నేను వచ్చేస్తాను” అని చెప్పింది.

వచ్చేసావా?కాస్త ముందే ఫోన్ చేయకూడదా? కార్ పంపిస్తాను, ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. మన ఊరు నువ్వు చూసినప్పటిలా లేదులే. చాలా మారిపోయింది. నువ్వు మా ఇల్లును గుర్తుపట్టలేవు.అక్కడే ఉండు ” అని చెప్పింది వసంత.

సరే” అని అక్కడ బెంచ్ మీద కూర్చుంది అపర్ణ.

బెంచ్ మీద తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు.తెల్ల పంచె ,లాల్చీ వేసుకుని ఉన్నాడు. మనిషి బాగా ఎత్తుగా తెల్లగా ఉన్నాడు. వయసు దాదాపు 75 ఏళ్లు ఉంటుందేమో!

 “ఎక్కడో చూశాను ఇతన్ని అని అనుకొని

అయ్యో ఈయన డ్రాయింగ్ మాస్టారు ఆనందం సార్ కదా” అని అనుకొని,

నమస్తే సార్ బాగున్నారా!” అని అడిగింది అపర్ణ.

బాగున్ననమ్మా ! కానీ, నువ్వు ఎవరో నేను గుర్తు పట్టలేదమ్మ! ఏమీ అనుకోవద్దు .వృద్ధాప్యం కదా! కళ్ళు కాస్త మసకబారాయి” అని అన్నాడు అతను.

నేను మీస్టూడెంట్ ను సార్, నాపేరు అపర్ణ.నేను క్లాస్ లో ఎప్పుడైనా మీరు ఇచ్చిన చిత్రాన్ని అచ్చంగా అలాగే వేస్తే, ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఆడ్రాయింగ్ పైన మీరు పెట్టే సంతకంతో పాటు ‘ గుడ్ ‘ అని పెట్టించుకోవాలని క్లాస్ అంతా ప్రయత్నించేవాళ్ళు. అందులో నేను ఒక దాన్ని.ఎన్నోసార్లు నన్ను మెచ్చు కున్నారు .” అని చెప్పింది అపర్ణ.

ఆనందం సారు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా తలపైకెత్తి,

ఆ !గుర్తొచ్చింది. తరగతిలో అల్లరి కూడా బాగా చేసే దానివి. చాలా సంతోషం తల్లి, నన్ను గుర్తుపట్టి మాట్లాడించినందుకు. ఎక్కడ ఉంటున్నావ్ ?ఏం చేస్తున్నావు? భర్త పిల్లలు అందరూ కులాసానా?” అని అడిగాడు సార్.

అన్ని వివరంగా చెప్తాను సార్ .మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మీఇంటి అడ్రస్ చేప్తే వస్తాను. నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటాను. మీఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అన్ని వివరాలు చెప్తాను” అని అన్నది అపర్ణ.

ఆనందం సార్ తన ఇంటి అడ్రస్ చెప్పి ,తను వెళ్లాల్సిన బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు.

అపర్ణ తన స్నేహితురాలు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి చేరుకుంది. దారిలో ఊరంతా చూస్తుంది. తన పుట్టి పెరిగిన ఊరుకు, ఇప్పటి ఊరుకు పోలికే లేదు. అంతా పట్టణ వాతావరణం లాగే ఉంది.

వసంత చెప్పినట్లు నేను ఒక్కదాన్ని వెళ్లడం కష్టమే” అని అనుకున్నది. ఇంతలో కారు ఇంటి ముందు ఆగింది .

కారు దిగి దిగగానే ఎదురుగా స్నేహితురాలు వచ్చేసింది.ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు వాట్సాప్ లో పంపించుకోవడం వల్ల గుర్తుపట్టుకోగలిగారు. లేకపోతే పూర్తిగా మారిపోయిన వాళ్ళ రూపాలను గుర్తుపట్టుకునే వాళ్ళు కాదు.ఎంతో లావుగా అయిన వసంతను చూసి,

ఏంటే ఇంత మారిపోయావు,?” అని దగ్గరకు తీసుకుంది అపర్ణ.

అవునే చాలా మారిపోయాను. బాగా ఒళ్లు వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా తిడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కాస్త డైట్ చూ సుకో అని ” అని నవ్వుతూ అపర్ణను చేతులతో పట్టుకుంది.

కానీ, నువ్వు మాత్రం ఏమీ మారలేదు అప్పూ! అలాగే ఉన్నావ్. చీర కట్టులో బాగున్నావు. అందమైన జడ ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా! ” అన్నది వసంత.

ఇంట్లోకి రానిస్తావా? లేక ముచ్చట్లతోనే కడుపు నింపుతావా? నిన్నటి నుండి ప్రయాణం చేసీ చాలా అలసిపోయాను” అన్నది అపర్ణ.

అయ్యో! నిన్ను చూసిన సంతోషంలో ఆవిషయమే మర్చిపోయానే! పద పద లోపలికి వెళదాము. నీకు గది ఏర్పాటు చేశాను. స్నానం చేసి టిఫిన్ చేసి అలసట తీరేవరకు పడుకో” అని చెప్పి స్నేహితురాలిని లోపలికి తీసుకెళ్ళింది వసంత.

ఇల్లంతా పెళ్లి సందడిగా ఉంది. పూల తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది. చక్కని పరిమళాలు వెదజల్లుతుంది . ఒక్కసారి అలసట అంతా మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది తెలిసిన బంధువులను పలకరిస్తూ గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ.

      తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిన అపర్ణకు, ఆగదిలోని  అమరిక ఎంతగానో నచ్చింది. గది వసంత వాళ్ళ తల్లి తండ్రులదట. వసంత అత్తగారు కూడా  ఒకటే ఊరు కావడం వల్ల ఇంచుమించు అందరూ కలిసే ఉంటారు. అందులో వసంత అత్తగారు వాళ్ళు  మేనరికం. వసంత  ఒకతే అమ్మాయి. అందుకని తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారు. గదిలోని సామాను చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. పాత కాలపు పందిరి మంచం , డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని చెక్క బొమ్మలు. ఇలా ఎంతో బాగుంది.మరో పక్క చిన్న దివాన్.అది తనకోసం కావొచ్చు అనుకున్నది.ఇల్లంతా మార్పులు చేసినా, గది అలాగే ఉండాలని వాళ్ళ కోరికట.గదిలో గంధపు పరిమళం వస్తుంది. దేవుడి పటానికి గంధపు పూమాల వేశారు.

అపర్ణ తన సూట్ కేస్ తెరచి, అందులో నుండి టవల్, సబ్బు,షాంపూ ,కట్టుకునే చీర బయటకు తీసి,సూట్ కేస్ మూసి, ఒక పక్కగా పెట్టింది.బాత్రూమ్

లోకి వెళ్లి హాయిగా నీళ్లు ఒంటి మీద పోసుకుంటే, బడలిక తీరినట్లు అనిపించింది. ఇంతలో బయట నుండి వసంత పిలుపు వినిపించింది.

అప్పూ! కుంకుడు కాయ రసం బాత్ రూం లో పెట్టించాను.నీకు నచ్చితే చెయ్యి,లేదా షాంపూ కూడా అక్కడే ఉంది ” అని చెప్పింది .

ఓహ్! అవునా! ఎన్నాళ్ళయింది కుంకుడుకాయ రసంతో స్నానం చేసి.సరెనే ! ” అని చెప్పి చక్కగా కుంకుడు రసంతో తలస్నానం చేసి ,సున్నిపిండితో స్నానం చేసి బయటకు వచ్చి,తలకి చిన్న పంచె కట్టుకుని ,తనకి ఎంతో ఇష్టమైన పింక్ చీర కట్టుకుంది.లైట్ గా  మేకప్ చేసుకుని, కొంచెం పెద్ద బొట్టుపెట్టుకుని,ముత్యాల దండ మెడలో వేసుకుని తనని తాను చూసుకుంది.వెంటనే భర్త గుర్తొచ్చి ఒక సెల్ఫి తీసుకుని పంపించింది.

తర్వాత తలని తుడుచుకుని, జుట్టు వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుని బయటకు వచ్చింది.అపర్ణని చూసిన వసంత

భలే అందంగా ఉన్నావే” అని పిలిచి అందరికీ పరిచయం చేసింది.

అపర్ణ కూడా అదే ఊరు కావడం వల్ల తనకు చాలామంది తెలిసినవాళ్లే.

అలా అందరితో మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో అందరిని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుపులు వచ్చాయి. పెళ్ళంతా సాంప్రదాయంగానే ఉండాలని ఏర్పాటు చేసింది వసంత. ఆకాలపు ఉపహారాలు, భోజనాలు ఇంటి వెనక పెరట్లో తడికల పందిళ్లు, పచ్చని విస్తారాకులలో భోజనాలు. కింద కూర్చొని తినగలిగే వాళ్ళకి చాపలు పరిచారు. కింద తినలేని వాళ్ళకి వరుసగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. తడికల పందిరిలోకి వెళ్ళగానే ఎంతో సంతోషం అనిపించింది అపర్ణకు . తన పెళ్లి జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఇంకా అదే విధంగా ప్లాన్ చేసుకున్న వసంతను మనసులోనే అభినందించింది.

వసూ! ఎంత బాగా ఏర్పాట్లు చేసావే, ఇంతకీ ఆలోచన నీదా ?మీ ఆయనదా?” అని అడిగింది.

ఏం? నాకు అలాంటి ఆలోచనలు రావు అనుకున్నావా?. నిజం చెప్పాలంటే మా ఆయనదే” అని చెప్పి పక్కకు తిరిగినంతలో వసంత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు వస్తూ కనిపించాడు.

అదిగో మాటల్లో వచ్చారు మాశ్రీవారు” అని అపర్ణ వైపు చూసి,

మాఆయన శ్రీనివాస రావు, ఇదేమో నా ఫ్రెండ్ అపర్ణ” అని పరిచయం చేసింది.

పరస్పర పరిచయాలు అయ్యాక..

రండి అపర్ణ గారూ!టిఫిన్ చెయ్యండి ” అన్నాడు శ్రీనివాస రావు.

అందరం కలిసి తిందాం మీరూ రండి ” అని వసంత వైపు చూసింది అపర్ణ.

మేము ఇప్పుడు ఏమీ తినకూడదు.రోజు అమ్మాయిని పెళ్లి కూతురును చేస్తున్నారు కదా!అంకురార్పణ,ఇంకా కొట్నం ఉంటుంది “అని చెప్పింది.

అవును మరచే పోయాను.సరే, నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను. ఏదైనా సహాయం చేస్తాను తిన్నాక ” అని చెప్పి అపర్ణ పందిట్లో కి వెళ్ళింది .

పందిట్లోకి వెక్కిన అపర్ణ వాతావరణం చూసి మై మరచి పోయింది.

సశేషం

You may also like

Leave a Comment