Home వ్యాసాలు నచికేతుడు

నచికేతుడు

by ఆచార్య మస‌న‌

నచికేతుడు ఉపనిషత్ వాఙ్మయాకాశంలో వెలుగొందే ధ్రువతార. అతని చరిత్ర కఠోపనిషత్తుతో చోటు చేసుకున్నది.

నచికేతుడు ఉద్దాలకుని కుమారుడు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనగలవాడు. ఎలాంటివారినైనా, ఎలాంటి ప్రశ్ననైనా  వేసి సమాధానం పొందగలడు. అలాంటివాణ్ణి మనం వాఙ్మయంలో చాలా తక్కువగా చూస్తాం.

ఉద్దాలకుడు యశస్సుతోపాటు మోక్షాన్ని కోరి, ‘విశ్వజిత్తు’ అనే పేరు గల యజ్ఞాన్ని నిర్వహించాడు. సంపూర్ణంగా తన సంపదను అర్థులకు దానం చేశాడు. ఉద్దాలకుడు దానం చేసిన వాటిలో గోవులు కూడా ఉన్నాయి. అవి గడ్డి వేయలేనివి. నీళ్లు తాగలేనివి. పాలీయలేనివి. సంతానోత్పత్తికి పనికిరానివి. అటువంటి గోవులను దానంగా ఇస్తుంటే నచికేతుడు చూశాడు. దానంవల్ల కలిగే పుణ్యం కంటె ఉపయోగానికి రాని గోవులను దానం చేయడం వల్ల తన తండ్రికి పుణ్యానికి బదులు పాపమే వస్తుందని భయపడ్డాడు నచికేతుడు. అందుకే నిర్భయంగా ‘నాన్నా నన్నెవరికిస్తావు’ అని అడిగాడు. ఉద్దాలకుడు పరధ్యానంలో ఉండడంవల్ల పుత్రుని మాటలు వినలేదు. దానితో నచికేతుడు మరో రెండుసార్లడిగాడు. చివరి మాటకు స్పందించిన తండ్రి తన పనికి కుమారుడడ్డుతగులుతున్నాడని భావించి ‘నిన్ను మృత్యువు కిస్తున్నాను’ అన్నాడు.

‘మృత్యువు’ అంటే భయపడవలసిన పనిలేదు. ‘ఆచార్య మృత్యుః’ అని అధర్వణ వేదం చెబుతుంది. మృత్యువుకిస్తున్నావని తండ్రి పలికిన మాటలకు నచికేతుడు తనను గురువు కర్పిస్తున్నట్లు గ్రహించాడు.

తండ్రి మాటలకు నచికేతుడు బెదరలేదు. చకితుడుకానివాడే నచికేతుడు. కాని తెలివిగల్గినవాడు కనుక ఆలోచనలో పడ్డాడు. అతనంతకుపూర్వమే సమీప పాఠశాలలో చదివి ఉన్నాడు కనుక, చాలామంది విద్యార్థులలో తమ ఉత్తమ శ్రేణికి చెందిన విద్యార్థిగా ఉన్నాననే నమ్మకం ఉంది. తండ్రికి కూడా తాను తెలివిలేని బాలుడనే భావన లేదు. ఐనా తండ్రి గురువు దగ్గరికి పంపుతున్నాడంటే, అందులో ఏదో ప్రయోజనముందని గ్రహించాడు నచికేతుడు. అందుకే మృత్యువనే పేరు గల యమాచార్యుని ఆశ్రమానికి బయల్దేరాడు. తీరా గురుకులానికి వస్తే అక్కడ ఆచార్యుడు లేడు. అతడు మూడు రోజుల తర్వాత వచ్చాడు ఆశ్రమానికి. అప్పటి దాకా నచికేతుడు పచ్చినీళ్ళు కూడా ముట్టలేదు. పస్తులున్నాడు!

ఆశ్రమవాసుల ద్వారా నచికేతుని గూర్చి తెలుసుకున్న ఆచార్యుడు అతనిలో ‘ఓ జ్ఞానీ, నీవు మా అతిథివి. అయినా మూడు రోజులు ఉపవాసమున్నావు. అందుకు నన్ను క్షమించు. దినానికొకటి చొప్పున మూడు వరాలు కోరుకో అని’ సెలవిచ్చాడు.

తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి కోపపడకుండా ఉండేలా వరమిమ్మని మొదటి కోరిక కోరినాడు నచికేతుడు. ఆచార్యుడు ‘సరే’ అన్నాడు. స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను బోధించమని నచికేతుడు రెండవ వరాన్ని కోరగా ఆచార్యుడు దానికి అంగీకరించాడు.

మూడు ఆశ్రమాలలో చేసే అగ్నిహోత్రానికే అగ్ని విద్య అని పేరు. ఎవరైతే జీవో కాలంలో తప్పకుండా యజ్ఞ దీక్షను పొంది క్రమం తప్పకుండా అగ్ని విద్యనుపాసిస్తారో వారికి స్వర్గప్రాప్తి అనగా మరుసటి జన్మలో అత్యంత సుఖం కల్గుతుంది. ఇదే అగ్ని విద్య రహస్యం!

రెండు వరాలిచ్చిన ఆచార్యుడు మూడవ వరాన్ని కోరుకొమ్మని నచికేతుడు ప్రోత్సహించినాడు.

‘మనిషి చనిపోయిన తర్వాత అతడు ఉంటాడా? ఉండడా? ఈ సందేహాన్ని తీర్చిండి. ఇదే నా మూడవ తరం’ అన్నాడు నచికేతుడు.

నచికేతుడు కోరుకున్న మూడు వరాల్లో మొదటిది మనుజులోకానికి సంబంధించింది. రెండవ వరం పునర్జన్మకు సంబంధించింది. కాగా, ఈ మూడవ వరం పూర్తిగా ఆత్మకు సంబంధించింది.

“చనిపోయిన తర్వాత ఆత్మ ఉండదా? ఉండదా అనే విషయం సామాన్యులకర్థం కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు బదులు మరొక వరాన్ని కోరుకో” అని ఆచార్యుడు తెలియజేశాడు. సామాన్యులకర్థం కాని విషయం ఆచార్యుని కంటె మరెవ్వరూ చెప్పలేరని నచికేతుడు పట్టుబట్టాడు. “ఇంత కఠినమైన విషయాన్ని మీరు దప్ప మరొకరు చెప్పలేనప్పుడు, ఇతరులను అడగడంవల్ల ప్రయోజనం ఉండదు. దయచేసి ఆత్మ అస్తిత్వాన్ని తెలియజేయండి” అని ప్రార్థించాడు.

ఆచార్యుడతనికితరమైన వరాలు కోరుకొమ్మని ఆశ చూపాడు. కాని అతడేమాత్రం వెనుకంజ వేయలేదు. తన సందేహాన్ని తీర్చవలసిందేనని అంతవరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టవని భీష్మించుకొని కూర్చున్నాడు. ఆ ఆచార్యుని దర్శనం చేతనే అన్ని సంపదలు లభిస్తాయని, కనుక కోరదగిన సంపద లేవీ లేవని, ఆత్మజ్ఞానం అనే సఁపదనే అనుగ్రహించమని కోరిన నచికేతుడు సామాన్యుడు కాడని చెప్పవచ్చు.

యమాచార్యుడు చేసిన ఉపదేశం ఇలా ఉంది. “ఓ నచికేతా! లోకంలో మనిషి నడుచుకునే మార్గాలు రెండున్నాయి. ఒకటి శ్రేయోమార్గం, రెండవది ప్రేయోమర్గం. సామాన్యులకు వీటి భేదం తెలియదు. సాంసారిక సుఖానుభవమే ప్రేమోమార్గం. ఆధ్యాత్మిక సుఖానుభవమే శ్రేయోమార్గం. ప్రేయోమార్గంలో వెళ్ళినవారికి పునర్జన్మ ఉంటుంది. శ్రేయోమార్గంలో వెళ్లినవారికి మోక్షం లభిస్తుంది. ఐతే ఏ మార్గంలో ప్రయాణిఁచినా దేహమే నశిస్తుంది కాని ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మజ్ఞానమే పరమాత్మ సాక్షాత్కారానికి కారమవుతుంది. పరమాత్మ ఓంకారవాచ్యుడు. అతడు పరమాణువులకంటే, జీవాత్మ కంటే సూక్ష్మమైనవాడు. అతడు లేని చోటు లేదు. అతడు మన హృదయకమలంలోను ఉన్నాడు కనుక, మనం అతన్ని అక్కడే ధ్యానించాలి. శరీరం రథం లాంటిది. జీవాత్మ రథస్వామి. బుద్ధి సారథి. మనస్సనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టుకోవాలి. జీవుడు మట్టి నుంచి పుట్టిన కుండ లాంటివాడు కాడు. అతడు శాశ్వతుడు. ఐతే కర్మవశాన అతడు ఒక శరీరం నుండి మరొక శరీరం లోనికి ప్రయాణిస్తుంటాడు. అతడొక విధంగా ఈ శరీరానికి అతిథి. కర్మఫలాలు తీరగానే శరీరాన్ని విడిచిపెడతాడు. అంతేకాని జీవునికి చావులేదు. శరీరం నశించినా జీవుడు మాత్రం నశించడు. ఇదే నీవడిగిన మూడవ వరం”.

యమాచార్యుడు నచికేతుకీ విధంగా ఆత్మశాశ్వతమైందని, కర్మవశాన జన్మలెత్తుతుందని, పరమాత్మ మాత్రం జన్మలెత్తడని, అతనికి కర్మలుగాని, కర్మవాసనలుగాని అంటవని చెప్పగా అతడు సంతోషాంతరంగుడయ్యాడు. చిన్నవాడైనప్పటికీ, బ్రహ్మజ్ఞానంలో అతని ముఖం ఎంతో ప్రకాశమానమైంది.

కఠోపనిషత్తులోని నచికేతునికి యుద్ధ సమయంలో విషాద యోగంలో మునిగిన అర్జునునికి తేడా ఏమీ లేదు. యమాచార్యుని స్థానంలో శ్రీ కృష్ణుడన్నాడు. అటు యమాచార్యుడు, ఇటు కృష్ణుడు చేసిన ఆత్మబోధ సమానమే. అందుకే కఠోపనిషత్తు ప్రభావం భగవద్గీత మీద ఉందని విద్వాంసుల అభిప్రాయం.

You may also like

Leave a Comment