మనుషులందున కొందర్ని మార్చవచ్చు ననుచు కొత్తగ జెప్పంగ నవ్యభావ జాలముల చేత నొప్పంగ జనము చదువు… అనే ఒక నవీనమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఈ శతకాన్ని రాశారు వేణుశ్రీగారు. వేణుశ్రీ తెలుగులో సుమారు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న కవి. ఆధునిక అభ్యుదయ భావాలు కలిగిన కవిగా స్వేచ్ఛ కవిగా సుప్రసిద్ధులు. తొలిదశలో వచన కవిత్వం ఎక్కువగా రాశారు. కాని, ఆయన తండ్రిగారు శ్రీ సుదర్శనం హనుమాండ్లు గారు మంచి తెలుగు పండితులు. వారి శిక్షణలోను వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలోను తెలుగు వ్యాకరణ ఛందో2లంకారాది శాస్త్రాలు చదువుకున్నారు.
వాటి పట్ల మంచి అభినివేశం ఉంది. పద్యాలు, ఛందస్సు అంటే ఇష్టం. విషయం కొత్తగా ఉండాలి పద్ధతి పాతదైనా మంచిదైతే పలువురి చేత ఆదరింపబడేదైతే అది పాటించడంలో తప్పులేదని తన అభిప్రాయం. అందుకే పద్యాలలో నేటి భావాలెందుకు అనే విమర్శ రాకుండా మొదటి పద్యంలోనే తిన్న అన్నమే తింటున్నట్లు చెప్పిన మాటలే కావచ్చు కొన్ని చెప్పిన పద్ధతి కూడా కావచ్చు కాని పలుమార్లు పిల్లలకు బుజ్జగించి తల్లి తినిపించడం వల్ల వారికి ఆరోగ్యం పుష్టి కలిగినట్లు పాఠకులకు పదే పదే మంచి పద్ధతిలో చెపితే ప్రయోజనం ఉండకపోతుందా అనే ఆశయాన్ని వ్యక్తం చేశారు.
కవిత్వం కవిత్వం కోసం కాక సమాజం కోసం ముఖ్యంగా రేపటి తరం కోసం అందించాలని ఆరాటం. అందుకే గతంలో వరేణ్య, ఓ ప్రచేతసా! పేర్లతో పద్యశతకాలు వెలువరించారు. ఆ రెండు పేర్లు తమ మనుమలవి. ఈ కైరవ కూడా మరో మనుమడు. అయితే మనుమని తరానికి చెందిన పిల్లలందరికీ ఈ పద్యాలలోని విషయాలు కొంతయినా సామాజిక జ్ఞానాన్ని కలిస్తాయని. జీవితంలో ఆలోచించడానికి తోడ్పడతాయని తన సంకల్పం. ఎవరినో ఉద్దేశించడానికి బదులు తన యింట తన మనుమలను ఉద్దేశించి చెప్పినవి తన వారికి తనవారి తోటివారికి కూడా ఉపయోగ పడతాయని ఈ మకుటాలను పెట్టుకున్నారు.
ఈ శతకంలో సామాజిక విషయాలు, ప్రత్యక్షంగా ఇప్పుడున్న మనుషుల ప్రవర్తనలు, రాజకీయాలు, అనేక విధాల మనస్తత్వాలు మొదలైనవి కొన్ని కథారూపంలో కొన్ని వార్తా కథన రూపంలో కొన్ని వర్ణనల రూపంలో అందించారు. సీస పద్యం నాలుగు పొడవైన లేదా ఎనిమిది భాగాలుగా కనిపించే పెద్ద పద్యం. దాని చివర మరో ఎత్తుగీతి తేటగీతి కాని ఆటవెలది కాని ఉంటుంది. ఇన్ని పాదాలలో విషయాన్ని ఎంతో విడమరచి చెప్పారు. అంతే కాదు ఎత్తుగీతి పాదాలు చాలకపోతే పెంచారు. విషయం ప్రధానం కాని పాదాలను పెంచుకోవడం వల్ల నియమ భంగమేమి కాదు.
మనకు అవయవాలున్నాయి. ఇంద్రియాలున్నాయి. అవి ఎట్లా ఉపయోగపడతాయి. ఎట్లా వాడుకోవాలి అనే వాటిని చాలా సరళంగా సూటిగా చెప్పారు. ముక్కును గురించి, ముక్కును చూసియు ముచ్చటలాడగ / నడ్డి గరుడ సట్టి ననుకొనెదరు….. అని రూపాన్ని బట్టి పిలిచే పేర్లతో పాటు మంచి వాసనను గుర్తించి ఆకర్షింపజేస్తుంది, చెడువాసన వస్తే తిరస్కరిస్తుంది, ముక్కుకు ఆభరణాలు ధరించవచ్చు, ముక్కుతో అక్షరాలు పలుకవచ్చు వంటి ఎన్నో విషయాలు తేటగా తెలిపారు. కన్ను, చెవి, జుత్తు మొదలైనవి మనుషులకు ఆడ, మగ వారికి ఎంత అందంగా అనుకూలంగా ఉంటాయో ఎంత అననుకూలంగా ఉంటాయో కూడా వివరించడం వీరి పరిశీలనా దృష్టికి నిదర్శనం. ఇట్లా ప్రతి విషయంలో మంచి చెడ్డలను రెంటినీ చూపి తాత మాటలు కైరవా తరగతి నిధి అని వీటన్నిటినీ తరచి చూడమంటారు.
రాజకీయాలలో నాయకులే దేవుళ్ళుగా కొలువబడుతున్నారు. పూర్వపు దేవతలు వెంటనే కోరికలు తీర్చరు. వీరు కనపడి వెంటనే తీర్చగలరు అనే ఆశతో జనం వీరి వెంటపడుతున్నారు. కాని నిజం గమనించాలి అని హెచ్చరించారు. కరోనా, మూఢనమ్మకాలు, విద్యలో లోపాలు, భక్తిలో మోసాలు, ఎన్నికలు, పాలకులు మొదలైన ఆధునిక విషయాలన్ని సవిమర్శకంగా పద్య రూపంలో స్పష్టం చేశారు.
వేణుశ్రీకి పురాణకథలు వాటి విశేషాలు బాగా తెలుసు. వాతాపి ఇల్వలులు కథ, తారాంశశాంకుల కథ, ఆయా ఋషుల జన్మలు, మొదలైన ఘట్టాలను తెలుపుతూ వాటిలోని సారాంశాన్ని గ్రహించాలని బోధించారు.
తెలంగాణలోని సంస్కృతిని ముఖ్యంగా యాభయి సంవత్సరాల కిందటి పల్లె జీవనాలను ఎంతో అందంగా ఆయా పదజాలంతో చెప్పిన పద్యాలు చదువుతుంటే ఆ దృశ్యాలు మనముందు కదలుతుంటాయి. విషయాలతో పాటు ఆనాటి మాటలు కూడా అట్లే పద్యాల్లో ఒదిగించడం విశేషం.” మక్కపేలాలేంచు మంగళమేమాయె/కంది పుట్నాలింక కానరావు, జొన్నపేలాలును జొన్న పిస్కిల్లును, మొల్కబియ్యము పట్ల మోజులేవి… అనే పద్యంలో చిన్ననాటి విషయాలెన్నో గుర్తుచేశారు.
ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విషయాన్ని పలుకోణాల్లో వివరించడానికి పొడవైన సీస పద్యాలనెన్నుకున్నారు. సీస పద్యాలు పదహారు రకాలున్నాయని ఛందశ్శాస్త్రం తెలుపుతుంది. గణాల ప్రయోగాన్ని బట్టి, పాదాల విరుపులను బట్టి, వడి (యతి), ప్రాసాదులు (ప్రాస నియమం లేకపోయినా అనుప్రాస, వృత్యనుప్రాసలను వాడటం) ప్రయోగాలను బట్టి వైవిధ్యం గల సీస పద్యాలున్నాయి. నన్నయ నుండి నేటి వరకు కావ్యాలలో శతకాలలో విరివిగా వాడిన సీస పద్యానికి వేణుశ్రీ కొత్త నడకలు నేర్పించారు. ఒకటి అచ్చంగా వాడుక మాటలు, రెండవది వాడుక వాక్యాలు వాక్యాలుగా గణాలలో ఇమిడిపోయి పద్యం రూపంగా అవతరింపజేయటం, మూడు పాదాలు ఒకదాన్నుండి మరొకదానిలోనికి చొచ్చుకొని పోవడం, పదాలు గణభంగం కాకుండా దొర్లిపోవడం… ఇట్లాంటి అచ్చమైన ఆధునికమైన వ్యావహారికమైన సీస పద్యాలకు రాశారు. ఇదివరకటి ఓ ప్రచేతసా! శతకంలో కూడా ఇటువంటి నడకలే పాటించారు. ఈ తరం పద్యకవులు లేదా పద్యాలు రాయాలనుకునేవారు భయపడాల్సిన పనిలేదని వాడుక మాటలు, సంభాషణలు పద్యాలలో ఒదిగిపోతాయని నిరూపించడానికి ధైర్యం చెప్పడానికి ఈ పద్యాలు మార్గదర్శకాలుగా ఉంటాయి.
పాదాలు ఆగకుండా నడిచే పద్ధతిని గునుగు సీసాలంటారని నన్నయ ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగించారని విజ్ఞుల అభిప్రాయం. ముఖ్యంగా కథనం వేళ, వర్ణనవేళ ఈ ఛందస్సు బాగా ఉపయోగపడుతుంది.
“నైమిశారణ్య పుణ్య క్షేత్రమున కుల/పతి శౌనకుండను పరమమౌని
బ్రహ్మర్షి గణసముపాసితుండై సర్వ/లోక హితార్థంబులోక నుతుడు… ఇట్లా సాగుతుంది నన్నయ మహాభారతంలోని సీసం.” ఇల్వలు వాతాపి ఇగురముతోడను / వాతాపి మేకగ వంటవండి,
వచ్చిన వారికి వడ్డించి తినగానె / వాతాపి పొట్టలు పగలజీల్చి… ఇట్లా వేణుశ్రీ పద్యం సాగుతుంది. ఇవే కాక తిక్కనవలె శతక పద్యాలవలె, శ్రీనాథుని సీసాల వలె సాగిన పద్యాలున్నాయి.
పల్లెల్లోని భాష మంగళం, వడ్లోల్లు, బర్మ, పిస్కలు, బొత్తిగ, ఎచ్చులు, రంది, సరళాదేశాలతో సహజంగా వాడే గంత, గింత వంటి యెన్నో మాటలు పద్యాలలో కలిసిపోయాయి. తాగే వాడే కట్టాలి తాళ్ళపన్ను వంటి సామెతలు కూడా చేరాయి.
పల్లెటూరి జీవనాన్ని, మనస్తత్వాలను మరోసారి చూపించారు.
శతకంలో ఆధునిక వ్యాపారాలు, ఆంగ్ల భాషా వ్యామోహాలు, పాలకుల అవినీతి మొదలైన వెన్నో వర్ణించడం స్పష్టం చేయడంతో పాటు మానవత్వం, మంచితనం, మంచి సమాజం ఏర్పడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసే పద్యాలు ఉండి నిన్నటి నేటి తరాల తీరును చూపుతూ రేపటి తరానికి మార్గదర్శనం చేయాలనే ప్రగాఢమైన ఆరాటం శతకం నిండా కనిపిస్తాయి.
పిల్లల కోసం ప్రధానంగా ఉద్దేశించిన నవ నీతిచంద్రిక ఈ శతకం.
వచన కవిత్వం రాసేవారు కూడా తేలికగా పద్యాలు రాయవచ్చుననే సరికొత్త విధానాన్ని శతక రచనలో ప్రవేశపెడుతున్న పద్యకవి మిత్రుడు పండితుడు వేణుశ్రీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సహృదయులైన సాధారణ పాఠకులందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను.
1-12-2021
అమెరికా